• facebook
  • whatsapp
  • telegram

పంచవర్ష ప్రణాళికలు

* స్వాతంత్య్రానికి పూర్వమే (బ్రిటిష్‌వారి పాలనా కాలంలో) భారతదేశంలో ప్రణాళికల కోసం మోక్షగుండం విశ్వేశ్వరయ్య, జవహర్‌లాల్ నెహ్రూ (జాతీయ ప్రణాళికా కమిటీ), సర్ అదిషర్ దళాల్ నాయకత్వంలో బొంబాయికి చెందిన పారిశ్రామికవేత్తలు (బాంబే ప్లాన్), శ్రీమన్ నారాయణ్ అగర్వాల్ (గాంధీ ప్లాన్), ఎం.ఎన్.రాయ్ (ప్రజా ప్రణాళిక) లాంటి మేధావులు ప్రణాళికల కోసం కృషిచేశారు. కానీ ఇవేవీ అమలులోకి రాలేదు.
* స్వాతంత్య్రానంతరం భారత ప్రభుత్వం 1950 మార్చిలో ప్రణాళిక సంఘాన్ని ఏర్పాటు చేసింది. (ఇటీవల దీని స్థానంలో నీతి ఆయోగ్ ఏర్పాటైంది.) ప్రణాళిక సంఘం ద్వారా ఇప్పటి వరకు 11 పంచవర్ష ప్రణాళికలు పూర్తయ్యాయి. ప్రస్తుతం 12వ పంచవర్ష ప్రణాళిక అమల్లో ఉంది. ఆరో ప్రణాళిక కాలం నుంచి దేశ ఆర్థికాభివృద్ధి గమనంలో అనేక కీలక మార్పులు చోటుచేసుకున్నాయి.


 ఆరో ప్రణాళిక
 (1980 ఏప్రిల్ 1 - 1985 మార్చి 31)

* 1980లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అంతకు ముందు జనతా పార్టీ ప్రవేశపెట్టిన నిరంతర ప్రణాళిక (1978)ను నిలిపివేసి ఆరో పంచవర్ష ప్రణాళికను ప్రవేశపెట్టింది. ఉపాధి కల్పన ద్వారా నిరుద్యోగ నిర్మూలన, పేదరికం, అసమానతలు తగ్గించడం, స్వావలంబన దిశగా క్రమంగా ప్రగతి సాధించడం, అవస్థాపన సౌకర్యాలు కల్పించడం ఈ ప్రణాళిక ముఖ్య లక్ష్యాలు. ఈ ప్రణాళికను 'నిరుద్యోగ నిర్మూలన ప్రణాళిక'గా అభివర్ణిస్తారు.
 పైన పేర్కొన్న లక్ష్యాల సాధన కోసం ఈ ప్రణాళికలో ప్రభుత్వ రంగానికి రూ.1,09,260 కోట్లు కేటాయించారు. ఇందులో శక్తికి అత్యధికంగా 28 శాతం నిధులు, వ్యవసాయం, నీటి పారుదల రంగాలకు 24 శాతం నిధులు కేటాయించారు.


సాధించిన ప్రగతి:
* 6వ ప్రణాళిక కాలంలో సాలుసరి 5.2 శాతం వృద్ధి రేటు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంటే 5.7 శాతం వృద్ధిరేటును సాధించడం జరిగింది. ప్రొఫెసర్ రాజ్‌కృష్ణ పేర్కొన్న 'హిందూ వృద్ధిరేటు' (5 శాతం)ను అధిగమించి తొలిసారిగా వృద్ధి నమోదైంది. ఇదే కాలంలో తలసరి ఆదాయంలో 3.2 శాతం వృద్ధిరేటు, వ్యవసాయ రంగంలో 4 శాతం వృద్ధిరేటు నమోదయ్యాయి. ఈ ప్రణాళికా కాలంలో అదనంగా 11 మిలియన్ హెక్టారులకు నీటిపారుదల సౌకర్యాలు కల్పించారు. ఆహారధాన్యాల ఉత్పత్తిలో 154 మిలియన్ టన్నుల లక్ష్యాన్ని సాధించగలిగాం.
* నిరుద్యోగ, పేదరిక నిర్మూలన కోసం ఈ ప్రణాళికలో ప్రత్యేకంగా సమగ్ర గ్రామీణాభివృద్ధి పథకం (IRDP - 1980 దేశవ్యాప్తంగా), గ్రామీణ, భూమిలేని వారికి ఉపాధి భద్రతా పథకం (RLEGP - 1983), జాతీయ గ్రామీణ ఉపాధి పథకం (NREP - 1980), గ్రామీణ ప్రాంతాలలో మహిళలు, శిశువుల అభివృద్ధి పథకం (DWACRA) మొదలైన కార్యక్రమాలు చేపట్టారు.
* వృద్ధిరేటు ఎక్కువగా ఉన్నప్పటికీ, ఆరో ప్రణాళిక కాలంలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగిత, ఆదాయ అసమానతలు, తదితర సమస్యలు మాత్రం అలాగే ఉన్నాయి.

 

ఏడో పంచవర్ష ప్రణాళిక
 (1985 ఏప్రిల్ 1 - 1990 మార్చి 31)

* ఆరో పంచవర్ష ప్రణాళికలో ఆర్థిక వ్యవస్థ అనుకున్న విధంగా వృద్ధిని సాధించడంతో ఏడో పంచవర్ష ప్రణాళిక ఆశాజనకమైన ఆర్థిక వాతావరణంలో ప్రారంభమైంది. ఈ పంచవర్ష ప్రణాళికను 1985 నుంచి 2000 సంవత్సరం వరకు, అంటే 15 సంవత్సరాల కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటూ దీర్ఘదృష్టితో తయారు చేయడం జరిగింది.
* ఆర్థిక వృద్ధి, ఆధునికీకరణ, స్వావలంబన, సాంఘిక న్యాయం లాంటి ముఖ్య ఉద్దేశాల నేపథ్యంలో ఏడో పంచవర్ష ప్రణాళిక ప్రారంభమైంది. ఆహార ధాన్యాల ఉత్పత్తి, ఉద్యోగ అవకాశాల కల్పన, ఉత్పాదకతను పెంచడం, తదితర లక్ష్యాలకు ఈ ప్రణాళిక అధిక ప్రాధాన్యం ఇచ్చింది.
* ఏడో ప్రణాళికలో ప్రభుత్వ రంగంలో చేయదల్చుకున్న వ్యయం రూ.2,18,730 కోట్లు. మొత్తం ప్రణాళిక వ్యయంలో అత్యధికంగా ఇంధన (శక్తి) రంగానికి 28 శాతం నిధులు కేటాయించారు. అందుకే దీన్ని 'శక్తి ప్రణాళిక'గా పిలుస్తారు.


సాధించిన ప్రగతి:
* ఈ ప్రణాళికలో నిర్దేశించిన వృద్ధిరేటు (5 శాతం) కంటే అధిక వృద్ధి (6 శాతం) సాధించాం. ఈ కాలంలో తలసరి ఆదాయవృద్ధి రేటు 3.6 శాతంగా నమోదైంది.
* గ్రామీణ నిరుద్యోగిత, పేదరిక నిర్మూలన కోసం NREP, RLEGP లను కలిపి జవహర్ రోజ్‌గార్ యోజన (JRY - 1989) పథకాన్ని, పట్టణ పేదరిక నిర్మూలన కోసం నెహ్రూ రోజ్‌గార్ యోజన (NRY - 1989) లాంటి పథకాలను ఈ ప్రణాళిక కాలంలో ప్రవేశపెట్టారు.

 

వార్షిక ప్రణాళికలు (1990-92):

ఆర్థిక సంక్షోభం, రాజకీయ అస్థిరత, విదేశీ మారక నిల్వల కొరత, ధరల పెరుగుదల, తదితర సమస్యల వల్ల 1990 - 92 మధ్యకాలంలో వార్షిక ప్రణాళికలను అమలు చేశారు. ఈ కాలంలో భారతదేశంలో నూతన ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టారు.


 ఎనిమిదో ప్రణాళిక
 (1992 ఏప్రిల్ 1 - 1997 మార్చి 31)

* ఎనిమిదో పంచవర్ష ప్రణాళిక 1990 ఏప్రిల్ 1 నుంచి ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ, కేంద్రంలో రాజకీయ అనిశ్చితి కారణంగా ప్రారంభం కాలేదు. 1992 ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమైంది. 'మానవ వనరుల అభివృద్ధి'లో భాగంగా శతాబ్ది అంతానికి సంపూర్ణ ఉద్యోగిత సాధించడం, జనాభా పెరుగుదలను అరికట్టడం, సార్వత్రిక ప్రాథమిక
విద్య, తాగునీరు, అందరికీ ఆరోగ్యం అనే లక్ష్యాలతో ఎనిమిదో ప్రణాళిక ప్రారంభమైంది. ముఖ్యాంశాలు...
* ఈ ప్రణాళికను పి.వి.నరసింహారావు, మన్మోహన్ సింగ్ నమూనా (ఎల్‌పీజీ) ఆధారంగా రూపొందించారు.
* నూతన ఆర్థిక సంస్కరణల అమలు తర్వాత ప్రారంభించిన మొదటి ప్రణాళిక ఇది.
* ఈ ప్రణాళిక నుంచి భారత్ సూచనాత్మక ప్రణాళిక విధానాన్ని అమలు పరిచింది. దీనిలో ప్రభుత్వరంగ ప్రాధాన్యం తగ్గి ప్రైవేటు రంగానికి ప్రాముఖ్యం పెరిగింది.
* ఈ ప్రణాళిక కాలంలో బడ్జెట్ లోటును, విదేశీ రుణాన్ని సవరించే లక్ష్యంతో భారత ఆర్థిక వ్యవస్థను క్రమంగా ఓపెన్ మార్కెట్ ఆర్థిక వ్యవస్థగా మార్చడానికి ప్రయత్నం జరిగింది.
* ఈ ప్రణాళికలో మొత్తం ప్రణాళిక వ్యయంలో ప్రభుత్వ రంగానికి రూ.4,85,460 కోట్లు కేటాయించారు. అత్యధికంగా ఇంధన రంగానికి 27 శాతం నిధులు కేటాయించారు.


ప్రణాళిక ప్రగతి:
* ఈ ప్రణాళికలో వృద్ధిరేటు లక్ష్యం 5.6 శాతం, సాధించింది 6.8 శాతం. ఈ ప్రణాళిక కాలంలో తలసరి ఆదాయ వృద్ధిరేటు 4.6 శాతం, వ్యవసాయం, దాని అనుబంధ రంగాలలో 3.9 శాతం, పారిశ్రామిక రంగంలో 8 శాతం (నిర్దేశించింది 7.6 శాతం), సేవారంగంలో 7.9 శాతం (నిర్దేశించింది 6.1 శాతం) వృద్ధిరేటు నమోదయ్యాయి.
ప్రధానమంత్రి రోజ్‌గార్ యోజన (PMRY - 1993), జాతీయ సామాజిక సహాయ పథకం (NSAP - 1995), గంగా కళ్యాణ్ యోజన (GKY) లాంటి పథకాలు ఈ ప్రణాళికలో ప్రారంభమయ్యాయి. ఈ ప్రణాళిక కాలంలో ధనిక, పేద అంతరాలు పెరిగాయనే అభిప్రాయం ఉంది.

 

తొమ్మిదో ప్రణాళిక
 (1997 ఏప్రిల్ 1 - 2002 మార్చి 31)

సాంఘిక న్యాయం, సమానత్వంతో కూడిన వృద్ధి, గ్రామీణాభివృద్ధిపై తొమ్మిదో ప్రణాళిక ఎక్కువగా దృష్టి సారించింది. వీటిని సాధించడానికి నాలుగు అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని పేర్కొన్నారు. అవి: 1. జీవన నాణ్యత 2. ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం 3. ప్రాంతీయ అసమానతలు తగ్గించడం 4. స్వయం ఆధారితం.
 పైన పేర్కొన్న లక్ష్యాల సాధనకోసం ఈ ప్రణాళిక కాలంలో ప్రభుత్వ రంగంలో రూ.8,59,200 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించారు. ఇందులో అత్యధికంగా రవాణా, సమాచార రంగానికి 25 శాతం నిధులు కేటాయించారు.


ప్రణాళిక ఫలితాలు:
* ఈ ప్రణాళికలో నిర్దేశిత వృద్ధి రేటు లక్ష్యం 6.5 శాతం అయితే, 5.4 శాతం వృద్ధిని మాత్రమే సాధించడం జరిగింది. ఈ కాలంలో తలసరి ఆదాయ వృద్ధిరేటు 3.4 శాతం, వ్యవసాయరంగంలో వృద్ధిరేటు 2.1 శాతం, పరిశ్రమల రంగంలో 4.5 శాతం, సేవల రంగంలో 7.8 శాతం మాత్రమే వృద్ధిరేటు నమోదైంది.
* వ్యవసాయరంగంలో లక్ష్యంగా నిర్దేశించిన 234 మిలియన్ టన్నుల ఆహారధాన్యాల కంటే తక్కువగా 209 మిలియన్ టన్నుల ఆహారధాన్యాలను మాత్రమే ఉత్పత్తి చేయగలిగాం. మొత్తం మీద తొమ్మిదో ప్రణాళిక ముఖ్య లక్ష్యాలను సాధించడంలో విఫలమైనట్లు చెప్పవచ్చు.
* స్వర్ణ జయంతీ షహరీ రోజ్‌గార్ యోజన (SJSRY - 1997), జవహర్ గ్రామ సమృద్ధి యోజన (JGSY - 1999), స్వర్ణజయంతీ గ్రామ్ స్వరోజ్‌గార్ యోజన (SGSY - 1999), ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజన (PMGSY - 2000) లాంటి పథకాలు ఈ ప్రణాళిక కాలంలో ప్రారంభమయ్యాయి.

 

పదో పంచవర్ష ప్రణాళిక
 (2002 ఏప్రిల్ 1 - 2007 మార్చి 31)

* జాతీయ అభివృద్ధి మండలి ఈ ప్రణాళికను డిసెంబర్ 2002లో ఆమోదించింది. 8 శాతం వార్షిక వృద్ధిరేటును సాధించాలని నిర్ణయించింది. 'సమానత్వం, సాంఘిక న్యాయం, నాణ్యమైన మానవ వనరులను పెంపొందించడం' ఈ ప్రణాళిక ప్రధాన ఉద్దేశం.

ముఖ్య లక్ష్యాలు...
*  అయిదేళ్లలో 50 మిలియన్ల మందికి ఉద్యోగాలు కల్పించడం.
*  పేదరికం నిష్పత్తిని 2007 నాటికి 5 శాతం పాయింట్లు, 2012 నాటికి 15 శాతం పాయింట్లు తగ్గించడం.
* 2007 నాటికి అక్షరాస్యతను 75 శాతానికి పెంచాలి.
* రాబోయే పదేళ్లలో తలసరి ఆదాయం రెట్టింపు చేయాలి.
* ప్రణాళికాంతం నాటికి అందరికీ సార్వత్రిక ప్రాథమిక విద్యావ్యాప్తి.
* శిశు మరణాల రేటును (వెయ్యికి) 2007 నాటికి 45కి, 2012 నాటికి 28కి తగ్గించాలి.
* ప్రసూతి మరణాల రేటును (వెయ్యికి) 2007 నాటికి 2కి, 2012 నాటికి 1కి తగ్గించాలి.
* అడవుల విస్తీర్ణాన్ని 2007 నాటికి 25 శాతానికి, 2012 నాటికి 33 శాతానికి పెంచాలి.
* 2012 నాటికి గ్రామాలన్నింటికీ రక్షిత మంచినీరు అందించాలి.
* 2007 నాటికి కాలుష్యానికి గురైన ప్రధాన నదులన్నింటినీ శుభ్రం చేయాలి.


వనరుల కేటాయింపు:
* ఈ ప్రణాళికలో ప్రభుత్వరంగానికి రూ.15,25,639 కోట్లు కేటాయించారు. ఇందులో అత్యధికంగా 28 శాతం నిధులు సామాజిక సేవలు, శాస్త్ర సాంకేతిక విజ్ఞానంపై ఖర్చు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.


పదో ప్రణాళిక ఫలితాలు...
* పదో పంచవర్ష ప్రణాళిక లక్ష్యంగా నిర్దేశించిన స్థూల దేశీయోత్పత్తిలో 8 శాతం వృద్ధిరేటును సాధించలేకపోయాం. అయితే తొమ్మిదో ప్రణాళికలో సాధించిన 5.4 శాతం కంటే ఎక్కువగా (7.6 శాతం) వృద్ధిరేటును సాధించి ఆర్థిక వ్యవస్థను అభివృద్ధిపథం వైపు మళ్లించడానికి పదో ప్రణాళిక దోహదం చేసింది. తలసరి ఆదాయ వృద్ధిరేటు 6.1 శాతంగా నమోదైంది. ఈ కాలంలో వ్యవసాయ రంగ వృద్ధిరేటు 2.1 శాతం, పారిశ్రామికరంగ వృద్ధిరేటు 8.7 శాతం, సేవారంగంలో వృద్ధిరేటు 9.3 శాతంగా నమోదైంది. స్థూల దేశీయ ఉత్పత్తిలో పొదుపు రేటు 30.8 శాతం, పెట్టుబడి రేటు 32 శాతంగా నమోదయ్యాయి.
* గ్రామీణ ప్రాంతాలలోని ఆరు రంగాలలో అవస్థాపన సౌకర్యాల అభివృద్ధి కోసం ఈ ప్రణాళిక కాలంలో భారత్ నిర్మాణ్ పథకాన్ని (2005) ప్రారంభించారు.
* పొదుపు, పెట్టుబడులు పెంపొందించడం, వృద్ధిరేటు సాధనలో సంతృప్తికర ఫలితాలు సాధించాం. పేదరికం, నిరుద్యోగం, ప్రాంతీయ అసమానతల తగ్గింపు, వ్యవసాయరంగంలో వృద్ధిరేటు సాధించడం మొదలైన అంశాల్లో ఈ ప్రణాళిక కాలంలో విఫలమయ్యాం.

 

Posted Date : 14-12-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌