• facebook
  • whatsapp
  • telegram

మూలధన మార్కెట్‌

పెద్ద పెట్టుబడులు అందించే విశ్వసనీయ వ్యవస్థ!

 


  దేశ ప్రగతి, ఆర్థికాభివృద్ధిలో కీలకమైన వ్యాపార సంస్థలకు, కంపెనీలకు పెట్టుబడులు పెద్దమొత్తంలో కావాలి. అలాగే ప్రభుత్వాలు, ప్రభుత్వ సంస్థలకు ఎప్పటికప్పుడు భారీగా నిధులు అవసరమవుతుంటాయి. వీటికి వ్యవస్థాగతంగా దీర్ఘకాలిక విత్తాన్ని అందించే వనరే మూలధన మార్కెట్‌. ప్రజల వద్ద ఉన్న పొదుపును; బ్యాంకులు, బీమా సంస్థల్లో పోగుపడిన నిధులను, సంస్థాగత పెట్టుబడిదారుల నుంచి సంపదను సేకరించి ఉత్పాదక కార్యకలాపాలకు తరలిస్తున్న వ్యవస్థ ఇది. ఇందులో భాగమే స్టాక్‌ మార్కెట్‌. దేశంలోని మిగులు ధనాన్ని అనుత్పాదక వనరుల నుంచి ఉత్పాదక రంగాలకు తరలిస్తున్న ఈ చట్రంపై పోటీ పరీక్షార్థులకు తగిన అవగాహన ఉండాలి. ఆధునిక కాలంలో పెట్టుబడుల సేకరణకు సృష్టించిన అద్భుత మార్గమైన స్టాక్‌ మార్కెట్‌ గురించి, దాని పూర్వాపరాలు, పనితీరు, ప్రభావం, అనుబంధ సంస్థల గురించి తెలుసుకోవాలి.

 


 
  దీర్ఘకాలిక విత్తాన్ని కొన్ని సంస్థలు, ఏర్పాట్లు, సౌకర్యాలు సమకూరుస్తాయి. వాటన్నింటినీ కలిపి మూలధన మార్కెట్‌ అంటారు. పొదుపు మొత్తాల సేకరణ, పెట్టుబడి మార్గాల్లోకి తరలింపు దీని ప్రధాన బాధ్యత. ప్రైవేటు రంగంతో పాటు ప్రభుత్వ రంగం కూడా దీర్ఘకాలిక విత్త అవసరాలకు మూలధన మార్కెట్‌పై ఆధారపడుతుంది. ఈ మార్కెట్‌లో పెట్టుబడి కాలవ్యవధి ఒక సంవత్సరం కంటే ఎక్కువ.

 


మూలధన మార్కెట్‌ సాధనాలు: 1) వాటాలు 2) రుణపత్రాలు 3) బాండ్లు 4) డెరివేటివ్స్‌ 5) మ్యూచువల్‌ ఫండ్స్‌.

 


ద్రవ్య మార్కెట్, మూలధన మార్కెట్‌ ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి. ఆర్థిక వ్యవస్థకు రెండూ అవసరమే. ఒక మార్కెట్‌ కార్యకలాపాలు రెండో మార్కెట్‌ను ప్రభావితం చేయవచ్చు. స్వల్పకాలిక రుణాలపై వడ్డీ రేటు అధికంగా ఉంటే మూలధన మార్కెట్‌లో ద్రవ్యానికి డిమాండ్‌ పెరగవచ్చు. మూలధన మార్కెట్‌లో సెక్యూరిటీలపై డివిడెండ్‌ లేదా వడ్డీ చెల్లించినప్పుడు ద్రవ్య మార్కెట్‌లో ద్రవ్య నిధులు పెరగవచ్చు.

 


మూలధన మార్కెట్‌ విధులు:  1) సమాజంలోని పొదుపును సమీకరిస్తుంది, పెట్టుబడి మార్గంలోకి మళ్లిస్తుంది. 2) పరిశ్రమలకు, వ్యాపార సంస్థలకు విత్తాన్ని సమకూరుస్తుంది.3) మూలధన నిధులను అనుత్పాదక రంగాల నుంచి ఉత్పాదక రంగాలకు తరలిస్తుంది. 4) వనరుల సమర్థ వినియోగం ద్వారా ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి, ఉద్యోగిత పెరుగుదలకు తోడ్పడుతుంది.5) దేశ ఆర్థికాభివృద్ధిలో పాలు పంచుకుంటుంది.

 


భారతీయ మూలధన మార్కెట్‌ స్వరూపం:

 


సెక్యూరిటీల మార్కెట్‌: ద్రవ్యం మీద లేదా విత్త సంబంధ ఆస్తుల మీద ఉన్న హక్కును తెలియజేసే పత్రాలను సెక్యూరిటీలు అంటారు. దీర్ఘకాలిక వ్యవధి ఉన్న సెక్యూరిటీల కొనుగోలు, అమ్మకం నిర్వహించే మార్కెట్‌ను సెక్యూరిటీల మార్కెట్‌ అవుతుంది. దీన్నే స్టాక్‌ మార్కెట్‌ అని కూడా అంటారు. మూలధన మార్కెట్‌లో ప్రధాన విభాగం ఇదే. దీన్ని ప్రభుత్వ సెక్యూరిటీ మార్కెట్, ప్రైవేటు సెక్యూరిటీల మార్కెట్‌ అని రెండు రకాలుగా విభజించారు.

 


1) ప్రభుత్వ సెక్యూరిటీల లేదా శ్రేష్ఠ సెక్యూరిటీల మార్కెట్‌ (గిల్ట్‌ ఎడ్జ్‌డ్‌ మార్కెట్‌): ఇది ప్రభుత్వ సెక్యూరిటీలు లేదా ప్రభుత్వ హామీ పొందిన సెక్యూరిటీల క్రయవిక్రయాలు జరిగే మార్కెట్‌. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, నగరపాలక సంస్థలు, పురపాలక సంస్థలు, ప్రభుత్వ పోర్టు ట్రస్టులు, రాష్ట్ర విద్యుత్తు మండళ్లు, ప్రభుత్వరంగ సంస్థలు, ప్రభుత్వరంగ అభివృద్ధి బ్యాంకులు జారీ చేసిన సెక్యూరిటీలను ప్రభుత్వ సెక్యూరిటీలు అంటారు. గిల్ట్‌ ఎడ్జ్‌ అంటే ‘మంచి నాణ్యత’ అని అర్థం. వీటికి ప్రభుత్వ హామీ ఉంటుంది. నష్టభయం ఉండదు. ప్రభుత్వ సెక్యూరిటీలు రూ.100, రూ.1000 విలువతో ఉంటాయి. ప్రభుత్వ సెక్యూరిటీలు అధికంగా ప్రామిసరీ నోటు రూపంలో ఉంటాయి.బేరర్‌ బాండ్ల రూపంలో స్టాక్‌ సర్టిఫికెట్‌లు ఉంటాయి.

 


2) పారిశ్రామిక లేదా కార్పొరేట్‌ సెక్యూరిటీల మార్కెట్‌: ప్రైవేటు సెక్యూరిటీల మార్కెట్‌ను పారిశ్రామిక సెక్యూరిటీల మార్కెట్‌ అంటారు. ఇది రెండు రకాలుగా ఉంటుంది.


ఎ) నూతన జారీ మార్కెట్‌: దీన్ని ప్రాథమిక మార్కెట్‌ అంటారు. వీటి ద్వారా నిధులు సమకూర్చుకునే సంస్థలు కొత్తవి కావచ్చు, విస్తరణకు ప్రయత్నిస్తున్న పాత సంస్థలు కావచ్చు.


బి) పాత జారీ మార్కెట్‌: అప్పటికే అమలులో ఉన్న సెక్యూరిటీలు లేదా పాత జారీల క్రయ విక్రయాలు నిర్వహించే మార్కెట్‌. అలాంటి సెక్యూరిటీలకు ద్రవ్యత్యం కల్పించడమే ఈ మార్కెట్‌ ప్రధాన విధి. దీన్నే ద్వితీయ మార్కెట్‌ అంటారు. దీన్ని రెండు భాగాలుగా వర్గీకరించవచ్చు.


i) సంఘటిత స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ మార్కెట్‌: వ్యవస్థీకృత మూలధన మార్కెట్‌లో స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లు ఒక ముఖ్యమైన భాగం. పారిశ్రామిక, వ్యాపార సంస్థల వాటాలు, డిబెంచర్లు, ప్రభుత్వ బాండ్లు, ఇతర సెక్యూరిటీల క్రయ విక్రయాలు జరిగే మార్కెట్‌. దీన్నే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ లేదా స్టాక్‌ మార్కెట్‌గా పిలుస్తారు.


ii) ఓవర్‌ ది కౌంటర్‌ మార్కెట్‌: స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ జాబితాలో లేని సెక్యూరిటీల్లో లావాదేవీలు నిర్వహిస్తుంది.

 


స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌: 1956 సెక్యూరిటీ క్రమబద్ధ చట్టం ప్రకారం సెక్యూరిటీల కొనుగోలు, అమ్మకాల వ్యాపారాన్ని లేదా వర్తకాన్ని నియంత్రించడానికి లేదా సులభం చేయడానికి ఏర్పాటుచేసిన నమోదైన, లేదా నమోదు కాని వ్యక్తుల సంఘం స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌. ప్రభుత్వ సెక్యూరిటీలకు రిజర్వు బ్యాంకు అనుమతి పొందిన ప్రభుత్వ బ్రోకర్లు ఉంటారు. స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ జాబితాలో ఉన్న సెక్యూరిటీలకు మార్కెట్‌లో న్యాయబద్ధమైన ధర లభిస్తుంది. పన్నుల విధింపులో కొన్ని రాయితీలు లభిస్తాయి.అలాంటి సెక్యూరిటీలకు ద్రవ్యత్వం ఎక్కువగా ఉంటుంది.

 


స్థాపన: ప్రపంచంలో మొదట స్థాపించిన స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ లండన్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌. దీన్ని 18వ శతాబ్దంలో నెలకొల్పారు. అమెరికాలోని న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ ‘నాస్‌డాక్‌’, ఇంగ్లండ్‌లోని లండన్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్, జపాన్‌ ఎక్స్ఛేంజ్‌ గ్రూపు ప్రపంచంలో ప్రధానమైన స్టాక్‌ మార్కెట్లు. భారతదేశంలో మొట్టమొదటి స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ 1875లో ముంబయిలో ఏర్పాటైంది. ఆ తర్వాత అహ్మదాబాద్, చెన్నై, దిల్లీ, ఇందౌర్, హైదరాబాద్, బెంగళూరు, లుథియానా, కాన్పుర్‌ నగరాల్లో స్థాపించారు.


భారతదేశంలో సెబీ గుర్తించిన స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లు 8 ఉన్నాయి. అవి 1) బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ (బీఎస్‌ఈ) 2) నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ (ఎన్‌ఎస్‌ఈ) 3) అహ్మదాబాద్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ 4) కలకత్తా స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ 5) ఇండియా ఇంటర్నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ 6) మగధ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ 7) మెట్రోపాలిటన్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌


8) ఎన్‌ఎస్‌ఈ ఐఎఫ్‌ఎస్‌సీ లిమిటెడ్‌.వీటిలో బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ ప్రధానమైనవి.

 


బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌: 1875లో అప్పటి బొంబయిలో ‘ది నేటివ్‌ షేర్‌ అండ్‌ స్టాక్‌ బ్రోకర్స్‌ అసోసియేషన్‌’ అని ఒక సంస్థ ఏర్పడింది. అదే బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌గా మారింది. భారతదేశంలో 1957లో శాశ్వత ప్రాతిపదికన మొదట గుర్తించిన స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ ఇది. ప్రధాన కార్యాలయం ముంబయి దలాల్‌ వీధిలో ఉంది. ఇందులో రిజిస్టరైన కంపెనీల సంఖ్య 5307. ప్రస్తుత ఎండీ, సీఈఓ సుందరరామన్‌ రామమూర్తి.

 


నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌: 1992, నవంబరులో ముంబయిలో నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ ఆఫ్‌ ఇండియాను స్థాపించారు. 1994, జూన్‌ 30 నుంచి ఇందులో వ్యాపారం ప్రారంభమైంది. అప్పటివరకు అతి పెద్దదైన బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ కంటే ఎక్కువ వ్యాపారం సాధించింది. ఇందులో రిజిస్ట్టరైన కంపెనీలు 2002. ప్రస్తుత ఎండీ, సీఈఓ అశీష్‌ కుమార్‌ చౌహాన్‌.

 


స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లో సభ్యులు జాబర్లు, బ్రోకర్లు అని రెండు రకాలు.

 


జాబర్లు: స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లోనే ఉండి వ్యాపార వ్యవహారాలు నిర్వహిస్తారు.

 


బ్రోకర్లు: కొనుగోలు, అమ్మకం వ్యవహారాల్లో ఇతరులకు ఏజెంట్లుగా పనిచేస్తారు. సభ్యులు కాని వారిని స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లోకి అనుమతించరు.

 


అంచనా వ్యాపారం: సాధారణంగా స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లో అంచనా వ్యాపారం ఎక్కువగా జరుగుతుంది. సెక్యూరిటీ ధరల్లో భవిష్యత్తులో వచ్చేందుకు అవకాశం ఉన్న మార్పులను ముందుగానే అంచనా వేసి అధిక లాభాపేక్షతో కొనుగోలు, అమ్మకం చేసే వ్యాపారులను అంచనా వ్యాపారులు అంటారు. అంచనా వ్యాపారం చేసే సభ్యులను స్పెక్యులేటర్లు అంటారు. వీరిని నాలుగు రకాలుగా వర్గీకరిస్తారు.

 


1) బుల్స్‌: భవిష్యత్తులో ధరలు పెరుగుతాయని ఊహించి, ప్రస్తుత ధరల వద్ద సెక్యూరిటీలు కొని ధరలు పెరిగిన తర్వాత అమ్మేవారిని బుల్స్‌ అంటారు. వీరు ఆశావాదులు.

 


2) బేర్స్‌: భవిష్యత్తులో ధరలు తగ్గుతాయని ఊహించి సెక్యూరిటీలను అమ్మేవారిని బేర్స్‌ అంటారు. వీరు నిరాశావాదులు.

 


3) స్టాగ్స్‌: వీరు బుల్స్‌ మాదిరిగానే భవిష్యత్తులో సెక్యూరిటీల ధరలు పెరుగుతాయని ఊహిస్తారు. కొత్త కంపెనీలు జారీ చేసిన సెక్యూరిటీలను పెద్దమొత్తంలో కొనేందుకు దరఖాస్తు చేస్తారు.

 


4) లేమ్‌డక్‌లు: వీరు తమ వద్ద సెక్యూరిటీలు లేకపోయినా అమ్మడానికి కాంట్రాక్టులు రాసి వాటిని నెరవేర్చడానికి తక్కువ ధరల వద్ద సెక్యూరిటీలు కొనడానికి అన్వేషిస్తుంటారు.

 


భారతదేశంలో స్టాక్‌ మార్కెట్‌ సూచికలు:

 


సెన్సెక్స్‌: దీన్నే సెన్సిటివ్‌ ఇండెక్స్‌ అంటారు. ఇది బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌కి సంబంధించిన సూచిక. ఈ సూచీలోని ప్రాతినిధ్య సంస్థల సంఖ్య 30. ఆధార సంవత్సరం 1978-79.

 


నేషనల్‌ ఇండెక్స్‌: బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌కి సంబంధించిన మరో సూచిక. దీనిలో ప్రాతినిధ్య సంస్థల సంఖ్య 100. ఆధార సంవత్సరం 1983-84.

 


బీఎస్‌ఈ- 200: ఈ సూచికలోని ప్రాతినిధ్య సంస్థల సంఖ్య 200. ఆధార సంవత్సరం 1989-90.

 


డాలెక్స్‌: బీఎస్‌ఈ- 200 డాలర్‌ విలువను డాలెక్స్‌ అంటారు. దీని ఆధార సంవత్సరం 1989-90.

 


బ్యాంకెక్స్‌: ఇది 2003, జూన్‌ నుంచి రూపుదిద్దుకుంటోంది. ఇందులో 12 బ్యాంకుల వాటాలను చేర్చారు. ఆధార సంవత్సరం 2002.

 


బీఎస్‌ఈ షరియా: బీఎస్‌ఈలో 2010లో దీన్ని ప్రవేశపెట్టారు. దీనిలో 50 కంపెనీలు లిస్టయ్యాయి.

 


నిఫ్టీ ఫిప్టీ (ఎన్‌ఎస్‌ఈ-50): ఈ సూచికను నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ తయారు చేస్తుంది. 50 ప్రాతినిధ్య సంస్థల వాటాలను ఇందులో చేర్చారు. దీనిపేరు ఎస్‌ అండ్‌ పీసీఎన్‌ఎక్స్‌ నిఫ్టీగా మార్చారు. ఆధార సంవత్సరం 1975.

 


కమాడిటీ ఫ్యూచర్స్‌ మార్కెట్‌: కొన్ని వస్తువుల ధరల్లో భవిష్యత్తులో ఎక్కువగా మార్పులు సంభవిస్తూ ఉంటాయి. ఆ ప్రభావాన్ని తప్పించేందుకు కొనుగోలుదారులు, అమ్మకందారులు ఒక వస్తువును భవిష్యత్తులో ఒక నిర్ణీత పరిమాణంలో ఒక నిర్ణీత తేదీన, ఒక నిర్ణీత ధర వద్ద కొనడం, అమ్మకం గురించి ఒప్పందం కుదుర్చుకుంటారు. అలాంటి ఒప్పందాలను కమాడిటీ ప్యూచర్స్‌ మార్కెట్‌ అంటారు. వ్యవసాయ ఉత్పత్తులు, బంగారం, ముడి చమురు, లోహ వస్తువులు, విమాన ఇంధనం, ధనియాలు, వెల్లుల్లి, ఉక్కు మొదలైన వస్తువుల్లో ఫ్యూచర్‌ వ్యాపారం జరుగుతుంది. ఈ మార్కెట్‌కు సంబంధించిన ఎక్స్ఛేంజ్‌లను కమాడిటీ ఎక్స్ఛేంజ్‌లు అంటారు. భారతదేశంలో పనిచేస్తున్న కమాడిటీ ఎక్స్ఛేంజ్‌లు 1) నేషనల్‌ కమాడిటీ ఎక్స్ఛేంజ్‌ (ఎన్‌ఎమ్‌సీఈ) అహ్మదాబాద్‌ (2002) 2) ఎం.సి.ఎక్స్‌. ముంబయి- (2003). 3) నేషనల్‌ కమాడిటీ అండ్‌ డెరివేటివ్స్‌ ఎక్స్ఛేంజ్‌ లిమిటెడ్‌ (ఎన్‌సీడీఈఎక్స్‌) 4) ఎ.సి.ఇ. కమాడిటీ ఎక్స్ఛేంజ్‌ (ముంబయి).

 


క్రిసిల్‌-క్రెడిట్‌ రేటింగ్‌ ఇన్ఫర్మేషన్‌ సర్వీస్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌: క్రిసిల్‌ భారతదేశపు మొదటి రేటింగ్‌ ఏజెన్సీ. దీనిని 1987లో నెలకొల్పారు. సంస్థల వ్యాపార నష్టభయం, నిర్వహణ నష్టభయం, ఆర్థిక నష్టభయం అనే మూడు అంశాలను మూల్యాంకనం చేసి, వ్యాపార సంస్థలకు రేటింగ్‌ ఇస్తుంది.

 


సెబీ: సెక్యూరిటీస్‌ ఎక్స్ఛేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా. మూలధన మార్కెట్‌ను క్రమబద్ధీకరించటానికి, అభివృద్ధి చేయడానికి, పెట్టుబడిదారులకు రక్షణ కల్పించడానికి ఒక ఉన్నత స్థాయి సంస్థను నెలకొల్పాలన్న పటేల్‌ కమిటీ సిఫార్సు మేరకు 1988లో సెబీ ఏర్పాటైంది. 1992, జనవరి నుంచి సెబీని చట్టబద్ధం చేశారు. దీని ప్రధాన కార్యాలయం ముంబయిలో ఉంది. ప్రస్తుత సెబీ ఛైర్మన్‌ మాదాబి పూరి బచ్‌.

 


సెబీ లక్ష్యాలు: * స్టాక్‌ ఎక్స్చేంజీల్లో, ఇతర సెక్యూరిటీ మార్కెట్లలో వ్యాపార వ్యవహారాలను న్యాయసమ్మతమైన రీతిలో క్రమబద్ధీకరించడం. * బ్రోకర్లు, ఇతర మధ్యవర్తుల పనితీరును క్రమబద్ధం చేయటం.* పెట్టుబడిదారుల మూలధనానికి, వారి హక్కులకు భద్రత కల్పించటం.

 


అభివృద్ధి విత్త సంస్థలు: ప్రత్యేకంగా పారిశ్రామిక ఆర్థిక సహాయ సంస్థలను స్థాపించాలని, 1953లో పారిశ్రామిక విత్తసంస్థల విచారణ సంఘం సిఫార్సు చేసింది. దాన్ని అననుసరించి భారత ప్రభుత్వం వరుసగా అనేక విత్త సంస్థలను స్థాపించింది. 1991లో నరసింహం కమిటీ వీటిని అభివృద్ధి విత్త సంస్థలుగా పేర్కొంది.

 


విత్త మధ్యవర్తిత్వ సంస్థలు:

 


1) మర్చంట్‌ బ్యాంకులు: కార్పొరేట్, ఇతర సెక్యూరిటీలను మార్కెట్‌ చేసేవే మర్చంట్‌ బ్యాంకులు.

 


2) మ్యూచువల్‌ ఫండ్స్‌: పలు ప్రభుత్వ రంగ బ్యాంకులు, విత్త సంస్థలు మ్యూచువల్‌ ఫండ్స్‌ని ప్రారంభించాయి. ప్రజల నుంచి పొదుపులను సేకరించి స్టాక్‌ మార్కెట్‌ సెక్యూరిటీల్లో పెట్టుబడి పెట్టడం వీటి ప్రధాన లక్ష్యం. మధ్యతరగతి ప్రజలు బ్యాంకుల్లోని తమ పొదుపును మ్యూచువల్‌ ఫండ్స్‌కి మళ్లిస్తున్నారు.

 


3) లీజింగ్‌ కంపెనీలు: పరిశ్రమలు ముఖ్యంగా చిన్నతరహా, మధ్యతరహా, పరిశ్రమలకు ప్లాంట్‌ అండ్‌ మిషనరీ సేకరించడంలో లీజింగ్‌ పద్ధతి చాలా ఆదరణ పొందింది. లీజుకు ఇచ్చే సంస్థకు అద్దె చెల్లించి కొంత నిర్ణీత కాలంలో ఆ సంస్థ యంత్రాలను, పరికరాలను లీజుకు తీసుకునే సంస్థ వాడుకునే విధంగా కుదుర్చుకున్న ఒప్పందమే లీజు. సేవారంగంలో లీజింగ్‌ ఎక్కువ వినియోగంలో ఉంది.

 


4) వెంచర్‌ క్యాపిటల్‌ కంపెనీలు: వ్యాపార రంగంలో కొత్త ఔత్సాహికులకు సాంకేతికంగా కొత్తవి, అంతవరకు సమర్థత రుజువు కాని ప్రాజెక్టులను ప్రారంభించడానికి సమకూర్చే మూలధనమే వెంచర్‌ క్యాపిటల్‌. కొన్ని అఖిలభారత విత్త సంస్థలు వెంచర్‌ క్యాపిటల్‌ కోసం అనుబంధ సంస్థలను ప్రారంభించాయి.

 


రచయిత: ధరణి శ్రీనివాస్‌ 

Posted Date : 02-07-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌