• facebook
  • whatsapp
  • telegram

బ్యాంకులు - జాతీయీకరణ లక్ష్యాలు - ప్రగతి

సామాన్యుడి పరపతి పెరిగింది!

 


  దేశ ఆర్థిక ప్రగతిని అత్యంత కీలకంగా ప్రభావితం చేసిన పరిణామాల్లో బ్యాంకుల జాతీయీకరణ ప్రధానమైనది.  ఈ చర్య కేవలం లాభాపేక్షతోనే పనిచేస్తున్న వాణిజ్య బ్యాంకుల దృక్ఫథాన్ని మార్చి, వాటికి సామాజిక బాధ్యతను నిర్దేశించింది. అప్పట్లో నగరాల్లో ధనవంతుల సేవలో తరిస్తున్న బ్యాంకింగ్‌ రంగం గ్రామాలకు విస్తరించి సామాన్యుల చెంతకు చేరింది. ఒకప్పుడు పెద్ద పట్టణాల్లోని పరిశ్రమలకే పరిమితమైన పరపతి, ఇప్పుడు రైతులు, చిన్నచిన్న వ్యాపార సంస్థలకూ అందుతోంది. మౌలిక సౌకర్యాల కల్పనలో బ్యాంకుల పాత్ర పెరగడంతో ఆర్థిక అభివృద్ధి జరిగి, సామాన్యుల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి. ఈ విధంగా సమూల మార్పులకు దోహదపడిన బ్యాంకుల జాతీయీకరణ గురించి పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. 

 

 
  స్వేచ్ఛా ఆర్థిక వ్యవస్థలో ఇతర వ్యాపార సంస్థల మాదిరిగా వాణిజ్య బ్యాంకులు కూడా లాభాల కోసం పనిచేసి సాంఘిక లక్ష్యాలను విస్మరించాయి. ఫలితంగా ప్రాధాన్య రంగానికి, పారిశ్రామిక రంగానికి సరిపడా నిధులు లభించలేదు. ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోలేద]ు. 1967లో హజారీ కమిటీ తన నివేదికలో.. పరిశ్రమలకు, బ్యాంకులకు మధ్య అనుసంధానం లేకపోతే పరపతి ప్రణాళిక తీసుకురావడం కష్టమని పేర్కొంది. ఫలితంగా ప్రభుత్వం మొదట ‘సోషల్‌ కంట్రోల్‌’ని ప్రవేశపెట్టింది. దీంతో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో 1969, జులై 19న నాటి ప్రధాని ఇందిరాగాంధీ తొలిసారిగా బ్యాంకుల జాతీయీకరణ ప్రక్రియ ప్రారంభించారు. ఆ తర్వాత 1980, ఏప్రిల్‌ 15న రెండోసారి బ్యాంకుల జాతీయీకరణ చేశారు.

 

1969లో బ్యాంకుల జాతీయీకరణ లక్ష్యాలు: 


* బ్యాంకులపై కొద్దిమంది అధిపత్యాన్ని తొలగించడం.


* వ్యవసాయం, చిన్న పరిశ్రమలు, ఎగుమతులకు చాలినంత రుణాన్ని సమకూర్చడం.

 

* బ్యాంకుల నిర్వహణను ఆధునికీకరించడం.


* నూతన వ్యవస్థాపకులను ప్రోత్సహించడం.


* బ్యాంకు ఉద్యోగులకు సరైన శిక్షణ ఇవ్వడం, వారి ఉద్యోగ నిబంధనలను మెరుగుపరచడం.

 


లీడ్‌ బ్యాంకు పథకం: 1962లో జాతీయ పరపతి మండలి డి.ఆర్‌.గాడ్గిల్‌ అధ్యక్షతన ఒక అధ్యయన బృందాన్ని నియమించి సాంఘిక లక్ష్యాల అమలు కోసం బ్యాంకింగ్‌ వ్యవస్థలో మార్పులు సూచించాలని కోరింది. విస్తృతంగా డిపాజిట్లు సేకరించడానికి, సామాజిక లక్ష్యాలకు అనుగుణంగా పరపతి పంపిణీకి ప్రాంతీయ మార్గ దృక్పథం అవసరమని గాడ్గిల్‌ బృందం సూచించింది. ఈ సూచనే లీడ్‌ బ్యాంకు పథకానికి దారితీసింది. 1969లో నారీమన్‌ అధ్యక్షతన రిజర్వ్‌ బ్యాంకు ఏర్పాటు చేసిన బ్యాంకర్ల సంఘం గాడ్గిల్‌ బృంద సిఫార్సును ఆమోదించి లీడ్‌ బ్యాంకు పథకాన్ని ప్రవేశపెట్టింది. ముంబయి, కోల్‌కతా, మద్రాస్, దిల్లీ, చండీగఢ్, గోవా మినహా దేశవ్యాప్తంగా ఇతర ప్రాంతాలన్నింటిలో ఈ పథకం అమల్లోకి వచ్చింది. 2004, మార్చి నాటికి 587 జిల్లాల్లో లీడ్‌ బ్యాంకు పథకం అమలైంది.వాణిజ్య బ్యాంకుల పురోగతి:  జాతీయీకరణ తర్వాత దేశం నలుమూలల్లో వాణిజ్య బ్యాంకుల శాఖలు ప్రారంభమయ్యాయి. డిపాజిట్ల పరిమాణం, పరపతి విస్తరణ పెరిగింది.

 


1) శాఖల పెరుగుదల: బ్యాంకుల జాతీయీకరణ, లీడ్‌ బ్యాంకు పథకం తర్వాత బ్యాంకు శాఖలు పెరిగాయి. ఫలితంగా ఎస్‌బీఐ గ్రూప్, జాతీయ బ్యాంకుల్లో 92% బ్యాంకుల శాఖలు విస్తరించాయి. గ్రామాల్లో బ్యాంకు శాఖలు విరివిగా ఏర్పాటయ్యాయి. 1969 నాటికి గ్రామాల్లో 22 శాతంగా ఉన్న బ్యాంకు శాఖలు, 2020 మార్చి నాటికి 35 శాతానికి పెరిగాయి.

 


2) డిపాజిట్ల సేకరణ: వాణిజ్య బ్యాంకుల డిపాజిట్ల మొత్తం 1969లో రూ.4,646 కోట్ల నుంచి, 2020 మార్చి నాటికి రూ.137 లక్షల కోట్లకు పెరిగింది. 50 ఏళ్లలో ఈ పెరుగుదల 2,960 రెట్లు.

 


3) పరపతి విస్తరణ: దేశంలో వాణిజ్య బ్యాంకుల డిపాజిట్లు పెరగడంతో పాటు వాటి పరపతి పరిమాణం పెరుగుతోంది. 1969, జూన్‌లో రూ.3,020 కోట్ల నుంచి 2020, మార్చిలో రూ.104 లక్షల కోట్లకు పరపతి పెరిగింది. 50 ఏళ్లలో ఈ పెరుగుదల 3,460 రెట్లు.

 

4) ప్రాధాన్య రంగాలకు పరపతి పెరుగుదల: భారత ప్రభుత్వం బ్యాంకు పరపతి మంజూరు కోసం కొన్ని ప్రాధాన్య రంగాలను గుర్తించింది. అవి

 

1) వ్యవసాయం 2) చిన్న పరిశ్రమలు 3) ఇతర రుణాలు, అంటే ఎ) పారిశ్రామికవాడలకు రుణాలు   బి) రహదారులు, నీటి రవాణా సి) చిల్లర వర్తకం  డి) చిన్న వ్యాపారం ఇ) స్వయంఉపాధి ఎఫ్‌) విద్య జి) వెనుకబడిన తరగతుల వారికి, షెడ్యూల్డ్‌ కులాలు, తెగల వారికి గృహ నిర్మాణ రుణాలు హెచ్‌) వినిమయ రుణాలు.


ప్రాధాన్య రంగాలకు పరపతి గురించి 1980లో రిజర్వ్‌ బ్యాంకు కొన్ని ఆదేశాలిచ్చింది. అవి

 

1) మొత్తం బ్యాంకు పరపతిలో ప్రాధాన్య రంగాలకు ఇచ్చే పరపతి 40% ఉండాలి.

 

2) ప్రాధాన్య రంగాలకు చెల్లించిన పరపతి మొత్తంలో వ్యవసాయానికి ఇచ్చే వాటా 40% ఉండాలి.

 

3) గ్రామ ప్రాంతాల్లోని వ్యవసాయం, అనుబంధ కార్యకలాపాల్లో పనిచేస్తున్న బలహీనవర్గాల వారికి మంజూరు చేసే ప్రత్యక్ష రుణాలు వ్యవసాయానికి చెల్లించిన మొత్తం ప్రత్యక్ష పరపతిలో 50 శాతం ఉండాలి. 


4) గ్రామీణ చేతివృత్తులు, కుటీర పరిశ్రమల్లో పనిచేసేవారికి చెల్లించిన రుణం, చిన్న పరిశ్రమకు చెల్లించిన మొత్తం పరపతిలో కనీసం 12.5 శాతం ఉండాలి.  1969లో బ్యాంకులు ఇచ్చిన పరపతిలో ప్రాధాన్య రంగాల వాటా 12% ఉండగా, 2021 - 22 నాటికి 39.72 శాతానికి పెరిగింది.

 


5) సామాజిక బ్యాంకింగ్‌ - పేదరిక నిర్మూలన పథకాలు: దేశంలో పేదరికం నిర్మూలన కోసం ప్రభుత్వం ప్రణాళికల ద్వారా అనేక పథకాలను ప్రవేశపెట్టింది. వాటికి అవసరమైన నిధులు సమకూర్చడానికి వాణిజ్య బ్యాంకుల సేవలను వినియోగించుకుంది.

 


వ్యత్యాస వడ్డీ రేట్లు: 1972, ఏప్రిల్‌లో వ్యత్యాస వడ్డీ రేట్ల పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. మొదట 162 జిల్లాలకు, ఆ తర్వాత అన్ని జిల్లాలకు ఈ పథకాన్ని విస్తరించారు. దీనికింద బలహీనవర్గాల వారికి చెల్లించే రుణాలపై వడ్డీ రేటును 4 శాతంగా నిర్ణయించారు.

 


సమగ్ర గ్రామీణాభివృద్ధి పథకం (ఐఆర్‌డీపీ): ఈ పథకం కింద అనేకమంది లబ్ధి పొందారు. రాయితీ చెల్లించారు. షెడ్యూల్డ్‌ కులాలు, షెడ్యూల్డ్‌ తెగలకు చెందినవారు, స్త్రీలు, బలహీనవర్గాల వారికి రుణాలు ఇచ్చారు.


* సామాజిక బ్యాంకింగ్‌ కింద బ్యాంకులు విద్యావంతులైన నిరుద్యోగ యువతకు ప్రధానమంత్రి రోజ్‌గార్‌ యోజన, పట్టణ సూక్ష్మసంస్థల పథకం కింద పరపతి సమకూర్చాయి. స్వయంఉపాధి పథకం కింద కూడా రుణాలు ఇచ్చాయి.

 

6) బ్యాంకింగ్‌ వైవిధ్యీకరణ/నూతన విధానాలు, సాధనాలు: జాతీయీకరణ తర్వాత బ్యాంకుల వ్యవహార సరళిలో, దృక్పథంలో మార్పు వచ్చింది. ఆధునిక విధానాలు, పురోగామి పద్ధతులను అనుసరించాయి. 1949 నాటి బ్యాంకింగ్‌ క్రమబద్ధీకరణ చట్టాన్ని సవరించారు. బ్యాంకింగ్‌ వైవిధ్యీకరణకు కేంద్ర ప్రభుత్వం మార్గదర్శక సూత్రాలు జారీ చేసింది.

 

ప్రధానమంత్రి జన్‌ధన్‌ యోజన: ఆర్థిక సమ్మిళిత వృద్ధి లక్ష్యంతో 2014, ఆగస్టు 28న ఈ పథకం ప్రారంభమైంది. దాని నినాదం ‘మేరా ఖాతా భాగ్యవిధాత’. దేశంలోని అన్ని కుటుంబాలకు బ్యాంకు ఖాతాలు ఉంటే అనేక విత్త సేవలకు అవకాశం ఉంటుంది. ఈ పథకం ప్రారంభించిన రోజునే దేశవ్యాప్తంగా 1.5 కోట్ల పొదుపు ఖాతాలు తెరిచారు. ఈ ఖాతా తెరవడానికి కనీస బాలెన్స్‌ అవసరం లేదు. ఖాతాదారులకు రూపే డెబిట్‌ కార్డులు జారీ అవుతాయి. రూ.లక్ష వరకు ప్రమాద బీమా సౌకర్యం ఉంటుంది.

 


బ్యాంకింగ్‌ రంగ సంస్కరణలు


ద్రవ్య వ్యవస్థ పనితీరును సమీక్షించడానికి 1982లో నియమించిన సుఖమాయ్‌ చక్రవర్తి కమిటీ 1985లో నివేదిక సమర్పించింది. అందులోని ముఖ్యాంశాలు.. 1) ధరల స్థిరీకరణను సాధించే విధంగా ద్రవ్య విధానం ఉండాలి. 2) ద్రవ్య సరఫరా పెరగడానికి కారణం ఆర్‌బీఐ, ప్రభుత్వానికి పెద్దఎత్తున పరపతిని అందించడమే. 3) వడ్డీ రేట్ల నిర్ణయంలో బ్యాంకులకు స్వేచ్ఛ ఉండాలి. 4) కేంద్ర బడ్జెట్‌ లోటును తిరిగి నిర్వచించాలి.

 


నరసింహం కమిటీ: విత్తవ్యవస్థ పనితీరు, నిర్మాణాన్ని పరిశీలించి సూచనలు చేసేందుకు 1991లో ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ ఎం.నరసింహం అధ్యక్షతన ఒక కమిటీని ప్రభుత్వం నియమించింది. ఇది 1991, డిసెంబరులో నివేదిక సమర్పించింది. అందులో పలు సిఫార్సులు చేసింది.

 

1) ఆదేశిత పెట్టుబడి:


ఎ) చట్టబద్ధ ద్రవ్యత్వ నిష్పత్తి (ఎస్‌ఎల్‌ఆర్‌) తగ్గించడం: ప్రభుత్వానికి నిధులు సమకూర్చడానికి ప్రధాన సాధనంగా చట్టబద్ధ ద్రవ్యత్వ నిష్పత్తిని ఉపయోగించడాన్ని మానుకోవాలి. ఎస్‌ఎల్‌ఆర్‌ను 38.5 శాతం నుంచి అయిదేళ్లలో 25 శాతానికి తగ్గించాలి (ప్రస్తుత ఎస్‌ఎల్‌ఆర్‌ రేటు 18%).


బి) నగదు నిల్వల నిష్పత్తి తగ్గించడం (సీఆర్‌ఆర్‌): పరపతి 


నియంత్రణ కోసం నగదు నిల్వల నిష్పత్తిపై ఆధారపడకుండా బహిరంగ మార్కెట్‌ వ్యవహారాలపై దృష్టి పెట్టాలి. సీఆర్‌ఆర్‌ని 15 శాతం నుంచి 3 శాతానికి తగ్గించాలి (ప్రస్తుత సీఆర్‌ఆర్‌ 4.5%). 


2) ఆదేశిత పరపతి కార్యక్రమాల నిలుపుదల: ప్రాధాన్య రంగ రుణాలను 40 శాతం నుంచి 10 శాతానికి తగ్గించాలి. అయితే ప్రభుత్వం ఈ సిఫార్సును ఆమోదించలేదు.

 

3) వడ్డీ రేట్ల వ్యవస్థ: దేశంలో వడ్డీ రేట్లను మార్కెట్‌ శక్తుల ఆధారంగా నిర్ణయించాలి

 

 4) నాలుగంచెల బ్యాంకింగ్‌ వ్యవస్థను ఏర్పాటు చేయాలి.

 

5) బ్యాంకు విస్తరణ, సరళీకరణకు ప్రాధాన్యమివ్వాలి.

 

6) ద్వంద్వ నియంత్రణను రద్దు చేయాలి.

 

  బ్యాంకింగ్‌ సంస్కరణలపై 1998లో మరోసారి నరసింహం కమిటీని ఏర్పాటు చేశారు. అందులోని ముఖ్యాంశాలు-* శక్తిమంతమైన బ్యాంకింగ్‌ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ః సంకుచిత బ్యాంకింగ్‌ వ్యవస్థను అమలు చేయాలి.* చిన్న, స్థానిక బ్యాంకుల ఏర్పాటు.* మూలధన పర్యాప్త నిష్పత్తిని పెంచాలి.* బ్యాంకింగ్‌ చట్టాలను సమీక్షించాలి. * వడ్డీ రేట్లపై క్రమబద్ధీకరణ తొలగించాలి. *  బ్యాంకింగ్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డును రద్దు చేయాలి. * స్వచ్ఛంద పదవీ విరమణ పథకం అమలు చేయాలి. * ఎస్‌బీఐ, జాతీయ బ్యాంకుల్లో ఆర్‌బీఐ వాటాను 33 1/2 శాతానికి తగ్గించాలి.వీటిని చాలావరకు ప్రభుత్వం ఆమోదించి అమలు  చేస్తోంది. ఆర్థిక మంత్రిత్వశాఖలో ఉన్న బ్యాంకింగ్‌ శాఖను మూసివేయాలన్న సిఫార్సును మాత్రం ఆమోదించలేదు. 

Posted Date : 18-06-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌