• facebook
  • whatsapp
  • telegram

కేంద్ర సామాజిక, ఆర్థిక సర్వే 2022-23

బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా 2022-23 ఆర్థిక సర్వేను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. పార్లమెంట్‌ ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగం పూర్తయిన తర్వాత ఆమె ఆర్థిక సర్వేను సమర్పించారు. 

ఆర్థిక సర్వే అంటే ఏమిటీ..? బడ్జెట్‌కు దీనికి తేడా ఏంటీ..?

గత సంవత్సర కాలంలో దేశ ఆర్థిక పనితీరును.. రాబోయే సంవత్సరంలో ఆర్థికంగా ఎదురయ్యే సవాళ్లను ముందుగానే అంచనా వేసి చెప్పేదే ఈ ఎకనమిక్‌ సర్వే (Economic Survey). దేశ ఆర్థిక వ్యవస్థకు దిశానిర్దేశం చేసేదిగా భావించే ఈ సర్వే ఆధారంగానే ప్రతిఏటా బడ్జెట్‌ (Union Budget) రూపకల్పన జరుగుతుంది. ఆర్థిక మంత్రిత్వశాఖ రూపొందించే ఈ సర్వే.. రానున్న రోజుల్లో దేశం ముందున్న సవాళ్లు, వాటిని ఎదుర్కోవడానికి తీసుకోవాల్సిన చర్యలను ముందుగానే అంచనా వేసి పలు సూచనలు చేస్తుంది. సాధారణంగా కేంద్ర ముఖ్య ఆర్థిక సలహాదారు (CEA) ఆధ్వర్యంలో ఈ నివేదిక రూపొందిస్తారు. ప్రస్తుతం కేంద్ర ముఖ్య ఆర్థిక సలహాదారుగా ఉన్న వి.అనంత నాగేశ్వరన్‌ ఆర్థిక సర్వే-2022-23లోని వివరాలను వెల్లడించారు.

సర్వేలో ఏముంటుంది..?

బడ్జెట్‌ రూపకల్పనలో కీలక పాత్ర పోషించే ఈ సర్వే దేశ ఆర్థిక వ్యవస్థ (Economy) ఎలా ఉందన్న విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది. కేవలం దేశ ఆర్థిక పరిస్థితులను తెలియజేయడమే కాకుండా ప్రధాన రంగాలైన వ్యవసాయ, పారిశ్రామికోత్పత్తి, మౌలిక సదుపాయాలు, ఎగుమతి దిగుమతులు, విదేశీ మారక నిల్వలు, నగదు చలామణి, ఉద్యోగాలు, ధరల పెరుగుదల వంటి అంశాలను కూడా వివరిస్తుంది. ప్రభుత్వం అమలుచేస్తోన్న అభివృద్ధి కార్యక్రమాల స్థితిగతులు, ప్రభుత్వ విధాన నిర్ణయాలు, వాటివల్ల వస్తోన్న ఫలితాలనూ ఈ సర్వే విశ్లేషిస్తుంది. వీటితో పాటు వచ్చే ఏడాది ఎదురయ్యే ఆర్థిక సవాళ్లు, వాటిని ఎదుర్కొనే వ్యూహాలను కూడా ఈ సర్వే సూచిస్తుండడంతో దీనికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది.

బడ్జెట్‌కు దీనికి తేడా ఏంటంటే..!

కేంద్ర బడ్జెట్‌లో (Union Budget) వివిధ రంగాల్లో రాబడి, ఖర్చుల కేటాయింపులను మాత్రమే పేర్కొంటారు. కానీ ఆర్థిక సర్వేలో మాత్రం ప్రస్తుత సంవత్సరం దేశ ఆర్థిక వ్యవస్థ పనితీరు విశ్లేషణ, రాబోయే రోజుల్లో ఎదురయ్యే సవాళ్లు, చేపట్టాల్సిన సంస్కరణలను ప్రముఖంగా ప్రస్తావిస్తారు. అందుకే ఈ ఆర్థిక సర్వే ఆధారంగానే కేంద్ర బడ్జెట్‌ను రూపొందిస్తారు.

తొలిసారి ఎప్పుడు..?

బడ్జెట్‌ కన్నా ముందు ఆర్థిక సర్వేను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టడం ఎన్నో ఏళ్లుగా ఆనవాయితీగా వస్తోంది. మొట్టమొదటిసారిగా ఈ ఆర్థిక సర్వేను 1950-51 ఆర్థిక సంవత్సరంలో పార్లమెంటులో ప్రవేశపెట్టారు. 1964 వరకు సాధారణ బడ్జెట్‌తోనే కలిపి ప్రవేశపెట్టేవారు. కానీ, 1964 నుంచి దీన్ని బడ్జెట్‌ కన్నా ముందు ప్రత్యేకంగా ప్రవేశపెడుతున్నారు. కేంద్ర బడ్జెట్‌లో కేటాయింపుల ప్రతిపాదనలను తేలికగా అర్థం చేసుకోవడం కోసమే ఆర్థిక సర్వేను ప్రత్యేకంగా విడుదల చేస్తున్నారు. తాజాగా 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సర్వే నివేదికను ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ లోక్‌సభలో ప్రవేశపెట్టారు.

  

ఈ ఏడాది వృద్ధి రేటు 7%.. ఆర్థిక సర్వేలోని ముఖ్యాంశాలు

ప్రపంచంలో భారత్‌ అత్యంత వేగంగా వృద్ధిని సాధిస్తోందని ఆర్థిక సర్వే (Economic Survey) తెలిపింది. దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు 2022- 23లో 7శాతంగా నమోదవుతుందని అంచనా వేసింది. 2023- 24లో అది 6.5 శాతానికి పరిమితమవుతుందని తెలిపింది. ‘పర్చేజింగ్‌ పవర్‌ ప్యారిటీ (PPP)’ పరంగా చూస్తే ప్రపంచంలోనే భారత్‌ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అని పేర్కొంది. బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా 2022-23 ఆర్థిక సర్వే (Economic Survey)ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ (Nirmala Sitharaman) మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు.

ఆర్థిక సర్వేలో కీలకాంశాలు..

మహమ్మారి సమయంలో స్తంభించిన భారత ఆర్థిక వ్యవస్థ దాదాపు పూర్తిగా కోలుకుంది. నిలిచిపోయిన కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యాయి. నెమ్మదించిన అంశాలన్నీ తిరిగి పుంజుకున్నాయి.

 ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6.8% వద్ద ద్రవ్యోల్బణం వ్యక్తిగత వినిమయాన్ని తగ్గించే అధిక స్థాయిలోగానీ, లేదా పెట్టుబడులను బలహీనపరిచేంత తక్కువ స్థాయిలోగానీ ఉండదు.

 రుణరేట్లు దీర్ఘకాలం అధికంగా ఉండే అవకాశం ఉంది. కఠిన ద్రవ్య పరపతి విధాన వైఖరిని మరికొంత కాలం పొడిగించడానికి స్థిరంగా కొనసాగుతున్న ద్రవ్యోల్బణం దోహదం చేయనుంది.

 అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ ఇంకా వడ్డీరేట్లు పెంచే అవకాశం ఉన్నందున రూపాయి మారక విలువకు సవాళ్లు ఎదురుకావొచ్చు.

 ఎగుమతుల వృద్ధి నెమ్మదించడం, కరెంటు ఖాతా లోటు విస్తృతమవుతున్న నేపథ్యంలో రూపాయికి ఒడుదొడుకులు తప్పకపోవచ్చు.

 ప్రపంచవ్యాప్తంగా కమొడిటీ ధరలు అధిక స్థాయిల్లో కొనసాగుతున్నందున కరెంటు ఖాతా లోటు (CAD) మరింత పెరిగే అవకాశం ఉంది.

 ఇతర దేశాలతో పోలిస్తే కరోనా మహమ్మారి సంక్షోభం నుంచి భారత్‌ చాలా వేగంగా కోలుకుంది. దేశీయ గిరాకీ, మూలధన పెట్టుబడుల్లో పెరుగుదల భారత వృద్ధికి దోహదం చేయనున్నాయి.

 ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధంలో ఎగుమతుల వృద్ధి కాస్త నెమ్మదించింది.

 ప్రపంచ ఆర్థిక వృద్ధి, వాణిజ్య కార్యకలాపాలు నెమ్మదించడం ఎగుమతులపై ప్రభావం చూపాయి.

 స్థిరాస్తి రంగంతో పాటు నిర్మాణ కార్యకలాపాలు పుంజుకోవడంతో ఉపాధి కల్పన మెరుగైంది. వలస కూలీలు తిరిగి పట్టణాలకు చేరడానికి ఇది దోహదం చేసింది.

 2023-24 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం సాధారణ స్థాయిలో ఉండి, రుణ వ్యయం తక్కువగా ఉన్నట్లయితే ‘సూక్ష్మ, చిన్న మధ్యస్థాయి పరిశ్రమ (MSME)’ల రుణాల వృద్ధి మెరుగ్గా ఉండే అవకాశం ఉంది.

 కొవిడ్‌ తీవ్రస్థాయిలో ఉన్నప్పుడు తీసుకొచ్చిన ‘అత్యవసర రుణ హామీ పథకం (ECLGS)’ వల్ల MSMEలు వేగంగా కోలుకుంటున్నాయి.

2023-24లో 6.5 శాతం వృద్ధి..

‣ వచ్చే ఆర్థిక సంవత్సరంలో దేశంలో 6.5శాతం వృద్ధి నమోదయ్యే అవకాశముందని ఆర్థిక సర్వే అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి 7శాతంగా ఉండనున్నట్లు తెలిపింది.

 అమెరికా ఫెడ్‌ వడ్డీరేట్లు మరింత పెరగొచ్చనే అంచనాలున్నాయి. దీంతో రూపాయి క్షీణత సవాళ్లు కొనసాగే అవకాశముంది.

 ప్రపంచవ్యాప్తంగా వినియోగ వస్తువుల ధరలు అధికంగానే ఉన్నాయి. దీంతో ద్రవ్యలోటు మరింత పెరగనుంది. రూపాయి ఒత్తిడికి గురవ్వొచ్చు.

 మహమ్మారి నుంచి భారత్‌ వేగంగా కోలుకుంటోంది. దేశీయ డిమాండ్‌, క్యాపిటల్‌ పెట్టుబడులు వృద్ధిని బలోపేతం చేస్తున్నాయి.

వచ్చే ఏడాది వృద్ధి రేటు 6.8%

ప్రపంచంలో భారత్‌ అత్యంత వేగంగా వృద్ధిని సాధిస్తోందని ఆర్థిక సర్వే తెలిపింది. దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు(జీడీపీ) 2022-23లో 7శాతంగా నమోదవుతుందని అంచనా వేసింది. 2023-24లో అది 6 నుంచి 6.8 శాతానికి పరిమితమవుతుందని పేర్కొంది. కొనుగోలు శక్తి (పర్చేజింగ్‌ పవర్‌ ప్యారిటీ/పీపీపీ) పరంగా చూస్తే ప్రపంచంలోనే భారత్‌ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అని వెల్లడించింది. దేశీయంగా వినియోగం పెరుగుతున్నందున ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ఆశాభావం వ్యక్తం చేసింది. పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా 2022-23 ఆర్థిక సర్వేను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ‘‘అంతర్జాతీయ వృద్ధిని మొదట కరోనా మహమ్మారి దెబ్బతీయగా.. ఆపై రష్యా-ఉక్రెయిన్‌ మధ్య యుద్ధం ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణానికి దారితీశాయి. దానిని అదుపులోకి తెచ్చేందుకు అమెరికా ఫెడరల్‌ రిజర్వుతో సహా అన్ని దేశాల కేంద్ర బ్యాంకులు అనుసరించిన వడ్డీరేట్ల పెంపు ఆర్థిక వ్యవస్థలను అతలాకుతలం చేస్తున్నాయి. అమెరికా ఫెడ్‌ రేట్ల పెంపు చర్యలతో ఆ దేశ స్టాక్‌ మార్కెట్లలోకి పెట్టుబడుల ప్రవాహాన్ని పెంచుతోంది. దీంతో అనేక దేశాల కరెన్సీతో పోలిస్తే డాలర్‌ విపరీతంగా బలపడుతోంది. ఈ కారణంగా పలు దేశాలు కరెంటు ఖాతా లోటు(సీఏడీ)ను ఎదుర్కొంటున్నాయి. అంతేకాకుండా దిగుమతులపై ఎక్కువగా ఆధారపడే భారత్‌ లాంటి దేశాలు ద్రవ్యోల్బణ ఒత్తిళ్లకు గురవుతున్నాయి. అయినప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ కరోనా మహమ్మారి దాడి పూర్వస్థితికి చేరుకుంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో అనేక దేశాల కంటే ముందువరుసలో నిలిచి పూర్తిస్థాయి రికవరీని సాధించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఐరోపాలో తలెత్తిన సంక్షోభం(రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం)తో కూడా మనదేశం ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను ఎదుర్కొంటోంది. ఇతర దేశాల కరెన్సీతో పోలిస్తే మన రూపాయి పనితీరు బాగానే ఉంది. ఇప్పటికీ అధికస్థాయిలో కొనసాగుతున్న అంతర్జాతీయ కమోడిటీ(ముఖ్యంగా ముడి చమురు) ధరలతో సీఏడీ ఆందోళనకరంగా పెరుగుతున్నా భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి తీరు బలంగా ఉంది’’ అని సర్వే వివరించింది.

మూడు ముప్పులు ముంచెత్తాయి

సర్వేపై కేంద్ర ముఖ్య ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వరన్‌ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..2020 నుంచి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మూడు ముప్పులు ముంచెత్తాయని పేర్కొన్నారు. ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలతో మిగిలిన దశాబ్దకాలం పాటు భారత వృద్ధి రేటు 6.5 శాతం నుంచి 7 శాతం మధ్య ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. ముడి చమురు ధర బ్యారెల్‌కు 100 డాలర్లకు మించకుండా ఉంటే దేశ అంచనా వృద్ధి రేటులో తేడా ఉండదన్నారు. పునరుత్పాదక ఇంధన మిళిత లక్ష్యాల సాధనలో మనదేశం గణనీయంగా ముందుకుసాగుతోందని తెలిపారు.

ఆర్థిక సర్వేలో కీలకాంశాలు..

 కొవిడ్‌ మహమ్మారి సమయంలో స్తంభించిన భారత ఆర్థిక వ్యవస్థ దాదాపు పూర్తిగా కోలుకుంది. నిలిచిపోయిన కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యాయి.

 ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6.8% వద్ద ద్రవ్యోల్బణం వ్యక్తిగత వినిమయాన్ని తగ్గించే అధిక స్థాయిలోగానీ, లేదా పెట్టుబడులను బలహీనపరిచేంత తక్కువ స్థాయిలోగానీ ఉండదు.

 రుణరేట్లు దీర్ఘకాలం అధికంగా ఉండే అవకాశం ఉంది. కఠిన ద్రవ్య పరపతి విధాన వైఖరిని మరికొంత కాలం పొడిగించడానికి స్థిరంగా కొనసాగుతున్న ద్రవ్యోల్బణం దోహదం చేయనుంది.

 అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ ఇంకా వడ్డీరేట్లు పెంచే అవకాశం ఉన్నందున రూపాయి మారక విలువకు సవాళ్లు ఎదురుకావొచ్చు.

 ఎగుమతుల వృద్ధి నెమ్మదించడం, సీఏడీ విస్తృతమవుతుండడంతో రూపాయికి ఒడుదొడుకులు తప్పకపోవచ్చు.

 ప్రపంచవ్యాప్తంగా కమోడిటీ ధరలు అధిక స్థాయిల్లో కొనసాగుతున్నందున బలహీనమైన రూపాయి విలువతో సీఏడీ మరింత పెరిగే అవకాశం ఉంది. జులై-సెప్టెంబరు కాలానికి సీఏడీ 4.4 శాతంగా ఉంది. ఇది అంతకు ముందు త్రైమాసికంలో 2.2 శాతంగా, ఏడాది క్రితం 1.3 శాతంగా ఉండేది.

 ప్రపంచ ఆర్థిక వృద్ధి, వాణిజ్య కార్యకలాపాలు నెమ్మదించడం ఎగుమతులపై ప్రభావం చూపాయి.

 స్థిరాస్తి రంగంతో పాటు నిర్మాణ కార్యకలాపాలు పుంజుకోవడంతో ఉపాధి కల్పన మెరుగైంది. వలస కూలీలు తిరిగి పట్టణాలకు చేరడానికి ఇది దోహదం చేసింది.

 2023-24 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం సాధారణ స్థాయిలో ఉండి, రుణ వ్యయం తక్కువగా ఉన్నట్లయితే ‘సూక్ష్మ, చిన్న మధ్యస్థాయి పరిశ్రమల’(ఎంఎస్‌ఎంఈ) రుణాల వృద్ధి మెరుగ్గా ఉండే అవకాశం ఉంది.

 కొవిడ్‌ తీవ్రస్థాయిలో ఉన్నప్పుడు తీసుకొచ్చిన ‘అత్యవసర రుణ హామీ పథకం’ వల్ల నిలు వేగంగా ఎంఎస్‌ఎంఈలు కోలుకుంటున్నాయి.

 వచ్చే ఆర్థిక సంవత్సరంలో.. మూలధన పెట్టుబడులు పుంజుకుంటాయి.

 పీఎం కిసాన్‌, పీఎం గరీబ్‌ కల్యాణ్‌ యోజన వంటి పథకాలు పేదరికాన్ని తగ్గించడంలో గణనీయంగా దోహదపడ్డాయి.

 దేశీయంగా వినియోగం పెరగడం వల్ల ఉపాధి అవకాశాలు మెరుగుపడుతున్నాయి. అయితే, మరిన్ని ఉద్యోగాల కల్పనకు ప్రైవేటు పెట్టుబడులు మరింత పెరగాలి.

 సీఏడీని ఎదుర్కోవడానికి, రూపాయి అస్థిరతను నిలువరించడానికి మన వద్ద చాలినని విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఉన్నాయి.

మన దేశంపై ప్రపంచ దేశాల ఆశావాదాన్ని, మౌలికరంగంపై దృష్టి, వ్యవసాయరంగంలో ప్రగతి, పరిశ్రమలు, భవిష్యత్తు రంగాలు వంటి వాటితో సహా భారత వృద్ధి పథాన్ని 2022-23 ఆర్థిక సర్వే సమగ్రంగా విశ్లేషించింది. 

- ప్రధాని నరేంద్ర మోదీ

ఆర్థిక సర్వేలోని మరికొన్ని ముఖ్యాంశాలు

 ప్రపంచ వృద్ధిలో మందగమనం అంతర్జాతీయ కమోడిటీల ధరలను కిందకు తెస్తుంది. ఈ కారణంగా 2024 ఆర్థిక సంవత్సరంలో దేశ సీఏడీ పరిస్థితి మెరుగు పడుతుంది.

 2014 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2019 ఆర్థిక సంవత్సరం నాటికి మొత్తం ఆరోగ్య వ్యయంలో ప్రభుత్వ వాటా 28.6 శాతం నుంచి 40.6 శాతానికి చేరింది.

 భారత వ్యవసాయ రంగం అద్భుత పనితీరు కనబరచింది. అయితే వాతావరణ మార్పులు, పెరిగిపోతున్న పెట్టుబడులు వంటి సమస్యల నేపథ్యంలో ఈ రంగానికి కొత్త దిశానిర్దేశం అవసరం.

 దేశవ్యాప్తంగా మధ్యలోనే బడి మానేసే పిల్లల రేటులో క్రమం తప్పకుండా తగ్గుదల చోటు చేసుకుంటోంది. మరోపక్క పాఠశాల, ఉన్నత విద్యలో విద్యార్థుల ప్రవేశాలు పెరుగుతున్నాయి.

 దేశ ఆర్థిక ప్రగతిలో సామాజిక రంగ మౌలిక సదుపాయాలు అభివృద్ధి మరింత కీలకం.

 2015 ఆర్థిక సంవత్సరంలో తీసుకొచ్చిన జన్‌ధన్‌-ఆధార్‌-మొబైల్‌ అంకురం కొవిడ్‌-19 టీకా కార్యక్రమానికి డిజిటల్‌ మౌలికసదుపాయమైన కొవిన్‌ రూపకల్పనలో ఉపకరించింది.

 పీఎం గతిశక్తి, జాతీయ లాజిస్టిక్స్‌ పాలసీ, ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకాలు తయారీ రంగ ఉత్పత్తికి ఊతమిస్తాయి.

 సాధారణ పరిస్థితులు నెలకొంటే వచ్చే ఆర్థిక సంవత్సరంలో 11 జీడీపీ నమోదుకు అవకాశం ఉంది.

 ఇతర దేశాలతో పోలిస్తే కరోనా మహమ్మారి సంక్షోభం నుంచి భారత్‌ చాలా వేగంగా కోలుకుంది. దేశీయ గిరాకీ, మూలధన పెట్టుబడుల్లో పెరుగుదల భారత వృద్ధికి దోహదం చేయనున్నాయి.

 ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధంలో ఎగుమతుల వృద్ధి కాస్త నెమ్మదించింది.

కొవిడ్‌ నుంచి కోలుకున్నాం

‘కొవిడ్‌’ పరిణామాల వల్ల తలెత్తిన ముప్పు నుంచి మన ఆర్థిక వ్యవస్థ త్వరగా కోలుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఆర్థిక సర్వే స్పష్టం చేసింది. వడ్డీరేట్లు తక్కువగా ఉంచడంతో పాటు సరఫరా వ్యవస్థల పరంగా తీసుకున్న చర్యలు ఇందుకు కారణమని విశ్లేషించింది. ‘అసాధారణ సవాళ్లను ఇతర దేశాలతో పోల్చితే భారతదేశం ఎంతో సమర్థంగా తట్టుకుని నిలిచింది’ అని సర్వే పేర్కొంది, ఇంకా అనేక సానుకూలాంశాలను ప్రస్తావించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7 శాతం వృద్ధి ఉండొచ్చని, ప్రైవేటు వినియోగం ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఎంతో ఆకర్షణీయంగా 58.5 శాతానికి పెరిగిందని, హోటళ్లు, వర్తకం, రవాణా రంగాలు కళకళలాడాయని వివరించింది. వచ్చే దశాబ్దం మనదేనని ధీమా వ్యక్తం చేసింది. ఎంఎస్‌ఎంఈ సంస్థలు ఎంతో అధికంగా రుణాలు తీసుకున్నాయని, ఇతర అన్ని రంగాల్లో ఇదే జోరు కొనసాగి 2023-24లో బ్యాంకు రుణాల్లో అధిక వృద్ధి నమోదవుతుందని అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్‌- నవంబరు మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వ పెట్టుబడులు 63.4% పెరిగినట్లు పేర్కొంది. కొన్ని ఇబ్బందులనూ సర్వే ప్రస్తావించింది. ద్రవ్యోల్బణం అధిక స్థాయుల నుంచి దిగివచ్చినప్పటికీ, రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నిర్దేశించుకున్న 6 శాతం కంటే అధికంగా 6.8 శాతంగా ఈ ఆర్థిక సంవత్సరంలో నమోదు కావచ్చని పేర్కొంది. దీనివల్ల రుణాలపై వడ్డీభారం మరికొంతకాలం అధికంగానే  ఉండొచ్చని తెలిపింది. కరెంటు ఖాతా లోటు వల్ల రూపాయి మారకపు విలువపై ఒత్తిడి కొనసాగుతోందని వివరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో ఎగుమతుల్లో వృద్ధి తగ్గిందని, ప్రపంచ వృద్ధి రేటు తక్కువగా ఉండటం దీనికి కొంత కారణమని పేర్కొంది.

రూ.9.9 లక్షల కోట్లకు ద్రవ్యలోటు

ప్రభుత్వ వ్యయాలు, ఆదాయాల అంతరమైన ద్రవ్యలోటు 2022-23 ఏప్రిల్‌-డిసెంబరులో రూ.9,92,976 కోట్లకు చేరుకుంది. 2022-23 బడ్జెట్‌ అంచనా(బీఈ) అయిన రూ.16.61 లక్షల కోట్లలో ఇది 59.8 శాతానికి సమానం. ఆదాయ వసూళ్లలో వృద్ధి స్తబ్దుగా ఉండడం ఇందుకు కారణం.   2021-22 ఇదే సమయానికి బడ్జెట్‌ అంచనాల్లో ద్రవ్యలోటు 50.4 శాతానికి చేరింది.  ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌-డిసెంబరులో నికర పన్ను ఆదాయాలు    రూ.15.55 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. 2022-23 బడ్జెట్‌ అంచనాల్లో ఇవి 80.4 శాతానికి సమానం. 2021-22 ఇదే సమయంలో నికర పన్ను ఆదాయాలు బడ్జెట్‌ అంచనాల్లో 95.4 శాతంగా ఉన్నాయి. 2022-23 ఏప్రిల్‌-డిసెంబరు లో కేంద్ర ప్రభుత్వ మొత్తం వ్యయాలు బడ్జెట్‌(2022-23) అంచనాల్లో 71.4 శాతంగా ఉన్నాయి. అంతక్రితం ఏడాది 72.4 శాతంతో పోలిస్తే ఇవి తక్కువే.

జనవరిలో జీఎస్‌టీ వసూళ్లు రూ.1.56 లక్షల కోట్లు

వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) వసూళ్లు జనవరిలో రూ.1,55,922  కోట్లుగా నమోదైనట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ మంగళవారం వెల్లడించింది. 2022 ఏప్రిల్‌లో వసూలైన రూ.1.68 లక్షల కోట్ల తర్వాత ఇదే అత్యధిక స్థాయి కావడం విశేషం. ఈ ఆర్థిక సంవత్సరం (2022-23)లో నెలకు రూ.1.50 లక్షల కోట్ల మైలురాయిని దాటడం ఇది మూడోసారి.  
డిసెంబరులో కీలక రంగాల వృద్ధి 7.4%

డిసెంబరులో 8 కీలక రంగాల వృద్ధి 3 నెలల గరిష్ఠమైన 7.4 శాతానికి చేరింది. 2021 డిసెంబరులో ఇది 4.1 శాతమే. బొగ్గు, ఎరువులు, ఉక్కు, విద్యుత్‌ రంగాల్లో మంచి వృద్ధి నమోదు కావడంతో ఈసారి కీలక రంగాలు రాణించాయి.

2030 కల్లా 7 లక్షల కోట్ల డాలర్లకు

భారత ఆర్థిక వ్యవస్థ 6.5-7 శాతం వృద్దితో సాగి, 2025-26 కల్లా 5 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి చేరొచ్చు. గత 30 ఏళ్లుగా భారత జీడీపీ, డాలర్ల రూపేణ సగటున 9 శాతం వార్షిక వృద్ధిని కనబరచింది. డాలరుతో పోలిస్తే రూపాయి విలువ క్షీణించిన సమయంలోనూ దీనిని సాధించడం విశేషం. ఒక వేళ రూపాయి బలోపేతం అయితే డాలర్ల రూపేణ 9 శాతం కంటే అధిక వృద్ధిని సాధించే అవకాశం ఉంటుంది. అపుడు 2030 కల్లా 7 లక్షల కోట్ల డాలర్లకు ఆర్థిక వ్యవస్థ చేరడమూ సాధ్యమే.    - ముఖ్య ఆర్థిక సలహాదారు వి.అనంత నాగేశ్వరన్‌

రూపాయిపై.. ఒత్తిడి కొనసాగొచ్చు

కరెంట్‌ ఖాతా లోటు(సీఏడీ) పెరుగుతూ ఉన్నందున భారత రూపాయిపై ఒత్తిడి కొనసాగొచ్చని ఆర్థిక సర్వే అంచనా వేసింది. ‘ఏప్రిల్‌-జూన్‌లో   2.2 శాతంగా ఉన్న సీఏడీ.. అధిక వాణిజ్య లోటు కారణంగా సెప్టెంబరు త్రైమాసికానికి 4.4 శాతానికి చేరింది. అంతర్జాతీయ అనిశ్చితల మధ్య అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీరేట్లు పెంచడంతో, పెట్టుబడులు తరలిపోయి భారత రూపాయి ఒత్తిడిలో కొనసాగింది. ఒక దశలో అమెరికా డాలర్‌ రూ.83 స్థాయినీ చేరింది. కమొడిటీ ధరలు రికార్డు స్థాయిల నుంచి దిగివచ్చినా.. ఇంకా రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధానికి ముందు స్థాయిల కంటే అధికంగానే ఉన్నాయి. బలమైన దేశీయ గిరాకీ, అధిక కమొడిటీ ధరల వల్ల దేశ దిగుమతుల బిల్లు పెరుగుతోంద’ని వివరించింది.

ఇళ్ల ధరలు స్థిరపడుతున్నాయ్‌

రెండేళ్ల పాటు కొవిడ్‌-19 పరిణామాలతో ఇబ్బంది పడిన గృహ నిర్మాణరంగం కుదుట పడుతోంది.  ఇళ్ల విపణి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రికవరీ బాటలో ఉంది. ఇళ్ల ధరలు స్థిరపడుతున్నాయి. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధ పరిణామాల వల్ల నిర్మాణ సామగ్రి ధరలు పెరిగి, ఇళ్ల ధరలూ అధికమయ్యాయి. గిరాకీ పుంజుకుంటున్నందున, అమ్ముడవ్వాల్సిన గృహాల సంఖ్య తగ్గుతోంది. ఉక్కు, ఇనుప ఖనిజం వంటి నిర్మాణ సామగ్రిపై దిగుమతి సుంకాలను తగ్గించిన నేపథ్యంలో, ఇళ్ల నిర్మాణ వ్యయంతో పాటు ధరల్లో పెరుగుదల పరిమితం అవుతుందని ఆర్థిక సర్వే అంచనా వేసింది. గృహ రుణాలపై వడ్డీ రేట్లు పెరగడం, స్థిరాస్తి ధరలు అధికమవుతున్నా, గిరాకీ పుంజుకుని గృహాల విక్రయాల్లో వృద్ధి కనిపించింది.

రుణ హామీ పథకంతో ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలకు ఊపిరి

భారత్‌లోని సూక్ష్మ, చిన్న, మధ్య స్థాయి కంపెనీలు (ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ) ఆర్థిక ఒత్తిళ్లలో కూరుకుపోకుండా.. అత్యవసర రుణ అనుసంధానిత హామీ పథకం (ఈసీఎల్‌జీఎస్‌) కాపాడిందని ఆర్థిక సర్వే వివరించింది. ఈ రంగానికిచ్చిన రుణాల్లో వృద్ధి 2022 జనవరి-నవంబరులో సగటున 30.6%గా నమోదు కావడం వీటికి మద్దతుగా నిలిచింది. ‘కరోనా సమయంలో బాగా ఇబ్బందులు పడ్డ కంపెనీల్లో 83 శాతం మేర ఈసీఎల్‌జీఎస్‌ను వినియోగించుకున్నాయి. వీటిల్లో సగం కంపెనీలకు పైగా రూ.10 లక్షల్లోపు రుణాలు తీసుకున్నాయ’ని సర్వే వెల్లడించింది.  

 దేశంలోని 6 కోట్ల ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈల్లో 12 కోట్ల మంది పనిచేస్తున్నారు. జీడీపీలో వీటి వాటా 35%.

ఎఫ్‌డీఐలు పుంజుకుంటాయ్‌

దేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డీఐ) రాబోయే కొద్ది నెలల్లో పెరగనున్నాయని ఆర్థిక సర్వే అంచనా వేసింది. భారత్‌ అధిక ఆర్థిక వృద్ధిని నమోదు చేస్తుండడంతో పాటు.. దేశీయంగా వ్యాపార వాతావరణం మెరుగుపడడం ఇందుకు దోహదం చేస్తుందని తెలిపింది. ‘రష్యా-ఉక్రెయిన్‌ సంఘర్షణ నేపథ్యంలో ఏర్పడ్డ అంతర్జాతీయ అనిశ్చితి వల్ల 2022-23 ఏప్రిల్‌-సెప్టెంబరులో తయారీ రంగంలోకి ఎఫ్‌డీఐలు 26.9 బిలియన్‌ డాలర్లకు పరిమితమయ్యాయి. అంతక్రితం ఏడాది ఇదే సమయంతో పోలిస్తే ఇవి 14 శాతం తక్కువ. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో మొత్తం ఎఫ్‌డీఐలు  39 బి. డాలర్లకు తగ్గాయి. 2021-22 తొలి 6 నెలల్లో ఇవి  42.86 బి. డాలర్లుగా ఉన్నాయి.

ఎలక్ట్రానిక్స్‌ ఎగుమతుల్లో 55% వృద్ధి

ఎలక్ట్రానిక్స్‌ పరికరాల ఎగుమతులు 55 శాతం వార్షిక వృద్ధిని సాధించాయి. గత ఏడేళ్లలో దేశంలో మొబైల్‌ ఫోన్ల ఉత్పత్తి అయిదింతలైందని ఆర్థిక సర్వే తెలిపింది. స్థానిక కంపెనీల ఉత్పత్తి సామర్థ్యాలు పెరిగేందుకు ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహకాల (పీఎల్‌ఐ) పథకం దోహదపడుతోందని వెల్లడించింది. అంతర్జాతీయంగా రెండో అతిపెద్ద మొబైల్‌ ఫోన్‌ తయారీదారుగా భారత్‌ అవతరించింది.

ఉత్పత్తి రంగ కేంద్రంగా ఎదుగుతాం: ఈ దశాబ్దంలో భారత్‌ ఉత్పత్తి రంగ కేంద్రంగా ఎదిగే అవకాశం ఉంది. అమెరికా-చైనా వర్తక యుద్ధం, కొవిడ్‌-19 ముప్పు, ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం రూపేణ అదనపు సవాళ్ల నేపథ్యంలో,  విదేశీ కంపెనీలు సరఫరా వ్యవస్థలను బలోపేతం చేసుకునేందుకు చేస్తున్న యత్నాలను అందిపుచ్చుకుందాం.

ఎగుమతులు పెరగకపోవచ్చు

అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో రికవరీ రాకపోతే, వచ్చే ఆర్థిక సంవత్సరం భారత ఎగుమతుల్లో వృద్ధి తగ్గొచ్చు. 2021-22లో భారత మర్కండైజ్‌ ఎగుమతులు జీవన కాల గరిష్ఠమైన 422 బిలియన్‌ డాలర్లకు చేరాయి. పలు సవాళ్ల నేపథ్యంలో అంతర్జాతీయ వాణిజ్యం నెమ్మదిస్తోంది. దీంతో భారత వస్తువుల ఎగుమతుల వృద్ధిపై ప్రభావం పడే అవకాశం ఉంది. 2022 డిసెంబరులో భారత ఎగుమతులు 12.2 శాతం తగ్గి 34.48 బి.డాలర్లకు పరిమితమయ్యాయి. వాణిజ్య లోటు 23.76 బి.డాలర్లకు చేరింది. 2022-23 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌-డిసెంబరు మధ్య దేశ మొత్తం ఎగుమతులు 9 శాతం పెరిగి 332.76 బి.డాలర్లకు చేరగా, దిగుమతులు 24.96 శాతం పెరిగి  551.7 బి.డాలర్లకు చేరాయి.

ఏటా కోటి విద్యుత్‌ వాహన విక్రయాలు

దేశీయంగా విద్యుత్‌ వాహనాల (ఈవీలు) విక్రయాలు 2030 నాటికి, ఏటా కోటికి చేరొచ్చని సర్వే అంచనా వేసింది. దీంతో ఈ రంగంలో 5 కోట్ల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొంది. 2022 డిసెంబరు ఆఖరుకు చూస్తే, వాహన విక్రయాల పరంగా జపాన్‌, జర్మనీలను అధిగమించి, భారత్‌ మూడో స్థానానికి చేరింది. హరిత ఇంధనం వైపు దేశం అడుగులు వేయడంలో వాహన పరిశ్రమ కీలక పాత్ర పోషించనుంది. దేశీయ విద్యుత్‌ వాహనాల విపణి 2022 నుంచి 2030 వరకు 49 శాతం వార్షిక సంచిత వృద్ధి రేటుతో సాగనుంది.

పెట్టుబడుల ఉపసంహరణతో ఇప్పటివరకు రూ.4.07 లక్షల కోట్లు

గత 9 ఏళ్లలో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా ప్రభుత్వం రూ.4.07 లక్షల కోట్ల నిధుల్ని సమీకరించింది. 2014 తర్వాత ప్రభుత్వం ప్రైవేటు రంగాన్ని అభివృద్ధిలో సహ భాగస్వామిగా  చేసుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23)లో నిర్దేశించుకున్న రూ.65,000 కోట్ల పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యంలో, 2023 జనవరి 18 నాటికి 48 శాతం (రూ.31,000 కోట్లు) సాధించింది. 2014-15 నుంచి 2022-23 వరకు (2023 జనవరి 18 నాటికి) 154 లావాదేవీల ద్వారా ప్రభుత్వం రూ.4.07 లక్షల కోట్ల నిధుల్ని ఇలా సమీకరించింది. ఆయా సంస్థల్లో మైనార్టీ వాటా విక్రయాల ద్వారా రూ.3.02 లక్షల కోట్లు, వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ.69,412 కోట్లు సమీకరించింది.

దేశీయ ఔషధ విపణి 130 బి.డాలర్లకు

దేశీయ ఔషధ విపణి 2030 నాటికి 130 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.10.6 లక్షల కోట్ల) స్థాయికి చేరొచ్చని ఆర్థిక సర్వే వెల్లడించింది. దేశ ఔషధ ఎగుమతులు 2020-21లో స్థిరంగా 24 శాతం వృద్ధి సాధించాయి. 150కి పైగా దేశాల్లో మన అత్యవసర ఔషధాలకు ఉన్న గిరాకీ, ఇతర సరఫరాలతో ఇది సాధ్యమైంది. అంతర్జాతీయ ఔషధ పరిశ్రమలో భారత ఔషధ పరిశ్రమకు గొప్ప స్థానం ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఔషధాల ఉత్పత్తిలో పరిమాణం పరంగా మూడో స్థానం, విలువ పరంగా 14వ స్థానంలో భారత్‌ ఉంది. అంతర్జాతీయంగా జెనరిక్‌ ఔషధాలను సరఫరా చేస్తున్న అతి పెద్ద దేశం మనదే. పరిమాణ పరంగా 20 శాతం వాటా కలిగి ఉంది. టీకాల సరఫరాలో 60 శాతం వాటా కలిగి ఉంది.

రూ.5.06 లక్షల కోట్లు సమీకరించిన కంపెనీలు

దేశీయ కంపెనీలు గత ఏడాది ఏప్రిల్‌- నవంబరులో రూ.5.06 లక్షల కోట్ల ఈక్విటీ, రుణ పెట్టుబడులు సమీకరించాయి. 2021 ఇదేకాలంలో సమీకరించిన రూ.5.53 లక్షల కోట్లతో పోల్చితే ఇవి 8.5% తక్కువ. రూ.5.06 లక్షల కోట్లలో రూ.3.92 లక్షల కోట్లు రుణ పెట్టుబడులు కాగా, రూ.1.14 లక్షల కోట్లు మాత్రమే ఈక్విటీ పెట్టుబడుల రూపంలో లభించాయి. 2021లో రుణ పెట్టుబడులు రూ.3.71 లక్షల కోట్లు కాగా, ఈక్విటీ పెట్టుబడులు రూ.1.81 లక్షల కోట్లుగా ఉన్నాయి. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, కేంద్ర బ్యాంకుల కఠిన పరపతి నిర్ణయాలతో ఎఫ్‌పీఐలు 2022-23 ఏప్రిల్‌-డిసెంబరులో ఎఫ్‌పీఐలు నికరంగా రూ.16,153 కోట్ల నిధుల్ని మార్కెట్ల నుంచి వెనక్కి తీసుకున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ద్రవ్యోల్బణం

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23)లో అత్యధిక ద్రవ్యోల్బణం రేటు విషయంలో దేశంలో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత స్థానాల్లో పశ్చిమబెంగాల్‌, హరియాణా, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌, గుజరాత్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం మంగళవారం విడుదల చేసిన ఆర్థిక సర్వే ఈ వివరాలను వెల్లడించింది. ద్రవ్యోల్బణం పెరుగుదలకు ప్రధాన కారణం ఇంధనం, వస్త్రాల ధరలేనని సర్వే స్పష్టంచేసింది. చాలా రాష్ట్రాల్లో పట్టణ ప్రాంతాల్లో కంటే గ్రామీణ ప్రాంతాల్లోనే అత్యధిక ద్రవ్యోల్బణం రేటు నమోదైనట్లు పేర్కొంది. ఆహార పదార్థాల ధరల పెరుగుదలే ఇందుకు కారణమని వెల్లడించింది. హైదరాబాద్‌ మెట్రో నగరంలో స్థిరాస్తి (రియల్‌ ఎస్టేట్‌) భూం కొనసాగుతోందని సర్వే పేర్కొంది. తల్లుల మరణాలను తగ్గించడంలో దేశంలో తెలంగాణ మూడో స్థానంలో ఉండగా, కుళాయిల ద్వారా ఇంటింటికీ రక్షిత తాగునీరు అందిస్తున్న నాలుగు రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని వెల్లడించింది. సర్వేలోని ముఖ్యాంశాలివీ..

ధరలు దంచేశాయి

తెలంగాణలో 2021-22 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం 7% ఉండగా 2022-23లో 8.5 శాతానికి పెరిగింది. గత ఏడాది ఏప్రిల్‌ నుంచి సెప్టెంబరు వరకూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో కూరగాయల ధరలు విపరీతంగా పెరిగాయి. సెప్టెంబరులో అత్యధికంగా నమోదయ్యాయి.

విద్యుత్‌ ఛార్జీల సవరణ

ఈ ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కర్ణాటక, మధ్యప్రదేశ్‌, హరియాణా, కేరళ, అస్సాం సహా కేంద్రపాలిత ప్రాంతాలు విద్యుత్‌ ఛార్జీలను పెంచాయి.

 తెలంగాణ, తమిళనాడు, కేరళ ఆస్తిపన్ను రాబడులు పెంచుకునేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నాయి.

కర్మాగారాల్లో పనిచేసే వారిలో ఏడో స్థానం

 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కర్మాగారాల్లో పనిచేసే వారి సంఖ్య పరంగా తమిళనాడు, గుజరాత్‌, మహారాష్ట్ర మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. తెలంగాణ 7, ఆంధ్రప్రదేశ్‌ 9వ స్థానంలో ఉన్నాయి.

 2017-18తో పోలిస్తే 2020-21 నాటికి మహిళా కార్మిక శక్తి భాగస్వామ్యం ఆంధ్రప్రదేశ్‌లో 2% పెరగ్గా, తెలంగాణలో 15% పెరిగింది.

ఎంఎంఆర్‌లో మూడో స్థానం

ప్రసవ సమయంలో తల్లుల మరణాలు (మెటర్నల్‌ మోర్టాలిటీ రేట్‌-ఎంఎంఆర్‌).. ప్రతి లక్ష ప్రసవాలకు 70 కంటే తక్కువగా ఉండాలనేది లక్ష్యం కాగా.. తెలంగాణ సహా 8 రాష్ట్రాలు దీనిని చేరుకున్నాయి. ఈ విషయంలో కేరళ (19 మరణాలు), మహారాష్ట్ర (33), తెలంగాణ (43), ఏపీ (45), తమిళనాడు (54) రాష్ట్రాలు తొలి 5 స్థానాల్లో నిలిచాయి.

 ప్రజల వైద్యం కోసం తెలంగాణ ప్రభుత్వం చేసే వ్యయం 40.9 శాతంగా 

ఆర్థిక సర్వే 2022-23 డౌన్‌లోడ్‌ చేసుకోండి

Posted Date : 09-02-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌