• facebook
  • whatsapp
  • telegram

కరవు

పట్టి పీడించే కాటకం!

 

కావాల్సినంత కురవని వర్షం, బీటలు వారిన భూములు, అడుగంటిన చెరువులు, ఎండిపోయిన పంటలు, నిస్సారమైన నేలలు, వీటి ప్రభావంతో వస్తుసేవలు అందక జనం పడే ఇబ్బందులు. ఇదే విపత్తు. సమాజ పురోగతిని కుంగదీసే ప్రకృతి విపరిణామం. ఇలాంటి కాటక పరిస్థితులు ఎందుకు ఏర్పడతాయి? నివారించే మార్గాలు ఏమిటి? తదితర అంశాలను ‘విపత్తు నిర్వహణ’ అధ్యయనంలో భాగంగా పరీక్షార్థులు తెలుసుకోవాలి.

  

 

ఒక భౌగోళిక ప్రాంతంలో సాధారణ పరిస్థితులకు భిన్నంగా కొంతకాలం వరకూ పూర్తిగా వర్షం లేకపోవడం లేదా అల్ప వర్షపాతం ఉండవచ్చు. ఇది శీతోష్ణస్థితి సాధారణ లక్షణం. దీనివల్ల నీరు, ఆహారం, పశుగ్రాసం కొరత ఏర్పడటం, ఉపాధి అవకాశాలు కొరవడటం వంటి సమస్యలు తలెత్తుతాయి. ఈ పరిస్థితినే కరవు లేదా దుర్భిక్షం అని పిలుస్తారు. ఈ వైపరీత్యంతో వ్యవసాయదారులతోపాటు మొత్తం సమాజం కూడా ఇబ్బందులకు గురవుతుంది. 


ప్రధాన కారణాలు: 

* దేశంలో రుతుపవనాలు అసమానంగా విస్తరించడం.

* మానవ అభివృద్ధి వల్ల వృక్షసంపద దెబ్బతిని నీరు భూమిలో ఇంకకపోవడం.

* అధిక జనాభా వల్ల నీటివనరులపై ఒత్తిడి పెరగడం.

* పట్టణీకరణ పెరగడంతో నీటి నిల్వ ప్రాంతాలు, నీటివనరుల పరీవాహక ప్రదేశాలు ఆక్రమణకు గురవడం.

* నీటి అవసరాలు, నిర్వహణ గురించి ప్రజలకు సరైన అవగాహన లేకపోవడం.

 

నాలుగు రకాలు

భారత వ్యవసాయ కమిషన్‌ కరవును నాలుగు రకాలుగా విభజించింది.

వాతావరణ సంబంధ కరవు: ఒక ప్రదేశంలో సాధారణం కంటే చాలా తక్కువ వర్షపాతం నమోదైనప్పుడు సంభవించే కరవును వాతావరణ సంబంధ కరవుగా పేర్కొనవచ్చు. ఇలాంటి కరవు కారణంగా మిగతా కరవులు ఏర్పడతాయి. ఇది అన్ని కరువుల్లోనూ అతి తీవ్రమైంది.


జల సంబంధ కరవు: చాలాకాలం పాటు ఏర్పడే వాతావరణ కరవు కారణంగా భూఉపరితలంపైన, భూగర్భంలో నీటివనరుల లభ్యత తగ్గిపోవడాన్ని జలసంబంధ కరవుగా నిర్వచించవచ్చు.


వ్యవసాయ సంబంధ కరవు: జలసంబంధ కరవు ఎక్కువ కాలం కొనసాగితే మృత్తికల్లో తేమ తగ్గిపోయి మొక్కలు, పంటలు ఆరోగ్యకరమైన పెరుగుదలకు తోడ్పడలేని స్థితిని వ్యవసాయ సంబంధ కరవుగా భావించవచ్చు.


సామాజిక - ఆర్థిక కరవు: పై మూడు రకాల కరవులతో పాటు వస్తువులు, సేవల సరఫరా డిమాండ్‌పైన ప్రభావం చూపడాన్ని సామాజిక - ఆర్థిక కరవుగా పిలుస్తారు. ఇది సమాజంలోని ప్రతి వ్యక్తిపైనా ప్రభావం చూపుతుంది.


ఎలా కొలుస్తారు?


1) కరవు ఆరంభం: ఒక ప్రదేశంలో సాధారణ వర్షపాతంలో 25 శాతం తగ్గడం లేదా ఉండాల్సిన వర్షపాతంలో 75 శాతం వరకే నమోదైతే కరవు మొదలైనట్లు పరిగణిస్తారు.


2) మిత కరవు: సాధారణ వర్షపాతంలో 26% నుంచి 50% వరకు తగ్గడం లేదా ఉండాల్సిన వర్షపాతంలో 50% వరకు మాత్రమే కురిస్తే మిత కరవుగా పిలుస్తారు.


3) తీవ్ర కరవు: సాధారణ వర్షపాతంలో 50% కంటే తగ్గితే తీవ్ర కరవుగా వ్యవహరిస్తారు. మన దేశంలో వాయవ్య ప్రాంతంలో బలహీన రుతుపవనాల వల్ల, పర్యావరణం దెబ్బతినడంతో అతి తీవ్ర కరవు పరిస్థితులు ఏర్పడుతుంటాయి.


ప్రపంచ స్థితిగతులు


* ప్రపంచవ్యాప్తంగా జరిగే మొత్తం సహజ విపత్తుల్లో కరవు ద్వారా వచ్చే విపత్తు వాటా 19 శాతం ఉంటుంది. మొత్తంగా చూస్తే కరవు విపత్తు 3వ స్థానంలో ఉంది (మొదటి స్థానం వరదలు - 30%, రెండో స్థానం తుపాన్లు - 21%).

* ఐక్యరాజ్యసమితికి చెందిన యునైటెడ్‌ నేషన్స్‌ ఆఫీస్‌ ఫర్‌ డిజాస్టర్‌ రిస్క్‌ రిడక్షన్‌ (యూఎన్‌డీఆర్‌ఆర్‌- జెనీవా) నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా అన్నిరకాల సహజ విపత్తు మరణాల్లో కరవు, దుర్భిక్షం వల్ల అత్యధికంగా 45%, ఆ తర్వాత వరదల కారణంగా 16% మరణాలు సంభవిస్తున్నాయి.

* వరల్డ్‌ బ్యాంక్, యూఎన్‌ఓ సంయుక్తంగా విడుదల చేసిన సహజ వైపరీత్యాలు, అసహజ వైపరీత్యాల నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా అధిక శాతం సంభవించే విపత్తులు వరదలు, తుపాన్లు. అయితే ఆఫ్రికా దేశాల్లో మాత్రం కరవు తరచూ సంభవిస్తుంది.  

 

భారత్‌లో కరవు పరిస్థితులు

ఏటా దేశంలో 5 కోట్ల మంది ప్రజలు కరవు ప్రభావానికి గురవుతున్నారు. మొత్తం 640 జిల్లాల్లో 191 జిల్లాలు తీవ్ర కరవు ముప్పు ఎదుర్కొంటున్నాయి. దేశంలో మొత్తం వ్యవసాయ భూమిలో 68% భూమి క్షామం బారిన పడుతోంది. ఇది దేశం మొత్తం భూమిలో 16%. శుష్క, అర్ధశుష్క మండలాల్లో దాదాపు 8-9 ఏళ్లకు ఒకసారి తీవ్ర, అసాధారణ కరవు ఏర్పడుతోంది. కొన్ని రాష్ట్రాల్లో కరవు ఏటా సర్వసాధారణం.

ఉదా: రాజస్థాన్‌లో అత్యధిక ప్రాంతాల్లో 2000, 2001, 2002, 2003లలో వరుసగా నాలుగేళ్లు కరవు తాండవించింది.


కరవు తీవ్రత ఆధారంగా భారత వ్యవసాయ కమిషన్‌ దేశాన్ని అయిదు ప్రాంతాలుగా విభజించింది.


1. వాయవ్య భారతదేశం: రాజస్థాన్‌ తూర్పు, పశ్చిమ ప్రాంతాలు; గుజరాత్‌లోని సౌరాష్ట్ర, కచ్‌ ప్రాంతాలు; పంజాబ్, హరియాణా, చండీగఢ్, దిల్లీ ప్రాంతాలను ఇందులో చేర్చారు. ఇది దేశంలో ఎక్కువగా కరవు ఎదుర్కొనే ప్రాంతం.


2. పశ్చిమ, మధ్య భారతదేశం: మహారాష్ట్రలోని మరట్వాడా, విదర్భ, ఉత్తర కర్ణాటక, మధ్యప్రదేశ్‌లోని తూర్పు, పశ్చిమ భాగాలు; కొంకణి, గోవా ప్రాంతాలు, తెలంగాణ ఇందులో ఉన్నాయి.


3. ద్వీపకల్ప భారతదేశం: ఆంధ్రప్రదేశ్, దక్షిణ కర్ణాటక, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి ప్రాంతాలు.


4. మధ్య ఈశాన్య భారతదేశం: ఝార్ఖండ్, బిహార్, ఒడిశా, ఉత్తర్‌ప్రదేశ్‌లో తూర్పు, పశ్చిమ భాగాలు.


5. ఈశాన్య భారతదేశం: అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపుర్, మిజోరం, త్రిపుర, హిమాలయాల దిగువనున్న పశ్చిమ బెంగాల్, సిక్కిం ప్రాంతాలు.

 

దేశంలో భూగర్భ జలాల వినియోగం ఆధారంగా రెండు ప్రాంతాలుగా విభజించారు.

డార్క్‌ జోన్‌: దేశంలో 40% ప్రాంతాన్ని డార్క్‌ జోన్‌గా ప్రకటించారు. ఈ ప్రాంతంలో భూగర్భ జలాలను 50% కంటే ఎక్కువగా తోడేశారు.

ఉదా: రాజస్థాన్‌లోని సరిష్కా జాతీయ పార్కు ప్రాంతం.

గ్రే జోన్‌ ప్రాంతం: దేశంలో 30% ప్రాంతం గ్రే జోన్‌లో ఉంది. ఈ ప్రాంతంలో భూగర్భ జలాలను అక్కడి వర్షపాతం కంటే ఎక్కువ పరిమాణంలో తోడేస్తుంటారు.

 

కరవు తీవ్రతను తగ్గించే చర్యలు: * వర్షం నీటిని సరైన మార్గాల్లోకి మళ్లించే విధానాలు (వాటర్‌ హార్వెస్టింగ్‌) పాటించాలి.

* దేశంలో ఉత్తర భారత నదులను, దక్షిణ భారత నదులను కాల్వల ద్వారా అనుసంధానించాలి.

* గుజరాత్‌లో ఝలరా, రాజస్థాన్‌లోని బోలిస్‌ లాంటి మెట్ల బావుల విధానం, చెరువుల నిర్మాణం లాంటి సంప్రదాయ జలసంరక్ష పద్ధతులను ప్రోత్సహించాలి.

* ప్రజల్లో కరవుపై అవగాహన కల్పించాలి.

* వర్షపాతం, జలాశయాలు, సరస్సులు, నదులు లాంటి వాటిలో నీటి లభ్యతను గమనిస్తూ సరైన నీటి పర్యవేక్షణ చేపట్టాలి.

* పొలాల నుంచి వృథాగా పోతున్న నీటిని వ్యవసాయ కుంటల్లాంటి ఉమ్మడి జలాశయాల్లోకి చేరేలా చూడాలి.

* ముందుగానే కరవు ప్రణాళికను తయారు చేసుకోవాలి.

* కరవు ప్రాంతంలో జీవనోపాధి ప్రణాళికలు, పంటల బీమా పథకాలు అమలు చేయాలి.


మాదిరి ప్రశ్నలు


1. అంతర్జాతీయ మెట్ట ప్రాంత పంటల పరిశోధన కేంద్రం ఎక్కడ ఉంది?

1) హైదరాబాద్‌     2) బెంగళూరు     3) ఇందౌర్‌     4) కోల్‌కతా

జ: హైదరాబాద్‌

 

2. ఝలరా, బోలిస్‌ అనే సంప్రదాయ నీటి సంరక్షణ విధానాలు కింది వాటిలో దేనికి చెందుతాయి? 

1) చెరువులు    2) మెట్ల బావులు    3) ఆనకట్టలు    4) నీటి కాలువలు

జ: మెట్ల బావులు

 

3. ఇంటి పైకప్పు నుంచి జారే వర్షపు నీటిని నిల్వ చేసుకోవడం దేనికి ఉదాహరణ?

1) వాటర్‌షెడ్‌ విధానం       2) రైన్‌ షాడో విధానం

3) రైన్‌ ప్రిసిపిటేషన్‌ విధానం      4) వాటర్‌ హార్వెస్టింగ్‌ విధానం

జ: వాటర్‌ హార్వెస్టింగ్‌ విధానం

 

4. భారతదేశ వ్యవసాయ భూమిలో కరవు భూమి ఎంత?

1) 38%      2) 68%      3) 48%      4) 28%

జ:  68%

 

5. భూగర్భ జలాలను 50% కంటే ఎక్కువగా వాడేసే ప్రాంతాలను ఏ జోన్‌గా నిర్ణయించారు?

1) డార్క్‌ జోన్‌     2) గ్రే జోన్‌     3) ఎల్లో జోన్‌      4) రెడ్‌ జోన్‌

జ: డార్క్‌ జోన్‌

 

6. సాధారణ వర్షపాతంలో ఎంత శాతం తగ్గితే కరవుగా భావిస్తారు? 

1) 25% వరకు    2) 50% వరకు    3) 75% వరకు    4) 10% వరకు

జ: 50% వరకు

 

7. ప్రపంచ సహజ విపత్తుల్లో కరవు విపత్తు వాటా ఎంత?

1) 50%      2) 19%      3) 5%          4) 80%

జ: 19%

 

8. మహారాష్ట్రలో రాలెగావ్‌ సిద్ధి గ్రామంలో కరవును పారదోలిన అనుసంధానకర్త, సామాజిక కార్యకర్త ఎవరు?

1) అన్నాహజారే     2) రాజేంద్రసింగ్‌      3) మేధాపాట్కర్‌      4) పాలేకర్‌

జ: అన్నాహజారే

 

9. దేశంలో కరవు తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతం.

1) మధ్య భారతదేశం        2) ఈశాన్య భారతదేశం

 3) వాయవ్య భారతదేశం       4) హిమాలయ ప్రాంతం

జ: వాయవ్య భారతదేశం
 

10. భారత వ్యవసాయ పరిశోధనా మండలి కేంద్ర కార్యాలయం ఎక్కడ ఉంది?

1) దిల్లీ      2) ముంబయి      3) బెంగళూరు      4) కోల్‌కతా

జ: దిల్లీ

రచయిత: జల్లు సద్గుణరావు

Posted Date : 16-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌