• facebook
  • whatsapp
  • telegram

కాకతీయుల కాలంనాటి ఆర్థిక, సాంఘిక సాంస్కృతిక పరిస్థితులు

తెలుగు రాష్ట్రాల చరిత్రలో కాకతీయులకు విశిష్టస్థానం ఉంది. పరిపాలన, పన్నుల విధింపులో వారి విధానాల ప్రభావం ఇప్పటికీ ఉంది.  కాకతీయుల ఆస్థానంలోని పదవులు, పన్నుల పేర్లు, సామాజిక స్థితిగతులు, మతాల తీరు పరీక్షల దృష్ట్యా చాలా ముఖ్యమైన అంశాలు.
 

పరిపాలన

* కాకతీయుల కాలంలో తెలంగాణ అన్ని రంగాల్లో గణనీయమైన అభివృద్ధిని సాధించింది. కాకతీయులు సంప్రదాయ సిద్ధమైన రాజరికాన్ని అనుసరించారు. రాజులు సప్తాంగ సిద్ధాంతాన్ని అనుసరించి పాలించారు.

* రాజోద్యోగులను నియోగాలుగా విభజించారు. మొత్తం 72 నియోగాలు (శాఖలు) ఉండేవి. వీటిని బాహత్తర నియోగాధిపతి పర్యవేక్షించేవాడు. అంతఃపుర రక్షకుడు అనే ఉద్యోగిని నగర శ్రీకావళి అని వ్యవరించేవారు. ఈ కాలం నాటి పాలకులు మహామండలేశ్వర బిరుదు ధరించారు.

* పరిపాలనా సౌలభ్యం కోసం రాజ్యాన్ని స్థలం, గ్రామాలుగా విభజించారు. గ్రామ పరిపాలనకు 'మహాజనులు' అనే పేరుతో ఒక సభ ఉండేది. ఈ సభ నిర్ణయాలను అమలుపరుస్తూ 12 మంది ఆయగార్లు (వివిధ వృత్తుల వారు) ఉండేవారు. వీరిలో ముగ్గురు ముఖ్యమైనవారు.

* కరణం - గ్రామంలోని భూముల వివరాలను సేకరించేవాడు. రెడ్డి - భూమిశిస్తు వసూలు చేసి ప్రభుత్వానికి అందజేసేవాడు. తలారి - గ్రామ రక్షకుడు. శాంతిభద్రతలను పరిరక్షించేవాడు.

* ఆయగార్లకు పన్నులు లేని భూములే కాకుండా పంటలో కూడా భాగముండేది.

* కాకతీయుల కాలంలో సైన్యం రెండు రకాలుగా ఉండేది. మొదటిది చక్రవర్తి సైన్యం, రెండోది నాయంకర సైన్యం. రుద్రమదేవి మొదటిసారిగా సైన్యంలో నాయంకర విధానాన్ని ప్రవేశపెట్టింది. కాకతీయులు తమకు విశ్వాసపాత్రులైన వారికి భూములను ఇచ్చి వారితో సైన్యాలను పోషింపజేసేవారు. వీరిని నాయంకరులు అంటారు.

* చక్రవర్తి అంగరక్షకులను లెంకలు అనేవారు. గ్రామంలోని వివాదాలను తలారి, మహాజనులు విచారించి న్యాయ నిర్ణయం తీసుకునేవారు. ధర్మాసనాలు (న్యాయస్థానాలు) ఇచ్చిన తీర్పులను 'జయపత్రాలు' అనే పేరుతో రాజముద్రిక వేసి ఇచ్చేవారు. భూమిశిస్తును 'అరి' చెల్లించేవారిని 'అరిగాపులు' అని వ్యవహరించేవారు.

 

పన్నులు

* దరిశనం - రాజును దర్శించినప్పుడు ఇచ్చే కానుకలు.

* ఉపకృతి - రాజు లేదా ఇతర అధికారులు మేలు చేసినప్పుడు ప్రతిఫలంగా చెల్లించే పన్ను.

* అప్పనం - అకారణంగా వచ్చేది.

* భూమిని కేసరి పాటిగడతో కొలిచేవారు.

* ప్రతి గ్రామంలో రాజు సొంత పొలానికి 'రాచదొడ్డి' అని పేరు. ఈ పొలాన్ని రైతులకు 'కోరు' లేదా అర్థాదాయానికి కౌలుకు ఇచ్చేవారు. ఇలాంటి రైతులను 'అర్థశిరీ' అనేవారు. ఇంటిపన్నును ఇల్లరి, అటవీ ఉత్పత్తులపై పన్నును  పుల్లరి అని వ్యవహరించేవారు.

 

వాణిజ్యం

* వర్తకులు శ్రేణీ వ్యవస్థ ద్వారా వర్తకం చేసేవారు. ఆనాటి పెద్ద శ్రేణి సర్వదేశీయ సహస్రతెలికి, దేశీయ వాణిజ్యానికి ఓరుగల్లు ప్రధాన కేంద్రం. ఇక్కడ ప్రతివారం మడిసంత, మైలసంత జరిగేవి. మంథెన, పానగల్లు, అలంపురం, మాచెర్ల, వేల్పూరు, తంగెడ మొదలైన దేశీయ వాణిజ్య కేంద్రాలు ఉండేవి. వీటిని రేవు పట్టణాలతో కలుపుతూ రహదారులు ఉండేవి. మోటుపల్లి, కృష్ణపట్నం, హంసలదీవి, మచిలీపట్నం ఓడరేవుల ద్వారా విదేశీ వాణిజ్యం జరిగేది. వీటిని కరపట్టణాలు అనేవారు. చైనా, పర్షియా, సింహళం, అరేబియా దేశాలు, తూర్పు ఇండియా దీవులతో వాణిజ్యం సాగేది. సుగంధ ద్రవ్యాలు ప్రధానంగా ఎగుమతి అయ్యేవి. గద్యాణం (బంగారు నాణెం), రూక (వెండి నాణెం) మొదలైన నాణేలు ఉండేవి.

 

సాంఘిక పరిస్థితులు

* కాకతీయులు శూద్రులు. విజ్ఞానేశ్వరం స్త్రీ ధనాన్ని అయిదు రకాలుగా వివరిస్తుంది. వీరశైవ, వీర వైష్ణవ, మత శాఖల వల్ల బలిజ, సాతాని, లింగాయతులు, తుంబళులు, నంబులు, దాసరులు, చాత్తాద వైష్ణవులు మొదలైన కొత్త కులాలు ఈ కాలంలో ఏర్పడ్డాయి.

* బ్రాహ్మణ, క్షత్రియ, శూద్ర వర్ణాల్లో ఉపకులాలు ఆవిర్భవించాయి. కాకతీయుల కాలం నాటి సాంఘిక జీవితంలో మరో ముఖ్య లక్షణం కుల సంఘాలు. వీటిని సమయాలు అనేవారు.

1. బ్రాహ్మణ కుల సంఘం (సమయం) - మహాజనులు

2. వైశ్య కుల సంఘం (సమయం) - నకరం

* శైవ సమయాలు, వైష్ణవ సమయాలు దేవాలయ అర్చక సంఘాలుగా వ్యవహరించేవి. నాటి సమాజంలో బాల్య వివాహాలు, కన్యాశుల్కం సతీ సహగమనం, నిర్భంద వైధవ్యం మొదలైన మూఢాచారాలుండేవి.

* దేవదాసీలకు, బసివిరాండ్రకు, వేశ్యలకు సమాజంలో గొప్ప గౌరవం ఉండేది. బసివిరాండ్రు బసవని (శివుడు) పేరున బాలికలను శివాలయానికి అంకితం చేసేవారు. వీరు తమ జీవితాన్ని శివుడికి అర్పించి, శివుడికి సేవలు చేసేవారు. ప్రభువులు, ఉన్నత వర్గాల వారు దేవాలయాలకు దేవదాసీలను, నాట్యగత్తెలను బహూకరించేవారు. దుర్గాష్టమి, దీపావళి, మకర సంక్రాంతి, ఉగాది, మహాశివరాత్రి, ఏరువాక అనే పండుగలను జరుపుకునేవారు. పల్నాటి బ్రహ్మనాయుడు కులవ్యవస్థను ఖండించి సహపంక్తి భోజనాలను చాప కూళ్లను ప్రోత్సహించాడు. ఈయన వీర వైష్ణవాన్ని అనుసరించి అనేక మంది నిమ్నకులస్థులను అందులో చేర్చాడు.
 

జైన మతం

* హనుమకొండ క్రీ.శ.800 సంవత్సరాల నాటికి గొప్ప జైన కేంద్రంగా ఉండేది. తొలి కాకతీయ రాజులు దిగంబర జైన మతాన్ని అనుసరించారు.

* రాజరాజనరేంద్రుడు అనే వేంగి చాళుక్య రాజు హింసించగా ఋషభనాథుడనే జైనాచార్యుడు హనుమకొండకు వచ్చాడనే విషయం ఓరుగల్లు కైఫీయత్తు ద్వారా తెలుస్తోంది. ప్రోలరాజు మంత్రి బేతన భార్య మైలమ హనుమకొండపై కడలాయ అనే జైన బసదిని నిర్మించింది.

* శైవులు జైనులను హింసించి వారి దేవాలయాలను నేలమట్టం చేసి వారిని బలవంతంగా శైవంలోకి మార్చారు.

* బోధన్, హనుమకొండ, కొల్లిపాక (కొలనుపాక), పొట్ల చెరువు (పటాన్‌చెరువు), వేములవాడ, వర్ధమానపురం, అలంపురం మొదలైనవి ప్రముఖ జైన కేంద్రాలుగా ఉండేవి.

 

శైవం

* కాకతీయుల కాలంలో శైవ మతం ప్రజాదరణ, రాజాదరణ పొందింది.

* శైవంలో అనేక శాఖలు ఉండేవి. క్రీ.శ.10వ శతాబ్దంలో కాలాముఖ శైవం ప్రచారంలో ఉండేది. గోళకీ మఠ ప్రధానాచార్యుడైన విశ్వేశ్వర శంభూ గణపతి దేవుడి శివదీక్షా గురువు. క్రీ.శ.1261లో రుద్రమదేవి విశ్వేశ్వర శంభూనకు మందారమ్ (మందడం) గ్రామాన్ని వెలగపూడి కృష్ణలంకలతో కలిపి దానం చేసినట్లు మలకాపురం శాసనం

పేర్కొంది. విశ్వేశ్వర శంభూ మందడం గ్రామంలో ఒక శివాలయాన్ని, శుద్ధశైవ మఠాన్ని ఏర్పాటు చేశాడు. ఈ మఠానికి అనుబంధంగా ఒక వేదశాస్త్ర ఆగమ విద్యాలయాన్ని, ప్రసూతి వైద్యశాలను ఏర్పాటు చేశాడు. శివుడి అవతారాలైన 28 మంది యోగాచార్యుల గురించి శివ పురాణం, కూర్మ పురాణం తెలుపుతున్నాయి.

* ఈ యోగాచార్యుల్లో శ్వేతాచార్యుడు మొదటి గురువు, లకులీశుడు చివరి గురువు. వీర శైవాన్ని బసవేశ్వరుడు కర్ణాటకలో స్థాపించాడు. ఆంధ్రదేశంలో బసవేశ్వరుడి శిష్యులకు వీరశైవులు లేదా లింగాయతులని పేరు. వీరశైవులు కుల వ్యవస్థను, బ్రాహ్మణుల ఆధిక్యతను ప్రశ్నించారు. వీరశైవుల గురువులను జంగములు అని, వీరశైవ గ్రంథాలను ఆగమములు అని అంటారు.
 

వైష్ణవం

* ఈ కాలంలో వైష్ణవం కూడా ప్రజాదరణ పొందింది. కాకతీయుల రాజలాంఛనం వరాహం. వీరి ముద్రలు, నాణేల మీద వరాహ లాంఛనం ఉండేది. దక్షిణ దేశం నుంచి రామానుజ వైష్ణవం ఆంధ్రదేశంలోకి ప్రవేశించింది. రుద్రమదేవి కాలం నుంచి వైష్ణవం విశేషంగా వ్యాప్తి చెందింది. కాకతీయ సామంతులు వైష్ణవ మతాన్ని ఆదరించారు. పల్నాడులో బ్రహ్మనాయుడు వీరవైష్ణవ మతాన్ని ప్రచారం చేసి సంఘ సంస్కరణకు పూనుకున్నాడు. రుద్రదేవుడి మంత్రి గంగాధరుడు హనుమకొండలో ప్రసన్న కేశవాలయాన్ని నిర్మించాడు. రుద్రదేవుడు, గణపతిదేవుడు 'చాతుర్వర్ణ సముద్ధరణ' బిరుదు ధరించారు. వీరులకు వీరగల్లు, వీరగుళ్లు వెలిశాయి.
 

చెరువుల నిర్మాణం

* కాకతీయులు చెరువుల నిర్మాణాన్ని ప్రోత్సహించి వ్యవసాయాభివృద్ధికి కృషిచేశారు. ఫలితంగా తెలంగాణలోని అన్ని గ్రామాల్లోనూ చెరువులను నిర్మించారు. చెరువును నిర్మించిన వ్యక్తికి అశ్వమేధ యాగం చేసిన వ్యక్తికి వచ్చే పుణ్యం వస్తుందనే నమ్మకం ఉండేది.

 

ముఖ్యమైన చెరువులు

* కేసరి సముద్రం  - మొదటి ప్రోలరాజు నిర్మించాడు

* కేసముద్రం  - మొదటి ప్రోలరాజు

* ఉదయచోడని చెరువు - రుద్రదేవుడు

* పాకాల చెరువు - జగదల ముమ్మడ (గణపతి దేవుడి సేనాని)

* రామప్ప చెరువు - రేచెర్ల రుద్రుడు (గణపతి దేవుడి సేనాని)

* లక్నవరం చెరువు - ప్రతాపరుద్రుడు

* బయ్యారం చెరువు - మైలాంబ (గణపతి దేవుడి సోదరి)

* వ్యవసాయ పొలాలకు నీటిని ఏతం, మోట ద్వారా సరఫరా చేసేవారు.

* గోధుమలు, కొర్రలు, వరి, జొన్నలు, చెరకు, నూనె దినుసులు, ఉల్లి, అల్లం, పసుపు పంటలు పండించేవారు. తెలంగాణలో వివిధ పరిశ్రమలు  

  1. రత్నకంబళాలు, ముఖమల్ వస్త్రాలు - ఓరుగల్లు 

  2. ఇనుము పరిశ్రమ - గుత్తికొండ, పల్నాటి సీమ

  3. వజ్రాల గనులు - గోల్కొండ, రాయలసీమ

  4. వజ్రపురి - గురజాల (వజ్రాలకు ప్రసిద్ధి)

  5. కత్తులు - నిర్మల్

Posted Date : 25-11-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌