• facebook
  • whatsapp
  • telegram

వ‌ర‌ద‌ల విప‌త్తు

జల విలయం

నదుల ప్రవాహాలు గట్లు దాటినా, అధిక వర్షాల వల్ల కురిసిన నీటిని అదుపు చేయలేకపోయినా వరదలు సంభవిస్తాయి. పొలాలను, జనావాసాలను ముంచేస్తాయి. ఆస్తులకు, ప్రాణాలకు నష్టాన్ని కలిగిస్తాయి. తాగునీరు కలుషితమైపోతుంది. పారిశుద్ధ్యం క్షీణించి అంటువ్యాధులు ప్రబలుతాయి. జనజీవనం అస్తవ్యస్తమవుతుంది. ఇదంతా వరదలు సృష్టించే విలయమే. నదులకు నిలయమైన మన దేశంలో ఏటా ఈ పరిస్థితులు ఎదురవుతూనే ఉన్నాయి. విపత్తు నిర్వహణ అధ్యయనంలో భాగంగా వరదల స్థితిగతులను, కారణాలను, ప్రభావాలను పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి.

 

 

నీరు సాధారణ స్థితిని లేదా ప్రవాహ స్థాయిని మించినప్పుడు వరదలు వస్తాయి. వాన చినుకులు జడివానగా మారి కొన్ని గంటల  వ్యవధిలోనే వరదగా మారవచ్చు. కొన్ని సందర్భాల్లో ఆనకట్టలు  తెగిపోవడం వల్ల ఎలాంటి హెచ్చరిక లేకుండా అకస్మాత్తుగా వరదలు సంభవించవచ్చు. ఎక్కువ శాతం వరదలకు నదీ ప్రవాహాలే ప్రధాన కారణం. వాటి అంతర్భాగం, ఆనకట్టల సామర్థ్యాన్ని మించి    ప్రవహించినప్పుడు చుట్టుపక్కల భూభాగాలను ముంచెత్తుతుంటాయి.

 

వరదల్లో రకాలు


నదీ వరదలు: వర్షాకాలంలో అధిక వర్షాల వల్ల, తుపాన్లు సంభవించే సందర్భాల్లోనూ, మంచు కరిగి నదిలో కలిసినప్పుడు నదీ వరదలు సంభవిస్తాయి. సముద్రంలోకి పంపే నీటి పరిమాణం కంటే ఎక్కువ నీటిని నది కలిగి ఉన్నప్పుడు నీరు పొంగి గట్టు దాటి   వరదలు సంభవిస్తాయి. వీటినే నదీ వరదలు అంటారు. నది తనలో ఉంచుకోగలిగిన నీటి పరిమాణాన్ని దాని పారుదల సామర్థ్యం అంటారు. నీటి పరీవాహక ప్రాంతం నుంచి ఒక సెకనులో ప్రవహించే నీటి పరిమాణాన్ని ‘డిశ్చార్జ్‌’ అంటారు.


తీరప్రాంత వరదలు: తుపాను వచ్చినప్పుడు, సముద్ర ఉప్పెనల వల్ల, సునామీలు సంభవించినప్పుడు, కొన్ని సందర్భాల్లో సముద్రంలో పెద్ద అలలు ఏర్పడినప్పుడు వచ్చే వరదలను తీర ప్రాంత వరదలు అంటారు.


నదీముఖద్వార వరదలు: సముద్రంలో ఉప్పెన కారణంగా గానీ, సునామీ కెరటాలు నెట్టుకొస్తున్నప్పుడుగానీ, అమావాస్య, పౌర్ణమి రోజుల్లో సముద్రంలో వేలా తరంగాలు ఎక్కువగా ఉన్నప్పుడు గానీ, నది ద్వారా సముద్రంలోకి ప్రయాణించే నీటిని సముద్రం స్వీకరించలేక వెనక్కి పంపినప్పుడు తీరం వెంబడి వరదలు రావచ్చు. నదులు సముద్రంలో కలిసే ప్రదేశాలను నదీ ముఖ ద్వారాలు అంటారు.


మెరుపు వరదలు: హఠాత్తుగా మంచు కరిగి నదిలో చేరడం,  కొండలపైన కుండపోత వర్షాలు, ఆనకట్టలు పగిలిపోవడం, కూలిపోవడం వల్ల అకస్మాత్తుగా సంభవించేవి మెరుపు వరదలు.


పట్టణ వరదలు: పట్టణ ప్రాంతాల్లో నీటిపారుదల వ్యవస్థ సరిగా లేకపోవడం వల్ల, భారీ వర్షాలు కురిసినప్పుడు పట్టణాల్లో ఈ  వరదలు సంభవిస్తుంటాయి.


ప్రమాదం కారణంగా వచ్చే వరదలు: అధిక పరిమాణంలో నీటి సరఫరా చేసే నీటి గొట్టాలు పగిలిపోవడం వల్ల చుట్టుపక్కల ప్రాంతాలు నీటితో మునిగిపోవడం ద్వారా వచ్చే వరదలు.

 

ప్రపంచ వరద స్థితిగతులు

ప్రపంచవ్యాప్తంగా మానవుల జీవనోపాధికి తీవ్ర నష్టం కలిగించే విపత్తుల్లో అత్యంత విధ్వంసకర విపత్తు వరదలు. ప్రపంచ మొత్తం విపత్తు నష్టాల్లో అత్యధికంగా 30% ఈ వరదల వల్లే జరుగుతోంది. దీని తర్వాత స్థానంలో 21% నష్టం తుపాన్ల వల్ల ఏర్పడుతోంది. ‘ద హ్యూమన్‌ కాస్ట్‌ ఆఫ్‌ వెదర్‌ రిలేటెడ్‌ డిజాస్టర్‌’ పేరుతో ఐక్యరాజ్యసమితి వెల్లడించిన నివేదిక ప్రకారం 1995-2015 మధ్య ప్రపంచవ్యాప్తంగా వరదల వల్ల 230 కోట్ల మంది ప్రభావితమయ్యారు. 1,57,000 మంది  మరణించారు. మొత్తం జల, వాతావరణ విపత్తుల్లో ఈ నష్టం 56% మేర ఉంది.


ఐక్యరాజ్యసమితి ‘అంతర్జాతీయ విపత్తు కుదింపు వ్యూహం (United Nations International Strategy for Disaster Reduction)’ రూపొందించిన గ్లోబల్‌ ఎసెస్‌మెంట్‌ రిపోర్ట్‌ 2011 ప్రకారం ప్రపంచవ్యాప్తంగా వరదల ప్రభావాన్ని ఎదుర్కొంటున్న   జనాభాలో 90% మంది దక్షిణాసియా, తూర్పు ఆసియా, పసిఫిక్‌ దేశాల్లోనే ఉన్నారు. ఇందులో దక్షిణాసియా దేశాల్లో భారత్, బంగ్లాదేశ్‌లు ఎక్కువ ప్రభావానికి గురవుతున్నాయి. గత దశాబ్దంలో ప్రపంచవ్యాప్తంగా వరద ప్రభావాన్ని ఎదుర్కొన్న దేశాలు చైనా, ఇండియా, బంగ్లాదేశ్, జర్మనీ, పోలండ్, మొజాంబిక్, అమెరికా వరుస   క్రమంలో ఉన్నాయి. 


ప్రపంచ వ్యాప్తంగా వివిధ వర్గాల వరద బాధితులు:  

 

* అల్పాదాయం ఉన్నవారు  50% 

* దిగువ మధ్యస్థాయి ఆదాయం ఉన్నవారు  26%  

*  అధిక మధ్యస్థాయి ఆదాయం ఉన్నవారు  23%  

* అధిక ఆదాయం ఉన్నవారు - 1%


భారతదేశంలో వరదలు

* ప్రపంచ మొత్తం వరద మరణాల్లో 1/5 (20%) మన దేశంలోనే సంభవిస్తున్నాయి. భారత్‌లో మొత్తం విపత్తు నష్టంలో 52% వరదల వల్లే జరుగుతోంది.


* దేశ వైశాల్యంలో 40 మిలియన్‌ హెక్టార్ల భూమి వరద ప్రభావానికి గురవుతోంది. ఇది దేశ వైశాల్యంలో 12%. (బిల్డింగ్‌ మెటీరియల్స్‌ టెక్నాలజీ ప్రమోషన్‌ కౌన్సిల్‌ ప్రకారం)


* దేశంలో ఉత్తర, ఈశాన్య ప్రాంతాలు ఏటా వరద ముప్పు ఎదుర్కొంటున్నాయి.


* దేశంలోని అన్ని నదీ పరీవాహక ప్రాంతాల్లో వరదలు సంభవిస్తున్నాయి. ముఖ్యంగా గంగా, బ్రహ్మపుత్ర నదీ పరీవాహక ప్రాంతాలు వరద పీడిత   ప్రాంతాలుగా ఉన్నాయి. 


* ఉద్ధృతిపరంగా చూస్తే ఉత్తర్‌ ప్రదేశ్, బిహార్, అస్సాం, పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాలు ఎక్కువగా వరదల బారిన పడుతున్నాయి.


* వరదల వల్ల దేశంలో ఏటా 40 లక్షల టన్నుల వడ్లు నీటిపాలవుతున్నాయని అంతర్జాతీయ వరి పరిశోధనా కేంద్రం (IRRI) వివరించింది.


* 1953 - 2009 మధ్య గమనిస్తే భారతదేశంలో వరదల వల్ల ఏటా సగటున రూ.1650 కోట్ల నష్టం మేర వాటిల్లింది. సగటున 1,464 మంది మరణిస్తున్నారు. 86,288 పశువులు చనిపోతున్నాయి.


వరద ముప్పు ప్రాంతాలు:  ప్రపంచంలో అత్యధిక వరద ముప్పు ఉన్న దేశాల్లో భారతదేశం ఒకటి. ఇక్కడి వరదలకు రుతుపవన కాలాల్లో తక్కువ కాలంలో ఎక్కువ వర్షం కురవడం, అధిక పూడిక ఉన్న నదులు, వాలైన హిమాలయ పర్వత శ్రేణులు లాంటివి ముఖ్యమైన కారణాలు.   


గంగా నదీ పరీవాహక ప్రాంతం: దేశంలో వరద దుర్బలత్వం ఉన్న ప్రాంతాల్లో ఇది ప్రధానమైంది. అందులోనూ గంగా పరీవాహకంలోని ఉత్తర భాగం ఉపనదుల    కారణంగా తీవ్రంగా ప్రభావితమవుతోంది. ఉత్తర్‌ ప్రదేశ్‌లో శారద, గాగ్రా నదుల వల్ల; బిహార్‌లో కోసీ, గండక్‌ నదుల వల్ల ఎక్కువగా వరదలు సంభవిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్‌లో దక్షిణ భాగంలో దామోదర్, జయ నదులు, వాటి ఉపనదుల వల్ల వరదలు సంభవిస్తున్నాయి.


బ్రహ్మపుత్ర, బరాక్‌ నదుల పరీవాహక ప్రాంతం: ఈ నదులు, వాటి ఉప నదులతో అస్సాం ఎక్కువగా వరదలకు గురవుతోంది. ఈ పరీవాహక ప్రాంతంలో పశ్చిమ బెంగాల్‌ ఉత్తర భాగంలో జల్దాకా, తీస్తా, తోర్సా నదులు వరదలకు కారణమవుతున్నాయి. అలాగే మణిపుర్‌లో తిలాంగ్, నంబుల్, చప్కి, తోబుల్‌ నదులు, అధిక వర్షాల వల్ల ఇంఫాల్‌లో కొన్ని ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయి.


వాయవ్య నదీ పరీవాహక ప్రాంతం: భారత వాయవ్య ప్రాంతంలో జీలం, చీనాబ్, రావి, సట్లెజ్, బియాస్, గగ్గర్‌ నదీ పరీవాహక ప్రాంతాల్లో వరదలు వస్తున్నాయి.


మధ్య భారత్, దక్కన్‌ పరీవాహక ప్రాంతం: ఈ ప్రాంతంలో గోదావరి, కృష్ణా, కావేరి, పెన్న, తుంగభద్ర, నర్మద మొదలైన నదుల పరీవాహక ప్రాంతాలు, ఒడిశాలోని   మహానది, బైతరణి, బ్రహ్మణి నదీ పరీవాహక ప్రాంతాలు వరద ముప్పును ఎదుర్కొంటున్నాయి.

 

తెలుగు రాష్ట్రాల్లో వరదల స్వభావాలు

దక్షిణ భారతదేశంలో ఎక్కువగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోనే పెద్ద  ఎత్తున ప్రాణ, ఆస్తి, పంట నష్టాలకు వరదలు కారణమవుతున్నాయి.

* తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్‌లో వరదల దుర్బలత్వం ఎక్కువ. గోదావరి, కృష్ణా, వంశధార, నాగావళి, పెన్నా నదులు సముద్రంలో కలిసే నదీ ముఖ ద్వారాల్లో డెల్టా మైదానాలు ఏర్పడి, అవి విశాలంగా, పాయలుగానూ చీలిపోయి ప్రవహిస్తున్నాయి.

* ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద నదుల డెల్టాలతోపాటు చిన్న నదులు, వాగులు పొంగడం వల్ల, కొల్లేరు సరస్సు పరిసర ప్రాంతాలు రుతువుల కాలంలో వరదల్లో మునిగిపోతున్నాయి.

* గోదావరి, కృష్ణా నదులు తెలంగాణ వైపు కచ్చితమైన, స్థిరమైన ప్రవాహ మార్గాలు కలిగి ఉండటం, మానవ నిర్మిత ఆనకట్టలు వరద నీటిని సక్రమంగా మోసుకెళ్లడం వల్ల వరదల ప్రభావం అంతగా లేదు. అయినప్పటికీ తెలంగాణలో గోదావరి పరీవాహక మార్గంలో నిజామాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాలు; ప్రాణహిత మార్గంలో ప్రస్తుత కొమురం భీమ్‌ జిల్లా రుతుపవనాల కాలంలో వరద ముప్పును ఎదుర్కొంటున్నాయి.

 

వరదలపై అధ్యయనం: జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (GSI) ముంపునకు గురవుతున్న భూమి ఆకారాన్ని, పరీవాహక ప్రాంతం (హరివాణం) వైశాల్యం, నేల వాలు, మురుగు నీటిపారుదల వ్యవస్థ లాంటి వాటిపై సమాచారాన్ని సేకరించి వరద దుర్బలత్వ మ్యాపులను తయారు చేస్తుంది. 

Posted Date : 11-02-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌