• facebook
  • whatsapp
  • telegram

అటవీ సంపద

తెలంగాణ తల్లికి హరిత హారం
 

      అడవులు ఏ రాష్ట్రానికైనా ఆస్తులు. ఆదాయాన్నివ్వడమే కాకుండా ఎన్నో రకాల ప్రయోజనాలు కూడా చేకూరుస్తాయి. అడవులను పరిరక్షించడంతో పాటు, విస్తీర్ణాన్ని పెంచితే ఎన్నో విధాలుగా దోహదపడతాయి. ఈ దిశగా తెలంగాణ రాష్ట్రం ముందుకు వెళుతోంది. ప్రత్యేక పథకాలను అమలు చేస్తూ అటవీ విస్తీర్ణం పెంపునకు ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తోంది. తెలంగాణలో అటవీ విస్తీర్ణం.. ఆదాయం.. అమలు చేస్తున్న పథకాలు.. ఈదిశగా ప్రభుత్వ కృషి.. తదితర విశేషాలు టీఎస్‌పీఎస్సీ అభ్యర్థుల కోసం..
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో అటవీ వనరులు ప్రధాన పాత్ర పోషిస్తాయి. పర్యావరణ పరిరక్షణకు, గ్రామీణ పేదల జీవనోపాధికి, భూతాపం తగ్గించడానికి, భూసార పరిరక్షణకు ఇవి దోహదం చేస్తాయి. 2014-15లో రాష్ట్ర స్థూల ఆదాయంలో అటవీ సంపద, కలప 0.9 శాతం వాటాను ఆక్రమించాయి. జీఎస్‌డీపీలో వ్యవసాయరంగంలో అటవీ సంపద వాటా 5.02 శాతం.
తెలంగాణ రాష్ట్రం మొత్తం భౌగోళిక విస్తీర్ణం 1,14,865 చ.కి.మీ.లు. ఇందులో 27.43 లక్షల హెక్టార్లలో (23.89 శాతం) అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. 25.46 శాతం సామాజిక వనాలతో హరిత విస్తీర్ణంలో దేశంలో 12వ స్థానంలో నిలిచింది. రిజర్వ్‌డ్ అటవీ ప్రాంతం 21,024 చ.కి.మీ.లు, రక్షిత అడవులు 7,468 చ.కి.మీ.లు కాగా 750 చ.కి.మీ.లు అవర్గీకృత భూభాగం. 2014 డిసెంబరు నాటికి అటవీ ఉత్పత్తుల ద్వారా రాష్ట్రానికి రూ.54.16 కోట్ల ఆదాయం సమకూరింది.
తెలంగాణలో 2,939 రకాల వృక్ష జాతులు, 365 పక్షి జాతులు, 103 రకాల క్షీరదాలు, 28 రకాల సరీసృపాలు, 21 రకాల ఉభయచర జాతులు, ఇతర వైవిధ్య చెట్టుచేమలు, జీవరాశితో కూడిన ప్రకృతి తెలంగాణకు గొప్ప వరం. రాష్ట్రంలో గోదావరి తీరం వెంబడి టేకు వృక్షాలతోపాటు ఏగిస, నల్లమద్ది, రోజ్‌వుడ్, నరేపా, వెదురు తదితర రకాల వృక్షాలున్నాయి. రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణకు.. ప్రభుత్వం ప్రజల భాగస్వామ్యంతో పర్యావరణ పరిరక్షణలో భాగంగా సామాజిక వనాల అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రారంభించింది.

 

హరితహారం
రాష్ట్ర అటవీ విస్తీర్ణాన్ని 33 శాతానికి పెంచాలనే ఉద్దేశంతో రూపుదిద్దుకున్న పథకమే హరితహారం. 2015, జులై 3న రంగారెడ్డి జిల్లాలో దీన్ని ప్రారంభించారు. అడవుల పునరుద్ధరణ, అగ్నిప్రమాదాల నిరోధం, వాటర్‌షెడ్ల ద్వారా తేమను పెంచడం ఈ పథకం ప్రధాన లక్ష్యాలు. పథకంలో భాగంగా వచ్చే మూడేళ్లలో 230 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వీటిలో 130 కోట్ల మొక్కలను నోటిఫైడ్ అటవీ ప్రాంతాల వెలుపల, 10 కోట్ల మొక్కలను హెచ్ఎండీఏ పరిధిలోనూ, మిగతా మొక్కలను రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో నాటాలని నిర్ణయించారు.

 

2009 నుంచి కాంపా..
తెలంగాణలో కాంపన్సేటరీ అఫారెస్టేషన్ ఫండ్ మేనేజ్‌మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీ (కాంపా) కార్యకలాపాలు 2009 నుంచి అమల్లో ఉన్నాయి. కాంపాను భారత ప్రభుత్వ పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ నెలకొల్పింది. అటవీ భూములను అటవీయేతర ప్రయోజనాలకు మళ్లించినప్పుడు ఏర్పడే నష్టాన్ని భర్తీ చేయడానికి వన పోషణ, వన పునరుజ్జీవ కార్యక్రమాలను అభివృద్ధి చేయడం కాంపా ప్రధాన ఉద్దేశం.
తెలంగాణలో 2009-10 నుంచి 2013-14 వరకు కాంపా కింద రూ.233.125 కోట్ల వ్యయం చేశారు. 2014-2015లో రూ.101.95 కోట్లు కేటాయించారు. 2014 డిసెంబరు నాటికి రూ.45.11 కోట్లు ఖర్చు చేశారు.

 

జీవవైవిధ్య పరిరక్షణ
తెలంగాణలో అరుదైన చెట్టుచేమ, పర్యావరణ వ్యవస్థ ఉంది. జీవ వైవిధ్య పరిరక్షణకు 12 ప్రాంతాలను అరక్షిత ప్రాంతాలుగా ప్రకటించారు. వీటిలో 9 వన్యప్రాణి, 3 జాతీయ వన్యప్రాణి నిలయాలు. వీటి మొత్తం విస్తీర్ణం 5,692.48 చ.కి.మీ.లు. రాష్ట్ర అటవీ విస్తీర్ణంలో ఇది 19.73 శాతం. మంజీరా వన్యప్రాణి ఆశ్రయంలో అంతరించిపోతున్న మంచి మొసళ్లు (మార్ష్) ఉన్నాయి.

 

పులుల సంరక్షణ
రాష్ట్రంలో పులుల సంరక్షణకు 2 టైగర్ రిజర్వ్‌లు ఉన్నాయి. వీటిలో ఒకటి అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ కాగా రెండోది కవ్వాల్ టైగర్ రిజర్వ్. అమ్రాబాద్ రిజర్వ్ మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల్లోని నల్లమల అడవుల్లో విస్తరించి ఉంది. కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఆదిలాబాద్ సరిహద్దులో ఉంది.

 

జీవ వైవిధ్య బోర్డు
రాష్ట్రంలో జీవ వైవిధ్య రక్షణకు 2014లో తెలంగాణ రాష్ట్ర జీవ వైవిధ్య బోర్డు (టీఎస్‌బీడీబీ)ను ఏర్పాటు చేశారు. ఏటా ఇది మే 22న అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. అవగాహన కార్యక్రమాలను చేపడుతోంది. తెలంగాణ వ్యాప్తంగా 10 జిల్లాల్లోని 66 మండలాల్లో 170 జీవ వైవిధ్య నిర్వహణ కమిటీలను ఏర్పాటు చేశారు. ప్రతి జిల్లాలోనూ జీవ వైవిధ్య పార్కులను అభివృద్ధి చేసి అవగాహన కల్పించాలని జీవ వైవిధ్య బోర్డు ప్రతిపాదించింది. (పట్టిక-1 చూడండి)
* తెలంగాణ రాష్ట్ర ఆదాయంలో అటవీ సంపద ఆదాయాల్లో హెచ్చుతగ్గులున్నప్పటికీ క్రమంగా పెరుగుదల నమోదైంది.
* రాష్ట్ర దశాబ్ద కాలం ఆదాయంలో అత్యధికంగా 2014-15లో పొందవచ్చని అంచనా. (రూ. 1994 కోట్లు)
* దశాబ్ద కాలంలో ప్రాథమిక రంగంలో అటవీ సంపద వాటా ఎక్కువగా ఉన్న కాలం 2006-07. ఈ సంవత్సరంలో 8.83% అత్యధిక వాటా పొందింది. (పట్టిక-2 చూడండి)
* తెలంగాణ రాష్ట్రంలో 2010-11లో అటవీ సంపద వృద్ధి రేటు అత్యధికంగా 4.12 శాతంగా నమోదైంది. (పట్టిక-3 చూడండి)


                               

Posted Date : 10-09-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌