• facebook
  • whatsapp
  • telegram

 వాయు కాలుష్యం


శాస్త్రీయ విధానాలతో స్వచ్ఛమైన శ్వాస!

ప్రపంచదేశాలన్నీ భూతాపం, వాతావరణ మార్పులతో సతమతమవుతున్నాయి. ప్రజలకు మంచి ఆహారం, గాలి దొరకడం కష్టమవుతోంది. సగటు మనిషి ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తోంది. ఈ అనర్థాలన్నింటికీ కారణం వాయుకాలుష్యం. భూమిపై జంతుజాలాన్ని, మొక్కలను, నీటిలోని జలచరాలను, చివరకు కట్టడాలను కూడా ఇది ప్రభావితం చేస్తోంది. వృక్షాల్లో కిరణజన్య సంయోగక్రియను సరిగా సాగనీయడం లేదు. ఇళ్లు, వాహనాల రంగులను మార్చేస్తోంది. సహజసిద్ధ ప్రకృతి రమణీయ ప్రాంతాల నాణ్యతను క్షీణింపజేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో భవిష్యత్తు తరాలకు స్వచ్ఛమైన శ్వాసను అందించాలంటే శాస్త్రీయ విధానాలను అవలంబించాలి. ఆ వివరాలతోపాటు వాయు కాలుష్య రకాలు, వాటి నివారణ చర్యలను పోటీపరీక్షల అభ్యర్థులు సమగ్రంగా తెలుసుకోవాలి.
 

భూమి చుట్టూ ఆవరించిన వాయు పొరలను వాతావరణం అంటారు. ఇందులో నైట్రోజన్, ఆక్సిజన్, ఆర్గాన్, కార్బన్‌ డయాక్సైడ్, హీలియం, నియాన్‌ లాంటి అనేక వాయువులు సహజంగా పర్యావరణానికి సరిపడా రీతిలో ఉంటాయి. అయితే ఘన, ద్రవ, వాయు స్థితుల్లో ఉన్న కొన్ని అవాంఛనీయ పదార్థాలు వాతావరణంలో పరిమితికి మించి చేరి వాతావరణ సంఘటనంలో మార్పులు తీసుకొస్తాయి. ఫలితంగా వీటి ద్వారా జీవజాతులు, వాటి పరిసరాలకు హాని కలిగే స్థితి ఏర్పడుతుంది. దీన్నే ‘వాయుకాలుష్యం’గా పేర్కొంటారు. అగ్నిపర్వతాలు బద్దలైనప్పుడు విడుదలైన వాయువులు, అడవులు తగలబడిపోవడం వల్ల మార్స్‌ గ్యాస్, మీథేన్‌ లాంటి ప్రకృతిపరమైన కాలుష్యకాలు ఒక వైపు; వాహనాలు, పరిశ్రమలు, ఇంధనాలు మండించడం వంటి వాటితో విడుదలవుతున్న కార్బన్‌ డయాక్సైడ్, కార్బన్‌ మోనాక్సైడ్, సల్ఫర్‌ డయాక్సైడ్, పొగ లాంటి మానవ కారక కాలుష్యాలు మరోవైపు స్వచ్ఛమైన గాలిని కలుషితం చేస్తున్నాయి. వాయు కాలుష్యాలను కణరూప, వాయు రూప కాలుష్యకాలుగా విభజించవచ్చు.


1) కణరూప కాలుష్యకాలు: గాలిలో తేలియాడుతూ, 10 మైక్రాన్ల కంటే తక్కువ వ్యాసార్ధం ఉండే ఘన, ద్రవ రూప రేణువులను కణరూప కాలుష్యకాలు అంటారు. రేణువులు, ద్రవ బిందువులు వాయువులతో కలిసి ఏర్పడే మిశ్రమాన్ని ‘ఏరోసాల్స్‌’ అంటారు. ఇవి రెండు రకాలు.


ఎ) సూక్ష్మ కణరూప కాలుష్యకాలు: 2.5 మైక్రాన్ల లోపు పరిమాణంలో ఉండే కణరూప కాలుష్యకాలివి. వాహనాలు, పరిశ్రమల నుంచి; జీవపదార్థాలు మండించినప్పుడు, వ్యవసాయ సంబంధ] వ్యర్థాల నుంచి విడుదలవుతాయి. కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు (సీపీసీబీ) సూచనల ప్రకారం గాలిలో PM 2.5 స్థాయికి మించితే జీవులకు చాలా హానికరం. ఊపిరితిత్తుల్లోకి ప్రవేశిస్తే ఉబ్బసం, దీర్ఘకాలిక శ్వాసనాళాల వాపు (బ్రాంకైటీస్‌), గుండె స్పందనలో వ్యత్యాసాలు లాంటి అనారోగ్యాలకు కారణమవుతాయి.


బి) స్థూల కణరూప కాలుష్యకాలు:   PM 10 గా పిలిచే 2.5 - 10 మైక్రాన్ల పరిమాణం ఉన్న కాలుష్యకాలు. ఇవి లోహ ఆక్సైడ్‌లు, సల్ఫర్, నైట్రోజన్‌ ఆక్సైడ్‌ లాంటి కాలుష్యాలు.


కణరూప కాలుష్యకాల దుష్ప్రభావాలు: వీటితో శ్వాసకోశ, గొంతు, కళ్ల సంబంధిత వ్యాధులు వస్తాయి.
 

1. సిలికోసిస్‌ వ్యాధి: స్టోన్‌క్రషింగ్‌ పరిశ్రమల నుంచి విడుదలైన సిలికా సంబంధ ఏరోసాల్స్‌ ఊపిరితిత్తుల్లో చేరి సిలికోసిస్‌ అనే వ్యాధి వస్తుంది. ఈ వ్యాధి మొక్కలకు సోకితే పత్రాలు వడలిపోతాయి. పంట పెరుగుదల దెబ్బతిని దిగుబడి తగ్గిపోతుంది.

2. బయాప్సినోసిస్‌ వ్యాధి (వైట్‌ లంగ్స్‌): నూలు వస్త్ర పరిశ్రమ నుంచి విడుదలయ్యే కాటన్, ధూళి వల్ల కార్మికులకు బయాప్సినోసిస్‌ అనే దగ్గు, శ్వాసకోశ సంబంధ వ్యాధి వస్తుంది.

3. ఆస్‌బెస్టాసిస్‌ వ్యాధి: ఆస్‌బెస్టాస్‌ తవ్వకాలు, ఆస్‌బెస్టాస్‌ సిమెంట్‌ రేకుల పరిశ్రమల నుంచి విడుదలైన ధూళి ఊపిరితిత్తుల వ్యాధికి కారణమవుతోంది. అందుకే ఈ ఖనిజం తవ్వకాలను ప్రపంచవ్యాప్తంగా అరికట్టారు.

4. బెరీలియోసిస్‌ వ్యాధి: బాక్సైట్‌ గనుల్లో పనిచేసే వారికి ఈ రకం ఊపిరితిత్తుల వ్యాధి వస్తుంది.

5. న్యూమోనియోసిస్‌ (బ్లాక్‌ లంగ్స్‌): బొగ్గు గనుల్లో పనిచేసే వారికి వచ్చే ఊపిరితిత్తుల వ్యాధి.

2) వాయు రూప కాలుష్యకాలు:


1. కార్బన్‌ డయాక్సైడ్‌: గ్లోబల్‌ వార్మింగ్‌కు ప్రధాన కారణమైన వాయువు కార్బన్‌ డయాక్సైడ్‌. శిలాజ ఇంధనాలు పూర్తిగా దహనం కాకపోవడం వల్ల; విద్యుత్తు కేంద్రాలు, పరిశ్రమల నుంచి ఈ వాయువు విడుదలవుతుంది. కేవలం శిలాజ ఇంధనాల వినియోగం వల్లే ఏటా సుమారు 2.5 × 10*13 టన్నుల కార్బన్‌డయాక్సైడ్‌ వాతావరణంలో కలుస్తోంది.


2. కార్బన్‌ మోనాక్సైడ్‌: ఇది చాలా ప్రమాదకర విషవాయువు. శిలాజ ఇంధనాలు అసంపూర్తిగా దహనమవడం, వంట చెరకును మండించినప్పుడు, బొగ్గును కాల్చినప్పుడు ఎక్కువగా విడుదలవుతుంది. దీన్ని పీల్చడం వల్ల రక్తంలోని ‘హీమోగ్లోబిన్‌’ ఆక్సిజన్‌కు బదులు, ఈ వాయువుతో ఆక్సీకరణం చెంది ‘కార్బాక్సీ హీమోగ్లోబిన్‌’గా మారుతుంది. దీంతో శ్వాసకోశ సంబంధ వ్యాధులు వస్తాయి. దీన్నే ‘హైపోక్సియా’ అంటారు. ఇంకా మెదడు దెబ్బతినడం, కంటిచూపు మందగించడం, మతి భ్రమించడం లాంటి మస్తిష్క వ్యాధులకు దారితీస్తుంది.


3. సల్ఫర్‌డయాక్సైడ్‌: ప్రధానంగా థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల్లో బొగ్గును మండించినప్పుడు, మోటారు వాహనాల నుంచి విడుదలవుతుంది. దీనిస్థాయి వాతావరణంలో 1 PPM దాటినప్పుడు చాలా దుష్ప్రభావాలు ఉంటాయి. దీనివల్ల ఆమ్లవర్షాలు కురుస్తాయి. ఫలితంగా చర్మక్యాన్సర్లు రావచ్చు. ఈ వ్యాధికారక గాలి మొక్కల పెరుగుదలను నిరోధిస్తుంది. చారిత్రక కట్టడాలు దెబ్బతింటాయి.

ఉదా: ఉత్తర్‌ప్రదేశ్‌లోని మధుర ఆయిల్‌ రిఫైనరీ నుంచి విడుదలైన సల్ఫర్‌డయాక్సైడ్‌ వల్ల తెల్లని తాజ్‌మహల్‌ క్రమేపీ పసుపు రంగులోకి మారుతోంది. మరిన్ని చారిత్రక కట్టడాల గోడలు పగుళ్లు బారుతున్నాయి. దీన్నే రాతి కుష్ఠువ్యాధి అంటారు.


4. నైట్రోజన్‌ ఆక్సైడ్‌: పెట్రోల్, డీజిల్‌తో నడిచే మోటారు వాహనాలు; విద్యుత్తు జనరేటర్లు, పంట పొలాల్లో వాడిన నత్రజని ఎరువుల వాడకం ద్వారా సాధారణంగా నైట్రోజన్‌ ఆక్సైడ్‌ గాలిలో కలుస్తుంది. దీనివల్ల గ్రీన్‌హౌస్‌ వాయువులు విడుదలై భూతాపానికి (గ్లోబల్‌ వార్మింగ్‌) కారణమవుతున్నాయి. కాలేయం, మూత్రపిండాలకు నష్టం కలగడం, ఆస్తమా వంటి శ్వాసకోశ వ్యాధులు వస్తాయి.


5. క్లోరోఫ్లోరో కార్బన్లు: మస్కిటో కాయిల్స్, ఫ్రిజ్‌లు, అత్తరు నుంచి ఇవి విడుదలై భూతాపాన్ని పెంచుతున్నాయి. ఊపిరితిత్తులు, మూత్రపిండాలు దెబ్బతినడం; అధిక రక్తపోటు, ఆస్తమా లాంటి వ్యాధులకు కారణమవుతాయి. వీటితో పాటు భార లోహలైన మెర్క్యూరీ, లెడ్, కాడ్మియం లాంటివి వాతావరణంలోకి విడుదలై కేంద్ర నాడీవ్యవస్థ, మెదడు దెబ్బతింటాయి. కాడ్మియం నేరుగా గుండెపై ప్రభావం చూపిస్తుంది. మెర్క్యూరీ ప్రభావంతో జింజివాటా, మినిమాటా లాంటి వ్యాధులు వస్తాయి.


వాయు కాలుష్య నివారణ పద్ధతులు:

* వాహనాల్లో సీసం లేని పెట్రోల్‌ను వాడాలి.

* సంప్రదాయ ఇంధన వనరులకు బదులుగా బయోడీజిల్, బయోగ్యాస్, బయోమాస్‌ లాంటివి వినియోగించాలి.

* థర్మల్‌ విద్యుత్తు పరిశ్రమల నుంచి వెలువడే రేణు రూప పదార్థాలను తొలగించడానికి ఎలక్ట్రోస్టాటిక్‌ ప్రెసిపిటేటర్స్‌ అనే ఫిల్టర్‌లను తప్పనిసరిగా వాడాలి.

* పరిశ్రమల నుంచి వెలువడే కొన్ని సూక్ష్మ రేణువుల్లాంటి వాయుకాలుష్య కారకాలను తీసివేయడానికి స్క్రబ్బర్‌ వాడాలి. అంటే సున్నపురాయి తెట్టు లేదా సిమెంట్‌ బూడిద స్లర్రీ వినియోగించాలి.

* వాహనాల ద్వారా వాతావరణంలోకి విడుదలయ్యే కాలుష్య ఉద్గారాలను తగ్గించడానికి, వాయు నాణ్యత ప్రమాణాలను ప్రజలకు తెలియజేయడానికి భారత్‌/యూరో ఇంధన ప్రమాణాలను మరింత కఠినతరం చేయాలి. ఇప్పటివరకు యూరో - 6 ప్రమాణాలు అమల్లో ఉన్నాయి.

* ఇళ్లలో వంటచెరకుగా పిడకలు, కర్రలకు బదులుగా ఎల్‌పీజీ గ్యాస్‌ వాడకం పెంచాలి. శీతలీకరణ యంత్రాల్లో సి.ఎఫ్‌.సి. లకు బదులుగా ద్రవ నత్రజని వినియోగించాలి.

* దేశవ్యాప్తంగా రైల్వేట్రాకులను విద్యుదీకరించాలి.

* రవాణా రంగంలో చమురు ఆధారిత పెట్రోల్, డీజిల్‌కు ప్రత్యామ్నాయంగా లిక్విఫైడ్‌ నేచురల్‌ గ్యాస్‌ కంప్రెసర్, నేచురల్‌ గ్యాస్‌ (సీఎన్‌జీ) హైడ్రోజన్‌ ఇంధనం, బ్యాటరీ ఆపరేటెడ్‌ వెహికల్స్‌ వినియోగాన్ని పెంచాలి.

* వాయు ఉద్గారాల్లో 20 శాతం మేరకు ఉద్గారాలను భారీ స్థాయిలో చెట్ల పెంపకం ద్వారా కార్బన్‌ సింక్‌ చేయవచ్చని యూఎన్‌ఓ చెబుతోంది. దీనికోసం UNO - REDD (Reducing Emissions from deforestation and Degradation) అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. భారీ స్థాయి అటవీకరణ ద్వారా కార్బన్‌ డయాక్సైడ్‌ను తొలగించే ప్రక్రియను కార్బన్‌ సీక్వెస్ట్రేషన్‌ అంటారు.

* కాలుష్య బాధితులకు నష్టపరిహారం ఇవ్వడం అనే ‘పొల్యూటర్‌ పే’ సూత్రాన్ని పర్యావరణ చట్టం (1986)లో చేర్చాలని సుప్రీంకోర్టు 1996లో సూచించింది. ఈ సూచనను అన్ని మంత్రిత్వ శాఖల్లో అమలుచేయాలి.

* వాహనాల పొగ గొట్టాల్లో కెటాలిటిక్‌ కన్వర్టర్లను అమర్చాలి. వీటితోపాటు ఇంకా అనేక శాస్త్రీయ విధానాలు అమలు చేసి, ప్రజలను అప్రమత్తం చేస్తేనే భవిష్యత్తు తరాలకు స్వచ్ఛమైన శ్వాస అందుతుంది.

రచయిత: జల్లు సద్గుణరావు

 

 

Posted Date : 14-08-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌