• facebook
  • whatsapp
  • telegram

భారత రాష్ట్రపతి

భారత దేశాధిపతి, ప్రథమ పౌరుడు రాష్ట్రపతి. పార్లమెంటరీ ప్రజాస్వామ్య సంప్రదాయం ప్రకారం బ్రిటన్‌లో నామమాత్రపు కార్యనిర్వహణాధికారిగా రాణి ఏవిధంగా ఉంటారో  అలాగే మన దేశంలో కూడా రాష్ట్రపతి ఉంటారు. అంటే భారతదేశంలో పాలన మొత్తం రాష్ట్రపతి పేరు మీదుగా జరుగుతుంది. కానీ, వాస్తవంగా పరిపాలన అంతా ప్రధానమంత్రి నాయకత్వంలోని మంత్రిమండలి నిర్వహిస్తుంది.

అర్హతలు
భారత రాష్ట్రపతిగా ఎన్నిక కావడానికి కింది అర్హతలు ఉండాలి. అవి...
* భారతీయ పౌరుడై ఉండాలి.
* 35 సంవత్సరాల వయసు నిండాలి.
* ఆదాయం ఇచ్చే ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఉండకూడదు.
* లోక్‌సభ సభ్యుడిగా ఎన్నిక కావడానికి కావాల్సిన అర్హతలు కలిగి ఉండాలి.

ఎన్నిక
భారత రాష్ట్రపతిని ఎన్నుకొనే వ్యవస్థను ఎన్నికల గణం (ఎలక్టోరల్‌ కాలేజ్‌) అంటారు. ఇందులో సభ్యులుగా పార్లమెంట్‌కు ఎన్నికైన ఉభయసభల సభ్యులు, రాష్ట్రాల విధాన సభ సభ్యులు (ఎమ్మెల్యే), పాండిచ్చేరి, దిల్లీ విధాన సభకు ఎన్నికైన సభ్యులు ఉంటారు. నామినేటెడ్‌ సభ్యులు ఇందులో ఉండరు. రాష్ట్రపతి పదవీకాలం 5 సంవత్సరాలు. రాష్ట్రపతి తన పదవి ముగియక ముందే రాజీనామా చేయవచ్చు. రాజీనామా పత్రాన్ని ఉపరాష్ట్రపతికి అందజేయాలి. రాష్ట్రపతితో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణస్వీకారం చేయిస్తారు. రాష్ట్రపతిని పదవి నుంచి తొలగించడం మహాభియోగ తీర్మానం ద్వారా జరుగుతుంది.

రాష్ట్రపతి - అధికారాలు
రాష్ట్రపతి అధికారాలను రెండు రకాలుగా పేర్కొనవచ్చు. అవి-
* సాధారణ అధికారాలు
* అత్యవసర అధికారాలు

సాధారణ అధికారాలు
సాధారణ అధికారాలను శాసన, కార్యనిర్వహణ, ఆర్థిక, న్యాయ, సైనిక, దౌత్య అధికారాలుగా విభజించవచ్చు.

శాసన అధికారాలు
భారత రాష్ట్రపతికి పార్లమెంటు సభ్యత్వం ఉండదు. కానీ ఆయన పార్లమెంటులో అంతర్భాగమే. రాష్ట్రపతికి కింద ఇచ్చిన శాసన అధికారాలు ఉంటాయి.
పార్లమెంటును సమావేశపరచవచ్చు. వాయిదావేయవచ్చు. లోక్‌సభను రద్దుచేయవచ్చు.
* సాధారణ ఎన్నికల తర్వాత పార్లమెంటు వార్షిక సమావేశాలను రాష్ట్రపతి ప్రారంభిస్తారు.
* పార్లమెంటు ఉభయసభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు.
* లోక్‌సభకు ఇద్దరు ఆంగ్లో - ఇండియన్లను, రాజ్యసభకు వివిధ రంగాల్లో నిపుణులైన 12 మందిని నామినేట్‌ చేస్తారు.
* పార్లమెంటు సమావేశాలు లేనప్పుడు ఆర్డినెన్స్‌ను జారీ చేస్తారు.
* పార్లమెంటు సమావేశమైన ఆరు వారాల లోపు ఆర్డినెన్స్‌ ఆమోదిస్తే అది చట్టం అవుతుంది. లేకపోతే రద్దవుతుంది. మొత్తం మీద ఆర్డినెన్స్‌ పార్లమెంటు ఆమోదం పొందకుండా 7 1/2 నెలలు (6 నెలల 6 వారాలు) అమల్లో ఉంటుంది. పార్లమెంటు ఆమోదించిన బిల్లులు రాష్ట్రపతి ఆమోదంతోనే చట్టాలుగా చలామణి అవుతాయి.

కార్యనిర్వహణ అధికారాలు
కేంద్ర ప్రభుత్వ కార్యనిర్వహణాధికారాలు అన్నీ రాష్ట్రపతి పేరు మీదనే జరుగుతాయి. కేంద్ర ప్రభుత్వంలో కింద పేర్కొన్న అత్యున్నత పదవులకు నియామకాలను ఆయనే నిర్వహిస్తారు.
ప్రధానమంత్రి, ఇతర మంత్రులు
* సుప్రీంకోర్టు, హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు
* రాష్ట్రాలకు గవర్నర్‌లు
* కంప్రోల్టర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌
* భారత అటార్నీ జనరల్‌
* యూపీఎస్సీ ఛైర్మన్, సభ్యులు
* ప్రధాన ఎన్నికల కమిషనర్, సభ్యులు
* ఆర్థిక సంఘం ఛైర్మన్, సభ్యులు

ఆర్థిక అధికారాలు
వార్షిక బడ్జెట్‌ను, ఆర్థిక బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి రాష్ట్రపతి ముందుగానే అనుమతి ఇవ్వాలి. ప్రతి అయిదు సంవత్సరాలకు ఒకసారి ఆర్థిక సంఘాన్ని నియమిస్తారు.

న్యాయ అధికారాలు
రాజ్యాధినేతగా రాష్ట్రపతి ఉన్నత న్యాయస్థానాలు విధించిన శిక్షల అమలును  వాయిదా వేయవచ్చు. లేదా ఒక శిక్షను మరోశిక్షగా మార్పు చేయవచ్చు. క్షమాభిక్షను కూడా ప్రసాదించవచ్చు. సుప్రీంకోర్టు, హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు, ఇతర న్యాయమూర్తుల నియామకాలు కూడా ఈ అధికారాల కిందకే వస్తాయి.

సైనిక అధికారాలు
భారతదేశ సర్వసైన్యాధిపతి, త్రివిధ దళాధిపతి రాష్ట్రపతి. యుద్ధం ప్రకటించడానికి, సంధి చేసుకోవడానికి రాష్ట్రపతికి అధికారం ఉంది. త్రివిధ దళాధిపతుల నియామకం కూడా ఆయన అధికారమే.

దౌత్య అధికారాలు
విదేశాల్లో భారత రాయబారులు, ఇతర దౌత్య సిబ్బందిని, ఐక్యరాజ్యసమితిలో భారతదేశ ప్రతినిధులను రాష్ట్రపతి నియమిస్తారు.

అత్యవసర అధికారాలు
భారత రాష్ట్రపతికి మూడు రకాల అత్యవసర, అసాధారణ అధికారాలను రాజ్యాంగం కల్పించింది. అవి-
జాతీయ అత్యవసర పరిస్థితి
ఆర్టికల్‌ 352 ప్రకారం విదేశీదండయాత్ర, యుద్ధం లేదా సాయుధ తిరుగుబాటు జరిగినప్పుడు రాష్ట్రపతి జాతీయ అత్యవసర పరిస్థితిని విధిస్తారు. ఈ జాతీయ అత్యవసర పరిస్థితి కాలంలో పౌరుల ప్రాథమిక హక్కులను తాత్కాలికంగా రద్దు చేయవచ్చు.
రాజ్యాంగపరమైన అత్యవసర పరిస్థితి. 
దీన్నే రాష్ట్రపతి పాలన అని కూడా అంటారు. ఆర్టికల్‌ 356 ప్రకారం ఏదైన రాష్ట్రంలో రాజ్యాంగ బద్దంగా పాలన కొనసాగించే వీలులేని పరిస్థితి ఏర్పడిందని ఆ రాష్ట్ర గవర్నర్‌ నివేదికను రాష్ట్రపతికి సమర్పిస్తే ఈ అత్యవసర పరిస్థితిని ఆయన ప్రకటిస్తారు. రాష్ట్రపతి పాలన సమయంలో, ఆయన నేరుగా లేదా గవర్నర్‌ ద్వారా లేదా తన ప్రతినిధి ద్వారా ఆ రాష్ట్రంలో పాలన నిర్వహిస్తారు. ఆ రాష్ట్ర శాసనశాఖ విధులను పార్లమెంటు చేపడుతుంది.

ఆర్థిక అత్యవసర పరిస్థితి
ఆర్టికల్‌ 360 ప్రకారం భారతదేశంలో అంతా లేదా ఏదైనా ఒక ప్రాంతంలో ఆర్థిక సంక్షోభ పరిస్థితులు ఏర్పడ్డాయని రాష్ట్రపతి భావిస్తే ఈ ఆర్థిక అత్యవసర పరిస్థితిని విధిస్తారు. అప్పుడు కేంద్రం సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయమూర్తుల జీతభత్యాలతో సహా పాలనా సిబ్బంది, జీతభత్యాలు కూడా తగ్గించవచ్చు. ఆర్థికపరమైన చర్యలు చేపట్టవచ్చు. ఇప్పటి వరకు ఆర్థిక అత్యవసర పరిస్థితిని మన దేశంలో విధించలేదు. 

Posted Date : 04-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ఎన్టీపీసీ

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌