• facebook
  • whatsapp
  • telegram

జీఎస్‌పై పట్టు గెలుపు మెట్టు!

 

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌  నిర్వ‌హించే అన్ని ప‌రీక్ష‌ల్లో జనరల్‌ స్టడీస్‌ కీలకమైంది.  సిలబస్‌ విస్తృతంగా ఉంటుంది. పోటీలో ఈ పేపర్‌ నిర్ణయాత్మకంగా మారే అవకాశం ఉంది. అందుకే జీఎస్‌ పేపర్‌పై సరైన అవగాహనతో వ్యూహాత్మకంగా ప్రిపేర్‌ కావాలి.

 

విస్తృత సిలబస్‌.. పరిమిత సమయం

జీఎస్‌ సిలబస్‌ చాలా విస్తృతం. దాన్ని 90 రోజుల్లో పటిష్ఠంగా అధ్యయనం చేయాలి. సంపూర్ణంగా చదవాలంటే సమయం సరిపోదు. అందుకే పరీక్షా పద్ధతిని సమగ్రంగా తెలుసుకోవాలి. ఏం చదవాలి? ఎలా చదవాలి? అనే అంశాలపై పోటీ పరీక్షార్థులకు అవగాహన వస్తే సరైన ప్రణాళికను సిద్ధం చేసుకోవచ్చు.

 

వర్తమాన విషయాలు

ఈ విభాగం నుంచి 15 - 20 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. వీటిలో వర్తమాన ఆర్థికాంశాలు, వర్తమాన రాజకీయ అంశాలు కూడా ఉంటాయి. సాధారణంగా పరీక్ష తేదీకి ముందు ఒక సంవత్సరకాలంలో జరిగిన సంఘటనల నుంచి ప్రశ్నలు వస్తాయి. సగానికంటే ఎక్కువ ప్రశ్నలు పరీక్షతేదీకి మూడు/నాలుగు నెలలకు ముందు జరిగిన అంశాల నుంచే ఉంటాయి. ఉదాహరణకు మీ పరీక్ష 2018 అక్టోబర్‌లో జరిగితే - 2017 అక్టోబర్‌ నుంచి వర్తమాన విషయాలు చదవాలి. అదేవిధంగా ఇతర అంశాలను అధ్యయనం చేయాలి. ప్రాంతీయ, జాతీయ వర్తమాన విషయాల కోసం వార్తా పత్రికలను చదవటం దినచర్యలో భాగం చేసుకోవాలి. ప్రత్యేకంగా నోట్సు రాసుకోవాలి. రోజువారీ టీవీ వార్తలను చూడాలి. ముఖ్యమైన సంఘటనలపై వార్తాపత్రికలను చదవాలి.

 

జనరల్‌ సైన్స్‌

దీని నుంచి దాదాపు 10 - 15 ప్రశ్నలు రావచ్చు. ఎన్‌సీఈఆర్‌టీ ప్రచురణలు, రాష్ట్ర ప్రభుత్వ పాఠశాల ప్రచురణలు, 8, 9, 10 తరగతుల్లోని భౌతిక, రసాయన, జీవశాస్త్రాలకు సంబంధించి నిత్య జీవిత వినియోగాలను చదివితే సరిపోతుంది.

 

పర్యావరణ సమస్యలు - విపత్తు నిర్వహణ

ఇటీవల ఈ విభాగానికి ప్రాధాన్యం పెరిగింది. ముఖ్యంగా కాలుష్యం, అడవుల విధ్వంసం- భూతాపం - హరిత గృహ వాయువులు - కరవులు - వరదలు - చక్రవాకాలు - సునామీలు - భూకంపాలు - అగ్నిపర్వతాల విస్ఫోటం - మానవ కారణమైన భారీ ప్రమాదాలు మొదలైనవి. విపత్తు నిర్వహణ చట్టంలోని అంశాలను, జాతీయ, రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ స్థాయిలో విపత్తు నిర్వహణ యంత్రాంగం, పనితీరు, విపత్తులపై ప్రజల అవగాహన మొదలైనవి చదువుతూ ఇటీవలి విపత్తులపై దృష్టి సారించాలి.

 

భారతదేశ, తెలంగాణ రాష్ట్ర భౌగోళికాంశాలు

భౌగోళిక ఉనికి - శీతోష్ణస్థితి - నేలలు లేదా మృత్తికలు, ముఖ్యమైన నదులు, ఉపనదులు, అడవులు- వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు, జాతీయ పార్కులు, వ్యవసాయ పంటలు, నీటి పారుదల ప్రాజెక్టులు, ఖనిజాలు, పరిశ్రమలు- రవాణా సౌకర్యాలు, ముఖ్యంగా జనాభాకు సంబంధించిన అంశాలను చదవాలి. 8, 9, 10 తరగతుల పాఠ్యపుస్తకాలతోపాటు తెలుగు అకాడమీ పోటీ¨పరీక్షల కోసం ఇటీవల ప్రచురించిన భారతదేశ, తెలంగాణ భౌగోళిక శాస్త్ర పుస్తకాలను అధ్యయనం చేయాలి. కొత్త జిల్లాల సమాచారాన్ని జిల్లాలవారీగా ప్రదేశాలు, ప్రాజెక్టులు, ఖనిజ వనరులపై దృష్టిసారించాలి.

 

భారతదేశ, తెలంగాణ ఆర్థిక వ్యవస్థ

జాతీయ ఆదాయ భావనలను, పేదరిక సమస్యలను, వాటి నిర్మూలన పథకాలను, నిరుద్యోగ నిర్మూలన పథకాలను, వివిధ పంచవర్ష ప్రణాళికలను ముఖ్యంగా జాతీయ, రాష్ట్ర స్థాయుల్లో ఇటీవల ప్రవేశపెట్టిన, అమలుచేస్తున్న ఆర్థికాభివృద్ధి పథకాలు ముఖ్యం. పంచవర్ష ప్రణాళికలతో పాటు నీతి ఆయోగ్‌ ఏర్పాటు, నిర్వహణ, విధులను చదవాలి. ఆర్థికాంశాల్లో ఎక్కువ ప్రశ్నలు ఇటీవలి కాలానికి చెందినవే ఉంటాయి. కాబట్టి దేశ, రాష్ట్ర ఆర్థిక సర్వేలను అధ్యయనం చేసి సమగ్ర అవగాహన పెంపొందించుకోవాలి.

 

భారతదేశ రాజకీయ వ్యవస్థ, భారత రాజ్యాంగం

అత్యంత ప్రధానమైన విభాగమిది. దీని నుంచి సాధారణంగా ఎక్కువ ప్రశ్నలుంటాయి. భారత రాజ్యాంగ విశిష్ట లక్షణాలు- విభాగాలు, షెడ్యూల్స్‌ - పీఠిక - కొత్త రాష్ట్రాల ఏర్పాటు - ప్రాథమిక హక్కులు - ఆదేశ సూత్రాలు - ప్రాథమిక విధులు - కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్మాణం - అధికారాలు - విధులు - పార్లమెంట్‌ రాష్ట్ర శాసన సభలు - సుప్రీంకోర్టు - హైకోర్టులు - కేంద్ర రాష్ట్ర సంబంధాలు - పంచాయతీరాజ్‌ - నగరపాలక సంస్థలు - షెడ్యూల్డ్ కులాలు, తెగలవారి ప్రత్యేక అంశాలు- జాతీయ కమిషన్‌లు - అత్యవసర పరిస్థితి - రాజ్యాంగ సవరణలు లాంటి అంశాలను వివరణాత్మకంగా అధ్యయనం చేయాలి. ప్రశ్నలు రాజ్యాంగ స్వభావం- స్వరూపం - పనితీరుపై ఉంటాయి. ప్రామాణిక గ్రంథాలనూ, ఇటీవలి ముద్రణలను మాత్రమే అనుసరించాలి.

 

ఆధునిక భారతదేశ చరిత్ర, భారత స్వాతంత్య్రోద్యమం

ప్రాచీన, మధ్యయుగ భారతదేశ చరిత్రలను కాకుండా ఆధునిక భారతదేశ చరిత్రనూ, భారత స్వాతంత్రోద్యమాన్నీ సమగ్రంగా అధ్యయనం చేయాలి. దీని కోసం తెలుగు అకాడమీ, నేషనల్‌ బుక్‌ ట్రస్ట్‌ ప్రచురణలు ఉపయోగం. గత పోటీపరీక్షల ప్రశ్నపత్రాల సాధన అవసరం.

అభ్యర్థులందరూ పూర్తిగా దృష్టి కేంద్రీకరించాల్సిన అంశాలు- తెలంగాణ చరిత్ర, సంస్కృతి. శాతవాహనుల పూర్వయుగం నుంచి అసఫ్‌ జాహీల పాలన వరకు అంటే 1948 వరకు కూలంకషంగా చదవాలి. తెలుగు అకాడమీ ప్రచురణలతో పాటు తెలంగాణ సాహిత్య అకాడమీ ప్రచురణలు ఉపయోగం. ముఖ్యంగా శాతవాహనులు, ఇక్ష్వాకులు, విష్ణుకుండినులు, వేములవాడ చాళుక్యులు, కాకతీయులు, ముసునూరి నాయకులు, రాచకొండ, దేవరకొండ వెలమ రాజ్య చరిత్ర, ముఖ్యంగా కుతుబ్‌షాహీ వంశపాలకుల చరిత్రపై ప్రత్యేక దృష్టి సారించాలి. అసఫ్‌ జాహీల పాలనలో ముఖ్యంగా నిజాం అలీ పాలన, ఆరో, ఏడో నిజాంల పాలనా కాలం ముఖ్యం. సాలార్‌జంగ్‌ సంస్కరణలపై అవగాహన అవసరం. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, తెలంగాణ రాష్ట్ర సాధన: అత్యధిక ప్రాధాన్యం ఉన్న అంశం ‘తెలంగాణ ఉద్యమం - తెలంగాణ రాష్ట్ర సాధన’. పోటీపరీక్షలో అత్యధిక ప్రశ్నలు వచ్చే విభాగం ఇదే. సమగ్రంగా 1948 నుంచి 2014 వరకు జరిగిన వివిధ ఉద్యమ దశలను అధ్యయనం చేయాలి. ముఖ్యంగా మలి ఉద్యమ కాలాన్ని అంటే 2001 నుంచి జరిగిన సంఘటనలపై, రాష్ట్ర విభజన, పార్లమెంటు ప్రక్రియ, వివిధ కమిటీలు, వివిధ ఉద్యమాలు అంటే మిలియన్‌ మార్చ్‌, సాగర హారం, సకలజనుల సమ్మె లాంటి వాటిపై దృష్టి అవసరం.

 

తెలంగాణ సమాజం, సంస్కృతి, వారసత్వం, కళలు, సాహిత్యం

తెలంగాణకు సంబంధించిన మరొక ముఖ్యమైన అంశమిది. దీనికి తెలంగాణ సాహిత్య అకాడమీ ప్రచురణలను క్షుణ్ణంగా చదవాలి. తెలంగాణ సమాజంలో వాడుకలో ఉన్న కొన్ని ప్రత్యేక పదాలపై ప్రశ్నలుంటాయి. ఉదాహరణకు అగం, అలుగు, తూము, గంగాళం, గోలెం, గుమ్మి, పునాస, యాసంగి లాంటివాటి అర్థాలు తెలుసుకోవాలి.

తెలంగాణకే పరిమితమైన కొన్ని పండుగలైన బతుకమ్మ, బొడ్డెమ్మ, బోనాలు మొదలైన వాటిపై లోతుగా ప్రశ్నలుంటాయి. తెలంగాణ ప్రముఖ కవులు, వారి గ్రంథాలపై కూడా ప్రశ్నలు వస్తాయి.

తెలంగాణ ప్రభుత్వ విధానాలు: చివరిగా దృష్టి సారించాల్సిన అంశమిది. వీటిని 2014 నుంచి నేటివరకూ అంటే రైతుబంధు, భూముల రిజిస్ట్రేషన్‌ విధానాల వరకు తెలుసుకోవాలి. సిలబస్‌లోని అంశాలన్నింటిలోకి అతి తక్కువ సిలబస్‌ను కలిగి సునాయాసంగా అర్థం చేసుకునే విభాగం. కాబట్టి అన్ని పథకాలనూ, వాటిని ప్రారంభించిన తేదీలనూ, ప్రదేశాలనూ గుర్తుపెట్టుకోవాలి. పథకాల లక్ష్యాలను సవివరంగా చదవాలి.

 

నైతిక విలువలు, మహిళలు, బలహీన వర్గాల సమస్యలు

వీఆర్వో పరీక్షకు పై అంశాలతో పాటు మరో ప్రత్యేకాంశాన్ని చేర్చారు. అదే నైతిక విలువలు, సమాజంలోని మహిళా సమస్యలు, బలహీన వర్గాల సమస్యల పట్ల అవగాహన, వారి పట్ల సున్నితంగా, గౌరవంగా, వ్యవహరించే ధోరణులు. వారి కోసం రూపొందించి, అమలు చేస్తున్న పథకాలు, వారి రక్షణ, గౌరవ మర్యాదలకు సంబంధించిన చట్టాలపై ప్రాథమిక అవగాహన ఉండాలి. దీనికి సంబంధించి సమస్యలు, వాటి పరిష్కారాల నుంచి ప్రశ్నలు ఉంటాయి.

 

గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌

ప్రత్యేకించి వీఆర్వో పరీక్షకు ఎక్కువ ప్రశ్నలు గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌పై ఉంటాయి. ఇది గ్రహించి అత్యధిక ప్రాధాన్యంతో ప్రిపేర్‌ కావాలి.

Posted Date : 26-01-2021

 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు