• facebook
  • whatsapp
  • telegram

అటవీశాఖ ఆహ్వానం

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఈ కొలువులను భర్తీ చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా నేడు ఎదుర్కొనే ప్రధాన సమస్య వాతావరణ కాలుష్యం. తరచుగా సంభవించే వరదలు, దాని ఫలితంగా జరిగే నేలల క్రమక్షయం, భూగర్భ జలాల కొరత, వర్షాల కొరత, వాతావరణ కాలుష్యం..ఈ సమస్యలన్నిటినీ పరిష్కరించడంలో అడవులది కీలకపాత్ర. కాబట్టి విచక్షణ రహితంగా అడవులను నరికివేయడాన్ని అరికట్టడంలో అటవీశాఖ ఉద్యోగులు క్షేత్రస్థాయిలో కీలకపాత్ర వహిస్తారు. కనుమరుగవుతున్న వన్యప్రాణులను సంరక్షించే బాధ్యతనూ వీరు స్వీకరిస్తారు. కాబట్టి వీరిని మామూలు ఉద్యోగుల్లా కాకుండా సాహసంతో కూడుకున్నవారిగా భావించాలి. నిరక్షరాస్యులైన గిరిజన ప్రజలతో కలిసిమెలిసివుంటూ వారిని చైతన్యవంతులను చేయడంలో కూడా వీరికి పాత్ర. పరీక్ష సిలబస్‌లో ప్రత్యేకించి సామాజిక అవగాహనను కూడా పేర్కొన్నారు. ఆరకంగా ఈ కొలువుల్లో ఉద్యోగ భద్రతతోపాటు సంతృప్తి కూడా ఉంటుంది. కాలక్రమేణా పదోన్నతులు కూడా లభిస్తాయి.

ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్లు
ఇవి జిల్లావారీగా నియమించే పోస్టులు. అంటే 80% ఉద్యోగాలను ఆయా జిల్లాలవారికే కేటాయించి, మిగిలిన 20% ఆ జిల్లాతోపాటు మిగిలిన అన్ని జిల్లాలవారికీ కేటాయిస్తారు. 
విద్యార్హతలు: ఇంటర్‌/తత్సమాన పరీక్ష. వయసు 18 - 31 సంవత్సరాలు. రిజర్వేషన్‌ ఉన్నవారికి గరిష్ఠ వయోపరిమితి 36 సంవత్సరాలు. నిర్దిష్ట దేహదారుఢ్యం ఉండాలి. రాతపరీక్ష తర్వాత పురుషులు 25 కి.మీ., మహిళలు 16 కి.మీ. దూరాన్ని కాలినడకన 4 గంటల్లో పూర్తిచేయాల్సి ఉంటుంది. అభ్యర్థులు ముందుగానే తమ శారీరక కొలతలను నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థుల తుది ఎంపిక రాతపరీక్ష, ఆపై నడక, మెడికల్‌ టెస్టులపై ఆధారపడి ఉంటుంది. రాతపరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి.
పేపర్‌-1 జనరల్‌ నాలెడ్జ్‌, పేపర్‌-2 సాధారణ గణితానికి సంబంధించినవి. ఒక్కో పేపర్‌ 100 ప్రశ్నలతో 100 మార్కులకు ఉంటుంది. ప్రశ్నలు బహుళైచ్ఛిక విధానంలో ఉంటాయి. 90 నిమిషాల పరిమిత సమయంలో 100 ప్రశ్నలకు కచ్చితమైన సమాధానాలను గుర్తించవలసి ఉంటుంది.
బీట్‌ ఆఫీసర్‌ పోస్టులకు కనీస విద్యార్హత ఇంటర్మీడియట్‌ అయినప్పటికీ డిగ్రీ, పీజీ చదివినవారే ఎక్కువగా ఉంటారు. ఇంజినీరింగ్‌ అభ్యర్థులు కూడా పోటీ పడుతున్నారు. దీనికి ప్రధాన కారణం- ఇటీవలి కాలంలో ప్రభుత్వ ఉద్యోగాలకు పెరిగిన గిరాకీ, గణనీయంగా పెరిగిన జీతభత్యాలు. ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్లు, ఫారెస్ట్‌ సెక్షన్‌ ఆఫీసర్ల పరీక్షలకు ఒకే పరీక్ష పద్ధతి, ఒకే సిలబస్‌ ఉన్నాయి.
 

ఫారెస్ట్‌ సెక్షన్‌ ఆఫీసర్లు
సైౖన్స్‌, ఇంజినీరింగ్‌, మేథమెటిక్స్‌, స్టాటిస్టిక్స్‌ మొదలైన సబ్జెక్టులుగా కలిగి ఉండి, డిగ్రీ ఉత్తీర్ణత పొందినవారు అర్హులు. ఇది డిగ్రీ కనీస అర్హతగా ఉన్న పోస్టు అయినప్పటికీ పీజీ విద్యార్థులు కూడా పోటీపడే అవకాశం ఉంది. అటవీశాఖలో సెక్షన్‌ ఆఫీసర్‌గా ఉద్యోగాన్ని ప్రారంభించినవారు డిపార్ట్‌మెంటల్‌ పరీక్షలు పాసైతే త్వరితగతిన పదోన్నతులు పొందవచ్చు. కొద్దికాలంలోనే ఫారెస్ట్‌ రేంజ్‌, తర్వాత అసిస్టెంట్‌ కన్జర్వేటర్‌ స్థాయికి కూడా పదోన్నతి పొందే అవకాశం ఉంటుంది. దేహరుఢ్యానికి సంబంధించి ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్లకు నిర్దేశించిన ప్రమాణాలే (కొలతలు) ఈ పోస్టులకూ వర్తిస్తాయి. అలాగే రాతపరీక్ష, ఆపై నడక పరీక్ష ఉంటాయి. రాతపరీక్షలో రెండు పేపర్లు బహుళైచ్ఛిక ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటాయి. మొదటి పేపర్‌ జనరల్‌ నాలెడ్జ్‌, రెండో పేపర్‌ సాధారణ గణితం. ఒక్కో పేపర్‌లో 100 మార్కులకు 100 ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలు. ఒక్కో పేపర్‌ను 90 నిమిషాల్లో సాధించాల్సి ఉంటుంది. బీట్‌ ఆఫీసర్లు, సెక్షన్‌ ఆఫీసర్ల ఉద్యోగాలకు విద్యార్హతలు వేరైనప్పటికీ దేహదారుఢ్య‌ (ప్రమాణాలు, కొలతలు, నడక పరీక్ష) పరీక్షా విధానం, సిలబస్‌ ఒకటిగానే పేర్కొన్నారు. 
 

ఏ స్థాయి? ఏ విధంగా తయారవ్వాలి
పేపర్‌-1: జనరల్‌ నాలెడ్జ్‌ (ఎస్‌ఎస్‌సీ స్టాండర్డ్‌)
ఈ పేపర్‌లోని 100 ప్రశ్నలు పదోతరగతి స్థాయిలో ఉంటాయని పేర్కొన్నారు. నిజానికి కొన్ని అంశాలు అంతకంటే ఎక్కువ స్థాయిలో ఉంటాయి.
వర్తమాన విషయాలు: వీటి నుంచి దాదాపు 10-12 ప్రశ్నలు రావొచ్చు. జాతీయ, రాష్ట్ర స్థాయి దినపత్రికలను అనుసరించాలి. ఎక్కువ ప్రశ్నలు గత సంవత్సర కాలంగా జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ స్థాయుల్లో జరిగిన ముఖ్య సంఘటనలపై ఉంటాయి.
జనరల్‌ సైన్స్‌: ఈ విభాగంలో 8, 9, 10 తరగతుల పాఠ్యపుస్తకాల్లోని శాస్త్ర సాంకేతిక అంశాలు చదవాలి. రోజువారీ పరిశీలన, అనుభవంలో ఉండే వివిధ అనువర్తనాలపై ప్రశ్నలుంటాయి. పర్యావరణ సమస్యలు, విపత్తు నిర్వహణ: వీటికి సంబంధించి కూడా 8, 9, 10 తరగతుల పాఠ్యపుస్తకాలు ఉపయోగకరం. జాతీయ, అంతర్జాతీయంగా ఇటీవల సంభవించిన విపత్తుల అధ్యయనం అవసరం. పార్లమెంట్‌ 2005లో రూపొందించిన విపత్తు నిర్వహణ చట్టంలోని ముఖ్యాంశాలు ముఖ్యమైనవి.
భౌగోళికాంశాలు: భారతదేశం, తెలంగాణలకు సంబంధించి 8, 9, 10 తరగతుల పాఠ్యాంశాలు చదవాలి. అదనంగా ఇటీవలి కాలంలో దేశంలోనూ, తెలంగాణలోనూ ప్రారంభించిన వివిధ నీటిపారుదల ప్రాజెక్టులపై అవగాహన పెంచుకోవాలి. ఈమధ్య కాలంలో ప్రారంభించిన భారీ పరిశ్రమల పరిజ్ఞానం అవసరం.
భారతదేశ ఆర్థికవ్యవస్థ: దేశ ఆర్థికవ్యవస్థ మౌలికాంశాలు, పంచవర్ష ప్రణాళికలను పాఠ్యపుస్తకాల్లో చదువుకోవాలి. కేంద్ర, రాష్ట్ర బడ్జెట్‌లు, వాటి కేటాయింపులు, ప్రాధాన్యాలు, గత సంవత్సర ఆర్థిక వ్యవస్థ పనితీరుకు సంబంధించి ఆర్థిక సర్వేల సమగ్ర అధ్యయనం తప్పనిసరి. అదనంగా ఇటీవల ఏర్పాటు చేసిన నీతి ఆయోగ్‌పై కూడా అవగాహన ఉండాలి.
భారత రాజ్యాంగం- రాజకీయ వ్యవస్థ: రాజ్యాంగంలోని ముఖ్యాంశాలు, పాఠ్యపుస్తకాలను చదువుకుంటూ ఇటీవలి పరిణామాలను ప్రత్యేకించి గమనించాలి. ఉదాహరణకు- ఇటీవల జరిగిన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు. ముఖ్యంగా రాజ్యాంగ విశిష్ట లక్షణాలు- సమాఖ్య, ఏక కేంద్ర లక్షణాలపై కేంద్ర, రాష్ట్ర సంబంధాలపై దృష్టిసారించాలి. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర విధాన సభ, విధాన పరిషత్‌ల వివరాలను తెలుసుకోవాలి.
భారతదేశ చరిత్ర-స్వాతంత్రోద్యమం: వీటికి పదో తరగతి స్థాయిలోపు పాఠ్యపుస్తకాలు సరిపోతాయి. ప్రాచీన, మధ్యయుగ, ఆధునిక భారతదేశ చరిత్రలను క్రమపద్ధతిలో చదవాల్సి ఉంటుంది. ముక్కలు ముక్కలుగా చదవడం లాభించదు. అయితే ఎక్కువగా స్వాతంత్రోద్యమంపై దృష్టిసారించాలి.
తెలంగాణ చరిత్రను శాతవాహనుల కాలం నుంచి హైదరాబాద్‌ రాజ్యం భారతదేశంలో విలీనమయ్యేవరకు అధ్యయనం చేయాలి. శాతవాహనులు, విష్ణుకుండినులు, రాష్ట్రకూటులు, ముదిగొండ చాళుక్యులు, కాకతీయులు, రాచకొండ, దేవరకొండ, రాజ్యాలు ఆ తర్వాత గోల్కొండ, అసఫ్‌జాహీల చరిత్రకు సంబంధించిన ముఖ్యాంశాలు చదవాల్సి ఉంటుంది. తెలంగాణ ఉద్యమానికి ఎక్కువ ప్రాధాన్యమివ్వాలి. తెలంగాణ సమాజం-సంస్కృతి, వారసత్వం, కళలు మొదలైనవాటిపై పాఠ్యపుస్తకాలను ఆరోతరగతి నుంచి చూసుకోవాలి. తెలంగాణ పండుగలు, జాతరలు, వంటలు, దేవాలయాలు, గ్రామీణ ప్రాంతాల వాడుక పదజాలం మొదలైనవి ముఖ్యం.
 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పథకాలు
రాష్ట్రం ఏర్పడిన తరువాత ప్రభుత్వం రూపొందించి అమలు చేస్తున్న పథకాలన్నింటిపై పూర్తి అవగాహన అవసరం. వీటి సమాచారాన్ని రాష్ట్ర అవతరణ దినోత్సవం నాటి, స్వాతంత్య్రదినోత్సవం నాటి ప్రముఖ దినపత్రికల్లో చూడవచ్చు. మొదటిసారిగా ప్రవేశపెట్టిన నైతిక విలువలు, మహిళలు, దళితుల పట్ల ఆదరాభిమానాలు, సమాజంపై అవగాహన ప్రధానమైనవి. ఎక్కువ ప్రశ్నలు నిత్యజీవితంలోని అనుభవాలపై ఉంటాయని గమనించాలి. సమాజంలోని కులవ్యవస్థ, మత వ్యవస్థ, దళితుల సమస్యలు, మహిళా సమస్యలు మొదలైనవాటిపై అవగాహన తప్పనిసరి. ఈ రెండు పరీక్షల్లో రెండో పేపర్‌ సామాన్య గణితానికి సంబంధించింది. ఇందులోని ప్రశ్నలన్నీ పదో తరగతి స్థాయిలో ఉంటాయి. కాబట్టి ఈ పేపర్‌లో నిర్దేశించిన సిలబస్‌ అంశాలన్నింటినీ 8, 9, 10 తరగతుల పాఠ్య పుస్తకాల్లో చదివి అవగాహనను తెచ్చుకోవాలి. సాధ్యమైనంత ఎక్కువ ప్రశ్నలను సాధన చేయాలి. సాధన చేసేటపుడు షార్ట్‌కట్‌ పద్ధతి మెలకువలను తెలుసుకోవాలి. లేకపోతే సమయం సరిపోదు. కేవలం 90 నిమిషాల్లో 100 ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలని మర్చిపోకూడదు.
 

ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్లు
ప్రణాళికబద్ధంగా చదివి ప్రతిభ చూపితే ఉన్నత ఉద్యోగమైన ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ పోస్టునే సొంతం చేసుకోవచ్చు. అనుభవజ్ఞులైన నిపుణుల మార్గదర్శకత్వంలో ఏ సబ్జెక్టును ఏవిధంగా ఎంతవరకూ చదవాలో తెలుసుకుంటే మేలు!
అటవీ ఉద్యోగాల్లో ఎగువస్థాయి (హయ్యర్‌ కేడర్‌) ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్ల పోస్టులదే. అటవీశాఖలో ఈ రేంజ్‌ అధికారులు కీలకపాత్ర వహిస్తారు. వీరు తమ పై అధికారులు, కింది అధికారులకు మధ్య సమన్వయకర్తలుగా వ్యవహరిస్తారు. ఉద్యోగంలో చేరాక డిపార్ట్‌మెంటల్‌ పరీక్షలు పాసై అంచెలంచెలుగా పదోన్నతులు పొందవచ్చు. ముందుగా అసిస్టెంట్‌ కన్జర్వేటర్‌, తర్వాత డివిజనల్‌ ఫారెస్ట్‌ ఆఫీసర్‌, ఆపై ఫారెస్ట్‌ కన్జర్వేటర్‌ పదవి వరకు చేరవచ్చు. ఈ విధంగా వారు అఖిలభారత సర్వీస్‌ అయిన ఐఎఫ్‌ఎస్‌ స్థాయికి చేరుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు కనీస విద్యార్హత సైన్స్‌, ఇంజినీరింగ్‌, మేథమేటిక్స్‌, అగ్రికల్చర్‌, వెటర్నరీ సైన్స్‌ల్లో ఏదో ఒకదానిలో పట్టభద్రత. వయసు 18-28 సంవత్సరాలు. రిజర్వేషన్‌ ఉన్నవారికి మరో 5 సంవత్సరాల సడలింపు ఉంటుంది. నిర్దిష్ట దేహదారుఢ్యం ఉండాలి. ఈ ఉద్యోగాల నియామకం రెండు రకాల పరీక్షలపై ఆధారపడి ఉంటుంది. అదనంగా నడక పరీక్ష, ఇంటర్వ్యూ.
అర్హత పరీక్ష: దీనిలో రెండు పేపర్లు ఉంటాయి. మొదటిది జనరల్‌ ఇంగ్లిష్‌, రెండోది సామాన్య గణితానికి సంబంధించింది. ఒక్కో పేపర్‌లో 100 మార్కులకుగానూ 100 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో పేపర్‌ను 100 నిమిషాల్లో సాధించవలసి ఉంటుంది. ఈ రెండు పేపర్లలో 40% మార్కులను సాధించి అర్హత పొందవలసి ఉంటుంది. ఈ మార్కులను తుది ఎంపికలో పరిగణించరు. రెండో పరీక్ష 500 మార్కులకు. 450 మార్కులు రాతపరీక్షకు కేటాయించగా 50 మార్కులకు ఇంటర్వ్యూ. ఈ రాతపరీక్షలో 2 పేపర్లుంటాయి. మొదటి పేపర్‌ జనరల్‌స్టడీస్‌కు, రెండోది ఏదైనా ఒక ఐచ్ఛిక సబ్జెక్టుకు సంబంధించినది. అభ్యర్థులు మొత్తం 21 సబ్జెక్టుల్లో ఏదేని ఒక సబ్జెక్టును ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.
పేపర్‌-1  : జనరల్‌ స్టడీస్‌: ఇందులో మొత్తం 11 అంశాలను పేర్కొన్నారు. 150 మార్కులకు 150 ప్రశ్నలుంటాయి. వీటిని 150 నిమిషాల్లో అంటే రెండున్నర గంటల్లో సాధించాల్సి ఉంటుంది.
పేపర్‌-2 : ఐచ్ఛిక సబ్జెక్టుకు సంబంధించింది. 300 మార్కులకు 150 ప్రశ్నలు. ఒక్కో ప్రశ్నకు రెండు మార్కులు. అభ్యర్థుల తుది ఎంపికలో ఈ పేపర్‌దే కీలకపాత్ర. దీన్ని దృష్టిలో పెట్టుకుని అభ్యర్థులు తమకు ఇష్టమైన, పట్టున్న సబ్జెక్టును ఎంచుకోవాల్సి ఉంటుంది. 
చివరగా ఇంటర్వ్యూ. దీనికి కేటాయించిన మార్కులు 50. కాబట్టి అభ్యర్థుల తుది ఎంపిక ముఖ్యంగా రెండో పరీక్షలోని రెండు పేపర్లపై ఆధారపడి ఉంటుంది. పరీక్ష సన్నద్ధతకు ఎక్కువ సమయం లేనందున ఇప్పటినుంచే తగిన ప్రణాళికను రూపొందించుకోవాలి. ముఖ్యాంశాలను ప్రాధాన్యక్రమంలో అధ్యయనం చేస్తూ వీలైనన్ని మాదిరి ప్రశ్నపత్రాలను సాధించటం మేలు.

Posted Date : 02-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌