• facebook
  • whatsapp
  • telegram

బ్యాక్టీరియా వ‌ల్ల క‌లిగే వ్యాధులు

* బ్యాక్టీరియాలు కేంద్రక పూర్వ జీవుల నిర్మాణం ఉన్న ఏకకణ జీవులు. వీటిలో క్రోమోజోమ్‌లు (జన్యుపదార్థం) నగ్నంగా, కేంద్రకత్వచం లేకుండా ఉంటాయి. జన్యు పదార్థంతో పాటు కణద్రవ్యంలో ఉండే కేంద్రకేతర డీఎన్ఏ శకలాన్ని ప్లాస్మిడ్ అంటారు.

* బ్యాక్టీరియా అనే సూక్ష్మజీవుల వల్ల మానవుడిలో అనేక వ్యాధులు కలుగుతున్నాయి.

 

కలరా

* ఇది ఒక ఎపిడెమిక్ వ్యాధి

* విబ్రియో కలరా (Vibrio cholerae) అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది.

* సుమారుగా వ్యాధి సంక్రమించిన 12 గంటల నుంచి 5 రోజుల్లోపు వ్యాధి లక్షణాలు కనిపించవచ్చు.

* వాంతులు, విరేచనాలు కావడం ఈ వ్యాధి ప్రధాన లక్షణాలు.

* కలరాతో బాధపడుతున్న మనిషి రోజుకు సుమారు ఇరవై లీటర్ల వరకూ ద్రవాలను కోల్పోతాడు. దీనివల్ల శరీరంలో నీరు, లవణాలు లోపిస్తాయి.

* నష్టపోయిన లవణాలను అందించడానికి ORS (Oral Rehydration Solution) ద్రావణాన్ని రోగికి ఇవ్వాలి.

* ఈ వ్యాధి కారక క్రిమి కలుషితమైన నీరు, ఆహార పదార్థాల ద్వారా ఆరోగ్యవంతుడైన మనిషిలోకి ప్రవేశిస్తుంది.
 

టైఫాయిడ్

* ఇది సాల్మోనెల్లా టైఫై (Salmonella typhi) అనే బ్యాక్టీరియం వల్ల సంక్రమిస్తుంది.

* కలుషితమైన ఆహారం, తాగునీరు ద్వారా ఈ బ్యాక్టీరియా వ్యాప్తి చెందుతుంది. పరిశుభ్రత లేకపోవడం ఈ వ్యాధి కలగడానికి ప్రధాన కారణం.

* చికిత్స జరగక సుమారు 25 శాతం మంది వ్యాధిగ్రస్తులు మరణిస్తుంటారు. టైఫాయిడ్ చికిత్సలో భాగంగా యాంటీబయాటిక్స్‌ను (సూక్ష్మ జీవనాశకాలు) వాడతారు.

* సాల్మోనెల్లా టైఫై సాధారణంగా మనిషి పేగుల్లో, రక్తప్రవాహంలో జీవిస్తుంది.

* ఏ జంతువూ ఈ వ్యాధి సంక్రమణకు వాహకంగా పనిచేయదు. ఈ మనిషి నుంచి మనిషికి వ్యాపిస్తుంది.

* టైఫాయిడ్ పరాన్నజీవిని మనిషి రక్తం, మలం, మూత్రం, ఎముక మజ్జలో గమనించడం ద్వారా ఈ వ్యాధిని నిర్ధారించవచ్చు.

* సాధారణంగా వ్యాధి సంక్రమించిన 6 నుంచి 30 రోజుల తర్వాత వ్యాధి లక్షణాలు బయట పడవచ్చు.

* ఈ వ్యాధి లక్షణాల్లో ప్రధానమైనవి సుమారు 104oF ఉష్ణోగ్రత తీవ్రతతో జ్వరం, వాంతులు, విరేచనాలు. కొందరిలో మెడ, ఉదర భాగాల్లో గులాబీ రంగు మచ్చలు కూడా కనిపించవచ్చు.

 

డిఫ్తీరియా

* ఇది కొరైనీ బ్యాక్టీరియం డిఫ్తీరియే (Corynebacterium diphtheriae) అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది.

* మనిషికి మనిషికి మధ్య ప్రత్యక్ష తాకిడి ద్వారా ఈ వ్యాధి వేగంగా వ్యాప్తి చెందుతుంది.

* వ్యాధికారక బ్యాక్టీరియం మానవుడి గొంతు, నాసికా కుహరాలను ప్రభావితం చేస్తుంది.

* జ్వరం, గొంతు నొప్పి ఈ వ్యాధి ప్రధాన లక్షణాలు.

* ఇది చలి కాలంలో వేగంగా వ్యాపిస్తుంది.

* ఇది ఇంక్యుబేషన్ సమయం సుమారు 2 నుంచి 5 రోజులు.

* ఇది ఇచ్చే వ్యాక్సిన్ పేరు డి.పి.టి.

* డి.పి.టి. అనేది ట్రిపుల్ ఏంటిజన్, దీనిలో డిఫ్తీరియా, పెర్టుసిస్ (కోరింత దగ్గు), టెటనస్ (ధనుర్వాతం) వ్యాధులు మూడింటినీ ఎదుర్కోగల వ్యాక్సిన్‌లు ఉంటాయి.

 

కోరింత దగ్గు (పెర్టుసిస్)

* బోర్డిటెల్లా పెర్టుసిస్ (Bordetella pertussis) అనేది కోరింత దగ్గు వ్యాధిని కలగజేస్తుంది.

* చిన్న పిల్లల్లో ఎక్కువగా గాలి ద్వారా వ్యాపిస్తుంది.

* ఈ వ్యాధి సుమారు ఆరు నుంచి ఎనిమిది వారాలు ఉంటుంది.

* జ్వరం, వదలని దగ్గు ఈ వ్యాధి ప్రధాన లక్షణాలు.

* ఈ వ్యాధిని కట్కాయి వ్యాధి, ఊఫింగ్ కాఫ్ అని కూడా పిలుస్తారు.

* ఇది ఊపిరితిత్తుల సంబంధమైన శ్వాసకోశ వ్యాధిగా గుర్తింపు పొందింది.
 

ధనుర్వాతం (టెటనస్)

* ఈ వ్యాధి క్లాస్ట్రీడియమ్ టెటనై (Clostridium tetani) అనే బ్యాక్టీరియం వల్ల వస్తుంది.

* ఈ బ్యాక్టీరియం ఉత్పత్తి చేసిన విషపదార్థం మెదడు, నాడీ వ్యవస్థలను ప్రభావితం చేస్తుంది.

* కట్టుకట్టని గాయాలు, చీరుకుపోయిన చర్మ భాగాల ద్వారా ధనుర్వాతం సంక్రమిస్తుంది.

* రోగి మెడ, దవడ కండరాలు బిగుసుకుపోయి బాధపెడతాయి.

* రోగి శరీరం ధనస్సు ఆకారంలో వంచినట్లు తయారవుతుంది.

* ఈ వ్యాధి ఇంక్యుబేషన్ సమయం నాలుగు రోజుల నుంచి సుమారు మూడు వారాల వరకు ఉంటుంది.

* దీన్నే లాక్‌జా వ్యాధి అని కూడా అంటారు.
 

క్షయ (T.B.)

* ఈ వ్యాధి మైకోబ్యాక్టీరియం ట్యుబర్క్యులోసిస్ (Mycobacterium tuberculosis) అనే బ్యాక్టీరియం వల్ల వస్తుంది.

* అలసట, జ్వరం, శ్లేష్మంతో కూడిన దగ్గు, ఆకలి, బరువు తగ్గడం లాంటివి క్షయ వ్యాధి ప్రధాన లక్షణాలు.

* ఈ వ్యాధివల్ల ప్రధానంగా ప్రభావితమయ్యేవి ఊపిరితిత్తులు.

* క్షయను రికవరీ డిసీజ్ లేదా సైలెంట్ కిల్లర్ అని కూడా అంటారు.

* వ్యాధిగ్రస్తుల నుంచి గాలి ద్వారా ఈ బ్యాక్టీరియం వ్యాపిస్తుంది.

* ప్రపంచంలో అత్యధికంగా క్షయవ్యాధి ఉన్న దేశంగా మన భారతదేశం రికార్టుల్లో ఉంది.

* ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవాన్ని ఏటా మార్చి 24న నిర్వహిస్తారు.

* 2018 సంవత్సరానికి 'క్షయ లేని ప్రపంచం కోసం నాయకులు కావాలి' అనే ముఖ్య ఉద్దేశంతో ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవాన్ని నిర్వహించారు.

* క్షయవ్యాధి నివారణకు ఉపయోగపడే ముఖ్యమైన సూక్ష్మ జీవ నాశకం 'స్ట్రెప్టోమైసిన్'.

* పసిపిల్లలకు క్షయవ్యాధి రాకుండా బి.సి.జి. టీకాలు ఇస్తారు. (BCG - Bacillus Calmette Guerin).

 

కుష్టు వ్యాధి (లెప్రసీ)

* ఈ వ్యాధికి కారణమైన సూక్ష్మజీవి మైకో బ్యాక్టీరియం లెప్రె.

* చర్మంపై మచ్చలు రావడం, స్పర్శ లేకపోవడం, చేతులు, కాలి వేళ్ల నుంచి రక్తస్రావం లాంటివి కుష్టువ్యాధి లక్షణాలు.

* ఈ వ్యాధిని కలగజేసే బ్యాక్టీరియాను హన్‌సన్ అనే శాస్త్రవేత్త కనుక్కున్నారు. కాబట్టి ఈ వ్యాధికి హన్‌సన్ వ్యాధి అనే పేరు కూడా ఉంది.

* 2018లో ప్రపంచ కుష్టు వ్యాధి దినోత్సవాన్ని జనవరి 28న నిర్వహించారు.

* World Leprosy Day 2018 సంవత్సరానికి బాల బాలికల్లో వైకల్య శూన్యత అనే ముఖ్య ఉద్దేశంతో జరిపారు.

* కుష్టు వ్యాధి అంటువ్యాధి కాదు.

* ఇతర వ్యాధులతో పోలిస్తే  ఇది చాలా నెమ్మదిగా వ్యాధిగ్రస్తుడి శరీరంలో అభివృద్ధి చెందుతుంది.

* జాతీయ కుష్టు వ్యాధి నియంత్రణా కార్యక్రమం 1955 లోనే ప్రారంభమైంది.

 

ప్లేగు వ్యాధి

* ఈ వ్యాధి కారక బ్యాక్టీరియా పేరు యెర్సీనియా పెస్టిస్.

* ఈ బ్యాక్టీరియా ఎలుకల ద్వారా వ్యాపిస్తుంది.

* ఈ వ్యాధి ప్రధాన లక్షణాలు జ్వరం, వాంతులు, కండరాలు వంకరలు పోవడం మొదలైనవి.

* ఈ వ్యాధినే బ్లాక్‌డెత్ అని కూడా పిలుస్తారు.

* ఇది రక్తప్రసరణ వ్యవస్థకు, కండరాలకు సంబంధించిన వ్యాధి.

* ప్లేగు వ్యాధి నివారణకు ఉపయోగపడే ఔషధం  టెట్రాసైక్లిన్.

* టెట్రాసైక్లిన్‌ను ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యల్లాప్రగడ సుబ్బారావు కనుక్కున్నారు. ఈయనకు అద్భుత ఔషధసృష్టికి మంత్రగాడు అనే పేరు ఉంది.

* ప్లేగువ్యాధి బ్యుబోనిక్, సెప్టెసెమిక్, న్యూమోనిక్ అని మూడు విధాలుగా ఉండవచ్చు.
 

ఆంథ్రాక్స్

* వ్యాధి కారక సూక్ష్మజీవి పేరు బాసిల్లస్ ఆంథ్రసిస్.

* ఇది పశువులు, గొర్రెల పాలు, మాంసం ద్వారా ఎక్కువగా వ్యాపిస్తుంది.

* ఈ వ్యాధి నాడీ వ్యవస్థపై ప్రభావాన్ని చూపుతుంది.

 

మెనింజైటిస్

* మెనింజిస్ పొరల వాపు ఈ వ్యాధి ప్రధాన లక్షణం.

* మెనింజిస్ అంటే వెన్నుపాము, మెదడులను ఆవరించి ఉండే పొరలు.

* ఇది సాధారణంగా నిస్సెరా మెనింజైటిస్ అనే బ్యాక్టీరియా వల్ల కలుగుతుంది.

 

గనేరియా

* ఈ వ్యాధిని కలగజేసే బ్యాక్టీరియం పేరు నిస్సీరియా గనేరియే (Neisseria gonorrhoea)

* ఇది లైంగిక సంపర్కం ద్వారా వ్యాపిస్తుంది.

* ఇంక్యుబేషన్ కాలం సుమారు 2 నుంచి 10 రోజులు.

* మూత్ర జననేంద్రియ వాహికల వాపు ఈ వ్యాధి ప్రధాన లక్షణం.

* ఈ వ్యాధికారక బ్యాక్టీరియం పేరు ట్రిపోనిమా పేలిడమ్.

* ఈ వ్యాధి కూడా అసురక్షిత లైంగిక సంబంధాల వల్ల సంక్రమిస్తుంది.

* మొదటి దశ వ్యాధి లక్షణాలు పది రోజుల నుంచి మూడు వారాల వ్యవధిలో కనిపిస్తాయి.

* లింఫ్ గ్రంథుల వాపు, ఫ్లూ జ్వరానికి ఉన్న కొన్ని లక్షణాలు, చర్మంపైన దురదలేని మచ్చలు, జననాంగాల ప్రాంతంలో చర్మం పెరుగుదల లాంటివి ఈ వ్యాధి ప్రధాన లక్షణాలు.
 

బొటులిజం (ఆహార విష ప్రభావ వ్యాధి)

* ఆహార విష ప్రభావాన్ని కలిగించే ఒక బ్యాక్టీరియా రకం క్లాస్ట్రీడియం బొటులీనమ్.

* కలుషిత ఆహారం వల్ల ఈ బ్యాక్టీరియా వ్యాపించి, వ్యాధిని కలగజేస్తుంది.

* ఎక్కువ కాలం నిల్వ ఉంచిన ఆహారంలో ఈ బ్యాక్టీరియా పెరిగి బొటులిన్ అనే విషపదార్థాన్ని విడుదల చేస్తుంది. ఫలితంగా ఆ ఆహారాన్ని తీసుకున్నవారు విష ప్రభావానికి లోనై, వాంతులు, విరేచనాలు లాంటి సమస్యలతో బాధపడతారు.
 

జంతువుల్లో బ్యాక్టీరియా వల్ల కలిగే వ్యాధులు

* పశువుల్లో క్షయ మైకోబ్యాక్టీరియం బొవిస్.

* పశువుల్లో బ్లాక్‌లెగ్ వ్యాధి క్లాస్ట్రీడియం చావోలు బ్యాక్టీరియా.

* గొర్రెలు, మేకల్లో కలిగే బేంగ్స్ వ్యాధి (బ్రూసిల్లోసిస్) బ్రూసిల్లా బ్యాక్టీరియం.

* గొర్రెల్లో ఫుట్‌రాట్ వ్యాధి ప్యూజీఫార్మిస్ నోడోసస్.
 

మొక్కల్లో బ్యాక్టీరియా వల్ల కలిగే వ్యాధులు

* వరిలో ఎండు తెగులు (బ్లయిట్ తెగులు) జాంథో మోనాస్ ఒరైజే.

* నిమ్మలో గజ్జి తెగులు (సిట్రస్ కేంకర్) జాంథో మోనాస్ సిట్రి.

* బంగాళాదుంపల్లో సాప్ట్‌రాట్ వ్యాధి సూడోమోనాస్ సొలనేషియారమ్.

* క్యాబేజీలో బ్లాక్‌రాట్ వ్యాధి జాంథో మోనాస్ కాంపెస్ట్రిస్.

* ఆపిల్‌లో క్రౌన్‌గాల్ వ్యాధి ఆగ్రో బ్యాక్టీరియం ట్యుమిఫేషియన్స్.

* పత్తిలో కోణీయ ఆకుమచ్చ తెగులు వ్యాధి జాంథోమోనాస్ మాల్వేసియారమ్.

* చెరకులో గమ్మోసిస్ వ్యాధి జాంథోమోనాస్ వాస్కులోరమ్.

* పొగాకులో విల్ట్ తెగులు ఫైటో బ్యాక్టీరియం సొలనేషియారమ్.

Posted Date : 17-04-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌