• facebook
  • whatsapp
  • telegram

జీవవైవిధ్య సంరక్షణ

జీవజాతులను కాపాడుకుందాం!

 


   సృష్టిలోని ప్రతి జీవి సహజ ఆవరణ వ్యవస్థలో భాగమే. పరస్పర ఆధారితమే. మనిషి చేసే అభివృద్ధి కార్యకలాపాలు, మితిమీరిన వనరుల వినియోగం వల్ల ఎన్నో జీవజాతుల మనుగడ ప్రశ్నార్థకమవుతోంది. ఇప్పటికే కొన్ని వేల రకాల జంతు, వృక్ష జాతులు కనుమరుగయ్యాయి. చాలా జాతుల ఉనికి ప్రమాదపుటంచుల్లో కొనసాగుతోంది. ఈ పరిస్థితిపై అవగాహన పెంచి జీవవైవిధ్యాన్ని సంరక్షించేందుకు ప్రపంచవ్యాప్త కృషి జరుగుతోంది. అందులోనూ భూభాగం కంటే జీవ వైవిధ్య వాటా నాలుగు రెట్లున్న భారతదేశంలో గట్టి ప్రయత్నమే సాగుతోంది. పర్యావరణ పరిరక్షణను పౌరుల ప్రాథమిక విధిగా, వన్యప్రాణుల సంరక్షణను ప్రభుత్వాల బాధ్యతగా రాజ్యాంగం నిర్దేశించింది. ప్రమాద పరిస్థితుల్లో ఉన్న జాతుల వర్గీకరణ, వాటి సంరక్షణకు చేపడుతున్న చర్యలను పోటీపరీక్షల అభ్యర్థులు తెలుసుకోవాలి.

 

 
  అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ సమితి (ఇంటర్నేషనల్‌ యూనియన్‌ ఫర్‌ కన్జర్వేషన్‌ ఆఫ్‌ నేచర్‌ అండ్‌ నేచురల్‌ రిసోర్సెస్‌ -IUCN) అనేది ప్రకృతి, వనరుల పరిరక్షణ కోసం పాటుపడుతుంది. ఈ సంస్థ అధ్యయనం, విశ్లేషణల ద్వారా ప్రకృతి పరిరక్షణకు కృషి చేస్తుంది. దీని ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్‌లో మోర్గెస్‌లోని గ్లాండ్‌ ప్రాంతంలో ఉంది. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా మానవ చర్యల వల్ల ప్రమాద స్థితిలో ఉన్న వృక్ష, జంతు జాతులను గుర్తించి, వాటి సంరక్షణ, నిర్వహణ చర్యలను సూచిస్తూ మొదటిసారిగా రెడ్‌ డేటా బుక్‌ను 1966లో ప్రచురించింది. ఈ బుక్‌లోని గులాబీ రంగున్న పేజీల్లో తీవ్రంగా అంతరించే స్థితిలో ఉన్న జీవజాతులను నమోదు చేస్తారు. ఆకుపచ్చ పేజీల్లో గతంలో అంతరించే స్థాయిలో ఉన్నప్పటికీ, ప్రస్తుతం ఆ స్థితిలో లేని జాతులను పేర్కొంటున్నారు. ఈ ఆకుపచ్చ పేజీలు పెరుగుతూ ఉంటే జీవసంరక్షణ చర్యలు అధికమవుతున్నట్లు భావించవచ్చు. IUCN సంస్థ వివిధ జాతుల వివరాల ఆధారంగా వాటిని రకరకాలుగా విభజించింది.

 


1) అంతరించిపోయిన జాతులు: వీటినే విలుప్తం చెందిన జీవులు అని కూడా అంటారు. ఒక జాతికి చెందిన జీవి ప్రాంతీయంగా/దేశాల్లో/ఖండాల్లో/ప్రపంచంలో ఎక్కడా జీవించే ఆనవాళ్లు లేని లేదా చివరి జీవి కూడా అంతరించినట్లయితే దాన్ని గతించిన జాతిగా గుర్తిస్తారు. ఉదా: డైనోసార్లు, దొడా పక్షి, ఆసియా చిరుతలు, ఊదారంగు తల ఉండే బాతు.

 


2) తీవ్ర అంతర్థాన స్థితిలో ఉన్న జాతులు: వీటినే విలుప్త స్థితికి దగ్గరగా ఉన్న జీవులు అంటారు. దాదాపు అంతరించే స్థితికి చేరిన జీవులను ఈ జాబితాలో చేరుస్తారు. అంటే మనిషి ప్రత్యక్షంగా వాటిని సంరక్షిస్తే తప్ప వాటి మనుగడ సాధ్యం కాని స్థితిలో ఉన్న జీవజాతులు అని అర్థం. ఈ జాతి జీవులుగా పేర్కొనాలంటే వాటికి కొన్ని లక్షణాలు ఉండాలి.


ఎ) గత పదేళ్లలో వాటి సంఖ్య 90% కంటే తగ్గిపోయి ఉండాలి. 


బి) వాటి జనాభా సంఖ్య 50 కంటే తక్కువగా ఉండాలి.


సి) అటవీ జీవులు అయితే పదేళ్లలో వాటి సంఖ్య 50% తగ్గిపోయి ఉండాలి.


ఉదా: ఇండియన్‌ వైల్డ్‌యాస్, ఇండియన్‌ రైనో, లయన్‌ టైల్డ్‌ మకాక్, మలబార్‌ కెవిట్, అతిచిన్న అడవి పంది, ఎగిరే ఉడుత (అరుణాచల్‌ప్రదేశ్‌లో నమ్‌దపా వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో కనిపిస్తుంది), శేషాచలం అడవుల్లో కనిపించే పునుగు పిల్లి, బంగారు బల్లి, ఉడుము, హిమాలయాల్లో కనిపించే కస్తూరి మృగం, బట్టమేకల పక్షి, అండమాన్‌ స్రౌ, గుడ్లగూబలు.

 


3) అంతర్థాన స్థితిలో ఉన్న జీవులు: ఆవాసాల ఆక్రమణలు, వేటాడటం లాంటి చర్యల వల్ల కొన్ని జాతుల్లో అక్కడక్కడా మిగిలి ఉన్నజీవులు ఇవి. వీటిని కాపాడకపోతే భవిష్యత్తులో విలుప్త స్థితికి దగ్గరవుతాయి. ఈ విభాగానికి కొన్ని లక్షణాలు ఉండాలి.


ఎ) గత పదేళ్లలో వీటిసంఖ్య 70% కంటే తక్కువకు పడిపోవాలి.


బి) ప్రస్తుతం వీటి సంఖ్య 250 వరకు ఉండాలి.


సి) అవి క్రూర జీవులైతే గత 20 ఏళ్లలో 20% వరకు అంతరించి ఉండాలి.

ఉదా: బెంగాల్‌ టైగర్, రెడ్‌ పాండా, బ్లూవేల్, ఇండియన్‌ ఎలిఫెంట్, సాంగై దుప్పి, గంగానది డాల్ఫిన్, ఏషియాటిక్‌ లయన్, గ్రీన్‌ టర్టిల్, ఈజిప్ట్‌ రాబందు లాంటివి.

 


4) దుర్బల స్థితిలోని జీవులు: ఎలాంటి పరిరక్షణ చర్యలు చేపట్టకపోతే భవిష్యత్తులో ప్రమాదస్థితికి చేరే జీవులు. ఈ జాబితాలో చేర్చడానికి నిర్దేశిత లక్షణాలు ఉండాలి.


ఎ) గత పదేళ్లలో ఆ జీవులు 50 శాతానికి తగ్గిపోయి ఉండాలి.


బి) ఆ జాతి సంఖ్య 10,000 కంటే తక్కువ ఉండాలి.


సి) క్రూర జీవులైతే గత వందేళ్లలో 10% తగ్గిపోయి ఉండాలి.


ఉదా: నాలుగు కొమ్ముల దుప్పి, బరసింగా దుప్పి, బ్రౌన్‌ బేర్, స్లాత్‌ బేర్, అడవిదున్న, యాక్, మంచు పులి, సారస్‌క్రేన్, ఆలివ్‌రిడ్లే తాబేళ్లు.


5) ప్రమాదపుటంచులో ఉన్న జీవులు: తీవ్ర అంతర్థాన స్థితి, అంతర్థాన స్థితి, దుర్భల స్థితుల్లో ఉన్న జీవులన్నీ ప్రమాదపుటంచులో ఉన్న జీవులే.


6) సమీప భవిష్యత్తులో ప్రమాదంలో పడే జీవులు: తీవ్ర అంతర్థాన స్థితి, అంతర్థాన స్థితి, దుర్భల స్థితుల జాబితాల్లో చేరనివి. కానీ, భవిష్యత్తులో ఆ జాబితాల్లో చేరే అవకాశం ఉన్న జాతులు. వీటిని కాపాడుకోవాలి.

 


భారత్‌లో జీవసంరక్షణ చర్యలు


భారతదేశంలో చాలా కాలం నుంచీ జీవవైవిధ్య సంరక్షణ చర్యలు చేపడుతున్నారు.

 


వన్యప్రాణి సంరక్షణా కేంద్రాలు: వన్యప్రాణుల సంరక్షణ కోసం మొదటగా 1895లో తమిళనాడులోని వేదాంతగళ్‌ ప్రాంతంలో పక్షుల సంరక్షణ కేంద్రం ప్రారంభమైంది. ప్రస్తుతం దేశంలో 567 వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు కొనసాగుతున్నాయి.

 


జాతీయ పార్కులు: ఆవరణ వ్యవస్థను కాపాడటానికి, ప్రాంతీయ వృక్ష, జంతు జాతులకు రక్షణ కల్పించే ప్రాంతాలు. మొదట 1935లో ఉత్తరాఖండ్‌లో జిమ్‌కార్బెట్‌ నేషనల్‌ పార్కును ప్రారంభించారు. ఇప్పుడు దేశంలో 106 జాతీయ పార్కులు కొనసాగుతున్నాయి.

 


టైగర్‌ ప్రాజెక్టులు: పులుల సంరక్షణ కోసం 1973 నుంచి పులుల సంరక్షణ ప్రాజెక్టులు ప్రారంభించారు. దేహ్రాదూన్‌లోని ‘వైల్డ్‌ లైఫ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా’ ప్రకారం 2023, జనవరి నాటికి దేశంలో 53 టైగర్‌ ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం పులుల జనాభా లెక్కించడానికి M-STIPES (మానిటరింగ్‌ సిస్టమ్‌ ఫర్‌ టైగర్స్‌ ఇంటెన్సివ్‌ ప్రొటెక్షన్‌ అండ్‌ ఎకలాజికల్‌ స్టేటస్‌) అనే సాఫ్ట్‌వేర్‌ వాడుతున్నారు.

 


ప్రాజెక్ట్‌ ఎలిఫెంట్‌: ఏనుగుల రక్షణ కోసం 1992లో ఈ ప్రాజెక్టును తీసుకొచ్చారు. ప్రస్తుతం దేశంలో 33 ఎలిఫెంట్‌ ప్రాజెక్టులు అమల్లో ఉన్నాయి. ఏనుగులపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు భారత పర్యావరణశాఖ ‘హాథీ మేరా సాథీ’ (ఎలిఫెంట్‌ ఈజ్‌ మై ఫ్రెండ్‌) కార్యక్రమాన్ని తీసుకొచ్చింది.


ప్రాజెక్ట్‌ గిర్‌ లయన్‌: గుజరాత్‌లోని కథియావార్‌ ప్రాంతంలోని ఆకురాల్చే గిర్‌ అటవీ ప్రాంతాన్ని సింహాల పరిరక్షణ ప్రాంతంగా కొనసాగిస్తున్నారు. దేశంలో ఇక్కడ మాత్రమే ఈ జాతి సింహాలు కనిపిస్తాయి. ఇవి ప్రస్తుతం 674 ఉన్నాయి.


ప్రాజెక్ట్‌ రైనోస్‌ విజన్‌: దీన్ని 2005లో ప్రకటించారు. దేశంలో రైనోల సంఖ్యను 3 వేల వరకు పెంచాలని నిర్ణయించారు. పశ్చిమ బెంగాల్‌లోని జలదాపరా వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని ‘ఎ హోమ్‌ ఆఫ్‌ ఇండియా అండ్‌ వరల్డ్‌ రైనోస్‌’ అంటారు.


ప్రాజెక్ట్‌ క్రొకడైల్స్‌: దీన్ని 1975లో ప్రకటించారు. అత్యంత వేగంగా అంతరించిపోతున్న జాతిగా ఘరియల్‌ మొసళ్లని నిర్ణయించారు. ఇవి మధ్యప్రదేశ్‌లోని చంబల్‌ ప్రాంతంలో ప్రసిద్ధి. ఒడిశాలోని బిత్తరకనిక ప్రాంతం రాకాసి ఉప్పునీటి మొసళ్లకు ప్రసిద్ధి.


ప్రాజెక్ట్‌ సీ టర్టిల్‌: ఒడిశాలోని తీర ప్రాంతానికి ఏటా శీతాకాలంలో గాలపోగస్‌ దీవుల నుంచి ఆలివ్‌ రిడ్లే తాబేళ్లు వలస వస్తుంటాయి. మనదేశంలో గ్రీన్‌ తాబేళ్లు, నక్షత్ర తాబేళ్ల లాంటి జాతులు కూడా నివసిస్తున్నాయి. వీటి రక్షణ కోసం 1999లో యూఎన్‌ఓతో కలిసి ఈ ప్రాజెక్టును చేపట్టారు.


ప్రాజెక్ట్‌ స్నో లెపర్డ్స్‌: మన దేశంలో జమ్ము-కశ్మీర్, హిమాచల్‌ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాల్లో మాత్రమే మంచు చిరుతలు ఉన్నాయి. వీటి రక్షణ కోసం 2009లో ఈ ప్రాజెక్టుని ప్రారంభిస్తారు.

 


ప్రాజెక్ట్‌ చీతా: చీతాల ‘రీ ఇంట్రడక్షన్‌’ పేరుతో మన దేశంలో అంతరించిపోయిన చిరుత పులులను తిరిగి ప్రజననం చేయడానికి నిర్ణయించారు. ఇందుకోసం ఆఫ్రికాలోని నమీబియా, దక్షిణాఫ్రికా దేశాల నుంచి రెండు విడతలుగా చీతాలు తీసుకొచ్చారు. వీటిని మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్‌ పార్కులో ప్రవేశపెట్టారు. చివరి చీతాను 1948లో వేటాడి చంపిన తర్వాత 1952లో భారత ప్రభుత్వం ఈ జాతి దేశంలో అంతరించిపోయినట్లు ప్రకటించింది.

 


రచయిత: జల్లు సద్గుణరావు


 

Posted Date : 28-06-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌