• facebook
  • whatsapp
  • telegram

గవర్నర్‌ జనరల్స్,  వైస్రాయ్‌లు

    ఆంగ్ల ప్రభుత్వం 1833 చార్టర్‌ చట్టం ద్వారా బెంగాల్‌ గవర్నర్‌ జనరల్‌ పదవిని భారతదేశ గవర్నర్‌ జనరల్‌గా మార్చింది. ఈ చట్టం ద్వారా అంతవరకు బెంగాల్‌ గవర్నర్‌ జనరల్‌గా ఉన్న విలియం బెంటింక్‌ భారతదేశ తొలి గవర్నర్‌ జనరల్‌ అయ్యాడు. 1833లో విలియం బెంటింక్‌ నుంచి 1858లో లార్డ్‌ కానింగ్‌ వరకు పనిచేసిన ఆంగ్ల పాలకులను భారతదేశ గవర్నర్‌ జనరల్‌గా పిలిచేవారు.

    1833 నుంచి 1835 మధ్య విలియం బెంటింక్‌ భారతదేశ గవర్నర్‌ జనరల్‌గా వ్యవహరించాడు. అతడి తర్వాత 1835  36 మధ్య సర్‌ ఛార్లెస్‌ మెట్‌కాఫ్‌ పనిచేశాడు. ఇతడు భారతదేశంలో పత్రికలపై ఉన్న నియంత్రణలను ఎత్తివేసి, ‘పత్రికా స్వాతంత్య్ర పితామహుడి’గా పేరొందాడు. 1836  42 మధ్య లార్డ్‌ ఆక్‌లాండ్‌ భారతదేశ గవర్నర్‌ జనరల్‌గా పనిచేశాడు. ఇతడి కాలంలోనే మొదటి ఆఫ్ఘన్‌ యుద్ధం (1838 - 42) జరిగింది. ఈ యుద్ధంలో ఆంగ్లేయులు దోస్త్‌ మహ్మద్‌ను తొలగించి షాషుజాను ఆఫ్ఘన్‌ పాలకుడిగా నియమించారు. దీంతో కోపగించిన ఆఫ్ఘన్లు అలెగ్జాండర్‌ బర్నస్‌ అనే ఆంగ్ల రాయబారితో పాటు 1650 మంది ఆంగ్లేయులను వధించారు. ఈ యుద్ధం కారణంగానే లార్డ్‌ ఆక్‌లాండ్‌ తన పదవిని కోల్పోయాడు. 1842 - 44 మధ్య లార్డ్‌ ఎలిన్‌బరో భారతదేశ గవర్నర్‌ జనరల్‌గా పనిచేశాడు. ఇతడు 1842లో మొదటి ఆఫ్ఘన్‌ యుద్ధాన్ని ముగించి దోస్త్‌ మహ్మద్‌ను తిరిగి ఆఫ్ఘన్‌ పాలకుడిగా నియమించాడు. చార్లెస్‌ నేపియర్‌ అనే ఆంగ్లేయుడిని పంపించి సింధు ప్రాంతాన్ని లార్డ్‌ ఎలిన్‌బరో ఆక్రమించాడు. భారతదేశంలో బానిసత్వాన్ని నిషేధించిన గవర్నర్‌ జనరల్‌గా ఇతడు పేరొందాడు. 1844  48 మధ్య లార్డ్‌ మొదటి హార్డింజ్‌ భారతదేశ గవర్నర్‌ జనరల్‌గా పనిచేశాడు. ఇతడి కాలంలోనే మొదటి సిక్కు యుద్ధం (1845 - 46లో) జరిగింది. ఈ యుద్ధం తర్వాత లార్డ్‌ మొదటి హార్డింజ్‌ సిక్కులతో మొదట లాహోర్‌ సంధి అనంతరం 1846లో బైరోవల్‌ సంధిని చేసుకున్నాడు. బైరోవల్‌ సంధి ద్వారా రంజిత్‌సింగ్‌ కుమారుడు దిలీప్‌సింగ్‌ను రాజుగా నియమించాడు. మొదటి హార్డింజ్‌ గోండు తెగల్లో ఉండే నరబలి ఆచారాన్ని అరికట్టాడు. ఇతడు ఆంగ్ల భాష నేర్చుకున్న భారతీయులకు 1844 నుంచి ఉద్యోగాలు కల్పించాడు. 

రాజ్య విస్తరణ విధానాలు: డల్హౌసీ కాలంలో 1848  49లో రెండో సిక్కు యుద్ధం, 1850లో సిక్కిం యుద్ధం జరిగాయి. మొదటి సిక్కు యుద్ధంలో సిక్కులను ఓడించి 1849, మార్చి 29న సంధి చేసుకుని సిక్కు రాజ్యాన్ని ఆంగ్ల సామ్రాజ్యంలో విలీనం చేశాడు. దిలీప్‌సింగ్‌కు భరణం మంజూరు చేసి, లండన్‌కు పంపించాడు. యుద్ధం ద్వారా ఆంగ్ల సామ్రాజ్యంలో విలీనమైన చివరి భారతీయ స్వతంత్ర రాజ్యం సిక్కు రాజ్యమే. సిక్కు రాజ్య ఆక్రమణ తర్వాత జాన్‌ లారెన్స్‌ను పంజాబ్‌కు పంపి, అనేక పాలనా సంస్కరణలను అమలు చేశాడు. 1850లో సిక్కింను ఆంగ్ల సామ్రాజ్యంలో విలీనం చేశాడు.

    1848లో డల్హౌసీ రాజ్య సంక్రమణ సిద్ధాంతం/ దత్తత రద్దు పద్ధతిని ప్రవేశపెట్టి, సతారా, జైత్‌పూర్, సంబల్‌పూర్, భగత్, ఉదయ్‌పూర్, నాగ్‌పూర్, ఝాన్సీ మొదలైన రాజ్యాలను ఆంగ్ల సామ్రాజ్యంలో కలిపాడు. సంతానంలేని భారతీయ రాజులు ఎవరినీ దత్తత తీసుకోరాదని, వారి తర్వాత ఆ రాజ్యం ఆంగ్ల సామ్రాజ్యంలో కలిసిపోతుందనేదే ‘రాజ్య సంక్రమణ సిద్ధాంతం’. దీని కారణంగానే ఝాన్సీ లక్ష్మీభాయి 1857 సిపాయిల తిరుగుబాటులో పాల్గొంది. 1856లో దుష్పరిపాలన నెపంతో అయోధ్యను (అవధ్‌) ఆక్రమించాడు. జేమ్స్‌ ఔట్రామ్, స్లీమెన్‌ అనే ఆంగ్లేయులను అవధ్‌కు పంపి, పాలనా సంస్కరణలను అమలు చేశాడు. మొదటి నుంచీ ఆంగ్లేయులకు మిత్రరాజ్యంగా ఉన్న అయోధ్యను డల్హౌసీ దుష్పరిపాలన నెపంతో ఆక్రమించడం తీవ్ర విమర్శల పాలైంది. ఈ కారణంగానే 1857 తిరుగుబాటులో ముస్లింలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పీష్వా రెండో బాజీరావు దత్త పుత్రుడైన నానాసాహెబ్‌కు 8 లక్షల భరణాన్ని, కర్ణాటక నవాబు బిరుదును రద్దు చేశాడు.


లార్డ్‌ రిప్పన్‌ (1880 - 84)
    ‘‘స్థానిక స్వపరిపాలనా పితామహుడు’’, భారతీయుల ఆత్మబంధువుగా పేరొందిన వైస్రాయ్‌ లార్డ్‌ రిప్పన్‌. ఇతడు 1880లో ప్రాంతీయ భాషా పత్రికల చట్టాన్ని రద్దు చేశాడు. 1881లో మొదటి ఫ్యాక్టరీ చట్టం ప్రవేశపెట్టి కార్మికులకు సౌకర్యాలు కల్పించాడు. 1881, 1882 సంవత్సరాల్లో స్థానిక స్వపరిపాలనా చట్టాలను ప్రవేశపెట్టి, అనేక పాలనా సంస్కరణలను అమలు చేశాడు. పురపాలక సంఘాలు, తాలూకా, జిల్లా బోర్డులను ఏర్పాటు చేశాడు. విద్యారంగ సంస్కరణల కోసం 20 మంది సభ్యులతో 1882లో హంటర్‌ కమిషన్‌ను నియమించాడు. సివిల్‌ సర్వీస్‌ పరీక్షలు రాసే భారతీయుల అర్హత వయసును 19 నుంచి 21 సంవత్సరాలకు పెంచాడు. ఉప్పు పన్ను తగ్గించాడు. 

    ప్రభుత్వ ఆదాయాన్ని కేంద్ర, రాష్ట్ర, ఉమ్మడి పద్దుల కింద విభజించాడు. వెయ్యి మైళ్ల పొడవైన కాలువలను తవ్వించి, కొత్తగా పది లక్షల ఎకరాల భూమిని సాగులోకి తెచ్చాడు. నాటి కలకత్తా హైకోర్ట్‌ ప్రధాన న్యాయమూర్తి రిచర్డ్‌ గర్త్‌ స్థానంలో భారతీయుడైన ఆర్‌.సి. మిత్తర్‌ను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా నియమించాడు. ఆ కాలంలో భారతీయ న్యాయస్థానాల్లో భారతీయ న్యాయమూర్తులు ఎదుర్కొంటున్న వివక్షతపై ఇల్బర్ట్‌ కమిటీని నియమించాడు. ఆ కమిటీ సిఫార్సుల ప్రకారం ఇల్బర్ట్‌ బిల్లును రూపొందించి, భారతీయ న్యాయమూర్తులు కూడా ఐరోపా నేరస్థులను విచారించవచ్చని ఆదేశించాడు. కానీ, ఐరోపావారి ఉద్యమం వల్ల ఇల్బర్ట్‌ బిల్లును రద్దు చేయాల్సి వచ్చింది. ఈ సంఘటన భారతీయుల్లో జాతీయతాభావం పెరగడానికి దోహదపడింది. రెండో ఆఫ్ఘన్‌ యుద్ధాన్ని ముగించి, అబ్దుల్‌ రెహమాన్‌ను ఆఫ్ఘన్‌ పాలకుడిగా నియమించాడు. దుష్పరిపాలన నెపంతో విలియం బెంటింక్‌ ఆక్రమించిన మైసూర్‌ రాజ్యాన్ని తిరిగి వడయార్‌ రాజవంశీకులకు ఇచ్చేశాడు. 


లార్డ్‌ కానింగ్‌ (1856 - 62)
    డల్హౌసీ తర్వాత 1856లో లార్డ్‌ కానింగ్‌ భారతదేశ గవర్నర్‌ జనరల్‌గా నియమితుడయ్యాడు. కానీ 1858 భారత ప్రభుత్వ చట్టం ద్వారా తొలి భారతదేశ వైస్రాయ్‌గా (రాజప్రతినిధి) మారి, 1862 వరకు ఆ పదవిలో కొనసాగాడు. 1856లో ఇతడు సామాన్య సేవా నియుక్త చట్టాన్ని ప్రవేశపెట్టి, సిపాయిలపై ఆంక్షలు విధించాడు. పాత బ్రౌన్‌బెస్‌ తుపాకుల స్థానంలో ఎన్‌ఫీల్డ్‌ తుపాకులను ప్రవేశపెట్టాడు. ఇతడి కాలంలోనే 1857 సిపాయిల తిరుగుబాటు జరిగింది. 1858, నవంబరు 1న అలహాబాద్‌ దర్బారులో విక్టోరియా మహారాణి ప్రకటనను చదివాడు. దాని ప్రకారమే 1858 భారత ప్రభుత్వ చట్టాన్ని ప్రవేశపెట్టారు. ఈ చట్టం ప్రకారం భారతదేశ గవర్నర్‌ జనరల్‌ పదవిని రద్దు చేసి వైస్రాయ్‌/ రాజప్రతినిధి పదవిని ఏర్పాటు చేశారు. 1857లో మద్రాస్, బొంబాయి, కలకత్తా విశ్వవిద్యాలయాలను స్థాపించారు. 1861 చట్టం ద్వారా భారతదేశంలో పోర్ట్‌ఫోలియో పద్ధతిని ప్రవేశపెట్టారు. 


లార్డ్‌ డల్హౌసీ (1848 - 56)
    ‘ప్రాచ్య దేశపు అబ్రహం లింకన్‌’గా పేరు పొందిన గవర్నర్‌ జనరల్‌ లార్డ్‌ డల్హౌసీ. అతి చిన్న వయసులో (36) గవర్నర్‌ జనరల్‌ పదవిని చేపట్టాడు. డల్హౌసీ భారతదేశ ఆక్రమణకు నాలుగు ప్రధాన విధానాలను అనుసరించాడు. 


అవి: 1) యుద్ధాలు చేయడం  
2) రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టి అమలు చేయడం 
3) దుష్పరిపాలన నెపంతో రాజ్యాల ఆక్రమణ 
4) బిరుదులు, భరణాలను రద్దుచేయడం. 

Posted Date : 04-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ఎన్టీపీసీ

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌