• facebook
  • whatsapp
  • telegram

సన్నద్ధతలో సవాళ్లేమిటి? 

ఆర్థిక సర్వే.. బడ్జెట్‌

 

 

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక సర్వే, బడ్జెట్‌లు కేవలం పాలకులూ, ఆర్థిక నిపుణులకే కాదు.. పోటీ పరీక్షలకు సిద్ధపడుతున్న ప్రతి అభ్యర్థికీ కీలకమైనవే! యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్, స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్, రాష్ట్ర సర్వీస్‌ కమిషన్లు నిర్వహించే పరీక్షల్లోనూ; సబ్‌ ఇన్‌స్పెక్టర్, బ్యాంక్‌ పీఓ మొదలైన పరీక్షలన్నిటిలోనూ ఆర్థిక సర్వే, బడ్జెట్‌ల నుంచి ప్రశ్నలు వస్తుంటాయి. ఈ ప్రశ్నల ధోరణి ఎలా ఉంటుంది? సన్నద్ధతలో గణాంకాలకు ఏమేరకు ప్రాధాన్యం ఇవ్వాలి? తెలుసుకుందాం! 

 

ఆర్థిక సర్వే అనగానే వివిధ రకాలైన స్థూల ఆర్థిక (మాక్రో ఎకనామిక్స్‌) గణాంకాలను గుర్తుంచుకోవాలని చాలామంది అభ్యర్థులు భావిస్తుంటారు. దాదాపు 50 శాతం ప్రశ్నలను స్థూల ఆర్థిక అంశాల నుంచి ఆబ్జెక్టివ్‌ కోణంలో అడగటం జరుగుతూ వస్తోంది. 

సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ లాంటి రాతపరీక్షల్లో 1-2 ప్రశ్నలు- 

బ్యాంకు పీఓ పరీక్షల కరెంట్‌ విభాగంలో 4, 5 ప్రశ్నలు- 

రాష్ట్ర సర్వీస్‌ కమిషన్‌ జనరల్‌ స్టడీస్‌ విభాగంలో 2-3 ప్రశ్నలు- 

తెలుగు రాష్ట్రాల సర్వీస్‌ కమిషన్ల గ్రూప్‌- 2 పరీక్షల్లో 5 నుంచి 20 ప్రశ్నలు వస్తున్నాయి.

గ్రూప్‌-1, సివిల్‌ సర్వీస్‌ పరీక్షల ప్రిలిమినరీలో 3-4 ప్రశ్నలు అడుగుతున్నా మెయిన్స్‌లో ఎకనామిక్‌ సర్వే, బడ్జెట్లు ప్రధాన పాత్ర పోషిస్తాయి. 

ఎకనామిక్‌ సర్వే, బడ్జెట్‌లపై పట్టు పెంచుకుంటే గ్రూప్‌- 1 మెయిన్స్‌ ఎకానమీలో 20 మార్కుల వరకు ప్రభావవంతంగా సమాధానాలు రాయవచ్చు. 

ఎకానమీ విభాగంలో అడిగే మిగతా ప్రశ్నల్లో కూడా సందర్భోచితంగా సర్వే, బడ్జెట్‌ అంశాలను ఆధారాలుగా వివరించాల్సి ఉంటుంది. 

సాధారణ వ్యాసంలో కూడా నేరుగా కొన్ని సందర్భాల్లో బడ్జెట్‌తో ముడిపడిన ప్రశ్నలు రావచ్చు. ఒకవేళ అలా రాకపోయినా వ్యాస రచనల్లో ఎన్నో సందర్భాల్లో, ఆర్థిక సంబంధిత సమస్యలు, విషయాలు, కారణాల గురించి రాయాల్సిన సందర్భంలో సర్వే, బడ్జెట్‌ల అంశాలను తప్పనిసరిగా వినియోగించుకోవాల్సివుంటుంది.

 

ప్రశ్నల ధోరణిలో మార్పు ఏమైనా వచ్చిందా?

ఐదారు సంవత్సరాల క్రితం వరకు పోటీపరీక్షల్లో ప్రధానంగా గణాంక సంబంధిత ప్రశ్నలు అడిగేవారు. అదీ ప్రధానంగా మాక్రో ఎకనామిక్స్‌ పైనే దృష్టి పెట్టేవారు. కొద్ది కాలంగా బడ్జెట్‌ అంశాలకు సంబంధించిన కారణ- ఫలిత సంబంధాలపై అధికంగా ప్రశ్నిస్తున్నారు. ఆర్థిక మంత్రి ‘ఈ కారణం చేత ఇలా జరిగింది’ అని బడ్జెట్‌ ప్రసంగంలో వివరించేవాటిపై ఎగ్జామినర్‌ దృష్టి పెడుతున్నారు. అదేవిధంగా బడ్జెట్లో వివిధ సందర్భాల్లో వాడుతున్న కొత్త, పాత పదాలను కూడా ప్రశ్నల రూపంలోకి మారుస్తున్నారు. ఉదాహరణకు... బ్యాడ్‌ బ్యాంక్, ్య-i‘్న౯- సంస్థలు, ఆపరేషన్‌ గ్రీన్‌ స్కీం, గిగ్‌ కార్మికులు, మెట్రో నియో, మిషన్‌ పోషణ్‌ 2.0, న్యూమోకొకల్‌ వ్యాక్సిన్‌ లాంటి పదాలు తాజా బడ్జెట్లో కనిపిస్తున్నాయి. వీటిపై అవగాహన పెంచుకోవాలి. ప్రభుత్వ పథకాలు, కేటాయింపులు, వైఫల్యాలు, సాఫల్యాలు- ఎప్పటి మాదిరిగానే ప్రశ్నల రూపంలో వస్తున్నాయి.
తాజాగా కేంద్ర బడ్జెట్‌లో బడ్జెట్‌ ఆరు పునాదుల్ని పేర్కొంటూ కొత్త రూపంలో వివిధ ఆర్థిక విషయాలను సమర్పించారు. ఆ ధోరణిని పరిశీలించాలి. ‘కొత్త సీసాలో పాత సారా’నే అయినప్పటికీ ప్రభుత్వ ఆలోచన విధానాన్ని అర్థం చేసుకోవటం ద్వారా గ్రూపు 1, సివిల్స్‌ మెయిన్స్‌ పరీక్షల్లో ఆ తరహా 10 మార్కుల ప్రశ్నలకు జవాబిచ్చే అవకాశం ఉంటుంది.

 

గణాంకాలపై ఏ స్థాయిలో దృష్టి పెట్టాలి?

ఎకనామిక్‌ సర్వే, బడ్జెట్‌ అనగానే పోటీ పరీక్షల అభ్యర్థులు గణాంకాలని మాత్రమే ఎక్కువ సందర్భాల్లో భావిస్తుంటారు. కొత్తగా ఈ రంగంలోకి ప్రవేశించిన అభ్యర్థులైతే పూర్తిస్థాయిలో గణాంకాలనే గుర్తించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది సరైన విధానం కాదు. ప్రధానంగా మాక్రో ఎకనామిక్స్‌ సంబంధిత గణాంకాలపై దృష్టి పెట్టి పథకాలకు కేటాయింపులు, కొత్త అంశాల గణాంకాల వరకు పరిమితమయితే సరిపోతుంది. అంతకు మించి లోతుకు వెళ్ళి ప్రశ్నలడిగితే అందరి అభ్యర్థులతో పాటు మీకు కూడా క్లిష్టత కాబట్టి దాని వల్ల పెద్ద నష్టం ఉండదు.

 

900 పేజీలకు పైగా ఉండే ఆర్థిక సర్వేనూ, బడ్జెట్‌నూ ఎలా చదవాలి?

పోటీ పరీక్ష అభ్యర్థులు ఎదుర్కొనే ప్రధాన సవాలు ఇదే. ఎక్కడ మొదలు పెట్టాలి? ఎక్కడ ముగించాలి? దేనికి ప్రాధాన్యం ఇవ్వాలి అనే విషయంలో నిర్ధారించుకోలేక సహజంగానే ఇబ్బంది పడుతూ ఉంటారు. విశ్వసనీయమైన వ్యక్తులో, ప్రచురణ సంస్థలో  ఆర్థిక సర్వే, బడ్జెట్‌ విషయాలను క్లుప్లీకరించి ప్రచురించిన పుస్తకాలుంటే వాటి మీద ఆధారపడవచ్చు. లేకపోతే అభ్యర్థులు తమ సిలబస్‌లోని అంశాలను దగ్గర పెట్టుకుని వాటికి సంబంధించిన సర్వే, బడ్జెట్‌ విభాగాల్ని గ్రహించి నోట్సు తయారు చేసుకునే పద్ధతిని అనుసరించవచ్చు. 1, 2 ప్రశ్నలు మాత్రమే వస్తాయనుకునే పరీక్షల్లో వీలైనంతవరకు మాక్రో ఎకనామిక్స్‌పై దృష్టి పెడితే దాదాపుగా సరిపోతుంది. ఆయా పరీక్షలకు సంబంధించిన గత ప్రశ్నపత్రాలను చూడటం ద్వారా ఏ తరహా ప్రశ్నలు వస్తున్నాయో గ్రహించవచ్చు. 

 

ఎన్నేళ్ల బడ్జెట్లు, సర్వేలు చదవాలి?

ఈ సంవత్సరంలో జరిగే పోటీ పరీక్షలకు 2021-22, 2020-21 బడ్జెట్లను, 2020-21, 2019-20 సర్వేలను చదివితే మంచిది. అయితే గత అనుభవాలు పరిశీలించినప్పుడు 70 నుంచి 80 శాతం ప్రశ్నలు ప్రస్తుత సంవత్సరంలో విడుదలైన బడ్జెట్టు, సర్వేలపైనే  వచ్చాయి. పేపరు తయారీదారులు ఏదైనా ప్రభుత్వ అధికార పత్రికనో, తెలుగు అకాడమీ పుస్తకాలనో ప్రామాణికంగా తీసుకున్నప్పుడు మాత్రమే పాత సమాచారంపై ప్రశ్నలు వస్తున్నాయి.

 

తెలుగులో అధీకృత సమాచారం లేదు. మరెలా?

తెలుగు భాషలో పోటీపరీక్షలకు తయారవుతున్న అభ్యర్థులు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్య ఇది. రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్‌ ప్రసంగాన్ని తెలుగులో ఇస్తున్నాయి కానీ ఎకనామిక్‌ సర్వేని తెలుగులో ఇవ్వటం లేదు. కేంద్ర బడ్జెట్‌ ఆంగ్లం, హిందీలో మాత్రమే లభిస్తుంది. అందువల్ల బడ్జెట్‌ సన్నద్ధత కోసం అభ్యర్థులు విశ్వసనీయత కలిగిన ప్రైవేటు ప్రచురణలపై దృష్టి నిలపడం మంచిది. ఇటీవల న్యూ ఇండియా సమాచారం, యోజన, ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో కొంతవరకు ఈ బడ్జెట్‌ సంబంధిత విషయాలను తెలుగులో అందిస్తున్నాయి. వాటిని ఉపయోగించుకోవచ్చు. ప్రముఖ తెలుగు దిన పత్రికలు ఇస్తున్న సమాచారాన్ని కూడా సరైన పద్ధతిలో క్రోడీకరించి వినియోగించుకోవచ్చు.

 

గణాంకాల క్లిష్టత..?

రంగాల వారీ కేటాయింపులో ఖాతాలు, సవరించిన అంచనాలు, అంచనాలు అని మూడు ఆర్థిక సంవత్సరాల గణాంకాలను ఇస్తారు. ఈ మూడింటి మధ్య భేదాన్ని అర్థం చేసుకోవాలి. ఎగ్జామినర్‌ ఈ మూడు రకాల గణాంకాలపై  ప్రశ్నలు అడిగే అవకాశం ఎప్పుడూ ఉంటుంది. అయితే ప్రభుత్వం వివిధ డిమాండ్ల కింద కేటాయించే అన్నింటినీ గుర్తు పెట్టుకోకుండా మీ సిలబస్‌లో ఏఏ అంశాలుంటాయో వాటి వరకు మాత్రమే ఈ గణాంకాలను గుర్తు పెట్టుకోవాలి. ఇలా మెదడుపై భారాన్ని తగ్గించుకోవచ్చు. . ప్రధానంగా వ్యవసాయం, పారిశ్రామిక రంగం, విద్య, వైద్యం, కొత్త గ్రామీణాభివృద్ధి పథకాలు, ఆర్థిక పునర్నిర్మాణ ఆలోచనలకు సంబంధించిన మూడు రకాలైన గణాంకాలకూ పరిమితమైతే మంచిది.

 

బడ్జెట్లో వివిధ సందర్భాల్లో వాడుతున్న కొత్త, పాత పదజాలాన్ని ప్రశ్నల రూపంలోకి మారుస్తున్నారు. ఉదాహరణకు తాజా బడ్జెట్‌లో కనిపించిన పదాలు- బ్యాడ్‌ బ్యాంక్, unicorn సంస్థలు, ఆపరేషన్‌ గ్రీన్‌ స్కీం, గిగ్‌ కార్మికులు, మెట్రో నియో, మిషన్‌ పోషణ్‌ 2.0, న్యూమోకొకల్‌ వ్యాక్సిన్‌. వీటిపై అవగాహన పెంచుకోవాలి.

Posted Date : 08-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌