• facebook
  • twitter
  • whatsapp
  • telegram

చిత్రగ్రీవం

'ఆలోచించండి - చెప్పండి'కి సమాధానాలు
 

1. కోల్‌కతా నగరంలోని పిల్లలు పక్షుల ప్రేమికులని ఎలా చెప్పగలరు?
జ: సుమారు పది లక్షల జనాభా ఉందని మనం అనుకునే కోల్‌కతా మహానగరంలో కనీసం ఇరవై లక్షల పావురాలు ఉంటాయి. ప్రతి మూడో కుర్రాడి దగ్గర కనీసం ఒక డజను వార్తలు మోసే పావురాలు, గిరికీల పావురాలు, పిగిలి పిట్టలూ, బంతి పావురాలు ఉంటాయి. దీన్నిబట్టి కోల్‌కతా నగరంలోని పిల్లలు పక్షుల ప్రేమికులని చెప్పవచ్చు.

 

2. మీ ప్రాంతంలో ఏఏ పక్షులు ఎక్కువగా ఉంటాయి? వాటికోసం మీరేం చేస్తున్నారు?
జ: మా ప్రాంతంలో పిట్టలు, కాకులు, కోళ్లు ఎక్కువగా ఉంటాయి. పిట్టలు, కాకుల కోసం వేసవి కాలంలో కొబ్బరి చిప్పల్లో నీళ్లుపోసి చెట్టుకు కడతాను. అవి వచ్చి నీళ్లుతాగి తమ దాహార్తిని తీర్చుకుంటాయి. కోళ్ల కోసమైతే ప్రతిరోజు ఉదయం లేవగానే వాటిని గూడులో నుంచి వదిలి వాటికి గింజలు పోస్తా. మట్టిపాత్రలో నీళ్లు పోసి ఉంచుతా. పిట్ట గూళ్లను కాపాడతాను.

 

3. పావురాల గురించి ఆశ్చర్యం కలిగించే విషయాన్ని తెలుసుకున్నారు కదా! అలాగే మిగతా పక్షుల్లో ఆశ్చ్యర్యం కలిగించే విషయాలు ఏమైనా ఉన్నాయా?
జ: కోడి తన పిల్లలను ఎవరైనా ముట్టుకున్నట్లు అనిపిస్తే మీదికెగిరి పొడుస్తుంది. తన పిల్ల ఏదైనా మురికి కాలువలో పడితే అనేకసార్లు ముందుకు వెనక్కు అరుస్తూ తిరుగుతుంది. కుక్క, పిల్లి లాంటివి దగ్గరికి వస్తే బెదిరిపోయి అరుస్తూ దాడి చేసేందుకు ప్రయత్నిస్తుంది.
పిచ్చుక తుమ్మచెట్టుపై గూడు కట్టుకుంటుంది. ఈ గూడు అల్లిక విధానం సుందరంగా ఉంటుంది. గూడు నిర్మాణంలో ఆ పిచ్చుక పడే శ్రమ ఔరా అనిపిస్తుంది.

 

4. విశ్వాసం ప్రదర్శించడం అంటే ఏమిటి?
జ: మనమీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ముచేయకుండా ప్రేమను తెలియజేసేలా ప్రవర్తించడం లేదా బహిర్గతం చేయడాన్నే 'విశ్వాసం ప్రదర్శించడం' అంటారు. మనమీద పెట్టుకున్న విశ్వాసాన్ని మాట రూపంలో అనుకోవడం కాకుండా ప్రదర్శిస్తాం. విశ్వాస ప్రదర్శన ఏరకంగానైనా ఉంటుంది.

 

5. అంతఃప్రేరణాబలం అంటే ఏమిటి? దీనివల్ల మనం ఏం చేయగలం?
జ: హృదయంలో పదునైన ఉత్తేజం రావడమే అంతఃప్రేరణా బలంగా చెప్పవచ్చు. లోపల కలిగిన ప్రేరణ ఎంతటి పనినైనా చేయిస్తుంది. అసాధ్యం అనుకున్న పని సుసాధ్యం అవుతుంది. అంతఃప్రేరణాబలం శారీరక, మానసికమైన పనులను సైతం చేసేందుకు చేయూతను ఇస్తుంది. మనం దేనినైనా సమయానుకూలంగా పూర్తిచేయవచ్చు.

 

6. మీరు ఎప్పటికీ మరచిపోలేని రోజు ఏది? ఎందుకు?
జ: జిల్లాస్థాయి పాటల పోటీలో వందల మందిలో నేను పాడిన పాటకు ప్రథమ బహుమతి వచ్చిన రోజును నేను ఎప్పటికీ మరచిపోలేను. ఎందుకంటే ఆ బహుమతి తీసుకున్న రోజు నుంచి నేనే అన్ని స్థాయుల్లో పాటల పోటీల్లో ముందుంటున్నాను.

 

7. తెలివిమాలిన పనులు అంటే ఏమిటి?
జ: తెలివిని ఉపయోగించకుండా చేసే పనులను తెలివిమాలిన పనులు అంటారు. తెలివితో పనిచేస్తే పనులు సక్రమంగా జరుగుతాయి. కొన్ని సందర్భాల్లో తెలిసీతెలియక పనులు చేసేటప్పుడు తప్పిదాలు జరుగుతుంటాయి. ఆ సందర్భంలో 'తెలివిమాలిన పనులు' అనే మాటను వాడతారు.

 

8. మీమీద మీకే ఎప్పుడైనా కోపం వచ్చిందా? ఎందుకు?
జ: మా తెలుగు మాస్టారు క్విజ్ పోటి పెట్టినప్పుడు చివరి రౌండ్‌లో ఒక్క ప్రశ్నకు జవాబు చెబితే నా జట్టుకే మొదటి బహుమతి వచ్చేది. కానీ తొందరగా జవాబు గుర్తురాకపోవడంతో బహుమతి వేరే జట్టుకు వచ్చింది. సరైన సమయంలో జవాబు చెప్పలేకపోయినందుకు నా మీద నాకే కోపం వచ్చింది.

 

9. పావురం గూడు ఎలా ఉందో తెలుసుకున్నారు కదా! మీకు తెలిసిన పక్షి గూళ్లు ఎలా ఉంటాయో చెప్పండి. పక్షి గూళ్లన్నీ ఒకేలా ఉంటాయా?
జ: నాకు తెలిసిన పక్షి గూళ్లు - కాకి గూడు. ఇది చెట్టుపై కట్టెలు, గడ్డితో గుండ్రంగా కట్టి ఉంటుంది. పిచ్చుక గూడు అయితే తుమ్మచెట్టుకు వేలాడుతూ ఉంటుంది. ఇది సన్నగా, మెత్తగా ఉంటుంది. ఆ నిర్మాణం దానికి ప్రత్యేకం. పిట్ట గూడు గడ్డితో గుండ్రంగా కడుతుంది. పక్షుల గూళ్లన్నీ ఒకేలా ఉండవు.

 

10. దివ్యసంకల్పం చోటుచేసుకోవడం అంటే ఏమిటి?
జ: అనుకోకుండా మంచి పనులు మొదలుపెట్టి విజయవంతంగా ముగించడాన్ని 'దివ్యసంకల్పం చోటు చేసుకోవడం' అంటారు. దివ్య సంకల్పం చోటుచేసుకున్నప్పుడు సమయం, సందర్భం ఉండదు. ఎలాంటి స్థాయిలోనైనా జరుగుతుంది.

 

11. పిల్లపక్షిని దాని తల్లి ఎలా పెంచిందో తెలుసుకున్నారు కదా? మరి మిమ్మల్ని ఎవరు? ఎలా పెంచారో చెప్పండి.
జ: నన్ను మా అమ్మ చాలా అల్లారుముద్దుగా పెంచింది. నేను ఏది అడిగినా ఇప్పటికీ కాదనదు. అడిగినవన్నీ సమకూరుస్తుంది. బట్టలు, బొమ్మలు.. ఇలా సమస్తం కొనిపెడుతుంది. మంచి మంచి కథలు చెబుతుంది. పెద్దలతో ఎలా మాట్లాడాలో, ఎలా ప్రవర్తించాలో నేర్పింది.

 

12. 'ఘనకార్యం చేయడం' అనే వాక్యం నుంచి మీరేం గ్రహించారు? ఇలా దీన్ని ఇంకా ఏయే సందర్భాల్లో వాడతారు?
జ: 'ఘనకార్యం చేయడం' అనే వాక్యాన్ని ఏదైనా తప్పు పని జరిగినప్పుడు వాడతారని తెలుసుకున్నాను. తెలియక ఒక పని చేసినప్పుడు దానివల్ల ఇబ్బంది ఎదురు అవుతుంది. నష్టం జరుగుతుంది. ఆ సందర్భంలో 'ఘనకార్యం చేశావు' అని మనల్ని హేళన చేయడం పరిపాటి. అంతేకాకుండా గొప్ప పనులు చేసిన సందర్భంలో కూడా ఈ వాక్యాన్ని వాడతారు.

 

13. 'ఏ మాటకు ఆ మాటే' అనే వాక్యాన్ని ఏయే సందర్భాల్లో ఉపయోగిస్తారు?
జ: ఉన్న విషయంలోని నిజాన్ని, అబద్ధాన్ని వేరు చేసి చూపే సందర్భంలో వాడతారు.
వాస్తవాన్ని అంగీకరించే సందర్భంలో వాడతారు. ఉన్న విషయాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పేటప్పుడు ఉపయోగిస్తారు. ఒక విషయంపై మాట్లాడుతున్నప్పుడు మరో విషయం చెప్పే సందర్భంలో 'ఏ మాటకామాటే' చెప్పాలి వేరే విషయాలు ఎందుకు అని ప్రశ్నించడం గమనించవచ్చు.

 

14. పావురం కంటిలోని ప్రత్యేకతను గుర్తించారు కదా! ఇంకా ఇతర జంతువులు/ పక్షులకు సంబంధించిన ప్రత్యేకతలు ఏమున్నాయి?
జ: కప్పలు ఒక కాలంలోనే కనిపించి తర్వాత కొంతకాలంపాటు నిద్రావస్థలో ఉంటాయి. బల్లి తన జిగురు నాలుకతో పురుగులను అందుకుంటుంది. తేనెటీగలు తేనెను చెట్లపై పెట్టి కొంతకాలం వరకు దాని మీదనే ఆధారపడతాయి. పిచ్చుకలా గూటి నిర్మాణం ఎవరితరమూ కాదు. నీటికాకులు నీళ్లలోని చేపలను పైనుంచి చూసి అందుకుంటాయి.

 

15. 'నిమ్మకు నీరెత్తడం' అని ఏయే సందర్భాల్లో వాడతారు?
జ: ఏం పట్టించుకోని సందర్భంలో 'నిమ్మకు నీరెత్తడం' అనే పదాన్ని వాడతారు. విషయం తెలిసి ఉన్నా ఏమీ మాట్లాడకుండా ఉన్నప్పుడు తన గురించి తానే తప్ప ఇతరులకు సంబంధించిన వాటిని పరిగణనలోకి తీసుకోకుండా ఉన్న సందర్భంలో వాడతారు.

 

16. 'మహత్తర ఘట్టానికి చేరుకోవడం' అంటే ఏమిటి? దీనికి కొన్ని ఉదాహరణలు తెలపండి.
జ: ఒక పని విజయవంతంగా పూర్తికావడానికి సిద్ధంగా ఉన్నప్పుడు దాన్ని 'మహత్తర ఘట్టానికి చేరుకోవడం' అంటారు. పనిలోని ఫలితం పొందేస్థితిని పైవిధంగా పిలుస్తారు.
ఉదా: 1) గ్రామానికి కావాల్సిన మంచినీటి కోసం నిర్మించే వాటర్ ట్యాంక్ నిర్మాణం పూర్తయిన సందర్భంలో 'మహత్తర ఘట్టానికి చేరుకుంది' అని అంటారు.
2) సుమారు రెండు సంవత్సరాలపాటు రాసిన పుస్తకం అచ్చయి విడుదలకు సిద్ధంగా ఉన్నప్పుడు మహత్తర ఘట్టానికి చేరుకుంది అని అంటారు.

Posted Date : 19-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

 
 

విద్యా ఉద్యోగ సమాచారం

telugu

OTHER SUBJECTS

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌