• facebook
  • whatsapp
  • telegram

సివిల్స్‌ పోటీ... ఎందుకని విభిన్నం?

సివిల్స్‌ పోటీ... ఎందుకని విభిన్నం?

సివిల్‌ సర్వీస్‌ను లక్ష్యం చేసుకుని శిక్షణ సంస్థల్లో చేరినవారూ, సొంతంగా సన్నద్ధత ఆరంభించినవారూ ఈ పరీక్ష నిర్దిష్ట లక్షణాలూ, ప్రత్యేకతలపై అవగాహన పెంచుకోవాలి. ఇది మిగతా పరీక్షల కంటే ఎందుకు విభిన్నమైనదో గ్రహించాలి. దానికి అనుగుణంగా ప్రణాళికతో తయారవ్వాలి!
సివిల్స్‌ ప్రిలిమినరీ ఇటీవలే ముగిసింది. ఫలితాలు కొద్దిరోజుల్లో విడుదల కాబోతున్నాయి. ఈ పరీక్ష రాసి ఒకటి రెండు సార్లు నెగ్గలేనివారిలో తమ ప్రతిభా సామర్థ్యాల గురించి సందేహాలు మొదలుకావొచ్చు. ఎందుకిలా వైఫల్యం ఎదురైందనే ప్రశ్నకు జవాబు ఈ పరీక్ష స్వభావంలోనే ఉంది. దాన్ని ఆకళించుకోవటం ముఖ్యం.
రాజకీయ విధాన నిర్ణయాలను సక్రమంగా అమలుచేస్తూ దేశ భవితవ్యాన్ని నిర్దేశించగలిగే హోదాల్లో 30-35 సంవత్సరాలపాటు సేవలు అందించేవారు సివిల్‌ సర్వెంట్లు (ఇప్పుడు ఎంపికైనవారెవరైనా 2050 సంవత్సరం వరకూ విధుల నిర్వహిస్తారు). వీరు రాజకీయ నాయకుల్లా ప్రతి ఎన్నికకూ మారిపోవటం కాకుండా ఉద్యోగ విరమణ వరకూ విధుల్లో కొనసాగుతారు. అంత సుదీర్ఘకాలం వారి విధుల ప్రభావం అసంఖ్యాక ప్రజలపై ఉంటుంది. అందుకే తగిన వ్యక్తులను లోపరహితంగా ఎంపిక చేయడానికి సివిల్‌ సర్వీసెస్‌ పరీక్ష రూపొందింది. దీన్ని ఎప్పటికప్పుడు మెరుగుపరచటానికి ఎన్నో కమిటీలను నియమించారు. వాటి సిఫార్సులకనుగుణంగా సంస్కరణలు అమలవుతూ ఈ పరీక్ష అద్వితీయంగా రూపొందుతోంది.

ఎలాంటి లక్షణాలు అవసరం?
సాధారణంగా ఏ ఉద్యోగానికైనా బలమైన వ్యక్తిత్వం, నిజాయతీ, అంకితభావం, కష్టపడి పనిచేయటం తప్పనిసరి. వీటితోపాటు సివిల్‌ సర్వెంట్లకు నిర్దిష్టంగా కొన్ని లక్షణాలూ, నైపుణ్యాలూ అవసరమవుతాయి. భవిష్యత్తు గురించి ఆలోచించే దార్శనికత, ఆధునిక సాంకేతికతపై పట్టు ఉండాలి. సహజ న్యాయం, మానవ హక్కులను విశ్వసించటంతో పాటు పేదలపై, బడుగుల సమస్యలపై సహానుభూతి ఉండాలి. సమస్యా పరిష్కార నైపుణ్యం, తార్కికంగా పరిస్థితిని విశ్లేషించగలిగే నేర్పు, బృందాన్ని నడిపించగలిగే సామర్థ్యం, భిన్న వర్గాలతో భావప్రసారం చేయగలిగే చొరవ ఉండాలి.
ఈ అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందినదే సివిల్‌ సర్వీసెస్‌ పరీక్ష. ఇది మూడంచెల్లో.. ప్రిలిమినరీ, మెయిన్‌, మౌఖిక పరీక్షలతో కూడినది. మొదటిది ఆబ్జెక్టివ్‌ పద్ధతిలో, రెండోది వ్యాసరూప పద్ధతిలో ఉంటాయి. మౌఖిక పరీక్షలో అభ్యర్థి వ్యక్తిత్వాన్ని భిన్నకోణాల్లో పరిశీలిస్తారు.

తక్కువ అంచనా వేయొద్దు
మొదటిదైన ప్రిలిమినరీని ఆబ్జెక్టివ్‌ పరీక్షే కదా అని తక్కువ అంచనా వేయకూడదు. ఎందుకంటే.. మూడంచెల్లో క్లిష్టమైన పరీక్ష ఇదే!
దాదాపు 4.5 లక్షల మంది అభ్యర్థుల్లోనుంచి 12 వేల మందిని ఎంపిక చేయడం కోసం పరీక్షను రానురానూ క్లిష్టతరంగా రూపొందిస్తున్నారు. 2015 నుంచీ రెండో పేపర్‌ను అర్హత పరీక్షగా మార్చారు. దీంతో దాదాపు 90 శాతం మంది అర్హత పొందుతున్నారు. దీంతో మొదటి పేపర్‌ కీలకంగా మారింది. దీనిలో దాదాపు ఒకేరకంగా ఉండే జవాబులు, కాంబినేషన్‌ జవాబులు (1, 2; 1, 2, 3; 1, 2, 3, 4) ఇస్తూ ఎలిమినేషన్‌ పద్ధతిలో జవాబులు గుర్తించటానికి వీల్లేకుండా చేస్తున్నారు. ఏమరుపాటున ఉంటే అభ్యర్థులు పొరపాట్లు చేయటానికి ఎక్కువ అవకాశముండేలా రూపొందిస్తున్నారు.
ఇతర పోటీ పరీక్షలకూ, సివిల్స్‌కూ తేడాను అభ్యర్థులు గమనించటం ముఖ్యం. విస్తృతమైన అంశాలను సివిల్స్‌లో చదివితే, మిగతా పోటీ పరీక్షల్లో అంశాలను అంత విస్తృతంగా చదివే అవసరం ఉండదు.
సివిల్స్‌లో ఒక అంశాన్ని సంపూర్ణంగా అధ్యయనం చేయాల్సివుంటుంది. దానిపై స్పష్టత తెచ్చుకోవాలి. విశ్లేషించగలగాలి. కానీ మిగతా పరీక్షలకు క్లుప్తంగా చదివి, వాస్తవికాంశాలూ, గణాంకాలూ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది.
ఇతర పరీక్షలకు జనరల్‌ నాలెడ్జ్‌ తరహాలో చదివితే సరిపోతుంది. కానీ సివిల్స్‌కు అది సరిపోదు. దేశ ప్రజలపై ప్రభావం చూపే వివిధ అంశాలను వివరంగా చదవాలి. ప్రభుత్వ పథకాలూ, అంతర్జాతీయ అంశాలపై అవగాహన పెంచుకోవాలి.

రెండోసారి శిక్షణ ఫలితమిస్తుందా!
సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలో ప్రతిభ చూపించాలంటే దీర్ఘకాలికమైన సన్నద్ధత అవసరమని తెలిసిందే. కానీ ఏ తీరులో ఆ తయారీ ఉండాలనేదానిపై విద్యార్థుల్లో చాలా సందేహాలు వ్యక్తమవుతుంటాయి. ముఖ్యమైన కొన్నిటిని ఇక్కడ పరిశీలిద్దాం.


1. గత నాలుగేళ్ళుగా సివిల్స్‌ పరీక్షా విధానం మారుతూ వస్తోంది. అంతే కాదు; ఏటా ఏదో ఒక మార్పు జరుగుతూనేవుంది. ఏ ఆధారంతో దీర్ఘకాలం సిద్ధమవ్వాలి?
* నిజమే. 2011 సంవత్సరం నుంచి చాలా మార్పులు జరిగాయి. అయితే అలాంటి నిరంతర మార్పులే మళ్ళీ జరిగే అవకాశం లేదు. పరీక్ష మౌలిక స్వరూపం (హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ మొ.) మాత్రం మారదు. అవి అవసరాలకు తగ్గట్టుగా మారుతాయంతే. అందుకని ఈ సబ్జెక్టులతో సన్నద్ధతను నిరభ్యంతరంగా మొదలుపెట్టవచ్చు.


2. కళాశాలలో ఇంజినీరింగ్‌ చదువుతున్నాను. సివిల్స్‌కు ఎలా తయారవ్వాలి?
* హ్యుమానిటీస్‌ (హిస్టరీ, జాగ్రఫీ లాంటివి) సబ్జెక్టుల అధ్యయనం ఆరంభించండి. ఫైనలియర్లో మరింత శ్రద్ధ చూపించండి.


3. సివిల్స్‌కు శిక్షణ తీసుకున్నాను. అయితే పరీక్షలో ఇంకా నెగ్గలేదు. మళ్ళీ కోచింగ్‌ తీసుకోవడం మంచిదేనా?
* శిక్షణ (కోచింగ్‌) పాత్ర పరిమితమే. ఇంజినీరింగ్‌, కామర్స్‌ విద్యార్థులు పదో తరగతిలో తాము వదిలేసిన సబ్జెక్టులను పరిచయం చేసే పనీ, వారి నైపుణ్యాలను సానపెట్టే పనీ కోచింగ్‌ చేస్తుంది. ఇక హ్యుమానిటీస్‌ విద్యార్థులు తమ సబ్జెక్టులపై మరింత శ్రద్ధ పెట్టేలా సహకరిస్తుంది. ఇంతకుమించి కోచింగ్‌ నుంచి మరింకేమీ ఆశించకూడదు. కోచింగ్‌ను రెండోసారి తీసుకోవటం వల్ల సమయంతోపాటు డబ్బు కూడా వృథా అవుతుంది.


4. ఈ పరీక్షకు ఎక్కువ సమయం వెచ్చించాలని తెలుసు. కానీ దానికి ముగింపు అనేది ఉండాలి కదా? నిర్దిష్టంగా ఇంత సమయం అవసరమని నిర్దేశించుకోవచ్చా?
* కనీసం రెండు ప్రయత్నాలకు తగ్గట్టుగా పూర్తి సమయం కేటాయించుకోవాలి. ఆ తర్వాత మరో ప్రత్యామ్నాయం (ఉద్యోగం, ఉన్నతవిద్య మొదలైనవి) చూసుకుని, పరీక్షకు సిద్ధమవుతూవుండాలి.


5. రాబోయే కాలంలో సివిల్స్‌లో ఎలాంటి మార్పులు జరిగే అవకాశం ఉంది?
* ప్రిలిమినరీని ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించే అవకాశం ఉంది. దానివల్ల ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ల మధ్య ఉండే కాలవ్యవధిని తగ్గించవచ్చు. ఈ రకంగా మొత్తం పరీక్ష నిర్వహణలో ఉండే దీర్ఘ విరామం గణనీయంగా తగ్గుతుంది. ఎస్సే పేపర్లో రెండు విభాగాలు పెట్టి ఒక దానిలో చర్చనీయాంశాలు, రెండోదానిలో కేస్‌ స్టడీ ఆధారిత ప్రశ్నలు అడగవచ్చు. మెయిన్‌ పరీక్షలో ఐఏఎస్‌కూ, ఐపీఎస్‌కూ నిర్దిష్ట ప్రశ్నపత్రాలు (అంటే ఐఏఎస్‌ కోసం గవర్నెన్స్‌, పబ్లిక్‌ పాలసీ; ఐపీఎస్‌కు జనరల్‌ ప్రిన్సిపుల్స్‌ ఆఫ్‌ లా) ఇవ్వవచ్చు.

6. సివిల్స్‌లో అనుకూల ఫలితం వస్తుందని నిశ్చయంగా చెప్పలేం కదా? మరి ఆ కృషి వ్యర్థం కాకుండా ఏమైనా చేయొచ్చా?
* సివిల్స్‌తోపాటు రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పరీక్షలూ, ఆర్‌బీఐ పరీక్షలూ రాస్తుండాలి. ఈ రకంగా ఉపాధిపరంగా ఉండే అభద్రతాభావం తగ్గించుకోవచ్చు.

Posted Date : 03-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

స్టడీమెటీరియల్

 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌