• facebook
  • whatsapp
  • telegram

జవాబులను మెరిపించే గణాంకాలు

గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలో ఎస్సే, ఆర్థిక వ్యవస్థ విభాగాల్లో మంచి మార్కులు తెచ్చుకోవాలంటే ఎలా? పేజీలు నింపటమే లక్ష్యంగా నిర్దిష్ట విషయం లేకుండా ఏది పడితే అది రాస్తే మార్కులు రావటం అసంభవం. మరి ఏకైక మార్గం ఏమిటంటే... విషయానికి సంబంధించిన సమగ్ర సమాచారం తెలిసివుండాలి. అవసరమైనచోట సమాధానాల్లో కచ్చితమైన, తాజా గణాంకాలను ఉదాహరిస్తుండాలి!
అడిగిన ప్రశ్నలో ఆ సమస్య/ సంబంధిత ఆర్థికాంశానికి చెందిన గణాంకాలు ముందుగా సిద్ధ్దం చేసుకోవాలి. అయితే చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు, రాజ్యాంగం వంటి అంశాల్లో గణాంక సంబంధిత అంశాల ఉపయోగం, ప్రాధాన్యం తక్కువ. జనరల్‌ స్టడీస్‌, జనరల్‌ ఎస్సే, ఆర్థిక వ్యవస్థ వంటి విభాగాల్లో గణాంక సమాచారం కీలక పాత్ర పోషిస్తుంది. వాటి ఆధారంగా రాసే సమాధానాలు గరిష్ఠ మార్కులు సాధించేలా దోహదం చేస్తాయి. మాధానాలు రాసే సందర్భంలో వాటిని ఎక్కడ, ఏ విధంగా ఉపయోగించుకోవాలో తెలిసి ఉండాలి. గణాంకాలను ఏయే సందర్భాల్లో ఉదాహరించాలో పరిశీలిద్దాం.
 

సమస్య ప్రస్తావన, దాని తీవ్రత
జనరల్‌ స్టడీస్‌, వ్యాసం, ఆర్థిక వ్యవస్థ విభాగాల్లో పట్టణ జనాభా అభివృద్ధిపై ప్రశ్నను ఈ విధంగా రాయవచ్చు. ‘అభివృద్ధి జరుగుతున్న సమయంలో పట్టణ జనాభా పెరుగుదల తప్పనిసరిగా ఉంటుంది. ఇది ఆర్థికాభివృద్ధికి సూచికగా చెప్పవచ్చు. దేశంలో 1951లో 6.24% గా ఉంది. ఇది నాలుగు దశాబ్దాల తర్వాత ఆర్థిక సంస్కరణలు ప్రారంభించే కాలానికి 21.7% కు పెరిగింది. 2001 నాటికి 28.5%, 2011 నాటికి 37.7% పెరిగింది’.
 

అంశాల ధోరణులు, హెచ్చుతగ్గులు
ఒక సమస్య/ అంశానికి సంబంధించి పెరుగుదల, తగ్గుదల ఉంటాయి. ప్రధానంగా ధోరణులు వివరించి, వాటి మార్పులు తెలపటానికి గణాంకాలను ఉపయోగించుకోవచ్చు. ఉదాహరణకు ‘భారతదేశ గ్రామీణ జనాభా, పేదరికం’ వంటి ప్రశ్నలకు ఈ విధంగా జవాబు రాయవచ్చు. దేశంలో NSSO27 వ రౌండ్‌ ప్రకారం 1973-74 లో గ్రామీణ పేదరికం 56.4% గా ఉంది. 1999-2000 నాటికి 27.1% కు తగ్గింది. కానీ 2004-05 నాటికి గ్రామీణ పేదరికం 28.3%, 2009-10 నాటికి 33.8 శాతానికి తగ్గింది. అది 2011-12 (68వ రౌండ్‌) ప్రకారం 25.7% కు తగ్గింది’ అని వివరించవచ్చు.
 

అర్థం, వివరణ
‘ఆహార వృథా- సమస్య’ అనే ప్రశ్నకు భారతదేశం ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ముఖ్యమైనది. అంతరిక్ష రంగంలో ప్రపంచంలోనే చౌకైన వ్యయంతో ఉపగ్రహాలు పంపుతున్న దేశం. పారిశ్రామిక రంగంలో మొదటి పది దేశాల్లో ఒకటి. ప్రపంచ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో మొదటి 4 దేశాల్లో ఒకటి. ఇంతటి ప్రఖ్యాతి చెందినా ఆకలితో అలమటించే దేశాల్లో మన స్థానం 63. ప్రతిరోజూ ఆకలితో బాధపడేవారు 19.4 కోట్ల్ల జనాభా. దేశంలో సరైన ఆహారం లేక చనిపోతున్న పిల్లల సంఖ్య ప్రతిరోజు 3000 మంది అని అంచనా. 5 సం॥ పిల్లల్లో పోషకాహార లోపంతో ఉన్నవారు 30.7%గా చెప్పవచ్చు. ఇన్ని సమస్యలున్న దేశంలో ఏటా వృథాగా పడవేస్తున్న ఆహారం సుమారు 6.7 కోట్ల టన్నులు. భూక్‌ సంస్థ అంచనా ప్రకారం దేశంలో ఆకలితో బాధపడుతున్న వారి సంఖ్య దాదాపు 20 కోట్ల మంది’ ఈ విధంగా సమస్యను విశ్లేషించి సమాచారం రాస్తే ప్రభావశీలంగా ఉంటుంది. మార్కులూ ఎక్కువ వస్తాయి.
 

సమస్య స్థితి తెలిపే తాజా గణాంకాలు
ప్రశ్నకు సంబంధించి జవాబులో కచ్చితంగా తాజా గణాంకాలు రాయాలి. ఉదా॥ ప్రస్తుతం 2017లో గ్రూప్‌ పరీక్షలు రాస్తూ 2001, 2010 సం॥లో గణాంకాలు రాయవచ్చు. కానీ కొన్ని అంశాలు ముఖ్యంగా జనాభా, పేదరికం వంటి అంశాల్లో 2011 అంశాలు తాజాగా పరిగణించాలి. గణంకాలు నిత్యం అప్‌డేట్‌ చేసుకోవటం వల్ల జవాబుకు తాజాదనం వస్తుంది. ఉదాహరణకు కాగ్‌ 2016-17 ఆర్థిక ప్రగతిపై గణాంకాలు 25 మే 17 న విడుదల చేసింది. దాని ఆధారంగా ‘ఆదాయ అభివృద్ధిలో పన్నుల పాత్ర’ వంటి ప్రశ్నలో ఈ విధంగా జవాబు రాయవచ్చు- ‘ ఆదాయ అభివృద్ధిలో పన్నులు అత్యంత కీలకమైనవి. దేశంలో ఆదాయ అభివృద్ధిలో తెలంగాణకు ప్రథమ స్థానం దక్కింది. ప్రధాన పన్నులైన అమ్మకం పన్ను, అబ్కారీ, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు వంటి ప్రధాన పన్నుల్లో 17.82 శాతం వృద్ధిని నమోదు చేసింది. 2016-17 నాటికి రూ॥ 39,183 కోట్లు వసూలు చేసింది. అన్ని పన్నుల రూపంలో 17.81 శాతం వృద్ధిలో రూ॥ 42,564 కోట్లు వసూలు చేసింది. వృద్ధి రేటు 17.80 శాతంగా ఉండి దేశంలో మొదటిస్థానం చేరింది’ అని తాజా గణాంకాలతో రాయవచ్చు.
 

అనుకూల, ప్రతికూల వాదనలు
జనరల్‌ స్టడీస్‌, ఎస్సేల్లో వర్తమాన అంశాలకు సంబంధించి అనుకూల, ప్రతికూల వాదనలు తెలిపే సందర్భంలో గణాంకాల ఆధారంగా వాటిని సమర్థించటం ద్వారా మెరుగైన సమాధానం తయారవుతుంది. ఉదాహరణకు ‘రైతు ఆత్మహత్యలు-నివారణ’ వంటి ప్రశ్నల్లో రైతు ఆత్మహత్యలు ప్రధానంగా చిన్నకారు, సన్నకారు రైతులు, రైతు కూలీల్లో ఎక్కువ అని వివరించి, దీనికి ప్రధానంగా అప్పులు, వ్యవస్థాపరమైన, కుటుంబ సమస్యలు కారణాలు అని చెప్పవచ్చు. దీనికి అనుకూల వాదనకు నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో- 2015 ప్రకారం రైతు ఆత్మహత్యలకు అప్పులు 38.7%, వ్యవస్థాపర కారణాలు 19.5%, కుటుంబ సమస్యలు 11.7% అని గణాంకాలు జోడిస్తే సమర్థమైన, సమగ్రమైన జవాబు రాయవచ్చు.
 

విషయ వర్ణనకు భాషతో పాటు...
‘భారతదేశంలో మత అసమానతలు’ వంటి ప్రశ్న వస్తే దీనిలో గణాంకాలతో పాటు విషయం వర్ణన అవసరం. ‘భారతదేశం విభిన్న మతాలకు పుట్టినిల్లు. ప్రధానంగా అలౌకిక శక్తులను ప్రగాఢంగా నమ్మడమే మతం. ఈ భావనలో సంప్రదాయాలు, ఆచారవ్యవహారాలు, అలవాట్లు, మానవ అతీత శక్తుల నమ్మకాల మేలు కలయికగా చెప్పవచ్చు. దేశంలో 79.80% శాతంగా హిందూమతం ఒక మతంగా కాక జీవన విధాానంగా ఉంది’ అని రాయవచ్చు. ఇదే ప్రశ్న జనరల్‌ స్టడీస్‌లో వస్తే జవాబుకు నేరుగా గణాంకాలు జోడించాలి.
 

విషయ సమగ్రత, విశ్లేషణ
‘నిరుద్యోగిత’కు సంబంధించిన ప్రశ్నకు సమగ్రంగా జవాబు రాయాలంటే దానికి అన్ని కోణాల నుంచి గణాంకాలు ఇవ్వాలి. నిరుద్యోగిత నిర్వచనం, రకాలు, కారణాలు, నివారణ చర్యలు, గ్రామీణ, పట్టణ, స్త్రీ, పురుషుల్లో నిరుద్యోగిత శాతం మొదలైనవి రాయటం ద్వారా సమగ్రతకూ, విశ్లేషణకూ అవకాశం ఉంటుంది.
 

భూత, భవిష్యత్‌, వర్తమాన పరిస్థితులు
నిర్దిష్ట సమస్య సంపూర్ణ అవగాహన కోసం దానికి చెందిన భూత, భవిష్యత్‌, ప్రస్తుత స్థితిగతులు తెలిపే గణాంకాలు అవసరం. తద్వారా దాని పట్ల పూర్తి అవగాహన ఏర్పరుచుకోవచ్చు. ఉదాహరణకు పారిశ్రామిక రంగంలో ఉక్కు పరిశ్రమకు సంబంధించిన ప్రశ్నకు ఇలా రాయవచ్చు- ‘భారతదేశ సత్వర పారిశ్రామికాభివృద్ధికి ఉక్కు పరిశ్రమ అత్యంత కీలకమైనది. అంతేకాక మేకిన్‌ ఇండియా విజయానికి ఉక్కు అత్యంత ముఖ్యమైనది. 1991-92లో దేశ ఉక్కు ఉత్పత్తి కేవలం 2.2 కోట్ల టన్నులు. 2015-16 నాటికి 9.1 కోట్ల టన్నులకు పెరిగింది. కేంద్రం ఇటీవల జాతీయ ఉక్కు విధానం- 2017 ను ఆమోదించింది. దీని ప్రకారం 2030-31 నాటికి 30 కోట్ల టన్నులకు పెంచాలని లక్ష్యంగా నిర్ణయించింది’.
 

అధికారిక/సాధికార గణాంక సమాచారం
జవాబు రాసే సందర్భంలో గణాంక సమాచారపు ఆధారం తప్పనిసరిగా తెలిపాలి. అది సాధికారకమై ఉండాలి. వివిధ¿ ప్రభుత్వ నివేదికలు, కమిటీలు, బడ్జెట్లు, సర్వేలు, ఐరాస తదితర సంస్థల నివేదికలు అధికారికమని చెప్పవచ్చు. ‘జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-4 ప్రకారం 2005-06లో శిశు మరణాల రేటు ప్రతి వేయికీ 57 ఉండగా, 2015-16 నాటికి ఈ రేటు 41కి పడిపోయిందని 2017 ఫిబ్రవరి 28న విడుదలైన ఆ నివేదిక తెలిపింది’ అని రాస్తే సమాధానం విశ్వసనీయంగా ఉంటుంది. విధంగా తాజా గణాంకాలను లోపరహితంగా సందర్భానుసారం జోడించగలిగితే పరీక్షల్లో జవాబులు సమగ్రంగా రూపొందుతాయి. ఫలితంగా గరిష్ఠ్ట మార్కులు సాధించి అవలీలగా విజయతీరం చేరుకోవచ్చు.

Posted Date : 26-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌