• facebook
  • whatsapp
  • telegram

తెలంగాణ శీతోష్ణస్థితి

     
      తెలంగాణ రాష్ట్రం భారతదేశ ద్వీపకల్పంలో సుమారు 15o 55' నుంచి 19o 55' ఉత్తర అక్షాంశాల మధ్య నుంచి - 77o 22' నుంచి 81o 2' తూర్పు రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది. అందుకే ఈ ప్రాంతాన్ని ఉష్ణమండల ప్రాంతంగా చెప్పొచ్చు. ఈ కారణంగా తెలంగాణ శీతోష్ణస్థితి చాలా వరకు ఉష్ణమండల వర్షఛాయ మండలం మాదిరిగా ఉంటుంది.
* ఈ రాష్ట్రం సముద్ర ప్రభావం లేని పీఠభూమి ప్రాంతం కావడంతో వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు, శీతాకాలంలో అధిక చలి ఉంటుంది. ఇలాంటి ఉష్ణోగ్రతా వ్యత్యాసం ఎక్కువగా ఉన్న శీతోష్ణస్థితిని ఖండాతర్గత శీతోష్ణస్థితి అంటారు.
* తెలంగాణ పీఠభూమిలోని కొన్ని ప్రాంతాలు... ఉదాహరణకు హైదరాబాద్ సముద్ర మట్టం నుంచి ఎత్తయిన ప్రదేశంలో ఉండటంవల్ల (సుమారు 600 మీటర్లు) ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి. ఈ రాష్ట్రంలో సగటు ఉష్ణోగ్రతలు వేసవిలో 36oC గా, శీతాకాలంలో 18oC గా ఉంటాయి.

* మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లోని అతి శీతల, అధిక పీడన పవనాలు హిందూ మహాసముద్రంలోని అల్పపీడన ప్రాంతం దిశగా ప్రయాణం చేయడంవల్ల ఉత్తర తెలంగాణ, ఇతర ఎత్తయిన ప్రాంతాలైన హైదరాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో చలి ఎక్కువగా ఉంటుంది.
వర్షపాతం..
      వేసవిలోని పవనాలు శీతాకాలంలోని పవనాలకు విరుద్దంగా ఉంటాయి. ఇవి నైరుతి నుంచి ఈశాన్య దిశగా వీస్తాయి. ఈ కాలంలో పవనాల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. నైరుతి నుంచి ఈశాన్య దిశకు వెళ్లేకొద్ది వర్షపాతం అధికమవుతుంది. అలాగే దక్షిణ తెలంగాణ నుంచి ఉత్తర తెలంగాణకు వెళ్లేకొద్ది వర్షపాతం పెరుగుతుంది.
* తెలంగాణ రాష్ట్రం పశ్చిమ కనుమల వర్షఛాయ ప్రాంతం కింద ఉండటంతో ఇక్కడ వర్షపాతం చాలా తక్కువగా ఉంటుంది. మొత్తం రాష్ట్రంలోని 45% - 50% విస్తీర్ణంలో 100 సెం.మీ. కంటే తక్కువ వర్షం పడుతుంది. వర్షపాతంలో భిన్నత్వం, అనిశ్చితత్వం చాలా ఎక్కువ.
* వర్షపాతం సాధారణంగా జులై నెలలో అధికంగా ఉంటుంది. ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్ జిల్లాలలో వర్షాలు అధికంగా కురవగా, దక్షిణ తెలంగాణలోని మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాలలో తక్కువ వర్షపాతం నమోదవుతుంది.

రుతువులు
      భారత ప్రభుత్వ వాతావరణ శాఖ (IMD) దేశంలోని వాతావరణ పరిస్థితుల ఆధారంగా సంవత్సర కాలాన్ని నాలుగు భాగాలుగా విభజించింది...
      1. వేసవి కాలం: మార్చి నుంచి మే వరకు.
      2. నైరుతి రుతుపవన కాలం: జూన్ నుంచి సెప్టెంబరు వరకు.
      3. ఈశాన్య రుతుపవన కాలం: అక్టోబరు నుంచి డిసెంబరు వరకు.
      4. శీతాకాలం: డిసెంబరు నుంచి ఫిబ్రవరి వరకు.


వేసవికాలం..
      ఈ కాలంలో సూర్యకిరణాలు నిటారుగా పడి ఎక్కువ వేడిమినిస్తాయి. సగటు ఉష్ణోగ్రతలు రామగుండంలో 35oC నుంచి 48oC వరకు, నిజామాబాద్, ఖమ్మం ప్రాంతాల్లో 42oC - 45oC వరకు, భద్రాచలం, దుమ్ముగూడెం ప్రాంతాల్లో 48oC వరకు ఉంటాయి.
* ఈ ప్రాంతంలో సూర్య కిరణాలు నిటారుగా పడటమే కాకుండా, నల్లరేగడి నేలలు, బొగ్గు నిల్వలు ఉండటంతో ఉష్ణోగ్రతలు పగటిపూట ఎక్కువగా, రాత్రులు తక్కువగా ఉంటాయి.
* ఈ కాలంలో సాధారణంగా వర్షపాతం ఉండదు కానీ అప్పుడప్పుడు అధిక ఉష్ణోగ్రత వల్ల ఏర్పడే వాయుసంవహనాల వల్ల కొద్దిగా వర్షాలుపడతాయి.

నైరుతి రుతుపవనాలు..
      రాష్ట్రంలో జూన్ నుంచి సెప్టెంబరు వరకు వర్షాకాలం ఉంటుంది. జూన్ రెండో వారంలో నైరుతి పవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించి, నెలాఖరునాటికి రాష్ట్రమంతటా విస్తరిస్తాయి. రాష్ట్రంలోని దక్షిణ తెలంగాణ నుంచి ఉత్తర తెలంగాణ ప్రాంతానికి వెళ్లేకొద్ది వర్షపాతం అధికమవుతుంది. దీనికి కారణం అల్పపీడనాలు బంగాళాఖాతం నుంచి గంగా మైదానానికి ప్రయాణించడమే.
* ఈ కాలంలో అయనరేఖా వాయుగుండాలు బంగాళాఖాతంలో ఏర్పడటంవల్ల వర్షాలు ఎక్కువగా కురుస్తాయి. వీటివల్ల పగటి ఉష్ణోగ్రత కొంతవరకు తగ్గుతుంది.


ఈశాన్య రుతుపవన కాలం:
      నైరుతి రుతుపవనాల ఆఖరి రోజుల్లో సూర్యరశ్మి, వేడిగాలిలో తేమ అధికంగా ఉండటంవల్ల చెమట ఎక్కువ పడుతుంది. గాలి లేకపోవడంతో మనుషులు శారీరకంగా అలసటకు లోనవుతారు. ఇలాంటి పరిస్థితులు ముఖ్యంగా అక్టోబరు నెలలో కనిపిస్తాయి కాబట్టి దీన్ని అక్టోబరు వేడి అంటారు.
* క్రమంగా నవంబరు, డిసెంబరు నెలల్లో ఉష్ణోగ్రత తగ్గుతుంది. తిరుగుముఖం పట్టిన నైరుతి రుతుపవనాలనే ఈశాన్య రుతుపవనాలు అంటారు. ఈ కాలంలో బంగాళాఖాతంలో వాయుగుండాలు ఏర్పడతాయి. ముఖ్యంగా నవంబరు నెలలో వీటివల్ల వర్షాలు కురుస్తాయి.

శీతాకాలం..
      ఈ కాలంలో పీఠభూమిలోని ఎత్తయిన ప్రదేశాలతోపాటు హైదరాబాద్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలు బాగా చల్లగా ఉంటాయి. రాత్రుల్లో మంచు కురుస్తుంది. ఉష్ణోగ్రత విలోమం వల్ల పగటిపూట దట్టమైన పొగమంచు ఏర్పడుతుంది. ఫిబ్రవరి ఆఖరు వరకు చలి ఉంటుంది.
* మొత్తం మీద తెలంగాణలోని శీతోష్ణస్థితి... వాతావరణ కాలుష్యం, అధిక భూతాపం వల్ల అనేక మార్పులకు లోనవుతోంది. కరీంనగర్, వరంగల్‌లో ఇటీవల కురిసిన వడగండ్లవానే ఇందుకు నిదర్శనం.

Posted Date : 18-05-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌