• facebook
  • whatsapp
  • telegram

ప్రణాళికలు (Plannings)

* ప్రపంచంలోనే ప్రణాళికలను మొదటిసారి రూపొందించిన దేశం - యూఎస్ఎస్ఆర్ (లెనిన్ కాలంలో 1917 - 1920 మధ్యలో రూపొందించారు)
* 1929లో ప్రపంచంలో మొదటిసారిగా అమెరికాలోని వాల్‌స్ట్రీట్‌లో ఆర్థికమాంద్యం సంభవించి, ప్రపంచ దేశాలకు విస్తరించింది. అయితే రష్యా (యూఎస్ఎస్ఆర్) మాత్రం ప్రణాళికల అమలు చేసి ఆర్థిక మాంద్యాన్ని అధిగమించడంతో ప్రపంచ దేశాలన్నీ ప్రణాళికల పై మొగ్గు చూపాయి.
* భారతదేశం రష్యా నుంచి ప్రణాళికలను స్వీకరించి రాజ్యాంగేతర ప్రణాళికా సంఘాన్ని నెలకొల్పింది.
* ఆర్థికమాంద్యం సంభవించని ఒకే ఒక దేశం - రష్యా

 

ప్రణాళికా నిర్వచనాలు:
 

* ఒక దేశం కొన్ని నిర్ణీత లక్ష్యాలను ఒక నిర్ణీత కాలానికి సంబంధించి సాధించడానికి రూపొందించి అమలు చేసేవే ప్రణాళికలు.
           ''ప్రభుత్వం ఆలోచనాత్మకంగా, ఉద్దేశపూర్వకంగా, సుదీర్ఘ ఆలోచనలతో కొన్ని ఆర్థిక ప్రాధాన్యాలను ఎంపిక చేసుకుని వాటిని సాధించడానికి రూపొందించినవే ప్రణాళికలు'' - బార్బానా వూటన్
           ''లభ్యమయ్యే వనరులను కొన్ని నిర్దిష్ట లక్ష్యాలను సాధించడానికి ప్రభుత్వం సమర్థంగా, ఉద్దేశపూర్వకంగా, స్పష్టమైన ఆలోచనలతో కేటాయింపులు చేసి, రూపొందించిన ప్రక్రియే ప్రణాళిక'' - ప్రణాళిక సంఘం

 

ప్రొఫెసర్ డికిన్‌సన్ నిర్వచనం:
 

* ఎంత వస్తు పరిమాణాన్ని ఉత్పత్తి చేయాలి? ఏ విధంగా ఉత్పత్తి చేయాలి? ఉత్పత్తి చేసిన వస్తువులను ఏవిధంగా కేటాయించాలి? .... లాంటి ముఖ్యాంశాలను ఆర్థిక వ్యవస్థ పరిశీలించాక నిర్దేశించే ఒక పద్ధతి. ఈ పద్ధతిలో కేంద్ర అధికార సంస్థ ఉద్దేశపూర్వకంగా నిర్ణయించే విధానాన్నే ప్రణాళికగా చెప్పవచ్చు.
 

స్వాతంత్య్రానికి పూర్వం భారత్‌లో ప్రణాళికా విధానం
 

* భారతదేశంలో ప్రణాళిక పితామహుడు - మోక్షగుండం విశ్వేశ్వరయ్య.
* ప్రణాళికలకు సంబంధించిన వివిధ అంశాలను తెలుపుతూ ఇతడు 1934లో Planned Economy for India అనే గ్రంథం రాశారు.
* భారతదేశంలో ప్రణాళికలకు మార్గదర్శి - జవహర్‌లాల్ నెహ్రూ.
* మనదేశానికి ప్రణాళికలు అవసరమని చెప్పిన జాతీయ నాయకుడు - సుభాష్ చంద్రబోస్.

 

బాంబే ప్రణాళిక (Bombay Plan) (1943 - 44)
 

* బొంబాయికి చెందిన ఎనిమిది మంది పారిశ్రామికవేత్తలు A Plan of Economy Development for India అనే పేరుతో Bombay Plan ను రూపొందించారు.
* బాంబే ప్రణాళికకు పెట్టుబడిదారీ లక్షణాలు ఉన్నాయి.
* బాంబే ప్లాన్‌ను 'టాటా బిర్లా - ప్లాన్', 'పారిశ్రామిక ప్రణాళిక' అని కూడా అంటారు. ఇది భారీ, మౌలిక పరిశ్రమలకు ప్రాధాన్యాన్నిచ్చింది.
* ఈ ప్రణాళిక పెట్టుబడి రూ.10,000 కోట్లు. కాలవ్యవధి 15 సంవత్సరాలు. దీని లక్ష్యం - తలసరి ఆదాయాన్ని రెట్టింపు చేయడం.
* ఈ ప్రణాళిక ద్వారా జాతీయ ఆదాయం మూడు రెట్లు పెరుగుతుందని అంచనా వేశారు.

 

తలసరి ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి కావాల్సిన మార్గాలు:
 

1. వ్యవసాయ రంగాన్ని 130% పెంచాలి.
2. పారిశ్రామిక రంగాన్ని 500% పెంచాలి.
3. సేవా రంగాన్ని 200% పెంచాలి.

 

గాంధీ ప్రణాళిక: (1944)
 

* 1944లో గాంధీజీ సిద్ధాంతాలను (సామ్యవాద భావాలు) దృష్టిలో పెట్టుకుని శ్రీమన్నారాయణ అగర్వాల్ రూ.3,500 కోట్ల వ్యయంతో 'గాంధీ ప్రణాళిక' ను రూపొందించారు.
* ఈ ప్రణాళికలో వ్యవసాయ రంగానికి, కుటీర, చేనేత, హస్తకళలకు ప్రాధాన్యం ఇచ్చారు.

 

ప్రజా ప్రణాళిక: (1945) (పీపుల్స్ ప్లాన్)
 

* 1945లో ఇండియన్ లేబర్ ఫెడరేషన్‌కు చెందిన ఎం.ఎన్.రాయ్ ఈ ప్రణాళికను రూపొందించారు.
* 10 సంవత్సరాల కాలానికి రూ.15,000 కోట్ల వ్యయంతో వ్యవసాయ, వినియోగ వస్తువుల పరిశ్రమలకు అత్యధిక ప్రాధాన్యాన్ని ఇచ్చారు. ఈ ప్రణాళిక సామ్యవాద లక్షణాలను కలిగి ఉంది.
* పరిశ్రమలు ప్రభుత్వ ఆధీనంలో ఉండాలి. ప్రైవేట్ రంగ పరిశ్రమలను జాతీయీకరణం చేయాలని, వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించాలని ఎం.ఎన్. రాయ్ పేర్కొన్నారు.

 

పేపర్ ప్లాన్:
 

* స్వాతంత్య్రానికి ముందు రూపొందించిన ప్రణాళికలను పేపర్ ప్లాన్ (Paper Plan) అంటారు. వీటిని ప్రభుత్వం అమలు పరచలేదు.
* 1938లో భారత జాతీయ కాంగ్రెస్ (ఐఎన్‌సీ), జవహర్‌లాల్ నెహ్రూ అధ్యక్షతన జాతీయ ప్రణాళిక కమిటీ (National Planning Committee)ని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ 1948లో తన నివేదికను ఇచ్చింది.
* 1944లో బ్రిటిష్ ప్రభుత్వం దలాల్ అధ్వర్యంలో స్వల్ప, దీర్ఘకాల ప్రణాళికలను తయారు చేసింది.

స్వాతంత్య్రం తర్వాత:
 

ప్రణాళిక సంఘం:
 

* 1950, ఫిబ్రవరి 15న అప్పటి ఆర్థిక శాఖ మంత్రి ఆర్.కె. షణ్ముగం షెట్టి ప్రణాళిక సంఘాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.
* 1950, మార్చి 15న ప్రణాళిక సంఘాన్ని ఏర్పాటు చేశారు.
* ప్రణాళిక సంఘం కార్యాలయం పేరు - యోజన భవన్
* ఇది రాజ్యాంగేతర, శాసనేతర సంస్థ, చట్టబద్ధమైంది కూడా కాదు. కేవలం సలహా సంఘం (Advisory Board) మాత్రమే.
* నెహ్రూ అధ్యక్షుడిగా ఉన్న కేంద్రమంత్రి మండలి తీర్మానం మేరకు ప్రణాళిక సంఘం ఏర్పడింది.

 

అధ్యక్షుడు: ప్రధానమంత్రి
 

కార్యనిర్వహణాధికారి: ప్రధానమంత్రి
 

* ప్రణాళిక సంఘంలో ముగ్గురు ఎక్స్ అఫీషియో సభ్యులు ఉంటారు. వారు:
    1. ప్రధానమంత్రి
    2. ఆర్థికమంత్రి
    3. ప్రణాళిక మంత్రి
* హోదా వల్ల ఛైర్మన్‌గా ఉంటే ఎక్స్ - అఫీషియో అని పిలుస్తారు.

 

వాస్తవ కార్యనిర్వహణాధికారి: ఉపాధ్యక్షుడు
 

*ప్రణాళికా సంఘానికి అధికారరీత్యా/ పదవి రీత్యా అధ్యక్షులు - ప్రధానమంత్రి
* సాధారణంగా ప్రధానమంత్రి ప్రణాళిక శాఖను ఎవరికీ కేటాయించరు కానీ సహాయ మంత్రిని నియమిస్తారు.

* ప్రణాళికా సంఘాన్ని ఆర్థిక కేబినేట్ అంటారు. దీని ప్రధాన విధి - ప్రణాళికలను తయారు చేయడం.
* మొదటి ప్రణాళికా సంఘం అధ్యక్షుడు - జవహర్‌లాల్ నెహ్రూ
* ఉపాధ్యక్షుడు - గుల్జారీలాల్ నందా
* ప్రణాళికా సంఘానికి చివరి అధ్యక్షుడు - నరేంద్ర మోదీ.
* ప్రణాళికా సంఘానికి చివరి ఉపాధ్యక్షుడు - మాంటెక్ సింగ్ అహ్లువాలియా (మొదటిసారిగా వరుసగా రెండుసార్లు నియమితులై, అధిక కాలం డిప్యూటీ ఛైర్మన్‌గా కొనసాగారు.)
* ప్రణాళిక సంఘానికి 14వ ఉపాధ్యక్షుడు - మన్మోహన్ సింగ్
* ప్రణాళిక సంఘానికి 23వ ఉపాధ్యక్షుడు - కె.సి. పంత్

 

జాతీయాభివృద్ధి మండలి (National Development Council - NDC)
 

ఇది 1952, ఆగస్టు 6న ఏర్పడింది. ఇది రాజ్యాంగేతర సంస్థ.
* దీనికి కూడా ప్రధానమంత్రే ఎక్స్ - అఫీషియో ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు.
* కేంద్ర కార్యనిర్వాహక వర్గం (Cabinet) సిఫారసు మేరకు ఏర్పాటు దీన్ని చేశారు.
* దీని ముఖ్య విధి ప్రణాళికల పరిశీలన, ప్రణాళికలు ఆమోదించడం.
* ఇది రాష్ట్రాలకు, ప్రణాళికా సంఘానికి మధ్య సహకారం పెంపొందిస్తుంది.
* దీనిలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులు.
* 1967లో చేసిన పాలనా సంస్కరణల సంఘం సిఫారసు మేరకు కేంద్రపాలిత ప్రాంతాల (Union Territories) లెఫ్టినెంట్ గవర్నర్‌లు, కేంద్ర కేబినెట్ మంత్రులు కూడా దీనిలో సభ్యులే.
* ప్రణాళికా సంఘం కంటే ఎన్‌డీసీకి ఎక్కువ అధికారాలున్నాయి.
* ఎన్‌డీసీని సూపర్ కేబినెట్‌గా కె. సంతానం వర్ణించారు.
* ఎన్‌డీసీకి ప్రణాళికా ముసాయిదాను మార్పులు చేసే అధికారం ఉంటుంది.

 

ప్రణాళికలు - రకాలు
 

1. వనరుల కేటాయింపును బట్టి ప్రణాళికలు: 2 రకాలు.
 

ఎ) భౌతిక ప్రణాళికలు: ముడి పదార్థాలు, మానవ శక్తులపై ప్రభుత్వం చేసే కేటాయింపుల ఆధారంగా తయారు చేసిన ప్రణాళికలు.
* యుద్ధాలు, ప్రకృతి వైపరీత్యాల సమయాల్లో ప్రభుత్వం భౌతిక ప్రణాళికలను అమలు చేస్తుంది.
బి) ఆర్థిక/ విత్త ప్రణాళిక: ద్రవ్యరూపంలో ఉండే కేటాయింపులు చేస్తారు.
ఉదా: భారతదేశం
* 1910లో మొదటిసారిగా క్రిస్టియన్ కోఫైడర్ (యూఎస్ఎస్ఆర్) 'ఆర్థిక ప్రణాళిక' అనే భావనను వివరించాడు.

 

2. ప్రజల భాగస్వామ్యం బట్టి ప్రణాళికలు: 2 రకాలు
ఎ) కేంద్రీకృత ప్రణాళిక:
* ప్రణాళిక వ్యవస్థ ఒక కేంద్ర అధికార యంత్రాంగం వద్ద కేంద్రీకృతమై ఉంటుంది.
* ప్రణాళిక వ్యవస్థను కేంద్రం నుంచి రాష్ట్రాలకు, రాష్ట్రాల నుంచి జిల్లాలకు అనువర్తించే విధానం. పై స్థాయి నుంచి కిందిస్థాయికి చేసే ప్రణాళికలు.

 

బి) వికేంద్రీకృత ప్రణాళిక:
 

* కింది స్థాయి నుంచి పై స్థాయికి రూపొందించే ప్రణాళికలు.
* స్థానిక ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు తమ వనరులను అంచనా వేసి, స్థానిక అవసరాలకు అనుగుణంగా లక్ష్యాలను నిర్దేశించుకుంటూ రూపొందించిన ప్రణాళికలు.
   వీటిని ప్రాంతీయ అవసరాలను దృష్టిలో పెట్టుకుని రూపొందిస్తారు.

 

3. కాలవ్యవధి ఆధారంగా ప్రణాళికలు: 3 రకాలు
 

ఎ) స్వల్పకాలిక ప్రణాళిక:
 

* ఒక సంవత్సర కాలవ్యవధి కోసం రూపొందించేవి.
* అత్యవసర సమయాల్లో స్వల్పకాలిక ప్రణాళికలను ప్రభుత్వాలు అమలు చేస్తాయి.

 

బి) మధ్యకాలిక ప్రణాళిక:
 

* 4 నుంచి 6 సంవత్సరాల వరకు రూపొందించే ప్రణాళికలు.
* భారత్ ప్రణాళిక మధ్యకాలిక ప్రణాళిక రకానికి చెందింది.

 

సి) దీర్ఘకాలిక ప్రణాళిక:
 

* 10 నుంచి 25 ఏళ్ల దీర్ఘకాలాన్ని, దృష్టిలో పెట్టుకుని రచించే ప్రణాళికలు. భారత్‌లో 3వ, 7వ, ప్రణాళికల్లో దీన్ని అమలు చేశారు.
* దీన్ని సమగ్ర ప్రణాళిక అని కూడా పిలుస్తారు.
* కమ్యూనిస్టు దేశాల్లో ఈ ప్రణాళికలు రూపొందిస్తారు. వీటిలో అంతర్భాగంగా పంచవర్ష ప్రణాళికలను అమలు చేస్తారు.

 

నిరంతర ప్రణాళిక: (Rolling Plan)
 

* స్వీడన్ దేశీయుడు గున్నార్ మిర్డాల్ నిరంతర ప్రణాళికను ప్రతిపాదించారు.
* గడిచిన సంవత్సరాన్ని తొలగిస్తూ, రాబోయే సంవత్సరపు లక్ష్యాలు కలుపుతూ రూపొందించే ప్రణాళిక ఇది. దీన్ని జనతా ప్రభుత్వం అమలు చేసింది.
* ఈ ప్రణాళికకు నిర్ణీత కాలవ్యవధి ఉండదు.
* నిరంతర ప్రణాళిక కాలం (Rolling Plan)లో ప్రణాళికా సంఘం ఛైర్మన్ - మొరార్జీ దేశాయ్
* ఉపాధ్యక్షుడు - లక్డావాలా
* గున్నార్ మిర్డాల్ రచించిన గ్రంథం - "Asian Drama"
* ప్రపంచంలో నిరంతర ప్రణాళికను మొదటిసారిగా నెదర్లాండ్స్‌లోని ఫిలిప్స్ కంపెనీలో ప్రవేశపెట్టారు. తర్వాత అమెరికాలోని స్టాండర్డ్ ఆటోమొబైల్ కంపెనీలో అమలు చేశారు.

 

స్థిర ప్రణాళిక:
* ముందుగా నిర్దేశించిన ప్రణాళికలో ఎలాంటి మార్పులు చేయకుండా అమలు చేసే ప్రణాళికను స్థిర ప్రణాళిక అంటారు.
* కొన్ని సంవత్సరాల స్థిర కాలాన్ని నిర్ణయించి, లక్ష్యాలను సాధించడానికి రూపొందించిన ప్రణాళికలు.
ఉదా: భారతదేశంలోని ప్రణాళికలు    

Posted Date : 26-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - 3

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌