• facebook
  • whatsapp
  • telegram

కొలువుల మేలుకొలుపు!

గ్రూప్స్‌, డీఎస్‌సీ, వీఆర్‌ఓ, వీఆర్‌ఏ మొదలైన పోస్టులే కాకుండా ఇంజినీరింగ్‌, శాంతి భద్రతలు, మానవ వనరుల శాఖల నుంచి వెలువడే  అన్ని పోస్టుల‌కు అభ్య‌ర్థులు త‌గిన సాధ‌న చేయాలి. ఆశలను నెరవేర్చుకునే క్రమంలో ఆచరణ ఉండాలి. వెలువడిన ప్రతి నోటిఫికేషన్‌కూ స్పందించాల్సిన అవసరం లేదు. మొదట అభిరుచికి ప్రాధాన్యమిచ్చి ఏయే ఉద్యోగాలను సంతోషంగా నిర్వహించగలరో అభ్యర్థి నిర్ణయించుకోవాలి. అందుకు తగిన అర్హతలు తనకు ఉన్నాయో లేదో అని నిర్ణయించుకోవడం తదుపరి చర్య. ఖాళీల సంఖ్య, లభ్యమయ్యే సమయం తరువాత పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలు. వీటన్నిటినీ పరిగణించిన తరువాత ఒకటి, రెండు నోటిఫికేషన్లను లక్ష్యంగా ఎంచుకోవాలి. సిలబస్‌ పరిశీలన, పాత ప్రశ్నపత్రాల అధ్యయనం తరువాతి చర్యలు. సిలబస్‌లోని అనుకూల, ప్రతికూల అంశాలపై దృష్టిపెట్టి ఒక అంచనాకి రావడం...ఆపై చేయాల్సినవి. లభిస్తున్న సమయంలో సిలబస్‌పై పట్టు సాధించగలరా అనేది మరో కీలక నిర్ణయాత్మక అంశం. ఎదురయ్యే సవాళ్లను అంచనా వేయడం లక్ష్యాన్ని చేరుకోవడానికి ఇంకో ముఖ్యాంశం. మెటీరియల్‌, ఆర్థిక మద్దతు, ఆరోగ్యం, లభించే సమయం లాంటి సవాళ్లపై స్పష్టమైన అవగాహన ఉంటే లక్ష్యాన్ని సాధించడంలో మరో అడుగు పడినట్లే.
 

లోపాలు గుర్తించాలి
ఇప్పటికే 2 - 3 ప్రయత్నాలు చేసి విఫలమైనవారు సమీక్షించుకోవల్సిన సమయమిది. ‘లోపాలను గుర్తించడం’ అనే ప్రక్రియతో సన్నద్ధతను ప్రారంభించాలి.
సామర్థ్యానికి తగిన ఉద్యోగాలను ఎంపిక చేసుకోకపోవడం
సరైన గైడెన్స్‌ లేకపోవడం
చదివిన మెటీరియల్‌లో లోపాలు
విపరీతమైన పోటీ ఉంటుందని పునాదులు లేని అభ్యసనం చేయడం
అకడమిక్‌ ధోరణులనే పోటీపరీక్షల్లో అనుసరించడం
సాటి అభ్యర్థుల ప్రభావంతో సరికాని మార్గాల్లో అభ్యసించడం లాంటి లోపాలు ఉండవచ్చు. వీటన్నింటినీ సమీక్షించుకుని శక్తులను సమర్థంగా పునర్వినియోగించే ప్రణాళిక రూపకల్పన జరగాలి.
అభ్యర్థుల అనుభవాలనుబట్టి గ్రూప్‌ పరీక్షల్లో తరచూ చేసే తప్పిదాలు..
 

గ్రూప్‌-1
రాత అభ్యాసానికి ప్రాధాన్యం ఇవ్వకపోవడం.
భావవ్యక్తీకరణ పద్ధతులను సరిగా అనుసరించకపోవడం.
పాఠ్యగ్రంథాల్లో ఉండే సమాచారాన్ని యథాతథంగా ఉపయోగించడం.
కొన్ని సబ్జెక్టులకు అధిక ప్రాధాన్యమిచ్చి, ఎక్కువ సమయాన్ని కేటాయించి మిగతావాటిని నిర్లక్ష్యం చేయడం.
పాఠాలు, ప్రశ్నలను సరైన రీతిలో ఎంపిక చేసుకోకపోవడం.
కోచింగ్‌ సెంటర్ల ప్రభావం వల్ల మూసధోరణిలో సమాధానాలను ఇవ్వడం.
 

గ్రూప్‌-2
బిట్స్‌ రూపంలో చదవడం
అవగాహన, విశ్లేషణలకు తక్కువ సమయం కేటాయించడం.
ఒకటి, రెండు పుస్తకాలను ప్రామాణికంగా భావించి గుడ్డిగా అనుసరించడం.
గణాంకాలకు అధిక ప్రాధాన్యమివ్వడం.
ఎకానమీ సబ్జెక్టుకు ఎక్కువ సమయం కేటాయించడం.
జనరల్‌ స్టడీస్‌ను పైపైన చదవడం.
సోషల్‌ మీడియా ప్రభావంతో ఒకే గాటిన చదవడంతోపాటు సమయాన్ని వృథా చేసుకోవడం.
మార్కెట్‌లో అసంఖ్యాకంగా పుస్తకాలు లభ్యమవుతుండటంతో ఏది ప్రామాణికమో నిర్ణయించుకోలేకపోవడం.
 

పెరిగే అసహనం!
గ్రూప్స్‌లాంటి పరీక్షల్లో అభ్యర్థుల మూర్తిమత్వ లక్షణాలు కూడా కీలకపాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా అభ్యర్థుల్లో ‘సహనం’ చాలా ప్రధానం. రకరకాల సబ్జెక్టులు చదవాల్సి రావడంతో అసహనం పెరుగుతూ ఉంటుంది. ఇష్టమున్నా లేకపోయినా అన్నిరకాల సబ్జెక్టులూ చదవాల్సిందే. ఒకరకంగా అభ్యర్థులకు ఇది సవాలే. అలా అని సబ్జెక్టులు చదివే క్రమంలో అర్థం కాని విషయాలు తీవ్ర అసహనానికి కారణం కావచ్చు. అందువల్ల సహనాన్ని పెంచుకోవాల్సిన అవసరం చాలా ఉంది. గంటల తరబడి చదవాల్సి రావడం, పైగా మొదటి ప్రయత్నంలో చాలా సందేహాలుండటం వల్ల తీవ్ర ఒత్తిడికి గురై ‘నిరాశ’ ఏర్పడుతుంది. నిరాశ వల్ల పోటీపరీక్షల పరుగులో దాదాపు 70-80% మంది మొదటి రెండు నెలల్లోనే వైదొలుగుతారు. అలాంటి పరిస్థితి ఏర్పడకూడదనుకుంటే ఎప్పటికప్పుడు స్వీయప్రేరణతో నిరాశను దగ్గరికి రానీయకుండా ఆశావహ దృక్పథంతో ఉండటం మరో తప్పనిసరి లక్షణం. సానుకూల ఫలితాలనిచ్చే పరిసరాలను ఏర్పాటు చేసుకోవడం కూడా తప్పనిసరి. పోటీపడే ఇతర సహచర అభ్యర్థులు కూడా ఇలాంటి ఆశావహ ధోరణిని కలిగివుంటే అది అందరికీ మేలు చేస్తుంది. ఎప్పటికప్పుడు పరిస్థితులను వాస్తవ విశ్లేషణ చేసుకుంటూ తగిన మద్దతు ఇవ్వగలిగిన పోటీదార్లను పక్కన చేర్చుకోవడం కూడా అనుకూల ఫలితానికి తోడ్పడుతుంది. సోషల్‌ మీడియా అందుబాటులోకి వచ్చాక అభ్యర్థులు ఎలాంటి ఒత్తిడులకూ, మానసిక రుగ్మతలకూ గురవుతున్నారో మొన్నటి ఏపీపీఎస్‌సీ గ్రూప్‌-2 పరీక్ష ఘటనలు తెలియజేస్తున్నాయి. పరీక్షల వాయిదా, లీక్‌లు.. ఇలాంటి సమాచారం క్షణక్షణం అభ్యర్థులను కుంగదీశాయి. ‘ఏకాగ్రత’ లోపించి సరిగా చదవలేకపోయారు. మానసికంగా కుంగిపోయారు. ఇలాంటి పరిస్థితుల నుంచి బయటపడేందుకు సానుకూల పరిసరాల ఏర్పాటు; సమయం సద్వినియోగమయ్యేలా సబ్జెక్టుల అధ్యయనం అనివార్యం.
లక్ష్యాన్ని నిర్దేశించుకోవడంలో రెండు పద్ధతులు
 

1. పెద్ద లక్ష్యాన్ని ఎంచుకోవడం, సాధించడం
ఉదాహరణకు- ఒక అభ్యర్థి డిప్యూటీ కలెక్టర్‌, డిప్యూటీ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ కావాలి అనుకోవడం. లక్ష్యం పెద్దదైనప్పుడు శ్రమ అధికం, సవాళ్లు కూడా అధికమే. లక్ష్యం చేరలేకపోతే ఎదురయ్యే ప్రతికూలతలు కూడా తీవ్రంగానే ఉంటాయి. అయితే సరైన ప్రణాళిక, శక్తియుక్తులను సరిగా వినియోగించడం చేస్తే గ్రూప్ ‌- 1 స్థాయి ఉద్యోగాలను మొదటి ప్రయత్నంలో సాధించడం కూడా కష్టమేమీ కాదు.
 

2. చిన్న లక్ష్యంతో ప్రారంభం - పెద్ద ఫలితం
నిరుద్యోగులకు ముందుగా ఒక ఉద్యోగం అవసరం. ఆర్థిక సమస్యలు కూడా ఉంటే చిన్నదో, పెద్దదో ఒక ఉద్యోగం మరీ అవసరం. ఇలాంటి పరిస్థితులు ఉన్నవారు ముందుగా తేలికగా ఏ ఉద్యోగం చేయవచ్చో కచ్చితంగా నిర్ణయించుకుని ముందస్తుగా దాన్ని సాధించిన తరువాత గ్రూప్ ‌- 2, 1 ఉద్యోగాలపై దృష్టిని సారించాలి. ఉదాహరణకు- ముందుగా టీచర్‌/ పంచాయతీ కార్యదర్శి, గ్రూప్‌ - 4 ఉద్యోగాలకు పోటీపడి క్రమంగా ఎదుగుతూ ఉండటం. కానీ నోటిఫికేషన్లు క్రమం తప్పకుండా వెలువడే పరిస్థితి లేకపోవడం ఈ వ్యూహానికి ప్రతికూలమని చెప్పవచ్చు.

Posted Date : 26-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌