• facebook
  • whatsapp
  • telegram

బ్యాంకులు

అసమాన సేవల ఆర్థిక సంస్థలు!

 


 


ఆధునిక కాలంలో బ్యాంకులు, బ్యాంకింగ్‌ వ్యవస్థ లేని ఆర్థిక రంగాన్ని ఊహించడం సాధ్యం కాదు. ప్రభుత్వం, ప్రజలు, సంస్థలు జరిపే ఆర్థిక లావాదేవీలన్నీ బ్యాంకులతో ముడిపడినవే. వ్యక్తిగత, సంస్థాగత ఆర్థిక పురోగతిలో బ్యాంకులు కీలకపాత్ర పోషిస్తున్నాయి. పటిష్టమైన బ్యాంకింగ్‌ వ్యవస్థ, నియంత్రణ విధానం ఉన్న దేశాల్లో భారతదేశం ఒకటి. నేడు మెరుగైన ఆర్థిక సేవలు అందించడంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులు పోటీ పడుతున్నాయి. మన దేశంలో బ్యాంకింగ్‌ రంగం పుట్టుపూర్వోత్తరాలు, పరిణామక్రమంపై పోటీ పరీక్షార్థులకు అవగాహన ఉండాలి. స్వాతంత్య్రానికి పూర్వం ఏర్పాటైన బ్యాంకులు, స్వాతంత్య్రానంతరం బ్యాంకుల జాతీయీకరణ పరిణామాలు, బ్యాంకుల వర్గీకరణ, గ్రామీణ ప్రాంతాలకు బ్యాంకింగ్‌ సేవలు విస్తరించిన తీరు, ప్రత్యేక లక్ష్యాలతో ఇటీవల కాలంలో ప్రారంభించిన బ్యాంకులు, వాటి ఉద్దేశాలు, తెచ్చిన మార్పును సమగ్రంగా తెలుసుకోవాలి.


బ్యాంకు అనే పదానికి ఆధారం బ్యాంకో, బాంక్వీ. ఈ పదాలకు అర్థం బల్ల. Banca అనే ప్రాచీన ఇటాలియన్, Banc అనే జర్మన్‌ పదాల నుంచి Banc అనే ఆంగ్ల పదం ఆవిర్భవించింది. క్రీ.పూ.600 లోనే బాబిలోన్‌ దేశంలో బ్యాంకులు, బ్యాంకు పత్రాలు ఉండేవని రెవిల్‌హట్‌ అనే ఫ్రెంచి రచయిత పేర్కొన్నారు. బ్యాంకింగ్‌ అంటే ద్రవ్యాన్ని మారకం చేయడం అని అర్థం. క్రౌధర్‌ ప్రకారం బ్యాంకులకు పూర్వీకులు ముగ్గురు 1) వర్తక వ్యాపారి  2) వడ్డీ వ్యాపారి 3) స్వర్ణకారుడు.


బ్యాంకు నిర్వచనం: భారత బ్యాంకింగ్‌ రెగ్యులేషన్‌ చట్టం 1949 సెక్షన్‌-5 ప్రకారం ‘‘కోరిన వెంటనే లేదా ఇంకో సమయంలో చెక్కు, డ్రాఫ్టు, ఆర్డర్ల ద్వారా కానీ, ఇంకోవిధంగా కాని తిరిగి చెల్లించే షరతులపై డిపాజిట్లు స్వీకరించి, ఆ సొమ్మును రుణాలు ఇవ్వడానికి లేదా పెట్టుబడి కోసం ఉపయోగించడం బ్యాంకు వ్యాపారం’’.


షెడ్యూల్డ్‌ బ్యాంకులు: రిజర్వు బ్యాంకు చట్టం (1934) రెండో షెడ్యూల్‌లో నమోదైన బ్యాంకులను షెడ్యూల్డ్‌ బ్యాంకులు అంటారు.

అర్హతలు: 1) బ్యాంకింగ్‌ వ్యాపారం చేస్తూ ఉండాలి. 2) వాటా మూలధనం రూ.5 లక్షలు నికర విలువకు తక్కువ కాకుండా ఉండాలి. 3) జాయింట్‌ స్టాక్‌ కంపెనీగా రిజిస్టర్‌ కావాలి. 4) డిపాజిటర్ల క్షేమానికి భంగకరమైన కార్యకలాపాల్లో పాల్గొనకూడదు.


నాన్‌ షెడ్యూల్డ్‌ బ్యాంకులు: రిజర్వు బ్యాంకు చట్టం (1934) రెండో షెడ్యూలులో నమోదుకాని బ్యాంకులను నాన్‌ షెడ్యూల్డ్‌ బ్యాంకులు అంటారు.


భారతదేశంలో బ్యాంకింగ్‌ చరిత్ర: 1770లో అలెగ్జాండర్‌ అండ్‌ కో అనే ఆంగ్ల ఏజెన్సీ ‘హౌస్‌ బ్యాంక్‌ ఆఫ్‌ హిందూస్థాన్‌’ను స్థాపించింది. ఇది భారతదేశంలో స్థాపించిన మొదటి బ్యాంకు. ఆ తర్వాత ఏజెన్సీలతో సంబంధం లేకుండా ప్రెసిడెన్సీ బ్యాంకులను నెలకొల్పారు. అవి 1806లో బ్యాంక్‌ ఆఫ్‌ బెంగాల్‌; 1840లో బ్యాంక్‌ ఆఫ్‌ బొంబాయి; 1843లో బ్యాంక్‌ ఆఫ్‌ మద్రాస్‌. ఈ మూడు ప్రెసిడెన్సీ బ్యాంకుల వాటా మూలధనంలో అధికభాగం ఐరోపా వాటాదారులదే. పూర్తి భారతీయ యాజమాన్యంలో నెలకొల్పిన మొదటి బ్యాంకు జౌధ్‌ వాణిజ్య బ్యాంకు (1881). ఆ తర్వాత 1894లో పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు, 1901లో పీపుల్స్‌ బ్యాంకు ప్రారంభమయ్యాయి.


1921లో మూడు ప్రెసిడెన్సీ బ్యాంకులను కలిపి భారతీయ ఇంపీరియల్‌ బ్యాంకుగా పేరు మార్చారు. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఏర్పడక పూర్వం ఇంపీరియల్‌ బ్యాంకు కేంద్ర బ్యాంకు విధుల్లో కొన్నింటిని నిర్వహించేది. గోర్వాలా కమిటీ సిఫార్సుపై ఇంపీరియల్‌ బ్యాంకును 1955, జులై 1న స్టేట్‌ బ్యాంకుగా పేరు మార్చారు. 1959లో భారతీయ స్టేట్‌ బ్యాంకు చట్టం వచ్చింది. ఈ చట్టం కింద 8 ప్రాంతీయ బ్యాంకులను జాతీయం చేసి, స్టేట్‌ బ్యాంకు అనుబంధ బ్యాంకులుగా తీసుకుంది. అవి 1) బ్యాంక్‌ ఆఫ్‌ బికనీర్‌  2) బ్యాంక్‌ ఆఫ్‌ జైపుర్‌  3) బ్యాంక్‌ ఆఫ్‌ ఇండోర్‌  4) బ్యాంక్‌ ఆఫ్‌ మైసూర్‌  5) బ్యాంక్‌ ఆఫ్‌ పాటియాలా  6) స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ హైదరాబాద్‌  7) స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ సౌరాష్ట్ర  8) స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ట్రావెన్‌కోర్‌.

1963లో బ్యాంక్‌ ఆఫ్‌ బికనీర్, బ్యాంక్‌ ఆఫ్‌ జైపుర్‌ విలీనమై స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ బికనీర్‌ అండ్‌ జైపుర్‌గా మారింది. 2008లో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ సౌరాష్ట్రను, 2010లో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండోర్‌లను ఎస్‌బీఐ విలీనం చేసుకుంది. 2017, ఏప్రిల్‌లో మిగిలిన అయిదు అనుబంధ బ్యాంకులు ఎస్‌బీఐలో విలీనమయ్యాయి.


జాతీయం చేసిన బ్యాంకులు: 1967లో హజారే కమిటీ ప్రకారం బ్యాంకులు కుటీర పరిశ్రమలకు, ప్రాథమిక రంగాలకు రుణాలివ్వాలన్న సామాజిక నియంత్రణ విధించారు. కానీ ఆశించిన ఫలితాలు రాకపోవడంతో 1969, జులై 19న రూ.50 కోట్లు కంటే ఎక్కువ డిపాజిట్లు ఉన్న 14 వాణిజ్య బ్యాంకులను కేంద్ర ప్రభుత్వం జాతీయం చేసింది. 

ప్రజాసంక్షేమం, ఆర్థిక వ్యవస్థ నియంత్రణలో భాగంగా 1980, ఏప్రిల్‌ 15న రూ.200 కోట్ల కంటే ఎక్కువ డిపాజిట్లు ఉన్న 6 వాణిజ్య బ్యాంకులను కేంద్రం జాతీయం చేసింది. 

నష్టాలతో నడుస్తున్న న్యూ బ్యాంక్‌ ఆఫ్‌     ఇండియాను 1993లో పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో విలీనం చేశారు. 2019, ఏప్రిల్‌లో దేనా బ్యాంకు, విజయా బ్యాంకులు.. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో విలీనమయ్యాయి. 2020, ఏప్రిల్‌లో ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్, యునైటెడ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలు పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో విలీనమయ్యాయి. ఇదే సంవత్సరంలో సిండికేట్‌ బ్యాంకును కెనరా బ్యాంకులో, అలహాబాద్‌ బ్యాంకును ఇండియన్‌ బ్యాంకులో; ఆంధ్రా బ్యాంకు, కార్పొరేషన్‌ బ్యాంకులను యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో విలీనం చేశారు. ప్రస్తుతం జాతీయం చేసిన బ్యాంకులు 11 ఉన్నాయి. ఎస్‌బీఐతో కలిపి ప్రభుత్వ రంగ బ్యాంకులు మొత్తం 12.


భారతీయ మహిళా బ్యాంకు: మన్మోహన్‌ సింగ్‌ ప్రధానిగా, చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు 2013, నవంబరు 19న ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా మొదటి భారతీయ మహిళా బ్యాంకును దిల్లీ ప్రధాన కేంద్రంగా ప్రారంభించారు. దీని తొలి సీఎండీ ఉషా అనంత సుబ్రహ్మణ్యం. మహిళలకు ప్రత్యేకంగా బ్యాంకు ఏర్పాటు చేసిన మూడో దేశం ఇండియా. మొదటిది పాకిస్థాన్, రెండోది టాంజానియా. మహిళా బ్యాంకు అందరి నుంచి డిపాజిట్లు స్వీకరిస్తుంది. రుణాలు మాత్రం మహిళలకే అందిస్తుంది. 2017, ఏప్రిల్‌లో ఇది స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో విలీనమైంది.


 

ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు: బ్యాంకుల జాతీయీకరణ జరిగినప్పటికీ గ్రామాల్లో రుణగ్రస్థత తగ్గలేదు. వడ్డీ వ్యాపారుల ఆధిపత్యం కొనసాగుతూనే ఉంది. ఎం.నరసింహన్‌ కమిటీ సిఫార్సు మేరకు 20 సూత్రాల పథకంలో భాగంగా, 1975, అక్టోబరు 2న 5 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను ఏర్పాటు చేశారు. తర్వాత వీటిని స్పాన్సర్‌ చేసిన బ్యాంకుల్లో విలీనం చేశారు. ప్రస్తుతం వీటి సంఖ్య 43 (2021). 1987 తర్వాత కొత్త ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను స్థాపించలేదు. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి 15%, కేంద్ర ప్రభుత్వానికి 50%, స్పాన్సర్‌ చేసిన బ్యాంకుకు 35% చొప్పున వాటా ఉంటుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తొలి ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు నాగార్జున గ్రామీణ బ్యాంకు. 1976న ఖమ్మంలో ఏర్పాటైంది. దేశంలో ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు లేని రాష్ట్రాలు సిక్కిం, గోవా. 1997 నుంచి ప్రాధాన్య రంగాలకు రుణాలు ఇవ్వాలన్న భావనను ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులకు కూడా వర్తింపజేశారు. గ్రామీణ బ్యాంకులు ఇచ్చే రుణాల్లో 75% ప్రాధాన్య రంగాలకు ఇవ్వాలని చక్రవర్తి కమిటీ సూచించింది.


ముద్రా బ్యాంకు (ఎమ్‌యూడీఆర్‌ఏ - మైక్రో యూనిట్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ రీ ఫైనాన్స్‌ ఏజెన్సీ): ఇదొక ప్రభుత్వ రంగ విత్త సంస్థ. ప్రధానమంత్రి ముద్రా యోజన పథకం కింద 2015, ఏప్రిల్‌ 8న ప్రారంభమైంది. భారతీయ చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంకుకు అనుబంధ సంస్థ. సూక్ష్మ, చిన్నతరహా, మధ్యతరహా సంస్థలకు తక్కువ వడ్డీకి రుణాలిస్తుంది. సూక్ష్మ విత్త సంస్థలకు, బ్యాంకేతర విత్త సంస్థలకు కూడా రుణసహాయం అందిస్తుంది. ఈ సంస్థకు రూ.లక్ష కోట్ల పరపతి హామీ నిధిని ప్రభుత్వం కేటాయించింది.. ఈ సంస్థ రుణగ్రహీతలను 3 రకాలుగా వర్గీకరించి రుణాలిస్తుంది. చిన్న తయారీ సంస్థలు, దుకాణదారులు, పండ్లు, కూరగాయలు అమ్మేవారికి, చేతివృత్తుల వారికి ఈ సంస్థ రుణాలు అందిస్తుంది.


పేమెంట్‌ బ్యాంకులు: ఇవి కొత్తతరహా బ్యాంకులు. 2014, జనవరిలో నచికేత్‌ మోర్‌ కమిటీ వీటి ఏర్పాటుకు సిఫార్సు చేసింది. 2014, నవంబరు 27న రిజర్వు బ్యాంకు ఈ పేమెంట్‌ బ్యాంకుల ఏర్పాటుకు మార్గదర్శక సూత్రాలు జారీ చేసింది. 2015, ఆగస్టు 19న రిజర్వు బ్యాంకు 11 పేమెంట్‌ బ్యాంకుల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ప్రస్తుతం 6 మాత్రమే పనిచేస్తున్నాయి. ఈ బ్యాంకులు ఒక్కో వ్యక్తి నుంచి రూ.లక్ష వరకు డిమాండ్‌ డిపాజిట్లు స్వీకరించవచ్చు. చెల్లింపు సేవలు అందించవచ్చు. మొబైల్‌ ద్వారా చెల్లింపు బదిలీలు చేయవచ్చు. అల్పఆదాయ వర్గాల వారికి, చిన్న వ్యాపారులకు, వలస కార్మికులకు, అసంఘటిత రంగంలో పనిచేసేవారికి విత్త సేవలు అందుబాటులో ఉంచడమే వీటి లక్ష్యం. ఈ బ్యాంకులు డెబిట్‌ కార్డులు జారీ చేయవచ్చు. అయితే రుణాలు ఇచ్చేందుకు, క్రెడిట్‌ కార్డుల జారీకి వీల్లేదు.


చిన్న విత్త బ్యాంకులు: బ్యాంకింగ్‌ సేవలు అందుబాటులో లేని జనాభా సౌకర్యార్థం ఏర్పాటు చేసినవే చిన్న విత్త బ్యాంకులు. రూ.100 కోట్లు కనీస ఈక్విటీ మూలధనంతో వీటిని స్థాపించవచ్చు. 2014, నవంబరు 27న రిజర్వు బ్యాంకు ఈ తరహా బ్యాంకుల ఏర్పాటును ఆమోదించింది. 2015, సెప్టెంబరు 17న బ్యాంకేతర విత్త సంస్థలకు లైసెన్సు జారీ చేసింది. ఈ బ్యాంకులు ప్రజల నుంచి డిపాజిట్లు స్వీకరిస్తాయి.. సన్నకారు, ఉపాంత రైతులకు, చిన్నవ్యాపార సంస్థలకు, అసంఘటిత రంగాల్లో వారికి రుణాలు అందిస్తాయి.


బంధన్‌ బ్యాంకు: 2015లో అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ కోల్‌కతాలో ఈ బ్యాంకును ప్రారంభించారు. ఇది దేశంలో మైక్రోఫైనాన్స్‌ కంపెనీగా ఉండి పూర్తిస్థాయి వాణిజ్య బ్యాంకుగా కార్యకలాపాలు ప్రారంభించిన మొదటి బ్యాంకు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తూర్పు భారతదేశంలో ప్రారంభించిన మొదటి బ్యాంకు కూడా. ఇది ప్రైవేటు సంస్థ.


ఐడీఎఫ్‌సీ బ్యాంకు: 2015, అక్టోబరు 19న ప్రధాని మోదీ దిల్లీలో ప్రారంభించారు. ఈ బ్యాంకు ప్రధాన కేంద్రం ముంబయి. మొదట ఇది అవస్థాపనా సదుపాయాల కల్పన విత్త సంస్థగా ఉండేది. తర్వాత వాణిజ్య బ్యాంకుగా మార్చారు. ఇది ప్రైవేటు సంస్థ.


ప్రైవేటు బ్యాంకులు: దేశంలో 22 ప్రైవేటు బ్యాంకులు ఏర్పాటయ్యాయి. 2022 నాటికి 21 బ్యాంకులు మాత్రమే ఉన్నాయి


విదేశీ బ్యాంకులు: మనదేశంలో 2022 నాటికి 46 విదేశీ బ్యాంకులున్నాయి. ఇందులో అధిక శాఖలున్నవి 1) స్టాండర్ట్‌ చార్టర్డ్‌ బ్యాంకు 2) సిటీబ్యాంక్‌-హెచ్‌ఎస్‌బీసీ. విదేశీ బ్యాంకును ఏర్పాటు చేయాలంటే 2013 ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం  రూ.500 కోట్లు మూలధనం ఉండాలి. 


స్టేట్‌ బ్యాంక్‌ ఇన్‌ క్యూబ్‌: ప్రత్యేకంగా అంకుర సంస్థ (స్టార్టప్‌)ల కోసం ఏర్పాటైన వాణిజ్య బ్యాంకు శాఖ ఇది. 2016, జనవరి 14న బెంగళూరులో భారతీయ స్టేట్‌ బ్యాంకు ప్రారంభించింది.


 


రచయిత: ధరణి శ్రీనివాస్‌ 

Posted Date : 08-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌