• facebook
  • whatsapp
  • telegram

భారతదేశ నదీ వ్యవస్థ

సాధారణంగా ఎత్తయిన ప్రదేశాల్లో పుట్టి, మైదానాల ద్వారా పయనిస్తూ చివరకు సరస్సులు లేదా సముద్రాల్లో కలిసే మంచినీటి ప్రవాహాలను నదులు అంటారు.

ప్రధాన నది తన ప్రవాహ మార్గంలో చిన్న చిన్న సెలయేర్లు, వాగులు, వంకలు, గెడ్డలు, ఉపనదులను కలుపుకుంటూ ప్రవహిస్తూ ఉంటుంది. ఈ మొత్తం పరివాహక  వ్యవస్థను నదీ వ్యవస్థ(River System) అంటారు.   

నది పుట్టిన ప్రదేశాన్ని నది ముఖద్వారం (River Mouth) అని, ప్రవహించే మార్గాన్ని నది ప్రవాహ మార్గం (River Course) అని పిలుస్తారు.

నదుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ‘పొటమాలజీ’ అంటారు.

ఏటా మార్చి 22న ప్రపంచ నీటి దినోత్సవాన్ని, సెప్టెంబరు 28న ప్రపంచ నదీ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.

ప్రపంచంలోని తొలి నాగరికతలన్నీ నదీ పరివాహక ప్రాంతాల్లోనే అభివృద్ధి చెందాయి.

 ఏ దేశంలోనైనా సారవంతమైన డెల్టాలు ఏర్పడటానికి, వ్యవసాయ అభివృద్ధికి, పారిశ్రామిక, రవాణా, విద్యుదుత్పత్తికి పరిపుష్టమైన నదీ వ్యవస్థ అవసరం.

ప్రపంచంలోని ప్రధాన నదులన్నీ ముఖ్యంగా హిమాలయాలు (ఆసియా), రాఖీ (ఉత్తర అమెరికా), ఆండీస్‌ (దక్షిణ అమెరికా), ఆల్ఫ్స్‌ (యూరప్‌) పర్వత ప్రాంతాల్లో పుట్టి ప్రవహిస్తున్నాయి.  

మనదేశంలో నదుల పరిమాణం లేదా నదీ పరివాహక ప్రాంతం ఆధారంగా వాటిని మూడు రకాలుగా వర్గీకరించారు. అవి:

1. ప్రధాన నదులు (Major rivers)

2. మధ్యతరహా నదులు(Medium rivers)

3. చిన్నతరహా నదులు (Small rivers) 

ప్రధాన నదులు 

20,000 చ.కి.మీ. లేదా అంతకంటే ఎక్కువ పరివాహక లేదా జలగ్రహణ ప్రాంతాన్ని(Catchment area) కలిగి ఉన్న నదులను ప్రధాన నదులు అంటారు.

ఇలాంటి ప్రధాన నదులు మనదేశంలో 14 వరకు ఉన్నాయి. అవి: గంగ, సింధు, బ్రహ్మపుత్ర, నర్మద, తపతి, మహి, సబర్మతి, మహానది, గోదావరి, కృష్ణ, పెన్నా, కావేరి, సువర్ణరేఖ, బ్రాహ్మణి.

దేశంలోని మొత్తం నదీజల ప్రవాహంలో ఈ నదులు దాదాపు 85% నీటిని కలిగి ఉన్నాయి.

 

మధ్యతరహా నదులు 


20,000 నుంచి 2000 చ.కి.మీ. పరివాహక ప్రాంతాన్ని కలిగి ఉన్న నదులను మధ్యతరహా నదులు అంటారు. ఈ తరహా నదులు మనదేశంలో 49 ఉన్నాయి.

దేశంలోని మొత్తం నదీజల ప్రవాహంలో ఈ నదులు దాదాపు 7% నీటిని కలిగి ఉన్నాయి.

 

చిన్నతరహా నదులు 

2000 చ.కి.మీ. కంటే తక్కువ పరివాహక ప్రాంతాన్ని కలిగి ఉన్న నదులను చిన్నతరహా నదులు అంటారు. ఇవి దేశంలో 196  ఉన్నాయి.

దేశంలోని మొత్తం నదీజల ప్రవాహంలో ఈ నదులు సుమారు 8% నీటిని కలిగి ఉన్నాయి.

 

సముద్రంలో కలిసే మార్గం ఆధారంగా వర్గీకరణ


నదులు సముద్రంలో కలిసే మార్గాన్ని ఆధారంగా చేసుకుని దేశంలో నదులను రెండు రకాలుగా వర్గీకరించారు. అవి: 

1. బంగాళాఖాతంలో కలిసే నదీ వ్యవస్థ 

2. అరేబియా సముద్రంలో కలిసే నదీ వ్యవస్థ

సముద్రంలో కలిసే నదీజలాల్లో దాదాపు 90% బంగాళాఖాతంలో, 10% అరేబియా సముద్రంలో కలుస్తున్నాయి.

ఉద్భవ రీత్యా వర్గీకరణ 

పుట్టిన ప్రదేశం ఆధారంగా నదులను నాలుగు రకాలుగా వర్గీకరించారు. అవి:

1. హిమాలయ నదీ వ్యవస్థ

2. ద్వీపకల్ప నదీ వ్యవస్థ

3. అంతర్‌ భూభాగ నదీ వ్యవస్థ

4. పరస్థానీయ/ ఎక్సోటిక్‌ నదీ వ్యవస్థ

 

హిమాలయ నదీ వ్యవస్థ - లక్షణాలు


ఈ నదులు సంవత్సరం మొత్తం నీటిని కలిగి ఉంటాయి. వీటిని జీవనదులు అంటారు.

ఈ నదుల్లో కొన్ని పూర్వవర్తిత రకానికి చెందినవి. అంటే ఇవి హిమాలయాల కంటే ముందే ఆ ప్రాంతంలో ఆవిర్భవించాయి.
ఉదా: సింధు, సట్లెజ్, బ్రహ్మపుత్ర

మరికొన్ని అంతర్‌వర్తిత రకానికి చెందినవి. అంటే హిమాలయాల ఆవిర్భావం తర్వాత జన్మించాయి. ఉదా: గంగ, రామ్‌గంగ, యమున మొదలైనవి.

వీటికి వయసు తక్కువ.

ప్రవాహ మార్గంలో నదీ వక్రతలను కలిగి ఉంటాయి.

ఇవి శాఖీయుత రూపాన్ని కలిగిఉంటాయి. అంటే వివిధ శాఖలు, ఉపశాఖలుగా కనిపిస్తాయి


రకాలు


హిమాలయ నదీ వ్యవస్థలో ప్రధానంగా మూడు రకాలు ఉన్నాయి. అవి:

1. సింధూ నదీ వ్యవస్థ 

2. గంగా నదీ వ్యవస్థ

3. బ్రహ్మపుత్ర నదీ వ్యవస్థ

 

సింధూ నదీ వ్యవస్థ


సింధూ నది, దాని ఉపనదులు, వాటి మొత్తం పరివాహక వ్యవస్థను సింధూ నదీ వ్యవస్థగా పేర్కొంటారు.


 సింధూ నది టిబెట్‌లోని కైలాష్‌ పర్వతాల్లోని మానస సరోవరం వద్ద ఉన్న ‘గర్తాంగ్‌ చూ’ హిమనీ నదం వద్ద జన్మించింది.


అక్కడి నుంచి టిబెట్‌ మీదుగా జమ్మూ-కశ్మీర్‌లోని ‘థాంచోక్‌’ వద్ద భారతదేశంలోకి ప్రవేశించి, సింధూ తర్బల మైదానం నుంచి పాకిస్థాన్‌లోకి ప్రవహిస్తుంది. చివరకు పాకిస్థాన్‌లోని కరాచీ సమీపంలో అరేబియా సముద్రంలో కలుస్తోంది.


సింధూ నది మొత్తం పొడవు 2,880 కి.మీ. ఇది భారతదేశంలో 1,114 కి.మీ. పొడవున జస్కార్‌ (లద్దాఖ్‌) పర్వత శ్రేణుల మధ్య ప్రవహిస్తోంది.


దీని మొత్తం పరివాహక ప్రాంతం దాదాపు 3,21,000 చ.కి.మీ.


సింధూ నది అరేబియా సముద్రంలో కలిసే నదుల్లో అతిపెద్దది, పొడవైంది.


ఇది చైనా, భారత్, పాకిస్థాన్‌ల మీదుగా ప్రవహిస్తోంది.


సింధూ నదిని పర్షియా భాషలో హిందూ అని, గ్రీకు భాషలో సింధోస్‌ అని, లాటిన్‌ భాషలో ఇండస్‌ అని పిలుస్తారు.


సింధూ నది పేరు మీదే మనదేశానికి ఇండియా అనే పేరు వచ్చింది.


దీని ప్రధాన ఉపనదులు జీలం, చినాబ్, రావి, బియాస్, సట్లెజ్‌.


సింధూ జలాల ఒప్పందం


1960 సెప్టెంబరు 19న సింధూ, దాని ఉపనదుల జలాల పంపకం కోసం భారత్, పాకిస్థాన్‌ల మధ్య సింధూ జలాల ఒప్పందం  (Indus Water Treaty ) జరిగింది. దీనికి ప్రపంచ బ్యాంక్‌ మధ్యవర్తిత్వం వహించింది.


దీని ప్రకారం సింధూ నది వ్యవస్థ మొత్తం నీటిలో భారత్‌ 20%, పాకిస్థాన్‌ 80% వాడుకోవడానికి అంగీకారం కుదిరింది.


ఈ ఒప్పందంపై అప్పటి భారత ప్రధాని నెహ్రూ, పాకిస్థాన్‌ అధ్యక్షుడు ఆయూబ్‌ఖాన్‌ సంతకాలు చేశారు.


సింధూ నది ఉపనదులు


జీలం నది


దీన్ని పూర్వ కాలంలో వితస్థ, హైడాస్పస్‌ అని పిలిచేవారు.

 జమ్మూ - కశ్మీర్‌లోని వెరినాగ్‌ వద్ద ఉద్భవించింది. ఇది ఈ ప్రాంత ప్రధాన నది.

దీని మొత్తం పొడవు 724 కి.మీ.

దీని వల్లే శ్రీనగర్‌లో అహన్సర్‌ (ఆక్స్‌ బో), ఊలార్‌ సరస్సులు ఏర్పడ్డాయి.

ఇది చివరకు చినాబ్‌ నదిలో కలుస్తుంది.


చినాబ్‌ నది: ఇది చంద్ర, భాగ అనే రెండు  నదుల కలయికతో ఏర్పడింది. దీన్ని చంద్రభాగ నది, అసికిని నది అని కూడా అంటారు.

ఇది హిమాచల్‌ ప్రదేశ్‌లోని బారాలాప్చాలా కనుమ వద్ద జన్మించింది.

దీని మొత్తం పొడవు 1,180 కి.మీ.

 సింధూ నది ఉపనదుల్లోకెల్లా ఇది అత్యధిక నీటిని తీసుకుపోతుంది. చినాబ్‌ నది చివరకు సట్లెజ్‌ నదిలో కలుస్తుంది.

 

రావి నది


దీన్ని పూర్వం పరూష్ని అని పిలిచేవారు. దీనికే ఐరావతి, లాహోర్‌ నది అనే పేర్లు కూడా ఉన్నాయి.

ఇది హిమాచల్‌ ప్రదేశ్‌లోని కులు కొండల్లో ఉన్న రోహ్‌తంగ్‌ కనుమ వద్ద జన్మించింది.

దీని మొత్తం పొడవు దాదాపు 722 కి.మీ.

ఇది చినాబ్‌ నదిలో కలుస్తుంది.

 

బియాస్‌ నది


ఇది పూర్తిగా భారతదేశ భూభాగంలో మాత్రమే ప్రవహించే ఏకైక సింధూ ఉపనది.

దీని ప్రాచీన నామం విపాస. దీన్నే అర్గికియా అని కూడా అంటారు.

ఇది హిమాచల్‌ ప్రదేశ్‌లోని కులు లోయలో ఉన్న రోహ్‌తంగ్‌ కుండ్‌ దగ్గర్లోని బియాస్‌కుండ్‌ వద్ద పుట్టింది. 

దీని మొత్తం పొడవు దాదాపు 460 కి.మీ. ఇది పంజాబ్‌లోని హరికె వద్ద సట్లెజ్‌ నదిలో కలుస్తుంది.


సట్లెజ్‌ నది


దీని ప్రాచీన నామం శతుద్రి. ఇది టిబెట్‌లోని మానససరోవర్‌ సమీపంలో ఉన్న రాకాస్‌ సరోవర్‌ వద్ద జన్మించింది.

• ఇది ‘షిప్కి లా’ కనుమ మీదుగా హిమాచల్‌ ప్రదేశ్‌లోకి ప్రవహించి, చివరకు పాకిస్థాన్‌లోని సింధూనదిలో కలుస్తుంది.

ఇది సింధూ ఉప నదుల్లోకెల్లా అత్యంత పొడవైంది. దీని మొత్తం పొడవు దాదాపు 1050 కి.మీ.

చైనా, భారత్, పాకిస్థాన్‌ల మీదుగా ప్రవహించే ఏకైక సింధూ ఉపనది సట్లెజ్‌.


మాదిరి ప్రశ్నలు


1. నదుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు?

1) హైడ్రాలజీ     2) పొటమాలజీ

3) లింపాలజీ     4) రివరాలజీ

 

2. అరేబియా సముద్రంలో కలిసే నదుల్లో అత్యంత పెద్దది, పొడవైన నది....

1) నర్మద     2) తపతి  

3) సింధు      4) సబర్మతి

 

3. సింధూ నది ఉపనదుల్లో అత్యంత పొడవైంది....

1) జీలం  2) రావి   3) బియాస్‌    4) సట్లెజ్‌

 

4. భారతదేశ భూభాగంలో మాత్రమే ప్రవహించే ఏకైక సింధూ ఉపనది.....

1) సట్లెజ్‌     2) బియాస్‌ 

3) చినాబ్‌     4) రావి


సమాధానాలు   1-2  2-3  3-4  4-2  


రచయిత

మాన్యం మురళి

విషయ నిపుణులు 

Posted Date : 05-12-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌