• facebook
  • twitter
  • whatsapp
  • telegram

మన ఇతిహాసం - రామాయణం

(వాల్మీకి రామాయణానికి సంక్షిప్త వచన రూపం)

కాండల వారీగా సారాంశం


I. బాల కాండం

* నారదుడు వాల్మీకి ఆశ్రమానికి వచ్చాడు. 'శుభ లక్షణాలున్నవాడు ఈ లోకంలో ఉన్నాడా' అని వాల్మీకి నారదుడిని అడిగాడు. దానికి ఆయన 'రాముడు' అని చెప్పాడు. రామాయణ కథను నారదుడు వాల్మీకికి వినిపించాడు.
* స్నానానికి వెళ్లిన వాల్మీకి ఒక వేటగాడు చంపిన క్రౌంచ మగపక్షిని చూశాడు. బాధతో వెంటనే అతడి నోటి వెంట ఒక శ్లోకం వచ్చింది. ఆశ్రమానికి వచ్చినంతలోనే * వాల్మీకిని చూడటానికి బ్రహ్మ వచ్చాడు. బ్రహ్మ శ్రీరామచరిత్ర రాయమని వాల్మీకిని ఆదేశించాడు. ఆయన రచనకు శ్రీకారం చుట్టాడు.
 సరయూ నది తీరంలోని 'కోసల' దేశంలో అయోధ్యానగరాన్ని పాలిస్తుంది దశరథ మహారాజు. ఆయనకు సంతానం లేదు. సంతానం కోసం దశరథుడు 'అశ్వమేధ యాగం' చేశాడు. తర్వాత ఋష్యశృంగుడు సహాయంతో 'పుత్రకామేష్టి యాగం'ను కూడా ప్రారంభించాడు.

* యాగ సమయంలో బ్రహ్మతో దేవతలందరూ రావణుడి దుండగాలను గురించి చెప్పారు. మానవుడి చేతిలో రావణుడికి మరణం ఉందని బ్రహ్మ చెప్పాడు. ఇంతలో వచ్చిన శ్రీమహావిష్ణువును రావణుడిని సంహరించడానికి మానవుడిగా అవతరించమని, దశరథ మహారాజు ముగ్గురు భార్యలకు నాలుగు రూపాల్లో పుత్రులుగా పుట్టమని దేవతలందరూ మహావిష్ణువును ప్రార్థించారు.
* యజ్ఞకుండం నుంచి వచ్చిన దివ్య పురుషుడు ఇచ్చిన పాయసాన్ని దశరథుడు తన భార్యలకు ఇచ్చాడు. సంవత్సరం తర్వాత కౌసల్యకు శ్రీరాముడు, కైకేయికి భరతుడు, సుమిత్రకు లక్ష్మణ, శత్రఘ్నలు జన్మించారు.
* పెరిగి పెద్దవుతున్న కుమారులను తన యాగ రక్షణార్థం పంపమని విశ్వామిత్రుడు దశరథుడిని అడిగాడు. వశిష్టుని మాటలు విని దశరథుడు రాముడిని పంపాడు. లక్ష్మణుడు కూడా అన్నను అనుసరించాడు. మలద, కరూశ జనపదాలను విధ్వంసం చేస్తున్న 'తాటక'ని రాముడు శబ్దవేధి విద్యతో ప్రాణం తీశాడు.
* యజ్ఞంపై మారీచ, సుబాహులు విరుచుకు పడ్డారు. రాముడు 'శీతేషువు' అస్త్రాన్ని మారీచుడిపై, ఆగ్నేయాస్త్రాన్ని సుబాహుడిపై ప్రయోగించాడు.
* మరునాడు యజ్ఞం చేస్తున్న జనకమహారాజు మిథిలానగరానికి వీరందరూ బయలుదేరారు. గంగావతరణాన్ని విశ్వామిత్రుడు శిష్యులకు వివరించాడు.

* రాముడు గౌతమాశ్రమంలో కాలుపెట్టి అహల్యకు శాపవిముక్తి చేశాడు.
 అయిదువేల మంది అతి కష్టం మీద 'శివధనుస్సు' పేటికను తెచ్చారు. మిథిలా నగరంలో శివధనుస్సును ఎక్కుపెట్టిన వారికే సీతను ఇచ్చి వివాహం చేయాలనుకున్నాడు జనక మహారాజు. ఎందరో విఫలయత్నం చేశారు.

* 'శివధనుస్సు'ను రాముడు అవలీలగా పట్టుకుని వింటినారిని సంధించాడు. పిడుగుపాటులా విల్లు విరిగింది.
* ఇచ్చినమాట ప్రకారం జనకుడు సీతారాముల వివాహం జరపాలని అనుకున్నాడు. అయోధ్య నుంచి అందరూ తరలివచ్చారు. జనకుడు తన కుమార్తె సీతను రాముడికి, ఊర్మిళను లక్ష్మణుడికి, తన తమ్ముడు కుశధ్వజుడి కుమార్తెలైన మాండవి, శ్రుతకీర్తులను భరత, శత్రుఘ్నులకు ఇచ్చి వివాహం చేశాడు.
* అందరూ అయోధ్యకు బయలుదేరారు. దారిలో పరశురాముడు శ్రీరాముడితో తన దగ్గరున్న వైష్ణవ ధనుస్సును ఎక్కుపెట్టమని కోరాడు. రాముడు అవలీలగా ఎక్కుపెట్టాడు. ఓటమితో పరశురాముడు తక్షణమే మహేంద్ర పర్వతానికి వెళ్లాడు.
* రామలక్ష్మణులు అయోధ్యలో తల్లిదండ్రుల, గురువుల సేవలో తరిస్తూ ఉన్నారు.

II. అయోధ్యా కాండం

* దశరథుడికి పుత్రులమీద ఎంతో ప్రేమ. ముఖ్యంగా శ్రీరాముడి మీద మక్కువ ఎక్కువ. ఎందుకంటే సద్గుణాలను రాముడు కలిగి ఉన్నాడు.
శ్రీరాముడి గుణాలు
    * మృదువుగా మాట్లాడతాడు
    * శరణన్నవారిని కాపాడతాడు
    * కోపం, గర్వం లేనివాడు
    * సత్యం పలికేవాడు
    * పరుల సంపదను ఆశించనివాడు
    * దీనులను ఆదుకునేవాడు
    * కాలాన్ని వృథా చేయకుండా జ్ఞానులతో, సజ్జనులతో వివిధ విషయాలను చర్చించేవాడు
    * వినయశీలి
    * తల్లిదండ్రులు, గురువుల పట్ల నిశ్చలభక్తి కలవాడు
    * సోమరితనం, ఏమరుపాటు లేనివాడు
    * కళల్లో ఆరితేరినవాడు
    * అసూయ, మాత్సర్యం లేనివాడు
    * ప్రజల పట్ల వాత్సల్యం ఉన్నవాడు

* తమకు ప్రభువు కావాలని ఆ ప్రభువు శ్రీరాముడే అవ్వాలని ప్రజలు కోరారు. శ్రీరాముడిని రాజుగా చేయాలని దశరథుడు రాజ్యంలో ప్రముఖులను పిలిపించాడు. అందరూ శ్రీరాముడినే రాజుగా సమర్థించారు.
* రాముడి పట్టాభిషేకానికి దశరథుడు ఏర్పాట్లు చేశాడు. శ్రీరామ పట్టాభిషేకానికి అయోధ్యా నగరాన్ని అందంగా అలంకరించారు.
* మంథర (కైకేయి వెంట వచ్చిన దాసి) శ్రీరామ పట్టాభిషేకాన్ని కైకేయికి తెలిపింది. కైకేయి సంతోషపడింది. కానీ మంథర మాయమాటలు వల్ల ఆమె మనసు మారింది.
* గతంలో దశరథుడు ఇచ్చిన రెండు వరాలను ఇప్పుడు ఉపయోగించుకోమని మంథర కైకేయికి చెప్పింది.
* తన వద్దకు వచ్చిన దశరథుడితో కైకేయి రెండు వరాలు కోరింది.
అవి:
   1) భరతుడికి పట్టాభిషేకం
   2) శ్రీరాముడు 14 ఏళ్లు దండకారణ్యంలో తాపసవృత్తిలో ఉండాలి.
* కైకేయి రాముడితో రెండు వరాల గురించి చెప్పింది. వనవాసానికి రాముడు తన తల్లిదండ్రుల ఆశీర్వాదంతో కన్నీటి సంద్రంలో అందరూ విలపించుచుండగా బయలుదేరాడు.

* శ్రీరాముడి రథాన్ని ప్రజలంతా అనుసరించారు. తమసా నదితీరంలో రాత్రి విడిది చేశారు. అందరూ నిద్రలేచేలోపు సుమంత్రుని సారథ్యంలో సీత, రాముడు, లక్ష్మణుడు బయలుదేరారు.
* శృంగిబేరపురానికి రాజైన గుహుడు వారికి ఆతిథ్యం ఇచ్చాడు. మరునాడు గుహుడు సిద్ధం చేసిన నావలో సాయంత్రం వరకు భరద్వాజ ఆశ్రమానికి చేరారు. భరద్వాజుడు సూచించిన 'చిత్రకూట' పర్వతం చేరుకున్నారు. అక్కడ రాముడి ఆదేశం ప్రకారం లక్ష్మణుడు ఒక కుటీరం నిర్మించాడు.
* దశరథుడు రాముడి ఎడబాటుతో ప్రాణాలు విడిచాడు.
* అసలు విషయం తెలుసుకున్న భరతుడు రాముడు ఉన్న ప్రదేశానికి చేరుకున్నాడు. అయోధ్యకు రమ్మని, మహారాజుగా ఉండమని ప్రార్థించాడు. తండ్రి మాటే శిరోధార్యంగా భావించే రాముడు అందుకు అంగీకరించలేదు.
* రాముడు ఇచ్చిన పాదుకలతోనే 14 ఏళ్లు రాజ్యపాలన చేస్తానని, నగరం వెలుపలనే ఉంటానని, పద్నాలుగు సంవత్సరాలు పూర్తయిన తర్వాత రాముడి దర్శనం కాకుంటే అగ్నిప్రవేశం చేస్తానని భరతుడు రాముడితో చెప్పి వెళ్లాడు.
* అత్రి మహాముని, ఆయన భార్య అనసూయ రామలక్ష్మణ సీతలకు మర్యాదలు చేశారు. తర్వాత వారు దండకారణ్యంలోకి ప్రవేశించారు.


III. అరణ్య కాండం

*దండకారణ్యం పవిత్రమైన ప్రశాంత ప్రదేశం. అక్కడ లోకక్షేమం కోసం యజ్ఞయాగాలు జరుగుతాయి. అక్కడి మహర్షులు సీతారామ లక్ష్మణులకు స్వాగతం పలికారు. మరునాడు వారికి వీడ్కోలు పలికి సీత రామ లక్ష్మణులు ప్రయాణం సాగించారు.
* వనం మధ్యకు చేరగానే 'విరాధుడు' అనే రాక్షసుడు సీతారామ లక్ష్మణులపై విరుచుకుపడ్డాడు. ఎంతకూ చావని విరాధుడిని రామలక్ష్మణులు గోతిలో పెట్టాలనుకున్నారు. విరాధుడు తాను *తుంబురుడనని చెప్పాడు. కుబేరుడి శాపం వల్ల రాక్షసుడనయ్యానని రాముడి వల్ల శాపవిముక్తి కలుగుతుందని గ్రహించాడు.
* విరాధుడు చెప్పినట్లుగా శరభంగ మహర్షిని దర్శించుకున్నారు. శరభంగ మహర్షి 'సుతీక్ష్ణ' మహర్షిని దర్శించమని రామలక్ష్మణులకు సూచించాడు.
* మునులందరూ రావణుడి అకృత్యాలను చెప్పారు. సుతీక్ష్ణ మహర్షి ఆశ్రమం చేరారు. తర్వాత అగస్త్య ఆశ్రమం చేరారు. అగస్త్యుడు శ్రీరాముడికి దివ్య ధనస్సు, అక్షయతూణీరాలు, ఖడ్గాన్ని బహూకరించాడు.
* రాముడు తాను నివసించడానికి అనువైన ప్రాంతాన్ని సూచించమని అగస్త్యుడిని అడిగాడు. అతడు 'పంచవటి' ప్రదేశాన్ని సూచించాడు. పంచవటికి వెళ్లేదారిలో దశరథుడి మిత్రుడు *'జటాయువు' (గద్ద) కలిసింది. సీత రక్షణ బాధ్యతను రాముడు దానికి అప్పగించాడు. పంచవటిలో లక్ష్మణుడు పర్ణశాల నిర్మించాడు.
* పంచవటిలో ఉన్న రాముడిని 'శూర్పణఖ' అనే రాక్షసి (రావణుడి చెల్లెలు) చేపట్టమంది. అడ్డుగా ఉన్న సీతాలక్ష్మణులను చంపి తింటానంది. అన్న ఆజ్ఞ ప్రకారం లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు, చెవులను కత్తితో తుంచాడు.

* శూర్పణఖ తన సోదరుడైన ఖరుడికి చెప్పింది. ఖరుడు 14 వేల మందిని రాముడిపైకి పంపాడు. రాముడు అందరిని అంతమొందించాడు.
* సీత అపహరణ కోసం రావణుడు మారీచుడిని సహాయం కోరాడు. శూర్పణఖ మాట ప్రకారమే సీత అపహరణకు నిశ్చయించుకున్నాడు.
* రావణుడు సీత అపహరణ కోసం 'బంగారు లేడి'గా మారి సహకరించమని మారీచుడిని కోరాడు. మారీచుడు లేడిగా మారి సంచరించాడు. ఆ లేడి చాలా నచ్చిందని సీత దాన్ని తీసుకురావాలని కోరగానే రాముడు తేవడానికి సిద్ధమయ్యాడు.
* సీత రక్షణను జటాయువు, లక్ష్మణుడికి అప్పగించాడు శ్రీరాముడు.
* రాముడు తనకు అందకుండా వెళ్లుతున్న మృగాన్ని బాణంతో కొట్టాడు. మృగం భయంకరంగా అరుస్తూ, రాముడి కంఠధ్వనిని అనుకరిస్తూ 'అయ్యో సీతా! అయ్యో లక్ష్మణా' అని అరిచింది. సీత ఆందోళన చెంది లక్ష్మణుడిని వెళ్లమంది. వెళ్లలేను అన్న మాటలకు సీత దుష్టాలోచనతో ఇలా చేస్తున్నావని అంది. చేసేదిలేక లక్ష్మణుడు వెళ్లాడు.
* సన్యాసి వేషంలో రావణుడు వచ్చి తనను పతిగా స్వీకరించమని అడిగాడు. 'అపహరించి నీ చావును కొని తెచ్చుకోకు' అని సీత హెచ్చరించింది. అయినా బలవంతంగా తన రథంలో తరలించాడు. సీత ఆర్తనాదాలు విన్న జటాయువు రావణుడిని ఎదిరించాడు. రావణుడు ఖడ్గంతో జటాయువు రెక్కలు, కాళ్లను నరికివేశాడు.
* రావణుడు సీతను లంకలో ఉంచాడు. ఆమెకు 12 నెలల గడువు ఇచ్చాడు. అంతదాకా అశోకవనంలోని రాక్షసుల మధ్య ఆమెను ఉంచాడు.

* మారీచుడిని చంపి ఆశ్రమానికి వచ్చిన రాముడికి సీత జాడ కనిపించలేదు. జరిగిన విషయం వివరించి జటాయువు కన్నుమూశాడు.
* రామలక్ష్మణులు దండకారణ్యం నుంచి క్రౌంచారణ్యానికి చేరారు. ఆ వనంలో కబంధుడు అనే రాక్షసుడు రామలక్ష్మణులను తినేందుకు నోరు తెరిచాడు. వాడి భుజాలను నరికారు. కబంధుడు *శరీరానికి అగ్ని సంస్కారం చేశారు. దివ్యదేహంతో వచ్చి 'కబంధుడు' సీతాదేవి దొరికే ఉపాయాన్ని చెప్పాడు. వాలి, సుగ్రీవుల కథను వివరించాడు. 'కబంధుడు' సూచించిన మార్గంలో ప్రయాణిస్తూ పంపా సరస్సు తీరంలోని 'శబరి' ఆశ్రమానికి వెళ్లారు. శబరి తపస్సిద్దురాలు, శ్రీరామ దర్శనంతో ఆమె తనువు పులకరించింది.
* శ్రీరాముడి అనుమతితో 'శబరి' తన దేహాన్ని అగ్నికి ఆహుతి చేసి అగ్నికాంతితో ఊర్థ్వలోకాలకు వెళ్లింది.
* రామలక్ష్మణులు ఋష్యమూక పర్వతానికి ప్రయాణమయ్యారు.
 దారిలో పంపా సరోవరాన్ని దర్శించారు.


IV. కిష్కింధా కాండం

* పంపా సరోవరం అత్యంత రమణీయంగా ఉంది. అయినా శ్రీరాముడిని ఆ ప్రాంతం సంతోష పెట్టలేదు. మరింత బాధను కలిగించింది. ఆ సమయంలో లక్ష్మణుడు అధైర్య పడకుండా ప్రయత్నం చేస్తే మంచి ఫలితం లభిస్తుందని, ఉత్సాహమే బలమని రాముడికి ధైర్యం చెప్పాడు.

* సుగ్రీవుడు రామలక్ష్మణులను ఋష్యమూక పర్వతం నుంచి చూసి, తన అన్న వాలి పంపగా వచ్చారేమోనని భయంతో వారెవరో తెలుసుకోమని ఆంజనేయుడిని పంపాడు.
 సన్యాసి రూపంలో హనుమంతుడు రామలక్ష్మణుల దగ్గరకు వెళ్లి 'నేను సుగ్రీవుడి మంత్రిని, నన్ను హనుమంతుడు అంటారు' అని చెప్పాడు. సుగ్రీవుడు మీతో స్నేహం చేయాలని కోరుకుంటున్నాడని చెప్పాడు. హనుమంతుడి మాటలు శ్రీరాముడిని ఆకట్టుకున్నాయి.
* లక్ష్మణుడు తమ విషయాన్నంతా సుగ్రీవుడికి చెప్పి సహాయం కోరాడు. ఇంతలో సన్యాసి రూపం వదిలి హనుమంతుడు రామలక్ష్మణులను భుజాలపై ఎక్కించుకుని ఋష్యమూక పర్వతం వద్దకు తీసుకువెళ్లాడు.
* శ్రీరామ సుగ్రీవులు అగ్నిసాక్షిగా స్నేహితులయ్యారు. సుగ్రీవుడు వాలి నుంచి రక్షించాలని శ్రీరాముడిని కోరాడు. అందుకు సరేనని రాముడు మాట ఇచ్చాడు.
 సుగ్రీవుడు తాను కొండమీద ఉన్నప్పుడు ఒక రాక్షసుడు ఒక స్త్రీని బలవంతంగా తీసుకుపోవడం చూశానని, ఆమె తమని చూసి నగలమూట జారవిడిచిందని చెప్పి, ఆభరణాలను తెచ్చి చూపించాడు.
* సీతను తీసుకురావడంలో తాను తగిన ప్రయత్నం చేస్తానని, తన శక్తిని వినియోగిస్తానని, దుఃఖిస్తే తేజస్సు క్షీణిస్తుందని ధైర్యవచనాలు సుగ్రీవుడు రాముడితో చెప్పాడు.
 ప్రాణమిత్రులుగా రాముడు, సుగ్రీవుడు స్నేహధర్మాన్ని అనుసరించారు.

* సుగ్రీవుడు తన అన్న వాలితో వైరం వచ్చిన విధానాన్ని రాముడితో ఇలా తెలిపాడు.
* వాలి బలశాలి, పెద్దవాడు కాబట్టి తండ్రి తర్వాత కిష్కింధకు రాజైనాడు. 'మాయావి' ఒక నాడు అర్ధరాత్రి 'కిష్కింధ'కు వచ్చి వాలిని యుద్ధానికి ఆహ్వానించాడు. 'మాయావి'ని సుగ్రీవుడు తన సైన్యంతో వెంబడించాడు. మాయావి ఒక పెద్ద భూగృహంలోకి వెళ్లాడు. వాలి ఆవేశంతో భూగృహంలోకి వెళ్లేముందు, భూగృహ బిలద్వారం దగ్గర సుగ్రీవుడిని ఉంచాడు. మాయావిని చంపి వస్తానన్నాడు. సంవత్సరమైనా బయటకు రాలేదు. మాయావి చేతిలో వాలి చనిపోయాడని, రాక్షసుడు బయటకు వస్తాడేమోనని బండతో బిలద్వారాన్ని సుగ్రీవుడు మూసేశాడు. మంత్రులు సుగ్రీవుడిని రాజుగా చేశారు. కొంత కాలానికి వాలి వచ్చాడు. సుగ్రీవుడిని రాజ్యభ్రష్టుడిని చేసి, సుగ్రీవుడి భార్య 'రుమ'ను అపహరించాడు. సుగ్రీవుడు ప్రాణ భయంతో ఋష్యమూక పర్వతాన్ని చేరాడు. 'మతంగ ముని' శాపకారణంగా వాలి ఋష్యపర్వతం వెళ్లలేడు. వెళితే మరణిస్తాడు.
* సుగ్రీవుడు వాలిని వధించాలనే ఉద్దేశంతో యుద్ధానికి రమ్మన్నాడు. కానీ వాలిని తట్టుకోలేకపోయాడు. ఇద్దరూ ఒకేలా ఉండటం వల్ల రాముడు వాలిని చంపలేకపోయాడు. లక్ష్మణుడు మెడలో వేసిన 'నాగకేసరపులత'తో యుద్ధానికి వాలిని సుగ్రీవుడు రమ్మన్నాడు. వాలిని అతడి భార్య 'తార' అడ్డుపడింది. అయినా వినకుండా యుద్ధానికి సిద్ధమయ్యాడు. విషసర్పంతో సమానమైన బాణాన్ని రాముడు వాలి మీదకు వదిలాడు. వాలి కుప్ప కూలిపోయి, దొంగదెబ్బ ఎందుకు తీశావని రాముడిని అడిగాడు. 'అధర్మమైన పనులు చేసినందున నీకు మరణదండన విధించాను' అన్నాడు.
* సుగ్రీవుడు కిష్కింధకు రాజు అయ్యాడు. సుగ్రీవుడి ఆజ్ఞతో వానరులు సీతాన్వేషణ కోసం కిష్కింధకు వచ్చారు.

* శ్రీరాముడితో సుగ్రీవుడు సమావేశమై, నలు దిక్కులకు వానర వీరులను పంపారు.
* శ్రీరాముడు హనుమంతుడికి ఉంగరాన్ని ఇచ్చాడు. 'వంద యోజనాలు వెళ్లిరాగలవాడు హనుమంతుడొక్కడే' అని జాంబవంతుడు పలకగానే హనుమంతుడు ఉత్సాహంతో ప్రేరేపితుడై మహా సముద్రాలను అవలీలగా దాటగలనని ఆత్మశక్తిని ప్రకటించాడు.
* సముద్ర లంఘనానికి పూనుకున్న హనుమంతుడు లంఘించే సమయంలో తన బలాన్ని భూమి భరించలేదని, మహేంద్ర పర్వత శిఖరాలు అందుకు తగినవని పలికి మహేంద్రగిరికి చేరాడు.


V. సుందర కాండం

* హనుమంతుడు సూర్యుడికి, వాయువుకు, మహేంద్రుడికి, బ్రహ్మకు, ఇతర దేవతలకు నమస్కరించి తన శరీరాన్ని పెంచి ఒళ్లు విరిచి ప్రళయకాల మేఘంలా మహానాదం చేశాడు. చేతులను నడుము మీద ఉంచి, పాదాలను దట్టించి, చెవులను రిక్కించి, తోకను విదిల్చి అంగదాది వీరులతో ఏది ఏమైనా సీతామాతను తీసుకువస్తానని చెప్పి అంతరిక్షంలోకి ఎగిరాడు.
 హనుమంతుడికి అందరూ సహాయపడ్డారు. సాగరుడు హనుమంతుడి విశ్రాంతి కోసం సముద్రం నుంచి మైనాకుడిని బయటికి రప్పించాడు. కానీ హనుమంతుడు సమయం లేదని తెలిపి ముందుకు సాగాడు.
 * హనుమంతుడిని పరీక్షించడానికి వచ్చిన 'సురస' అనే నాగమాత ఆయన సమయస్ఫూర్తికి మెచ్చి ఆశీర్వదించింది. తనను మింగాలని చూసిన 'సింహిక' అనే రాక్షసిని చీల్చాడు.

* త్రికూట పర్వతం మీద ఉన్న 'లంక'ను హనుమంతుడు చేరి, రాత్రి సమయమే అనుకూలమని తలంచి పిల్లి ప్రమాణంలోకి తన శరీరాన్ని కుదించుకుని లోపలికి ప్రవేశించాడు.
 లంక లోపలికి చేరిన హనుమంతుడిని లంకాధిదేవత (లంకిణి) చూసి ఎందుకు వచ్చావని తన చేతితో బలంగా కొట్టింది. హనుమంతుడు స్త్రీ అని తలచి ఎడమ చేతితో దెబ్బ వేశాడు.
* లంకిణికి బ్రహ్మవరం జ్ఞాపకం వచ్చింది (ఒక వానరుడు వచ్చి లంకిణిని జయించినప్పుడు రాక్షసులకు కీడుమూడుతుంది).
* హనుమంతుడు లంక లోపలికి వెళ్లి అన్ని చోట్లా వెతికాడు. సీత జాడ కనిపించలేదు.
* రావణుడి భార్య మండోదరిని చూసి సీత అనుకున్నాడు. కాని తరువాత సీత కాదని నిశ్చయించుకున్నాడు.
* సీత జాడ తెలియక హనుమంతుడు ప్రాణాలు వదలాలనుకున్నాడు. కానీ తర్కించి చూసి బతికి ఉండటమే ఎన్నో విధాల ఉత్తమమని అనుకున్నాడు.
 *చివరకి అశోకవనంలో వెతికాడు. ఎత్తయిన 'శింశుపా' వృక్షాన్ని ఎక్కి సీతను గుర్తించాడు.
* సీతను చూసి ఆనందాశ్రులు విడిచి, హనుమంతుడు రాముడికి స్మరించుకుని ఆమెకు నమస్కరించాడు.
* రావణుడి మాటలకు, రాక్షస స్త్రీల మాటలకు సీతమ్మ లొంగలేదు. చంపుతామని భయపెట్టినా, శ్రీరాముడికి దూరమై బతకడం కంటే శరీరాన్ని విడవడం మంచిదని వారితో చెప్పింది.

* సీతాదేవి అన్న మాటలను రావణుడికి చెప్పడానికి కొందరు వెళ్లారు. మరికొందరు రాక్షస స్త్రీలు బంధించే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో విభీషణుడి కూతురు 'త్రిజట' రాక్షసులను వారించి తన కలలో వచ్చిన విషయాలు చెప్పి, దాన్ని బట్టి సీత కోరిక నెరవేరుతుందని రావణుడికి వినాశనం తప్పదని చెప్పింది.
* 'రామకథ'ను గానం చేసిన హనుమంతుడికి సీత తన విషయాన్ని అంతా చెప్పింది.
* తాను రామదూతనని, హనుమంతుడు రాముడి రూపగుణాలను వివరించాడు. తనతో సీతను రమ్మని కోరాడు. సీత పరపురుషుడిని తాకనంది. శ్రీరాముడే రావణుడిని సంహరించి తనను తీసుకు వెళ్లడమే తగిన పని అని అంది.
* ఆనవాలు ఇవ్వమని కోరిన హనుమంతుడికి కాకాసురుడి కథను చెప్పి, దివ్య చూడామణిని సీత ఇచ్చింది.
* రావణుడి సైన్య శక్తి సామర్థ్యాలు తెలుసుకోవాలనుకుని ఆశోక వనాన్ని హనుమంతుడు ధ్వంసం చేశాడు. దానిలో భాగంగా రావణుడు పంపిన 80 వేల మంది రాక్షసులను, మంత్రి పుత్రులు ఏడుగురిని, సేనాపతులు అయిదుగురిని అంతం చేశాడు. ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రంవల్ల బంధి అయినట్లుగా నటించాడు.
* బంధీగా వచ్చిన హనుమంతుడు శ్రీరాముడి పరాక్రమం గురించి సభలో చాటాడు. ప్రతిగా రావణుడు హనుమంతుడి తోకకు నిప్పు పెట్టి లంక అంతా తిప్పమన్నాడు.
* నిప్పు పెట్టిన తన తోకతో లంకను అంతా కాల్చేశాడు. సీత కాలిపోయి ఉంటుందని భావించినా అగ్నిదేవుడు సీతను దహించడని తలచి, ఆమెకు పాదాభివందనం చేసి తిరిగి ప్రయాణమయ్యాడు.

* హనుమంతుడు 'అరిష్టం' అనే పర్వతం ఎక్కి ఆకాశంలోకి ఎగిరి మైనాకుడిని తాకి మహేంద్రగిరి శిఖరం మీద అడుగుపెట్టాడు.
* 'సీతమ్మ'ను చూశానని ప్రకటించిన హనుమంతుడు అందరికి లంకా ప్రయాణ విశేషాలను వివరించాడు.
* అంగదుడు 'లంక'కు వెళ్లి రావణుడిని చంపి సీతను తీసుకుని శ్రీరాముడి వద్దకు వెళదామన్నాడు. జాంబవంతుడు ఆ మాటను ఖండించి అలా చేయవద్దని రావణుడిని రాముడే సంహరిస్తాడని చెప్పిన మాటను గుర్తు చేశాడు.
* వానరులు అందరూ రాముడు ఉండే చోటుకి బయలుదేరారు. దాంతో అందరూ 'మధువనం'లో తేనె తాగారు. మధువనంను సుగ్రీవుడి రక్షణలో అతడి మేనమామ 'దధిముఖుడు' కాపాడుతున్నాడు. వానరుల ధాటికి దధిముఖుడు గాయాలపాలయ్యాడు. దీన్ని సుగ్రీవుడు శుభంగా తలచాడు.
* శ్రీరామ సుగ్రీవులు ఉన్నచోటుకు అందరు చేరారు. హనుమంతుడు శ్రీరాముడికి సాష్టాంగ నమస్కారం చేసి 'సీతమ్మ'ను చూశానని చెప్పి, సీత ఇచ్చిన దివ్య చూడామణిని ఇచ్చాడు.
 అంతులేని ఆనందం పొందిన రాముడు కోరినట్లుగా సీత అన్వేషణ వృత్తాంతాన్ని హనుమంతుడు చెప్పాడు.

VI. యుద్ధ కాండం

* సీత జాడను చెప్పిన హనుమంతుడిని రాముడు ప్రశంసించాడు. తాను ఇవ్వగల సర్వస్వమని హనుమంతుడిని దగ్గరకు తీసుకుని గట్టిగా గుండెకు హత్తుకున్నాడు.

* దు:ఖం పొంగి వస్తున్న రాముడిని సుగ్రీవుడు 'నిరుత్సాహం ప్రయోజనాలను నాశనం చేస్తుంది, దుఃఖం శౌర్య పరాక్రమాలను దిగజారుస్తుంది' అని అన్నాడు. మహాసముద్రం మీద 'సేతువు'ను కట్టకుండా లంకను జయించలేమన్నాడు.
* లంకా ప్రయాణానికి రాముడు దిశానిర్దేశం చేశాడు. నీలుడు సైన్యానికి మార్గం చూపుతూ ఉండగా, లక్షలాది వానరులు అతడిని అనుసరించగా జాంబవంతుడు, సుషేణుడు, వేగదర్శి సైన్యం వెనుకభాగంలో ఉండగా అందరూ కలిసి సముద్ర తీరాన్ని చేరారు.
* లంకలో మంత్రులతో రావణుడు సమావేశమై వానరులను ఎదుర్కొని లంకను కాపాడుకోవడానికి ఏం చేయాలో నిర్ణయించమన్నాడు. వారు నరవానరులను లెక్కచేయాల్సిన అవసరం లేదని పెదవి విరిచారు.
* గొప్పలు పలికిన అందరితో రావణుడి సోదరుడు విభీషణుడు శ్రీరాముడు మనకు అపకారం చేయలేదని, సీతను అప్పగించడం మంచిదని చెప్పాడు. రావణుడిని తప్పుపట్టిన కుంభకర్ణుడు *సైతం ఇవన్నీ ఎలా ఉన్నా శ్రీరాముడిని అంతమొందించే భారం తమదేనని ప్రకటించాడు. ఇదంతా గమనించి రావణుడు తీవ్రస్థాయిలో నిందించినందు వల్ల విభీషణుడు రాముడితో జతకట్టాడు.
* తాను సహాయంగా ఉంటానన్న విభీషణుడిని లంకారాజుగా పట్టాభిషేకం రాముడు లక్ష్మణుడితో చేయమని అన్నాడు.
* సముద్రాన్ని దాటే ఉపాయాన్ని రాముడు సుగ్రీవుడిని అడిగాడు. విభీషణుడు సముద్రుడిని ప్రార్థిస్తే సాధ్యమవుతుందన్నాడు. రాముడు సముద్రాన్ని ఉపాసిస్తేదారి కనిపించలేదు. సముద్రుడి అహంకారం అణచాలని శ్రీరాముడు బ్రహ్మాస్త్రాన్ని స్మరించాడు. అప్పుడు లంకకు వెళ్లేదారి ఇస్తానన్నాడు.

* సేతువు(వంతెన) నిర్మించడానికి 'నలుడు' యోగ్యుడని, తాను భరిస్తానని సముద్రుడు తెలియజేశాడు.
* రాముడి ఆజ్ఞ ప్రకారం వానరులు బండరాళ్లతో సముద్రంలో దారి చేశారు. నలుడి సూచనలను బట్టి సేతువు అయిదు రోజుల్లో పూర్తయ్యింది.
* శ్రీరామ లక్ష్మణులు, సుగ్రీవుడు ముందుకు సాగారు. సైన్యం వారిని అనుసరించింది.
* శ్రీరాముడు యుద్ధనీతిని బట్టి సైన్యాన్ని విభాగాలుగా విభజించాడు. ఎవరి బాధ్యతలను వారికి అప్పజెప్పాడు.
* వానర రూపాలు దాల్చి సైన్యంలో చేరిన రావణ మంత్రులైన శుకసారణులను విభీషణుడు గుర్తించి రాముడి ఎదుట నిలిపాడు. రావణుడికి తన చేతిలో చావు తప్పదని చెప్పి పంపించేశాడు.
* రావణుడు సీతను లొంగదీసుకోవాలనే ఉద్దేశంతో సీతతో ఇలా అన్నాడు. రాముడు తన చేతిలో చచ్చాడని, తనను చేరాలని, మాయశిరస్సును, ధనుర్బాణాలను సీతకు చూపించాడు. *విభీషణుడి భార్య 'సరమ' సీతకు ఇదంతా మాయ అని చెప్పి ఊరడించింది.
* సువేల పర్వతం చేరిన సైన్యం లంకా నగరాన్ని చూసింది. రావణుడిని రాముడు చూశాడు. కోపగించిన సుగ్రీవుడు రావణ భవనంపై వాలి తాను రాముడి మిత్రుడనని చెప్పి రావణుడిపై దూకి కిరీటాన్ని తీసి నేలకు కొట్టాడు. ఇద్దరి మధ్య యుద్ధం జరిగింది.
* రాముడు అంగదుడిని రావణుడి దగ్గరకు రాయబారిగా పంపాడు. సీతను అప్పగించకపోతే మరణం తప్పదని వినిపించాడు. తనపైకి వచ్చిన రాక్షసులను నేలకు కొట్టాడు.
* శ్రీరాముడు లంక మీదికి తన సైన్యంతో బయలుదేరాడు. ఇరుసైన్యాలు పోరాడుతున్నాయి. అంగదుడి చేతిలో ఓడిన ఇంద్రజిత్తు రామలక్ష్మణులను 'నాగాస్త్రం'తో బంధించాడు. ఆ దృశ్యాన్ని రావణుడు నేలపై పడి ఉన్న వారిని సీతకు చూపించాడు. వారు గరుత్మంతుడి రాక వల్ల నాగాస్త్రం నుంచి విముక్తి పొందారు.

* భీకరమైన యుద్ధపోరులో రావణుడు వానర సేన మీద విరుచుకుపడ్డాడు. హనుమంతుడిని చేతితో కొట్టిన రావణుడిని హనుమంతుడు కూడా చేతితో ఒక దెబ్బ కొట్టాడు. అప్పుడు అతడి శక్తిని రావణుడు మెచ్చుకున్నాడు.
* రావణుడు లక్ష్మణుడిపై 'శక్తి' అనే ఆయుధాన్ని ప్రయోగించాడు. అతడిని ఎత్తుకొనిపోవాలని చూశాడు. కానీ ఆంజనేయుడి దాడికి అది జరగలేదు. రాముడి పరాక్రమానికి రావణుడి ధనస్సు, కిరీటం పడిపోయాయి. తిరిగి రమ్మని చెప్పాడు రాముడు.
* అవమాన భారంతో యుద్ధానికి కుంభకర్ణుడిని పంపాడు. కుంభకర్ణుడు వానరులను ముప్పుతిప్పలు పెట్టాడు. చివరకు రాముడి 'ఇంద్రాస్త్రం'తో శిరస్సు తెగి మరణించాడు.
* ఇంద్రజిత్తు 'బ్రహ్మాస్త్రం'తో రామలక్ష్మణులు స్పృహ కోల్పోయారు. ఆ 'అస్త్రం' వల్ల 67 కోట్ల మంది హతమయ్యారు. జాంబవంతుడి ఆదేశం మేరకు సర్వౌషధి మహాపర్వతాన్ని హనుమంతుడు తెచ్చాడు. దాని వాసనకు అందరి గాయాలన్నీ మాయమయ్యాయి.
* ఇంద్రజిత్తు మాయాసీతను సంహరించాడు. అందరూ నిజం అనుకున్నారు. కానీ విభీషణుడు మాయ అని తెలపడంతో ఊపిరి పీల్చుకున్నారు.
* రావణుడు లక్ష్మణుడిపై 'శక్తి' ఆయుధాన్ని ప్రయోగించాడు. దానిలో చంపే శక్తిని నశింపజేశాడు రాముడు. లక్ష్మణుడు పడిపోయి ఉన్నాడు.

* రాముడి విలువిద్య ముందు రావణుడు నిలువలేక పరుగులు తీశాడు. లక్ష్మణుడి కోసం హనుమంతుడు ఔషధ పర్వతం తెచ్చి లేచి కూర్చునేలా చేశాడు.
* ఇంద్రుడు 'మాతలి'ని దివ్యరథంతో పంపాడు. రాముడు దాన్ని అధిరోహించి రావణుడిని ఎదిరించాడు. అగస్త్యుడు 'ఆదిత్య హృదయం' ఉపదేశించాడు. శ్రీరాముడి బాణాల తాకిడికి రావణుడి తలలు నేలరాలాయి. మళ్లీ వెంటనే మొలుస్తున్నాయి.
* 'మాతలి' సూచన మేరకు శ్రీరాముడు బ్రహ్మాస్త్ర ప్రయోగం చేశాడు. రావణుడు మరణించాడు.
* విభీషణుడు రావణుడికి దహన సంస్కారాలు చేశాడు. విభీషణుడు లంకారాజుగా పట్టాభిషేకం పొందాడు
* శ్రీరాముడు సీతను 'పరుల పంచన ఉన్నందున నీ ప్రవర్తన గురించి సందేహముంది' అని అన్నాడు. సీత అగ్నిప్రవేశానికి పూనుకుంది.
* అగ్నిదేవుడే స్వయంగా సీతాదేవిని తీసుకువచ్చి స్వీకరించాలని కోరాడు.
* పరమశివుడు శ్రీరాముడిని ప్రశంసించాడు. ప్రజానురంజకంగా పరిపాలన చేయమన్నాడు.
* ఇంద్రుడు మృత్యుఒడికి చేరిన వానరులను బతికించాడు.
* రాముడు వానరులను స్వస్థానాలకు వెళ్లమని చెప్పి, లంకలో ఉండమన్న విభీషణుడికి వీడ్కోలు చెప్పి పుష్పక విమానంలో అయోధ్యకు బయలుదేరాడు.
* పుష్పక విమానంలో వెళ్లిన సీతారామలక్ష్మణులకు భరతుడు స్వాగaతం పలికాడు.

* సీతారామ లక్ష్మణులు కౌసల్య, సుమిత్ర, కైకేయి, వశిష్ఠుల పాదాలకు నమస్కరించారు
* భరతుడు శ్రీరాముడి చరణాలకు పాదుకలు తొడిగాడు.
* శ్రీరామ పట్టాభిషేకం ఘనంగా జరిగింది.
* భరతుడిని యువరాజుగా ప్రకటించారు.
* శ్రీరాముడు 11వేల సంవత్సరాల కాలం ప్రజలను కన్నబిడ్డల్లా, ఎలాంటి బాధలు లేకుండా, ధర్మబద్ధంగా, యజ్ఞయాగాలను కొనసాగిస్తూ ప్రజానురంజకంగా పరిపాలించాడు.
* శ్రీరాముడి పాలనను బట్టి 'రామరాజ్యం' అనే మాట నేటికీ ఆదర్శమైంది.
              శ్లో|| మంగళం కోసలేంద్రాయ - మహనీయ గుణాత్మనే|
              చక్రవర్తి తనూజాయ - సార్వభౌమాయ మంగళమ్||

Posted Date : 15-10-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

 
 

విద్యా ఉద్యోగ సమాచారం

telugu

OTHER SUBJECTS

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌