• facebook
  • whatsapp
  • telegram

అర్థం చేసుకుంటూ.. అవగాహన పెంచుకుంటూ!

గ్రూప్స్‌ పరీక్షల సన్నద్ధత మెలకువలు

 

 

గ్రూప్స్‌ లాంటి పోటీ పరీక్షలకు పుస్తకాలు యాంత్రికంగా చదవకూడదు. సబ్జెక్టులోని విషయం ఆకళింపు చేసుకుంటూ సన్నద్ధమవ్వాలి. విషయంపై అవగాహన సమగ్రంగా ఉంటేనే, పూర్తి పట్టు వస్తేనే ఏ తరహా ప్రశ్న వచ్చినా సమాధానాలు గుర్తించటం సాధ్యమవుతుంది! 

 

పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ సిలబస్‌లో నిర్దేశించిన వివిధ సబ్జెక్టుల్లోని వివిధ పాఠ్యాంశాలను క్షుణ్ణంగా పరిశీలించటం తెలుగు రాష్ట్రాల్లోని పోటీ పరీక్షలు రాసే అభ్యర్థులకు చాలా ప్రధానం. ఇలా చేస్తేనే ఒక్కో సబ్జెక్టు పరిధిపై స్థూలంగా ఒక అవగాహన వస్తుంది. ఉదాహరణకు- టీఎస్‌పీఎస్‌సీ గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్షను తీసుకుంటే ముఖ్యమైన సబ్జెక్టులేమిటో చూడాలి. భారతదేశ రాజకీయ వ్యవస్థ (ఇండియన్‌ పాలిటీ), పరిపాలన (గవర్నెన్స్‌), భారతదేశ ఆర్థిక వ్యవస్థ (ఇండియన్‌ ఎకానమీ), తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ, భారతదేశ చరిత్ర.. సంస్కృతి, తెలంగాణ చరిత్ర.. సంస్కృతి, తెలంగాణ ఉద్యమం- రాష్ట్ర ఏర్పాటు, ప్రపంచ, భారతదేశ భౌగోళికాంశాలు- తెలంగాణ భౌగోళికాంశాలు, జనరల్‌ సైన్స్, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం, నిత్యజీవితంలో వాటి అనువర్తనాలు (అప్ల్లికేషన్స్‌), భారతదేశ సమాజ నిర్మితి, సమస్యలు, సామాజిక ఉద్యమాలు- ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వర్తమాన విషయాలు, వివిధ సమస్యలు (ఉదా: జమ్ము-కశ్మీర్‌ సమస్య మూలాలు,  వర్తమాన విషయాలు), జనరల్‌ మెంటల్‌ ఎబిలిటీ (సాధారణ మానసిక సామర్థ్యాలు) ముఖ్యమైనవి. తెలంగాణ నిర్దిష్ట అంశాలు మినహాయిస్తే.. మిగిలినవన్నీ ఏపీపీఎస్‌సీ అభ్యర్థులకు ఉపయోగపడే అంశాలే.

 

ప్రిపరేషన్‌ పూర్తి కాకుండా గ్రాండ్‌ టెస్టులా? 

1. సిలబస్‌లోని సబ్జెక్టులన్నింటినీ ఏక కాలంలో చదవాలనే ఆతృత మంచిది కాదు.

2. ఒకే సబ్జెక్టుకు సంబంధించి అనేక పుస్తకాలూ, స్టడీ మెటీరియల్స్‌ను చదవటం సరికాదు. భిన్న సబ్జెక్టులకు తగిన ప్రాధాన్యం ఇస్తూ సంబంధిత ప్రామాణిక పుస్తకాలు చదవాలి.   

3. ఇద్దరు ముగ్గురు మిత్రులు కలిసి చర్చలు చేస్తూ చదువుకుంటే (కంబైన్డ్‌ స్టడీ) ప్రయోజనకరం.

4. ఏదైనా ఒక చాప్టర్‌ను చదవగానే స్వీయ మూల్యాంకనం చేసుకోవాలి. దీనికి కొన్ని ప్రామాణిక టెస్టులను రాసి, సాధన చేయవలసి ఉంటుంది.

5. ఎప్పటికప్పుడు టెస్టులు లేకుండా చదివితే ఆ ప్రిపరేషన్‌ వల్ల ఎలాంటి ఉపయోగమూ ఉండదు. 

6. ప్రిపరేషన్‌ పూర్తికాకుండా గ్రాండ్‌ టెస్టులను రాయకూడదు. ఇలా సిలబస్‌ మొత్తం చదవకుండా... సంపూర్ణ విషయ పరిజ్ఞానమేదీ లేకుండా గ్రాండ్‌ టెస్టులను రాస్తే అనవసరంగా నిరాశపడవలసి వస్తుంది. అలాకాకుండా పూర్తిచేసిన సిలబస్‌ నుంచి చాప్టర్‌వారీగా సమగ్రమైన టెస్టులను రాయటం సరైనది.  

7. మొదటినుంచీ కచ్చితమైన సమయపాలన పాటిస్తూ, శ్రద్ధగా కృషి చేస్తే ఈ పోటీ పరీక్షల్లో విజయం సాధ్యమే! 

8. కోచింగ్‌ అవసరమా.. కాదా అనే తర్జన భర్జనలో విలువైన సమయం వృథా చేసుకోకూడదు.  

9. కోచింగ్‌ తీసుకోవాలంటే ఆఫ్‌లైన్‌/ ఆన్‌లైన్‌ ఏది మీకు అనుకూలంగా ఉంటుందో నిర్ణయించుకోవాలి. 

10. ఆఫ్‌లైన్‌/ ఆన్‌లైన్‌ కోచింగ్‌ అవసరమనిపిస్తే ఏ శిక్షణ సంస్థ ప్రామాణికంగా బోధిస్తూ సరైన మార్గదర్శకత్వాన్నిస్తుందో విచారణ చేసి నిర్ణయం తీసుకోండి. 

11. వందల/ వేల సంఖ్యలో విద్యార్థులుంటేనే శిక్షణ సంస్థ మెరుగైనదని భావించనక్కర్లేదు. సాధారణంగా పరిమిత సంఖ్యలో విద్యార్థులుండే సంస్థల్లో వ్యక్తిగత శ్రద్ధకు అవకాశం ఉంటుంది. ఎప్పటికప్పుడు విషయ నిపుణులను సంప్రదించి మీ సబ్జెక్టుల్లోని అంశాలపై అనుమానాలను నివృత్తి చేసుకోవచ్చు. 

 

సబ్జెక్టు పరిధి తెలియాలి 

ముందుగా గ్రూప్‌-1 సిలబస్‌లోని ఏదైనా ఒక సబ్జెకును తీసుకుని అందులో ఏయే అంశాలు ఉంటాయో తెలుసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆ సబ్జెక్టు పరిధి ఏమిటో మీకు తెలుస్తుంది. ఆ తర్వాత ఒక్కొక్క సబ్జెక్టులోని అంశాలనూ, వాటి పరిధినీ గ్రహించాలి. ఆపై సమయాన్ని బట్టి రోజుకు 1 లేదా 2 సబ్జెక్టులను తీసుకుని పాఠ్యాంశాలను ఒక క్రమపద్ధతిలో కొన్ని చాప్టర్లు లేదా భాగాలను చదవాల్సి ఉంటుంది.

 

ఏదైనా ఒక విషయాన్ని చదివేటప్పుడు ‘ఎందుకు? ఎలా?’ అని ప్రశ్నించుకుంటూ చదవాలి. అంతేకానీ పుస్తకంలో ఉన్నది ఉన్నట్టుగా యాంత్రికంగా చదివేస్తూ పోకూడదు. ఒకసారి ఈ రెండు ప్రశ్నలకూ సమాధానాలు తెలిస్తే చదివే ఏ అంశంపైన అయినా పూర్తి పట్టు వస్తుంది. తద్వారా ఆ అంశంపై ఎలాంటి ప్రశ్న వచ్చినా కచ్చితమైన సమాధానాన్ని గుర్తించవచ్చు, వివరంగానూ రాయొచ్చు. 

 

అయితే చాలామంది అభ్యర్థులు చేసే ప్రధానమైన పొరపాటు ఏమిటంటే.. ఒక సబ్జెక్టుకు సంబంధించి ఒక ప్రామాణిక గ్రœంథాన్ని పూర్తిగా చదవకుండానే ఏకకాలంలో అనేక పుస్తకాలనూ, స్టడీ మెటీరియల్స్‌నూ చదవడానికి ప్రయత్నించడం. దీనివల్ల విలువైన సమయం వృథా అవుతుంది. సబ్జెక్టుపై తగిన అవగాహన కూడా రాదు. దీంతో గందరగోళం ఏర్పడుతుంది. అందుకే పూర్తిగా ఏదైనా ప్రామాణిక గ్రంథాన్ని తీసుకుని దాన్ని పూర్తిగా చదివిన తర్వాతనే, ఇతర ప్రామాణిక మెటీరియల్‌ చదివితే అది దాదాపు 90 శాతం రివిజన్‌గానే ఉంటుంది. 
ఏదైనా కొత్త విషయాలు లేదా అదనపు సమాచారం కేవలం 10 శాతమే ఉంటుంది. అంతేగానీ ఏకకాలంలో ఎక్కువ ప్రామాణిక గ్రంథాలనూ, స్టడీ మెటీరియల్స్‌నూ చదవడం వల్ల నష్టమే గానీ లాభం ఉండదు. 

 

ఎన్‌సీఈఆర్‌టీ/ ఎస్‌సీఈఆర్‌టీ.. తప్పనిసరా?

సిలబస్‌లోని సబ్జెక్టులపై ప్రామాణిక గ్రంథాలను చదివేముందు ఆయా సబ్జెక్టులకు సంబంధించిన ఎన్‌సీఈఆర్‌టీ/ ఎస్‌సీఈఆర్‌టీ రూపొందించిన 8, 9, 10 తరగతుల పాఠ్య పుస్తకాలను చదవాలి. ముఖ్యంగా సాంఘికశాస్త్రంలోని భౌగోళిక శాస్త్రం, భారతదేశ చరిత్ర, పౌరశాస్త్రం, ఆర్థికశాస్త్రాలూ.. అదేవిధంగా భౌతిక, రసాయన, జీవశాస్త్రాలను ఒక్కసారి అవలోకనం చేస్తే ఆయా సబ్జెక్టులపై అవగాహన కలుగుతుంది. నిజానికి ఇవన్నీ విద్యార్థులు గతంలో చదివిన పుస్తకాలే. కాబట్టి వీటిని ఒక్కసారి రివిజన్‌ చేసినట్లుగా చదవండి. 

 

ప్రస్తుతం మార్కెట్‌లో ఒకే సబ్జెక్టుపై అనేక పుస్తకాలు, స్టడీ మెటీరియల్స్‌ కుప్పలు తెప్పలుగా లభ్యమవుతున్నాయి. దీంతో ఏది ప్రామాణికమో ఏది కాదో తెలుసుకోవడం అభ్యర్థులకు ఎదురవుతున్న మరో సమస్య. అందుకే అనుభవజ్ఞులైన పోటీ పరీక్షల నిపుణులను సంప్రదిస్తే వారు మీకు కావలసిన ప్రామాణిక గ్రంథాలను సూచిస్తారు. 

 

 

 


 

‣ Read Latest job news, Career news, Education news and Telugu news

‣ Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 07-04-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌