• facebook
  • whatsapp
  • telegram

ఆమ్లాలు - క్షారాలు - ద్రావణాలు - లవణాలు

          రసాయన శాస్త్రంలో అధ్యయనం చేసే పదార్థాలను ఆమ్లాలు, క్షారాలుగా వర్గీకరించవచ్చు. ఆమ్లాలు అలోహ మూలకాల నుంచి, క్షారాలు లోహ మూలకాల నుంచి తయారవుతాయి. ఆమ్లం, క్షారం చర్యనొందినప్పుడు లవణాలు ఏర్పడతాయి. అర్హీనియస్, బ్రాన్‌స్టెడ్, లౌరి, లూయీ లాంటి శాస్త్రవేత్తలు ఆమ్లాలు, క్షారాల ధర్మాలను వివరించడానికి తమ సిద్ధాంతాలను ప్రతిపాదించారు. ప్రతి ఒక్కరి సిద్ధాంతంలోను లోపాలు ఉన్నప్పటికీ అవి అనేక అంశాల్లో ఆమ్ల, క్షార ధర్మాలను చక్కగా వివరించగలిగాయి.

ఆమ్లాల ధర్మాలు: రాబర్ట్ బాయిల్ అనే శాస్త్రవేత్త ఆమ్లాల ధర్మాలను మొదట ప్రతిపాదించాడు.
1) ఆమ్లాలు రుచికి పుల్లగా ఉంటాయి.
2) ఇవి నీలి లిట్మస్‌ను ఎర్రగా మారుస్తాయి.
3) సజల ఆమ్లాలు లోహాలతో చర్య జరిపి H2 వాయువును వెలువరిస్తాయి.
4) ఇవి లోహ కార్బొనేట్‌లతో చర్య జరిపి CO2 వాయువును వెలువరిస్తాయి.
జీవితంలో మనం వాడే నిమ్మరసం, చింతపండురసం, ఉసిరికాయ, వెనిగర్‌లు ఆమ్లాలను కలిగి ఉంటాయి. నిమ్మరసంలో సిట్రిక్ ఆమ్లం, చింతపండులో టార్టారిక్ ఉసిరికాయల్లో ఆస్కార్బిక్ ఆమ్లం, వెనిగర్‌లో ఎసిటిక్ ఆమ్లం ముఖ్యంగా ఉంటాయి. ఇవన్నీ రుచికి పుల్లగా ఉంటాయి. చీమకుట్టినప్పుడు మన శరీరంలోకి ఫార్మిక్ ఆమ్లం ప్రవేశిస్తుంది. రసాయనశాలలో కింది ఆమ్లాలను ఉపయోగిస్తాం.

రసాయనశాలలో కింది ఆమ్లాలను ఉపయోగిస్తాం.
   హైడ్రోక్లోరిక్ ఆమ్లం           HCl
   సల్ఫ్యూరిక్ ఆమ్లం         H2SO4
   నైట్రిక్ ఆమ్లం                  HNO3
   ఫాస్ఫారిక్ఆమ్లం             H3PO4
   ఎసిటిక్ఆమ్లంది              CH3COOH
   ఆగ్జాలిక్ఆమ్లం                H2C2O42H2


ఆమ్లాలను తయారు చేయడం: అలోహ ఆక్సైడ్‌లకు ఆమ్ల ధర్మం ఉంటుంది. వీటిని నీటిలో కరిగించినప్పుడు సంబంధిత ఆమ్లాలు ఏర్పడతాయి (పట్టిక - చూడండి).

        మనం ఉపయోగించే హైడ్రోక్లోరిక్, సల్ఫ్యూరిక్, పాస్ఫారిక్ ఆమ్లాలను గుర్తించడం కొంచెం కష్టమవుతుంది. భౌతికధర్మాలు తెలిసి ఉంటే వీటిని తేలికగా గుర్తించవచ్చు. ఈ మూడు ఆమ్లాలు ద్రవ స్థితిలోనే ఉంటాయి. కానీ సల్ఫ్యూరిక్ ఆమ్లం మాత్రం చిక్కని నూనె లాంటి ద్రవం. వీటిలో సల్ఫ్యూరిక్ ఆమ్లానికి మాత్రం వాసన ఉండదు. మిగిలిన రెండింటికి ఘాటైన వాసన ఉంటుంది. ఈ ఆమ్లాలు స్వచ్ఛమైన స్థితిలో రంగులేని ద్రవాలు. కానీ నైట్రిక్ ఆమ్లం మాత్రం NO2 మలినాలు ఉండటం వల్ల పసుపురంగు కలిగి ఉంటుంది.

రసాయన ధర్మాలు:  ¤  సజల ఆమ్లాలు లోహలతో చర్య జరిపినప్పుడు హైడ్రోజన్ వాయువు వెలువడుతుంది.
                         Zn + 2HCl      ZnCl2 + H2
                         Mg + H2SO4      MgSO4+H2 
¤   ఆమ్లాలు లోహఆక్సైడ్‌లతో చర్య జరిపినప్పుడు లవణాలను ఏర్పరుస్తాయి. 
                         CuO + 2HCl       CuCl2 + H2O
                         ZnO + 2HNO3    Zn(NO3)2 + H2
¤   ఆమ్లాలు లోహ కార్బొనేట్‌లతోను, లోహ బైకార్బోనేట్‌లతో చర్య జరిపినప్పుడు CO2వాయువు వెలువడుతుంది. 
                          Na2CO3 + 2HCl      2Nacl + CO2 + H2
                          NaHCO3 + HCl      NaCl + CO2 + H2O

4) ఆమ్లాలు క్షారాలతో చర్య జరిపినప్పుడు లవణం, నీరు ఏర్పడతాయి. 
                           HCl + NaOH       NaCl + H2
                           CH3COOH + KOH     CH3COOK + H2O

క్షారాల ధర్మాలు: వీటి ధర్మాలను మొదట రౌలే అనే శాస్త్రవేత్త ప్రతిపాదించాడు. 
¤  క్షారాలు రుచికి చేదుగా ఉంటాయి. 
¤  ఇవి ఎర్రలిట్మస్‌ను నీలిరంగుకు మారుస్తాయి. 
¤  వీటికి తాకితే జారిపోయే స్వభావం ఉంటుంది. 
¤  ఇవి నారింజ రంగుగల మిథైల్ ఆరంజి సూచికను పసుపు రంగుకు మారుస్తాయి. 
¤  వీటిని అమ్మోనియం లవణాలతో వేడిచేసినప్పుడు అమ్మోనియా వాయువు వెలువడుతుంది. నిత్యజీవితంలో వాడే దుస్తులసోడా ద్రావణం, సున్నపు నీరు, బూడిదనీరు క్షారాలకు ఉదాహరణలు.
రసాయనశాలలో కింది క్షారాలను ఉపయోగిస్తుంటాం. 
¤  సోడియం హైడ్రాక్సైడ్   (NaOH).  దీనిని దాహక సోడా లేదా కాస్టిక్ సోడా అంటారు.
¤  పొటాషియం హైడ్రాక్సైడ్   (KOH) దీనిని కాస్టిక్ పొటాష్ అని పిలుస్తారు 
¤  అమ్మోనియం హైడ్రాక్సైడ్   (NH4OH) 
¤  కాల్షియం హైడ్రైడ్     Ca(OH)2.   దీనిని తడి సున్నం అంటారు.


క్షారాలను తయారుచేయడం: లోహ ఆక్సైడ్‌లకు క్షారస్వభావం ఉంటుంది. వీటిని నీటిలో కరిగించినప్పుడు సంబంధిత క్షారాలు ఏర్పడతాయి (పట్టిక చూడండి).

రసాయన ధర్మాలు: 
¤   క్షారాలను వేడిచేసినప్పుడు లోహ ఆక్సైడ్‌లను ఏర్పరుస్తాయి.
                                   Cu(OH)2    CaO + H2
                                   2Fe(OH)3     Fe2CO3+3H2
¤   క్షారాలు ఆమ్లాలతో చర్యజరిపి లవణం, నీరు ఏర్పరుస్తాయి.
                                   Ca(OH)2 + 2HCl        CaCl2 + 2H2
                                   2KOH + H2SO4        K2SO4 + 2H2O
ఆమ్లాలు, క్షారాల ధర్మాలను వివరించడానికి మూడు ముఖ్యమైన కింది సిద్ధాంతాలు ప్రతిపాదించారు.

అర్హీనియస్ సిద్ధాంతం: ఈ సిద్ధాంతం జల ద్రావణంలో పదార్థం ఆమ్ల, క్షార స్వభావాన్ని వివరిస్తుంది. దీని ప్రకారం
¤  జలద్రావణంలో H+ అయాన్‌లను ఏర్పరిచే పదార్థాన్ని ఆమ్లం అంటారు.  ఉదా:  HCl, CH3COOH. 
¤  జల ద్రావణంలో OH - అయాన్‌లను ఏర్పరిచే పదార్థాన్ని క్షారం అంటారు.  ఉదా:  NaOH, KOH మొదలైనవి. 
¤  తటస్థీకరణం అంటే ఆమ్లంలోని H+ అయాన్‌లు క్షారంలోని OH - అయాన్‌లతో జల ద్రావణంతో చర్యనొంది నీరు ఏర్పడటం.    ఆమ్లం (H+) + క్షారం (OH - )     H2O (నీరు)
¤ బలమైన ఆమ్లం నీటిలో ఎక్కువ H+అయాన్‌లను, బలమైన క్షారం నీటిలో ఎక్కువ OH -  అయాన్‌లను  ఏర్పరుస్తుంది.


లోపాలు:  ¤   ఈ సిద్ధాంతం CO2, SO2ల ఆమ్ల స్వభావాన్ని వివరించలేదు  (వీటిలో హైడ్రోజన్ అయాన్ H+ లేదు కాని ఇవి ఆమ్లాలే) 
¤   ఇది CaO, NH3 లాంటి పదార్థాల క్షారధర్మాన్ని వివరించలేదు. (వీటిలో హైడ్రాక్సైడ్ అయాన్ OH - లేదు).
¤   ఇది కొన్ని రకాల తటస్థీకరణాలను వివరించలేదు.  ఉదా:  HCl + NH3 NH4Cl

II) బ్రాన్‌స్టెడ్ - లౌరి సిద్ధాంతం: ఇది అర్హీనియస్ సిద్ధాంతం కంటే మేలైంది. దీని ప్రకారం- 
¤  ప్రోటాన్‌ను దానంచేసే స్వభావం ఉన్న పదార్థాన్ని ఆమ్లం అంటారు. ఉదా: HCl, HNO3 మొదలైనవి. 
¤  ప్రొటాన్‌ను స్వీకరించే స్వభావం ఉన్న పదార్థాన్ని క్షారం అంటారు. ఉదా: NH3, Cl - మొదలైనవి. 
¤  ఆమ్లం నుంచి ప్రోటాన్ క్షారానికి బదిలీ జరగడాన్ని తటస్థీకరణం అంటారు. 
¤  బలమైన ఆమ్లానికి ప్రోటాన్‌ను దానంచేసే స్వభావం ఎక్కువగా ఉంటుంది. బలమైన క్షారానికి ప్రోటాన్‌ను స్వీకరించే స్వభావం ఎక్కువగా ఉంటుంది.

లోపాలు: ¤  ఈ సిద్ధాంతం AlCl3, BCl3 లాంటి పదార్థాల ఆమ్లస్వభావాన్ని వివరించలేదు.
¤  ఇది విడిగా పదార్థం ఆమ్ల లేదా క్షార స్వభావాన్ని వివరించలేదు

III) లూయీ సిద్ధాంతం: దీనిని ఎలక్ట్రాన్ జంట సిద్ధాంతం అంటారు. దీని ప్రకారం 
¤  ఆమ్లం అంటే అది సంయోజనీయ బంధం ఏర్పడేటప్పుడు ఎలక్ట్రాన్ జంట స్వీకర్త. ఉదా: BCl3, AlCl3 లాంటివి. 
¤  క్షారం అంటే అది సమన్వయ సంయోజనీయ బంధం ఏర్పడేటప్పుడు ఎలక్ట్రాన్ జంట దాత. ఉదా: H2O, NH3 లాంటివి.


3) తటస్థీకరణం అంటే రెండు పదార్థాల మధ్య సమన్వయ సంయోజనీయ బంధం ఏర్పడటం.
లోపాలు: 1) ఈ సిద్ధాంతం ఆమ్లాలు, క్షారాల తారతమ్య బలాలను వివరించలేదు.
2) ఇది H + అయాన్ ఉత్ప్రేరక స్వభావాన్ని వివరించలేదు.

నీటి అయానీకరణం: నీరు అధమ విద్యుత్‌వాహకం. ఇది చాలా స్వల్పంగా కిందివిధంగా అయనీకరణం చెందుతుంది.                                           H2O    H+ + OH-
ఈ విధంగా అయానీకరణం చెందినప్పుడు నీటి అణువులకు ఏర్పడిన అయాన్‌లకు మధ్య సమతాస్థితి ఉంటుంది. 25ºCనది వద్ద శుద్ధ జలంలో H+ అయాన్‌ల గాఢత 1.0 × 10-7 మోల్స్/ లీటరు, OH - అయాన్‌ల గాఢత
1.0 C 10-7 మోల్స్/ లీటరు ఉంటుంది. ఉష్ణోగ్రత పెరిగేకొద్దీ నీటి అయనీకరణం పెరుగుతుంది.

నీటి అయానిక లబ్ధం: ఒకమోల్ నీటిలో ఉన్నH+, OH- అయాన్‌ల గాఢతల లబ్ధాన్ని నీటి అయానిక లబ్ధం అంటారు. దీనిని Kw అని సూచిస్తారు.  Kw  =  (H+) × (OH-).   ఇక్కడ పలకల బ్రాకెట్లు గాఢతను సూచిస్తాయి.
25ºC వద్ద శుద్ధజలానికి నీటి అయానిక లబ్ధం విలువ 1.0 × 10-14 మోల్స్2/ లీటర్2 ఉంటుంది. H+అయాన్‌ల గాఢత ఆధారంగా ద్రావణాలను మూడు రకాలుగా వర్గీకరించవచ్చు.

1) ఆమ్ల ద్రావణాలు: వీటిలో H+ అయాన్ గాఢత 10-7మో/లీ కంటే ఎక్కువగా, OH- అయాన్ గాఢత 10-7 /లీ కంటే తక్కువగా ఉంటుంది.

2) క్షార ద్రావణాలు: వీటిలో OH- అయాన్ గాఢత 10-7 మో/లీ కంటే ఎక్కువగా, H+ అయాన్ గాఢత 10-7మో/లీ కంటే తక్కువగా ఉంటుంది.

3) నీరు లాంటి తటస్థ ద్రావణంలో H+ అయాన్ గాఢత 10-7 మో/లీ, OH- అయాన్ గాఢత 10-7 మో/లీ ఉంటుంది. 

pH మానం: ప్రయోగశాలల్లో సాధారణంగా తక్కువ గాఢతలున్న ఆమ్లాలు లేదా క్షారాలు ఉపయోగిస్తారు. ఈ గాఢతలను తెలిపేందుకు pH మానాన్ని ప్రతిపాదించారు. దీన్ని ఎస్.పి. సోరెన్‌సేన్ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించాడు. pH అంటే ఒక ద్రావణంలోని H+ అయాన్ గాఢత రుణ సంవర్గమానం. pH = - log10(H+) ద్రావణాల pH విలువలు 1 నుంచి 14 మధ్య అమరి ఉంటాయి. ఆమ్ల ద్రావణాలకు pH విలువ 7 కంటే తక్కువగా, క్షార ద్రావాణాలకు 7 కంటే ఎక్కువగా ఉంటుంది. నీరు లాంటి తటస్థ ద్రావణం pH విలువ 7 ఉంటుంది. నీటికి స్వల్పంగా ఆమ్లం కలిపితే ఆ ద్రావణం pH విలువ 7 కంటే తక్కువ ఉంటుంది. నీటికి స్వల్పంగా క్షారం కలిపితే ఆ ద్రావణం pH విలువ 7 కంటే ఎక్కువగా ఉంటుంది (పట్టిక చూడండి).


సమస్య: 0.01 M HNO3 ద్రావణం pH విలువను లెక్కించండి.
సమాధానం : HNO3    H+  + NO
                     0.01                     0.01     0.01
ఈ ద్రావణంలో H+ అయాన్ గాఢత = 0.01 = 10 -2 మోల్స్ / లీటరు.  
    ... pH =  -log (H+)  =  -log (10-2)  =  - (-2) log 10
                                                              =  2. log 10 = 2.

తటస్థీకరణం: ఆమ్లం క్షారంతో కలిసి జలద్రావణంలో నీరు ఏర్పడే చర్యను తటస్థీకరణం అంటారు. ఒక లవణం ఏర్పడాలంటే తప్పనిసరిగా ఒక ఆమ్లం, క్షారం కలవాలి. తటస్థీకరణ చర్య ఎప్పుడూ ఉష్ణమోచక చర్యే. బలమైన ఆమ్లం బలమైన క్షారంతో చర్య జరిపినప్పుడు అత్యధిక ప్రమాణంలో ఉష్ణం విడుదలవుతుంది. బలహీన ఆమ్లం బలహీన క్షారంతో చర్య జరిపినప్పుడు వెలువడే ఉష్ణం విలువ తక్కువగా ఉంటుంది.

తటస్థీకరణోష్ణం: ఒక మోల్ ఆమ్లం ఒక మోల్ క్షారంతో చర్య జరిపి లవణం, నీరు ఏర్పడేటప్పుడు వెలువడే ఉష్ణాన్ని తటస్థీకరణోష్ణం అంటారు. ఒక మోల్ బలహైన ఆమ్లం, ఒకమోల్ బలమైన క్షారంతో చర్య జరిపి తటస్థీకరణం జరిపినప్పుడు 13.7 కిలో కేలరీల ఉష్ణం వెలువడుతుంది.
                            HCl + NaOH     NaCl + H2O + 13.7 కి.కేలరీలు/ మోల్.
అర్హీనియస్ సిద్ధాంతం ప్రకారం ఒక మోల్ ఆమ్లంలోని H+ అయాన్‌లు ఒక మోల్ క్షారంలోని OH- అయాన్‌లతో చర్య జరిపి నీరు ఏర్పడేటప్పుడు విడుదలయ్యే ఉష్ణాన్ని తటస్థీకరణోష్ణం అంటారు. 

క్షారాలు

ధర్మాలు:
* క్షారాలు రుచికి చేదుగా ఉంటాయి. తాకితే జారిపోయే స్వభావంతో ఉంటాయి.
* క్షారాలు కూడా సూచికల రంగును మారుస్తాయి.
     క్షార ద్రావణాలు ఎర్ర లిట్మస్ కాగితాన్ని నీలి రంగులోకి మారుస్తాయి.
     ఇవి మిథైల్ ఆరెంజ్ సూచికను పసుపు రంగులోకి మారుస్తాయి.
     ఫినాఫ్తలీన్ సూచికను క్షార ద్రావణాలు గులాబీ రంగులోకి మారుస్తాయి.
* క్షారాలు, ఆమ్లాలతో చర్య జరిపి లవణాలు, నీటిని ఏర్పరుస్తాయి.

 

వర్గీకరణ:


బలమైన క్షారాలు: జల ద్రావణంలో 100% అయనీకరణం చెంది ఎక్కువ మొత్తంలో హైడ్రాక్సిల్ అయాన్‌లను (OH) ఇచ్చేవి 'బలమైన క్షారాలు'.
బలహీన క్షారాలు: జల ద్రావణంలో పాక్షికంగా వియోజనం (అయనీకరణం) చెంది తక్కువ మొత్తంలో హైడ్రాక్సిల్ అయాన్‌లను (OH) ఇచ్చేవి 'బలహీన క్షారాలు'.


                   
తయారీ: లోహ ఆక్సైడ్‌లను నీటిలో కరిగిస్తే క్షారాలను తయారు చేయవచ్చు. లోహ ఆక్సైడ్ + నీరు  క్షారం
ఉదా: సోడియం ఆక్సైడ్ + నీరు  సోడియం హైడ్రాక్సైడ్
        మెగ్నీషియం ఆక్సైడ్ + నీరు   మెగ్నీషియం హైడ్రాక్సైడ్
       * లోహ ఆక్సైడ్‌లు క్షార స్వభావం ఉన్న పదార్థాలు.

క్షారాల ఉపయోగాలు

1. సోడియం హైడ్రాక్సైడ్: దీన్ని 'కాస్టిక్ సోడా' అని అంటారు. దీనికి కారణం సోడియం హైడ్రాక్సైడ్‌కు చర్మాన్ని కాల్చే స్వభావం ఉంటుంది.
* దీన్ని సబ్బులు, మందులు (ఔషధాలు), కృత్రిమ సిల్క్ (రేయాన్), నైలాన్ తయారీలో వాడతారు.
* దీన్ని ప్రయోగశాలల్లో చర్యాకారకంగా కూడా ఉపయోగిస్తారు.


2. పొటాషియం హైడ్రాక్సైడ్: దీన్ని 'కాస్టిక్ పొటాష్' అని అంటారు. దీనికి చర్మాన్ని కాల్చే స్వభావం ఉంటుంది.
* దీన్ని ఎరువులు, సబ్బుల తయారీలో ఉపయోగిస్తారు.
* బ్యాటరీల తయారీలో ఉపయోగిస్తారు. (ఆల్కలీన్ బ్యాటరీలు).


3. మెగ్నీషియం హైడ్రాక్సైడ్: దీన్ని 'మిల్క్ ఆఫ్ మెగ్నీషియా' అని పిలుస్తారు.
* కడుపులో ఎసిడిటీని తగ్గించే యాంటాసిడ్‌గా ఉపయోగిస్తారు.


4. కాల్షియం హైడ్రాక్సైడ్: దీన్ని 'మిల్క్ ఆఫ్ లైమ్' లేదా 'సున్నపు తేట' లేదా 'తడి సున్నం' అని పిలుస్తారు.
* బ్లీచింగ్ పౌడర్ తయారీకి, నీటిలోని తాత్కాలిక కాఠిన్యాన్ని తొలగించడానికి, జంతువుల చర్మాన్ని శుద్ధి చేయడానికి, గోడలకు సున్నం వేయడానికి ఉపయోగిస్తారు.
* కార్బన్ డై ఆక్సైడ్‌ను గుర్తించడానికి సున్నపు తేటను ఉపయోగిస్తారు. CO2 సున్నపుతేటను పెరుగు లాంటి తెల్లటి అవక్షేపంగా మారుస్తుంది.


5. అల్యూమినియం హైడ్రాక్సైడ్: కడుపులో ఎసిడిటీని తగ్గించే యాంటాసిడ్‌గా ఉపయోగిస్తారు. అగ్నిమాపక పదార్థాల తయారీలో వాడతారు.


6. అమ్మోనియం హైడ్రాక్సైడ్: గాజు వస్తువులను శుభ్రపరిచే గ్లాస్‌క్లీనర్‌గా, దుస్తులపై గ్రీజు మరకలను తొలగించడానికి ఉపయోగిస్తారు.


7. కాల్షియం ఆక్సైడ్: దీన్ని 'పొడి సున్నం' అని అంటారు.
* దీన్ని సిమెంట్, గాజు తయారీలో ఉపయోగిస్తారు.
* కాల్షియం ఆక్సైడ్ (CaO)ను క్రిమిసంహారిణిగా, నిర్జలీకారిణిగా ఉపయోగిస్తారు.


8. అమ్మోనియా: దీని రసాయన ఫార్ములా NH3.
* దీన్ని నత్రజని ఎరువుల తయారీలో వాడతారు.
* ద్రవ అమ్మోనియాను 'శీతలీకరణి' గా ఉపయోగిస్తారు.
* ఫినాల్, అమైనో ఆమ్లాలు, నత్రికామ్లం తయారీలో వినియోగిస్తారు.

 

తటస్థీకరణం

* ఆమ్లం, క్షారంతో చర్య జరిపి లవణం, నీటిని ఏర్పరచడాన్ని 'తటస్థీకరణం' అంటారు.
* తటస్థీకరణ చర్య ఒక ఉష్ణమోచక చర్య. ఈ చర్యలో వెలువడే ఉష్ణాన్ని 'తటస్థీకరణోష్ణం' అంటారు.
     ఆమ్లం + క్షారం  లవణం + నీరు + ఉష్ణం
* ఒక బలమైన ఆమ్లం, బలమైన క్షారంతో చర్య జరిపితే 13.7 కి. కేలరీల తటస్థీకరణోష్ణం వెలువడుతుంది.
ఉదా: హైడ్రోక్లోరిక్ ఆమ్లం + సోడియం హైడ్రాక్సైడ్ 

 సోడియం క్లోరైడ్ + నీరు + 13.7 కి.కేలరీలు.
* ఒక బలమైన ఆమ్లం, బలహీన క్షారం లేదా బలమైన క్షారం, బలహీన ఆమ్లం లేదా బలహీన ఆమ్లం, బలహీన క్షారాల మధ్య చర్య జరిపితే వెలువడే తటస్థీకరణోష్ణం 13.7 కి.కేలరీల కంటే తక్కువగా ఉంటుంది.

లవణాలు 

* ఒక ఆమ్లం ఏదైనా క్షారంతో తటస్థీకరణ చర్య జరిపితే ఏర్పడే అయానిక సమ్మేళనాన్ని 'లవణం' అంటారు.
ఉదా: సోడియం క్లోరైడ్, సోడియం కార్బొనేట్, కాల్షియం కార్బొనేట్ మొదలైనవి.

లవణాల ఉపయోగాలు

1. సోడియం క్లోరైడ్: దీని రసాయన ఫార్ములా NaCl. దీన్ని 'సాధారణ ఉప్పు' లేదా 'సాధారణ లవణం' లేదా 'టేబుల్ సాల్ట్' అని అంటారు.
* దీన్ని ఆహారం రుచి పెంచడానికి, ఆహార పదార్థాలను నిల్వ ఉంచడానికి (Pickling). ఉపయోగిస్తారు.
* దీన్ని సోడియం హైడ్రాక్సైడ్, వంట సోడా, బట్టల సోడా, బ్లీచింగ్ పౌడర్, క్లోరిన్ వాయువు తయారీకి ముడి పదార్థంగా ఉపయోగిస్తారు.
* మంచుతో కలిపి దీన్ని 'హిమీకరణ మిశ్రమం'గా ఉపయోగిస్తారు.
రాతి ఉప్పు: ప్రపంచంలో చాలా ప్రాంతాల్లో ఘన సోడియం క్లోరైడ్ స్ఫటికాలు మలినాలతో కలిసిపోయి జేగురు రంగులో నిక్షేపాలుగా లభిస్తాయి. దీన్ని 'రాతి ఉప్పు' అంటారు. పూర్వం సముద్ర జలాలు ఎండిపోవడం వల్ల రాతి ఉప్పు మేటలు ఏర్పడ్డాయి.

 

2. సోడియం బై కార్బొనేట్: దీని రసాయన ఫార్ములా NaHCO3. దీన్ని 'బేకింగ్ సోడా' లేదా 'వంట సోడా' లేదా 'తినే సోడా' అని అంటారు.
* బేకింగ్ సోడా + టార్టారిక్ ఆమ్లం = బేకింగ్ పౌడర్.
* దీన్ని యాంటాసిడ్ మాత్రల తయారీలో ముఖ్య అణుఘటకంగా వాడతారు.
* అగ్నిమాపక యంత్రాల్లో దీన్ని 'సోడా ఆమ్లం'గా ఉపయోగిస్తారు.
* బేకింగ్ పౌడర్‌ను నీటిలో కలిపినప్పుడు లేదా వేడి చేసినప్పుడు కార్బన్ డై ఆక్సైడ్ (CO2)వెలువడుతుంది. దోసెలు లేదా కేక్‌ల తయారీలో బేకింగ్ పౌడర్‌ను కలిపినప్పుడు, ఆ పదార్థాల నుంచి CO2 వాయువు రంధ్రాలు చేసుకుని బయటకు వెళ్లడం వల్ల అవి వ్యాకోచించి మెత్తగా మారతాయి.

 

3. సోడియం కార్బొనేట్: అనార్ద్ర సోడియం కార్బొనేట్‌ను 'సోడా భస్మం' అంటారు. దీని ఫార్ములా Na2CO3.
 * సోడియం కార్బొనేట్ డెకాహైడ్రేట్ లవణాన్ని 'వాషింగ్ సోడా' లేదా 'ఉతికే సోడా' లేదా 'చాకలి సోడా' లేదా 'బట్టల సోడా' అని అంటారు. దీని రసాయన ఫార్ములా Na2CO3.10H2O.
 * దీన్ని కాగితం, గాజు పరిశ్రమల్లో ఉపయోగిస్తారు.
 * సబ్బులు, డిటర్జంట్‌లు, టూత్‌పేస్ట్‌ల తయారీలో దీన్ని ఉపయోగిస్తారు.
 * బోరాక్స్ తయారీకి, నీటి శాశ్వత కాఠిన్యతను తొలగించడానికి ఉపయోగిస్తారు.

 

4. సోడియం నైట్రేట్: దీన్ని 'చిలీ సాల్ట్ పీటర్' అంటారు. దీని ఫార్ములా NaNO3. దీన్ని ఎరువులు, పొగ బాంబుల (Smoke bombs) తయారీలో ఉపయోగిస్తారు.
 

5. ప్లాస్టర్ ఆఫ్ పారిస్: దీని రసాయన నామం 'కాల్షియం సల్ఫేట్ హెమీ హైడ్రేట్'. దీని రసాయన ఫార్ములా
CaSO4.1/2 H2O
* శరీరంలో విరిగిన ఎముకలను తిరిగి సక్రమంగా అతికించడానికి వేసే కట్టులో ఉపయోగిస్తారు.
* దీన్ని నీటిలో చేర్చినప్పుడు 'జిప్సం' అనే ఒక దృఢమైన ఘన పదార్థంగా మారుతుంది.
* దీన్ని బొమ్మల తయారీ, వినాయక విగ్రహాలు, అలంకరణకు ఉపయోగించే వస్తువుల తయారీలో ఉపయోగిస్తారు.
* ఇది ఒక తెల్లటి నిర్మాణ పదార్థం. గోడలు, ఇతర కట్టడాల ఉపరితలాలను నునుపు చేయడానికి, ఇళ్ల పైకప్పుల అలంకరణ కోసం ఉపయోగిస్తారు.

6. జిప్సం: దీని రసాయన నామం 'కాల్షియం సల్ఫేట్ డైహైడ్రేట్'. దీని రసాయన ఫార్ములా CaSO4.2H2O. 
* దీన్ని నల్లబల్ల సుద్ద తయారీలో, ఎరువుగా ఉపయోగిస్తారు.
* సిమెంట్ కాంక్రీట్ గడ్డకట్టకుండా ఉండే సమయాన్ని పెంచడానికి దీన్ని సిమెంట్‌లో కలుపుతారు.

 

7. పొటాషియం నైట్రేట్: దీని రసాయన ఫార్ములా KNO3
* దీన్ని ఎరువులు, గన్‌పౌడర్, టపాకాయల తయారీలో ఉపయోగిస్తారు.
* టూత్‌పేస్ట్‌ల తయారీలో వినియోగిస్తారు.

 

8. కాల్షియం కార్బొనేట్: దీని రసాయన ఫార్ములా CaCO3. దీన్ని 'సున్నపు రాయి' లేదా 'పాలరాయి' అని అంటారు.
* దీన్ని సుద్ద తయారీకి, చక్కెర, ఇనుమును శుద్ధి చేయడానికి వాడతారు.

 

9. బ్లీచింగ్ పౌడర్: దీని రసాయన నామం 'కాల్షియం హైపో క్లోరైట్'. దీని రసాయన ఫార్ములా Ca(OCl)2
* తాగునీరు, ఈత కొలనులో క్రిములను చంపడానికి 'క్రిమి సంహారిణి'గా ఉపయోగిస్తారు.
* వస్త్ర పరిశ్రమలో నూలు, కాగిత పరిశ్రమలో కలప గుజ్జును విరంజనం చేయడానికి ఉపయోగపడుతుంది.


10. బోరాక్స్: దీని రసాయన నామం 'సోడియం టెట్రాబోరేట్ డెకాహైడ్రేట్' దీని రసాయన ఫార్ములా
Na2 B4O7.10H2O
* నీటి కాఠిన్యతను తొలగించడానికి, శిలీంధ్రనాశినిగా, కీటకనాశినిగా, యాంటీసెప్టిక్‌గా ఉపయోగిస్తారు.

11. హైపో: రసాయన నామం సోడియం థయోసల్ఫేట్ పెంటాహైడ్రేట్. రసాయన ఫార్ములా Na2S2O3.5H2O
* దీన్ని సయనైడ్ విషానికి విరుగుడుగా ఉపయోగిస్తారు.
* నీరు, బ్లీచింగ్ పౌడర్‌లో క్లోరిన్ శాతాన్ని లెక్కించడానికి, దుస్తులపై సిరా మరకలను తొలగించడానికి వాడతారు.

12. సోడియం హైపో క్లోరైట్: దీని రసాయన ఫార్ములా NaClO
* దీన్ని టీ, కాఫీ మరకలను తొలగించడానికి ఉపయోగిస్తారు.
* పళ్లపై మరకలను శుభ్రపరచడానికి వాడతారు.
* మరుగుదొడ్లను శుభ్రపరచడానికి 'ద్రవ బ్లీచ్‌'గా ఉపయోగిస్తారు.

13. సిల్వర్ అయోడైడ్: దీని రసాయన ఫార్ములా 'Agl'
* దీన్ని కృత్రిమ వర్షాలు కురిపించడానికి ఉపయోగిస్తారు.


ఆర్ద్ర లవణాలు: ఒక లవణం ఫార్ములా యూనిట్‌లో నిర్దిష్ట సంఖ్యలో ఉండే నీటి అణువులను 'స్ఫటిక జలం' అంటారు. స్ఫటిక జలం ఉన్న లవణాలను 'ఆర్ద్ర లవణాలు' అంటారు.
ఉదా: అనార్ద్ర కాపర్ సల్ఫేట్ CuSO4 తెల్లటి పదార్థం.
        ఆర్ద్ర కాపర్ సల్ఫేట్ CuSO4. 5H2O నీలిరంగు లవణం.
* పొటాష్ ఆలమ్ నీటిని శుద్ధి చేయడానికి ఉపయోగిస్తారు.
* జింక్ పాస్ఫేట్‌ను ఎలుకలకు విషంగా ఉపయోగిస్తారు.
* సాధారణ ఉప్పు వర్షాకాలంలో తడిగా మారడానికి అందులో ఉండే 'మెగ్నీషియం క్లోరైడ్' అనే మలినం కారణం.

 

pH - స్కేలు
* ద్రావణాల ఆమ్ల లేదా క్షార స్వభావాన్ని కచ్చితంగా చెప్పడానికి ఎస్.పి.ఎల్. సొరెన్‌సెన్ అనే శాస్త్రవేత్త pH స్కేలును ప్రతిపాదించారు.
* ఒక ద్రావణంలో ఉన్న హైడ్రోజన్ అయాన్‌ల (H+) గాఢత రుణ సంవర్గమానాన్ని pH అంటారు.
* pH = – log10 [H+]
* pH స్కేలు '0' నుంచి '14' వరకు వ్యాప్తిచెంది ఉంటుంది. అంటే వివిధ ద్రావణాల pH విలువలు 0 నుంచి 14 వరకు ఉంటాయి.
* pH = 7 అంటే తటస్థ ద్రావణాలు.
* pH < 7 అంటే ఆమ్ల ద్రావణాలు.
* pH > 7 అంటే క్షార ద్రావణాలు.
* pH విలువ ఎంత తక్కువ ఉంటే ఆమ్లం అంత బలమైందని అర్థం.
* pH విలువ ఎంత ఎక్కువ ఉంటే అంత బలమైన క్షారమని అర్థం.


నిర్వచనాలు:

అర్హీనియస్ భావన: నీటిలో కరిగించినప్పుడు హైడ్రాక్సిల్ అయాన్‌లను (OH-) ఇచ్చే పదార్థాలను క్షారాలు అంటారు.
బ్రాన్‌స్టెడ్-లౌరీ భావన: క్షారాలు హైడ్రోజన్ అయాన్‌లను (H+) స్వీకరించే ప్రవృత్తి ఉన్న పదార్థాలు.
లూయీ భావన: ఒక ఎలక్ట్రాన్ జంటను దానం చేసే రసాయన పదార్థాలు క్షారాలు.


ద్రావణాలు

1. రెండు లేదా అంతకంటే ఎక్కువ సమ్మేళనాలున్న సజాతీయ మిశ్రమాన్ని ద్రావణం అంటారు.
2. ద్రావణంలో సాపేక్షంగా తక్కువ పరిమాణంలో ఉన్న ఘటకాన్ని ద్రావితం అంటారు.
3. ద్రావణంలో సాపేక్షంగా అధిక పరిమాణంలో ఉన్న ఘటకాన్ని ద్రావణి అంటారు.
4. ద్రావణం = ద్రావితం + ద్రావణి
5. ద్రావితాన్ని, ద్రావణికి కలిపినప్పుడు ఏర్పడే సజాతీయ మిశ్రమాన్నే ద్రావణం అంటారు.
ఉదా: i) 2 గ్రాముల కాపర్ సల్ఫేట్‌ను 50 మి.లీ. నీటిలో కలిపారు. తక్కువ పరిమాణం (2 గ్రాములు) ఉన్న కాపర్ సల్ఫేట్ ద్రావితం అవుతుంది, నీరు ద్రావణి అవుతుంది.
ii) 10 గ్రాముల కార్బన్ డై ఆక్సైడ్‌ను ఒక లీటర్ నీటిలో కరిగించగా సోడా ఏర్పడింది. తక్కువ పరిమాణం
(10 గ్రాములు) ఉన్న కార్బన్ డై ఆక్సైడ్ ద్రావితం, ఎక్కువ పరిమాణం ఉన్న నీరు ద్రావణి అవుతాయి.
iii) 50 గ్రాముల నీటికి, 50 గ్రాముల ఆల్కహాల్‌ను కలిపారు. ఈ సందర్భంలో రెండు ఘటకాల పరిమాణం సమానం. ఇలాంటప్పుడు ఏదైనా ఒక ఘటకాన్ని ద్రావణిగా, రెండో ఘటకాన్ని ద్రావితంగా భావించవచ్చు. ఈ ఉదాహరణలో నీరు ద్రావణి, ఆల్కహాల్ ద్రావితం లేదా నీరు ద్రావితం, ఆల్కహాల్ ద్రావణి.
6. నీటిని ద్రావణిగా ఉపయోగించిన ద్రావణాన్ని జలద్రావణం అంటారు.
7. ఆల్కహాల్‌ను ద్రావణిగా ఉపయోగించిన ద్రావణాన్ని ఆల్కహాల్ ద్రావణం అంటారు.
8. స్థిర ఉష్ణోగ్రత వద్ద 100 గ్రాముల ద్రావణిలో కరిగే ద్రావితం పరిమాణాన్ని ద్రావణీయత అంటారు.    


    


9. ద్రావణీయత కింది అంశాలపై ఆధారపడి ఉంటుంది.
* ద్రావితం, ద్రావణి స్వభావం
* ఉష్ణోగ్రత
10. అయానిక పదార్థాలు ధృవ ద్రావణిలో కరుగుతాయి, అధృవ ద్రావణిలో కరగవు.
ఉదా: కాపర్ సల్ఫేట్ నీటిలో కరుగుతుంది, కిరోసిన్‌లో కరగదు.
11. సమయోజనీయ పదార్థాలు అధృవ ద్రావణిలో కరుగుతాయి, ధృవ ద్రావణిలో కరగవు.
ఉదా: నాఫ్తలీన్ నీటిలో కరగదు కానీ కిరోసిన్‌లో కరుగుతుంది.
12. ద్రావణం ఏర్పడినప్పుడు ఉష్ణం వెలువడే సందర్భంలో ఉష్ణోగ్రతను పెంచితే ద్రావణీయత తగ్గుతుంది.
13. ద్రావణం ఏర్పడినప్పుడు ఉష్ణం గ్రహించే సందర్భంలో ఉష్ణోగ్రతను పెంచితే ద్రావణీయత పెరుగుతుంది.
14. ఉష్ణోగ్రతను పెంచితే వాయువుల ద్రావణీయత తగ్గుతుంది.
15. పీడనాన్ని పెంచితే వాయువుల ద్రావణీయత పెరుగుతుంది.
16. KOH, NaNO3, KNO3, NH4Cl లాంటి పదార్థాల ద్రావణీయత ఉష్ణోగ్రతతో పాటు పెరుగుతుంది.
17. CaSO4, Ce2(SO4)3, (CH3COO)2 Ca లాంటి పదార్థాల ద్రావణీయత ఉష్ణోగ్రత పెరగడం వల్ల తగ్గుతుంది.
18. NaCl లాంటి పదార్థాల ద్రావణీయత దాదాపు అంతే ఉంటుంది. ఉష్ణోగ్రత పెరగడం వల్ల మారదు.
19. CO2ను నీటిలో కరిగిస్తే ఏర్పడిన ద్రావణాన్ని సోడా అంటారు. భోజనం తర్వాత ఆహారం త్వరగా జీర్ణం కావడానికి సోడాను సేవిస్తారు. సోడా సీసాను తెరిచినప్పుడు బుడగలు రావడం మనం గమనిస్తాం. ఈ బుడగలే COవాయువు.
20. ఏకాంక ఘనపరిమాణం ఉన్న ద్రావణిలో వివిధ ఉష్ణోగ్రతల వద్ద వాయు పీడనం ఒక అట్మాస్ఫియర్ అయినప్పడు కరిగే వాయు ఘనపరిమాణాన్ని NTP పరిస్థితులను మార్చితే, దాన్ని 'శోషణ గుణకం' అంటారు.
ఉదా: CO2 వాయువు శోషణ గుణకాలు
0oC − 1.713
10oC − 1.194
20oC − 0.878
30oC − 0.665
40oC − 0.53

21. ద్రావణీయత ఆధారంగా ద్రావణాలను మూడు రకాలుగా విభజించారు.
  1) అసంతృప్త ద్రావణం   2) సంతృప్త ద్రావణం    3) అతిసంతృప్త ద్రావణం

22. అసంతృప్త ద్రావణం: నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద మరికొంత ద్రావితాన్ని కరిగించుకోగల ద్రావణాన్ని అసంతృప్త ద్రావణం అంటారు.
23. సంతృప్త ద్రావణం: నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద ఒక ద్రావణిలో కరగాల్సినంత ద్రావితం కరగడం వల్ల ఏర్పడిన ద్రావణాన్ని సంతృప్త ద్రాణం అంటారు.
                                  (లేదా)
నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద మరికొంత ద్రావితాన్ని కరగించుకోలేని ద్రావణాన్ని సంతృప్త ద్రావణం అంటారు.
24. అతిసంతృప్త ద్రావణం: నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద ఒక ద్రావణిలో సంతృప్త ద్రావణం ఏర్పడటానికి అవసరమైన ద్రావితం కంటే అధిక ద్రావితం కరగడం వల్ల ఏర్పడిన ద్రావణాన్ని అతి సంతృప్త ద్రావణం అంటారు. పటిక, హైపోలు అతిసంతృప్త ద్రావణాలను ఇస్తాయి.
25. సంతృప్త ద్రావణం ఏర్పడినప్పుడు కరగకుండా మిగిలిపోయిన ద్రావితం, ద్రావణంలో కరిగిన ద్రావితంతో సమతాస్థితిలో ఉంటుంది. ఈ సమతాస్థితి ఒక గతిక సమతాస్థితి.
26. సంతృప్త ద్రావణాన్ని వేడిచేస్తే అది అసంతృప్త దావ్రణంగా మార్పు చెందుతుంది.
27. అతి సంతృప్త ద్రావణం అస్థిరంగా ఉంటుంది. దీన్ని కదిలించినా లేదా అలజడి కలిగించినా అధికంగా కరిగి ఉన్న ద్రావితం వేరుపడుతుంది. సంతృప్త ద్రావణంగా మార్పు చెందుతుంది.
28. ప్రమాణ ఘనపరిమాణం ఉన్న ద్రావణంలో ఉండే ద్రావితం పరిమాణాన్ని గాఢత అంటారు. గాఢతను వివిధ రకాలుగా సూచించవచ్చు.
29. భారశాతం (Weight Percentage), W%: 100 గ్రాముల ద్రావణంలో కరిగి ఉన్న ద్రావితం భారాన్ని భారశాతం అంటారు. భారశాతానికి ప్రమాణాలు లేవు.


            


30. ఘనపరిమాణ శాతం (Volume Percentage), V%: 100 మి.లీ. ద్రావణంలో ఉన్న ద్రావితం ఘనపరిమాణాన్ని ఘనపరిమాణ శాతం అంటారు. ఘనపరిమాణ శాతానికి ప్రమాణాలు లేవు.
            

31. మొలారిటీ (M): ఒక లీటరు ద్రావణంలో కరిగి ఉన్న ద్రావితపు మోల్‌ల లేదా గ్రామ్ మోల్‌ల సంఖ్యను మొలారిటీ అంటారు.

V లీటర్ల ద్రావణంలో ఉన్న ద్రావిత మోల్‌ల సంఖ్య = n

32. ఒక ద్రావణపు మొలారిటీ ఉష్ణోగ్రతపై ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఉష్ణోగ్రత మారితే ఘనపరిమాణం (V) మారుతుంది.
33. మొలారిటీ ప్రమాణాలు మోల్/ లీటరు.
34. గాఢత తెలిసిన ద్రావణాన్ని ప్రమాణ ద్రావణం అంటారు.
35. ప్రమాణ ద్రావణాలను ప్రమాణ కుప్పెల్లో తయారు చేస్తారు.
36. మోల్ భాగం (Mole Fraction X): ద్రావణంలో ఉన్న ఘటక మోల్‌ల సంఖ్యకు, ద్రావణంలో ఉన్న మొత్తం మోల్స్ సంఖ్యకు గల నిష్పత్తిని మోల్ భాగం అంటారు.
 
 


39. ద్రావణంలో ఉన్న అన్ని ఘటకాల మోల్ భాగాల మొత్తం ఒకటికి సమానమవుతుంది.
             


40. మొలాలిటీ(m): ఒక కిలోగ్రామ్ (kg) ద్రావణిలో కరిగి ఉన్న ద్రావితం మోల్‌ల సంఖ్యను ఆ ద్రావణం మొలాలిటీ (m) గా నిర్వచిస్తారు.
    

41. నార్మాలిటీ (N): ఒక లీటర్ ద్రావణంలో కరిగి ఉన్న ద్రావితం తుల్య భారాల సంఖ్యను ఆ ద్రావణం నార్మాలిటీ అంటారు. దీన్ని 'N' తో సూచిస్తారు.

నార్మాలిటీని లెక్కకట్టేందుకు తుల్యభారాలు అవసరం.

¤ ఆమ్లం ఒక అణువులో స్థానభ్రంశం చెందించగల హెడ్రోజన్ పరమాణువుల సంఖ్యనే దాని క్షారత అంటారు.

¤ క్షారం ఒక అణువులో స్థానభ్రంశం చెందించడానికి వీలైన OH- అయాన్లనే దాని ఆమ్లత అంటారు.

 

42. వాయువులు, బాష్పాలు ఏవైనా, ఎన్నయినా పరస్పరం పూర్తిగా సజాతీయంగా మిశ్రణం చెందుతాయి. కాబట్టి వాయు మిశ్రమాలన్నీ వాయు ద్రావణాలే. వాయు ద్రావణానికి మంచి ఉదాహరణ గాలి.
43. ఒక ద్రవంలో మరో ద్రవం లేదా వాయువు లేదా ఘనపదార్థాన్ని కరగించడం ద్వారా కానీ, కొన్ని సందర్భాల్లో రెండు లేదా ఎక్కువ ఘనపదార్థాలను కానీ కలిపితే ద్రావణాలు లభిస్తాయి. ద్రవ ద్రావణాలను 3 రకాలుగా విభజించారు.
ఎ) పూర్తి మిశ్రణీయ ద్రవాలు (Miscible liquids): బెంజీన్, టోలిన్; నీరు, ఆల్కహాల్ లాంటివి ఒకదాంతో ఒకటి పూర్తిగా మిశ్రణం చెందుతాయి.
బి) పాక్షిక మిశ్రణీయ ద్రవాలు (Partially miscible liquids): ఈథర్, నీరు; ఫీనాల్, నీరు ఒకదానిలో ఒకటి స్వల్పంగా కరుగుతాయి.
సి) అమిశ్రణీయ ద్రవాలు (Immiscible liquids): నూనె, నీరు; కిరోసిన్, నీరు లాంటివి ఒకదానితో ఒకటి ఏమాత్రం కరగవు.
44. మిశ్రమ లోహాలన్నీ ఘన ద్రావణాలే. కాపర్, గోల్డ్ పరస్పరం కలిసిపోయి ఘన ద్రావణాన్ని ఏర్పరుస్తాయి.
45. సోడియం థయోసల్ఫేట్ (హైపో) రసాయన సంఘటనం Na2S2O3 . 2 H2O
46. పదార్థాలు నీటిలో కరిగి ధన, రుణ అయాన్‌లుగా విభజన చెందే ప్రక్రియను అయనీకరణం అంటారు.

Posted Date : 04-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

స్టడీ మెటీరియల్ : గ్రూప్ - డి

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌