• facebook
  • whatsapp
  • telegram

ఆర్థిక సంఘం

   విత్త వనరుల పంపకాల మార్గదర్శి!


 

సమాఖ్య వ్యవస్థ అవలంభిస్తున్న భారతదేశంలో పరిపాలన, ప్రజల సంక్షేమాన్ని చూడటంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సమాన ప్రాధాన్యం, బాధ్యత ఉంటుంది. అయితే ఆదాయ వనరుల పరంగా రాష్ట్రాల కంటే కేంద్రానికి ఎక్కువ పరిధి, అవకాశాలు ఉంటాయి. అందుకే ఆర్థిక వనరులను కేంద్ర, రాష్ట్రాల మధ్య సహేతుకంగా పంపిణీ చేసేందుకు ఏర్పాటైన రాజ్యాంగబద్ధ సంస్థే ఆర్థిక సంఘం. ప్రతి ఐదేళ్లకు రాష్ట్రపతి ఏర్పాటు చేసే ఈ సంస్థ సమయానుకూలంగా, పరిస్థితులకు తగినట్లుగా సమీక్షించి కేంద్ర, రాష్ట్రాల మధ్య ఆదాయ వనరుల పంపిణీ విషయంలో తగిన సిఫార్సులు చేస్తుంటుంది. వీటి ఆమోదం పూర్తిగా కేంద్రం చేతులోనే ఉన్నప్పటికీ, ఆ సిఫార్సులన్నీ దాదాపుగా ఆమోదం పొందుతుంటాయి. సహకార సమాఖ్య సజావుగా సాగడంలో, దేశ ఆర్థిక స్థిరత్వంలో కీలక ప్రాధాన్యం ఉన్న ఆర్థిక సంఘం నిర్మాణం, అధికారాలు, విధుల గురించి పరీక్షార్థులు తెలుసుకోవాలి. ఆర్థిక సంఘం సిఫార్సులు చేసే వనరుల పంపిణీ అంశాలు, ఇందులో క్రమానుగతంగా వచ్చిన మార్పులపై సమగ్ర అవగాహనతో ఉండాలి.

 

కేంద్ర, రాష్ట్రాల మధ్య ఆర్థిక వనరుల పంపిణీ; రాష్ట్రాల మధ్య వనరుల పంపిణీ బాధ్యత ఆర్థిక సంఘానిదే. రాజ్యాంగంలోని 280వ అధికరణ ప్రకారం భారత రాష్ట్రపతి ఐదేళ్లకు ఒకసారి ఆర్థిక సంఘాన్ని నియమిస్తారు. ఆర్థిక సంఘంలో ఛైర్మన్, నలుగురు సభ్యులు ఉంటారు. ప్రణాళికేతర విత్తవనరుల బదిలీని ఈ సంస్థ సూచిస్తుంది.

ఆర్థిక సంఘం విధులు

1) పన్నుల వల్ల సమకూరిన నికర రాబడిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పంపిణీ చేయడం, అందులో రాష్ట్రాల వాటా నిర్ణయించడం.

2) సంఘటిత నిధి నుంచి గ్రాంట్లు బదిలీ చేసేటప్పుడు అనుసరించాల్సిన నియమాలు సూచించడం.

3) రాష్ట్రపతి సూచించిన ఇతర ఆర్థిక అంశాలను విశ్లేషించడం.

ఇప్పటివరకు 14వ ఆర్థిక సంఘాల సిఫార్సులు అమలయ్యాయి. మనదేశంలో పన్ను వనరులు కేంద్రానికి అధికంగా, రాష్ట్రానికి లోటుగా ఉన్నాయి. అందుకే కేంద్రం నుంచి రాష్ట్రాలకు వనరుల బదిలీకి రాజ్యాంగం అవకాశం కల్పించింది. దీంతో పాటు రాజ్యాంగంలోని 275వ అధికరణ రాష్ట్రాలకు అవసరమైన గ్రాంట్లు అందించే సదుపాయం కల్పిస్తుంది. ఆర్థికంగా బలహీనమైన రాష్ట్రాలకు నిర్దిష్ట సహాయం కూడా అందిస్తుంది. 282వ అధికరణ ప్రకారం ప్రజాప్రయోజనాల దృష్ట్యా కేంద్రం రాష్ట్రాలకు తన విచక్షణపై గ్రాంట్లు ఇవ్వొచ్చు. అంటే 275వ అధికరణ ప్రకారం ఆర్థిక సంఘం సలహా ప్రకారం మాత్రమే గ్రాంట్లు ఇవ్వాలి. ఇందులో గ్రాంట్ల పరిమాణాన్ని ఆర్థిక సంఘం నిర్ణయిస్తుంది. 282వ అధికరణ ప్రకారం కేంద్రం తన విచక్షణతో గ్రాంట్లు ఇవ్వొచ్చు. దీనిలో గ్రాంట్ల పరిమాణాన్ని కేంద్రమే నిర్ణయిస్తుంది. రాష్ట్రాలు వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్రం నుంచి రుణాలు కూడా తీసుకోవచ్చు. పై అంశాల ఆధారంగా కేంద్రం నుంచి రాష్ట్రానికి వనరులు 3 విధాలుగా బదిలీ అవుతాయి. అవి: 1) పన్నులు, సుంకాలలో వాటా 2) గ్రాంట్లు 3) రుణాలు.

ఆర్థిక సంఘం ద్వారా వనరుల బదిలీ (1951 - 2000)

కేంద్ర, రాష్ట్రాల మధ్య నిధులు బదిలీ చేసేటప్పుడు దేశంలో మారే పరిస్థితుల ఆధారంగా వనరుల బదిలీకి ప్రాతిపదికను కూడా మారుస్తూ ఉంటారు.

1) ఆదాయపు పన్ను, ఎక్సైజ్‌ సుంకం: ఒకటో ఆర్థిక సంఘం ప్రకారం రాష్ట్రాలకు ఆదాయ పన్నులో 55% పంచాలని నిర్ణయించగా, 10వ ఆర్థిక సంఘం 77.5% పంపిణీ చేయాలని సూచించింది. మొదటి విత్త సంఘం కేంద్ర ఎక్సైజ్‌ సుంకాలలో 40%, 10వ విత్త సంఘం ప్రకారం 47.5% వాటా ఇవ్వాలని సూచించాయి. 10వ ఆర్థిక సంఘం ప్రకారం ఆదాయ పన్ను, ఎక్సైజ్‌ సుంకాల నుంచి విడివిడిగా రాష్ట్రాలకు వాటా అందించేవారు.

2) అదనపు ఎక్సైజ్‌ సుంకం: 1956లో జాతీయ అభివృద్ధి మండలి (ఎన్‌డీసీ)లో కుదిరిన ఒప్పందం ప్రకారం మిల్లువస్త్రాలు, పొగాకు, పంచదారపై అమ్మకం పన్ను స్థానంలో కేంద్రం అదనపు ఎక్సైజ్‌ సుంకం విధిస్తోంది. అందుకు ఈ ఆదాయం ఆ రాష్ట్రాల్లో వినియోగం మేరకు ఆ రాష్ట్రాలకే బదిలీ అవుతుంది.

3) ఎస్టేట్‌ సుంకం: ఈ పన్ను రాబడి పూర్తిగా రాష్ట్రాలకు పంపిణీ అవుతుంది. 1985లో దీన్ని రద్దు చేశారు.

4) కేంద్రం నుంచి రాష్ట్రాలకు గ్రాంట్లు: ఒకటో ఆర్థిక సంఘం ప్రకారం గ్రాంట్లు అందించేటప్పుడు బడ్జెట్‌ అవసరాలు, పన్ను ప్రయత్నాలు, రాష్ట్రాల వ్యయం లాంటి అంశాలు ప్రాతిపదికగా తీసుకుని అందించాలని సూచించింది. 9వ విత్త సంఘం బడ్జెట్‌ అంతరాలను భర్తీ చేయడానికి గ్రాంట్లు ఇచ్చే బదులు, కోశ అవసరాల ఆధారంగా గ్రాంట్లు ఇవ్వాలని సూచించింది.

5. కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వాలకు రుణాలు: రెండో ఆర్థిక సంఘం మార్కెట్‌ వడ్డీ రేటుకే కేంద్రం రాష్ట్రాలకు రుణం మంజూరు చేయాలని సిఫార్సు చేసింది. 6వ విత్త సంఘం రుణ చెల్లింపు కాలాన్ని 20 నుంచి 30 ఏళ్లకు పెంచి రాష్ట్ర ప్రభుత్వాలకు వెసులుబాటు కల్పించింది. 13వ విత్త సంఘం రెవెన్యూ లోటు తగ్గించడానికి కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల రుణాలు స్థూల జాతీయోత్పత్తిలో 68 శాతం మించరాదని సిఫార్సు చేసింది.

6. విపత్తు నిధి: జాతీయ విపత్తులు సంభవించినప్పుడు రాష్ట్రాలకు కొంత సహాయం చేసే పద్ధతి 8వ విత్త సంఘం వరకు ఉండేది. దీనినే మార్జిన్‌ మనీ స్కీమ్‌ అంటారు. 9వ విత్త సంఘం విపత్తు నిధిని ప్రతి రాష్ట్రానికి ఏర్పాటు చేయాలని సూచించింది. దీనికి కేంద్రం రాష్ట్రాలు 75:25 నిష్పత్తిలో నిధులు అందిస్తాయి. 10వ విత్త సంఘం కూడా దీన్నే కొనసాగించడంతో పాటు, కేంద్రం సైతం ప్రత్యేక నిధిని నిర్వహించాలని సిఫార్సు చేసింది. ఇది వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. 11వ విత్త సంఘం వినీదిళి స్థానంలో ‘నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ కలామిటీ మేనేజ్‌మెంట్‌’ను సిఫార్సు చేసింది.

7. స్థానిక సంస్థలు: 1993లో తీసుకొచ్చిన 73, 74 రాజ్యాంగ సవరణలు పంచాయతీలు, మున్సిపాలిటీలు, స్థానిక ప్రభుత్వాల అభివృద్ధికి అవకాశం కల్పించాయి. స్థానిక సంస్థలకు నిధులు అందించాలని 11వ ఆర్థిక సంఘం మొదటిసారిగా సిఫార్సు చేసింది.

8. రుణ ఉపశమనం: 12వ విత్త సంఘం రాష్ట్రాలు రుణాల కోసం కేంద్రంపై ఆధారపడటం తగ్గించాలని, మార్కెట్‌ నుంచి నేరుగా రుణాలు సేకరించాలని సూచించింది.

14వ ఆర్థిక సంఘం (2015 - 20)

14వ ఆర్థిక సంఘం డాక్టర్‌ వై.వి.రెడ్డి అధ్యక్షతన ఏర్పాటైంది. పన్నులు, గ్రాంట్లు రాష్ట్రాలకు బదిలీ చేసేటప్పుడు 1971 జనాభా లెక్కలను ఇది పరిగణనలోకి తీసుకుంది. 1971 తర్వాత వచ్చిన జనాభా మార్పులను కూడా లెక్కలోకి తీసుకుంది.

1. కేంద్ర, రాష్ట్రాల మధ్య పన్నుల వాటా

కేంద్రం నుంచి రాష్ట్రాలకు వచ్చే పన్నుల వాటాని ఒక్కసారిగా 32% నుంచి 42% కి పెంచింది.

2. రాష్ట్రాల మధ్య పన్నుల బదిలీకి ప్రాతిపదిక

14వ విత్త సంఘం రాష్ట్రాల మధ్య పన్నుల బదిలీకి నూతన ఫార్ములాను సూచించింది.

* నోట్‌: 13వ ఆర్థిక సంఘం సిఫార్సుల్లో కోశ నిర్వహణను పరిగణనలోకి తీసుకోగా, 14వ ఆర్థిక సంఘం మినహాయించింది.

14వ విత్త సంఘం సిఫార్సులతో కేంద్రం నుంచి అధిక పన్నుల వాటా బదిలీ అయిన రాష్ట్రాలు ఉత్తర్‌ప్రదేశ్, బిహార్‌. తక్కువ వాటా పొందిన రాష్ట్రాలు సిక్కిం, గోవా.

3) గ్రాంట్లు: రెవెన్యూ లోటు, ప్రకృతి విపత్తుల నిర్వహణ, స్థానిక సంస్థలకు గ్రాంట్లను సిఫార్సు చేసింది.


4) జీఎస్టీ: 14వ విత్త సంఘం జీఎస్టీపై సూచనలు చేసింది. జీఎస్టీ అమల్లోకి వచ్చిన మొదటి 3 సంవత్సరాలు రాష్ట్రాలకు వచ్చే నష్టాన్ని 100%, నాలుగో సంవత్సరం 75%, ఐదో ఏడాది 50% కేంద్రం భరించాలి.


5) కేంద్ర ప్రాయోజిత పథకాలు: కేంద్ర ప్రాయోజిత పథకాల్లో 30 పథకాలను రాష్ట్రాలకు బదిలీ చేయాలని సిఫార్సు చేసినప్పటికీ పథకాల ప్రాముఖ్యతను, న్యాయపరమైన అంశాలను దృష్టిలో ఉంచుకుని 8 పథకాలను మాత్రమే బదిలీ చేశారు

15వ ఆర్థిక సంఘం (2020 - 25)

రాష్ట్రపతి 15వ ఆర్థిక సంఘాన్ని 2017, నవంబరు 17న ఎన్‌.కె.సింగ్‌ అధ్యక్షతన ఏర్పాటు చేశారు. ఈ సంఘం 2020-2025కి వర్తించేలా సిఫార్సులను 2019, అక్టోబరులో అందించాలి. అయితే ఈ మధ్య కాలంలో కొన్ని అనూహ్య సంఘటనలు సంభవించాయి. అవి:

1) జమ్ము-కశ్మీర్‌ పునర్‌వ్యవస్థీకరణ చట్టం (2019) 

2) ప్రపంచ ఆర్థిక వృద్ధి క్షీణత (3%)

3) కార్పొరేట్‌ పన్ను రాబడి 19% శాతానికి తగ్గింది

4) నిర్మాణాత్మక సంస్కరణలు కొనసాగాయి.

పై చర్యలన్నీ కొంతకాలం పాటు ప్రభావం చూపేవి కావడంతో 15వ విత్త సంఘం రెండు నివేదికల్ని సమర్పించాల్సి వచ్చింది. 2020-21 సంవత్సరానికి చేసిన మధ్యంతర సిఫార్సులతో తొలి నివేదికను 2019, డిసెంబరులో రాష్ట్రపతికి సమర్పించింది. ఈ నివేదిక 2020, ఫిబ్రవరిలో పార్లమెంటు ముందుకు వచ్చింది. ఇది 2020-21 సంవత్సరానికి ఈ సిఫార్సులు వర్తిస్తాయి. తుది నివేదికను 2020, నవంబరులో రాష్ట్రపతికి సమర్పించగా, 2021, ఫిబ్రవరిలో పార్లమెంటు ముందుకు వచ్చాయి. ఈ సిఫార్సులు 2021-22 నుంచి 2025-26 కాలానికి వర్తిస్తాయి.

2015 - 16లో కోశ సమాఖ్యలోనూ ప్రాథమికంగా పలు మార్పులు జరిగాయి. అవి..


1. ప్రణాళిక సంఘం రద్దు


2. ప్రణాళిక, ప్రణాళికేతర వ్యయాల రద్దు


3. వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అమలు


4. రాష్ట్రాలకు 41% పన్నుల వాటా బదిలీ


5. టాక్స్‌ జీడీపీ నిష్పత్తి 10.2% నుంచి 11 శాతానికి పెంపు


6. జీడీపీలో రక్షణ వ్యయం 2% నుంచి 1.5%కి తగ్గింపు


7. రాష్ట్రాల్లో కోశ లోటు 1.9% నుంచి 2.5%కి పెరిగింది


8. స్థూల పన్ను రాబడిలో సెస్‌లు, సర్‌ఛార్జీల వాటా 2018-19 నాటికి 19.9%కి పెంపు


పన్ను, కోశప్రయత్నం - 2.5%

------------------------------------------

              100%


నోట్‌: ఒక రాష్ట్ర స్థూల రాష్ట్ర ఉత్పత్తి (జీఎస్‌డీపీ)ని దేశంలో అత్యధిక జీఎస్‌డీపీ ఉన్న రాష్ట్రంతో పోల్చడం ద్వారా ఆదాయ దూరం నిర్ణయిస్తారు.

15వ ఆర్థిక సంఘంలో అత్యధిక వాటా పొందిన రాష్ట్రాలు.. ఉత్తర్‌ప్రదేశ్‌ (17.939%), బిహార్‌ (10.058%), మధ్యప్రదేశ్‌ (7.850%), పశ్చిమ బెంగాల్‌ (7.523%), మహారాష్ట్ర (6.317%); తక్కువ వాటా పొందిన రాష్ట్రాలు.. గోవా (0.386%), సిక్కిం (0.388%)

* 15వ ఆర్థిక సంఘం ప్రకారం కేంద్ర బదిలీలలో తెలుగు రాష్ట్రాల వాటా 

1) ఆంధ్రప్రదేశ్‌ - 4.047% 

2) తెలంగాణ - 2.102%

15వ ఆర్థిక సంఘం నిర్మాణం

1. ఛైర్మన్‌: ఎన్‌.కె.సింగ్‌ - ప్రభుత్వ మాజీ కార్యదర్శి 

సభ్యులు

1. శక్తికాంత్‌ దాస్‌ - మాజీ ప్రభుత్వ కార్యదర్శి (పూర్తికాల సభ్యుడు)


2. అజయ్‌ నారాయణ్‌ ఝా - ప్రభుత్వ మాజీ కార్యదర్శి


3. ప్రొఫెసర్‌ అనూప్‌ సింగ్‌ - (పూర్తికాల సభ్యుడు)


4. డా।। అశోక్‌ లహరి - బంధన్‌ బ్యాంకు ఛైర్మన్‌ (పార్ట్‌ టైం సభ్యుడు)


5. డా।। రమేష్‌ చంద్ర - నీతి ఆయోగ్‌ సభ్యుడు (పార్ట్‌ టైం సభ్యుడు)


5. అరవింద మెహతా - కార్యదర్శి


ఆర్థిక సంఘం ఛైర్మన్లు
 

క్ర.సం.        ఛైర్మన్‌        నియమించిన ఏడాది
 

1. కె.సి.నియోగి - 1951


2. కె.సంతానం - 1956


3. ఎ.కె.చందా - 1960


4. పి.వి.రాజమన్నార్‌ - 1964


5. మహావీర్‌ త్యాగి - 1968


6. కాసు బ్రహ్మానంద రెడ్డి - 1972


7. జె.ఎం.షెలాట్‌ - 1977


8. వై.బి.చవాన్‌ - 1983


9. ఎన్‌.కె.పి.సాల్వే - 1987


10. కె.సి.పంత్‌ - 1992


11. ఎం.ఎం.ఖుస్రో - 1998


12. సి.రంగరాజన్‌ - 2003


13. విజయకేల్కర్‌ - 2007


14. వై.వి.రెడ్డి - 2013


15. నందకిశోర్‌ సింగ్‌ - 2017


16. అరవింద పనగరియా - 2023

 


రచయిత: ధరణి శ్రీనివాస్‌


 

Posted Date : 07-02-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌