• facebook
  • whatsapp
  • telegram

అడవులు - వన్యప్రాణి సంరక్షణ  

      పర్యావరణ పరిరక్షణలో అడవులు కీలకపాత్ర వహిస్తాయి. కానీ, భారతదేశంలో జనాభా విస్ఫోటం వల్ల వ్యవసాయాభివృద్ధి, పారిశ్రామికీకరణ, నగరీకరణ, భారీ నీటిపారుదల ప్రాజెక్టులు, జలవిద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణం, రోడ్లు - రైలు మార్గాల అభివృద్ధి మొదలైన కార్యకలాపాలవల్ల అడవుల విస్తీర్ణం క్రమంగా తగ్గుతోంది. దీంతో పర్యావరణ సమతౌల్యానికి విఘాతం కలుగుతోంది. అడవులు తరగిపోవడంతో వన్యప్రాణుల జీవనానికి ముప్పు వాటిల్లుతోంది. అందుకే sustainable development ను దృష్టిలో పెట్టుకుని భారత ప్రభుత్వం 1980లో సమగ్ర అడవుల పరిరక్షణ చట్టాన్ని (Forest Conservation1980) రూపొందించింది. పదో పంచవర్ష ప్రణాళికా కాలంలో సమగ్ర అడవుల పరిరక్షణ పథకాన్ని (Integrated Forest Protection Scheme) అమల్లోకి తెచ్చింది. 1988లో అటవీ విధానాన్ని (Forest Policy), 2006లో జాతీయ పర్యావరణ విధానాన్ని రూపొందించి అమల్లోకి తెచ్చింది. వాతావరణ మార్పు (Climate Change), గ్లోబల్ వార్మింగ్‌ను నివారించడానికి అడవుల పరిరక్షణ ఎంతో అవసరం. అడవుల పరిరక్షణ, నిర్వహణ అనే అంశం భారత రాజ్యాంగం ప్రకారం ఉమ్మడి జాబితాలో ఉండటంతో అడవులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడి బాధ్యతగా నిర్వహిస్తున్నాయి.

         భారత బొటానికల్ సర్వే (బి.ఎస్.ఐ.) ప్రకారం దేశంలో మొత్తం 46వేలకు పైగా వృక్షజాతులు ఉన్నాయి. కానీ, ఇటీవల అడవుల విధ్వంసం వల్ల అందులో అనేక వృక్షజాతులు అంతరించే ప్రమాదం ఉంది. భారత జూలాజికల్ సర్వే (జడ్.ఎస్.ఐ.) ప్రకారం దేశంలో మొత్తం 89వేలకు పైగా జంతు జాతులు (species) ఉన్నాయి. వీటిలో కూడా అనేకం అంతరించిపోయే ప్రమాదాలను ఎదుర్కొంటున్నాయి. కాబట్టి, ప్రకృతిసిద్ధమైన వృక్ష, జంతుజాతుల జీవ వైవిధ్యాన్ని (Bio - diversity) కాపాడేందుకు భారత ప్రభుత్వం అడవుల్లోని వృక్షాలను, జంతువులను వాటి సహజ పర్యావరణంలో అభివృద్ధి చేసేందుకు జీవావరణ కేంద్రాలను (Biosphere Reserves) నెలకొల్పింది. ఈ విధంగా దేశంలో మొదటగా ఏర్పాటుచేసింది నీలగిరి జీవావరణ కేంద్రం. దీన్ని 1986లో స్థాపించారు. ప్రస్తుతం భారతదేశంలో మొత్తం 15 జీవావరణ కేంద్రాలున్నాయి. 2008లో స్థాపించిన గుజరాత్‌లోని కచ్ కేంద్రం 15వ జీవావరణ కేంద్రం. ఈ 15 జీవావరణ కేంద్రాల్లో భౌగోళికంగా అతి పెద్దది మన్నార్ కేంద్రం. వీటిలో యునెస్కో గుర్తించి, ప్రపంచ జీవావరణ కేంద్రాల నెట్‌వర్క్‌లో చేర్చినవి నాలుగు. అవి: 1) సుందర్‌బన్స్, 2) మన్నార్, 3) నీలగిరి, 4) నందాదేవి. అడవులు, వన్యప్రాణుల సంరక్షణకోసం దేశవ్యాప్తంగా 99 జాతీయ పార్కులు, 513 వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలను స్థాపించారు. ఆంధ్రప్రదేశ్‌లో అయిదు జాతీయ పార్కులు ఏర్పాటయ్యాయి. ఇక పెద్దపులుల సంరక్షణ, అభివృద్ధికి కేంద్రప్రభుత్వం 1973లో ప్రాజెక్టు టైగర్‌ను ప్రారంభించింది. ప్రస్తుతం దేశంలో మొత్తం 17 టైగర్ ప్రాజెక్టులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని నాగార్జునసాగర్ - శ్రీశైలం టైగర్ ప్రాజెక్టుకు రాజీవ్‌గాంధీ టైగర్ ప్రాజెక్టు అని పేరుపెట్టారు.

టైగ‌ర్ ప్రాజెక్టు స్థాపించిన సంవత్సరం

రాష్ట్రం/రాష్ట్రాలు

నీలగిరి

1986

తమిళనాడు, కేరళ, కర్ణాటక

నందాదేవి 1988 ఉత్తరాఖండ్
 
నోక్రెక్ 1988

మేఘాలయ

మానస్ 1989 అసోం
 
సుందర్ బన్స్

1989

పశ్చిమబెంగాల్ 

మన్నార్ 1989

తమిళనాడు

గ్రేట్ నికోబార్ 1989 అండమాన్ - నికోబార్ దీవులు
సిమ్లీపాల్

1994

ఒరిస్సా
దిబ్రూ -సైకోవా

1997

అసోం
దెహాంగ్ - దెబాంగ్ 1998 అరుణాచల్ ప్రదేశ్

పచ్ మరి

1999 మధ్యప్రదేశ్
కాంచన్ గంగ(జంగ) 2000 సిక్కిం
అగస్త్యమలై 2001 త‌మిళ‌నాడు, కేర‌ళ‌

అచనామర్ - అమర్ కంఠక్

2005

మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్

కచ్

2008

గుజరాత్ 


ఏనుగుల సంరక్షణ, అభివృద్ధికి 1992లో ప్రాజెక్టు ఎలిఫెంట్‌ను స్థాపించారు. దీన్ని దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లో అమలుచేస్తున్నారు. భారతదేశంలో వన్యప్రాణి సంరక్షణకు కేంద్రప్రభుత్వం 1972లో వన్యప్రాణి సంరక్షణ చట్టాన్ని రూపొందించింది.  కొన్ని వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు ప్రత్యేకించి కొన్ని జంతువులకు ప్రసిద్ధి. దేశంలో అడవుల పరిరక్షణ, అభివృద్ధి, విద్య, పరిశోధనకోసం డెహ్రాడూన్‌లో 1987లో భారత అటవీ పరిశోధన, విద్యా మండలి (Indian Council of Forest Research and Education) స్థాపించారు.
 

భారత అటవీ పరిశోధన, విద్యా మండలి ఆధ్వర్యంలో అడవుల అభివృద్ధికోసం కృషిచేస్తున్న సంస్థలు
1.
ఫారెస్ట్ రిసెర్చ్ ఇన్ స్టిట్యూట్ - డెహ్రాడూన్
2. ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఎరిడ్ జోన్ ఫారెస్ట్రీ రిసెర్చ్ - జోధ్ పూర్
3. ఇందిరాగాంధీ నేషనల్ ఫారెస్ట్ అకాడమి - డెహ్రాడూన్
4. సెంటర్ ఫర్ సోషల్ ఫారెస్ట్రీ అండ్ ఎన్విరాన్ మెంట్ - అలహాబాద్
5. టెంపరేట్ ఫారెస్ట్ రిసెర్చ్ ఇన్ స్టిట్యూట్ - సిమ్లా
6. ట్రాపికల్ ఫారెస్ట్ రిసెర్చ్ ఇన్ స్టిట్యూట్ - జబల్ పూర్
7. రెయిన్ అండ్ మాయిస్ట్ డెసిడ్యుయస్ ఫారెస్ట్ రిసెర్చ్ ఇన్ స్టిట్యూట్ (Rain & Moist Deciduous Forest Research Institute)- జోర్హాట్ (అసోం)
8. ఫారెస్ట్ ట్రెయినింగ్ ఇన్ స్టిట్యూట్ - డెహ్రాడూన్
9. ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ మేనేజ్ మెంట్ - భోపాల్
10. ఇండియన్ ప్లైవుడ్ ఇండస్ట్రీస్ రిసెర్చ్ అండ్ ట్రెయినింగ్ ఇన్ స్టిట్యూట్ - బెంగళూరు మొదలైనవి.

 

వన్యప్రాణులు - సంరక్షణ చర్యలు
ప్రపంచవ్యాప్తంగా 140 మిలియన్ల జీవజాతులు నివసిస్తున్నట్లు గ్లోబల్‌ బయోడైవర్సిటీ ఔట్‌లుక్‌- 2001 నివేదిక పేర్కొంది. ఇందులో 1.74 మిలియన్ల జాతులను మాత్రమే గుర్తించారు. ప్రపంచంలో అనేక జీవజాతులు మానవ కార్యకలాపాలు, సహజ కారణాల వల్ల కనుమరుగవుతున్నాయి.


సంరక్షణ చర్యలు
* దేశంలో రక్షిత ప్రాంతాల అనుసంధానాన్ని విస్తరించి, ఆ ప్రదేశాన్ని కచ్చితంగా పెంచడం.
* అడవుల పెంపకంలో ప్రజలందరినీ భాగస్వాములను చేయడం. సామాజిక రిజర్వులను, వన్యప్రాణుల అలవాట్లను కాపాడటం.
* వన్యప్రాణులు నివసించే ప్రాంతాల్లో పర్యావరణ పర్యటకాన్ని ప్రోత్సహించడం.
* కనుమరుగవుతున్న వన్య జీవరాశులను గుర్తించి, వాటిని కాపాడటం.
* భారతదేశంలో అనేక ప్రాంతాల్లో వన్యప్రాణులను సంరక్షిస్తున్నారు. అరిచే జింకలు, హంగుల్‌ (కశ్మీరి దుప్పి), హిమాలయన్‌ మంచుకోడి, రాబందులు, సముద్రపు తాబేళ్లు, కలివి కోడి, కస్తూరి మృగం, పునుగు పిల్లి మొదలైనవన్నీ అంతరించిపోయే వన్యప్రాణుల జాబితాలో ఉన్నాయి.


వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 (The Wild Life Protection Act 1972) 
దేశంలోని వన్యప్రాణులు అంతరించిపోకుండా కాపాడేందుకు 1972లో వన్యప్రాణుల సంరక్షణ చట్టాన్ని రూపొందించారు. కొన్ని వన్యమృగాలను వేటాడటాన్ని ఈ చట్టం పూర్తిగా నిషేధించింది. దీని ద్వారా రాష్ట్ట్ర్రప్రభుత్వాలు పర్యావరణం/ భౌగోళిక స్వరూపం/ ప్రకృతి/ జంతుశాస్త్రపరంగా తగినంత ప్రాధాన్యం ఉన్న ప్రాంతాలను గుర్తిస్తాయి. అక్కడ వన్యప్రాణుల రక్షణ, పునరుత్పాదన, వృద్ధి కోసం జాతీయ ఉద్యానవనాలు, వన్యప్రాణుల సంరక్షణ స్థలాలను (Sanctuaries) ఏర్పాటు చేస్తాయి. 

లక్ష్యాలు:
1. వన్యప్రాణుల సంరక్షణ. 
2. వన్యప్రాణుల వేట, వాటి వ్యాపారాన్ని అరికట్టడం.
3. జాతీయ ఉద్యానవనాలను, పరిరక్షణ ప్రాంతాలను నియంత్రిచడం, నిర్వహించడం.
* వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972ను 2002లో సవరించారు. పర్యావరణ భద్రత కోసం వన్యమృగాలు, పక్షులు, మొక్కలను సంరక్షించడం దీని ఉద్దేశం. ఈ చట్టం ద్వారా ప్రధానమంత్రి అధ్యక్షతన జాతీయ మండలిని ఏర్పాటు చేస్తారు.

విధులు:
* వన్యప్రాణుల అభివృద్ధికి అవసరమైన విధానాలను రూపొందించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సలహాలు ఇవ్వడం.
* దేశంలో వన్యప్రాణుల సంరక్షణను సమీక్షించి, వాటి పురోగతికి అవసరమైన చర్యలు సూచించడం.
* వన్యప్రాణులకు చెందిన ఆయా ప్రాజెక్టులు, కార్యకలాపాలను పర్యావరణపరంగా మూల్యాంకనం చేయడం.
* కనీసం రెండేళ్లకోసారి దేశంలోని వన్యప్రాణుల స్థితిపై నివేదికలు రూపొందించి, ప్రచురించడం.
* రాష్ట్రాల్లో ముఖ్యమంత్రుల అధ్యక్షతన రాష్ట్రమండళ్లను ఏర్పాటు చేసేందుకు ఈ చట్టం వీలు కల్పిస్తుంది.  అవి వన్యప్రాణుల సంరక్షణ విధులను నిర్వహిస్తాయి.
* 2006లో వన్యప్రాణి సంరక్షణ చట్టం- 1972ను మరోసారి సవరించారు. పులుల రిజర్వ్‌ హాట్‌స్పాట్లలో టాస్క్‌ఫోర్స్‌ల ఏర్పాటుకు, వన్యప్రాణుల వేట/ వ్యాపారం చేసేవారి ఆస్తుల స్వాధీనానికి ఇది వీలు కల్పిస్తుంది.


జాతీయ పార్కులు
* ఏదైనా భౌగోళిక ప్రాంతాల్లో మానవ కార్యకలాపాల వల్ల అంతరించిపోయే దశలో ఉన్న వన్యప్రాణులు, ప్రకృతి సంపదను రక్షించేందుకు ఏర్పాటు చేసిన ఆవాసాలు/రక్షిత ప్రాంతాలను జాతీయ పార్కులు అంటారు.
* వీటిలో ఒక ప్రత్యేక జంతుజాతిని పరిరక్షిస్తారు.
* వన్యప్రాణులకు హాని కలగకుండా వినోదం, పర్యటకం, పరిశోధనలకు అనుమతిస్తారు.
* దేశంలో ప్రస్తుతం 4.85 మిలియన్‌ హెక్టార్లలో (1.-23%) 104 జాతీయ పార్కులు ఉన్నాయి. వీటిలో వంటచెరకు, అటవీ ఉత్పత్తులను సేకరించడం, పశువులను మేపడం నిషిద్ధం. వీటి సరిహద్దులను శాసనం ద్వారా నిర్ణయిస్తారు.


వన్యమృగ సôరక్షణ కేంద్రాలు/అభయారణ్యాలు (Sanctuaries) 
* వన్యజాతి, వృక్ష, జంతువుల సంరక్షణ కోసం వీటిని ఏర్పాటు చేశారు.
* వీటిని శాసనాల ద్వారా నిర్ణయించరు.
* వీటిలో వన్యప్రాణులకు హాని కలిగించకుండా అటవీ ఉత్పత్తులు, వంటచెరకును సేకరించొచ్చు.


తెలుగు రాష్ట్రాల్లోని సంరక్షణ కేంద్రాలు
ఆంధ్రప్రదేశ్‌
* శ్రీ వెంకటేశ్వర జాతీయ పార్క్‌ - చిత్తూరు
* పాపికొండలు జాతీయ పార్క్‌ - పాపికొండలు
* కౌండిన్య వన్యమృగ సంరక్షణ కేంద్రం - చిత్తూరు
* కోరింగ వన్యమృగ సంరక్షణ కేంద్రం - కాకినాడ
* గుండ్ల బ్రహ్మేశ్వరం వన్యమృగ సంరక్షణ కేంద్రం - కర్నూలు
* రాళ్లపాడు వన్యమృగ సంరక్షణ కేంద్రం - కర్నూలు
* శ్రీ లంకా మల్లేశ్వర వన్యమృగ సంరక్షణ కేంద్రం - కడప

 

తెలంగాణ
* మహవీర్‌ హరిణ వనస్థలి జాతీయ పార్క్‌ - హైదరాబాద్‌
* కిన్నెరసాని అభయారణ్యం - ఖమ్మం
* ప్రాణహిత వన్యప్రాణుల అభయారణ్యం - ఆదిలాబాద్‌
* ఏటూరు నాగారం అభయారణ్యం - వరంగల్‌
* మృగవని జాతీయ పార్క్‌ - హైదరాబాద్‌
* పాకాల అభయారణ్యం - వరంగల్‌
* మంజీర అభయారణ్యం - మెదక్‌
* పోచారం డ్యాం అభయారణ్యం - మెదక్‌
* నెహ్రూ జూలాజికల్‌ పార్క్‌ - హైదరాబాద్‌
* కావల్‌ టైగర్‌ రిజర్వ్‌ జాతీయ పార్క్‌ - జన్నారం
* నాగార్జునసాగర్‌ వన్యమృగ సంరక్షణ కేంద్రం - నాగార్జునసాగర్‌ 


బయోస్ఫియర్‌ రిజర్వ్‌ 
అంతరించే ప్రమాదంలో ఉన్న జాతులను వాటి భౌగోళిక ప్రాంతాల్లోనే పరిరక్షించడానికి ఏర్పాటు చేసిన బహుళ ప్రయోజనకర రక్షిత ప్రాంతాలను బయోస్ఫియర్లు అంటారు. ఇవి అడవుల్లో నివసించే గిరిజనుల జీవన శైలిని, పెంపుడు జంతువులు, మొక్కల జన్యు ఆధారాలను సంరక్షిస్తాయి.

మండలాలు: 
* బయోస్పియర్లను 3 మండలాలుగా విభజించారు. 
 కోర్‌జోన్‌: ఇక్కడ మానవ కార్యకలాపాలు నిషిద్ధం
తటస్థ మండలం: పరిశోధనల నిమిత్తం శాస్త్రవేత్తలకు అనుమతి ఉంటుంది.
 పరివర్తన మండలం: ఇది గిరిజనుల ఆవాసం. హోటళ్లకు, విహార యాత్రికులకు అనుమతి ఉంటుంది.
* 1986లో మొదటిసారి తమిళనాడులో నీలగిరి బయోస్ఫియర్‌ను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం దేశంలో వీటి సంఖ్య 18కి పెరిగింది. వీటిలో 11 బయోస్ఫియర్లను యునెస్కో  World Network of Biosphere Reserves (WNBR)లో చేర్చింది.


మిగిలిన బయోస్ఫియర్‌ రిజర్వ్‌లు:
* మానస్‌ - అసోం  
* రాణ్‌ ఆఫ్‌ కచ్‌ - గుజరాత్‌
* శీతల ఎడారి - జమ్మూ కశ్మీర్‌
* శేషాచలం కొండలు - ఆంధ్రప్రదేశ్‌
* పన్నా - మధ్యప్రదేశ్‌
* దిబ్రూ సైఖోవా - అసోం
* దిహంగ్‌ దిబంగ్‌ - అరుణాచల్‌ ప్రదేశ్‌
* గుజరాత్‌లోని రాణ్‌ ఆఫ్‌ కచ్‌ దేశంలోనే అతిపెద్ద బయోస్ఫియర్‌ రిజర్వ్‌. దీని విస్తీర్ణం 12,454 చ.కి.మీ. రెండోది తమిళనాడులోని గల్ఫ్‌ ఆఫ్‌ మన్నార్‌ (మన్నార్‌ సింధుశాఖ). బంగాళాఖాతంలోకి చొచ్చుకుని వచ్చిన భారత భూభాగమే మన్నార్‌ సింధుశాఖ. 
* దేశంలో అతిచిన్న బయోస్ఫియర్‌ రిజర్వ్‌ అసోంలోని దిబ్రూ సైఖోవా.
* WNBR ప్రపంచవ్యాప్తంగా 117 దేశాల్లో 621 బయోస్ఫియర్లను గుర్తించింది (2014 లెక్కల ప్రకారం).

 

జీవవైవిధ్య హాట్‌స్పాట్లు  
మనదేశంలో రెండు జీవవైవిధ్య హాట్‌స్పాట్లు ఉన్నాయి.
1. తూర్పు హిమాలయాలు 
2. పశ్చిమ కనుమలు
* పశ్చిమ కనుమల్లో అగస్త్యమలై కొండలు, సైలెంట్‌వ్యాలీ ముఖ్యమైన జీవవైవిధ్య కేంద్రాలు. 


జీవవైవిధ్య సంరక్షణ మార్గాలు
వరల్డ్‌ ఎన్విరాన్‌మెంట్‌ స్ట్రాటజీ జీవవైవిధ్య సంరక్షణ కోసం రెండు రకాల వ్యూహాలను సూచించింది. అవి:
సహజస్థాన (ఆవాసాంతర) సంరక్షణ  sIn Situz: మొక్కలు, జంతువులను అవి నివసించే సహజ ఆవరణ వ్యవస్థల్లో లేదా మానవ నిర్వహణలో ఏర్పాటు చేసిన ఆవరణ వ్యవస్థల్లో సంరక్షించడాన్ని సహజస్థాన సంరక్షణ అంటారు. ఇది అడవి మొక్కలు,  వన్యప్రాణులకు వర్తిస్తుంది. వాటి రక్షణకు చేపట్టిన చర్యలు:
* రక్షిత ప్రాంతాలు - జాతీయ పార్కులు, అభయారణ్యాలు
* బయోస్ఫియర్‌ రిజర్వ్‌
* అంతర్థానస్థితిలో ఉన్న జాతుల రక్షణకు ప్రత్యేక పథకాలు
* కమ్యూనిటీ, కన్జర్వేషన్‌ రిజర్వ్‌లు
* రిజర్వ్, రక్షిత, పవిత్ర అడవులు

స్థలబాహ్య (ఆవాసేతర) సంరక్షణ  (Ex Situ):-  వివిధ జాతుల జీవవైవిధ్యాన్ని వాటి సహజ ఆవాసంలో కాకుండా, వెలుపల సంరక్షించే పద్ధతిని స్థలబాహ్య సంరక్షణ అంటారు.
 

WNBR  గుర్తింపు పొందినవి

బయోస్ఫియర్‌ రిజర్వ్‌ సంవత్సరం
నీలగిరి 2000
గల్ఫ్‌ ఆఫ్‌ మన్నార్‌ 2001
సుందర్‌బన్స్‌ 2001
నందాదేవి 2004
నోక్రెక్‌ 2009
పంచ్‌మర్హి 2009
సిమ్లిపాల్‌ 2019
అచనక్‌మర్‌ - అమర్‌కంటక్‌ 2012
గ్రేట్‌ నికోబర్‌ 2013
అగస్త్యమలై 2016
కాంచన్‌జంగ 2018

 

దేశంలో వన్యమృగ సôరక్షణ కేంద్రాలు

జాతీయ పార్కు/అభయారణ్యం రాష్ట్రం ప్రత్యేక వన్యప్రాణులు
కజిరంగ జాతీయ పార్క్‌ అసోం ఒంటికొమ్ము ఖడ్గమృగం
కన్హా జాతీయ పార్క్‌ మధ్యప్రదేశ్‌ పులులు
కంగెర్‌ ఘటి జాతీయ పార్క్‌ ఛత్తీస్‌గఢ్‌ పులులు
శాల్వడోర్‌ సంరక్షణ కేంద్రం గుజరాత్‌ కంచర గాడిదలు
గిర్‌ వన్యమృగ సంరక్షణ కేంద్రం గుజరాత్‌ ఆసియా సింహాలు
జిమ్‌ కార్బెట్‌ జాతీయ పార్క్‌ ఉత్తరాఖండ్‌ పెద్ద పులులు
డచిగామ్‌ జాతీయ పార్క్‌ జమ్ముకశ్మీర్‌ కశ్మీరి దుప్పి
సలీం అలీ పక్షి సంరక్షణ కేంద్రం జమ్ముకశ్మీర్‌ హిమాలయన్‌ మంచుకోడి
కియోలాడియో/ఘనా సంరక్షణ కేంద్రం రాజస్థాన్‌ సైబీరియన్‌ కొంగలు
బొరివాలీ జాతీయ పార్క్‌ మహారాష్ట్ర అరిచే జింకలు
బన్నర్‌ఘట్ట జాతీయ పార్క్‌ కర్ణాటక  సీతాకోక చిలుకలు
బందీపూర్‌ వన్యమృగ సంరక్షణ కేంద్రం కర్ణాటక ఆసియా ఏనుగులు
సైలెంట్‌వ్యాలీ జాతీయ పార్క్‌ కేరళ మాకాక్‌ కోతులు
సిమ్లిపాల్‌ జాతీయ పార్క్‌ ఒడిశా తెల్ల పులులు
గిండి జాతీయ పార్కు తమిళనాడు పాములు
మదుమలై వన్యమృగ సంరక్షణ కేంద్రం తమిళనాడు ఏనుగులు
వేదాంతగల్‌ పక్షి సంరక్షణ కేంద్రం తమిళనాడు కొంగలు
రాజీవ్‌గాంధీ టైగర్‌ వ్యాలీ ప్రాజెక్ట్‌ ఆంధ్రప్రదేశ్‌ పులులు

 

​​​​​​​* భారతదేశంలో అతిపెద్ద జాతీయ పార్క్‌ - హైమీస్‌ హై ఆల్టిట్యూడ్‌. ఇది లద్దాఖ్‌లో ఉంది.
* మనదేశంలో మధ్యప్రదేశ్‌లో జాతీయ పార్కులు ఎక్కువగా ఉన్నాయి. మహారాష్ట్రలో అధికంగా వన్యమృగ సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి.

Posted Date : 28-06-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌