• facebook
  • whatsapp
  • telegram

శాతవాహనుల నుంచి కుతుబ్‌షాహీల దాకా.. వ్యవ‌సాయ, వ్యాపార ప్రగ‌తి, ప‌ట్టణీక‌ర‌ణ‌

శాతవాహనుల కాలంలో అధిక సంఖ్యలో ప్రజలకు వ్యవసాయమే జీవనాధారం. అందుకే పాలకులు కూడా వ్యవసాయాభివృద్ధికి విశేషంగా కృషి చేశారు. నాటి కాలంలో వ్యవసాయ భూములను రెండు రకాలుగా వర్గీకరించారు. మొదటి రకం - రాజు సొంత భూములు. వీటిని 'రాజ కంఖేట' లేదా 'రాజక్షేత్రం' అనేవారు. రెండో రకం - రైతులు సాగు చేసుకునే భూములు. గ్రామాల్లోని వ్యవసాయ క్షేత్ర పనులన్నీ గౌల్మిక (గ్రామపెద్ద) పర్యవేక్షణలో జరిగేవి. 'దున్నే వాడిదే భూమి' అనే భావనకు శాతవాహనుల కాలం నుంచే బీజాలు పడ్డాయి. శాతవాహన రాజులు దున్నే భూమిపై రైతులకు హక్కులను కల్పించారు. మొదటిసారిగా దక్కన్ ప్రాంతంలో భూములను దానం చేసే విధానాన్ని ప్రవేశపెట్టారు.
భారతదేశ చరిత్రలో సింధు ప్రజల నుంచి మౌర్యుల కాలం వరకూ వ్యవసాయానికి వర్షాలే ఆధారం. మౌర్యుల అనంతరం శాతవాహనుల కాలంలో ఆధునిక వ్యవసాయ పద్ధతులు ప్రారంభమయ్యాయి. వీరు బావులు, చెరువులను తవ్వించారు. వీటి నుంచి నీటిని తోడటానికి 'ఉదక యంత్రాలు' ఉపయోగించినట్లు 'నాసిక్ శాసనం'లో ఉంది. నీటిని పట్టేందుకు/ తోడే సాధనం 'ఘటి యంత్రం'.. ముడిపత్తి నుంచి విత్తనాలు వేరుచేసే యంత్రాన్ని 'గరిక యంత్రం' అని వ్యవహరించేవారు. ఆధునిక వ్యవసాయ సామగ్రి, పరికరాల రూపకల్పన బాధ్యతలను గిల్టులు / శ్రేణులు చూసుకునేవి. భూమిని దున్నడానికి గాడిదలను, దున్నలను ఉపయోగించేవారు. శాతవాహనుల కాలంలో రాజ్యానికి ప్రధాన ఆదాయ వనరు భూమిశిస్తు. పంటలో ఆరో వంతు శిస్తుగా చెల్లించాల్సి ఉండేది. పంటలో రాజు భాగాన్ని 'దయామేయం' అనేవారు.

 

భూమిశిస్తు ఆదాయ వనరు

ఇక్ష్వాకుల కాలంలో వర్తక, వ్యాపారాలు కుంటుపడ్డాయి. ఈ పరిస్థితులు పరోక్షంగా పాలకులను వ్యవసాయాభివృద్ధికి కృషి చేసేలా చేశాయి. భూమిశిస్తు ప్రధాన ఆదాయ వనరు కాబట్టి పాలకులు వ్యవసాయాభివృద్ధికి కృషి చేశారు. వాశిష్టీపుత్ర శాంతమూల చక్రవర్తి వ్యవసాయాన్ని విస్తరించడానికి బంగారు నాణేలను, భూమిని, నాగళ్లను, గోవులను దానం చేశాడు. ఇతడు లక్ష నాగళ్లను దానం చేసినట్లు.. ఇతడికున్న 'శతసహస్ర హాలక' అనే బిరుదును బట్టి తెలుస్తోంది.
విష్ణుకుండినులు కూడా వ్యవసాయాభివృద్ధికి విస్తృతంగా భూములను దానం చేశారు. ఫలితంగా తెలంగాణలోని మారుమూల ప్రాంతాల్లో కూడా వ్యవసాయాభివృద్ధికి అవకాశం ఏర్పడింది. బ్రాహ్మణులకు భూదానాలు ఇచ్చారు. చాళుక్య పాలకులు కూడా ఉదారంగా భూదానాలు చేయడం ద్వారా వ్యవసాయాభివృద్ధికి కృషి చేశారు. బ్రాహ్మణులకు భూదానాలు ఎక్కువయ్యాయి. పైగా పన్ను రహిత భూములను విరాళంగా (అగ్రహారాలు) ఇచ్చారు.

 

నేలలు.. రకాలు

చాళుక్యుల కాలం నాటి శాసనాల ద్వారా వివిధ రకాల నేలలు / భూములు ఉన్నట్లు తెలుస్తోంది. అవి నల్లరేగడి నేల, నీరు లేదా పానీయ క్షేత్రం, పన్నస లేదా చిత్తడి నేల, రాజ్యభూమి, పూదొంట లేదా పూవనితోట లాంటివి. చాళుక్య రాజులు పన్నులను విస్తృతంగా వసూలు చేశారు. భూమిశిస్తు, సేద్యపు నీటి సౌకర్యంపై పన్ను, పశుగ్రాసంపై పన్ను, ఇంటిపన్ను, ఆఖరుకు వివాహాలపై కూడా పన్నులు విధించారు. దీన్నిబట్టి ప్రజలకు పన్నుపోటు ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది. వీరికాలంలో పన్నుల వసూళ్లకు 'సుంకాధికారులు' (పన్ను వసూలు అధికారులు) కూడా నియమితులయ్యారు.
 

కౌలు విధానం

కాకతీయుల కాలం నాటి ఆర్థిక వ్యవస్థలో కూడా వ్యవసాయం ప్రధాన పాత్ర పోషించింది. ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం. ఓరుగల్లు ప్రాంతంలో సువాసనలు వెదజల్లే బియ్యాన్ని పండించినట్లు విదేశీ యాత్రికుడైన 'మార్కోపోలో' పేర్కొన్నాడు. వ్యవసాయ భూముల్లో రాజు సొంత భూములను అర్ధాదాయానికి కౌలుకిచ్చేవారు. ఇలాంటి కౌలుదార్లను 'అర్ధసిరి' అని వ్యవహరించే వారు. భూమిశిస్తు - పంటలో పదో వంతుగా ఉండేది. వీరి కాలంలో భూములను / పొలాలను 'గడ' లేదా 'దండ' లేదా 'కోల'ల్లో కొలిచేవారు. ఒక్కో 'గడ' పొడవు 32 జానలు ఉండేది. సాగు భూములను కాకతీయులు 3 రకాలుగా వర్గీకరించారు. అవి వెలిచేను, నీరునేల, తోటభూమి. 'కోరు, పుట్టి, సహితి' అనేవి వ్యవసాయం మీద విధించిన పన్నులు కాగా, గడ్డి మీద కూడా 'పుల్లరి పన్ను'ను విధించారు.
కుతుబ్‌షాహీల కాలంలో కూడా ఎక్కువమంది ప్రజలు వ్యవసాయం మీదే ఆధారపడి జీవించేవారు. పాలకులు వ్యవసాయభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇచ్చారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మొత్తం వ్యవసాయోత్పత్తులపైనే ఆధారపడింది. ప్రతి గ్రామంలోనూ సంతలు, వారాంతపు అంగళ్లు జరిగేవని.. నాటి రచన 'హంస వింశతి' ద్వారా తెలుస్తోంది. రాజ్యానికి ప్రధాన ఆదాయం భూమిశిస్తు. ఈ విధంగా ఆయా కాలాల్లో తెలంగాణ ప్రజల ప్రధాన ఆర్ధిక వ్యవస్థ వ్యవసాయంపైనే ఆధారపడటంతో పాలకులు వ్యవసాయాభివృద్ధికి విశేష ప్రాధాన్యం ఇచ్చారు.

 

నీటి పారుదలకు పెద్దపీట

తెలంగాణ సమాజంలో ప్రాచీన కాలం నుంచీ ఆర్థిక వ్యవస్థలో అత్యంత ప్రాధాన్యం ఉన్న వ్యవసాయ రంగానికి వెన్నూ-దన్నూ కూడా పాలకులు కల్పించిన నీటిపారుదల సౌకర్యాలే. దేశంలో అందుబాటులో ఉన్న చారిత్రక ఆధారాల మేరకు మౌర్యుల కాలంలో తవ్వించిన జలాశయాల్లో 'సుదర్శన తటాకమే' మొదటిదని చెప్పవచ్చు. మౌర్యుల రాజకీయ వారసులైన దక్షిణాత్య శాతవాహనులు, వారి అనంతరం ఇక్ష్వాకులు, విష్ణుకుండినులు వ్యవసాయాభివృద్ధికి విశేషంగా కృషి చేసినప్పటికీ చెరువులు, తటాకాలు, జలాశయాలు నిర్మించిన ప్రస్తావన లేదు. తెలంగాణలో తొలిసారిగా వేములవాడ / ముదిగొండ చాళుక్యుల కాలం నాటి శాసనాలు చెరువులను, తటాకాలను పేర్కొంటున్నాయి. మదివోజనకెరె (మెదక్), బీమసముద్రం (మహబూబ్‌నగర్), బృహత్ తటాక (నల్గొండ), అచ్చెబ్బె సముద్ర (చొప్పదండి) తదితర తటాకాలను చాళుక్య శాసనాలు ప్రస్తావించాయి. సహజ సిద్ధంగానే తెలంగాణ ప్రాంతంలో వర్షాభావ పరిస్థితులు నెలకొనడం, సారవంతమైన నేలలు లేకపోవడం వల్ల కృత్రిమ నీటిపారుదల సౌకర్యాలు కల్పించడం పాలకులకు అనివార్యమైంది. అందుకే వారు చెరువులను, కుంటలను నిర్మించారు. వీటినే - కెరె, సముద్రం, కుంటలు, తటాకాలు అని పిలిచేవారు. ఇక్ష్వాకుల కాలం నుంచి మందగించిన ఆర్థిక వ్యవస్థను తిరిగి చాళుక్య పాలకులు కల్పించిన నీటిపారుదల సౌకర్యాల ఫలితంగా వ్యవసాయాభివృద్ధి సాధ్యమై ఆర్థిక పరిస్థితులు మెరుగయ్యాయి.
 

చెరువుల నిర్మాణం

నీటిపారుదల సౌకర్యాల విషయంలో తెలంగాణలో కాకతీయుల కాలాన్ని మహోజ్జ్వల ఘట్టంగా చెప్పవచ్చు. కాకతీయ పాలకులు చెరువులు / తటాకాల నిర్మాణాన్ని పవిత్ర కార్యంగా, సప్తసంతానాల్లో భాగంగా భావించి చెరువుల తవ్వకాన్ని విస్తృతంగా కొనసాగించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నేడు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న 'మిషన్ కాకతీయ', 'జలహారం' కార్యక్రమాలకు కాకతీయులు నిర్మించిన చెరువులే స్ఫూర్తిగా నిలిచాయి. కాకతీయుల కాలంలో చెరువులను సముద్రాలు అని కూడా పిలిచేవారు. కనీసం ప్రతి ఊరుకొక చెరువు నిర్మించి వ్యవసాయానికి కాకతీయులు ప్రాణవాయువై నిలిచారు.
కాకతీయ పాలకులు ముఖ్యంగా 'గొలుసుకట్టు చెరువు'లకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు. అంటే ఒక చెరువు నిండిన తర్వాత మిగులు జలాలు కిందనున్న మరో చెరువులోకి చేరేవిధంగా చెరువులను నిర్మించడం. వీరు నిర్మించిన ప్రధాన చెరువుల్లో ఘనపురం, బయ్యారం, రామప్ప, పాకాల, లక్నవరం, చౌడ సముద్రం, బాల సముద్రం, కోట సముద్రం, నామ సముద్రం, అంబ సముద్రం, కేసముద్రం లాంటివి ఉన్నాయి. మొదటి ప్రోలరాజు కేసముద్రాన్ని, రుద్రదేవుడు పానగల్లులో రుద్ర సముద్రాన్ని, గణపతిదేవుని సేనాని రేచర్లరుద్రుడు పాకాల, రామప్ప చెరువులను తవ్వించారు. గణపతిదేవ చక్రవర్తి సోదరీమణులు మైలాంబ బయ్యారం, ధర్మసాగర్ చెరువులను; కుందాంబ కుంద సముద్రాన్ని నిర్మించారు. కాకతీయులు 'దశవంద ఇనాం' పద్ధతిలో చెరువుల్ని తవ్వించి రైతులకు సేద్యపు నీటి సదుపాయాల్ని కల్పించారు. అంటే - సేద్యపు నీటి ద్వారా ప్రయోజనం / లబ్ది పొందిన రైతులు తమ పంటలో పదో వంతు శిస్తు చెల్లించడం.
తెలంగాణలో వ్యవసాయ రంగానికి నీటిపారుదల సౌకర్యాల కల్పన విషయంలో కాకతీయుల వారసత్వాన్ని కుతుబ్‌షాహీ పాలకులు కొనసాగించారు. ఇబ్రహీం కులీ కుతుబ్‌షా ఇబ్రహీంపట్నం, హుస్సేన్‌సాగర్ చెరువులను తవ్వించాడు. హుస్సేన్‌సాగర్ నిర్మాణం హుస్సేన్‌షావాలీ స్వీయ పర్యవేక్షణలో కొనసాగింది. రాజమాత మాసాహెబా 'మాసాహెబా ట్యాంక్‌'ను నిర్మించింది. కుతుబ్‌షాహీ పాలకులు నీటిపారుదల సౌకర్యాల పునరుద్ధరణ, నిర్మాణ బాధ్యతలను గ్రామం, సర్కారు, పరగణా, తరఫ్ స్థాయుల్లో ఆయా స్థానిక అధికారులకే అప్పజెప్పారు. వీటి నిర్మాణాలకు ప్రత్యేకంగా రాయితీలను కల్పించి ప్రోత్సహించారు.

 

నేత వస్త్రాలు, వజ్రాలు

వ్యవసాయంతో పాటు చిన్న, కుటీర పరిశ్రమలు ఆర్థిక వ్యవస్థలో క్రియాశీలక పాత్ర పోషించాయి. శాతవాహనుల కాలం నాటి సమాజంలో ఉన్నత, సంపన్న వర్గాలుగా పేరొందిన వ్యక్తులు, వర్తకులు, శ్రేణులు ఆదాయార్జనలో, హోదాలో పాలకులతో పోటీపడ్డారు. ఫలితంగా చిన్నతరహా, కుటీర పరిశ్రమలు అభివృద్ధి చెందాయి. వివిధ వృత్తులు, వృత్తి ఆధారిత పరిశ్రమలు అభివృద్ధి చెందడం వల్ల పట్టణ ప్రాంతాల ప్రజలు సుఖసంతోషాలతో విలాసవంతమైన జీవితం గడిపినట్లు తెలుస్తోంది. శాతవాహనుల కాలం నాటి ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం తర్వాత పరిశ్రమలదే స్థానమని నాటి వాఞ్మయ, శాసనాధారాలు స్పష్టం చేస్తున్నాయి. నాసిక్, జున్నార్ శాసనాలు నాటి కాలంలోని వివిధ వ్యాపారాలు, పరిశ్రమలు, శ్రామికుల గురించి ప్రస్తావించాయి. వాటి ప్రకారం.. తిలపిష్టకులు - నూనె తీసేవారు, దమ్మికులు - ధాన్యం వర్తకులు, కొలికలు - నేత పనివారు, వసకరులు - వెదురు బుట్టలు అల్లేవారు లేదా మేదర్లు. ఈ కాలంలో చేతివృత్తులు బాగా విలసిల్లడం వల్లే పాలకులు చేతివృత్తులదారులపై 'కురుకర' అనే పన్ను విధించినట్లు తెలుస్తోంది. శాతవాహనుల అనంతరం విష్టుకుండినులు, ఇక్ష్వాకుల కాలంలో పారిశ్రామిక రంగం చెప్పుకోదగ్గ ప్రగతిని సాధించలేదు. చాళుక్యుల కాలంలో తిరిగి చేతివృత్తులు, పరిశ్రమలు ప్రాభవం పొందాయి. కాకతీయుల కాలంలో నేత పరిశ్రమ, వజ్రాలు, నూనె పరిశ్రమలు ఆర్థిక వ్యవస్థలో ప్రధాన పాత్ర పోషించాయి. తెలంగాణ / తెలుగు ప్రాంతం ప్రాచీన కాలం నుంచే సన్నని వస్త్రాలు, చీరలకు ప్రసిద్ధి గాంచింది. ఓరుగల్లు రత్నకంబళ్లకు, తివాచీలకు, మఖ్‌మల్ వస్త్రాలకు ప్రసిద్ధి చెందినట్లు కవులు, విదేశీ యాత్రికులు తమ రచనల్లో ప్రస్తావించారు. పాల్కురికి సోమనాథుడు తన 'పండితారాధ్య చరిత్ర'లో 50కి పైగా వివిధ రకాలైన వస్త్రాలను పేర్కొనడాన్ని బట్టి నాటి నేత పరిశ్రమ వైభవాన్ని అర్థం చేసుకోవచ్చు. రుద్రమదేవి కాలంలో కాకతీయుల రాజ్యాన్ని సందర్శించిన వెనీస్ యాత్రికుడు మార్కోపోలో సైతం ఇక్కడి వస్త్ర-నేత కళా నైపుణ్యాన్ని చూసి ముగ్ధుడై ఇలా ప్రశంసించాడు..
'వీటి ధర చాలా ప్రియం. నిజంగా ఆ దుస్తులు సాలెగూడు కన్నా సన్నగా ఉంటాయి. ఆ వస్త్రాలను ధరించని రాజు కానీ, రాణి కానీ ప్రపంచంలో లేరు'.
          కాకతీయుల కాలంలో మైసోలియా (మచిలీపట్నం) ప్రాంతం వస్త్ర తయారీకి ప్రసిద్ధి చెందినట్లు ప్లీనీ తన 'నేచురల్ హిస్టరీ'లో పేర్కొన్నాడు. కాకతీయుల కాలం నుంచే గోల్కొండ ప్రాంతం వజ్రాల గనులకు ప్రసిద్ధి చెందింది. ఈ ప్రాంతంలో వజ్రాల గనులున్నట్లు మార్కోపోలో తెలిపాడు. కుతుబ్‌షాహీల కాలంలో గోల్కొండ వజ్రాలు ప్రపంచ ప్రసిద్ధి చెందాయి. విదేశీ యాత్రికుడు మెతోల్డ్, గోల్కొండలో వజ్రాల గనులున్నట్లు పేర్కొన్నాడు. ట్రావెర్నియర్ అనే యాత్రికుడు కొల్లూరు వజ్రాల గని గురించి రాస్తూ సుమారుగా 60 వేల మంది కార్మికులు ఇక్కడ వజ్రాల పరిశ్రమల్లో పనిచేసేవారని పేర్కొన్నాడు. ఫ్రెంచ్ యాత్రికుడు ట్రావెర్నియర్ తాను 1665లో ఔరంగజేబు కోశాగారంలో ప్రత్యక్షంగా 'కోహినూర్' వజ్రాన్ని చూశానని పేర్కొన్నాడు. చివరకు 1849లో లార్డ్ లారెన్స్ ఈ కోహినూర్ వజ్రాన్ని బ్రిటిష్ మహారాణి విక్టోరియాకు బహుకరించాడు. దీని బరువు 106 క్యారెట్‌లు. ఈ వజ్రం సుల్తాన్ అబ్దుల్లా కుతుబ్‌షా కాలంలో వెలికితీశారు. ఇది కొల్లూరు వజ్రాలగనిలో లభించినట్లు ట్రావెర్నియర్ అభిప్రాయపడ్డాడు. గోల్కొండ రాజ్యం వజ్రాలకే కాకుండా వస్త్రాలకు కూడా పేరు పొందింది. ఈ రాజ్యంలోనే అత్యంత మేలురకమైన వస్త్రాలకు, వస్త్రాల ఎగుమతులకు 'మైసోలియా' ప్రసిద్ధి చెందింది. కుతుబ్‌షాహీలు ముఘ్రా, తెలియా నేత పనివారిని ఆదరించారు. వీరి తర్వాత మొగల్ చక్రవర్తుల దాడులు తెలుగు ప్రాంతంలోని చేనేత పరిశ్రమపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి.

 

పట్టణ, నగరీకరణలు

తెలంగాణ ప్రాంతంలో శాతవాహనుల కాలం నుంచి కుతుబ్‌షాహీల వరకు క్రమంగా వ్యాపారం, అభివృద్ధి విస్తృతి.. పట్టణాలు, నగరాల ఏర్పాటుకు మార్గాన్ని సుగమం చేశాయి. వ్యవసాయం, పరిశ్రమలు, వర్తక వ్యాపారాలు పుంజుకున్నాయి. దేవాలయాలు కూడా ఆర్థిక వ్యవస్థలో క్రియాశీలం కావడంతో మధ్యయుగంలో అనేక వాణిజ్య నగరాలు, కొత్త పట్టణాలు వెలిశాయి. ప్రాచీన యుగంలో ధాన్యకటకం, అమరావతి, నాగార్జునకొండ, విజయపురి.. మధ్యయుగంలో వరంగల్, వేములవాడ, ఆలంపూర్, పొలాస, శ్రీశైలం, గోల్కొండ తదితర పట్టణాలు, నగరాలు అవతరించాయి. ఇవి ఆర్థిక వ్యవస్థకు కేంద్రాలై నగర జీవనాన్ని ప్రతిబింబించాయి.
 

వర్తక వ్యాపారాలు

వ్యవసాయం, పరిశ్రమలతో పాటు స్వదేశీ, విదేశీ వర్తక వాణిజ్యాలు తెలంగాణ ప్రజల ఆర్థిక వ్యవస్థలో ప్రాచీన యుగం నుంచే చెరగని ముద్రవేశాయి. శాతవాహనుల కాలంనాటి పరిశ్రమల వల్ల స్వదేశీ, విదేశీ వాణిజ్యం కూడా వృద్ధి చెందింది. దేశీయ వ్యాపారాలన్నీ 'గిల్డు' లేదా 'శ్రేణులు' అనే సంఘాల ద్వారా జరిగేవి. ప్రతి వృత్తిపనివారికి సంఘాలు ఉండేవి. శాతవాహనుల కాలంలో ఇలాంటివి 18 సంఘాలున్నట్లు తెలుస్తోంది. ఈ 'గిల్డు'లు అనేవి నేటి సహకార బ్యాంకుల్లా లావాదేవీలు నిర్వహించేవి. దేశీయ వ్యాపారం, రవాణా ఎడ్ల బండ్ల ద్వారా జరిగేవి. వస్తు మార్పిడి పద్ధతిలో వ్యాపార లావాదేవీలు నిర్వహించేవారు. వీరి కాలంలో విదేశీ వర్తకం బాగా సాగింది. శాతవాహనుల కాలం నాటి విదేశీ వర్తకం ఎక్కువగా రోమ్‌తోనే జరిగేది. విదేశాల్లో వర్తకం చేసే వ్యాపారులను 'సార్ధవాహులు' అనేవారు. ప్రధానంగా విదేశీ వ్యాపారం నౌకల ద్వారా సాగేది. సన్నని నాణ్యమైన మస్లిన్, పట్టు, సిల్కు వస్త్రాలు విదేశాలకు ఎగుమతయ్యేవి. పైఠాన్, తగర, జున్నార్, నాసిక్, వైజయంతిలు పశ్చిమ తీరాన ఉన్న నౌకా కేంద్రాలుగా ప్రసిద్ధి చెందాయి. తూర్పు తీరాన కోడూరు, మైసోలియా, ఘంటశాలలు ప్రధాన రేవు పట్టణాలు. యజ్ఞశ్రీ శాతకర్ణి తన నాణేలపై ఒకవైపు నౌకబొమ్మను ముద్రించాడు. ఇక్ష్వాకుల కాలంలో వర్తక వ్యాపారాల్లో సహకార స్ఫూర్తి కొరవడటంతో వ్యాపారానికి, ఉత్పాదకతకు మధ్య సమన్వయం కుదురలేదు. ఫలితంగా చేతి వృత్తులు, కుటీర పరిశ్రమలు దెబ్బతిని వర్తక, వ్యాపారాలు మందగించాయి. శాతవాహనుల కాలం నాటి శ్రేణులు / నిగమాలు / వర్తక సంఘాలు ప్రాభవాన్ని కోల్పోయాయి. తిరిగి చాళుక్యుల కాలంలో అవి పునర్‌వైభవాన్ని సాధించడంతో ఆర్థిక వ్యవస్థ, వర్తక వ్యాపారాలు ఊపందుకున్నాయి.
కాకతీయల కాలం నాటి దేశీయ వ్యాపారంలో కూడా వర్తక సంఘాలు గణనీయమైన పాత్ర పోషించాయి. వీరి కాలంలోని ముఖ్య వర్తక సంఘాలు అయిదు. అవి.. స్వదేశీ, పరదేశీ, నానాదేశీ, నకరం, పెక్కుండ్రు. వీరి కాలంనాటి వ్యాపార వస్తు సామగ్రిలో మూడు రకాలైన భాండాలను (కొలత పాత్రలు) ఉపయోగించారు. అవి భూసి భాండం - ఆహారధాన్యాలు.. కొలభాండం - ఆవాలు, మిరియాలు, నువ్వుల నూనెలు.. మణిభాండం - ముత్యాలు, నగలు, విలువైన రాళ్లు, రత్నాలను కొలవడానికి ఉపయోగించేవారు. విదేశీ వ్యాపారం ప్రధానంగా రేవు పట్టణాల ద్వారా జరిగేది. సన్నని నూలు వస్త్రాలు, వజ్రాలు విదేశాలకు ఎగుమతయ్యేవి. తూర్పు తీరంలోని ప్రధాన రేవు పట్టణాలు మోటుపల్లి, మచిలీపట్నం, కృష్ణపట్నం, హంసలదీవి.

 

వర్తక కేంద్రాలు

కుతుబ్‌షాహీల కాలం నాటి వర్తక, వ్యాపార విశేషాలను సమకాలీన రచనలైన శుకసప్తతి, హంసవింశతిలు తెలియజేస్తున్నాయి. గోల్కొండ, హైదరాబాద్, వరంగల్, మచిలీపట్నం, కొండపల్లి, పెనుగొండ, తిరుపతి, ఉదయగిరి, నిజాంపట్నం, మోటుపల్లి తదితర ప్రాంతాలు వీరి కాలంనాటి ప్రధాన వర్తక కేంద్రాలు. నాటి తెలంగాణలోని అన్ని ప్రధాన ఆధ్యాత్మిక ప్రాంతాలు, పుణ్యక్షేత్రాలు, పెద్దపెద్ద వర్తక కేంద్రాలుగా ప్రసిద్ధి చెందాయి. వేములవాడ, గుల్బర్గా, ఔరంగాబాద్, అహోబిలం, శ్రీశైలం, తిరుపతి పట్టణాలు సుప్రసిద్ధ తీర్థయాత్ర కేంద్రాలుగా వైభవాన్ని సంతరించుకున్నాయి. ఆయా ప్రాంతాలు, క్షేత్రాల్లో ఏటా జరిగే వార్షికోత్సవాలు, తిరునాళ్లు, జాతరల సందర్భంగా భారీ ఎత్తున వ్యాపారం జరిగేది. దేశీయ వ్యాపారానికి సంబంధించి ఎద్దులపై, ఎద్దులబండ్లపై, ఒంటెలపై సరకులు రవాణా ద్వారా చేసేవారు. పెరిక (జనపనార సంచులు)ల్లో సరకులను నింపి చేరవేసేవారు. క్రమంగా పెరికలు ఒక సామాజిక వర్గంగా అవతరించారు. ఈనాటి దేశీయ / విదేశీయ వ్యాపారంలో స్థానిక వైశ్యులు / కోమట్లు, గౌరలు, విదేశీ అరబ్బులు, యూరోపియన్‌లు ప్రముఖ పాత్ర పోషించారు. వీరికాలంలో ప్రధానంగా విదేశీ వర్తకం మోటుపల్లి ఓడరేవు ద్వారా జరిగేది. గోల్కొండ వజ్రాలు, మేలురకపు వస్త్రాలు ఈ రేవు నుంచి ఐరోపా దేశాలకు ఎగుమతయ్యేవి. నౌకలపై సముద్రం ద్వారా జరిగే విదేశీ వర్తకాన్ని 'శుకసప్తతి'లో ఓడ బేరంగా పేర్కొన్నారు. 'ఓడకాడు' అనే మాట కూడా అందులో పేర్కొన్నారు. ఫ్రెంచ్ యాత్రికులైన ట్రావెర్నియర్, ధీవ్‌నాట్, బెర్నియార్.. బ్రిటిష్ వ్యాపారి థామస్‌బౌరీలు కుతుబ్‌షాహీల కాలంనాటి విదేశీ వర్తక, వాణిజ్య విశేషాలను వర్ణించారు. కుతుబ్‌షాహీల కాలం నాటి ప్రధాన రేవు పట్టణాలు మచిలీపట్నం, పులికాట్, నరసాపురం, నిజాంపట్నం. రేవు ప్రధానాధికారిని 'షాబందర్' అంటారు.
 

నాణేలు

    శాత‌వాహ‌నుల కాలంనాటి వ‌ర్తక సంఘాలు పంచ్ మార్క్‌డ్ నాణేల‌ను ముద్రించేవి. వీరి కాలంలో సీసం, పోటీన్‌, వెండి, బంగారు నాణేలు చెలామ‌ణిలో ఉన్నాయి. ఎక్కువ‌గా సీస‌పు నాణేలు వాడుక‌లో ఉన్నాయి. శాత‌వాహ‌నుల బంగారు నాణేన్ని 'సువ‌ర్ణాలు' అని, వెండి నాణేన్ని 'క‌ర్షాప‌ణ' అని వ్యవ‌హ‌రించేవారు. 1 సువ‌ర్ణ = 35 కర్షాపణాలు. శాతవాహన కాలంనాటి వర్తక వ్యాపారాల గురించి రాస్తూ ప్లీనీ తన 'నేచురల్ హిస్టరీ'లో 'రోమ్ దేశ బంగారం భారత్‌కు తరలిపోతుందని' పేర్కొన్నాడు. కాకతీయుల కాలంనాటి బంగారు నాణెం 'గద్వాణం', వెండి నాణేలు 'రూకలు'. నాణేలన్నింట్లోకెల్లా పెద్దది గద్వాణం. దీన్నే మాడ, నిష్కం అని కూడా అంటారు. 1 మాడ = 10 రూకలు. కుతుబ్‌షాహీల కాలం నాటి బంగారు నాణెం హొణ్ణు. విదేశీ వర్తకులు దీన్నే పగోడా అని కూడా అనేవారు. ఫణం / తార్ / కాసు అనేవి ఇతర నాణేలు. 'కుతుబ్‌షాహీల కాలంనాటి ప్రభుత్వ ఆదాయం రూ.5 కోట్లు' అని మెతోల్డ్ అనే చరిత్రకారుడు వ్యాఖ్యానించాడు.
 

 

Posted Date : 19-05-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు