• facebook
  • whatsapp
  • telegram

సంప్రదాయ రీతిలోను.. సరికొత్తగానూ!

టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-2 ఇంటర్వ్యూలు నిర్వ‌హించింది. సంప్రదాయ రీతులను, సరికొత్త పద్ధతులను మేళవించి నిర్వ‌హించారు. ఇప్పటివరకు జరిగిన మౌఖిక పరీక్షలను పరిశీలిస్తే... అభ్యర్థుల బయోడేటా, వర్తమాన అంశాలు, తెలంగాణ ప్రాథమిక అంశాలు, తాజా విషయాల నుంచి అత్యధిక ప్రశ్నలు వస్తున్నాయని తెలుస్తోంది.
 

పేరూ, జిల్లా ప్రస్తావన లేదు
ఎప్పటిమాదిరిగానే బయోడేటా సంబంధిత ప్రశ్నలు అడుగుతున్నారు. కానీ ఈసారి ఒక కొత్తదనం కనిపించింది. ఇంటర్వ్యూ ప్రారంభం కావడానికి ముందే సర్వీస్‌ కమిషన్‌ ఛైర్మన్‌ ఆరోజు వచ్చిన అభ్యర్థులందరినీ కలిసి ‘మీ పేరుగానీ, మీ జిల్లా గానీ మేము అడిగినా సరే, బోర్డులో చెప్పవద్దు’ అని కోరుతున్నారు. ఎటువంటి అక్రమం, అవినీతీ జరగకుండా ఉండాలనే ఆలోచనే దీనికి కారణం. బోర్డుకు అభ్యర్థి పేరు, జిల్లా తెలియకపోవడం వల్ల ఎటువంటి పక్షపాతానికి తావు లేకుండా మార్కుల కేటాయింపు ఉంటుదని తెలియజేయడమే ఈ సూచనల లక్ష్యం.
అందువల్ల అభ్యర్థి పేరు, జిల్లా సంబంధిత విషయాలను దాదాపుగా అడగటం మానేశారు. అయితే మిగతా బయోడేటా సంబంధిత ప్రశ్నలు ఏదో ఒక రూపేణా అడుగుతూనే ఉన్నారు. ‘మీ హాబీలు ఏమిటి?’ అని ఎక్కువమంది అభ్యర్థులను అడిగారు. అంటే హాబీని అర్థం చేసుకోవడం ద్వారా అభ్యర్థి మూర్తిమత్వ లక్షణాలని అంచనా వేస్తున్నారు. క్రీడలూ, కళలపట్ల ఉన్న ఆసక్తిని ప్రశ్నిస్తున్నారు.

ఉద్యోగాల ప్రాధాన్యక్రమం మీద అడుగుతున్నారు. ఉద్యోగాల గురించి అభ్యర్థి ఆర్జించిన జ్ఞానాన్ని బట్టి ఒక అభిప్రాయాన్ని బోర్డు ఏర్పరుచుకునే ప్రయత్నం చేస్తోంది. అందువల్ల అభ్యర్థులు సంబంధిత ఉద్యోగాల సమాచారంపై పట్టు పెంచుకోవాలి. ఉద్యోగ సంబంధిత శాఖలు, విధులు, పదోన్నతులు మొదలైనవాటన్నింటిపై ప్రశ్నలు ఉంటాయి. అభ్యర్థి గతంలో చేసిన, చేస్తున్న ఉద్యోగం మీద ప్రశ్నలు అడుగుతున్నారు. ముఖ్యంగా జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులు ఎక్కువమంది ఈ ఇంటర్వ్యూలకి ఎంపికయ్యారు. తరువాతి స్థానంలో ఉపాధ్యాయులు ఉన్నట్లు తెలుస్తోంది. ఫలితంగా పంచాయతీరాజ్‌, ఉపాధ్యాయ వ్యవస్థలపైనా ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయి. కాబట్టి తెలంగాణలో పంచాయతీరాజ్‌ కొత్త చట్టం అమలవుతున్న తీరు, 73, 74 రాజ్యాంగ సవరణలు లాంటి అంశాలపై అభ్యర్థులు అవగాహన పెంచుకోవడం మంచిది.

ఉపాధ్యాయ వృత్తి నిర్వహిస్తున్న అభ్యర్థులకు సంబంధించి ప్రధానంగా తెలంగాణలోని గురుకుల వ్యవస్థ, కేజీ టు పీజీ, అక్షరాస్యతలో వెనుకబడివుండటం మొదలైన వాటిపై ప్రశ్నలు సంధిస్తున్నారు. నిరుద్యోగులను నిరుద్యోగ సంబంధిత ప్రశ్నలతోపాటు వారు ఎందుకు రాణించలేకపోతున్నారనే అంశంపై వారి అభిప్రాయాలను తెలుసుకోవడంపై దృష్టి పెడుతున్నారు. ఇలాంటి ప్రశ్నలు వచ్చినప్పుడు తడబడకుండా, నిజాయతీగా ఎలాంటి సమాధానాలు చెప్పాలో అభ్యర్థులు ముందుగా ప్రాక్టీస్‌ చేసుకోవాలి. అభ్యర్థులు ఏదైనా వృత్తిలో ఉంటే దానికి సంబంధించి కొన్ని క్లిష్టమైన సమస్యలను ఇచ్చి వాటికి పరిష్కారం అడుతున్నారు.
ఉదాహరణకు ఒక ఉపాధ్యాయ అభ్యర్థిని ‘తరగతి గదిలో రాణించలేకపోతున్న ఒక విద్యార్థిని ఏవిధంగా మెరుగుపరుస్తావు?’ అని ప్రశ్నించారు. ‘ఉపాధ్యాయ వృత్తిలో మీరు గడించిన అనుభవం గ్రూప్‌-2 ఉద్యోగాలకు ఏవిధంగా ఉపయోగపడుతుంది?’ అని అడిగారు. ‘పంచాయతీ కార్యదర్శిగా వ్యవసాయాభివృద్ధికి ఏ విధంగా ప్రాధాన్యం ఇస్తున్నారు?’ ఇది మరో అభ్యర్థికి ఎదురైన ప్రశ్న. ‘తెలంగాణలో హరితహారం లాంటి పథకాన్ని ప్రభుత్వం ఎందుకు ప్రారంభించింది?’, ‘పంచాయతీ కార్యదర్శిగా హరితహారం సంబంధిత అమలు విషయాలు ఏమిటి?’ లాంటివీ ఉన్నాయి. తెలంగాణలో సర్పంచి, ఉపసర్పంచులకు చెక్‌ పవర్‌ ఇచ్చి పంచాయతీ కార్యదర్శికి ఇవ్వడం, ఇవ్వకపోవడం కోణాల్లో ప్రశ్నలు అడిగారు. సాఫ్ట్‌వేర్‌ రంగంలో ఉద్యోగం చేస్తున్న అభ్యర్థిని ‘మీరు గడించిన జ్ఞానం ఏవిధంగా తెలంగాణా పాలనలో ఉపయోగపడుతుంది?’ అని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఈవిధంగా అభ్యర్థి బయోడేటా మీద ప్రశ్నలు అడగడం ద్వారా అభ్యర్థి సామర్థ్యాన్నీ, అవగాహననూ, అనుభవాన్నీ పరిగణనలోకి తీసుకున్నట్లుగా భావించవచ్చు. రాబోయే ఇంటర్వ్యూల్లో ఈ ధోరణి కొనసాగుతుంది కాబట్టి అభ్యర్థులు తగినవిధంగా సంసిద్ధమవటం మేలు.
 

తెలంగాణ భౌగోళికం, పరిపాలన
తెలంగాణ ఉద్యమ చరిత్రతోపాటు రాష్ట్రానికి సంబంధించిన భౌగోళిక, పాలన అంశాలు ప్రశ్నలుగా మారుతున్నాయి. ‘బంగారు తెలంగాణ అంటే?’, ‘తెలంగాణ భౌగోళిక అంశాలేమిటి?’, ‘తెలంగాణకు ఈ పేరు ఎందుకు వచ్చింది?’, ‘ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా వచ్చిన పరిణామాలు ఏమిటి?’, ‘తెలంగాణ గీతం, జంతువు, పక్షిగా అవే ఎందుకు ఎంపికయ్యాయి?’ వంటి ఆసక్తి ప్రధానమైన ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ‘తెలంగాణలో ఉన్న దేవాలయాలు, పర్యాటక క్షేత్రాలు, ముప్ఫై మూడు జిల్లాల తెలంగాణ ఆవశ్యకత, పరిపాలన సౌలభ్యత, ప్రభుత్వ పథకాలు...అందులో కీలకమైనవి... ఇలాంటి అంశాలపై కూడా అడుగుతున్నట్లు తెలుస్తోంది.
 

తాజా తాజా సంగతులు
ఇటు అభ్యర్థులకూ, అటు బోర్డుకూ సరైన అనుసంధానం... వర్తమాన విషయాలే. ఆ ధోరణిలోనే దాదాపుగా ఎక్కువమందిని వర్తమాన అంశాలపై ప్రశ్నలు వేస్తున్నారు. కేంద్ర బడ్జెట్‌, కాళేశ్వరం ప్రాజెక్టు, తలాక్‌ తలాక్‌ తలాక్‌ బిల్లు, జమిలీ ఎన్నికలు, ఇటీవల ముగిసిన ఎన్నికలు, ఆర్థికంగా బలహీనవర్గాల రిజర్వేషన్లు, ప్రస్తుత ప్రపంచ క్రికెట్‌ కప్‌ మొదలైన వాటిపై అడిగినట్టుగా తెలుస్తోంది. రాబోయే రోజుల్లో కూడా ఇటువంటి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. అభ్యర్థులు సరైన రీతిలో సిద్ధపడాలి. కరెంట్‌ ఎకానమీ, కరెంట్‌ పాలిటీ అంశాల మీద కూడా దృష్టిపెట్టి తయారవ్వాలి. ప్రతిరోజూ వార్తాపత్రికలను సునిశితంగా అధ్యయనం చేస్తే వర్తమానాంశాలపై అవగాహన పెరుగుతుంది.
 

నిజాయతీ, స్పష్టతలపై దృష్టి
స్థూలంగా చూస్తే ఇంటర్వ్యూలు చాలా మంచి వాతావరణాన్నీ, విశ్వసనీయమైన పరిస్థితులనూ కల్పిస్తున్నట్లుగా అర్థమవుతోంది. అభ్యర్థులను ప్రోత్సహించి సమాధానాలను రాబట్టుకునే సహనం, అవగాహనలను బోర్డు ప్రదర్శిస్తోందని తెలుస్తోంది. రాబోయే రోజుల్లో జరిగే ఇంటర్వ్యూల్లో కూడా ఇదే ధోరణిని అనుసరించే అవకాశం ఉంది. అయితే ఇవే ప్రశ్నలకు మాత్రమే తయారై, అవే అడుగుతారని భావించకూడదు. బోర్డు కూడా అవే ప్రశ్నలు అడిగి అడిగి బోర్‌ ఫీలయ్యే అవకాశం ఉంటుంది. వారూ కొత్త కోణాలను పరిశీలించవచ్చు. కాబట్టి ప్రశ్నల సరళిని అనుసరించి అభ్యర్థులు సంసిద్ధం కావాలి. అభ్యర్థులు ఇంటర్వ్యూకు సంబంధించి పూర్తిస్థాయిలో సిద్ధ్దమైతే ఏ విషయాల మీద ప్రశ్నలు అడిగినా జవాబులు చెప్పవచ్చు. అయితే ఎన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పారనేదాని కంటే, అభ్యర్థుల్లోని నిజాయతీ, పారదర్శకత, స్పష్టత, అవగాహన, అన్వయం, సమస్యా పరిష్కారం అనే సామర్థ్యాలను ఎక్కువగా పరిశీలిస్తారు. అందువల్ల పరిజ్ఞాన సంబంధమైన విషయాలతో పాటుగా మూర్తిమత్వ విషయాలు, బాడీ లాంగ్వేజ్‌, కమ్యూనికేషన్‌ నైపుణ్యాలు సరిగా సాధన చేసి మెరుగుపరుచుకుంటే అనుకూల ఫలితాలకు వీలుంటుంది

Posted Date : 26-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌