• facebook
  • whatsapp
  • telegram

టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌తో ముఖాముఖి

* పూర్తి పారదర్శక విధానాలు పాటిస్తాం
* పరీక్ష రాసిన సాయంత్రంకల్లా ఆన్‌లైన్‌లో సమాధానపత్రం
* పుస్తకాల ముద్రణ మా బాధ్యత కాదు
* శిక్షణ కేంద్రాల కోసం మేం పనిచేయం
* గ్రామీణప్రాంత విద్యార్థులకు ఇబ్బందేమీ ఉండదు
ఈనాడు - హైదరాబాద్‌: నీళ్లు-నిధులు-నియామకాలు అనే నినాదంతో ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డ తెలంగాణలో తొలి నియామక ప్రకటన వెలువడింది. తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) అసలైన పని ఆరంభమైంది. మరి టీఎస్‌పీఎస్సీ పనితీరెంత భిన్నంగా ఉండబోతోంది? ప్రత్యేకతలేంటి? కొత్త సిలబస్‌, సంబంధిత పుస్తకాలు-సమాచారంపై ఏం చేస్తారు? విద్యార్థులెలా సన్నద్ధం కావాలి? అభ్యర్థులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న కీలంకాంశాలపై ఆగ‌స్టు 19న‌ 'ఈనాడు' ప్రతినిధికిచ్చిన ప్రత్యేక ముఖాముఖిలో టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ ఆచార్య ఘంటా చక్రపాణి స్పందించారు. ఆ ముఖ్యాంశాలు....
 

* పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్లంటేనే అవినీతికి, జాప్యానికి ఆలవాలమని అనుకుంటుంటారు. మరి టీఎస్‌పీఎస్సీ ఏ విధంగా భిన్నంగా ఉండబోతోంది?
దరఖాస్తుల నుంచి పరీక్ష ఫలితాల దాకా అన్నింటా ఆధునిక సాంకేతికతను వినియోగించటం టీఎస్‌పీఎస్సీ ప్రత్యేకత. ఆధునిక పద్ధతులతో పూర్తి పారదర్శకతతో వ్యవహరిస్తే అక్రమాలకు అడ్డుకట్ట వేయగలుగుతాం. ఇప్పుడు మేం చేయబోతోంది అదే. ప్రతి అంచెలో అభ్యర్థి తన పరిస్థితిని చూసుకోగలిగేలా వ్యవస్థల్ని తీర్చిదిద్దుతున్నాం. ఆన్‌లైన్‌ దరఖాస్తులు, ఆన్‌లైన్‌ పరీక్షలు అందులో భాగమే. దాదాపు మూడులక్షల మంది ఇప్పటికే వన్‌టైమ్‌ రిజిస్ట్రేషన్‌ ద్వారా టీఎస్‌పీఎస్సీలో నమోదు చేసుకున్నారు. ఇలానమోదు చేసుకున్నవారు మూడు నిమిషాల్లో దరఖాస్తు పూర్తిచేయొచ్చు. 19వ తేదీన విడుదలచేసిన ఇంజినీరింగ్‌ ఉద్యోగాలకు అర్హులైన దాదాపు 9 వేల మంది ఇప్పటికే నమోదు చేసుకున్నారు. వారందరికీ ఉద్యోగ ప్రకటన సమాచారం 20వ తేదీన ఎస్‌ఎంఎస్‌ల ద్వారా చేరిపోతుంది. ఇలా ప్రతి ప్రకటనకు ముందే అర్హతల ఆధారంగా సమాచారం చేరవేస్తాం. దరఖాస్తుల్లో ఆధార్‌ను పెట్టినా తప్పనిసరి చేయలేదు.
 

* ఆన్‌లైన్‌ పరీక్ష అందరికీ అందుబాటులో ఉంటుందా? గ్రామీణ విద్యార్థులకు ఏమైనా ఇబ్బందులుంటాయా?
కేవలం సాంకేతిక ఉద్యోగాలకే ఆన్‌లైన్‌ పరీక్ష పెడుతున్నాం. అయినా.. ఈ తరం ఉద్యోగులకు కంప్యూటర్‌ పరిజ్ఞానం లేకుంటే ఎలా? పేపర్ల లీకేజీలను ఆన్‌లైన్‌ వ్యవస్థలో పూర్తిగా నిర్మూలించగలం. ఆఫ్‌లైన్‌లో నిర్వహించినా అంతే పటిష్ఠంగా నిర్వహిస్తాం. పరీక్ష కేంద్రాలను కూడా జాగ్రత్తగా ఎంపిక చేసి, వాటిని ఆన్‌లైన్‌లో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తాం. ప్రతి అభ్యర్థి వేలిముద్రను బయోమెట్రిక్‌ పద్ధతిలో సేకరిస్తాం. మేం ఆన్‌లైన్‌లో సేకరించేవన్నీ అభ్యర్థికి అందుబాటులో ఉంచుతాం. పరీక్షరాసిన సాయంత్రానికి సమాధానపత్రం ఆన్‌లైన్‌లో ఇంటికి చేరేలా చూస్తాం. ఇంటర్వ్యూలుండే పరీక్షలే తక్కువ కాబట్టి ఇక ఎవరికీ ఎలాంటి అనుమానాలు ఉండాల్సిన అవసరమే లేదు.

 

* మరి ఇంటర్వ్యూల్లో ఎలాంటి పారదర్శకతను ఆశించొచ్చు? ఇంటర్వ్యూలపై కొంతమంది అనుమానాలు వ్యక్తంజేస్తున్నారుకదా..?
అఖిల భారత స్థాయి పోస్టులకూ ఇంటర్వ్యూ తప్పనిసరి. అయితే గతంలోకంటే భిన్నమైన ఇంటర్వ్యూ పద్ధతి ఉండాలని అనుకుంటున్నాం. ఏం చేస్తామనేది పైకి చెప్పలేంగాని ఇంటర్వ్యూలోనూ పూర్తిపారదర్శకత ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. వ్యక్తిగతమైన అంశాలను, బలాబలాలను అంచనా వేయటానికి.. ఉద్యోగానికెంతమేర సరిపోతారనే అంశాలను పరీక్షిండానికే ఇంటర్వ్యూ.
 

* ఇంకా ఎలాంటి మార్పులుండే అవకాశముంది?
సిలబస్‌ పరంగా చూసినా.. చాలా మార్పులు జరిగాయి. వారం రోజుల్లో వెలువడే సిలబస్‌లో ఆ మార్పును మీరంతా చూస్తారు. శిక్షణ తీసుకున్నవారికి, తీసుకోనివారికుండే అంతరాలను దృష్టిలో ఉంచుకొని ప్రశ్నపత్రాల రూపకల్పన, ప్రశ్నల స్వభావంలోనూ మార్పులు తీసుకురావటానికి ప్రయత్నిస్తున్నాం. సిలబస్‌, పరీక్షలు... అన్నీ కూడా తెలంగాణ కేంద్రంగా, తెలంగాణ అభ్యర్థులు, నిరుద్యోగులు, తెలంగాణ భవిష్యత్‌ కేంద్రంగా ఉంటాయి. కచ్చితంగా తెలంగాణతో సంబంధమున్న వారికి, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వారికి ఇబ్బందిలేకుండా ఉంటుంది.
 

* సిలబస్‌కు తగ్గ పుస్తకాలు అందుబాటులో లేవని అభ్యర్థుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. దానిపై ఏమంటారు..?
ఆ ఆందోళనతో మాకు సంబంధం లేదు. పోటీ పరీక్షలను నిర్వహించేవారు సిలబస్‌ ఇస్తారే తప్ప పుస్తకాలు ప్రచురించరు. నిజంగా వాటికి డిమాండ్‌ ఉంటే పుస్తకాలు వాటంతట అవే మార్కెట్లోకి వస్తాయి. తెలంగాణ ఉద్యమంపై ఇప్పటికే మార్కెట్లో 20 పుస్తకాలున్నాయి. వాటి ప్రామాణికత సంగతి నాకు తెలియదు. ఇప్పటికే బోలెడంత సమాచారం అందుబాటులో ఉంది. అయినా ఓ ఐదు సంవత్సరాల పత్రికల్ని నిశితంగా చదువుతున్నవారు, పరిశీలిస్తున్నవారికి అనుగుణంగానే సిలబస్‌ అంతా ఉంటుంది. అలాంటి వారికి కచ్చితంగా 50 ఏళ్ల చరిత్రపై అవగాహన కలుగుతుంది. తెలంగాణ ఉద్యమంపై 120 వెబ్‌సైట్లున్నాయి. బోలెడంత సమాచారం అందుబాటులో ఉంది. వ్యాసాలున్నాయి. అయినా పోటీ పరీక్షలకు ఫలానా పుస్తకాలుండవు. ఇవన్నీ శిక్షణకేంద్రాల వాళ్ళు చెప్పేవి. మక్కీకిమక్కీ బట్టి పట్టిన పరిజ్ఞానాన్ని పరీక్షించటం కాదు పోటీపరీక్షంటే. సమానస్కంధుల మధ్య పోటీ. డబ్బులున్న వాళ్లు కోచింగ్‌ తీసుకుంటారు. లేనివాళ్ళు తీసుకోరు. మరి వారికి అన్యాయం చేయాలా? మేం కోచింగ్‌ సెంటర్ల వాళ్ళకోసం పనిచేయటం లేదు. పోటీపరీక్ష పెట్టినప్పుడు వాటికి తగ్గట్లు తయారవటం విద్యార్థుల బాధ్యత.. కర్తవ్యం.
 

* గతంలో ప్రకటించినట్లు కమిషన్‌ నుంచి ఉద్యోగాల క్యాలెండర్‌ను ఆశించొచ్చా?
మొత్తం వ్యవస్థ మా చేతిలో ఉన్నప్పుడు క్యాలెండర్‌ వేయటంలో అర్థముంటుంది. కానీ అలా లేదిప్పుడు. ఉదాహరణకు కమలనాథన్‌ కమిటీనే తీసుకుంటే ఆరునెలలనుకున్నది మూడేళ్లదాకా వెళుతోంది. దీనిప్రభావం ప్రభుత్వంపైనా, నియామకాలపైనా పడుతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో నియామకాల వారీగా క్యాలెండర్‌ మాత్రం మేం ఇవ్వగలం. డిసెంబరు దాకా ప్రతినెలా ఒక పరీక్ష ఉంటుంది. ప్రభుత్వం కూడా మాకు పరీక్షే పెట్టింది. ఇచ్చినవి నాలుగైదువేల ఉద్యోగాలే అయినా 14 రకాల ఉద్యోగాల్ని మాకిచ్చారు. కొన్ని కొత్త ఉద్యోగాలనూ ఇచ్చారు. వీటన్నింటినీ డిసెంబరులోపు పూర్తి చేయటం మా ముందున్న సవాలు.
 

* పరీక్ష కేంద్రాల్లో డ్రెస్‌కోడ్‌ ఏమైనా పెడతారా?
మేం ఇప్పుడే ఎలాంటి దుస్తులు ధరించాలో నిర్దేశించేదాకా వెళ్లటం లేదు. అయితే...పరీక్షకు, శరీరానికి అవసరం లేని వస్తువులు వేటినీ లోనికి తీసుకొని రానివ్వం. గడియారాలు, గొలుసులు, చెవిపోగులు, బ్రాస్‌లెట్లు, అందాల కళ్లజోళ్లు తదితర ఆభరణాలు ఏవైనా అనుమతించం. సుప్రీంకోర్టు, యూపీఎస్సీలు కూడా ఇదే చెబుతున్నాయి. కచ్చితంగా వాటన్నింటినీ పాటించాల్సిందే.

 Posted on 20-8-2015

Posted Date : 10-10-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌