• facebook
  • whatsapp
  • telegram

ద్రావణాలు, ఆమ్లాలు, క్షారాలు

ద్రావణాలు

1. రెండు లేదా అంతకంటే ఎక్కువ సమ్మేళనాలున్న సజాతీయ మిశ్రమాన్ని ద్రావణం అంటారు.
2. ద్రావణంలో సాపేక్షంగా తక్కువ పరిమాణంలో ఉన్న ఘటకాన్ని ద్రావితం అంటారు.
3. ద్రావణంలో సాపేక్షంగా అధిక పరిమాణంలో ఉన్న ఘటకాన్ని ద్రావణి అంటారు.
4. ద్రావణం = ద్రావితం + ద్రావణి
5. ద్రావితాన్ని, ద్రావణికి కలిపినప్పుడు ఏర్పడే సజాతీయ మిశ్రమాన్నే ద్రావణం అంటారు.
ఉదా: i) 2 గ్రాముల కాపర్ సల్ఫేట్‌ను 50 మి.లీ. నీటిలో కలిపారు. తక్కువ పరిమాణం (2 గ్రాములు) ఉన్న కాపర్ సల్ఫేట్ ద్రావితం అవుతుంది, నీరు ద్రావణి అవుతుంది.
ii) 10 గ్రాముల కార్బన్ డై ఆక్సైడ్‌ను ఒక లీటర్ నీటిలో కరిగించగా సోడా ఏర్పడింది. తక్కువ పరిమాణం
(10 గ్రాములు) ఉన్న కార్బన్ డై ఆక్సైడ్ ద్రావితం, ఎక్కువ పరిమాణం ఉన్న నీరు ద్రావణి అవుతాయి.
iii) 50 గ్రాముల నీటికి, 50 గ్రాముల ఆల్కహాల్‌ను కలిపారు. ఈ సందర్భంలో రెండు ఘటకాల పరిమాణం సమానం. ఇలాంటప్పుడు ఏదైనా ఒక ఘటకాన్ని ద్రావణిగా, రెండో ఘటకాన్ని ద్రావితంగా భావించవచ్చు. ఈ ఉదాహరణలో నీరు ద్రావణి, ఆల్కహాల్ ద్రావితం లేదా నీరు ద్రావితం, ఆల్కహాల్ ద్రావణి.
6. నీటిని ద్రావణిగా ఉపయోగించిన ద్రావణాన్ని జలద్రావణం అంటారు.
7. ఆల్కహాల్‌ను ద్రావణిగా ఉపయోగించిన ద్రావణాన్ని ఆల్కహాల్ ద్రావణం అంటారు.
8. స్థిర ఉష్ణోగ్రత వద్ద 100 గ్రాముల ద్రావణిలో కరిగే ద్రావితం పరిమాణాన్ని ద్రావణీయత అంటారు.    


    


9. ద్రావణీయత కింది అంశాలపై ఆధారపడి ఉంటుంది.
* ద్రావితం, ద్రావణి స్వభావం
* ఉష్ణోగ్రత
10. అయానిక పదార్థాలు ధృవ ద్రావణిలో కరుగుతాయి, అధృవ ద్రావణిలో కరగవు.
ఉదా: కాపర్ సల్ఫేట్ నీటిలో కరుగుతుంది, కిరోసిన్‌లో కరగదు.
11. సమయోజనీయ పదార్థాలు అధృవ ద్రావణిలో కరుగుతాయి, ధృవ ద్రావణిలో కరగవు.
ఉదా: నాఫ్తలీన్ నీటిలో కరగదు కానీ కిరోసిన్‌లో కరుగుతుంది.
12. ద్రావణం ఏర్పడినప్పుడు ఉష్ణం వెలువడే సందర్భంలో ఉష్ణోగ్రతను పెంచితే ద్రావణీయత తగ్గుతుంది.
13. ద్రావణం ఏర్పడినప్పుడు ఉష్ణం గ్రహించే సందర్భంలో ఉష్ణోగ్రతను పెంచితే ద్రావణీయత పెరుగుతుంది.
14. ఉష్ణోగ్రతను పెంచితే వాయువుల ద్రావణీయత తగ్గుతుంది.
15. పీడనాన్ని పెంచితే వాయువుల ద్రావణీయత పెరుగుతుంది.
16. KOH, NaNO3, KNO3, NH4Cl లాంటి పదార్థాల ద్రావణీయత ఉష్ణోగ్రతతో పాటు పెరుగుతుంది.
17. CaSO4, Ce2(SO4)3, (CH3COO)2 Ca లాంటి పదార్థాల ద్రావణీయత ఉష్ణోగ్రత పెరగడం వల్ల తగ్గుతుంది.
18. NaCl లాంటి పదార్థాల ద్రావణీయత దాదాపు అంతే ఉంటుంది. ఉష్ణోగ్రత పెరగడం వల్ల మారదు.
19. CO2ను నీటిలో కరిగిస్తే ఏర్పడిన ద్రావణాన్ని సోడా అంటారు. భోజనం తర్వాత ఆహారం త్వరగా జీర్ణం కావడానికి సోడాను సేవిస్తారు. సోడా సీసాను తెరిచినప్పుడు బుడగలు రావడం మనం గమనిస్తాం. ఈ బుడగలే COవాయువు.
20. ఏకాంక ఘనపరిమాణం ఉన్న ద్రావణిలో వివిధ ఉష్ణోగ్రతల వద్ద వాయు పీడనం ఒక అట్మాస్ఫియర్ అయినప్పడు కరిగే వాయు ఘనపరిమాణాన్ని NTP పరిస్థితులను మార్చితే, దాన్ని 'శోషణ గుణకం' అంటారు.
ఉదా: CO2 వాయువు శోషణ గుణకాలు
0oC − 1.713
10oC − 1.194
20oC − 0.878
30oC − 0.665
40oC − 0.53

21. ద్రావణీయత ఆధారంగా ద్రావణాలను మూడు రకాలుగా విభజించారు.
  1) అసంతృప్త ద్రావణం   2) సంతృప్త ద్రావణం    3) అతిసంతృప్త ద్రావణం

22. అసంతృప్త ద్రావణం: నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద మరికొంత ద్రావితాన్ని కరిగించుకోగల ద్రావణాన్ని అసంతృప్త ద్రావణం అంటారు.
23. సంతృప్త ద్రావణం: నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద ఒక ద్రావణిలో కరగాల్సినంత ద్రావితం కరగడం వల్ల ఏర్పడిన ద్రావణాన్ని సంతృప్త ద్రాణం అంటారు.
                                  (లేదా)
నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద మరికొంత ద్రావితాన్ని కరగించుకోలేని ద్రావణాన్ని సంతృప్త ద్రావణం అంటారు.
24. అతిసంతృప్త ద్రావణం: నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద ఒక ద్రావణిలో సంతృప్త ద్రావణం ఏర్పడటానికి అవసరమైన ద్రావితం కంటే అధిక ద్రావితం కరగడం వల్ల ఏర్పడిన ద్రావణాన్ని అతి సంతృప్త ద్రావణం అంటారు. పటిక, హైపోలు అతిసంతృప్త ద్రావణాలను ఇస్తాయి.
25. సంతృప్త ద్రావణం ఏర్పడినప్పుడు కరగకుండా మిగిలిపోయిన ద్రావితం, ద్రావణంలో కరిగిన ద్రావితంతో సమతాస్థితిలో ఉంటుంది. ఈ సమతాస్థితి ఒక గతిక సమతాస్థితి.
26. సంతృప్త ద్రావణాన్ని వేడిచేస్తే అది అసంతృప్త దావ్రణంగా మార్పు చెందుతుంది.
27. అతి సంతృప్త ద్రావణం అస్థిరంగా ఉంటుంది. దీన్ని కదిలించినా లేదా అలజడి కలిగించినా అధికంగా కరిగి ఉన్న ద్రావితం వేరుపడుతుంది. సంతృప్త ద్రావణంగా మార్పు చెందుతుంది.
28. ప్రమాణ ఘనపరిమాణం ఉన్న ద్రావణంలో ఉండే ద్రావితం పరిమాణాన్ని గాఢత అంటారు. గాఢతను వివిధ రకాలుగా సూచించవచ్చు.
29. భారశాతం (Weight Percentage), W%: 100 గ్రాముల ద్రావణంలో కరిగి ఉన్న ద్రావితం భారాన్ని భారశాతం అంటారు. భారశాతానికి ప్రమాణాలు లేవు.


            


30. ఘనపరిమాణ శాతం (Volume Percentage), V%: 100 మి.లీ. ద్రావణంలో ఉన్న ద్రావితం ఘనపరిమాణాన్ని ఘనపరిమాణ శాతం అంటారు. ఘనపరిమాణ శాతానికి ప్రమాణాలు లేవు.
            

31. మొలారిటీ (M): ఒక లీటరు ద్రావణంలో కరిగి ఉన్న ద్రావితపు మోల్‌ల లేదా గ్రామ్ మోల్‌ల సంఖ్యను మొలారిటీ అంటారు.

V లీటర్ల ద్రావణంలో ఉన్న ద్రావిత మోల్‌ల సంఖ్య = n

32. ఒక ద్రావణపు మొలారిటీ ఉష్ణోగ్రతపై ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఉష్ణోగ్రత మారితే ఘనపరిమాణం (V) మారుతుంది.
33. మొలారిటీ ప్రమాణాలు మోల్/ లీటరు.
34. గాఢత తెలిసిన ద్రావణాన్ని ప్రమాణ ద్రావణం అంటారు.
35. ప్రమాణ ద్రావణాలను ప్రమాణ కుప్పెల్లో తయారు చేస్తారు.
36. మోల్ భాగం (Mole Fraction X): ద్రావణంలో ఉన్న ఘటక మోల్‌ల సంఖ్యకు, ద్రావణంలో ఉన్న మొత్తం మోల్స్ సంఖ్యకు గల నిష్పత్తిని మోల్ భాగం అంటారు.
 
 


39. ద్రావణంలో ఉన్న అన్ని ఘటకాల మోల్ భాగాల మొత్తం ఒకటికి సమానమవుతుంది.
             


40. మొలాలిటీ(m): ఒక కిలోగ్రామ్ (kg) ద్రావణిలో కరిగి ఉన్న ద్రావితం మోల్‌ల సంఖ్యను ఆ ద్రావణం మొలాలిటీ (m) గా నిర్వచిస్తారు.
    

41. నార్మాలిటీ (N): ఒక లీటర్ ద్రావణంలో కరిగి ఉన్న ద్రావితం తుల్య భారాల సంఖ్యను ఆ ద్రావణం నార్మాలిటీ అంటారు. దీన్ని 'N' తో సూచిస్తారు.

నార్మాలిటీని లెక్కకట్టేందుకు తుల్యభారాలు అవసరం.

¤ ఆమ్లం ఒక అణువులో స్థానభ్రంశం చెందించగల హెడ్రోజన్ పరమాణువుల సంఖ్యనే దాని క్షారత అంటారు.

¤ క్షారం ఒక అణువులో స్థానభ్రంశం చెందించడానికి వీలైన OH- అయాన్లనే దాని ఆమ్లత అంటారు.

 

42. వాయువులు, బాష్పాలు ఏవైనా, ఎన్నయినా పరస్పరం పూర్తిగా సజాతీయంగా మిశ్రణం చెందుతాయి. కాబట్టి వాయు మిశ్రమాలన్నీ వాయు ద్రావణాలే. వాయు ద్రావణానికి మంచి ఉదాహరణ గాలి.
43. ఒక ద్రవంలో మరో ద్రవం లేదా వాయువు లేదా ఘనపదార్థాన్ని కరగించడం ద్వారా కానీ, కొన్ని సందర్భాల్లో రెండు లేదా ఎక్కువ ఘనపదార్థాలను కానీ కలిపితే ద్రావణాలు లభిస్తాయి. ద్రవ ద్రావణాలను 3 రకాలుగా విభజించారు.
ఎ) పూర్తి మిశ్రణీయ ద్రవాలు (Miscible liquids): బెంజీన్, టోలిన్; నీరు, ఆల్కహాల్ లాంటివి ఒకదాంతో ఒకటి పూర్తిగా మిశ్రణం చెందుతాయి.
బి) పాక్షిక మిశ్రణీయ ద్రవాలు (Partially miscible liquids): ఈథర్, నీరు; ఫీనాల్, నీరు ఒకదానిలో ఒకటి స్వల్పంగా కరుగుతాయి.
సి) అమిశ్రణీయ ద్రవాలు (Immiscible liquids): నూనె, నీరు; కిరోసిన్, నీరు లాంటివి ఒకదానితో ఒకటి ఏమాత్రం కరగవు.
44. మిశ్రమ లోహాలన్నీ ఘన ద్రావణాలే. కాపర్, గోల్డ్ పరస్పరం కలిసిపోయి ఘన ద్రావణాన్ని ఏర్పరుస్తాయి.
45. సోడియం థయోసల్ఫేట్ (హైపో) రసాయన సంఘటనం Na2S2O3 . 2 H2O
46. పదార్థాలు నీటిలో కరిగి ధన, రుణ అయాన్‌లుగా విభజన చెందే ప్రక్రియను అయనీకరణం అంటారు.

Posted Date : 04-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

స్టడీ మెటీరియల్ : గ్రూప్ - డి

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌