• facebook
  • whatsapp
  • telegram

కామర్స్‌ జేఎల్‌, డీఎల్‌.. మెలకువలు ఇవిగో!

గురుకులాల్లో జూనియర్‌ లెక్చరర్‌, డిగ్రీ లెక్చరర్‌ పోస్టులకు టీఎస్‌పీఎస్సీ ప‌రీక్ష నిర్వ‌హిస్తుంది.  ప్రిలిమినరీ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా మెయిన్‌ పరీక్షకు ఎంపిక అవుతారు. కామర్స్‌ మెయిన్‌ పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. మొదటిదైన పెడగోజీని 100 మార్కులకూ, రెండో పేపరు కామర్స్‌ను 200 మార్కులకూ నిర్వహిస్తారు. మెయిన్స్‌లోని రెండో పేపర్‌ అయిన కామర్స్‌కు ఏడు విభాగాల సిలబస్‌ను నిర్దేశించారు. ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు చొప్పున మొత్తం 200 ప్రశ్నలు ఇస్తారు. అంటే ప్రతి విభాగం నుంచీ 25 - 30 వరకు ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. మొత్తం సిలబస్‌ను సమగ్రంగా చదివితే మంచి మార్కులు పొందవచ్చు. మెయిన్‌ పరీక్ష ఆబ్జెక్టివ్‌ తరహాలో ఆంగ్ల మాధ్యమంలోనే ఉంటుంది. అందుకని ఆంగ్ల మాధ్యమంలోని ప్రామాణిక పుస్తకాలను చదవడం మేలు.

1. ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌: జేఎల్‌ కామర్స్‌ విభాగాల్లో ముఖ్యమైనవాటిలో ఇదొకటి. ముఖ్యమైన అంశాలను కాన్సెప్టులతో పాటు సూత్రాలను శ్రద్ధగా చదవాలి. వీటి నుంచి చిన్న చిన్న ప్రాబ్లెమ్స్‌ను అడిగే అవకాశం ఉంది. వాటిని సాధన చేస్తూ చదవాలి. సూత్రాలను గుర్తుపెట్టుకోవాలి.
2. ఫైనాన్షియల్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ అకౌంటింగ్‌: వివిధ అంశాలను లోతుగా, విశ్లేషిస్తూ చదవాలి. వీటి మూలసూత్రాలను గుర్తుంచుకోవాలి. సాధ్యమైనన్ని ప్రాబ్లెమ్స్‌ని సాధన చేయాలి.
3. కాస్ట్‌ అకౌంటింగ్‌- కంట్రోల్‌: కాస్ట్‌ కాన్సెప్టులూ, కాస్ట్‌ క్లాసిఫికేషన్‌, ఎలిమెంట్స్‌ ఆఫ్‌ కాస్ట్స్‌ను వాటి భావనలతోపాటు ప్రాబ్లెమ్స్‌ను సాధన చేయాలి. సూత్రాలనూ, వివిధ కాస్టింగ్‌ పద్ధతులు, టెక్నిక్‌లు, వాటిని పాటించే సంస్థలనూ తెలుసుకోవాలి. చిన్న చిన్న ప్రాబ్లెమ్స్‌ను సాధన చేస్తూ చదవాలి.
4. మేనేజిరియల్‌ ఎకనామిక్స్‌: దీనిలో తక్కువ అంశాలను చేర్చారు. ప్ర¾తి సిద్ధాంతాన్నీ పటం సహాయంతో అధ్యయనం చేస్తే సులభంగా గుర్తుండే అవకాశం ఉంటుంది. సిద్ధాంతాలు, కారకాలు, పటాలు, సమీకరణాలు గుర్తుండేలా విశ్లేషిస్తూ చదవాలి.
5. ఆర్గనైజేషన్‌ థియరీ - బిహేవియర్‌: వివిధ థియరీలు, వాటిని ప్రవేశపెట్టిన నిర్వహణ శాస్త్రవేత్తలు, వారి గ్రంథాలు, సం॥రాలను గుర్తు పెట్టుకోవాలి. అతి ముఖ్యమైన పాయింట్లను పేపర్‌పై నోట్‌ చేసుకోవాలి. దీనివల్ల అతి తక్కువ సమయంలో పునశ్చరణకు వీలు ఉంటుంది.
6. మార్కెటింగ్‌ మేనేజ్‌మెంట్‌: కాన్సెప్ట్‌ ఆధారిత ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రొడక్ట్‌, ప్రైౖస్‌, ప్రమోషన్‌, ప్లేస్‌ల గురించి లోతుగా, వర్తమాన అంశాలతో కలిపి చదివితే మంచి మార్కులు పొందవచ్చు.
7. క్వాంటిటేటివ్‌ టెక్నిక్స్‌: దీనిలో డిగ్రీ స్థాయిలోని అంశాలను చేర్చారు. వివిధ భావనలు, పద్ధతులు, వాటి సూత్రాలు, ప్రాబ్లమ్స్‌ సాధన చేస్తూ చదవాలి. అన్ని సూత్రాలను ఒక పేపర్‌పై నోట్‌ చేసుకొని సమయం దొరికినప్పుడల్లా వాటిని చదవడం ద్వారా గుర్తుపెట్టుకోవచ్చు. పై సిలబస్‌ను డిగ్రీ స్థాయితోపాటు పీజీ స్థాయిలో సిద్ధమవ్వాలి. చదివేటప్పుడు అతి ముఖ్యమైన భావనలు, సిద్ధాంతాలు, సమీకరణాలు, సూత్రాలు, వివిధ సం॥రాలు, సిద్ధాంతకర్తల పేర్లు క్లుప్తంగా నోట్‌ చేసుకుంటూ చదవాలి. దీనివల్ల పరీక్షకు ముందు తక్కువ సమయంలో అన్ని అంశాల పునశ్చరణకు వీలుంటుంది.
 

డిగ్రీ లెక్చరర్స్‌ సిలబస్‌, సన్నద్ధత
ప్రిలిమినరీ మార్కుల ఆధారంగా మెయిన్‌ పరీక్షకు ఎంపిక అవుతారు. మెయిన్‌ పరీక్షలో వీరికి ఒకే పేపరు ఉంటుంది. దీనిలో 150 ప్రశ్నలు. రెండేసి మార్కుల చొప్పున 300 మార్కులు. మెయిన్‌ పరీక్షలో ఒకే పేపరును నిర్దేశించడం వల్ల పూర్తిగా మెయిన్‌ సిలబస్‌పైనే దృష్టి పెట్టి చదవవచ్చు. కామర్స్‌ డిగ్రీ లెక్చరర్‌ మెయిన్‌ పరీక్ష సిలబస్‌లో 10 విభాగాలను నిర్దేశించారు. వీటి నుంచి మొత్తం 150 ప్రశ్నలు వస్తాయి. ఒక్కోదాని నుంచి దాదాపు 15 ప్రశ్నలు.
1. ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌
2. ఫైనాన్షియల్‌, మేనేజ్‌మెంట్‌ అకౌంటింగ్‌
3. కాస్ట్‌ అకౌంటింగ్‌- కంట్రోల్‌
4. మేనేజీరియల్‌ ఎకనామిక్స్‌
5. ఆర్గనైజేషన్‌ థియరీ- బిహేవియర్‌
6. మార్కెటింగ్‌ మేనేజ్‌మెంట్‌
పైన తెలిపిన 6 సబ్జెక్టులకు సంబంధించిన ఒకేరకమైన సిలబస్‌ను కామర్స్‌ జేఎల్‌ పోస్టులకూ, డిగ్రీ లెక్చరర్‌ పోస్టులకూ నిర్దేశించారు. కాబట్టి అభ్యర్థులు జేఎల్‌కు నిర్దేశించిన సిలబస్‌, సన్నద్ధత మెలకువలను గమనించగలరు. మిగతా నాలుగు సబ్జెక్టుల సిలబస్‌, పఠన వ్యూహాలను ఇప్పుడు చూద్దాం.
7. హ్యుమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌: వివిధ భావనలు, సంవత్సరాలు, చట్టాలను, వర్తమాన అంశాలలో మిళితం చేస్తూ చదవాలి. ఈ మధ్య కాలంలో వచ్చిన మార్పులను కూడా పరిగణనలోకి తీసుకోవాలి.
8. బిజినెస్‌ ఎన్విరాన్‌మెంట్‌: దీనిలో వివిధ చట్టాలు, వాటి సంవత్సరాలు, TSIPASS ల గురించి, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులలో ఈ మధ్య కాలంలో వచ్చిన మార్పులు, వాటి ధోరణులను విశ్లేషిస్తూ చదవాలి. ముఖ్యమైనవి నోట్‌ చేసుకోవాలి.
9. క్వాంటిటేటివ్‌ టెక్నిక్స్‌: వీటిలో వివిధ భావనలు, సూత్రాలను లోతుగా అధ్యయనం చేయాలి. చిన్న సమస్యల సాధన పట్ల పట్టు సాధించాలి.
10. ఐటీ అండ్‌ ఇ-కామర్స్‌: ప్రస్తుతం ఇ-కామర్స్‌లో, ఐటీలో వస్తున్న మార్పులు, నూతన విధానాలను, నగదురహిత విధానాలను ప్రోత్సహించే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన వివిధ పథకాలను వర్తమాన అంశాలతో జోడిస్తూచదవాలి. ఆ విధంగా మంచి మార్కులు పొందవచ్చు.
వివిధ సబ్జెక్టులకు సంబంధించిన అంశాలను చదువుతున్నప్పుడు ముఖ్యమైన భావనలు, సూత్రాలు, సమీకరణాలు, సిద్ధాంతకర్తల పేర్లు, వారు రాసిన గ్రంథాల పేర్లు, వర్తమాన అంశాలను విడిగా నోట్‌ చేసుకోవాలి. వీటిని పరీక్షకు ముందు ఒకటి, రెండు సార్లు పునశ్చరణ చేసుకోవాలి. దీంతో ముఖ్యమైన అంశాలపై పట్టు లభించి మార్కుల సాధన.. ఆపై ఉద్యోగ సాధన సులభమవుతుంది. ప్రామాణిక పుస్తకాలను శ్రద్ధగా చదవటం అవసరం. ఆశావహ దృక్పథంతో సమయం సద్వినియోగం చేసుకుంటూ శ్రమించాలి. తగిన సాధన చేస్తేనే విజయం సాధ్యమవుతుంది.

Posted Date : 24-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌