• facebook
  • whatsapp
  • telegram

భారత రాజ్యాంగ నిర్మాణం

   భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ రూపొందించింది. రాజ్యాంగ పరిషత్ సభ్యులంతా పరోక్షంగా ఎన్నికైనవాళ్లే. జాతీయోద్యమంలో భాగంగా ఏర్పడిన విలువలకు అద్దం పడుతూ, భారత ప్రజల చిరకాల వాంఛ అయిన స్వేచ్ఛ, సమానత్వం, హక్కులు, న్యాయం లాంటి రాజనీతి భావాలకు ప్రాధాన్యమిస్తూ.. రాజ్యాంగ రచన కొనసాగింది. భారతదేశ ప్రజలు 'రాజ్యాంగ పరిషత్' ఏర్పరచుకుని, తద్వారా రాజ్యాంగ రచన కొనసాగించాలని తొలుత ఎం.ఎన్.రాయ్ అభిప్రాయపడ్డారు.
       1930 - 32 మధ్యకాలంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో భారతీయులకు ప్రత్యేక రాజ్యాంగం కావాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. 1940 ఆగస్టులో (ఆగస్టు ప్రతిపాదన) భారత రాజ్యాంగ పరిషత్ ఏర్పాటును బ్రిటన్ సూచనప్రాయంగా అంగీకరించింది. రెండో ప్రపంచ యుద్ధానంతరం అధికారంలోకి వచ్చిన లేబర్ పార్టీ అధినేత అట్లీ భారత దేశానికి స్వాతంత్య్రం ఇచ్చి, రాజ్యాంగాన్ని రూపొందించుకోవడానికి అంగీకరించారు. అంతకు ముందే, అంటే 1942లో క్రిప్స్ ప్రతిపాదనల ద్వారా బ్రిటిషర్లు తమ ఉద్దేశాలను మార్మికంగా తెలిపారు. ఆ తర్వాత 1946లో కేబినెట్ మిషన్ ప్లాన్ సూచనను అనుసరించి రాజ్యాంగ పరిషత్‌ను ఏర్పాటు చేశారు.

 

రాజ్యాంగ పరిషత్ ఎన్నికలు...
       1946 జూన్‌లో రాజ్యాంగ పరిషత్‌కు ఎన్నికలు జరిగాయి. దేశ జనాభాలో సుమారుగా ప్రతి 10 లక్షల జనాభాకు ఒక సభ్యుని చొప్పున రాజ్యాంగ పరిషత్‌లో ప్రాతినిధ్యం కల్పించారు. 
కేబినెట్ మిషన్ ప్లాన్ సూచన అనుసరించి బ్రిటిష్ పాలిత ప్రాంతాల నుంచి 292 మంది సభ్యులను ఎన్నుకున్నారు. స్వదేశీ సంస్థానాలకు 93 మందిని కేటాయించారు. చీఫ్ కమిషనరేట్ ప్రాంతాల నుంచి నలుగురికి ప్రాతినిధ్యం కల్పించారు. మొత్తం సభ్యులు 389 మంది. అయితే దేశ విభజన కారణంగా ముస్లింలీగ్ సభ్యులు రాజ్యాంగ పరిషత్ నుంచి వైదొలగడంతో సభ్యుల సంఖ్య 299కి పడిపోయింది. వీరిలో బ్రిటిష్ పాలిత ప్రాంతాలకు 229 మంది, స్వదేశీ సంస్థానాలకు 70 మంది ప్రాతినిధ్యం వహించారు.

 

రాజ్యాంగ పరిషత్ నిర్మాణం, పనితీరు...
       రాజ్యాంగ పరిషత్ తొలి సమావేశాన్ని డిసెంబరు 9, 1946న నిర్వహించారు. ముస్లింలీగ్ ఈ సమావేశంలో పాల్గొనలేదు. సమావేశానికి డాక్టర్ సచ్చిదానంద సిన్హా తాత్కాలిక అధ్యక్షుడిగా వ్యవహరించారు. తర్వాత డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్‌ను అధ్యక్షుడిగా, హెచ్.సి.ముఖర్జీని ఉపాధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. రాజ్యాంగ పరిషత్‌కు సలహాదారుగా బి.ఎన్.రావు వ్యవహరించారు. మనదేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక కాబట్టి రాజ్యాంగ పరిషత్తులోనూ అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించారు.

 

 

 

  
 

రాజ్యాంగ పరిషత్‌లోని వివిధ కమిటీలు
* రాజ్యాంగ పరిషత్ కార్యకలాపాల్లో భాగంగా ఎన్నో కమిటీలను నియమించింది. ఇందులో ప్రధానమైనవి ఎనిమిది. ఈ కమిటీలు, వాటి ఛైర్మన్‌ల వివరాలు.....
కేంద్ర అధికారాల కమిటీ - జవహర్‌లాల్ నెహ్రూ
కేంద్ర రాజ్యాంగ కమిటీ - జవహర్‌లాల్ నెహ్రూ
రాష్ట్రాల రాజ్యాంగ కమిటీ - సర్దార్ వల్లభాయి పటేల్
ముసాయిదా కమిటీ - డా.బి.ఆర్.అంబేడ్కర్
ప్రాథమిక హక్కులు, మైనారిటీ కమిటీ - సర్దార్ వల్లభాయి పటేల్
(ఇందులో రెండు ఉప కమిటీలు ఉన్నాయి.)
అవి: a) ప్రాథమిక హక్కుల ఉప కమిటీ - జె.బి.కృపలానీ
      b) మైనారిటీ ఉప కమిటీ - హెచ్.సి.ముఖర్జీ
నియమ నిబంధనల కమిటీ - డాక్టర్ బాబూ రాజేంద్ర ప్రసాద్
రాష్ట్రాల సంప్రదింపుల కమిటీ - జవహర్‌లాల్ నెహ్రూ
సారథ్య కమిటీ - డాక్టర్ బాబూ రాజేంద్ర ప్రసాద్
 పై కమిటీల్లో అత్యంత ముఖ్యమైంది ముసాయిదా కమిటీ. రాజ్యాంగాన్ని క్షుణ్నంగా పరిశీలించి, రూపొందించాల్సిన గొప్ప బాధ్యత ఈ కమిటీకి అప్పజెప్పారు. ఇందులో ఏడుగురు సభ్యులు....
* డా.బి.ఆర్.అంబేడ్కర్ (ఛైర్మన్)
* ఎన్.గోపాలస్వామి అయ్యంగార్
* అల్లాడి కృష్ణస్వామి అయ్యర్
* డా.కె.ఎం.మున్షి
* సయ్యద్ మహ్మద్ సాదుల్లా
* ఎన్.మోహనరావు (బి.ఎల్.మిట్టల్ స్థానంలో)
* టి.టి.కృష్ణమాచారి (డి.పి.ఖైతాన్ స్థానంలో)

Posted Date : 07-12-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌