• facebook
  • whatsapp
  • telegram

వైరస్‌ల వల్ల వచ్చే వ్యాధులు  

     మానవుడిలో వైరస్‌ల వల్ల తట్టు, ఆటలమ్మ, పోలియో, గవదబిళ్లలు, మెదడువాపు, హెపటైటిస్, ఫ్లూ లాంటి వ్యాధులు వస్తాయి. వైరస్‌లు మానవుడికి తుంపరలు లేదా వాహకాల ద్వారా సంక్రమించి వ్యాధులను కలిగిస్తాయి.

 

 పోలియో 

  ఈ వ్యాధి పోలియో వైరస్ వల్ల వస్తుంది. ఇది సాధారణంగా అయిదు సంవత్సరాల లోపు పిల్లలకు ఎక్కువగా వస్తుంది.  పోలియో వైరస్‌లు సాధారణంగా కలుషిత నీరు, ఆహారం వల్ల వ్యాపిస్తాయి. వైరస్‌ల ప్రభావం నాడీ మండలంపైన ఉంటుంది. వీటి ప్రభావానికి లోనైన కండరాలు సరిగా పనిచేయవు. అవయవాల కండరాల సైజులో తగ్గుదల ఉంటుంది. జ్వరం, వాంతులు, కండరాల నొప్పులు, ఆకలి లేకపోవడం, కాళ్లు, చేతుల కండరాలు పనిచేయకపోవడం లాంటివి ఈ వ్యాధి లక్షణాలు. ఈ వ్యాధిలో ఎక్కువగా ఒకటి లేదా రెండు కాళ్లు బలహీనమవుతాయి. పోలియోను శిశుపక్షవాతం అని కూడా అంటారు. ఒకసారి సోకిన తర్వాత ఈ వ్యాధి పూర్తిగా నయం కాదు. ఇది రాకుండా పోలియో వ్యాక్సిన్ ఇవ్వాలి. ప్రస్తుతం నోటి ద్వారా చుక్కల రూపంలో పోలియో వ్యాక్సిన్‌ను ఇస్తున్నారు. దీన్ని అభివృద్ధి చేసిన శాస్త్రవేత్త ఆల్బర్ట్ సాబిన్ కాబట్టి దీన్ని సాబిన్ (Sabin) వ్యాక్సిన్ అంటారు.

 

జలుబు (Common cold)

     రినోవైరస్‌లు (Rhino viruses) , కొరోనా వైరస్‌లు (Corona Viruses) సాధారణంగా జలుబును కలిగిస్తాయి. వాతావరణంలో ఉండే ఈ వైరస్‌లు దేహంలోకి ప్రవేశించినప్పుడు, జలుబుతో బాధపడుతున్న వ్యక్తి ఉపయోగించిన తువ్వాళ్లు, చేతి రుమాలు లాంటివి వాడటం వల్ల జలుబు వ్యాపిస్తుంది. కళ్లు ఎరుపెక్కడం, తుమ్ములు, దగ్గు, ముక్కు నుంచి నీరు కారడం, శ్వాసపీల్చుకోవడం కష్టంగా ఉండటం ఈ వ్యాధి లక్షణాలు. జలుబు సోకిన వ్యక్తికి మంచి ఆహారం, పండ్లరసాలు ఇవ్వాలి. రోగి వీపు, రొమ్ముపై యూకలిప్టస్ నూనెను రాయాలి. ఆవిరి పట్టాలి.
 

ఫ్లూ జ్వరం

  ఈ వ్యాధి ఇన్‌ఫ్లుయెంజా (influenza) అనే వైరస్ వల్ల వస్తుంది. కాబట్టి దీన్ని ఇన్‌ఫ్లుయెంజా అని కూడా అంటారు. వ్యాధిసోకినవారు దగ్గడం, తుమ్మడం ద్వారా ఈ వైరస్‌లు ఇతరులకు వ్యాపిస్తాయి. జలుబు, గొంతునొప్పి, కళ్లమంట, జ్వరం, తలనొప్పి, ఒళ్లునొప్పులు మొదలైనవి ఈ వ్యాధి లక్షణాలు. వ్యాధి సోకిన వ్యక్తి నుంచి మరొకరికి వ్యాపించకుండా రోగిని వేరొక గదిలో ఉంచాలి. ప్రత్యేక చికిత్సను అందించాలి. ఇటీవల భారతదేశంతోపాటు ప్రపంచంలోని అనేక దేశాలను వణికిస్తున్న స్వైన్ ఫ్లూ వ్యాధి H1N1 ఇన్‌ఫ్లుయెంజా అనే వైరస్ వల్ల వస్తుంది.

 

మీజిల్స్ (Measles)

       ఈ వ్యాధిని రూబియోలా (Rubeola) అని కూడా అంటారు. ప్రాంతాన్ని బట్టి ఈ వ్యాధిని తట్టు, దద్దు, వేపపూత, అమ్మవారు లాంటి అనేక పేర్లతో పిలుస్తారు. పారామిక్సో వైరస్ (Paramyxovirus) వల్ల మీజిల్స్ వైరస్ వస్తుంది. ఇది అంటు వ్యాధి. దగ్గు, జ్వరం, జలుబు, కళ్లు ఎరుపెక్కి నీరు కారడం మొదలైనవి ఈ వ్యాధి ప్రారంభ లక్షణాలు. దీని తర్వాత 3-7 రోజులకు ముఖంపై ఎర్రటి పూత ప్రారంభమై క్రమంగా శరీరమంతా వ్యాపిస్తుంది. ఈ పూత 4-7 రోజుల వరకు ఉండి క్రమంగా తగ్గుతుంది. వ్యాధిగ్రస్తుల శరీరంపై పూత కనిపించక ముందే రోగి నుంచి దగ్గు, తుమ్ముల వల్ల వైరస్ ఇతరులకు వ్యాపిస్తుంది. మూడు సంవత్సరాల్లోపు పిల్లల్లో తరచుగా కనిపించినప్పటికీ ఏడాది వయసు నిండని వారిలో ఈ వ్యాధి తీవ్రత ఎక్కువ. వ్యాధి తగ్గిన తర్వాత కూడా కొంతమంది పిల్లల్లో న్యుమోనియా, బుద్ధిమాంద్యం, ఫిట్స్ రావడం లాంటి లక్షణాలు కలుగుతాయి. శరీరంపై దద్దుర్లు లేదా పూత ప్రారంభమయినప్పటి నుంచి రోగిని వేరుగా ప్రత్యేక గదిలో ఉంచడం ద్వారా వ్యాధి వ్యాప్తిని అరికట్టవచ్చు. ఈ వ్యాధి రాకుండా M.M.R అనే టీకాను ఇస్తారు.
 

చికెన్ పాక్స్ (Chicken Pox)

     దీన్ని ఆటలమ్మ అని కూడా అంటారు. పదేళ్లలోపు పిల్లల్లో సాధారణంగా కనిపించే అంటువ్యాధి ఇది. వ్యాధి ప్రారంభ దశలో అలసట, తలనొప్పి, ఆకలి తగ్గడం, జ్వరం, ఒళ్లునొప్పులు లాంటి లక్షణాలు కనిపిస్తాయి. దీని తర్వాత శరీరంపై ముత్యం లాంటి పొక్కులు వస్తాయి. ఇవి ఛాతీపై ప్రారంభమై ముఖం, తల, నోరు, చెవులు, కాళ్లు చేతులకు వ్యాపిస్తాయి. వెరిసెల్లా జోస్టర్ (Vericella Zoster) అనే వైరస్ వల్ల చికెన్ పాక్స్ వస్తుంది. వ్యాధి గ్రస్తులు తుమ్మడం, దగ్గడం వల్ల

వైరస్‌లు ఇతరులకు వ్యాపిస్తాయి. వీరికి అతి దగ్గరగా కలిసి నివసించడం వల్ల ఒకరి చర్మం మరొకరికి అంటుకుని కూడా వ్యాధి వ్యాపించవచ్చు. రోగిని ప్రత్యేక గదిలో ఉంచడం, వారి దుస్తులను నీటిలో మరగబెట్టి ఉతికి ఎండలో ఆరవేయడం లాంటి చర్యల ద్వారా ఈ వ్యాధి వ్యాప్తిని నివారించవచ్చు. చికెన్ పాక్స్ రాకుండా టీకాను ఇవ్వొచ్చు.

 

గవద బిళ్లలు (Mumps)

    మిక్సోవైరస్ పరొటైడిస్ అనే వైరస్ వల్ల ఈ వ్యాధి వస్తుంది. ఈ వైరస్‌లో RNA జన్యుపదార్థంగా ఉంటుంది. గవదబిళ్లల్లో చెవికి ముందు ఉండే లాలాజల గ్రంథి అయిన పెరోటిడ్ గ్రంథి వాచి నొప్పిగా ఉంటుంది. జ్వరం, తలనొప్పి, చెవినొప్పి, ఆహారం మింగడంలో కష్టంగా ఉండటం ఈ వ్యాధి లక్షణాలు. రోగి తుమ్మడం, దగ్గడం ద్వారా వైరస్‌లు ఇతరులకు వ్యాపిస్తాయి M.M.R టీకాను ఇవ్వడం ద్వారా దీన్ని రాకుండా నివారించవచ్చు.

 

మెదడువాపు

     ఈవ్యాధిని ఎన్‌సెఫలైటిస్ (Encephalitis) అని అంటారు. ఎన్‌సెఫలైటిస్ వైరస్ వల్ల ఈ వ్యాధి వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా దీనిలో అనేక రకాలను గుర్తించారు. భారతదేశంలో జపనీస్ ఎన్‌సెఫలైటిస్ వైరస్ వల్ల మెదడువాపు వస్తుంది. ఈ వైరస్‌లు పక్షులు, పందులు, ఎలుకల్లాంటి వాటిలో ఉంటాయి. ఈ జీవులు వైరస్‌లకు ఆశ్రయంగా పనిచేస్తాయి. వీటినుంచి క్యూలెక్స్ దోమకాటు ద్వారా మానవుడిలోకి ప్రవేశిస్తాయి. తలనొప్పి, జ్వరం, మెదడు సక్రమంగా పనిచేయక ఒకవైపు పక్షవాతం కలగడం, ఫిట్స్ రావడం లాంటివి ఈ వ్యాధి లక్షణాలు. ఆశ్రయ జీవులు మన చుట్టుపక్కల లేకుండా చూడటం, దోమలు కుట్టకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఇది వ్యాప్తిచెందకుండా చూడొచ్చు. టీకాను ఇవ్వడం ద్వారా ఈ వ్యాధి రాకుండా నివారించొచ్చు.

 

కామెర్లు (Jaundice)

        ఈ వ్యాధి వల్ల చర్మం, కంటిలోని తెల్లగుడ్డు పసుపు పచ్చగా మారుతుంది. మూత్రం పసుపు రంగులో వస్తుంది. కాబట్టి దీన్ని పచ్చకామెర్లు అంటారు. కామెర్ల వ్యాధి రావడానికి అనేక కారణాలున్నాయి. కాలేయంలో అధిక సంఖ్యలో ఎర్ర రక్తకణాలు నాశనమవడం వల్ల బైలిరూబిన్ వర్ణ ద్రవ్యం ఎక్కువవడం, పిత్తాశయంలో రాళ్లు ఏర్పడటం, పైత్యరసం స్రవించడంలో ఆటంకం లాంటి వాటివల్ల కామెర్లు రావొచ్చు. వీటివల్ల రక్తంలో బైలిరూబిన్ ఎక్కువై శరీరం, కళ్లు పసుపు పచ్చగా మారతాయి. హెపటైటిస్ అనే వైరస్ సోకడం వల్ల హైపటైటిస్ అనే వ్యాధి కలిగి కామెర్లు వచ్చే అవకాశం ఉంది. హైపటైటిస్ వైరస్‌లలోA,B,C,D,E,F అనే రకాలు ఉన్నాయి. వైరస్‌ను బట్టి హైపటైటిస్ వ్యాధి కూడా A,B,C,D,E,F రకాలుగా ఉంటుంది. కలుషితమైన సిరంజీలు వాడటం, కలుషిత రక్తమార్పిడి వల్ల ఈ వ్యాధి సోకుతుంది. కాలేయ కణాలు సరిగా పనిచేయకపోవడం, కొన్ని విష పదార్థాలు, రసాయనాల వల్లకూడా కామెర్లు రావడానికి అవకాశం ఉంది. సాధారణ కారణాలవల్ల వచ్చే కామెర్ల వ్యాధికి కారణాన్ని బట్టి చికిత్స చేయాలి. వైరస్ వల్ల వ్యాధి వస్తే పూర్తిగా వైద్యుడి పర్యవేక్షణలో చికిత్స జరగాలి. ప్రస్తుతం హెపటైటిస్ A,B వ్యాధులకు టీకాలు ఇస్తున్నారు. వ్యాధి సోకిన వ్యక్తికి విశ్రాంతినివ్వడం, పండ్ల రసం, గ్లూకోజ్ ఎక్కువగా ఇవ్వడం లాంటివి చేయాలి.                                              

 

ప్రోటోజోవా జీవుల వల్ల వచ్చే వ్యాధులు

మానవుడిలో ప్రోటోజోవా జీవుల వల్ల అమీబియాసిస్, మలేరియా లాంటి వ్యాధులు వస్తాయి. ఇవి కలుషితమైన నీరు, ఆహారం లేదా వాహకాల ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తాయి.

 

అమీబియాసిస్ (జిగట విరేచనాలు) 

ఈ వ్యాధి ఎంటమీబా హిస్టోలైటిక (Enatamoeba Histolytica) అనే ప్రోటోజోవా పరాన్నజీవి వల్ల వస్తుంది. ఈ జీవి కోశీయ దశలో కలుషితమైన నీరు, ఆహారం ద్వారా మానవుడిలోకి ప్రవేశిస్తుంది. పేగులో కోశీయదశ నుంచి వెలువడిన జీవులు పేగు గోడపై దాడిచేసి పుండ్లను ఏర్పరుస్తాయి. దీనివల్ల రక్తం, జిగట పదార్థాలతో కూడిన విరోచనాలవుతాయి. మలం దుర్వాసనతో ఉంటుంది. ఈ వ్యాధినే అమీబిక్ డీసెంటరి అనికూడా పిలుస్తారు. సరైన ఔషధాలతో అమీబియాసిస్‌ను పూర్తిగా నయం చేయొచ్చు. ఆహారం, నీటిపై మూతలను ఉంచడం; వంట, భోజనానికి ముందు చేతులను శుభ్రపరచుకోవడం; కూరగాయలను, పండ్లను కడగడం లాంటి చర్యల ద్వారా వ్యాధి రాకుండా చూడొచ్చు.

 

మలేరియా

     మలేరియా అనే పదానికి ఇటాలియన్ భాషలో చెడుగాలి అని అర్థం. పూర్వకాలంలో ఈ వ్యాధి చెడుగాలి వల్ల వస్తుందని భావించారు. మలేరియా పరాన్నజీవిని మొదట కనిపెట్టింది చార్లెస్ లావిరన్ (Charles laveran). దోమలు మలేరియాను వ్యాపింపజేస్తాయని భావించింది పాట్రిక్ మాన్‌సన్. మలేరియా జీవిత చక్రాన్ని కనుక్కున్నది సర్ రోనాల్డ్ రాస్. ఈ పరిశీలన సికింద్రాబాద్‌లో జరగడం విశేషం. మలేరియాను కలిగించే పరాన్నజీవి ప్లాస్మోడియంలో నాలుగు రకాల జాతులున్నాయి.

అవి: 1.ప్లాస్మోడియం వైవాక్స్ (Plasmodium Vivax), 2. ప్లాస్మోడియంఓవెల్ (Plasmodium Ovale),   3. ప్లాస్మోడియం మలేరియే (Plasmodium Malariae),  4. ప్లాస్మోడియం ఫాల్సిఫారమ్ (Plasmodium Falciparum).

ప్లాస్మోడియం పరాన్నజీవి రెండు ఆతిథేయిల్లో తన జీవిత చక్రాన్ని పూర్తిచేసుకుంటుంది. అవి: దోమ, మానవుడు. వీటిలో ఆడ ఎనాఫిలస్ దోమ ప్రధాన ఆతిథేయి. మానవుడు ద్వితీయ లేదా మాధ్యమిక ఆతిథేయి. మానవుడిలో ప్లాస్మోడియం అలైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా వృద్ధి చెందుతుంది. ఆరోగ్యవంతుడిని ఆడ ఎనాఫిలిస్ దోమ కుట్టినప్పుడు ప్లాస్మోడియం స్పోరోజాయిట్‌లు (Sporozoit) రూపంలో ప్రవేశిస్తాయి. రక్తం నుంచి ఇవి కాలేయ కణాలను చేరి వాటిని ఆహారంగా గ్రహిస్తూ పెరిగి షైజాంట్ దశగా (Schizont) తర్వాత అలైంగిక విభజన ద్వారా మీరోజాయిట్లుగా మారతాయి. వీటిలో కొన్ని మళ్లీ కాలేయ కణాలపై మరికొన్ని ఎర్ర రక్తకణాలపై దాడిచేస్తాయి. ఈ వలయాన్ని ఎర్రరక్త కణాల పూర్వ వలయం (ప్రీ - ఎరిత్రోసైటిక్ వలయం) అంటారు.

ఎర్రరక్త కణాలను చేరిన మీరోజాయిట్లు కణంలోని హిమోగ్లోబిన్‌ను ఆహారంగా తీసుకుంటూ పెరిగి తిరిగి మీరోజాయిట్ (Merozoite) లను ఏర్పరుస్తాయి. రక్తకణం పగలడం ద్వారా ఇవి రక్తంలోకి విడుదలవుతాయి. ఈ దశలో రోగికి మలేరియా లక్షణమైన చలి, జ్వరాలు వస్తాయి. రక్తకణంలో జరిగే విభజన తర్వాత మీరోజాయిట్‌లు స్థూల సంయోగ బీజ మాతృకలు, సూక్ష్మ సంయోగ బీజమాతృకలను ఏర్పరుస్తాయి. ఈ దశలన్నీ ఎర్ర రక్తకణాల్లో జరుగుతాయి కాబట్టి దీన్ని రక్తకణ జీవిత చక్రం (Erythocytic cycle) అంటారు. సంయోగబీజ మాతృకలు తర్వాత పరిధీయ రక్తనాళాలను చేరతాయి. దీని తర్వాత జరిగే అభివృద్ధి దోమలో జరుగుతుంది.
మలేరియాతో బాధపడుతున్న వ్యక్తిని దోమకుట్టినప్పుడు సంయోగ బీజమాతృకలు దోమ జీర్ణాశయాన్ని చేరతాయి.

వీటిలో సూక్ష్మసంయోగ మాతృకల నుంచి పురుష సంయోగ బీజకణాలు (సూక్ష్మ సంయోగబీజాలు), స్థూల సంయోగ బీజ మాతృకణం నుంచి స్త్రీ సంయోగబీజకణం (స్థూల సంయోగబీజం) ఏర్పడతాయి. ఈ రెండు సంయోగ బీజకణాలు సంయోగం చెంది సంయుక్త బీజం ఏర్పడుతుంది. ఇది తిరిగి విభజన చెంది స్పోరోజాయిట్లను ఏర్పరుస్తుంది. ఇవి లాలాజల గ్రంథులను చేరి దోమకాటు ద్వారా ఆరోగ్యవంతుడిలో ప్రవేశించడంతో తిరిగి ప్లాస్మోడియం జీవిత చక్రం ప్రారంభమవుతుంది.

మలేరియా వ్యాధి ప్రారంభంలో చలి, జ్వరం వస్తాయి. జ్వరం ఎక్కువగా ఉంటుంది. ఈ దశలో రోగికి తలనొప్పి, ఒళ్లునొప్పులు ఉంటాయి. దీని తర్వాత దశలో రోగికి అధికంగా చెమటలు వచ్చి జ్వరం తగ్గుతుంది. ఈ లక్షణాలు మళ్లీ, మళ్లీ కనిపిస్తాయి. పిల్లల్లో మలేరియా పరాన్నజీవి మెదడుకు రక్తం అందజేసే రక్తకేశనాళికలకు అడ్డుపడి రక్తప్రవాహాన్ని అడ్డగిస్తుంది. మలేరియా జ్వరానికి చాలాకాలం వరకు క్వినైన్ అనే ఔషధంతో చికిత్స చేసేవారు. ప్రస్తుతం ఈ వ్యాధికి క్లోరోక్విన్, ప్రిమాక్విన్ అనే ఔషధాలను వాడుతున్నారు. మన చుట్టుపక్కల ప్రదేశాల్లో దోమలు అభివృద్ధి చెందకుండా చూడటం, దోమలు కుట్టకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ వ్యాధిని నివారించవచ్చు.

పై వ్యాధులే కాకుండా చిన్నపిల్లల్లో ఎక్కువగా గజ్జి, ఆస్కారియాసిస్ (Ascariosis) అనే వ్యాధులు వస్తాయి. వీటిలో గజ్జి అనేది ఒక చిన్న కీటకం (మైట్) వల్ల వస్తుంది. ఇవి చేతివేళ్ల లాంటి భాగాల్లోని చర్మంలో నివసిస్తూ దురదను కలిగిస్తాయి. ఆస్కారియాసిస్ అనే వ్యాధి నిమాటిహెల్మింథిస్ పరాన్నజీవి అయిన ఆస్కారిస్ లుంబ్రికాయిడ్స్ (Ascaris Lumbricoides) వల్ల వస్తుంది. దీన్ని ఏలికపాము అంటారు. ఏలికపాము గుడ్లు కలుషితమైన నీరు, ఆహారం ద్వారా మానవుడి పేగుల్లోకి చేరతాయి. ఇక్కడ గుడ్ల నుంచి ఏలికపాములు బయటకు వస్తాయి. పేగుల్లో అధికసంఖ్యలో ఇవి ఉండటం వల్ల ఆహార కదలికలకు అడ్డుపడటం, కడుపునొప్పి, మలబద్దకం లాంటి లక్షణాలు కలుగుతాయి. ఏలికపాములు చిన్నపేగుల్లోని జీర్ణమైన ఆహారాన్ని తీసుకోవడంవల్ల పిల్లల్లో పోషకాహార లోపం ఏర్పడుతుంది. పరిశుభ్రంగా ఉండటం; ఆహారం, నీరు కలుషితం కాకుండా చూడటం ద్వారా ఈ వ్యాధి రాకుండా చూడొచ్చు.

 

జికా వైరస్‌ వ్యాధి

    జికా వైరస్‌ వ్యాధి జికా వైరస్‌ వల్ల వస్తుంది. ఈ వైరస్‌ను మొదటగా 1947లో ఉగాండాలోని అడవుల్లో గల రీసస్‌ కోతిలో కనుక్కున్నారు. ఈ వ్యాధిని 1954లో నైజీరియాలో గమనించారు. ఈ వ్యాధి అనేక ఆఫ్రికన్‌ దేశాలు, ఆసియాలోని భారత్, ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పైన్స్, థాయ్‌లాండ్, వియత్నాం లాంటి దేశాల్లో కూడా ప్రబలింది. జికా వైరస్‌ వ్యాధిని 2016 ఫిబ్రవరి వరకు 39 దేశాల్లో ఉన్నట్లు గుర్తించారు. దీన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ  (WHO)  ప్రజా ఆరోగ్య అత్యయిక స్థితిగా ప్రకటించింది. ఈ వ్యాధికి కారణమయ్యే వాహకం ఎడిస్‌ ఈజిప్టి, ఎడిస్‌ ఆల్బోపిక్టస్‌ రకం దోమలు.

వ్యాపించే విధానం: ఈ వ్యాధి వైరస్‌ కలిగిన ఆడ ఎడిస్‌ దోమ కాటు వల్ల వస్తుంది. అంతే కాకుండా లైంగికంగా సంక్రమించే అవకాశం ఉందని భావిస్తున్నారు. గర్భిణులకు ఈ వ్యాధి సోకినట్లయితే పుట్టబోయే పిల్లలకు సంక్రమించే అవకాశం ఉంటుంది. ఈ పిల్లలు మైక్రోసెఫాలి (తల చిన్నగా ఉండటం) అనే లక్షణంతో ఉంటారు.

లక్షణాలు: జ్వరం, చర్మంపై దద్దురులు; కండరాలు, కీళ్ల నొప్పులు, తలనొప్పి, కండ్లకలక, జీర్ణకోశ సంబంధ సమస్యలు, గొంతు నొప్పి, దగ్గు, లింఫ్‌ గ్రంథులు ఉబ్బడం లాంటివి ఉంటాయి. 

నిర్ధారణ, చికిత్స: ఈ వ్యాధిలో రక్త నమూనాలను రియల్‌టైమ్‌ పాలిమరేజ్‌ చైన్‌ రియాక్షన్‌  (RT - PCR)  ద్వారా నిర్ధారించవచ్చు. జికా వైరస్‌ వ్యాధికి నిర్దిష్ట చికిత్స లేదు. రోగి లక్షణాలను గమనించి వైద్యం అందిస్తారు. రోగులకు విశ్రాంతి అవసరం. వీరు ఎక్కువగా నీటిని తాగాలి. జ్వరం తగ్గడానికి పారాసిటమల్‌ లాంటి ఔషధాలను ఇవ్వాలి. ఈ వ్యాధి ఒకసారి సోకిన తర్వాత రెండోసారి రాదు.

నివారణ చర్యలు: దోమలు కుట్టకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ వ్యాధి ప్రబలకుండా జాగ్రత్త పడవచ్చు. పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి, వ్యక్తిగత శుభ్రత పాటించాలి. 

 

ఎబోలా వైరస్‌ వ్యాధి 

    ఈ వ్యాధిని ఆఫ్రికాలోని కాంగోలో 1976లో గుర్తించారు. తర్వాత 2013లో గునియా దేశంలో గమనించారు. ఇక్కడి నుంచి ఈ వ్యాధి అనేక దేశాలకు వ్యాపించింది. ఈ వ్యాధి  ఎబోలా వైరస్‌ వల్ల వస్తుంది. ఈ వైరస్‌లో అయిదు ఉపరకాలు ఉన్నాయి. ఫలాలను తినే ఒక రకమైన గబ్బిలం (Fruit bat) ఈ వైరస్‌కు సహజ రిజర్వాయర్‌గా ఉందని భావిస్తున్నారు. ఆఫ్రికా ప్రాంత అడవుల్లో ఉన్న చింపాంజీలు, గొరిల్లా, కోతుల లాంటి జీవులు చనిపోయినప్పుడు లేదా అనారోగ్యంగా ఉన్న వాటిని తాకినప్పుడు ఈ వ్యాధి సంక్రమణ జరిగిందని భావిస్తున్నారు. 

వ్యాపించే విధానం: ఎబోలా వైరస్‌ వ్యాధి ఒకరి నుంచి మరొకరికి స్పర్శ ద్వారా వ్యాపిస్తుంది. వ్యాధిగ్రస్థుడి శరీర ద్రవాలైన రక్తం, మూత్రం, లాలాజలం, కన్నీరు, ముక్కు నుంచి వచ్చే స్రావాల్లో ఈ వైరస్‌ ఉంటుంది. కలుషితమైన సూదుల ద్వారా కూడా ఈ వ్యాధి వ్యాపించవచ్చు. ఈ వ్యాధి పొదిగే కాలం (ఇంక్యుబేషన్‌ పీరియడ్)‌ 2 నుంచి 21 రోజులు.

లక్షణాలు, చికిత్స: వ్యాధిగ్రస్థుడిలో జ్వరం, తీవ్రమైన తలనొప్పి, అలసట, కండరాల నొప్పులు, వాంతులు, డయేరియా, కడుపులో నొప్పి, శరీర అంతర భాగాల్లో  రక్తస్రావం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. చివరగా శరీరంలో అనేక అవయవాలు దెబ్బతింటాయి. ఎబోలా వైరస్‌ వ్యాధిని రియల్‌టైమ్‌ పాలిమరేజ్‌ చైన్‌ రియాక్షన్‌ (RT PCR), యాంటీజెన్,  IgM యాంటీబాడీ గుర్తింపు లాంటి వాటితో నిర్ధారించవచ్చు. ఈ వ్యాధికి నిర్దిష్ట చికిత్స లేదు. రోగి పరిస్థితిని గమనించి చికిత్స చేయాలి. ఎలక్ట్రోలైట్‌ ద్రావణాలను ఇస్తూ ఇతర ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఔషధాలు ఇవ్వాలి. వ్యాధి ప్రబలకుండా ఆరోగ్య కార్యకర్తలు, వైద్యులు ప్రత్యేక రక్షణ చర్యలు చేపట్టాలి. వారు రోగికి వైద్యం చేసేటప్పుడు ప్రత్యేక దుస్తులు ధరించాలి. శరీరాన్ని పూర్తిగా కప్పి ఉండే విధంగా మాస్క్‌లు, చేతి తొడుగులు, ప్రత్యేక పాదరక్షలు వాడాలి.

 

ఆంత్రాక్స్‌ 

    గ్రీకు, రోమన్‌ల కాలం నుంచే ఆంత్రాక్స్‌ వ్యాధిపై అవగాహన ఉంది. 18, 19వ శతాబ్దాల్లో యూరప్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఈ వ్యాధి వల్ల జంతువులు, మానవులు మరణించారు. మానవులు, జంతువులకు సంక్రమించే వ్యాధుల్లో మొదటగా గుర్తించిన వ్యాధికారక సూక్ష్మజీవి ఆంత్రాక్స్‌ బ్యాక్టీరియా. 1876లో రాబర్ట్‌ కోచ్‌ అనే శాస్త్రవేత్త ఈ బ్యాక్టీరియాను పరిశుద్ధ స్థితిలో వేరు చేశారు. 1880లో లూయిస్‌ పాశ్చర్‌ ఈ వ్యాధికి టీకాను అభివృద్ధి చేసి గొర్రెలు, మేకలు, ఆవులకు ఇచ్చారు. వ్యవసాయం, పాడి పశువులు అధికంగా ఉండే ప్రాంతాలైన దక్షిణ అమెరికా, మధ్య అమెరికా, యూరప్, ఆసియా, ఆఫ్రికా దేశాల్లో ఈ వ్యాధి ఎక్కువగా ప్రబలింది. భారతదేశంలో దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లలో దీని వ్యాప్తి ఎక్కువ. 2004లో ఒడిశా, 2000లో పశ్చిమ్‌ బంగ, 1999లో మైసూర్‌లలో ఈ వ్యాధి బయటపడింది. ఆంత్రాక్స్‌ వ్యాధిని మాలిగ్నెంట్‌ ఒడెమా, నూలు వడికే వారికి కలిగే వ్యాధి  (Wool sorter’s disease) అని అంటారు.

వ్యాధి కారకం, వ్యాపించే విధానం: ఈ వ్యాధి బాసిల్లస్‌ ఆంత్రాక్స్‌ అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఇది స్పోరుల రూపంలో ఉంటుంది. ఇవి నేలలో చాలా సంవత్సరాల వరకు ఉంటాయి. స్పోరులు ఉన్న గడ్డి తినడం ద్వారా పశువులకు ఈ వ్యాధి సంక్రమిస్తుంది. ఈ వ్యాధితో చనిపోయిన జంతువుల మాంసాన్ని తినడం, వాటి రక్తం శరీరానికి అంటుకోవడం ద్వారా మానవులకు వ్యాపిస్తుంది. ఉన్ని పరిశ్రమలో పని చేసే వ్యక్తులు ఈ వ్యాధి బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. వ్యాధి వ్యాపించే విధానాన్ని బట్టి ఆంత్రాక్స్‌ వ్యాధిలో అనేక రకాలున్నాయి. అవి...

చర్మం ద్వారా కలిగే ఆంత్రాక్స్‌: ఆంత్రాక్స్‌ బ్యాక్టీరియా గాయం లేదా పగిలిన చర్మం ద్వారా లోపలికి ప్రవేశిస్తుంది. ఈ రకమైన ఆంత్రాక్స్‌ ఎక్కువగా వ్యాపిస్తుంది. 

ఉచ్ఛ్వాసం ద్వారా కలిగే ఆంత్రాక్స్‌: జంతువుల ఉన్ని, చర్మం లాంటి వాటిలో ఉండే స్పోరులు శరీరంలోకి ప్రవేశించి ఈ వ్యాధిని కలిగిస్తాయి.

పేగుల్లో కలిగే ఆంత్రాక్స్‌: ఈ వ్యాధితో మరణించిన జంతువుల మాంసం తినడం వల్ల వస్తుంది.

నిర్ధారణ, చికిత్స: వైద్య పరీక్షా కేంద్రాల్లో బ్యాక్టీరియాలను గుర్తించి, వ్యాధి లక్షణాలను గమనించి ఈ వ్యాధిని గుర్తించవచ్చు. దీనికి పాలిమరేజ్‌ చైన్‌ రియాక్షన్‌  (PCR) పద్ధతి కూడా ఉపయోగపడుతుంది.

నివారించే పద్ధతులు: ఈ వ్యాధితో చనిపోయిన జంతువుల మాంసాన్ని ఆహారంగా తీసుకోరాదు. వ్యాధి కలిగిన జంతువులను చనిపోయిన తర్వాత పూడ్చి పెట్టాలి. నూలు, తోలు పరిశ్రమల్లో పని చేసేవారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. మానవులు, పశువులకు టీకాలు వేయించాలి.

 

కరోనా వైరస్‌ డిసీజ్‌ - 19 (కోవిడ్‌-19)

కోవిడ్‌-19ను కలిగించే వైరస్‌ నావెల్‌ కరోనా వైరస్‌-19 (2019-nCoV), అంటే కొత్తరకం కరోనా వైరస్‌. ఇంటర్నేషనల్‌ కమిటీ ఆన్‌ టాక్సానమీ ఆఫ్‌ వైరసెస్‌ (ICTV) వారు ఈ కొత్తరకం కరోనా వైరస్‌ను SARS -CoV-2గా పిలుస్తున్నారు. ఈ వైరస్‌ ఇంతకుముందు సార్స్‌ వ్యాధిని కలిగించిన కరోనా వైరస్‌ను కొంతవరకు పోలి ఉంది. కరోనా వైరస్‌లో కొత్తరకం లేదా మార్పు చెందిన కరోనా వైరస్‌ ప్రస్తుత వ్యాధికి కారణమవుతుందని భావిస్తున్నారు. ఫిబ్రవరి 11, 2020న ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)  ఈ కరోనా వైరస్‌ కలిగించే వ్యాధికి  COVID19గా పేరు పెట్టింది. అలాగే ఈ వ్యాధిని మహమ్మారిగా ప్రకటించింది.

ఉద్భవం: కరోనా వైరస్‌లలో అనేక రకాలున్నాయి. వీటిలో కొన్ని మనుషుల్లో, మరికొన్ని జంతువుల్లో ఉంటాయి. జంతువుల్లో ఉండే వైరస్‌లు వాటిపై ఎలాంటి ప్రభావాన్ని చూపించవు. కానీ, వాటి నుంచి మానవులకు సంక్రమిస్తే మాత్రం వ్యాధిని కలిగిస్తాయి. ఇలాంటి వాటిని మానవులకు వ్యాధిని కలిగించే కొత్తరకం వైరస్‌లుగా పరిగణిస్తారు. ఉదాహరణకు సాధారణ సార్స్‌ (SARS) వ్యాధిని కలిగించే సార్స్‌- CoV వైరస్‌ 2002లో చైనాలోని పునుగు పిల్లి  (Civet Cat) నుంచి మానవులకు సంక్రమించిందని భావిస్తున్నారు. అలాగే 2012లో సౌదీ అరేబియాలో వెలుగు చూసిన మిడిల్‌ ఈస్ట్‌ రెస్పిరేటరీ సిండ్రోమ్‌ (MERS) ను కలిగించిన వైరస్‌ ఒంటెల నుంచి మానవులకు సంక్రమించిందని భావిస్తున్నారు. ఈ వైరస్‌కు మిడిల్‌ ఈస్ట్‌ రెస్పిరేటరీ సిండ్రోమ్‌ కరోనా వైరస్‌  (MERS - CoV)  అని పేరు పెట్టారు. ప్రస్తుత వైరస్  SARSCoV2‌ చైనాలోని ఊహాన్‌ నగరంలో జంతుమాంసం అమ్మే మార్కెట్‌లోని జంతువుల నుంచి మానవులకు సంక్రమించిందని భావిస్తున్నారు.

నిర్మాణం: ఈ వైరస్‌ గుండ్రంగా ఉంటుంది. దానిపైన గద ఆకారంలో పొడుచుకు వచ్చినట్లుగా ఉండే గ్లైకోప్రొటీన్‌ నిర్మాణాలుంటాయి. దీని మధ్యలో ఒకే పోచ ఉన్న ధనాత్మక  ఆర్‌ఎన్‌ఏ (పాజిటివ్‌సెన్స్‌ - ఆర్‌ఎన్‌ఏ)  ఉంటుంది. ఇది సూర్యుడి కరోనాలా అందంగా కనిపిస్తుంది. కాబట్టి, ఈ వైరస్‌కు కరోనా వైరస్‌ అని పేరు పెట్టారు. 

ఎలా వ్యాపిస్తుంది?: కరోనా వైరస్‌ ఉన్న వ్యాధిగ్రస్థుడు దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు వెలువడే తుంపరలలో వైరస్‌లు ఉంటాయి. వీటిని మనం పీల్చుకున్నప్పుడు వైరస్‌లు నేరుగా మన శరీరంలో ప్రవేశిస్తాయి. రోగి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు వెలువడిన తుంపరలు వస్తువులపై పడతాయి. వీటిని తాకి ఆ చేతులతో కళ్లు, ముక్కు, నోటిని తాకినప్పుడు ఈ వైరస్‌ మన శరీరంలోకి ప్రవేశిస్తుంది. అయితే రోగి నుంచి వెలువడిన వైరస్‌లు గాలిలో 3 గంటలు, ప్లాస్టిక్, చెక్క, రాగి, స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ వంటి వాటిపై 4 గంటల నుంచి 72 గంటల వరకు చైతన్యవంతంగా లేదా వ్యాధిని కలిగించే విధంగా ఉంటాయి.

పొదిగే కాలం (ఇంక్యుబేషన్‌ పీరియడ్‌): వ్యాధికారక సూక్ష్మజీవి మన శరీరంలో ప్రవేశించి వ్యాధి లక్షణాలు కనిపించే వరకూ ఉండే కాలాన్ని పొదిగే కాలం అంటారు. కోవిడ్‌-19లో ఇది 1-14 రోజుల వరకు ఉంటుంది. ఎక్కువ మందిలో ఇది సరాసరి 5 రోజుల వరకు ఉంటుంది. దీని వల్లనే వైద్యులు అనుమానిత వ్యాధిగ్రస్థులను 14 రోజుల పాటు క్వారంటైన్‌ (దిగ్బంధనం)లో ఉండాలని సూచిస్తున్నారు.

వ్యాధి లక్షణాలు: వ్యాధిగ్రస్థుల్లో దగ్గు, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లాంటి లక్షణాలు కనిపిస్తాయి. వ్యాధి ఎక్కువఅయితే న్యుమోనియా కలుగుతుంది.

నిర్ధారణ ఇలా: వ్యాధి లక్షణాలు కనిపించినవారి నుంచి లేదా అనుమానిత వ్యక్తుల గొంతు లేదా ముక్కు భాగాల నుంచి నమూనా (స్వాబ్‌)లను తీసుకొని రాష్ట్రాల్లో ప్రభుత్వం అనుమతి పొందిన పరీక్షా కేంద్రాల్లో (వైరస్‌ రిసెర్చ్‌ అండ్‌ డయాగ్నెస్టిక్స్‌ ల్యాబొరేటరీ) రియల్‌టైమ్‌ పాలిమరేజ్‌ చైన్‌ రియాక్షన్‌ (RT-PCR)  పరీక్ష ద్వారా వ్యాధిని నిర్ధారిస్తారు. ఇవే కాకుండా నమూనాలను  పుణేలోని ఐసీఎంఆర్‌ (ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రిసెర్చ్‌) వారి నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ (NIV)కు పంపి కూడా నిర్ధారిస్తారు.

చికిత్స: వ్యాధి సోకిన వ్యక్తులను వేరుగా గదిలో ఉంచి చికిత్స ప్రారంభిస్తారు. దీనివల్ల వ్యాధి ఇతరులకు వ్యాపించకుండా ఉంటుంది. రోగులకు హైడ్రాక్సి క్లోరోక్విన్, యాంటీవైరల్‌ ఔషధాలైన లువినావిర్, రెమ్‌డెసివిర్‌ లాంటివాటితో చికిత్స చేస్తారు.

 

వ్యాధి ప్రబలకుండా ఏం చేయాలి?

* వ్యాధి సోకిందనే అనుమానిత వ్యక్తులను క్వారంటైన్‌లో ఉంచడం.

* వ్యాధి నిర్ధారణ అయితే వేరుగా గదిలో ఉంచి (ఐసోలేషన్‌) చికిత్స చేయడం.

* దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు చేతిని/చేతి రుమాలును అడ్డు పెట్టుకోవడం.

* అనేక మంది గుమిగూడిన ప్రదేశాలకు సాధ్యమైనంత వరకు వెళ్లకుండా ఉండటం.

* కనీసం 3 అడుగులు/ ఒక మీటరు దూరం పాటించడం.బయటకు వెళ్లేటప్పుడు మాస్కును ధరించడం.

* వ్యాధి ప్రబలంగా ఉన్న ప్రాంతాలకు వెళ్లినప్పుడు అక్కడ ఉన్న వస్తువులను లేదా వైరస్‌ ఉందని భావిస్తున్న వస్తువులను సాధ్యమైనంత వరకు తాకకుండా ఉండటం. ఒకవేళ తప్పనిసరిగా తాకాల్సి వస్తే చేతికి తొడుగులు ధరించాలి.

* రోగి ధరించిన వస్త్రాలను, వాడిన వస్తువులను శాస్త్రీయ పద్ధతిలో ధ్వంసం చేయడం.

* బయట నుంచి వచ్చినప్పుడు, ఆహారం తినేముందు, మలవిసర్జన తర్వాత సబ్బుతో లేదా ఆల్కహాల్‌ ఉన్న శానిటైజర్‌తో చేతులను శుభ్రపరచుకోవాలి.

* వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి.

* చికిత్స కంటే నివారణ మేలు అనే దాన్ని పాటించడం ద్వారా ఈ వ్యాధి రాకుండా చూసుకోవచ్చు.

 

భవిష్యత్తులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

* వైరస్‌ సంహారక ద్రావణాన్ని పిచికారీ చేయడానికి రోబోలను వినియోగించాలి.

* వైరస్‌ ఉన్న వ్యాధిగ్రస్థులను గుర్తించడానికి 5 నుంచి 10 నిమిషాల్లో ఫలితం ఇవ్వగల వ్యాధినిర్ధారణ కిట్‌లను అభివృద్ధి చేయడం.  

* సమతుల ఆహారం తీసుకోవడం ద్వారా వ్యాధి నిరోధకతను పెంపొందించుకోవడం. దీని ద్వారా వైరస్‌ శరీరంలోకి ప్రవేశించినా దాని హాని తీవ్రత తగ్గుతుంది.

* వ్యాధిగ్రస్థుల చికిత్స కోసం కోవిడ్‌ 19 ప్రత్యేక ఆసుపత్రులను శాశ్వతంగా నిర్మించడం.

* వైరస్‌ వ్యాప్తి నిరోధించడానికి వైరస్‌ ఉన్న వ్యక్తులను బయటకు వెళ్లకుండా నియంత్రించడానికి ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించినవారిపై చట్ట ప్రకారం చర్యలు చేపట్టడం.

* ప్రస్తుతమున్న అంటువ్యాధుల నివారణ చట్టం 1897 (ఎపిడమిక్‌ డిసీజ్‌ యాక్ట్‌)తో పాటుగా మరింత కఠినమైన చట్టాలను తేవడం.

 

కరోనా వైరస్‌ - రకాలు

కరోనా వైరస్‌ కరోనా విరిడే కుటుంబానికి చెందినది. దీనిలో అనేక రకాలున్నాయి. వీటిని ఆల్ఫా, Äబీటా, గామా, డెల్టా ఉపరకాలుగా విభజించారు. మానవుడిలో కేవలం 7 రకాలు మాత్రమే వ్యాధిని కలిగిస్తాయి. అవి

i) 229 E (ఆల్ఫా కరోనా వైరస్‌)

ii) NL63 (ఆల్ఫా కరోనా వైరస్‌)

iii) OC43 (బీటా కరోనా వైరస్‌)

iv) HKUI (బీటా కరోనా వైరస్‌) - ఈ నాలుగు  రకాలే ఎక్కువగా మానవుడికి సంక్రమిస్తాయి.

v) SARS-CoV (బీటా కరోనా వైరస్‌) - ఇది సార్స్‌ వ్యాధిని కలిగిస్తుంది.

vi) MERS-CoV (బీటా కరోనా వైరస్‌) - ఇది మిడిల్‌ ఈస్ట్‌ రెస్పిరేటరీ సిండ్రోమ్‌ను కలిగిస్తుంది.

vii) SARS - CoV2 (కొత్త రకం కరోనా వైరస్‌) - ఇది కోవిడ్‌-19 ను కలిగిస్తుంది.

 

పరిశోధనలు..చేపట్టాల్సిన చర్యలు

* చికిత్సకు సమర్థవంతమైన విధానాన్ని అభివృద్ధి చేయడం.

* వ్యాధిపై పూర్తి అవగాహనకు ప్రపంచ దేశాలన్నీ కలసికట్టుగా కృషి చేయడం. వ్యాధి గురించిన సమగ్ర సమాచారాన్ని క్రోడీకరించడం.

* వివిధ వయసులవారికి వ్యాధి కలిగించే ప్రభావం, వారిలో కలిగిన లక్షణాలను గమనించడం.

* ఈ వ్యాధికి సమర్థవంతమైన, వివిధ రకాలుగా పనిచేసే వ్యాక్సిన్‌లను అభివృద్ధి చేయడం.

* CoV-2వైరస్‌ పూర్తి జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ను పూర్తి చేయడం. చైనా శాస్త్రవేత్తలు ఇప్పటికే దీన్ని పూర్తిచేశారు. వివిధ పరిశోధనాశాలలు మరింత లోతుగా జీనోమ్‌ విశ్లేషణ చేస్తున్నాయి.

* మన శరీరంలో వైరస్‌ను ఎదుర్కొనే, వైరస్‌ సంఖ్య వృద్ధి చెందకుండా ఉండేందుకు శక్తిమంతమైన ఔషధాన్ని తయారు చేయడం.

*  I.T. ఉపయోగించి వ్యాధి వ్యాపించకుండా కట్టడి చేయడం. 

* సామాజిక మాధ్యమాలను వినియోగించుకొని సాధారణ ప్రజలకు వ్యాధిపట్ల అవగాహనను, వ్యాధి సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేయడం.

* వ్యాధి వేగంగా ప్రబలితే దీన్ని నియంత్రించడానికి అవసరమయితే ప్రత్యేక చట్టాలను చేయడం లేదా పాత చట్టాలను సవరించడం.
 

 


Posted Date : 14-04-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌