• facebook
  • whatsapp
  • telegram

ఓటమిని గెలిచేదెలా?

పోటీపరీక్షల ప్రయాణంలో ఎల్లప్పుడూ విజయాలే వరించవు. వైఫల్యాలు కూడా పలకరిస్తుంటాయి. అది సహజం. సీఏ, సివిల్స్‌, గ్రూప్స్‌, బ్యాంకు.. పరీక్ష ఏదైనా ఓటమి ఎదురైౖనపుడు అది రేపటి గెలుపునకు పునాదిగా భావించాలి!
కరీంనగర్‌ జిల్లాకు చెందిన కావ్య తల్లిదండ్రుల కోరిక మేరకు సీఏ కావాలని ప్రయత్నిస్తోంది. కానీ తొలి దశలోనే వైఫల్యం ఎదురై నిరాశకు గురైంది.
శ్రీకాకుళం జిల్లాకు చెందిన శ్రీనివాస్‌ బ్యాంకు ఆఫీసర్‌ కావాలని కలలు కన్నాడు. రెండేళ్ల నుంచి అతను రాయని బ్యాంకు పరీక్ష లేదు. కానీ రాతపరీక్ష పాసైతే, ఇంటర్వ్యూ పోతోంది. కొన్ని సందర్భాల్లో ప్రిలిమినరీ దశనే దాటలేకపోవడం అతడిని మనోవ్యధలోకి నెట్టేసింది.
అనంతపురం జిల్లాకు చెందిన అరుణ్‌ డిగ్రీ నుంచి సివిల్స్‌ మీద దృష్టిపెట్టి తొలి ప్రయత్నంలోనే ఐఏఎస్‌ కొట్టాలనుకున్నాడు. కానీ ప్రిలిమినరీ దగ్గరే ఎదురుదెబ్బ తగలడంతో వైరాగ్యంలో పడిపోయాడు.
హైదరాబాద్‌కు చెందిన మహేష్‌ది మరో రకమైన అనుభవం. ఆరు నూరైనా గ్రూప్స్‌ కొట్టాలని ఆరేళ్ల నుంచి పోరాడుతున్నాడు. డబ్బు మంచినీళ్లలా ఖర్చయ్యి అంతంతమాత్రంగా వూళ్లొ వ్యవసాయం చేస్తున్న తండ్రికి భారం కావడం తప్ప తాను సాధించింది శూన్యమని మౌనంగా రోదిస్తున్నాడు.

 

నాలుగు ప్రాంతాలకు చెందిన వీరి నేపథ్యాలు వేరు, లక్ష్యాలు భిన్నం. అయితే అందరూ ఆశపడుతున్నది పోటీపరీక్షల్లో విజయం కోసమే. కానీ అపజయాలు ఎదురుకావడంతో కుంగిపోతున్నారు. ఇది ఈ నలుగురి సమస్యే కాదు. పోటీపరీక్షల సమర క్షేత్రంలో ప్రవేశించిన లక్షలమంది ఆవేదన. పోటీపరీక్షల్లో అవకాశాలు స్వల్పం. పోటీపడేవారు అధికం. కానీ అంతిమ ఫలితం దక్కేది కొందరికే. మిగతా అందరూ అంతులేని ఆవేదనను ఏదో ఒక దశలో ఎదుర్కొంటారు. దీని నుంచి బయటపడేదెలా? అసలు పోటీ నుంచి నిష్క్రమించడమే శరణమా? ఈ సంక్లిష్ట దశలో ఎలా స్పందించాలి? ఎలా స్వీయ విశ్లేషణ చేసుకోవాలి? నడిచిన దారి సరైనదేనా? కాదా అన్న మీమాంసను ఎలా పరిశీలించాలి? విజయం అంటే ఒక వైఫల్యం నుంచి మరో వైఫల్యానికి ఉత్సాహాన్ని కోల్పోకుండా చేసే ప్రయాణం అంటారు. జీవిత పర్యంతం వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఎన్నో పరాజయాలను ఎదుర్కొని, ఎదురొడ్డి చివరికి అమెరికా అధ్యక్ష పదవిని అధిష్ఠించారు అబ్రహాం లింకన్‌. ఏ పరాజయమూ శాశ్వతం కాదు. అపజయం అనేది ఒక స్థితి, ఒక దశ. దాని నుంచి బయటపడి విజయ ప్రస్థానం చేరడానికి మూడు మార్గాలున్నాయి. స్వీయ సాంత్వన కోసం మానసిక నిపుణులు సూచిస్తున్న సాధనాలున్నాయి.
1. తక్షణ స్పందన
2. వ్యక్తిగత అంతర్వీక్షణం
3. విద్యాపరమైన విశ్లేషణ
 

తక్షణ స్పందన
కొన్ని నెలలు లేదా సంవత్సరాల కృషి అనంతరం రాసిన పోటీపరీక్షల ఫలితాలు ప్రతికూలంగా రావడం నిరాశను కలిగించడం సహజం. అప్పటివరకూ వేసిన అంచనాలు, కన్న కలలు తలకిందులయ్యాయన్న వ్యధ కలగడమూ మామూలే. అయితే దీనిని సుదీర్ఘ ప్రయాణంలో భాగంగానే చూడాలి. జీవనయానంలో ఒక అడుగుగానే భావించాలి.
అపజయాన్ని అంగీకరించడం: ఫలితం ప్రతికూలమైనప్పుడు మనసు పరిపరివిధాల పోతుంది. ఈ సొంత పరాజయాన్ని మరెవరి మీదైనా నెట్టెయ్యాలని మనసు ఉవ్విళ్లూరుతుంది. అందుకు ఎవరిని నిందించాలన్న అంతర్మధనం మొదలవుతుంది. కానీ అసలు వాస్తవం- వైఫల్యానికి కారణమైన ప్రతి నిర్ణయం అభ్యర్థిదే. సరైన వ్యూహం ఎంచుకోకపోయినా, తగిన ప్రణాళిక వేసుకోలేకపోయినా, తీసుకున్న శిక్షణలో తగిన ప్రమాణాలు లేకపోయినా, ఇలా కారణం ఏదైనా ఆ నిర్ణయం సొంతదారు అభ్యర్థే. కాబట్టి, యథాతథంగా దాన్ని స్వీకరించడం మేలు. ఓటమిని అంగీకరించడం తరువాత సాధించబోయే విజయంలో తొలిమెట్టు.
సన్నద్ధతకు స్వల్ప విరామం: పోటీపరీక్షల ఫలితాలు రావడంతోనే అపజయం చవిచూసిన అనంతరం చాలామంది తక్షణం మళ్లీ సన్నద్ధతలో పడిపోతారు. అయితే వైఫల్యం తాలూకు వేదన మాత్రం మనసును కుదిపేస్తుంటుంది. అలాంటి కల్లోల స్థితిలోనే సన్నద్ధత కొనసాగించడం వల్ల సంపూర్ణ ఏకాగ్రత కుదరదు. అందుకే కనీసం పక్షం రోజులు సన్నద్ధతకు దూరంగా ఉండి, కల్లోలిత మనసును కుదుటపడనివ్వాలి. ఇది సమయాన్ని వృథా చేయడం కాదు. పరుగు పందెంలో మోకాలుపై వంగి ఒక కాలు వెనక్కి వేసి, తగిన శక్తి పుంజుకునే ప్రయత్నం చేసినట్టు, ఈ స్వల్ప విరామం రాబోయే పెద్ద ప్రయత్నానికి పునాది అవుతుంది.
అంతఃశోధన: ఇలా విరామం తీసుకోవడం వల్ల మనసు కాస్త స్థిమితపడి అంతః విశ్లేషణ మొదలవుతుంది. చేసిన ప్రయత్నంలో అంతర్గతంగా తప్పొప్పుల సమీక్ష జరుగుతుంది. అప్పటికే విజయ సారథుల మనోగతాలు వెల్లడవుతాయి. కాబట్టి, వారితో తన ప్రయత్నాన్ని సరిపోల్చుకోవడానికి వీలవుతుంది. ముఖ్యంగా ఓటమి పరాభవాన్ని వెనక్కి నెట్టి అసలు కారణాల అన్వేషణకు మనసు సిద్ధపడుతుంది.
 

వ్యక్తిగత అంతర్వీక్షణం
పోటీ పరీక్షల్లో ఎదురైన చేదు అనుభవ పరాభవం ఫలితంగా ఉత్పన్నమయ్యే తక్షణ స్పందన దశ నుంచి బయటపడ్డాక నిజమైన స్వీయ పరిశీలన మొదలవ్వాలి. సాధారణంగా పోటీపరీక్షల్లో పరాజయానికి రెండు కారణాలుంటాయి. వ్యక్తిగత కారణాలు మొదటి కోవకు చెందితే, సదరు పోటీపరీక్ష సన్నద్ధతలో విషయపరమైన లోపాలు రెండో కోవకు చెందుతాయి. ముందు తనకు మాత్రమే తెలిసిన వ్యక్తిగత కారణాలను పరిశీలిస్తే..
క్రమశిక్షణ లోపించడం: ఒక్కో తరహా పోటీపరీక్షకు ఒక్కో ప్రత్యేక పంథాలో సన్నద్ధత అనివార్యమవుతుంది. సివిల్‌ సర్వీసెస్‌లో విజయానికి ఒక విధమైన సన్నద్ధత అవసరం అయితే, ఐఐటీ జేఈఈ పరీక్షకు మరో విధమైన సన్నద్ధత అవసరం. దీన్ని బట్టి అందుకు తగ్గట్టుగా దినచర్య అలవాటు చేసుకోవాలి, క్రమశిక్షణ అలవరచుకోవాలి. ఇది పోటీ పరీక్షార్థికి స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది. కానీ వ్యక్తిగత బలహీనతల కారణంగా క్రమశిక్షణ తప్పడం వల్ల విజయానికి దూరమవుతారు.
ఏక లక్ష్యం లోపించడం: పోటీ పరీక్షలకు ఏక లక్ష్య సన్నద్ధత (సింగిల్‌ మైండెడ్‌ ప్రిపరేషన్‌) చాలా సందర్భాల్లో విజయం చేకూరుస్తుంది. కానీ పోటీపరీక్షల్లో చాలామంది ఒకేసారి నాలుగు పడవలపై కాళ్లు వేయాలని చూస్తుంటారు. దీనివల్ల ఏ పరీక్షపైనా ఏకాగ్రత కుదరదు. నిరాశాపూరితంగానే ఉంటుంది.
బాహ్య ఒత్తిళ్లు: పోటీ పరీక్షల్లో విజయానికి సొంత బలాబలాల అంచనా అవసరం. అన్ని పోటీపరీక్షల్లోనూ వేర్వేరు విద్యా నేపథ్యాలు ఉన్నవారు విజయం సాధించడం లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని పోటీపరీక్ష ఎంపిక జరగాలి. కానీ కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రుల ఆకాంక్ష నెరవేళేర్చడానికో, స్నేహితుల ప్రభావం కారణంగానో ఎంపిక చేసుకుంటే సొంత బలాలు వాటితో అనుసంధానం కాక ఆశించిన ఫలితం రాదు.
మార్గదర్శకత్వ కొరత: పోటీపరీక్షల్లో సరైన మార్గదర్శకత్వం విజయానికి చేరువ చేస్తుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో చదువుకుని మొదటిసారి పోటీపరీక్షలకు హాజరవుతున్నవారికి సరైన మార్గదర్శకత్వం లేక వారి తొలి ప్రయత్నం వృథా అవుతుంటుంది. మంచి అధ్యాపకులో, పోటీపరీక్షల్లో సీనియరో, మంచి శిక్షణ సంస్థ మార్గదర్శకత్వం ఇస్తేనో ప్రతిభగల అభ్యర్థులు త్వరగా గ్రహిస్తారు. పోటీపరీక్షల్లో సత్వర ఫలితాలు వస్తాయి.
* * సివిల్‌ సర్వీసెస్‌కు ఒక విధమైన సన్నద్ధత, ఐఐటీ జేఈఈకి మరో రకం సన్నద్ధత అవసరం. అందుకు తగ్గట్టుగా దినచర్య, క్రమశిక్షణ అలవరచుకోవాలి.* *
 

విద్యాపరమైన విశ్లేషణ
కొంతమంది అభ్యర్థులు వ్యక్తిగతంగా మంచి క్రమశిక్షణ చూపుతూ ఎటువంటి చంచలభావం లేకుండా ఒకే ఒక పోటీపరీక్షకు అంకితమై ఏళ్లతరబడి ప్రయత్నిస్తున్నా సత్ఫలితం రాదు. రాష్ట్ర సర్వీస్‌ కమిషన్‌ గ్రూప్స్‌లో ఇటువంటి అభ్యర్థులు తారసపడుతుంటారు. ఇలాంటివారి విషయంలో వ్యక్తిగత కారణాల కంటే సన్నద్ధత పర్వంలో చేసిన పొరపాట్లే విజయాన్ని ప్రభావితం చేస్తాయి.
సరైన వ్యూహం కొరవడం: ప్రతి పోటీపరీక్షకు దాని స్వభావాన్నిబట్టి పటిష్టమైన వ్యూహం అవసరం. మొత్తం సన్నద్ధతకు వినియోగించే కాలం, సబ్జెక్టువారీ సమయ విభజన, నిపుణుల మార్గదర్శకత్వం, ఏ సబ్జెక్టు ముందు, ఏది తర్వాత, పునశ్చరణకు కేటాయించే సమయం తదితర అంశాలు ఈ వ్యూహంలో అంతర్భాగాలు. వీటిపై అవగాహన లేకపోవడం కూడా పరాజయానికి కారణం అవుతుంది.
తగిన సాధన లేకపోవడం: పోటీపరీక్షల్లో అధ్యయనానికి ఎంత ప్రాముఖ్యముందో సాధనకూ అంతే ప్రాధాన్యం ఉంటుంది. ఉదాహరణకు సివిల్స్‌, గ్రూప్‌-1 స్థాయి పరీక్షల్లో మెయిన్స్‌ దశకు చేరేసరికి సంప్రదాయ విధానంలో వ్యాసరూపంలో జవాబులు రాయాల్సి ఉంటుంది. దీనికి ఎంతో సాధన అవసరం. చాలామంది అభ్యర్థులు మెయిన్స్‌కు సన్నద్ధమవుతారు కానీ, వాటిని రాయడంలో మెలకువలను మెరుగుపరచుకోలేరు. దీనివల్ల అనుకోని అపజయం పలకరిస్తుంది.
మెటీరియల్‌: పోటీపరీక్షల్లో అంతిమంగా ఏం చదివారు? ఏం రాశారు? అన్నదానిపై జయాపజయాలు ఆధారపడి ఉంటాయి. పుస్తకాల ఎంపిక, స్టడీ మెటీరియల్‌ అనుసరణ విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. సిలబస్‌లకు సరిగా సరిపడేలా రూపొందించిన పుస్తకాల ఎంపిక అవసరం. కొన్ని సందర్భాల్లో ఈ విషయంలో జరిగే పొరపాటు అపజయానికి దారితీస్తుంది. కారణం ఏదైనా ఏ పోటీపరీక్ష అయినా గెలిచేవారు తక్కువగా, ఓడేవారు ఎక్కువగా ఉంటారు. అయితే ఆ ఓటమి శాశ్వతం కాదు. దాన్ని తట్టుకుని నిలబడితే మరో ప్రయత్నంలో గెలుపు బృందంలో ఉండవచ్చు. దీనికి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మానసిక శిక్షణ నిపుణులు సూచిస్తున్న ఉపశమన ప్రక్రియ- స్వీయ ఓదార్పు (సెల్ఫ్‌ కంపాషన్‌)..
 

అనుకూల ఫలితానికి ‘స్వీయ ఓదార్పు’
జీవితంలో జయాపజయాలు, కష్టసుఖాలు సర్వసాధారణం. అయితే చాలామంది అపజయాలు ఎదురైనప్పుడు కుంగిపోతారు. తమను తాము నిందించుకుంటారు. తాము దురదృష్ట¾్టవంతులమనీ, నష్ట జాతకులమనీ, తమది ఐరన్‌లెగ్‌ అనీ, తాము విజయానికి తగమనీ నిస్పృహ చెందుతారు. దీనివల్ల శక్తిసామర్థ్యాలు క్షీణించి మరిన్ని పరాజయాలను తెచ్చుకుంటారు. అందుకే అపజయాలు ఎదురైనప్పుడు ఏం చేయాలన్నదానిపై ప్రపంచవ్యాప్తంగా, విస్తృతంగా పరిశోధనలు జరుగుతున్నాయి. నిజానికి ఎంతటి ప్రతికూల పరిస్థితుల్లోనైనా ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దని మానసిక శాస్త్ర నిపుణులు సూచిస్తుంటారు. కానీ ప్రతికూల దృక్పథం కారణంగా మరింత నిస్తేజమవుతారు. క్రిస్టన్‌ నీఫ్‌ అనే అమెరికన్‌ మానసిక శాస్త్రవేత్త దీనిపై కృషి చేసి, ఒక నూతన ప్రక్రియను పరిచయం చేశారు. స్వీయ ఓదార్పు అనే ఈ ప్రక్రియ పరాజయ స్థితినీ, కష్ట సమయ ప్రతికూల మానసిక దుస్థితినీ అధిగమించడానికి చేయూతనిస్తుంది. తీవ్రమెనౖ సంక్షోభ సమయంలోనూ ఈ ప్రక్రియ ఒడ్డుకు చేరుస్తుంది. స్వీయ ఓదార్పు అంటే.. ఎదురైన పరాజయానికి కల్లోల మానసిక స్థితిలో తనను తాను బయటి వ్యక్తిలా ఓదార్చుకోవడం.
ఉదాహరణకు- స్నేహితుడికి ప్రమాదం అయింది. ఆసుపత్రిలో ఉన్నాడు. మీరు అతడిని ఎలా ఓదారుస్తారో అలాగే మిమ్మల్ని మీరు ఓదార్చుకోవాలి. స్నేహితులు పరీక్షలో విఫలమై మానసిక వ్యధలో ఉన్నపుడు అతడిని/ఆమెను వూరడించడానికి చెప్పే మాటలను మిమ్మల్ని మీరు సాంత్వన పరచుకోవడానికి ఉపయోగించుకోవాలి. ఈ విధమైన స్వీయ ఓదార్పు ద్వారా మానసిక ఉపశమనం కలిగి భవిష్యత్తుపై ఆశ చిగురుస్తుందని, ఆత్మ విశ్వాసం మళ్లీ పాదుకుంటుందని నిరూపణ అయ్యింది. దీనివల్ల బలహీన మానసిక స్థితిని అధిగమించి మళ్లీ విజయం సాధించే దిశగా పయనం సాగిస్తారు.
 

స్వీయ వూరడింపులో దశలు
స్వీయ ఆర్ద్ర‌త‌: ఎదురైన అపజయాలు, కష్టాలు, చేదు అనుభవాలతో మనసు గాయపడినప్పుడు ఎవరి పట్ల వారు కఠినంగా ఉండకూడదు. ప్రేమతో వ్యవహరించాలి, గౌరవించుకోవాలి, స్వీయ నింద నుంచి దూరంగా ఉండాలి.
మీరొక్కరే కాదు: ఓటమి ఎదురైనప్పుడు ఆ పరాభవం మీకు మాత్రమే దాపురించిందన్న భావన నుంచి బయటపడాలి. జయాపజయాలు సర్వసాధారణం. ఇదే రకమైన అపజయం ఇంతకుపూర్వం.. ఇప్పుడూ నాతోపాటు అనేకమంది చవిచూశారు. ఓటమికి ఎవరూ అతీతులు కాదు అన్న భావనతో ఆలోచించినప్పుడు మనసు తేలికపడుతుంది.
ఎటూ తూగకుండా: స్వీయ ఓదార్పు ప్రక్రియలో ఎటూ తూగకుండా నిష్పాక్షికంగా వ్యవహరించాలి. స్వీయ విమర్శా కూడదు. అతి స్వీయ ప్రశంసా తగదు. ఈ సమయంలో వచ్చే ప్రతికూల భావాలను అధిగమిస్తూ ఎవరిని వారు ఓదార్చుకోవడానికి మాత్రమే పరిమితం కావాలి. పోటీ పరీక్షలు కఠినమై కావొచ్చు. కానీ ఓడిన ప్రతివారికీ గెలిచే అవకాశం కూడా ఇస్తాయి. ప్రయత్నించి ఓటమిపై గెలుపు సాధించడం మన వంతు!
సివిల్‌ సర్వీసెస్‌కు ఒక విధమైన సన్నద్ధత, ఐఐటీ జేఈఈకి మరో రకం సన్నద్ధత అవసరం. అందుకు తగ్గట్టుగా దినచర్య, క్రమశిక్షణ అలవరచుకోవాలి.

Posted Date : 26-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌