• facebook
  • whatsapp
  • telegram

ప్రశ్నలేంటో ఛైర్మన్‌కూ తెలియవు

* 'మేఘ'సందేశం ద్వారా నిమిషాల ముందు ప్రశ్నపత్రం
* చివరి దాకా తప్పులు సరిదిద్దుకోవచ్చు
* 45 నిమిషాల ముందే గేట్లు మూసివేత
* పెన్ను, పేపర్ కూడా అనుమతించం
* ఆన్‌లైన్ పరీక్షకు నేటి నుంచి హాల్‌టికెట్ల డౌన్‌లోడ్
* 'ఈనాడు ప్రతిభ'తో టీఎస్‌పీఎస్సీ సాంకేతిక సలహాదారు డాక్టర్ నిశాంత్ దొంగరి

మరో వారంలో మొదటిసారిగా ఆన్‌లైన్ ఉద్యోగ పరీక్ష పెడుతున్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) అందుకు తగిన ఏర్పాట్లన్నింటినీ పూర్తి చేసింది. ఈ నెల 20న 900 పైచిలుకు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ల పోస్టులకు పరీక్ష రాయబోతున్న 31వేల మందికి హాల్‌టికెట్లను సోమవారం నుంచి జారీ చేస్తున్నారు. అభ్యర్థులు వాటిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మరికొద్దిరోజుల్లోనే వారికి 'మాదిరి ఆన్‌లైన్ పరీక్ష కూడా నిర్వహించబోతున్నారు. రాష్ట్రంలో తొలిసారి నిర్వహిస్తున్న ఆన్‌లైన్ ఉద్యోగ పరీక్ష తీరుతెన్నులనూ, అభ్యర్థులు అనుసరించాల్సిన విధివిధానాలను టీఎస్‌పీఎస్సీ సాంకేతిక సలహాదారు, హైదరాబాద్ ఐఐటీలో సహ ఆచార్యులు డాక్టర్ నిశాంత్ దొంగరి 'ఈనాడు ప్రతిభకు వివరించారు.
 

'మేఘసందేశం....
టీఎస్‌పీఎస్సీ నిర్వహించబోయే ఆన్‌లైన్ పరీక్ష పూర్తి పారదర్శకంగా, అక్రమాలకు తావు లేకుండా జరగబోతోంది. మూడువేల ప్రశ్నల నుంచి 150 ఎంపిక చేసి ఇస్తారు. ఆ 150 ప్రశ్నలు ఏమిటో ఎవరికీ తెలియవు. చివరకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్‌కు కూడా తెలియవు. ఎందుకంటే పరీక్షకు కొద్ది నిమిషాల ముందు కంప్యూటర్ యాదృచ్ఛికంగా ఆ 150 ప్రశ్నలను ఎంపిక చేసి విడివిడిగా (జంబ్లింగ్) ప్రశ్నపత్రాలను రూపొందిస్తుంది. ఇలా 31 వేల మంది అభ్యర్థులకు సుమారు మూడువేల రకాల ప్రశ్నపత్రాలు తయారై ప్రతి ఒక్క అభ్యర్థికి 'క్లౌడ్ కంప్యూటింగ్ ద్వారా తెరపై ప్రత్యక్షమవుతాయి. ఒకరి ప్రశ్నపత్రం మరొకరి దానితో పోలి ఉండదు. ప్రశ్నలు అవే ఉంటాయి. కానీ వరుస మారుతుంది. సమాధానాల వరుస కూడా వేర్వేరుగానే ఉంటుంది. అభ్యర్థి కంప్యూటర్ ముందుకూర్చున్న తర్వాత తనకిచ్చే పాస్‌వర్డ్‌ను ఉపయోగిస్తేనే తెరపై ప్రశ్నపత్రం ప్రత్యక్షమవుతుంది. అభ్యర్థికి పాస్‌వర్డ్‌ను పరీక్షకు కొద్ది నిమిషాల ముందు అందజేస్తారు. ఇలా పాస్‌వర్డ్‌ను కొద్ది నిమిషాల ముందు ఎలా అందజేస్తామనేది రహస్యం. ఇప్పుడే వెల్లడించలేం.
 

అనుక్షణం నిక్షిప్తం
అన్ని పరీక్ష కేంద్రాల్లోనూ ప్రతి అభ్యర్థికి కేటాయించిన కంప్యూటర్ హైదరాబాద్‌లోని కమాండ్ సెంటర్‌తో అనుసంధానమై ఉంటుంది. సమయానికి టైమర్ ఆరంభమవుతుంది. పరీక్ష సమయం ముగియగానే కంప్యూటర్ సిస్టమ్ ఆగిపోతుంది. మధ్యలో ఏదైనా తీవ్రమైన సమస్య వచ్చి పరీక్షను ఆపేస్తే టైమర్ ఆగిపోతుంది. తర్వాత కొనసాగించవచ్చు. అయితే ఇలాంటి అవకాశాలు చాలా చాలా తక్కువ. ఎందుకంటే విద్యుచ్ఛక్తికి అంతరాయం కలిగినా, మరేదైనా సమస్య వచ్చినా పరీక్ష ఆగకుండా అన్ని జాగ్రత్తలు ముందే తీసుకున్నాం. కంప్యూటర్ ముందు కూర్చున్న అభ్యర్థి లాగిన్ అయిన క్షణం నుంచి పరీక్ష పూర్తయ్యే దాకా ప్రతిక్షణం ఏం చేస్తున్నారో హైదరాబాద్‌లో రికార్డు అవుతుంటుంది.
 

కీ బోర్డూ పనిచేయదు....
ఉదయం పది గంటలకు ఆరంభమయ్యే జనరల్ స్టడీస్ పరీక్షకు 8.30 నుంచి లోపలికి అనుమతిస్తారు. 9.15 గంటలకు పరీక్ష కేంద్రం గేటు మూసేస్తారు. మధ్యాహ్నం సబ్జెక్ట్ పరీక్షకు ఒంటిగంట నుంచి అనుమతిస్తారు. 1.45కు గేటు మూసేస్తారు. పరీక్ష కేంద్రంలోకి హాల్‌టికెట్, ధ్రువీకరణ (ఐడెంటిటీ-ఒరిజినల్) పత్రం తప్ప మరేదీ అనుమతించరు. చివరకు పెన్ను, పెన్సిల్, కాగితం ముక్క కూడా లోపలికి తీసుకొని రానివ్వరు. హాల్‌టికెట్‌ను రంగుల్లో డౌన్‌లోడ్ చేసుకుంటే మంచిది. పరీక్ష గదిలోకి అనుమతించే ముందు బయోమెట్రిక్ పద్ధతిలో అభ్యర్థులందరి వేలిముద్రలు, వీడియో రికార్డు చేస్తారు. లోపలికి అడుగుపెట్టిన తర్వాత కంప్యూటర్‌లో మౌస్‌ను మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది. కీబోర్డులు కూడా పనిచేయవు. కంప్యూటర్ తెరపైనే వర్చువల్ క్యాలుకులేటర్ ఉంటుంది. మౌస్ ద్వారా కావాలంటే ఏవైనా లెక్కలు చేసుకోవచ్చు. ఒకవేళ ఎవరైనా తమకు పేపర్, పెన్ను కావాలంటే పబ్లిక్ సర్వీస్ కమిషనే వాటిని పరీక్ష గదిలో అందజేస్తుంది. పరీక్ష పూర్తయ్యేదాకా ఎవరినీ బయటికి పంపరు. పూర్తి అంధులకు సహాయకుడిని అనుమతిస్తారు. వారికి అదనంగా 20 నిమిషాల సమయం కేటాయిస్తారు. పరీక్షకు సంబంధించిన ప్రతి విషయాన్ని, నిర్ణయాన్ని ఇప్పటి నుంచి అభ్యర్థులకు సంక్షిప్త సందేశం (ఎస్ఎంఎస్) ద్వారా చేరవేస్తారు.
 

ఒత్తిడి అవసరం లేదు...
పరీక్ష ప్రారంభానికి పది నిమిషాల ముందు అభ్యర్థులు లాగిన్ అవ్వొచ్చు. ఓఎంఆర్ షీట్లలో మాదిరిగా తప్పులు చేస్తే మార్చుకోలేమన్న బాధ ఈ ఆన్‌లైన్ పరీక్షలో ఉండదు. చివరి వరకు కూడా సమాధానాలను మార్చుకోవచ్చు. అంటే తప్పులు చేసినా గాబరా పడాల్సిన పన్లేదు. చివర్లో మరోమారు సరిచేసుకొని సేవ్ చేస్తే సరిపోతుంది. ప్రతి పరీక్ష కేంద్రంలో 20 మందికి ఒక ఇన్విజిలేటర్లను నియమిస్తున్నారు. ఎంపిక చేసిన కొంతమంది అధికారుల వద్ద తప్పిస్తే ఎవరి వద్ద కూడా సెల్‌ఫోన్లు ఉండవు.

Posted Date : 26-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌