• facebook
  • twitter
  • whatsapp
  • telegram

చిత్రగ్రీవం

కవి పరిచయం
* 'చిత్రగ్రీవం' పాఠ్యాంశ రచయిత ధనగోపాల్ ముఖర్జీ.
* ఈయన 1890 లో జన్మించారు.
* ముఖర్జీ కుటుంబం కోల్‌కతాకు దగ్గరలోని ఓ మందిరంలో పూజారులుగా ఉండేవారు.
* ధనగోపాల్ బాల్యం అంతా భారతదేశంలోనే గడిచింది. ఆయన పందొమ్మిదేళ్ల వయసులో అమెరికా వెళ్లారు.
* అమెరికాలోని కాలిఫోర్నియా, స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయాల్లో చదువుకున్నారు.
* ఆయన జీవితం అంతా అమెరికాలోనే గడిచింది.
* ముఖర్జీ ముఖ్య వ్యాపకాలు - రచనలు చేయడం, ఉపన్యాసాలు ఇవ్వడం.
    » జంతువులకు సంబంధించిన బాలల పుస్తకాలు (9) రాశారు.
   » 'కరి ది ఎలిఫెంట్' (1922), 'హరిశా ది జంగిల్ ల్యాడ్' (1924), 'గోండ్ ది హంటర్' (1928) పుస్తకాలు రాశారు.
* ధనగోపాల్ ముఖర్జీ రాసిన విలక్షణ పుస్తకం 'చిత్రగ్రీవం'.
* 'చిత్రగ్రీవం' 1928లో 'న్యూబెరీ మెడల్' ను గెలుచుకుంది.
* బాలసాహిత్యంలో విశేష కృషి చేసినవారికి 'అమెరికన్ లైబ్రరీ అసోసియేషన్' ఇచ్చే విశిష్ట పురస్కారమే న్యూబెరీ మెడల్.
* ఈ పురస్కారాన్ని అందుకున్న ఒకే ఒక భారతీయ రచయిత 'ధనగోపాల్ ముఖర్జీ'.
* విదేశాల్లో ఉన్నప్పటికీ ఏనాడూ ఆయన భారతదేశాన్నీ, భారతీయ మూలాలను మరచిపోలేదు.
* ఇక్కడి (భారతదేశం) కథల గురించి కూడా రచనలు చేశారు.
* ఆయన 1936లో మరణించారు.

పాఠ్యాంశ ఉద్దేశం - నేపథ్యం

మనదేశంలో వృక్షసంపద, పక్షిసంపద ఎక్కువగా ఉంటుంది. అయితే వీటి గురించి తెలియజేసే పుస్తకాలు తక్కువగా ఉన్నాయి. పాతకాలంలో సమాచారాన్ని తెలియజేసేందుకు పావురాలను పంపించేవారు. 'చిత్రగ్రీవం' అనే పుస్తకం పావురాల పుట్టుక, వాటి జీవన వివరాలకు సంబంధించిన కథనాలతో కూడింది. కలకత్తాలో ఓ పెంపుడు పావురం, దాన్ని పెంచే ఓ బాలుడూ... వారి కథను మనసుకు హత్తుకుపోయేలా వివరించింది ఈ 'చిత్రగ్రీవం'. బాలల కోసమే రాసిన పుస్తకమైనప్పటికీ ప్రకృతి పరిశీలకులను కూడా అలరించింది. పావురాల జీవనానికి సంబంధించిన అతి సూక్ష్మ వివరాలు తెలియజెప్పడమే ఈ పాఠం ఉద్దేశం.

పాఠ్యభాగ వివరాలు

* చిత్రగ్రీవం కథాప్రక్రియకు చెందింది.
* ఇది అనువాద కథ.
* ధనగోపాల్ ముఖర్జీ రాసిన 'చిత్రగ్రీవం - ఓ పావురం' కథ అనే పుస్తకంలో నుంచి స్వీకరించారు.
* తెలుగులోకి రచయిత 'దాసరి అమరేంద్ర' అనువదించారు.
* ఈ అనువాదాన్ని నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా సంస్థ ప్రచురించింది.
* 'చిత్రగ్రీవం' అనేది ఒక పెంపుడు పావురం పేరు.
* ఈ పాఠం పక్షులకు సంబంధించిన శాస్త్రీయ విజ్ఞానాన్ని అందిస్తుంది.
 

ప్రవేశిక
* పక్షి ప్రపంచంలో రెండు దృశ్యాలు అతి మనోహరమైనవి.

మొదటిది
* తల్లి పక్షి గుడ్డు పగలగొట్టి పిల్ల పక్షిని ఈ ప్రపంచపు వెలుగు వెల్లువలోకి తీసుకురావడం.

రెండోది
* గుడ్డు నుంచి బయటకి వచ్చిన పిల్ల పక్షి నోటికి ఆహారం అందిస్తూ తల్లి పక్షి పెంపకం కొనసాగించడం.
» చిత్రగ్రీవం పెంపకం ఎంతో అనురాగంతో సాగింది.
» ఇంతకూ 'చిత్రగ్రీవం' ఎవరు? దాని పెంపకం ఎలా సాగింది? అది ఎలా ఎగరడం నేర్చుకుంది? ఈ పాఠం చదివి తెలుసుకోండి.

పాఠ్యభాగ సారాంశం
   పది లక్షల మంది నివసించే కలకత్తా మహానగరంలో కనీసం ఇరవై లక్షల రకరకాల పావురాలు ఉంటాయి. పావురాలను పెంచడం అనే కళ వేల సంవత్సరాలుగా భారతదేశంలో కొనసాగుతుంది. అలా పావురాలను పెంచడం అనే కళ ద్వారా ప్రపంచానికి పిగిలి పిట్ట, బంతి పావురాలను భారతదేశం అందించగలిగింది. ఎన్నో శతాబ్దాల నుంచి రాజులు, యువరాజులు, రాణులు, యువరాణులు తమ మందిరాల్లో; సామాన్యులు, నిరుపేదలు తమ ఇళ్లూ, పూరిళ్లలోనూ వీటిని పెంచుతున్నారు.
   విదేశీయులెవరైనా మన మహానగరాలకు వచ్చినట్లయితే వారికి గిరికీలు కొట్టే పావురాల గుంపులు కనిపిస్తాయి. పెంపుడు పావురాలకు తమ డాబా ఇళ్ల మీద నిల్చొని తెల్ల జెండాలు ఊపుతూ సంకేతాలు అందించే కుర్రాళ్లు కనిపిస్తారు. అప్పుడు గుంపులుగా ఉన్న పావురాలు తమ యజమానుల ఇళ్ల మీద కొద్దిసేపు తిరుగుతూ అన్నీ కలిసి సమూహంగా ఏర్పడి, కనుచూపునకు అందనంత ఎత్తుకు ఎగిరిపోతాయి. అలా కలగలిసి గంటల తరబడి ఎగిరాక తిరిగి అన్నీ విడివిడిగా యజమానుల ఇళ్లకు చేరుకుంటాయి.
   ఇళ్ల పై కప్పులన్నీ ఒకేలా ఉన్నా తమ గూళ్లకు ఎలా చేరుకోగలుగుతున్నాయా అన్నది ఆశ్చర్యం కలిగించే విషయం. పావురాలకు అద్భుతమైన దిశాపరిజ్ఞానం ఉంటుంది.
   రచయిత ఏనుగులు, పావురాలు తమ యజమానుల పట్ల ఎక్కువ విశ్వాసం ప్రదర్శించేవని, వాటితో సన్నిహిత పరిచయం ఉందని అంటున్నారు.
అద్భుతమైన అంతః ప్రేరణాబలంతో పావురాలు, ఏనుగులు యజమానుల చెంతకు చేరతాయి.
   రచయిత ముఖర్జీ పెంపుడు ఏనుగు పేరు 'కరి'. పెంపుడు పావురం పేరు 'చిత్రగ్రీవం'. చిత్ర అంటే ఉల్లాసభరితమైన రంగులతో నిండిన - అని అర్థం. 'గ్రీవం' అంటే కంఠం. పావురం మెడ చిత్ర విచిత్ర వర్ణ భరితమై ఉండేది. ఆయన ఆ పావురాన్ని 'హరివిల్లు మెడగాడు' అని ముద్దుగా పిలుస్తాడు.
   నిజానికి చిత్రగ్రీవం పుట్టుకతోనే హరివిల్లు మెడతో ఉట్టిపడలేదు. గుడ్డులోంచి బయటపడినప్పుడు ఏ రంగులూ లేవు. మూడు నెలలు నిండాక ఈకలు పెరిగి, అవి అతిసుందరమైన రంగులతో నిండాక దానికి సాటి రాగల పావురం ఊళ్లో లేదని స్పష్టమైంది. వేల పావురాల్లో అతిసుందరమైంది చిత్రగ్రీవం.
   చిత్రగ్రీవం తల్లిదండ్రుల్లో తండ్రి ఓ గిరికీల మొనగాడు, తల్లి ఓ వార్తల పావురం. ఆ రోజుల్లో అది అతి సుందరమైన కులీన వంశానికి చెందిన పావురం. రెండు విశిష్టమైన పావురాలు జతగట్టాయి. గుడ్లుపెట్టాయి. వాటికి పుట్టిన చిత్రగ్రీవం వార్తాహారియైన పావురంగా రూపొందింది. తల్లి నుంచి తెలివితేటలు, తండ్రి నుంచి వేగం, చురుకుదనం, సాహసం నేర్చుకుంది. ఆ శక్తియుక్తుల పుణ్యమా అని అది ఎన్నోసార్లు శత్రువుల దాడి నుంచి ఆఖరి క్షణంలో - ఆ దాడి చేస్తున్న డేగల తలల మీద నుంచే గిరికీలు కొట్టి తప్పించుకుంది.
గుడ్డులో ఉన్నప్పుడు చిత్రగ్రీవం ఓ ప్రమాదం నుంచి తృటిలో ఎలా తప్పించుకుందో తెలియజేశాడు రచయిత.
తల్లి పావురం పెట్టిన రెండు గుడ్లలో ఒకదాన్ని తీసి జాగ్రత్తగా పక్కగూట్లో పెట్టాడు. మెత్తటి పదార్థాలు ఏమీలేవు. ఆ గూటిలోని చెత్తను తీసేస్తున్నాడు. తీసి మళ్లీ గూట్లో ఒక్క గుడ్డును పెట్టాడు. రెండో గుడ్డును మెల్లగా పెట్టే సమయంలో తండ్రి పావురం రచయిత ముఖాన్ని గీరింది.
   ఆ సందర్భంలో రెండో గుడ్డు పగిలిపోయింది. గుడ్లను ఎత్తుకు పోతున్నాడేమో అనుకుని అలా చేసిందని గ్రహించాడు. పొదుగు కాలంలో గూళ్లను శుభ్రపరచేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని అర్థం అయ్యింది.
   పొదగడం విషయంలో మూడింట రెండు వంతులు నిర్వహించేది తల్లి పక్షి. గుడ్డు పెంకును ముక్కుతో పొడిచి పిల్ల పక్షిని ఈ ప్రపంచంలోకి ఎప్పుడు తీసుకురావాలో తల్లిపక్షికి కచ్చితంగా తెలుసు. గుడ్డులోని పచ్చసోనా, తెల్లసోనా కలగలిసి ప్రాణం పోసుకుని పిల్లపక్షిగా రూపొంది, ప్రపంచంలోకి అడుగుపెట్టడానికి సంసిద్ధమయ్యే శుభ ముహూర్తం వచ్చిందని తల్లి పక్షికి అంత కచ్చితంగా ఎలా తెలుస్తుంది అన్నది మన ఊహకందని విషయం. అలాగే పై పెంకుమీద ఏ చోటున ఎంత బలంతో ముక్కుతో తాకాలో కూడా తల్లిపక్షికి క్షుణ్నంగా తెలుసు.
   గుడ్లు పొదగడం మొదలైన ఇరవయ్యో రోజున తల్లిపక్షి గుడ్డు మీద కూర్చోవడం మానేసి పక్కపక్కన తిరగడం రచయిత గమనించాడు. తండ్రి పక్షి పొదగడానికి వచ్చిన ప్రతిసారి తల్లిపక్షి ముక్కుతో పొడిచి దూరంగా తరిమేసేది. అదంతా ఆందోళన, ఆసక్తి మిళితమై ఆత్రంగా గూటికేసి రచయిత చూడసాగాడు. ఓ గంట ముప్పావు సమయం గడిచాక తల్లిపక్షి మెడ అటూ ఇటూ తిప్పుతూ గుడ్డులోపల కదలికలను వినసాగింది. దివ్య సంకల్పంతో తల నిక్కించి గురిచూసి రెండు ముక్కు పోట్లతో గుడ్డును పగలగొట్టింది. పిల్లపక్షి బయటికొచ్చింది. తల్లిపక్షి తన రొమ్ములోని నీలి ఈకల మాటున దాన్ని పొదువుకుంది.
   పక్షి ప్రపంచంలో రెండు దృశ్యాలు అతి మనోహరమైనవి. అందులో మొదటిది గుడ్డు బద్దలుకొట్టి తల్లిపక్షి పిల్లపక్షిని ఈ ప్రపంచపు వెలుగులోకి తీసుకురావడం. రెండోది బయటకు వచ్చిన పిల్లపక్షి నోటికి ఆహారం అందిస్తూ తల్లిపక్షి పెంపకం కొనసాగించడం. చిత్రగ్రీవం పెంపకం ఎంతో అనురాగంతో సాగింది. మనం చిన్న పిల్లలను ఎత్తుకుని లాలిస్తే ఆ పిల్లలకు ఎలాంటి హాయి సౌఖ్యమూ లభిస్తాయో చిత్రగ్రీవానికి తన తండ్రిపక్షి, తల్లిపక్షి నుంచి అలాంటి వెచ్చదనం లభించింది. 
   చంటి పక్షులు ఎదిగివచ్చే సమయంలో వాటి గూళ్లలో మరీ ఎక్కువగా మెత్తటి దూదీ, పీచులాంటి పదార్థాలను ఉంచకూడదు. వాటిని తగుమోతాదులో ఉంచాలి. నిజానికి పిల్లపక్షులకు కావాల్సిన వెచ్చదనాన్ని తమ శరీరం నుంచే విడుదల చేస్తాయి. పావురాల గూళ్లను మరీ తరుచుగా శుభ్రం చేయడం కూడా మంచిది కాదు.
   చిత్రగ్రీవం పుట్టిన రెండోనాటి నుంచే తల్లిదండ్రులు వచ్చిన ప్రతిసారీ తన ముక్కు తెరిచి తన గులాబీరంగు ఒంటిని బంతిలా ఉబ్బిస్తుంది. బార్లాతెరిచిన పిల్లపక్షుల నోళ్లలో పెద్దపక్షులు తాము సంపాదించిన ధాన్యపు గింజల నుంచి ఉత్పత్తి చేసిన పాలను పోస్తాయి. పిల్లపక్షులకు నెల రోజుల వయసు వచ్చినప్పుడు కూడా పెద్ద పక్షులు తిన్నగా గింజలను అందించవు. ముందు తమ కంఠంలో మెత్తగా చేశాకే అందిస్తాయి. 
   చిత్రగ్రీవానికి ఆకలి ఎక్కువ. ఒక పెద్దపక్షి తన దగ్గరే ఉండి లాలిస్తూ తన బాగోగులు చూస్తూ ఉండగా రెండోపక్షి తన కోసం ఆహార సేకరణలో నిమగ్నమై ఉండేలా చేసేది చిత్రగీవ్రం. తల్లిదండ్రుల శ్రమా, శ్రద్ధా పుణ్యమా అని చిత్రగ్రీవం ఏపుగా ఎదిగింది. గులాబీరంగు మారి పసుపు కలిసిన తెలుపురంగు వచ్చింది. ఈకలు రావడానికి ఈ మార్పు మొదటి సూచన. తర్వాత చిన్నచిన్న బొడిపెల్లా ముళ్లపంది ముళ్లలాంటి ఈకలు వచ్చాయి.
   దాని కళ్లు, నోటి దగ్గరా అప్పటిదాకా వేలాడుతూ ఉన్న పసుపు పచ్చని చర్మాలు రాలిపోయాయి. పొడవాటి, గట్టి, సూదిలాంటి ముక్కురూపం దిద్దుకుంది. ఎంత బలమైన ముక్కు అంటే మూడు వారాల వయసులో గూటిలో చీమ పాకింది. దాన్ని పొడిస్తే రెండు ముక్కలయ్యింది. తినే వస్తువు అనుకుని అలాచేసింది. అది పశ్చాత్తాప పడిందనీ రచయిత అభిప్రాయం.
   పుట్టిన అయిదో వారానికల్లా చిత్రగ్రీవం తను పుట్టిన గూటి నుంచి బయటకు గెంతి పావురాళ్ల గూళ్ల దగ్గర ఉంచిన మట్టి మూకుళ్ల లోంచి మంచినీళ్లు తాగేస్థాయికి చేరుకుంది. ఆహారం సంపాదించే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ చిత్రగ్రీవం ఆహారం కోసం తల్లిదండ్రుల మీదే ఆధారపడేది. రచయిత చేతిలోని గింజలను పొడుచుకుని తినేది. శక్తియుక్తులు పెంపొందించుకోవడంలో మాత్రం మందకొడిగా ఉండేది.
   పెరిగి పెద్దదవుతున్న చిత్రగ్రీవం కళ్లమీద సన్నటి చర్మపు పొర సాగి రావడం రచయిత గమనించాడు. తర్వాత క్షుణ్నంగా పరిశీలిస్తే అర్థమైంది ఏమిటంటే దాని సాయంతో పావురాలు గాలి దుమారాల్లో, తిన్నగా సూర్యుడిదిశగా ఏ ఇబ్బంది లేకుండా ఎగరగలవని. 
   మరో రెండు వారాలు గడిచేసరికి చిత్రగ్రీవం ఎగరడం నేర్చుకుంది. పుట్టింది పక్షి పుట్టుకే అయినా ఆ ఎగరడం నేర్వడం అన్నది అంత సులభంగా జరగలేదు. తన రెక్కలు విప్పడం విషయంలో ఏదో సంకోచం ఉంది. గంటల తరబడి మేడమీద బాగా గాలి వచ్చేచోట కూర్చున్నా రెక్కలు విప్పి ఎగరడం విషయంలో మాత్రం దాని ధోరణి నిమ్మకు నీరెత్తినట్లు ఉండేది.
   రచయితది నాలుగు అంతస్థుల ఇల్లు. మేడమీద గోడపై చిత్రగ్రీవాన్ని వదిలేవాడు. అది అలా గంటల తరబడి కూర్చొని ఉండేది. అంతే తప్ప ఎగరడం చేసేది కాదు. పిట్టగోడ కింద శనగ గింజలు పోశాడు. చిత్రగ్రీవాన్ని పిలిచాడు. ఆశగా చూసిందే తప్ప అది రాలేదు. చివరకు సంకోచాన్ని అధిగమించి పిట్టగోడ మీద నుంచి దూకేసరికి ఏనాడు తెరచుకోని దాని రెక్కలు అప్రయత్నంగా విచ్చుకున్నాయి.
   ఆ రోజుల్లోనే దాని ఈకల రంగు మారడం గమనించాడు. ఒళ్లంతా సముద్రపు నీలిరంగు ఈకలతో ధగధగా మెరవసాగింది. దాని మెడ ప్రాంతం సూర్యకాంతిలో ఇంద్రధనుస్సు వర్ణాల పూసల గొలుసులా ఉంది. 
   చిత్రగీవానికి ఎగిరే ప్రయత్నాన్ని రచయిత ప్రతిరోజు చేయించేవాడు. తోటి పావురాలు ఎగరడంలో దాని కంటే ముందుండేవి. 'వర్షాకాలం వచ్చేలోగా చిత్రగ్రీవానికి ఎగరడం నేర్పేయాలి' అనుకున్నాడు రచయిత.
   'మే' నెల ఇంకా కొద్ది రోజుల్లో ముగుస్తున్న సమయంలో తండ్రి పక్షి ఎగరడం నేర్పే పని మొదలుపెట్టింది. ఆ రోజు అప్పటిదాకా బలంగా వీచి ఊరును చల్లబరచిన ఉత్తరపు గాలి సన్నగిల్లి మంద్రంగా (గంభీరంగా ధ్వని) సాగుతుంది. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో చిత్రగ్రీవం పిట్టగోడలమీద కూర్చుని ఉంది. 'మూడు నెలలు నిండాయి. ఇంకా ఎగరవా?' అన్నట్లు చూసింది తండ్రి పక్షి.
   చిత్రగ్రీవం ఉలుకుపలుకు లేకుండా గంభీరంగా ఉండిపోయింది. తండ్రి పక్షిని అనుసరించి జరగడం కొనసాగించింది. పిట్టగోడ అంచుకు చేరింది. ఇంకాస్త జరిగితే కిందపడే స్థితికి చేరుకుంది. ఉన్నట్టుండి తండ్రి పక్షి తన భారాన్నంతా చిత్రగ్రీవం మీద వేసేసింది. చిత్రగ్రీవం జారింది.
   స్వీయరక్షణ కోసం అసంకల్పితంగా రెక్కలు విప్పార్చి గాలిలో ఎగిరింది. కింద అంతస్తులో ఉన్న తల్లి పక్షి చిత్రగ్రీవానికి సాయంగా ఎగిరింది. అవి పది నిమిషాల పాటు ఎగిరాయి. కష్టపడి రెక్కలను టపటపలాడిస్తూ ముందుకు సాగి ఆగింది. అలా ఆగినప్పుడు దాని రొమ్ము గోడను తాకింది. గబుక్కున రెక్కలు ముడిచేసింది. తల్లిపక్షి దాని పక్కకు చేరి ముక్కుతో నిమిరింది. లాలించింది. తాను చేపట్టిన కార్యం విజయవంతం కావడంతో తండ్రిపక్షి జలకాలాడటం కోసం కింది అంతస్తులోని నీళ్లకుండీల దగ్గరకు చక్కగా ఎగిరిపోయింది.

రచయిత: అంజాగౌడ్

Posted Date : 19-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

 
 

విద్యా ఉద్యోగ సమాచారం