• facebook
  • whatsapp
  • telegram

ఖండచలన సిద్ధాంతం

           గ్రేటర్ హిమాలయాలు ప్రపంచంలోనే నవీన పర్వతాలు. వీటి వయసు ఇరవై మిలియన్ సంవత్సరాలు. ఇవి ఏర్పడక ముందు ఈ ప్రదేశం లోయలా ఉండేది. ఇప్పుడు మనం చూస్తున్న దక్కన్ పీఠభూమి ఒకప్పుడు మైదానం. థార్ (Thar) ఎడారి అరణ్య ప్రాంతం. అయితే, ప్రాంతాలు స్థిరంగా ఉండకుండా చలిస్తుండటం వల్ల వాటి స్వరూపాలు ఇలా మారుతూ వచ్చాయని శాస్త్రవేత్తలు నిరూపించారు. వీరిలో ముఖ్యుడు - సర్ ఆల్ఫ్రెడ్ వెజినర్ (Alfred Wegener).

           ప్రపంచ పటాన్ని నిశితంగా అధ్యయనం చేస్తే ఒకప్పుడు అట్లాంటిక్ మహాసముద్ర తూర్పు, పశ్చిమ తీరాలు కలిసిపోయి ఉండేవేమో అనే ఆలోచన వస్తుంది. ఈ ఆలోచననే జర్మనీకి చెందిన ఆల్ఫ్రెడ్ వెజినర్ సిద్ధాంత రూపంలో ప్రతిపాదించారు. ఈయన 1915 లో తాను రాసిన "Origin of Continents & Oceans" పుస్తకంలో ఈ సిద్ధాంతాన్ని పొందుపరిచారు. ఇది భూశాస్త్ర ప్రపంచంలో సంచలనం సృష్టించింది.
 ఖండచలన సిద్ధాంతం ప్రకారం దాదాపు 360 మిలియన్ల సంవత్సరాలకు ముందు భూమి మీద ఉన్న ఖండాలన్నీ ఒకదాంతో మరొకటి కలిసి ఒకే భూభాగంగా ఉండేవి. ఈ మహాఖండాన్ని వెజినర్ 'పేంజియా'గా పేర్కొన్నారు.

ఈ పేంజియా చుట్టూ మహాజల భాగం ఉండేది. దీనికి 'పాంతలెస్స'గా నామకరణం చేశారు. సూర్యచంద్రుల గురుత్వాకర్షణశక్తి వల్లే ఈ పేంజియా రెండు సమాన భాగాలుగా చీలిపోయింది. ఉత్తర భాగాన్ని అంగారా (Angara) లేదా లారేషియా (Laurasia) అని, దక్షిణ భాగాన్ని గోండ్వానా (Gondwana) అని అంటారు.
యూరప్, ఆసియా, ఉత్తర అమెరికా అంగారాలో ఉన్నాయి. ఆసియా అంటే ప్రస్తుతం ఉన్నది కాదు. ఇండియా, అరేబియా లేని ఆసియా అంగారాలో ఒక భాగం.
గోండ్వానా విషయానికి వస్తే, ఇది దక్షిణ అమెరికా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, అంటార్కిటికా, ఇండియా, అరేబియాల కలయిక. ఈ ఉత్తర, దక్షిణ భూభాగాల మధ్యన పాంతలెస్స జలాలు ప్రవహించడం వల్ల కొత్తగా 'టెథిస్ సముద్రం' (Tethys Sea) ఆవిర్భవించింది. నేటి మధ్యధరా సముద్రం ఒకప్పటి టెథిస్ అవశేషమే.
ప్రధాన భూభాగాలైన అంగారా, గోండ్వానా స్థిరంగా ఉండక వివిధ ఖండాలుగా విడిపోయాయి.
అంగారాలోని ఉత్తర అమెరికా, యూరేషియా; అలాగే గోండ్వానాలోని దక్షిణ అమెరికా, ఆఫ్రికాల మధ్య పగుళ్లలోకి పాంతలెస్స జలాలు ప్రవహించడంతో అట్లాంటిక్ మహాసముద్రం ఆవిర్భవించింది.
ఉత్తర, దక్షిణ అమెరికాలు పశ్చిమ దిశకు, ఆఫ్రికా, ద్వీపకల్ప భారత ఉపఖండం ఉత్తర దిశగా జరిగాయి. ఆఫ్రికా, ఇండియా టెథిస్ సముద్రంలోకి చొచ్చుకుపోవడంతో ఐరోపాలో ఆల్ప్స్ (Alps) పర్వతాలు, ఆసియాలో హిమాలయాలు ఆవిర్భవించాయి. టెథిస్ కాలక్రమంలో మధ్యధరా సముద్రంగా పరిణామం చెందింది.

హిమాలయాల్లో జన్మించిన నదుల ప్రవాహంతో జరిగిన క్రమక్షయం, నిక్షేపణ వల్ల టెథిస్ సముద్రం పూడిపోయి, సారవంతమైన గంగా-సింధూ మైదానం ఏర్పడింది.
పశ్చిమ దిశకు జరిగిన ఉత్తర-దక్షిణ అమెరికాలకు పాంతలెస్స అడ్డురావడంతో, ఆ ఖండాల అంచులు విరిగిపోయి, పొడిగా మారి పర్వతాకారాన్ని సంతరించుకున్నాయి. వీటిని ఉత్తర అమెరికాలో రాకీస్ (Rockies) అని, దక్షిణ అమెరికాలో ఆండీస్ (Andes) పర్వతాలు అని పిలుస్తున్నారు.

 

ప్లేట్ టెక్టానిక్స్ సిద్ధాంతం (Plate Tectonics Theory)
            ఖండ చలన సిద్ధాంతాన్ని లోతుగా పరిశోధించడం ద్వారా ప్లేట్ టెక్టానిక్స్ సిద్ధాంతం ఆవిర్భవించింది. దీన్ని ప్రతిపాదించింది డబ్ల్యూ.జె. మోర్గాన్ (W.J. Morgan) అనే శాస్త్రవేత్త. ఈయన 1967-68 లో ఖండ చలన సిద్ధాంతం, సముద్రగర్భ విస్తరణ సిద్ధాంతం అనే రెండు సిద్ధాంతాలను ఆధారంగా చేసుకుని తన సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు.
 ప్లేట్ టెక్టానిక్స్ అనే పదాన్ని తొలిసారిగా ప్రయోగించింది - టుజోవిల్సన్ (1965).
 ప్లేట్ టెక్టానిక్స్ సిద్ధాంతం ప్రకారం భూగోళ పటలం మొత్తం 20 పెద్ద, చిన్న ముక్కలుగా పగిలిపోయింది. ఒక్కొక్క ముక్కను పళ్లెం లేదా ప్లేట్ అంటారు. మొత్తం 20 పళ్లేలను 7 పెద్ద ప్లేట్‌లు, 13 చిన్న ప్లేట్‌లుగా విడదీశారు.

పెద్ద పళ్లేలు
* సముద్ర పళ్లెం (Pacific Plate)
* ఉత్తర అమెరికా పళ్లెం 
* దక్షిణ అమెరికా పళ్లెం
* యురేషియా పళ్లెం 
* ఆఫ్రికా పళ్లెం
* ఇండో ఆస్ట్రేలియా పళ్లెం 
* అంటార్కిటికా పళ్లెం


చిన్న పళ్లేలలో ముఖ్యమైనవి
* జాన్‌డి ప్యూకా (Juan de Fuca)
* నజకా పళ్లెం (Nazca Plate)
* స్కోషియా (Scotia Plate)
* కోకాస్ (Cocos Plate)
* కరేబియన్ (Caribbean Plate)
* జపనీస్ పళ్లెం (Japanese Plate)
* కరోలినా పళ్లెం (Carolina Plate)
* బిస్మార్క్ పళ్లెం (Bismark Plate)
* ఫిలిప్పైన్ పళ్లెం (Philippine Plate)
* అరేబియన్ పళ్లెం (Arabian Plate)
 ఈ ప్లేట్‌లు నిలకడగా ఉండకుండా నిరంతరం కదులుతూ ఉంటాయి. ఈ కదలికలు ముఖ్యంగా మూడు రకాలు:

 

1) ఒకదానికొకటి దూరంగా జరగడం ((Divergent Plates): ప్లేట్స్ ఒకదానికొకటి దూరంగా జరగడంతో సముద్ర గర్భంలో రిట్జ్‌లు ఏర్పడి సముద్ర గర్భం విస్తరిస్తుంది. దీన్నే Sea Floor Spreading అంటారు.
 దీన్ని కనిపెట్టింది- హ్యారీ హెస్ (Harry Hess). ఈ ప్రక్రియను అట్లాంటిక్ సముద్రంలో చూడొచ్చు.
 ఉత్తర అమెరికా, ఆఫ్రికా ప్లేట్స్ దూరంగా జరగడం ద్వారా భూమిలోని Asthenosphere ద్రవం ఉప్పొంగి ఆ పగులులో ఇరుక్కుని పెద్ద రిడ్జ్‌గా మారింది. ఈ రిడ్జ్ మీదే ఉన్న ఐస్‌లాండ్ దేశం రెండుగా చీలి దూరంగా జరుగుతోంది. అందుకే ఐస్‌లాండ్ దేశ వైశాల్యం రోజురోజుకు పెరుగుతోంది.


2) ఒకదానికొకటి దగ్గరగా జరగడం (Convergent Plate Boundaries): ఒక పళ్లెం మరొక పళ్లెంవైపు జరుగుతూ, ఒకదాని కిందకు మరొకదాని అంచు వెళ్తుంది. ఇలాంటి మండలాలను Subduction Zones లేదా Benioff మండలం అంటారు. ఇలాంటి Benioff Zones దగ్గర మూడు రకాల క్రియలు జరుగుతాయి అవి...

భూమి మీద ముడుత పర్వతాలు ఏర్పడటం:
ఉదా:
ఇండో - ఆస్ట్రేలియా ప్లేటు ఆసియా ప్లేటులోకి నెమ్మదిగా చొచ్చుకుపోవడంతో హిమాలయాలు అనే ముడుత పర్వతాలు ఏర్పడ్డాయి. ఆఫ్రికా ప్లేటు ఐరోపా ప్లేటు కిందకు చొచ్చుకుపోవడంతో ఆల్ప్స్ పర్వతాలు ఏర్పడ్డాయి.

అగ్ని పర్వతాలు: ఖండ పళ్లెం, సముద్ర పళ్లెం ఒకదానికొకటి దగ్గరగా జరిగినప్పుడు.. ఖండ పళ్లెం కిందకి సముద్ర పళ్లెం దూరిపోయి అధిక ఒత్తిడి, ఉష్ణోగ్రతలు ఏర్పడతాయి. దాంతో సముద్ర పళ్లెం అంచు మాగ్మా ద్రవంగా మారి  అగ్నిపర్వత  రూపంలో  భూమి మీదకు  ఎగసిపడుతుంది లేదా సముద్రంలో అగ్నిపర్వత సమూహాలు ఏర్పడతాయి.
 ప్రస్తుతం మనం చూస్తున్న 'రింగ్ ఆఫ్ ఫైర్' (Ring of Fire) పసిఫిక్ సముద్రం చుట్టూ ఇది విస్తరించి ఉంది. మరొక ఉదాహరణ: జపాన్ దీవులు, ఇండోనేషియా దీవుల సమూహం.


అగాధాలు ఏర్పడటం: రెండు సముద్ర ప్లేట్లు ఒకదానికొకటి దగ్గరగా వచ్చినప్పుడు సముద్ర పళ్లెం అంచులు భూమిలోకి చొచ్చుకుపోవడంతో సముద్ర అగాధాలు (Trenches) ఏర్పడతాయి.
ఉదా: ప్రపంచంలోనే అతి లోతైన అగాధం మెరియానా అగాధం. ఇది పసిఫిక్ సముద్రంలో ఏర్పడింది. ఇలాంటి మరికొన్ని అగాధాలు - జపనీస్, ఫిలిప్పీన్స్ అగాధాలు.


3) ఒకదానికొకటి సమాంతరంగా జరగడం (Transform Plate Boundaries): పళ్లేలు ఒకదానికొకటి సమాంతరంగా కదిలినప్పుడు Fault lines ఏర్పడతాయి. వీటినే భ్రంశాలు అంటారు.

ఇలాంటి భ్రంశమే కాలిఫోర్నియాలోని సాన్ ఆండ్రీస్ భ్రంశం (San Andres Faulttine). జాన్ డి ప్యూకా అనే చిన్న ప్లేటు, ఉత్తర అమెరికా పళ్లెం సమాంతరంగా జరగడంతో ఈ భ్రంశం ఏర్పడింది. మరికొన్ని ఉదాహరణలు- మృతసముద్రం, తూర్పు ఆఫ్రికా పగులు లోయ

Posted Date : 18-05-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌