• facebook
  • whatsapp
  • telegram

సాంస్కృతిక వారసత్వం

ఘనమైన సాంస్కృతిక వారసత్వ చరిత్ర తెలంగాణ ప్రాంతం సొంతం. మొదటి పాలకులైన శాతవాహనులు పవిత్ర గోదావరి నదీ తీరం నుంచే రాజ్యస్థాపనకు శ్రీకారం చుట్టారు. కృష్ణా నది అవతలి తీరం వరకు అధికారాన్ని విస్తరించారు. వీరంతా సంస్కృతి, కళలు, వాస్తు-శిల్పం, సాహిత్యం పరంగా తెలంగాణ నేలను సుసంపన్నం చేశారు. తర్వాత ఇక్ష్వాకులు, విష్ణుకుండినులు, వేములవాడ / ముదిగొండ చాళుక్యులు, కాకతీయులు, రేచర్ల పద్మనాయకులు, కుతుబ్‌షాహీలు, అసఫ్‌జాహీలు పాలించారు. ఆయా రాజవంశీయుల పాలన కాలాల్లో సాంస్కృతిక చరిత్రలోని ప్రధాన విభాగమైన సమాజ స్థితిగతులు, సామాజిక పరిణామ క్రమం ఇది.

ఒక నిర్దిష్ట సమాజంలో అభివృద్ధి చెందిన లేదా రూపొందిన ప్రజల జీవన విధానాలను ఒక తరం నుంచి మరో తరం అందిపుచ్చుకున్న వైనాన్ని వ్యక్తపరిచేదే సాంస్కృతిక వారసత్వం. దీన్ని మూడు విభాగాలుగా వర్గీకరించవచ్చు. అవి..

1. వస్తు / భౌతిక సంస్కృతి: భవన నిర్మాణాలు, వస్తుసామగ్రి, వాస్తు-శిల్పం, స్మారక చిహ్నాలు.

2. సాంఘికాచారాలు: ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు.

3. సహజసిద్ధ సాంస్కృతిక వారసత్వం: సహజసిద్ధమైన నదీలోయలు, పర్వత పంక్తులు, అరణ్యాలు, సరోవరాలు.

 

శాతవాహనుల కాలంలో..

శాతవాహనుల కాలం నాటి సమాజంలో వర్ణ వ్యవస్థ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. వర్ణ వ్యవస్థను మొదటిసారిగా రుగ్వేదంలోని పురుష సూక్తంలో ప్రస్తావించారు. సమాజంలో వృత్తిపరమైన విభజన కనిపిస్తుంది. వృత్తిని బట్టి కులాలు ఏర్పడ్డాయి కానీ కులవ్యవస్థ రూపొందలేదు. సమాజాన్ని నాలుగు తరగతులుగా విభజించారు.

మొదటి తరగతి: మహా సేనాపతి, మహాభోజ, మహారథికలు లాంటి కేంద్ర, రాష్ట్ర, జిల్లా స్థాయి పాలకులు, అధికారులు ఉండేవారు.

రెండో తరగతి: అమాత్యులు, మహాపాత్రులు, శ్రేష్ఠి లేదా వర్తకులు.

మూడో తరగతి: వైద్యులు, చేతివృత్తులవారు, రైతులు, నగలు తయారు చేసేవారు.

నాలుగో తరగతి: శ్రామికులు, నేత పనివారు, కుమ్మరులు.

 

తండ్రిదే ప్రధానపాత్ర

శాతవాహనుల కాలం నాటి సమాజంలో ఆర్య సంస్కృతి లక్షణాల వారసత్వం కొనసాగింపు కనిపిస్తుంది. ఆర్యుల కాలంలోనూ కుల వ్యవస్థ రూపొందలేదు. వృత్తిని బట్టి సమాజంలో వర్గ విభజన కనిపిస్తుంది. ఒకే కుటుంబంలో విభిన్నమైన వృత్తులు-ప్రవృత్తులు కలిగిన సభ్యులున్నారు. ఆర్యులది 'పితృస్వామ్య వ్యవస్థ'. శాతవాహనుల కాలం నాటి సమాజం కూడా 'పితృస్వామ్య' స్వభావాన్నే ఆచరించింది. పురుషాధిక్యతే కనిపిస్తుంది. కుటుంబ ఆలనా పాలనా విషయాల్లో తండ్రిదే ప్రధాన పాత్ర. ఇంటికి యజమాని తండ్రి (గృహపతి). నాటి సమాజంలో పురుషాధిక్యత కొనసాగినప్పటికీ సాహిత్య, శాసనాధారాల ద్వారా స్త్రీలు ఉన్నత స్థానంలో గౌరవప్రదమైన జీవితాన్ని గడిపినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా శాతవాహన చక్రవర్తులు (గౌతమీపుత్ర శాతకర్ణి, వాశిష్టీపుత్ర శాతకర్ణి, యజ్ఞశ్రీ శాతకర్ణి) తమ పేర్లకు ముందు 'మాతృ సంజ్ఞలు' ధరించడాన్ని బట్టి నాటి సమాజంలో స్త్రీలకు గల ప్రాధాన్యం అర్థమవుతుంది. పాలనా వ్యవహారాల్లో కూడా పతుల పదవీ బాధ్యతల్లో స్త్రీలు భాగస్వాములయ్యారు.

 

సమష్టితత్వం

  సమష్టి, ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. కుటుంబ సభ్యులంతా ఒక్కతాటిపై నడిచేవారు. సమష్టిగా బౌద్ధ సంఘాలకు, ఆరామాలకు విరాళాలు ప్రకటించడాన్ని దీనికి రుజువుగా చెప్పవచ్చు. అమరావతి, నాసిక్ శాసనాలు కూడా ఈ విషయాన్ని ప్రస్తావించాయి. సమాజంలో కులాంతర, దేశాంతర వివాహాలు జరిగేవి. హాలుడు శ్రీలంక రాజకుమారి లీలావతిని వివాహం చేసుకున్నాడు. శాతవాహనులు మరాఠాలతో, శకులతో వివాహ సంబంధాలను ఏర్పరుచుకున్నారు. సమాజంలో వితంతువుల పట్ల గౌరవ మర్యాదలను ప్రదర్శించేవారు. శకులు, కార్దమాకులు స్థానికులతో వివాహ సంబంధాలను ఏర్పరచుకోవడం. అలాగే క్షత్రియులు - వ్యాపారం; బ్రాహ్మణులు, వైశ్యులు - ఉద్యోగాలు చేయడం ఆధారంగా సమాజంలో వర్ణ వ్యవస్థ ఉన్నప్పటికీ అది నిరంకుశం కాదని తెలుస్తోంది. శాతవాహన చక్రవర్తులు వర్ణాశ్రమ ధర్మ పరిరక్షణను తమ కర్తవ్యంగా భావించారు. గౌతమీపుత్ర శాతకర్ణి 'వర్ణసాంకర్యాన్ని' నిరోధించాడని 'నాసిక్ శాసనం' ద్వారా తెలుస్తోంది.
 

 

శాతవాహనుల అనంతరం..

శాతవాహనుల అనంతరం తెలంగాణ ప్రాంతాన్ని ఇక్ష్వాకులు, విష్ణుకుండినులు, వేములవాడ/ముదిగొండ చాళుక్యులు పరిపాలించారు. శాతవాహన చక్రవర్తుల్లా సువిశాల రాజ్యాన్ని పాలించక పోయినప్పటికీ విభిన్నమైన పాలకుల వల్ల వైవిధ్యభరితమైన సమ్మిళితమైన సంస్కృతి ఏర్పడింది.

శాతవాహన యుగానంతర కాలం నాటికి సమాజంలో వర్ణ వ్యవస్థ బలపడింది. సమాజంలో బ్రాహ్మణులు ఉన్నత స్థానంలో ఉన్నారు. పాలకులతో గౌరవ సత్కారాలు, పన్నులేని అగ్రహారాలను విరాళంగా పొందేవారు. విదేశీయులైన శకులు కూడా వైదిక సంప్రదాయ సహిత సమాజంలో భాగమయ్యారు. సమాజంలో శాతవాహనుల కాలం నాటి వృత్తిపరమైన విభజన కాకుండా కులం ప్రాబల్యం పెరగడం గమనార్హం. విష్ణుకుండినులు, చాళుక్యులు క్షత్రియులు కాకపోయినప్పటికీ బ్రాహ్మణ సాంకర్యంతో తమ వైభవాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేశారు. నాటి సమాజంపై బౌద్ధమత ప్రభావం వల్ల నిమ్నవర్ణాల వారు ఏకమయ్యారు. బ్రాహ్మణులు వేదాలు, శాస్త్రాల్లో ప్రావీణ్యం సంపాదించి పురోహితులుగానే కాకుండా పాలన విభాగంలోనూ ముఖ్యమైన పదవులను అలంకరించారు. చంద్రశ్రేష్ఠిలు - వర్తక సంఘాలుగా, వడ్డెపనివారు - శిల్పకారులుగా సమాజంలో గుర్తింపు పొందారు.

సమాజంలో స్త్రీల స్థానం, ప్రాభవం శాతవాహనుల కాలంలో మాదిరిగానే కొనసాగింది. ఇక్ష్వాక వంశ పాలకులు (వాశిష్టీపుత్ర శ్రీ శాంతమూలుడు లాంటివారు) కూడా మాతృ సంజ్ఞలను ధరించారు. స్త్రీలు పూర్తి స్వేచ్ఛా స్వాతంత్య్రాలను అనుభవించారు. రాణివాసపు స్త్రీలు విరివిగా బౌద్ధ, జైన మత గురువులకు విరాళాలిచ్చారు. సమాజంలో ఆనాటికే మేనరిక వివాహాలు ఆచారంలో ఉన్నాయి. వీరపురుషదత్తుడు మేనత్తల కుమార్తెలు ముగ్గురినీ వివాహమాడాడు. సమాజంలో బహుభార్యత్వం కనిపిస్తుంది. వేశ్యలు ప్రతిష్ఠ, అంతస్తుకు చిహ్నమయ్యారు. వీరికాలంలో కూడా కుల, దేశాంతర వివాహాలు జరిగాయి. వీరపురుషదత్తుడు తన కుమార్తె 'కొడబలిసిరి'ని చుటు కులస్థుడైన వనవాసి మహారాజుకు ఇచ్చి వివాహం చేశాడు. నాటి సమాజంలో అత్యధిక సంఖ్యాకులైన శూద్రులు సైన్యంలో ఎక్కువగా చేరారు. శూద్రులు ఒక వర్గంగా కాకుండా చేసే వృత్తిని బట్టి వివిధ శాఖలుగా ఏర్పడ్డారు. కొందరు బ్రాహ్మణులతో సమానంగా రాణించడానికి ప్రయత్నించారు. క్రీ.శ. 13వ శతాబ్దం ఆరంభం నాటికి బ్రాహ్మణులు, క్షత్రియుల ఆధిపత్యం, ప్రాభవం తగ్గిపోయి.. కమ్మ, వెలమ, రెడ్డి లాంటి వ్యవసాయదారుల కులాలు ఆవిర్భవించాయి. వర్తక, వ్యాపారాలు నిర్వహించే వైశ్యేతర కులస్థులు కూడా తమ పేర్ల చివర 'సెట్టి', 'కోమటి' అనే మాటలను చేర్చుకున్నారు. సమాజంలో వర్ణవ్యవస్థ, వర్గ విభజన ఉన్నప్పటికీ ప్రజలు సామరస్య పూర్వకంగా జీవనం సాగించడం ఈ శాతవాహన - కాకతీయుల మధ్యయుగం కాలం నాటి విశేషంగా చెప్పొచ్చు.

 

సామాజిక విస్తృతి

కాకతీయుల కాలంనాటి సమాజంలో కూడా చాతుర్వర్ణ వ్యవస్థ కొనసాగింది. సమాజంలో వృత్తి, ప్రాంతాన్ని బట్టి అనేక కులాలు, ఉపకులాలు విస్తృతంగా ఏర్పడ్డాయి. ఈ కాలంనాటి శాసనాలు, సాహిత్యాధారాలు సమాజంలో 'అష్టాదశ ప్రజలు (18 కులాలు)' ఉన్నట్లుగా పేర్కొంటున్నాయి. ప్రతి కులానికి, ఉపకులానికి వృత్తి సంఘాలు ఉండేవి. వీటిని 'సమయాలు' అంటారు. బ్రాహ్మణులు, క్షత్రియులు, కోమట్లు, సాలెలు, తెలికులు (నూనె వ్యాపారులు), తమ్మడ్లు (వ్యవసాయం), గొల్లవారు (పశుపోషణ), ఈదులవారు (గీత కార్మికులు), మంగలి, కుమ్మరి, మేదరి, వెలమ, కరణం (భూముల లెక్కలు), రెడ్లు (వ్యవసాయం), ఉప్పరి (మట్టి పని), మచరాసి (బెస్త, చేపలు పట్టడం), మేర, పెరిక (వ్యవసాయం, వాణిజ్యం), ఎరుకలి (బుట్టలు అల్లడం), కాసె (రాళ్లు కొట్టడం) మొదలైన కులాలు, ఉపకులాలను ప్రధానంగా పేర్కొన్నారు. కాకతీయుల రాజధాని ఓరుగల్లు నగర జీవితాన్ని, వివిధ వృత్తులను 'ప్రతాప చరిత్ర' కూడా ప్రస్తావించింది. బ్రాహ్మణులు, మంత్రులు, యోధులు, వైశ్యులు, పద్మనాయకులు (వెలమ), విశ్వకర్మలు, కాపులు, ఎడిగలు (గీత కార్మికులు), కుంభకరులు (కుమ్మరులు), పట్టుసాలెలు (పట్టునేతవారు), పద్మసాలె (నేత కార్మికులు), మేదరులు, బెస్తలు, రజకులు, వేశ్యలు, పూటకూళ్లవారు ఓరుగల్లు నగర జీవన సంస్కృతిలో భాగమయ్యారు.

బ్రాహ్మణ కులస్థుల్లోనూ వైదికులు (వేదశాస్త్రాల అధ్యయనం, పౌరోహిత్యం), నియోగులు (రాజాశ్రయంలో ఉద్యోగాలు, పదవులు) అనే శాఖలు ఏర్పడ్డాయి. వైదికుల్లో కూడా వారు అధ్యయనం చేసిన వేదశాఖను బట్టి రుగ్వేదులు, శుక్ల యజుర్వేదులు, కృష్ణ యజుర్వేదులు అనే విభాగాలు ఏర్పడ్డాయి. ప్రాంతాన్ని బట్టి వారు అనుసరించే కులాల్లోనూ ఉపకులాలు ఏర్పడ్డాయి. వేంగినాటి, పాకనాటి, వెలనాటి, తెలంగాణ బ్రాహ్మణులుగా వ్యవహారంలోకి వచ్చారు. ఈ కాలంలో బ్రాహ్మణులకు, దేవాలయాలకు పన్ను మినహాయింపుతో కూడిన భూములను దానం చేయడం విస్తృతమైంది. దీంతో వీటి వివరాలను లిఖిత పూర్వకంగా నమోదు చేయడం, భద్రపరిచి పర్యవేక్షణ చేయడానికి ఉద్యోగుల ఆవశ్యకత ఏర్పడింది. కాయస్థ, కరణం, కరణిక, లేఖిక, ధర్మలేఖిక మొదలైన ఉద్యోగులకు ఈ బాధ్యతల్ని అప్పగించడంతో వీరు 'కాయస్థ' అనే ఉపకులంగా ఆవిర్భవించారు. దీంతో రాజాస్థానాల్లో బ్రాహ్మణుల ఆధిపత్యానికి అడ్డుకట్ట వేసినట్లయింది. కాకతీయ ప్రభువులకు 'కాయస్థులు' మంత్రులుగా కూడా పనిచేశారు. వర్ణవ్యవస్థలో అట్టడుగున ఉన్న శూద్రుల పరిస్థితి మెరుగవడం ఈ కాలం నాటి ప్రధాన సామాజిక పరిణామం. వీరిని వ్యవసాయదారులుగా పరిగణించారు. రెడ్లు, వెలమలు, కమ్మలు రాజాస్థానాల్లో ఉన్నతోద్యోగాల్లో నియమితులయ్యారు. వైశ్యుల స్థాయి తగ్గడంతో వారిని శూద్రులతో సమానంగా పరిగణించారు.
 

ఉద్యమాల ప్రభావం

కాకతీయుల కాలంనాటి తెలంగాణ సమాజంలో వీరశైవం, శ్రీవైష్ణవ ఉద్యమాల ప్రభావం కూడా గణనీయమైన మార్పులను తీసుకొచ్చింది. వీరశైవం సమాజంలోని బ్రాహ్మణ వర్గం ఆధిపత్యాన్ని సవాల్ చేసింది. కుల వ్యవస్థను నిరసించింది. సనాతన సంప్రదాయాలను వ్యతిరేకించింది. బాల్యవివాహాలు, వైధవ్యం లాంటి సాంఘిక దురాచారాలను ఎండగట్టింది. ప్రధానంగా కమ్మరులు, చర్మకారులు, సాలెవారు మొదలైన కులాల వారు వీరశైవంలో చేరి సంస్కరణలకు కారణమయ్యారు. రామానుజాచార్యులు ప్రచారం చేసిన శ్రీవైష్ణవం మానవులంతా ఒక్కటేనని, అంటరానితనాన్ని నిర్మూలించేందుకు కృషిచేసి వారికి దేవాలయ ప్రవేశాన్ని కల్పించింది. పల్నాడులో బ్రహ్మనాయుడు 'చాపకూడు' పేరుతో సహపంక్తి భోజనాలను ఏర్పాటు చేశాడు. తెలంగాణ ప్రాంతంలో బ్రాహ్మణేతరులైన రామానుజాచార్యుల అనుచరులను సాతానులని, దాసరులని పిలుస్తున్నారు. నాటి సమాజాన్ని బాల్యవివాహాలు, సతీసహగమనం, దేవదాసీ, బహుభార్యత్వం, కన్యాశుల్కం, వేశ్యావ్యవస్థ లాంటి సామాజిక దురాచారాలు పట్టిపీడించాయి. దేవాలయాల్లో జీవనం గడుపుతూ తమ ఆట, పాటలతో రంజింపచేయడం దేవదాసీల వృత్తిగా ఉండేది. ఉన్నత, మధ్యతరగతి వర్గాల ప్రజల్లో బహుభార్యత్వం ఉండేది. రాచరికంలో స్త్రీలకు గౌరవ, మర్యాదలను కల్పించారు. దక్షిణ భారత చరిత్రలోనే మొదటిసారిగా మహిళను పరిపాలకురాలిని చేసిన ఘనత కాకతీయులదే. ముప్పమాంబ, మైలాంబ, కుందమాంబ తదితర స్త్రీలు విరివిగా భూదానాలు చేసినట్లు, చెరువులను తవ్వించినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది.

ముఖ్యంగా కాకతీయల కాలంనాటి ప్రజల సాంఘిక పరిస్థితులను తెలుసుకోవడానికి ఆధారం వినుకొండ వల్లభరాయుడు రాసిన 'క్రీడాభిరామం'. ఓరుగల్లు నగరంలోని ప్రజల సమగ్ర జీవన విధానాన్ని ఇది ప్రతిబింబిస్తుంది. ఈ నగరంలోని వెలిపాలెం, మేదరివాడ, అంగడి వీధి, మట్టియవాడ (మటైవాడ) తదితర వీధులను ప్రస్తావించారు. కోట గోడపై.. గడియారం, దేవాలయాలు, పూటకూళ్ల భోజనం, తోలుబొమ్మలాట, వేశ్యలు, కవి, గాయక వైతాళికులు, కోడిపందేలు, బంతులాట, దొమ్మరాటలు, మొదలైన వాటిని చిత్రించారు. సమాజంలో సామరస్య వాతావరణం క్రమంగా తగ్గి కుల వైషమ్యాలు, విశృంఖలత్వం పెరిగిపోయింది. రెడ్లు - వెలమల మధ్య అధికారం కోసం పోటీ విపరీత పరిణామాలకు దారి తీసింది.

 

సమ్మిశ్రిత సమాజం

కుతుబ్‌షాహీల కాలంనాటి సమాజంలో తెలంగాణలో ఒక విశిష్టమైన సమాజ నిర్మాణం జరిగింది. వర్ణవ్యవస్థ ప్రాబల్యం స్థానంలో సమాజంలో హిందువులు, ముస్లింలు అనే రెండు ప్రధాన వర్గాలు ప్రాముఖ్యం వహించాయి. హిందువుల్లో రాజోద్యోగులు, వర్తకులు, రైతులు ముఖ్య వర్గాలు కాగా.. ముస్లింలలో ప్రభుత్వోద్యోగులు, వర్తకులు ప్రధాన వర్గాలు. హిందూ జనాభాలో బ్రాహ్మణుల సంఖ్య బాగా తగ్గిపోయింది. హిందూ జనాభాలో అనేక ఉపకులాలు, శాఖలు ఏర్పడ్డాయి. కాపులు, రెడ్లు, బలిజలు, వెలమలు, వడ్రంగులు, కమ్మరి, నేత, బోయ, దర్జీ, మత్స్యకారులు, రజక, నాయీబ్రాహ్మణ తదితర జనాభా ఎక్కువ. హిందువులను పాలనా వ్యవస్థలోని అత్యున్నత ఉద్యోగాల్లో సైతం నియమించారు. రాజధాని గోల్కొండకు మధ్య ఆసియా ప్రాంతం నుంచి కవులు, కళాకారులు, వివిధ రకాల వృత్తి నిపుణులు, ఇరాన్‌కు చెందిన అఫాకీలు తరలివచ్చారు. వీరి వలసల ఫలితంగా తెలంగాణలోని భాగ్యనగరంలో ఒక విశిష్టమైన సమ్మిశ్రిత సంస్కృతి రూపుదాల్చింది. పాలకులు రాజ్యంలోని జనాభాలో మెజార్టీ భాగమైన హిందువుల ఆచార వ్యవహారాలను గౌరవించారు. హిందూ దేవాలయాలకు, పండితులకు విశేషంగా ఇనాములు ఇచ్చారు. బ్రాహ్మణులకు అగ్రహారాలను దానం చేశారు. సమాజంలో బహుభార్యత్వం, కన్యాశుల్కం, సతీసహగమనం, వేశ్యా వ్యవస్థ తదితర సాంఘిక దురాచారాలు కొనసాగాయి. వేశ్యలకు ప్రభుత్వ ఆదరణతో పాటు సమాజంలో గౌరవ, మర్యాదలను కల్పించారు. కుత్‌బ్‌షాహీ పాలకులు సతీసహగమనాన్ని రూపుమాపడానికి ప్రయత్నించారు.
సమాజంలోని ప్రజల ఆచార వ్యవహారాల్లో ఉత్తర భారత, హిందుస్థానీ ప్రభావం కనిపిస్తుంది. పురుషులు తలపై పొడవైన టోపీ, కుర్తా - పైజామా ధరించగా.. స్త్రీలు సాధారణంగా చీర, రవిక ధరించినప్పటికీ పేద స్త్రీలు రవికను అంతగా వాడలేదు. ముస్లిం స్త్రీలు పైజామా, దుపట్టాలను విరివిగా ధరించారు. స్త్రీ, పురుషులిద్దరూ బంగారు నగలు, ఆభరణాలను ధరించారు. రెడ్డి, బ్రాహ్మణ కులస్థులు మిద్దె ఇళ్లలో నివసించేవారు. వారి ఇళ్లలోనే పశువులకు, వాటి మేతకు కొంత స్థలాన్ని కేటాయించేవారు. వేలకొద్దీ వ్యభిచారుల గృహాలు గోల్కొండలో ఉండేవి. దేవాలయాలు, రాజాస్థానాలు, ముస్లింల పండగలు, శుభకార్యాల్లో 'నృత్యం' ఆనవాయితీగా మారింది. నేటికీ సంపన్నుల విందు వినోదాల్లో ఈ ఆచారం కొనసాగుతోంది.

  

 

జీవనవిధానం

శాతవాహనుల కాలం నాటి ప్రజల జీవన విధానాన్ని తెలుసుకోవడానికి ప్రధానమైన ఆధారాలు హాలుడి 'గాథాసప్తశతి', అమరావతి స్తూపంలోని శిల్పాలు. 'అత్త', 'పాడి', 'పొట్ట' లాంటి తెలుగు మాటలు 'గాథాసప్తశతి'లో ఉన్నాయి. తెలుగువారు వివిధ సందర్భాల్లో పాడుకునే పాటల ప్రస్తావన కూడా ఉంది. భాష సామాజిక సంపద. శాతవాహనుల కాలం నాటి ప్రజల భాష ప్రాకృతం కాగా రాజ భాష సంస్కృతం. అమరావతి స్తూపంపై కనిపించే మొదటి తెలుగు మాట 'నాగబు'. అమరావతి, కార్లే స్తూపాలపై చెక్కిన శిల్పాల్లోని స్త్రీలు, పురుష ప్రతిమలను బట్టి నాటి వస్త్రధారణ పద్ధతులు తెలుస్తున్నాయి. పురుషులు ధోతీ, ఉత్తరీయంతో పాటు తలపాగా ధరించేవారు. స్త్రీలు చాలా తక్కువ దుస్తులను వాడేవారు. శరీరమంతా కప్పుకోవడానికి ఒకే వస్త్రాన్ని ఉపయోగించేవారు. నాటి స్త్రీలకు ఆభరణాలు, నగలు అంటే మక్కువ. చెవులకు రింగులు, గాజులు, ఉంగరాలు, జుంకాలు, మురుగులు, వడ్డాణం, హారాలు ధరించేవారు. పురుషులు కూడా కర్ణాభరణాలు, మురుగులు, హారాలు ధరించేవారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు సామాన్య జీవితాన్ని గడపగా.. పట్టణ ప్రాంతాల్లోని ప్రజలు విలాసవంతమైన జీవితాన్ని గడిపారు. ప్రజలు సంగీత ప్రియులని, తీరిక వేళల్లో చదరంగం, నాట్యం వీరికి వినోద కార్యకలాపాలని తెలుస్తోంది. సంగీత పరికరాలైన వీణ, మృదంగం, వేణువులను ఉపయోగించడాన్ని బట్టి వీరు కళాప్రియులని తెలుస్తోంది. శాతవాహనుల కాలంనాటి ప్రజలు ఆహారప్రియులు, ఆరంభశూరులని ఒక విదేశీ చరిత్రకారుడి అభిప్రాయం.

 

భారతీయ సాంస్కృతిక వారసత్వపు ఔన్నత్యంపై గాంధీజీ ఏమన్నారంటే..

''భారతీయ సాంస్కృతిక వారసత్వం అనేది భారతదేశంలో నిలదొక్కుకోవడానికి వచ్చిన విభిన్న సంస్కృతుల మేళవింపు. అది భారతీయ జీవన విధానాన్ని ప్రభావితం చేసింది. మరోవైపు దేశ ప్రజలు స్వతహాగా ఇక్కడి మట్టి, నేలతల్లి స్ఫూర్తిగా ప్రభావితులయ్యారు. సహజంగానే ఇక్కడి మట్టి, నేల విశిష్టమైన సాంస్కృతిక సమ్మేళనానికి స్ఫూర్తినిచ్చింది. అమెరికాలో మాదిరిగా కాకుండా ఇక్కడ సహజసిద్ధంగానే జనించిన స్వదేశీ భావనే ఇలాంటి సమ్మిశ్రిత సంస్కృతికి ఆధారమైంది. ఇక్కడ పుట్టిన ప్రతి ఒక్క సంస్కృతికి సాధికారమైన స్థానముంది. ఇక్కడి సంస్కృతి సుస్థిరమైన శాంతిని తనలో ఐక్యం చేసుకుంటుంది. అక్కడి సంస్కృతిలో మాత్రం సామరస్యం కాకుండా ఒక కృత్రిమమైన, బలవంతపు ఐక్యత కనిపిస్తుంది".

Posted Date : 11-10-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌