• facebook
  • whatsapp
  • telegram

తెలంగాణలో వివిధ కులాల ఆశ్రిత కళాకారులు

కులాలను కీర్తిస్తూ.. కళలను రక్షిస్తూ!
 

తెలంగాణ సమాజంలో ప్రాచీన కాలం నుంచి వృత్తుల వారీగా ప్రధాన కులాలు ఏర్పడ్డాయి. వాటి ఆధారంగా ఉపకులాలు పుట్టుకొచ్చాయి. జీవనాధారం కోసం ఆ ఉపకులాలు కొన్ని కళలను, కీర్తనా ప్రతిభను నమ్ముకున్నాయి. నిర్దిష్ట కులాల వారిని ఆశ్రయించి తమ కళను ప్రదర్శిస్తూ, వారిని మెప్పిస్తూ జీవిస్తున్న వారే ఆశ్రిత కళాకారులుగా ప్రసిద్ధికెక్కారు. తెలంగాణ చరిత్ర అధ్యయనంలో భాగంగా అలాంటి విశిష్టతలున్న ఉపకులాల గురించి పరీక్షార్థులు తెలుసుకోవాలి. తమదైన సంగీతం, సాహిత్యం, కథనం, ఇంద్రజాలం, వాయిద్యాలు, పరికరాలతో ప్రత్యేకతను సంతరించుకున్న ఈ కళాకారులకు ప్రాచీనకాలం నుంచి ఉన్న ఉనికి, ప్రదర్శనలు ఇచ్చే విధానం, ప్రస్తుతం వీరి స్థితిగతులపై అవగాహన పెంచుకోవాలి.
 

తెలంగాణలో వివిధ కులాలు తమ జీవనోపాధి కోసం వివిధ వృత్తులను అనుసరిస్తూ వచ్చాయి. శైవ, వైష్ణవ మతాల ప్రభావం వల్ల వివిధ ఉపకులాలు ఏర్పడి ఇతర కులాల సంకీర్తనం, వంశ  కీర్తనం చేస్తూ ఆశ్రిత కులాలుగా మారిపోయాయి. ఈ ఉపకులాల వారు తాము ఆధారపడే కులాల మూలపురుషుల కథలు, వారు చేసిన యుద్ధాలు లేదా ఘనకార్యాలను మౌఖిక మాధ్యమంలో తమదైన సాహిత్యం, సంగీతం, లలితకళల ద్వారా ప్రచారం చేసేవారు.


పిచ్చికుంట్ల వారు 

తెలంగాణలోని పిచ్చికుంట్లవారికి పిచ్చకుంట్ల అనే మరో పేరుండేది. వీరు కాపు, రెడ్డి, కమ్మ, వెలమ, గొల్ల కులాలకు గోత్రాలు చెబుతూ వారిని యాచించి జీవిస్తారు. పిచ్చికుంట్ల అనే పదం ‘బిక్షకకుంట్ల’ అనే పదం నుంచి వచ్చింది. వీరు తెలంగాణ ప్రాంతంలో ప్రసిద్ధులు. తెలుగు సాహిత్యంలో పిచ్చికుంట్ల ప్రసక్తి ఉంది. పాల్కురికి సోమనాథుడు తన పండితారాథ్య చరిత్రలో వీరిని ప్రస్తావించాడు. అయ్యలరాజు రామనామాత్యుడు తన ‘హంసవింశతి’లో పిచ్చికుంట్లను పేర్కొన్నాడు. కర్ణాటక ప్రాంతంలోనూ వీరు ఉన్నారు. కర్ణాటకలో కాపు వాళ్లను యాచించి కథలు చెబుతూ గోత్రాలు పఠించేవాళ్లను హేళవులు అంటారు. వీరు తెలుగుప్రాంతాల నుంచి అక్కడికి జీవనాధారం కోసం వెళ్లినవాళ్లే. తెలంగాణలోని పిచ్చికుంట్ల కులంలో చాలా తెగలున్నాయి. అందులో గంట, రెడ్డి, తిత్తి, కత్తి, కమ్మ, పెదకంటి, పాకనాటి, గుడాటి, బుర్రతురగ, కోడిద, చిట్టెపు ముఖ్యమైనవి. ఇందులో కత్తి, తిత్తి పిచ్చికుంట్లు రెడ్డి కులానికి, గుంట పిచ్చికుంట్లు కమ్మ కులానికి, తురగ పిచ్చికుంట్లు గొల్లకులానికి గోత్రాలు చెబుతారు. రెడ్డి కులాన్ని ఆశ్రయించే పిచ్చికుంట్లు గోత్రపఠనంతో పాటు కుంటి మల్లారెడ్డి కథ, పల్నాటి వీరచరిత్రలను గానం చేస్తారు. కుంటి మల్లారెడ్డి కథలో రెడ్డి కుల పుట్టుపూర్వోత్తరాలను వివరిస్తారు. వీరి బృందంలో ముగ్గురు కథకులు ఉంటారు. ఇందులో ఒకరు ప్రధాన కథకుడు, మిగిలిన ఇద్దరు వంతలు. ప్రధాన కథకుడు ఒక చేతిలో కత్తిని, మరొక చేతిలో డాలును పట్టుకుని కథ చెబుతాడు. వంతల్లో ఒకరు తిత్తి ఊదుతూ, మరొకరు డక్కి వాయిస్తూ ప్రధాన కథకుడికి సహాయం చేస్తారు. నేటికీ వీరు రాష్ట్రవ్యాప్తంగా ఉన్నారు. వీరి వద్ద తమ వృత్తికి సంబంధించిన ఒక రాగిశాసనం, తమ దాతల కథకు సంబంధించిన తాళపత్ర గ్రంథాలు ఉంటాయి. ప్రతి బృందానికి తమకంటూ ప్రత్యేకమైన దాతల గ్రామాలుంటాయి. వాటిని మిరాశీ గ్రామాలంటారు. ఒకరి మిరాశీ గ్రామాల్లోకి మరొకరు వెళ్లరు. ఒక వేళ వెళితే, కుల పంచాయితీలో విచారణ జరిపించి జరిమానా విధిస్తారు.


రుంజవారు

రుంజ అనే వాయిద్యాన్ని శ్రావ్యంగా వాయిస్తూ కథలు చెప్పే గాయకులను రుంజవాళ్లు అంటారు. వీరికి రుద్రమహేశ్వరులు, రుద్రాంగులని కూడా పేర్లు ఉన్నాయి. వడ్రంగి, కమ్మరి, కంచరి, కంసాలి, శిల్పి అనే అయిదు వృత్తులు పాటించే విశ్వబ్రాహ్మణులకు కథలు చెబుతూ యాచించేవారు ఈ రుంజలు. రుంజ అనే వాయిద్యాన్ని తెలుగు నిఘంటువులు డంగురం, వీరణం, రౌంజ అని పేర్కొన్నాయి. ఆదిభట్ల వెంకటరమణ ఆంధ్రాభాషా భూషణంలో రుంజ వాయిద్య ప్రసక్తి ఉందన్నారు. అవజం, రుంజ, డంగురం, వీరణం అనేవి రుంజ వాయిద్యానికి పర్యాయపదాలని వివరించారు. రుంజ వాయిద్యం 10, 11 శతాబ్దాల కాలం నాటి సాహిత్యంలో, శాసనాల్లో ఉంది. ముఖ్యంగా కాకతీయుల కాలంనాటి ఒక శాసనంలో అవజకాడు అని పేర్కొంది. అవజకాడు అనే పదానికి బర్మా వాయిద్యమని సూర్యరాయంధ్ర నిఘంటువులో ఉంటే, శబ్దరత్నాకరం కూడా సమర్థించింది. ఆంధ్ర వాచస్పత్యం మాత్రం అవజం అనే పదానికి రుంజ అన్న అర్థాన్ని స్పష్టంగా పేర్కొంది. రుంజలు రెండు, మూడేళ్లకోసారి తమ దాతలైన విశ్వబ్రాహ్మణుల ఇళ్లకు వెళ్లి యాచిస్తారు. పార్వతీ కల్యాణం, దక్షయజ్ఞం, వీరభద్ర విజయం, విశ్వకర్మ పురాణం అనే కథలు గానం చేస్తారు. వీటితోపాటు పంచబ్రాహ్మణుల గురించి అంటే, అయిదు విశ్వబ్రాహ్మణుల వృత్తుల గురించి వివరిస్తారు. వీరి బృందంలో సాధారణంగా ఆరుగురు కళాకారులుంటారు. ఇందులో ఇద్దరు రుంజ వాయిస్తుంటారు. ఇద్దరు తాళాలు వాయిస్తూ, మరో ఇద్దరిలో ఒకరు సన్నాయి, మరొకరు బూర ఊదుతూ ప్రధాన కథకులకు సహాయం చేస్తారు. వీరికి మిరాశీ హక్కులు, రాగి శాసనం ఉంటాయి. విశ్వబ్రాహ్మణులను పంచాణం వారు అని కూడా అంటారు.


పాండవుల వాళ్లు 

పాండవుల వాళ్లు ముత్రాసి లేదా ముదిరాజ్‌ అని పిలిచే కుల ఆశ్రితులు. వీరు మహాభారతంలోని పాండవులకు సంబంధించిన కథలు గానం చేయడం వల్ల పాండవులవారు అనే పేరు వచ్చింది. వీరు దాదాపుగా మహాభారతంలోని 40 కథలు చెబుతారు. వీటన్నింటిలో యయాతి చరిత్ర, పాండవ వనవాసం ముఖ్యమైనవి. యయాతి చరిత్రలో తమ దాతృకులమైన ముదిరాజ్‌ల పుట్టుక గురించి తెలియజేస్తారు. పాండవ వనవాసంలో తమ కుల పుట్టుకను గురించి కూడా వివరిస్తారు. తెలంగాణ ప్రాంతంలోని అన్ని పాండవుల బృందాలు ఈ రెండు కథలను తప్పక గానం చేస్తాయి. దాదాపుగా మహాభారత కథ అంతా మౌఖిక మాధ్యమంలో వీరిద్వారా ప్రచారమవుతుంది. పాండవుల వారు సాధారణంగా తమ కళాప్రదర్శన రాత్రివేళలో చేస్తారు. వీరి బృందంలో ముగ్గురు సభ్యులుంటారు. ఇందులో ప్రధాన కథకుడు కిన్నెర అనే వాయిద్యాన్ని వాయిస్తూ కథ చెబుతాడు. మిగిలిన ఇద్దరు ప్రధాన కథకుడికి రెండువైపులా ఉండి సహాయపడుతుంటారు. ఇందులో కుడివైపు ఉండే వ్యక్తి మద్దెల వాయిస్తాడు. ఎడమవైపు ఉండే వ్యక్తి తాళాలు వాయిస్తాడు. వీరికి మిరాశీ గ్రామాలున్నాయి. వీరు ఉమ్మడి రంగారెడ్డి, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, నల్గొండ జిల్లాల్లో కనిపిస్తారు.


మందెచ్చువారు 


మందెచ్చువారు యాదవ కుల యాచకులు (మంద అంటే గొర్రెల గుంపు, హెచ్చు అంటే పెంపు చేసేవారు. మందెచ్చువారు అంటే గొర్రెల మందను పెంపుచేసేవారని అర్థం). రెండు లేదా మూడేళ్లకోసారి వీరు యాదవుల ఇళ్లకు వెళ్లి వారి గోత్రాలు, కాటమరాజు కథ చెబుతూ వారిని మాత్రమే యాచించి జీవిస్తారు. మందెచ్చువారిని మందపిచ్చోళ్లు, మందహెచ్చువారు, బొమ్మలాటవారు, పొడపోతుల వారు అనే పేర్లతో పిలుస్తారు. తెలంగాణ అంతటా వీరు పర్యటిస్తారు. వీరి ప్రధాన వృత్తి కాటమరాజు కథలు చెప్పి గొల్లలను యాచించడమే. వీరివద్ద కాటమరాజు కథలకు సంబంధించి 100 నుంచి 200 వరకు బొమ్మలుంటాయి. వీటిని చూపిస్తూ వీరు కథలు చెబుతారు. వీటిని ఉంచే పెట్టెను దేవస్థలం పెట్టె అంటారు. వీరి గురించి సాహిత్యంలో, జానపద గేయగాథలపై రచించిన గ్రంథాల్లోనూ ప్రస్తావన ఉంది. మందెచ్చులు మూడేళ్లకోసారి యాదవుల ఇళ్లకు భిక్షాటన కోసం వెళతారు. మొదట వీరు ఊరిలోని గొల్లపెద్ద ఇంటికి వెళతారు. వీరు ఉండటానికి గొల్లపెద్ద ఏర్పాట్లు చేస్తారు. తదుపరి ఊరి గొల్లల సహాయంతో తమ వాయిద్యాలతో ఊరంతా తిరుగుతారు. తర్వాత కులపెద్ద నిర్ణయించిన రోజు కాటమరాజు కథను గానం చేస్తారు. చివరి రోజు కథలు చెప్పడం పూర్తయిన తర్వాత యాదవులతో గంగకు బోనాల పండుగ చేయిస్తారు. ఆ మరుసటి రోజు ఉదయం 4 గంటలకు ‘గావు’ అనే బలి సమర్పణ చేస్తారు. వారికి రావాల్సిన దానాన్ని స్వీకరించి, మరొక గ్రామానికి వెళతారు. ఈ విధంగా ఇప్పటికీ మందెచ్చువారు తెలంగాణలో పర్యటిస్తున్నారు.


సాధనాసూరులు
 

సాధనాసూరులు ఇంద్రజాల ప్రదర్శకులు. ప్రతి రెండు లేదా మూడేళ్లకు ఒకసారి పద్మశాలీల ఇళ్లకు వెళ్లి తమ గారడీ విద్యను ప్రదర్శించి వారిని మాత్రమే యాచిస్తారు. ప్రస్తుతం వీరి సంఖ్య స్వల్పం. సాధనాసూరుల గురించి ఇద్గారేట్రస్టన్‌ వివరించారు. వీరి కులపుట్టుక గురించి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. సాధనాసూరులు ఒక్కో గ్రామంలో రెండు, మూడు రోజులు ఉండి తమ విద్యను ప్రదర్శిస్తారు. భిక్షాటనకు బయలుదేరేటప్పుడు గ్రామ పొలిమేరల నుంచి నగారా వాయిస్తూ వస్తారు. ముందు తమ దాతలైన పద్మశాలి కుల పెద్దమనిషి ఇంటికి వస్తారు. ఆ తర్వాత అతడు కులాన్ని సంప్రదించి ఏ రోజు సాధనాసూరులు తమ గారడీ విద్యను ప్రదర్శించాలో నిర్ణయిస్తాడు. ఆ రోజు కులపెద్ద ఇంటి ముందు బహిరంగ ప్రదేశంలో గారడీ విద్య ప్రదర్శించి పద్మశాలీలను వినోదింపజేస్తారు. వీరు ముఖ్యంగా జలస్తంభన, అగ్నిస్తంభన, అదృశ్యస్తంభన, బెండ్లి పల్లకి, బండను పగలగొట్టడం, నిండు కుండలో పొడి పసుపు వేసి తీయడం లాంటి ఇంద్రజాల విద్యలను ప్రదర్శిస్తారు. తదుపరి తమకు రావాల్సిన త్యాగం (కట్నం) తీసుకుని వెళతారు.


పెక్కర్లు 
 

వీరు కుమ్మరి కుల ఆశ్రిత గాయకులు. వీరికి పెక్కర్లు, పెక్కురోళ్లు, కులం బిడ్డలని పేర్లున్నాయి. వీరి సంఖ్య అతి స్వల్పం. అందుకే నాలుగైదేళ్లకోసారి పర్యటిస్తారు. కుమ్మరి వాళ్ల గోత్రాలను పఠిస్తారు. కుమ్మరి గుండ బ్రహ్మపురాణం, శాలివాహన చరిత్రలను గానం చేస్తారు. ఈ కథలకు చెందిన తాళపత్ర గ్రంథాలను తమ వెంట తెస్తారు. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, గోదావరి జిల్లాల్లో వీరిని కులబిడ్డలని, మిగిలిన ప్రాంతంలో పెక్కురోళ్లు అని పిలుస్తారు. పెక్కర్ల బృందంలో అయిదుగురు సభ్యులుంటారు. వీరు యక్షగాన పద్ధతిలో కథలు చెబుతారు. ప్రస్తుతం తెలంగాణ మొత్తంమీద పెక్కర్ల కుటుంబాలు 11 మాత్రమే ఉన్నాయి. అందులో కథాగానం చేసేవారు రెండు నుంచి మూడు కుటుంబాల వారే ఉంటారు. ఆ రోజుల్లో కుమ్మరి ఇళ్లకు వచ్చే పెక్కర్లు కేవలం వచన రూపంలోనే కథను వివరించి తమకు రావాల్సిన  ధనం స్వీకరించి వెళ్లేవారు.


 

రచయిత: డాక్టర్‌ ఎం.జితేందర్‌రెడ్డి


 

Posted Date : 08-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌