• facebook
  • whatsapp
  • telegram

జీవవైవిధ్యం

* భూమి పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకూ అనేక జీవజాతులు, వివిధ ఆవాసాల్లో, వేర్వేరు వాతావరణ పరిస్థితుల్లో అనేక రూపాల్లో వైవిధ్యతను ప్రదర్శిస్తూ జీవిస్తున్నాయి. 

* జీవవైవిధ్యం అనే పేరును ప్రతిపాదించిన శాస్త్రవేత్త ‘రోజెన్‌’. 

* జీవవైవిధ్యాన్ని సామాన్యంగా ఒక ప్రదేశంలో ఉండే జాతుల సంఖ్యా సంపద, వాటి మధ్య వ్యవస్థితమయ్యే వివిధ వ్యత్యాసాలుగా అర్థం చేసుకోవచ్చు.

* ఒక భౌగోళిక పరిధిలో ఉన్న మొత్తం జన్యువులు, జాతులు, ఆవరణ వ్యవస్థల సమాహారాన్ని జీవవైవిధ్యంగా చెప్పవచ్చు.

* జీవులు వాటి చుట్టూ ఉన్న పరిసరాలు,  ఇతర జీవులపై ఆధారపడుతూ జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటాయి. జీవుల మధ్య ఉన్న ఈ పరస్పరాధారిత సంబంధం జీవవైవిధ్య ప్రాధాన్యతను తెలుపుతుంది.

* ఏ ప్రదేశంలో జీవవైవిధ్యం అధికంగా ఉంటుందో ఆ ప్రదేశం ఆవరణ సమతౌల్యాన్ని ప్రదర్శిస్తుంది.

* జీవవైవిధ్యాన్ని మూడు వేర్వేరు స్థాయిల్లో అధ్యయనం చేయవచ్చు. అవి: 

1) జన్యు వైవిధ్యం    2) జాతుల వైవిధ్యం   3) ఆవరణ వ్యవస్థ వైవిధ్యం.

* ఒకే జాతికి చెందిన జీవి జన్యువుల్లో కనిపించే వ్యత్యాసాలకు సంబంధించిన జీవవైవిధ్య స్థాయిని జన్యువైవిధ్యం అంటారు.

* ప్రతి జీవి లైంగిక ప్రత్యుత్పత్తిలో జరిగిన పునఃసంయోజనం వల్ల ఒకే జాతికి చెందిన మిగిలిన జీవుల కంటే వ్యత్యాసాన్ని చూపుతుంది. ఇదే జీవవైవిధ్యానికి ప్రధాన కారణం. వివిధ రంగుల్లో ఉండే సీతాకోకచిలుకలు, వరి మొక్కల్లోని రకాలు మొదలైనవి జన్యు వైవిధ్యానికి ఉదాహరణలు.

* ఒక ప్రదేశంలో ఉండే వివిధ జాతుల మధ్య కనిపించే తేడాలను జాతుల వైవిధ్యంగా చెప్పవచ్చు. దగ్గర సంబంధాలున్న జీవుల్లో బహిర్గత లక్షణాలు ఒకేవిధంగా ఉంటాయి.

*రుల్లి (ఆలియం సెపా), వెల్లుల్లి (ఆలియం సటైవం) లాంటివి జాతుల వైవిధ్యాన్ని ప్రదర్శిస్తాయి.  

* విభిన్న జీవరాశులతో కూడిన ఆవాసాల స్థాయిలో కనిపించే వైవిధ్యాలను ఆవరణ వ్యవస్థ వైవిధ్యాలు అంటారు.

నీటి మొక్కలు, ఎడారి మొక్కలతో వైవిధ్యాన్ని ప్రదర్శిస్తాయి.


జీవవైవిధ్యం - హాట్‌స్పాట్‌లు

జీవవైవిధ్య సంపద ప్రపంచమంతా సమానంగా విస్తరించి లేదు. భూమధ్యరేఖా ప్రాంతంలో అధిక జీవైవిధ్యం కనిపిస్తూ ఉంటుంది. అలాగే ధ్రువాల వైపు వెళ్లే కొద్దీ తక్కువ జీవవైవిధ్యాన్ని గమనించవచ్చు. దీనికి ప్రధాన కారణం జంతు, వృక్ష సంపద ఒక ప్రదేశ వాతావరణం, సముద్ర మట్టం నుంచి దాని ఎత్తు, ఆ ప్రదేశ మృత్తిక రకం మొదలైన అంశాలపై ఆధారపడి ఉంటుంది.

* బ్రిటిష్‌  పర్యావరణ శాస్త్రవేత్త నార్మన్‌మైర్స్‌ తొలిసారిగా జీవవైవిధ్య హాట్‌స్పాట్‌ను నిర్వచించారు.

* కనీసం 1500 స్థానిక వృక్షజాతులు లేదా ప్రపంచ జీవవైవిధ్యంలో 0.5 శాతం జీవసంపదను కలిగి ఉన్న ప్రాంతాన్ని జీవవైవిధ్య హాట్‌స్పాట్‌గా గుర్తించవచ్చు.

* ఒక ప్రాంతం హాట్‌స్పాట్‌గా గుర్తింపు పొందాలంటే ఆ ప్రాంత వాస్తవ ఆవాసంలో సుమారు 70 శాతం వరకూ కోల్పోయిందిగా ఉండాలి. మైర్స్‌ ప్రతిపాదించిన ఈ నిర్వచనాలను కన్జర్వేషన్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ కూడా ఆమోదించింది.

* ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన జీవవైవిధ్య హాట్‌స్పాట్‌లు 36.

* భారతదేశంలో గుర్తింపు పొందిన జీవవైవిధ్య హాట్‌స్పాట్‌ల సంఖ్య 4.

అవి   1) హిమాలయాలు   2) ఇండో-బర్మా ప్రాంతం  3) సుందాలాండ్స్‌   4) పశ్చిమ కనుమలు,  శ్రీలంక ప్రాంతం.

* ప్రజలందరికీ జీవవైవిధ్యంపై అవగాహన కల్పించడానికే ఐక్యరాజ్యసమితి మే 22న అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవంగా ప్రకటించింది. 

* అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవం 2020  ప్రధాన నినాదం (థీమ్‌) ‘మన పరిష్కారాలు ప్రకృతిలో ఉన్నాయి’.

* 201020 ను ఐక్యరాజ్యసమితి జీవవైవిధ్య దశాబ్దంగా ప్రకటించింది.


స్థానీయత (ఎండమిజం)

ఒక భౌగోళిక ప్రదేశానికి మాత్రమే జీవజాతులు పరిమితంగా విస్తరించి ఉండే ప్రత్యేక ఆవరణశాస్త్ర సంబంధ స్థితిని స్థానీయత (ఎండమిజం) అంటారు.

* ఎ.పి.డీకండోల్‌ అనే శాస్త్రవేత్త స్థానీయత అనే పదాన్ని ప్రతిపాదించారు.

* కంగారూలు కేవలం ఆస్ట్రేలియాకు మాత్రమే పరిమితమైన విస్తరణను చూపుతాయి. కాబట్టి ఇవి స్థానీయతను ప్రదర్శించే జాతులకు ఉదాహరణ.

* స్థానీయతను ప్రదర్శించే జాతులకు అంతరించిపోయే ముప్పు ఉంటుంది. కాబట్టి స్థానీయ జాతులకు జీవవైవిధ్య సంపదలో ఒక ప్రత్యేక స్థానం ఉంది. పరిమితంగా విస్తరించి ఉన్న జాతులు అంతరిస్తే అది జీవవైవిధ్యానికి, జీవ సమతౌల్యానికి విఘాతం కలిగిస్తుంది.

* స్థానీయతను రెండు రకాలుగా చెప్పవచ్చు. అవి: 1్శ పేలియో ఎండమిజం 2్శ నియో ఎండమిజం.

* పేలియో ఎండమిజం: పూర్వం బాగా విస్తరించి, ప్రస్తుతం కొంత భౌగోళిక ప్రాంతానికి మాత్రమే పరిమితమైన జీవజాతులు ప్రదర్శించే స్థానీయత. 

* నియో ఎండమిజం: కొత్తగా ఆవిర్భవించిన జీవజాతులు ఒక నియమిత ప్రాంతానికి పరిమితమై ప్రదర్శించే స్థానీయత. 

జీవవైవిధ్య సంబంధ సమావేశాలు - చట్టాలు

రామ్‌సర్‌ సమావేశం: ఇది 1971, ఫిబ్రవరి 2న ఇరాన్‌లో జరిగిన అంతర్జాతీయ సమావేశం. దీని ప్రకారం తడి ప్రాంతాలను గుర్తించారు. 

* మానవ, జీవావరణ కార్యక్రమాన్ని యునెస్కో 1971లో ప్రారంభించింది.

* ధరిత్రీ సదస్సు 1992, జూన్‌ 5 న రియో డిజనీరోలో జరిగింది.

* మన దేశంలో 1972లో వన్యమృగ సంరక్షణ చట్టాన్ని రూపొందించారు.

* జాతీయ జీవవైవిధ్య చట్టాన్ని 2002 లో రూపకల్పన చేశారు. ఇది 2003, అక్టోబరు 1 నుంచి అమల్లోకి వచ్చింది.

* నేషనల్‌ బయోడైవర్సిటీ అథారిటీని 2003లో చెన్నైలో స్థాపించారు. 


జీవవైవిధ్య సంరక్షణ

సాధారణంగా జీవవైవిధ్యాన్ని రెండు విధాలుగా సంరక్షిస్తారు.

అవి 1) స్వస్థానీయ సంరక్షణ   2) పరస్థానీయ సంరక్షణ.

* స్వస్థానీయ సంరక్షణ విధానంలో జీవులను అవి ఉండే సహజ ఆవాసాల్లోనే సంరక్షిస్తారు. ఉదా: జాతీయ పార్కులు, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు, బయోస్ఫియర్‌ రిజర్వ్‌లు, పవిత్ర స్థలాలు.

* పరస్థానీయ సంరక్షణ విధానంలో జీవులను వాటి సహజ ఆవాసాల్లో కాకుండా వేరే స్థలాల్లో సహజ ఆవాస పరిస్థితులను కల్పించి సంరక్షిస్తారు. ఉదా: వృక్షశాస్త్ర సంబంధ ఉద్యానవనాలు, జంతు ప్రదర్శన కేంద్రాలు, సీడ్‌ బ్యాంక్‌లు.

* ఎలిఫెంట్‌ ప్రాజెక్ట్‌ను 1992లో రూపొందించారు. దక్షిణ భారతదేశంలోనే ఎక్కువ ఎలిఫెంట్‌ రిజర్వ్‌లు ఉన్నాయి.

* టైగర్‌ ప్రాజెక్టును 1973లో ప్రారంభించారు. దీని ప్రకారం టైగర్‌ రిజర్వ్‌లను స్థాపించారు.  దేశంలో మొదటి టైగర్‌ రిజర్వ్‌ - జిమ్‌ కార్బెట్‌ నేషనల్‌ పార్క్‌. ఇది ఉత్తరాఖండ్‌లో ఉంది.

* యునెస్కో స్థాపించిన మానవ, జీవావరణ కార్యక్రమంలో భాగంగా మన దేశంలో 1986లో బయోస్ఫియర్‌ రిజర్వ్‌లను ప్రారంభించారు. మన దేశంలో మొదటి బయోస్ఫియర్‌ రిజర్వ్‌ - నీలగిరి. 

* మెరైన్‌ నేషనల్‌ పార్క్‌ను మొదట గుజరాత్‌లో ప్రారంభించారు.

Posted Date : 03-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

స్టడీమెటీరియల్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌