• facebook
  • whatsapp
  • telegram

ప్రాథమిక హక్కులు

పీడన నిరోధపు హక్కు (నిబంధనలు 23-24) 
వ్యక్తి హుందాతనాన్ని, ఆత్మగౌరవాన్ని పెంపొందించడం, దోపిడీకి గురికాకుండా కాపాడటమే ఈ హక్కు ఉద్దేశం.

 

నిబంధన 23(1)
ఈ నిబంధన ప్రకారం చట్టానికి వ్యతిరేకంగా మనుషుల క్రయ, విక్రయాలు జరపడం, వెట్టిచాకిరి, నిర్బంధంగా పని చేయించడాన్ని నిషేధించారు. దీని ప్రకారం వ్యభిచారం, దేవదాసి లేదా జోగిని పద్ధతులను నిషేధించారు (వీటిని అమలు చేయడానికి పార్లమెంటు 1956 లో అశ్లీల, అసభ్య వ్యాపార నిరోధక చట్టాన్ని రూపొందించింది. దీన్ని 2006 లో సవరించారు).
* వెట్టిచాకిరీ నిరోధక చట్టం 1976
* కనీస వేతనాల చట్టం 1948, 1976
* అనైతిక కార్యకలాపాల నిషేధ చట్టం 1978
* సమాన పనికి సమాన వేతన చట్టం 1976
* 23 (2) ప్రకారం ప్రజా ప్రయోజనం కోసం నిర్బంధంగా పౌరులు, ఉద్యోగులతో రుసుము చెల్లించి లేదా చెల్లించకుండా సేవ చేయించే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. అయితే ఇందులో మతం, జాతి, కులం, వర్గం మొదలైన వివక్షలను చూపకూడదు. నిర్బంధ మిలిటరీ సేవ, నిర్బంధ సామాజిక సేవ బలవంతపు వెట్టిచాకిరీ కిందికి రావు.

 

నిబంధన 24 
దీని ప్రకారం 14 సంవత్సరాల్లోపు పిల్లలతో కర్మాగారాలు, గనులు, ఇతర ప్రమాదకరమైన ఉత్పత్తులకు సంబంధించిన పనులు చేయించకూడదు.ఉదాహరణకు భవన నిర్మాణం, రైల్వేలు మొదలైనవి. అయితే, ఈ నిబంధన హానికరంకాని పనుల్లో నియమించుకోవడాన్ని నిషేధించలేదు. ఈ నిబంధన అమలుకు రాజ్యాంగం అమల్లోకి రాకముందు కొన్ని చట్టాలున్నాయి. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత పార్లమెంటు అనేక చట్టాలు చేసింది. అవి:
1. బాలల ఉపాధి చట్టం - 1938
2. ఫ్యాక్టరీల చట్టం - 1948
3. ప్లాంటేషన్ కార్మిక చట్టం - 1951
4. మోటార్ ట్రాన్స్‌పోర్ట్ కార్మికుల చట్టం - 1951
5. గనుల చట్టం - 1952
6. మనుషుల అక్రమ వ్యాపార నిషేధ చట్టం - 1956
7. మర్చంట్ షిప్పింగ్ చట్టం - 1958
8. ప్రొబేషన్ ఆఫ్ అఫెండర్స్ చట్టం - 1958
9. అప్రెంటిస్ చట్టం - 1961
10. బీడీ, సిగరెట్ కార్మికుల చట్టం - 1966
11. బాలకార్మిక (నిషేధ, నియంత్రణ) చట్టం - 1986
12. బాలకార్మిక హక్కుల చట్టం - 2005
13. 2006 లో ప్రభుత్వం 14 సంవత్సరాల్లోపు పిల్లలతో గృహ సంబంధ పనులు, వ్యాపార సంస్థల్లో (ఉదాహరణకు హోటళ్లు, దాబాలు, దుకాణాలు, టీ దుకాణాలు మొదలైనవి) పనులకు నియమించుకోవడాన్ని నిషేధించింది.

 

మత స్వాతంత్య్రపు హక్కు (నిబంధనలు 25-28) 
భారతదేశంలో ప్రభుత్వ వ్యవహారాల్లో మత ప్రమేయం ఉండదు. అయితే 'లౌకిక' అనే పదాన్ని రాజ్యాంగంలో (ప్రవేశిక) 42 వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976 లో చేర్చారు.
* నిబంధన 25(1) ప్రకారం ప్రజా సంక్షేమం, నైతికత, ఆరోగ్యం మొదలైన అంశాలకు లోబడి, ప్రజలు తమ అంతరాత్మను, తమకు ఇష్టమైన మత విశ్వాసాలను అనుసరించడానికి, స్వీకరించడానికి, ప్రచారం చేసుకోవడానికి హక్కు ఉంది. అయితే, ఇతర మతాలవారిని బలవంతంగా తమ మతంలోకి చేర్చుకునే హక్కు లేదు.
* 25(2)(a) ప్రకారం మత సంబంధ కార్యకలాపాలతో సంబంధం ఉన్న ఆర్థిక, రాజకీయ లేదా ఇతర సంక్షేమ కార్యకలాపాలకు పరిమితం చేయడం లేదా నియంత్రణ చేయడం కోసం ప్రభుత్వం చట్టాలను రూపొందించవచ్చు.
* 25(2)(b) సామాజిక సంక్షేమం, సాంఘిక సంస్కరణల్లో భాగంగా హిందూ దేవాలయాల్లోకి, హిందూ మత సంబంధ వర్గాల ప్రవేశానికి ప్రభుత్వం చట్టాలను రూపొందించవచ్చు (సిక్కులు కృపాణాలను లేదా ఖడ్గాలను ధరించడం, తీసుకువెళ్లడం సిక్కు మత సంప్రదాయంలో భాగంగానే పరిగణించాలి).
* 25(2)(b) ప్రకారం సిక్కులు, జైనులు, బౌద్ధులను కూడా హిందువులుగానే పరిగణిస్తారు.

 

నిబంధన 26 
ఇది మత వ్యవహారాల నిర్వహణలో స్వేచ్ఛకు సంబంధించిన నిబంధన. ప్రజాశాంతి, నైతికత, ఆరోగ్యానికి లోబడి వ్యక్తులు కింది హక్కులను కలిగి ఉంటారు.
     (a) మత, ధార్మిక సంస్థలను స్థాపించవచ్చు.
     (b) తమ మత వ్యవహారాలను తామే నిర్వహించుకోవచ్చు.
     (c) స్థిర, చర ఆస్తులను మత సంస్థలు సమకూర్చుకోవచ్చు.
     (d) చట్ట ప్రకారం స్థిర, చరాస్తులను నిర్వహించుకునే హక్కు ఉంటుంది.

 

నిబంధన 27 
ఈ నిబంధన మతం పేరుతో పన్నులు వసూలు చేయడాన్ని నిషేధిస్తుంది.
* మత వ్యాప్తి లేదా పోషణ కోసం ప్రజల నుంచి పన్నులు వసూలు చేయడాన్ని నిషేధించారు. కానీ, మత ప్రాతిపదికపై ప్రత్యేక సేవలను అందించినందుకు ప్రభుత్వం ప్రజల నుంచి చార్జీ వసూలు చేయవచ్చు. ఉదా: దేవాలయంలో ప్రత్యేక దర్శనాలు, సేవల కోసం ప్రత్యేక ఫీజు వసూలు చేయడం రాజ్యాంగానికి విరుద్ధం కాదు. 

నిబంధన 28 
ఈ నిబంధన విద్యాలయాల్లో మత బోధన గురించి తెలియజేస్తుంది.
* 28 (1) ప్రకారం ప్రభుత్వ నిధులతో నిర్వహించే విద్యాసంస్థల్లో మత బోధనను నిషేధించారు.
* 28 (2) ప్రకారం ఏదైనా ధార్మిక సంస్థ లేదా ధర్మకర్తల మండలి స్థాపించి, పాలనాపరంగా ప్రభుత్వమే నిర్వహించే కొన్ని విద్యాలయాల్లో తప్పనిసరి పరిస్థితుల్లో మత బోధన చేయవచ్చు.
* 28 (3) ప్రకారం ప్రభుత్వం గుర్తించిన లేదా ప్రభుత్వ సహాయం పొందే (ఎయిడెడ్) విద్యా సంస్థల్లో మతపరమైన ప్రార్థనలు, కార్యకలాపాలు ఉన్నప్పటికీ, విద్యార్థులు వాటిలో పాల్గొనవచ్చు లేదా పాల్గొనకుండా ఉండవచ్చు. మైనర్లు అయిన విద్యార్థులు సంరక్షకుల అభీష్టం మేరకు నడుచుకునే అవకాశం ఉంది. వారిని మత ప్రార్థనల్లో, కార్యకలాపాల్లో తప్పనిసరిగా పాల్గొనమని బలవంతం చేయకూడదు.

సాంస్కృతిక, విద్యా విషయక హక్కు (నిబంధనలు 29-30)   
భాష, మతపరమైన అల్ప సంఖ్యాకులు తమ మతాన్ని, భాషను, సంస్కృతిని కాపాడుకోవడానికి, అభివృద్ధి చేసుకోవడానికి ప్రత్యేకంగా ఈ హక్కును కల్పించినప్పటికీ, అధిక సంఖ్యాకులు కూడా ఈ హక్కులను కలిగి ఉంటారు.
* 29(1) ప్రకారం భారత ప్రజలకు (ఏ వర్గం వారైనా) తమ భాష, లిపి, సంస్కృతిని కాపాడుకునే హక్కు ఉంటుంది.
* 29(2) ప్రకారం ప్రభుత్వం నిర్వహిస్తున్న/ ప్రభుత్వ ఆర్థిక సహాయం పొందుతున్న విద్యా సంస్థల్లో మతం, జాతి, కులం, భాష కారణాల వల్ల ప్రవేశాన్ని నిరాకరించరాదు.
* 30(1) ప్రకారం మతం లేదా భాషా ప్రాతిపదికపై అల్ప సంఖ్యాక వర్గాలకు చెందిన ప్రజలు ప్రత్యేక విద్యాసంస్థలను స్థాపించి, నిర్వహించుకోవచ్చు.
* 30(1)(A) ప్రకారం మైనారిటీలు నిర్వహిస్తున్న విద్యాసంస్థలను, వాటి ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకునప్పుడు వారికి ప్రత్యేక నష్టపరిహారాన్ని చెల్లించాలి.
* 30(2) ప్రకారం ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందజేసే విషయంలో విద్యాసంస్థలను అల్పసంఖ్యాక వర్గాలునిర్వహించే విద్యాసంస్థలు, అధిక సంఖ్యాక వర్గాలు నిర్వహించే విద్యాసంస్థలు అనే తేడా చూపకూడదు.

ఆస్తి హక్కు (నిబంధన 31): ఈ హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించారు.
 

రాజ్యాంగ పరిరక్షణ హక్కు (నిబంధన 32) 
ప్రాథమిక హక్కులను పొందడంలో రాజ్యం లేదా సంస్థ లేదా వ్యక్తులు ఆటంకం కల్పిస్తే నిబంధన 32 ద్వారా సుప్రీం కోర్టు, నిబంధన 226 ద్వారా హైకోర్టులు రక్షణ కల్పిస్తాయి. అందుకే డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ రాజ్యాంగ పరిరక్షణ హక్కును రాజ్యాంగానికి ప్రాణం, ఆత్మ, హృదయం అని వర్ణించారు.
* 32(1) ప్రకారం వ్యక్తి ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు రక్షణ కల్పించమని సుప్రీం కోర్టును ఆశ్రయించవచ్చు.
* 32(2) ప్రకారం ప్రాథమిక హక్కుల రక్షణకు సుప్రీం కోర్టు 5 రకాల రిట్లను జారీ చేయగలదు. అవి... హెబియస్ కార్పస్, మాండమస్, ప్రొహిబిషన్, సెర్షియోరరీ, కో-వారెంటో.
* 32(3) ప్రకారం సుప్రీం కోర్టు తన అధికారాలకు భంగం కలగకుండా, ఇతర న్యాయస్థానాలకు (జిల్లా కోర్టులు, స్థానిక కోర్టులు) కూడా రిట్లను జారీచేసే అధికారాన్ని కల్పిస్తూ పార్లమెంటు చట్టం చేయవచ్చు. (రిట్ అంటే తప్పనిసరిగా పాటించాల్సిన కోర్టు ఆదేశం లేదా ఉత్తర్వు).
* 32(4) ప్రకారం రాజ్యాంగంలో సూచించిన విధంగా తప్ప, ఏ ఇతర పద్ధతుల్లోనూ ప్రాథమిక హక్కుల పరిరక్షణ హక్కును (లేదా) రాజ్యాంగ పరిరక్షణ హక్కును తొలగించరాదు. అయితే, అత్యవసర పరిస్థితి విధించిన కాలంలో మార్షల్ లా లేదా సైనిక శాసనం అమల్లో ఉన్నప్పుడు ఈ నిబంధన అమలును తాత్కాలికంగా నిలిపివేయవచ్చు.
* పైన తెలిపిన ప్రాథమిక హక్కుల రక్షణకు ప్రజలు నేరుగా సుప్రీం కోర్టు, హైకోర్టులను ఆశ్రయించవచ్చు.

 

రిట్లు
హెబియస్ కార్పస్:  హెబియస్ కార్పస్ అనేది లాటిన్ భాషా పదం.ఇది అతి పురాతనమైన రిట్. హెబియస్ కార్పస్ అంటే To have the body (భౌతికంగా కనిపించడం). ఈ రిట్ ద్వారా స్వేచ్ఛా హక్కును (19 నుంచి 22 వరకు ఉన్న నిబంధనలు) కాపాడుకోవచ్చు.
* ఒక వ్యక్తిని నిర్బంధించినప్పుడు ఆ నిర్బంధానికి ఉన్న కారణాలు చట్ట సమ్మతమా, కాదా అని తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. చట్ట సమ్మతం అయితే 24 గంటల లోపు న్యాయస్థానం ముందు హాజరుపరచాల్సిందిగా లేదా చట్ట సమ్మతం కాకపోతే వెంటనే విడుదల చేయాల్సిందిగా ఆదేశిస్తారు.
* ఈ రిట్‌ను ప్రభుత్వ అధికారులకు, సంస్థలకు, ప్రైవేట్ వ్యక్తులకు జారీ చేయవచ్చు. కానీ, రాష్ట్రపతి, గవర్నర్లు, విదేశీయులకు జారీ చేయకూడదు.

మాండమస్: మాండమస్ అంటే ఆదేశించడం (Command). ప్రభుత్వ అధికారి లేదా సంస్థ తమ విధి నిర్వహణలో తీవ్రమైన జాప్యం లేదా పని చేయడానికి నిరాకరిస్తే లేదా నిర్వహించనప్పుడు ఆ విధిని నిర్వర్తించమని న్యాయస్థానం ఇచ్చే ఆదేశమే మాండమస్.
* మాండమస్‌ను కేవలం ప్రభుత్వ సంస్థలు లేదా ప్రభుత్వ అధికారులపై మాత్రమే జారీ చేస్తారు. దీన్ని రాష్ట్రపతి, గవర్నర్లపై జారీ చేయకూడదు.

ప్రొహిబిషన్: ప్రొహిబిషన్ అంటే నిషేధం. దీన్ని కేవలం న్యాయస్థానాలకు మాత్రమే జారీ చేస్తారు. కింది న్యాయస్థానాలు (సుప్రీం కోర్టు, హైకోర్టులు కాకుండా) విచారణ జరుపుతున్న కేసును నిలిపివేయాల్సిందిగా సుప్రీం కోర్టు లేదా హైకోర్టులు ఈ రిట్‌ను జారీ చేస్తాయి. అలాగే విచారణ జరుపుతున్న న్యాయమూర్తికి ఆ కేసుతో సంబంధం ఉన్నప్పుడు కూడా ఈ రిట్‌ను జారీ చేస్తారు.
 

సెర్షియోరరీ: సెర్షియోరరీ అంటే సుపీరియర్. కింది కోర్టులు లేదా ట్రైబ్యునళ్లు తమ అధికార పరిధిని అతిక్రమించి ఒక కేసును విచారించి అంతిమ తీర్పును ఇచ్చినప్పటికీ, దాన్ని రద్దుచేసి సుప్రీం కోర్టు లేదా హైకోర్టులు తమ పరిధిలోకి తీసుకోవడానికి సెర్షియోరరీ అవకాశం కల్పిస్తుంది. దీన్ని ప్రైవేట్ సంస్థలు, శాసనసభలకు వ్యతిరేకంగా జారీ చేయకూడదు.
* ప్రొహిబిషన్, సెర్షియోరరీ రిట్లను జ్యుడీషియల్ రిట్లు అని కూడా అంటారు.

 

కోవారెంటో:  కో-వారెంటో అంటే 'ఏ అధికారంతో?' అని అర్థం. దీని ద్వారా కోర్టు, ఒక వ్యక్తి ఏ అధికారంతో ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందాడో పరిశీలిస్తుంది. ఈ రిట్‌ను ప్రభుత్వ పదవుల్లోకి అక్రమంగా ప్రవేశించినవారిని, తొలగించడానికి ఉద్దేశించి రూపొందించారు.
* పైన తెలియజేసిన విధంగా సుప్రీం కోర్టు, హైకోర్టులు రిట్లను జారీ చేయడం ద్వారా ప్రజల ప్రాథమిక హక్కులకు రక్షణ కల్పిస్తాయి. అయితే అత్యవసర పరిస్థితి అమల్లో ఉన్నప్పుడు వీటిని జారీ చేయలేవు.
* డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ రాజ్యాంగ పరిహారపు హక్కును రాజ్యాంగ ఆత్మ, హృదయంగా వర్ణించారు.
* భారత రాజ్యాంగంలో న్యాయసమీక్ష అనే పదాన్ని వాడకపోయినా, అంతర్గతంగా న్యాయసమీక్షాధికారాన్ని కల్పించింది - నిబంధన 13.
* విద్యాహక్కును ప్రాథమిక హక్కుగా తెలిపేది - నిబంధన - 21(A).
* నిబంధన 15 ప్రకారం రాజ్యాంగం 5 రకాల వివక్షలను నిషేధించింది.

 

ప్రాథమిక హక్కులు - ల‌క్ష‌ణాలు

సంప్రదాయమైవి, ఆధునికమైనవి: స్వేచ్ఛా, స్వాతంత్య్రపు హక్కు, మతస్వాతంత్య్రపు హక్కు లాంటి సంప్రదాయ హక్కులతో పాటు ఆధునిక హక్కులైన సమానత్వపు హక్కు, పీడనాన్ని నిరోధించే హక్కు, విద్యా, సాంస్కృతిక హక్కులు సైతం ప్రాథమిక హక్కుల్లో అంతర్భాగాలుగా కొనసాగుతున్నాయి.

సార్వత్రికం కావు:  ఆర్టికల్స్‌ 15, 16, 19, 29, 30లో పేర్కొన్న ప్రాథమిక హక్కులు కేవలం భారతీయులకు మాత్రమే వర్తిస్తాయి. భారత్‌లో నివసించే విదేశీయులకు వర్తించవు.
* ఆర్టికల్‌ 19లో పేర్కొన్న స్వేచ్ఛా, స్వాతంత్య్రపు హక్కు సాయుధ దళాల సిబ్బందికి లభించదు. 
* ఆర్టికల్స్‌ 14, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28లో పేర్కొన్న ప్రాథమిక హక్కులు భారత ప్రజలతోపాటు భారత భూభాగంలో ఉన్న విదేశీయులకు కూడా వర్తిస్తాయి.

న్యాయ సంరక్షణ:  పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు ప్రాథమిక హక్కుల అమలుకు న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చు. ప్రాథమిక హక్కుల రక్షణ, అమలుకు ఆర్టికల్‌ 32 ప్రకారం సుప్రీంకోర్టు, ఆర్టికల్‌ 226 ప్రకారం హైకోర్టులు రిట్లు జారీచేస్తాయి.

నిరపేక్షమైనవి కావు: ప్రాథమిక హక్కులు అపరిమితమైనవికావు. దేశ సమగ్రత, సుస్థిరత దృష్ట్యా ప్రభుత్వం వీటిపై చట్టబద్ధమైన పరిమితులు విధించవచ్చు.

ప్రభుత్వ అధికారంపై పరిమితులు: ప్రాథమిక హక్కులను ప్రభుత్వాలు ఉల్లంఘించకూడదు. వీటికి వ్యతిరేకంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి శాసనాలు రూపొందించడానికి అవకాశం లేదు. ప్రభుత్వాలు రూపొందించే చట్టాల కన్నా ప్రాథమిక హక్కులు ఉన్నతమైనవి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి పనులు చేయకూడదో ప్రాథమిక హక్కులు పేర్కొంటాయి.

రద్దుకు అవకాశం లేనివి, కానీ సస్పెండ్‌ చేయొచ్చు: భారత రాష్ట్రపతి ఆర్టికల్‌ 352 ప్రకారం జాతీయ అత్యవసర స్థితిని ప్రకటించినప్పుడు ఆర్టికల్స్‌ 20, 21లో పేర్కొన్న ప్రాథమిక హక్కులు మినహాయించి మిగిలిన వాటిని తాత్కాలికంగా సస్పెండ్‌ చేయొచ్చు. కానీ పూర్తిగా రద్దుచేసే వీల్లేదు.

అల్పసంఖ్యాక వర్గాల ప్రయోజనాల సంరక్షణ: దేశంలోని మెజారిటీ వర్గాల ఆధిపత్యం నుంచి అల్పసంఖ్యాక వర్గాల ప్రయోజనాలను కాపాడటం, జాతి సమగ్రతను సంరక్షించడం, వివిధ వర్గాల మధ్య సామరస్యాన్ని పెంపొందించడంలో ప్రాథమిక హక్కులు కీలకపాత్ర పోషిస్తాయి. 
ఉదా: విద్యా, సాంస్కృతిక హక్కు ద్వారా అల్పసంఖ్యాక వర్గాల హక్కులకు రక్షణ కల్పించడం.

పౌరుల సమగ్రాభివృద్ధి సాధనాలు: పౌరులు గౌరవప్రదంగా జీవించడానికి, వారి వ్యక్తిత్వ వికాస అభివృద్ధి, స్వేచ్ఛా, స్వాతంత్య్రాలకు హామీఇవ్వడం ద్వారా ప్రాథమిక హక్కులు పౌరుల సమగ్రాభివృద్ధికి తోడ్పడుతున్నాయి.

వివరణ
*  1951లో చంపకం దొరైరాజన్‌ vs స్టేట్‌ ఆఫ్‌ మద్రాస్‌ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ ప్రాథమిక హక్కుల మీద ఆదేశిక సూత్రాలు స్వారీ చేయలేవు అని పేర్కొంది.
* 1973 లో కేశవానంద భారతి vs స్టేట్‌ ఆఫ్‌ కేరళ కేసులో సుప్రీంకోర్టు తీర్పుఇస్తూ ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు పరస్పర పోషకాలని ప్రకటించింది.
* 1980 లో మినర్వామిల్స్‌ vs యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసులో ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాల మధ్య సమన్వయాన్ని సాధించేందుకు సుప్రీంకోర్టు ప్రయత్నించింది.
* 1976 లో ఇందిరాగాంధీ ప్రభుత్వం 42 వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ప్రాథమిక హక్కులపై ఆదేశిక సూత్రాల ఆధిపత్యాన్ని నెలకొల్పేందుకు ప్రయత్నించింది.

ప్రాథమిక హక్కులు, సాధారణ హక్కులకు మధ్య భేదాలు
ప్రాథమిక హక్కులు
* ప్రాథమిక హక్కులను రాజ్యాంగంలో పొందుపరిచారు. వీటికి రాజ్యాంగం నుంచి హామీ లభిస్తుంది. ఇవి ప్రభుత్వ అధికారంపై పరిమితులు విధిస్తాయి.
* దేశ పౌరులు వీటిని వదులుకునే వీలులేదు.
* ప్రాథమిక హక్కుల సంరక్షణ, అమలుకు ఆర్టికల్‌ 32 ప్రకారం సుప్రీంకోర్టును, ఆర్టికల్‌ 226 ప్రకారం హైకోర్టులను ఆశ్రయించవచ్చు.
* రాష్ట్రపతి ఆర్టికల్‌ 352 ప్రకారం జాతీయ అత్యవసర స్థితిని ప్రకటించినప్పుడు ఆర్టికల్స్‌ 20, 21లలో పేర్కొన్న ప్రాథమిక హక్కులు మినహాయించి, ఇతర ప్రాథమిక హక్కులను తాత్కాలికంగా నిలిపివేయవచ్చు.
* ప్రాథమిక హక్కులు సాధారణ హక్కుల కంటే ఉన్నతమైన ఆధిక్యత, స్వభావం కలిగి ఉన్నాయి.

సాధారణ హక్కులు
* సాధారణ హక్కులు పార్లమెంట్, రాష్ట్రాల శాసనసభల ద్వారా రూపొందుతాయి. వీటికి హామీ ఉంటుంది. ఈ హక్కులు ప్రభుత్వానికి అదనపు అధికారాలు కల్పిస్తాయి.
* సాధారణ హక్కులను పౌరులు తమ ఇష్టానుసారం వదులుకోవచ్చు.
* సాధారణ హక్కుల అమలు కోసం పౌరులు కేవలం పరిమిత న్యాయస్థానాలను మాత్రమే ఆశ్రయించవచ్చు.
* వీటిని ఎలాంటి పరిస్థితిలోనైనా తాత్కాలికంగా నిలిపివేయడమే కాకుండా, రద్దు చేసే వీలు కూడా ఉంటుంది. 
* సాధారణ హక్కులు ప్రాథమిక హక్కులకు లోబడి ఉంటాయి.

ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాల మధ్య భేదాలు
ప్రాథమిక హక్కులు
* వీటిని రాజ్యాంగంలోని మూడో భాగంలో పేర్కొన్నారు.
* ఇవి రాజ్యాంగంలోని ఆర్టికల్స్‌ 12 నుంచి 35 మధ్య పొందుపరిచి ఉన్నాయి.
* వీటిని అమెరికా రాజ్యాంగం నుంచి గ్రహించారు.
* వీటికి న్యాయ సంరక్షణ ఉంది.
* ఇవి సర్వకాల, సర్వ వ్యవస్థల్లో అందుబాటులో ఉంటాయి.
* ఇవి వ్యక్తి స్వేచ్ఛ, స్వాతంత్య్రాలను సాధించేందుకు ఉద్దేశించినవి.
* వీటి ద్వారా రాజకీయ ప్రజాస్వామ్యాన్ని సాధించవచ్చు.
* ఇవి రాజ్యాంగ లక్ష్యాలను సాధించేందుకు సాధనాలుగా ఉపకరిస్తాయి.
* వీటి అమలుకు ప్రభుత్వం ప్రత్యేక చట్టాలు చేయాల్సిన అవసరం లేదు. 
* వీటిని జాతీయ అత్యవసర పరిస్థితి సమయంలో తాత్కాలికంగా నిలిపివేయవచ్చు.
* ప్రాథమిక హక్కులు వ్యక్తిగతమైనవి.
* వీటిని అమలు చేసే బాధ్యత న్యాయస్థానాలకు ఉంటుంది.
* ఇవి నకారాత్మక దృక్పథం కలిగినవి.
* కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేయకూడని పనులను తెలియజేస్తాయి.
* వీటికి ఆజ్ఞాపించే స్వభావం ఉంది.

ఆదేశిక సూత్రాలు
* వీటిని రాజ్యాంగంలోని నాలుగో భాగంలో పేర్కొన్నారు.
* వీటిని రాజ్యాంగంలోని ఆర్టికల్స్‌ 36 నుంచి 51 మధ్య వివరించారు.
* ఆదేశిక సూత్రాలను ఐర్లాండ్‌ రాజ్యాంగం నుంచి గ్రహించారు.
* వీటికి న్యాయస్థానాల రక్షణ లేదు.
* ప్రభుత్వాల ఆర్థికస్తోమతను అనుసరించి అందుబాటులో ఉంటాయి.
* సమాజ సమష్టి ప్రయోజనాలు సాధించేందుకు ఉద్దేశించినవి.
* వీటి ద్వారా సామాజిక, ఆర్థిక ప్రజాస్వామ్యాన్ని సాధించవచ్చు.
* ఆదేశిక సూత్రాలు రాజ్యాంగ లక్ష్యాలను తెలుపుతాయి.
* వీటి అమలుకు ప్రభుత్వం ప్రత్యేక చట్టాలు చేయాల్సి ఉంటుంది.
* ఇవి ఎప్పుడూ అమల్లోనే ఉంటాయి.
* ఇవి సామాజికపరమైనవి.
* వీటిని అమలు చేసే బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుంది.
* ఇవి సకారాత్మక దృక్పథాన్ని కలిగిఉంటాయి.
* ఆదేశిక సూత్రాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేయాల్సిన పనులను తెలుపుతాయి.
* ఇవి కేవలం సూచనప్రాయమైనవి.

 

ప్రాథమిక హక్కులు - సుప్రీంకోర్టు తీర్పులు

  భారత రాజ్యాంగం ప్రజలకు కల్పించిన ప్రాథమిక హక్కులకు ప్రభుత్వం ద్వారా లేదా మరే విధంగానైనా భంగం కలిగితే సుప్రీంకోర్టు, హైకోర్టుల ద్వారా కాపాడుకోవచ్చు. ప్రాథమిక హక్కులు సుప్రీంకోర్టు, హైకోర్టుల ఒరిజినల్ అధికార పరిధి లేదా ప్రారంభ విచారణాధికార పరిధి (కేసును నేరుగా తనే స్వీకరించి, విచారించి, తీర్పు ఇవ్వడం) కిందకు వస్తాయి. ఆస్తి హక్కు, స్వేచ్ఛ హక్కు, సమానత్వ హక్కు, పార్లమెంటు చేసిన కొన్ని రాజ్యాంగ సవరణ చట్టాలను సవాలు చేస్తూ అనేక వివాదాలు కోర్టుల్లో విచారణకు వచ్చాయి. అందులో ముఖ్యమైనవి......


I. సమానత్వ హక్కు (నిబంధనలు 14-18)
నిబంధన 14: చిరంజిత్ లాల్ చౌదరి Vs కేంద్ర ప్రభుత్వం (1950) కేసులో సుప్రీంకోర్టు (హెచ్.జె.కానియా) తీర్పునిస్తూ సమానుల్లో మాత్రమే సమానత్వం అమలు చేస్తారని తెలిపింది.
* బల్సారా Vs స్టేట్ ఆఫ్ బాంబే కేసు (1951)లో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ రక్షణ దళాలు, రాయబారులకు, సాధారణ ప్రజానీకానికి మధ్య వివక్ష చూపించడం 14 వ నిబంధనను ఉల్లంఘించినట్లు కాదని స్పష్టం చేసింది.
* సాఘీర్ అహ్మద్ Vs ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రం కేసు (1955)లో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ ప్రైవేట్ వ్యక్తులతో పోల్చినప్పుడు రాజ్యం ఒక ప్రత్యేక వర్గంగా భావించి, తనకు అనుకూలంగా గుత్తాధిపత్యాన్ని ఏర్పాటు చేయడం 14 వ నిబంధనను ఉల్లంఘించినట్లు కాదని తెలియజేసింది.
సుభాచంద్ Vs ఢిల్లీ ఎలక్ట్రికల్ సప్త్లె కేసు (1981) లో ప్రభుత్వ సర్వీసుల నియామకంలో వయసు, విద్యార్హతలు, కులం, లింగం మొదలైన అంశాల్లో వివక్ష చూపించడం, సమాన అవకాశాన్ని కల్పించే పరిధిలో ఉంటే అది రాజ్యాంగ విరుద్ధం కాదని సుప్రీంకోర్టు తెలిపింది.
* అసోసియేటెడ్ బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆఫ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా Vs కేంద్ర ప్రభుత్వ కేసు (1988) లో విధులు, కర్తవ్యాలు ఒకే స్వభావం కలిగి ఉన్నా, బాధ్యతల పరిమాణం వేరుగా ఉన్నప్పుడు సమాన పనికి, సమాన వేతన నియమం వర్తించదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.
* సమాన పని, సమాన విధులు నిర్వర్తిస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు, ఇతర తాత్కాలిక ప్రాతిపదికపై పనిచేసే ఉద్యోగులకు కూడా, శాశ్వత ఉద్యోగులకు చెల్లించే విధంగా వేతనాలు చెల్లించాలని పంజాబ్‌లోని తాత్కాలిక ఉద్యోగులు వేసిన రిట్ పిటీషన్ కేసు - 2016 లో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.

నిబంధన 15: చంపకందొరై రాజన్ Vs మద్రాసు ప్రభుత్వం కేసు (1951)లో ఆదేశ సూత్రాలను అమలు చేయడానికి ప్రాథమిక హక్కులను ఉల్లంఘించకూడదని తేల్చి చెప్పింది. దీన్ని అధిగమించడానికి కేంద్ర ప్రభుత్వం మొదటి రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 15 (4) క్లాజును చేర్చింది.
* యం.ఆర్.బాలాజీ Vs మైసూరు రాష్ట్ర ప్రభుత్వం (1963) కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ రిజర్వేషన్లు 50% కి మించరాదు అని స్పష్టం చేసింది.
* అయితే 76 వ రాజ్యాంగ సవరణ చట్టం, 1994 ద్వారా తమిళనాడులో కల్పించిన 69% రిజర్వేషన్లు రాజ్యాంగంలోని IXవ షెడ్యూల్‌లో చేర్చారు. దీని ద్వారా న్యాయసమీక్షాధికారానికి వీలు లేకుండా చేసింది. కానీ, 2006 లో సుప్రీంకోర్టు IXవ షెడ్యూల్ లోని అంశాలపై కూడా న్యాయసమీక్షాధికారం వర్తిస్తుందని తెలిపింది.
ఇనాందార్ Vs మహారాష్ట్ర ప్రభుత్వం (2005) కేసులో మైనారిటీ, మైనారిటీయేతర నాన్-ఎయిడెడ్ ప్రైవేట్ కళాశాలల్లో రిజర్వేషన్లు వర్తించవు అని తీర్పు ఇచ్చింది.
* సుప్రీంకోర్టు తీర్పును అధిగమించడానికి 93వ రాజ్యాంగ సవరణ చట్టం, 2005 ద్వారా 15 (5) క్లాజును చేర్చింది. దీని ప్రకారం 30 (1) నిబంధనను అనుసరించి ఏర్పడిన మైనారిటీ విద్యా సంస్థలు మినహా ఇతర విద్యా సంస్థల్లో రిజర్వేషన్లు వర్తిస్తాయని తెలిపింది.

నిబంధన 16: దేవదాసన్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు (1964) లో సుప్రీంకోర్టు క్యారీ ఫార్వర్డ్ రూల్ (రిజర్వేషన్ల విషయంలో) చెల్లదని తెలిపింది.
* ఎ.వి.ఎస్.నరసింహారావు Vs ఆంధ్రప్రదేశ్ (1970) కేసులో ఒకే రాష్ట్రంలో ఉన్న వ్యక్తుల మధ్య ఎలాంటి వివక్ష చూపరాదని, రాష్ట్రంలోని కొన్ని ఉద్యోగాలను రాష్ట్రం మొత్తంలో నివసిస్తున్న అందరికీ రిజర్వ్ చేయవచ్చని తెలిపింది. అంతేకాకుండా ముల్కీ నిబంధనల చట్టాన్ని రద్దు చేసింది.
* ఇందిరా సహానీ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు (1992) లో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ వెనుకబడిన తరగతులకు 27% రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగ విరుద్ధం కాదు, కానీ క్రీమీ లేయర్‌ను గుర్తించాలని పేర్కొంది.
* షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం కాబట్టి చెల్లవని కొట్టివేసింది.
* దీన్ని అధిగమించడానికి కేంద్ర ప్రభుత్వం 77 వ రాజ్యాంగ సవరణ చట్టం, 1995 ద్వారా 16 (4) క్లాజును చేర్చింది.

నిబంధన 18: బాలాజీ రాఘవన్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు (1996) లో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ భారతరత్న, పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ లాంటివి ప్రత్యేక పురస్కారాలు మాత్రమే అని, బిరుదులు కావని, వీటిని పేరుకు ముందు లేదా తర్వాత వాడటం నిబంధనలకు వ్యతిరేకమని స్పష్టం చేసింది.


II. స్వేచ్ఛ-స్వాతంత్య్ర హక్కు (నిబంధనలు 19-22)
నిబంధన 19: బ్రిజ్ భూషణ్ Vs స్టేట్ ఆఫ్ ఢిల్లీ కేసు (1950)లో సుప్రీంకోర్టు (సయ్యద్ ఫజుల్ అలీ నాయకత్వంలోని బెంచ్) తీర్పునిస్తూ ఒక పత్రికపై దాని ప్రచురణకు ముందే సెన్సార్‌షిప్ విధించకూడదని తెలిపింది.
* కానీ కె.ఎ.అబ్బాస్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు (1970)లో సుప్రీంకోర్టు (హిదయతుల్లా) తీర్పునిస్తూ సినిమాలపై సెన్సార్‌షిప్ విధించే అధికారం ప్రభుత్వానికి ఉంది అని తెలిపింది.
* మేనకాగాంధీ Vs యూనియన్ ఆఫ్ ఇండియా (1978) కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ సంచార స్వేచ్ఛతో పాటు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ దేశంలోపల, విదేశాల్లో ఉన్నప్పుడు కూడా ఉంటుందని పేర్కొంది. కాబట్టి, భావవ్యక్తీకరణకు భౌగోళిక హద్దులు లేవని తెలిపింది.
* బిజయ్ ఎమాన్యూల్ Vs స్టేట్ ఆఫ్ కేరళ (1986) కేసులో సుప్రీంకోర్టు వాక్, భావ ప్రకటన స్వేచ్ఛలో మౌనంగా ఉండే హక్కు కూడా ఉంది అని అభిప్రాయపడింది. ఇది జాతీయ గీతం కేసుగా ప్రచారం పొందింది.
* అజయ్ కామా Vs యూనియన్ ఆఫ్ ఇండియా (1988) కేసులో సుప్రీంకోర్టు, ప్రజా సంక్షేమం దృష్ట్యా వాహన డ్రైవర్లు తప్పనిసరిగా హెల్మెట్ వాడాలని ప్రభుత్వం చేసిన చట్టం రాజ్యాంగ విరుద్ధం కాదని, చెల్లుబాటు అవుతుందని స్పష్టం చేసింది.
* సోదన్ సింగ్ Vsన్యూదిల్లీ మున్సిపల్ కమిటీ (ఎన్‌డీఎంసీ) కేసు (1989) కు సంబంధించి సుప్రీంకోర్టు 1992లో తీర్పునిస్తూ క్రమబద్దీకరించిన రహదార్ల కాలిబాటలపై వ్యాపారం చేసుకునేందుకు (జీవనోపాధి) హాకర్లకు హక్కు ఉందని తెలియజేసింది.
సి.పి.ఐ.(యం) Vs భరత్ కుమార్ (1997) కేసులో సుప్రీంకోర్టు బంద్, హర్తాల్ మధ్య తేడాలను తెలియజేయడంతో పాటు బంద్ అనేది రాజ్యాంగ విరుద్ధమని తేల్చి చెప్పింది.
* రంగరాజన్ Vs స్టేట్ ఆఫ్ తమిళనాడు (2003) కేసులో సుప్రీంకోర్టు, సమ్మె ప్రాథమిక హక్కు కాదని, ప్రభుత్వ కార్మికులు లేదా ఉద్యోగులు సమ్మెను ప్రాథమిక హక్కుగా వినియోగించకూడదని స్పష్టం చేసింది.
* శ్రేయా సింఘాల్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా (2015) కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ ఇన్ఫర్‌మేషన్ టెక్నాలజీ చట్టం, 2000లోని సెక్షన్ 66A భావవ్యక్తీకరణ స్వేచ్ఛకు విరుద్ధమని, చెల్లదని స్పష్టం చేసింది. (నేపథ్యం- 2012 లో స్వర్గీయ బాల్ థాకరే మరణం తర్వాత ముంబయి బంద్‌కు పిలుపునివ్వడంపై షహీన్ దాదా, రీను శ్రీనివాసన్ తమ అసంతృప్తిని ఫేస్‌బుక్ ద్వారా తెలియజేశారు. దీంతో వారిని అరెస్టు చేశారు. కానీ ప్రజావ్యతిరేకత రావడంతో విడుదల చేశారు).

నిబంధన 20: నందిని సాత్పతి Vs డాని పి.ఎల్. (1978) కేసులో సుప్రీంకోర్టు బలవంతపు సాక్ష్యం అనే అంశాన్ని వివరించింది.
* స్వయంగా నిందను ఆపాదించుకోకూడదు.
* మౌనాన్ని పాటించే హక్కు నిందితుడికి ఉంటుంది.
* శారీరకంగా బెదిరించి, హింసించి పొందిన సాక్ష్యం, మానసిక క్షోభ కలిగించడం, ప్రతికూల పరిసరాలను కల్పించి ఒత్తిడి తేవడం, పదేపదే ప్రశ్నలు అడిగి విసిగించడం, శక్తికి మించిన బరువు, బాధ్యతలు మోపడం, బలవంతంగా నిందితుడి నుంచి సమాచారాన్ని రాబట్టడానికి పోలీసులు ఉపయోగించే ప్రత్యక్ష లేదా పరోక్ష, మానసిక లేదా శారీరక క్షోభకు గురిచేయడం బలవంతపు సాక్ష్యం కిందికి వస్తాయని సుప్రీంకోర్టు వివరించింది.
ఎ.ఎ.ముల్లా Vs స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర (1996) కేసులో సుప్రీంకోర్టు అవినీతి నిరోధక చట్టం కింద విచారించి నిర్దోషిగా విడుదలైన వ్యక్తిని, తిరిగి కస్టమ్స్ చట్టం, విదేశీమారక క్రమబద్దీకరణ చట్టం కింద రెండో విచారణ నిర్వహించడం 20 వ నిబంధనకు వ్యతిరేకం కాదని తేల్చి చెప్పింది. రెండు విచారణల్లోని అంశాలు వేర్వేరుగా ఉన్నాయని మొదటి, రెండో విచారణల్లోని వాస్తవ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని, కాబట్టి రెండో విచారణ నిర్వహించవచ్చని వ్యాఖ్యానించింది.

నిబంధన 21: ఎ.కె.గోపాలన్ Vs స్టేట్ ఆఫ్ మద్రాసు (1950) కేసులో సుప్రీంకోర్టు 19, 21 ప్రకరణలు లేదా నిబంధనల పరిధులు వేరని తెలిపింది. 21 వ నిబంధనను అనుసరించి చేసిన శాసనం ప్రకారం నిర్బంధితులైనప్పుడు సహజ న్యాయసూత్రాలు వర్తించవని స్పష్టం చేసింది. అంటే ఒక వ్యక్తి స్వేచ్ఛను ఏ పరిస్థితుల్లో పరిమితం చేయవచ్చో చట్టం చేస్తే, అది చెల్లుబాటు అవుతుందని తెలిపింది.
* నీరజా చౌదరి Vs స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ (1984) కేసులో సుప్రీంకోర్టు (జస్టిస్ పి.భగవతి) తీర్పునిస్తూ వెట్టిచాకిరీ జీవించే హక్కు (నిబంధన 21)కు భంగకరం కాబట్టి, ప్రభుత్వాలు వెట్టిచాకిరీని  నిర్మూలించే శాసనాలను రూపొందించాలని ఆదేశించింది.
* ఉన్నిక్రిష్ణన్ Vs స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, (1993) కేసులో సుప్రీంకోర్టు (ఎల్.ఎం.శర్మ) చరిత్రాత్మక తీర్పునిస్తూ విద్యాహక్కు ప్రాథమిక హక్కుల్లో అంతర్భాగమని, అది లేకపోతే జీవించే హక్కుకు, వ్యక్తి గౌరవానికి అర్థం లేదని తెలియజేసి, విద్యను ప్రాథమిక హక్కుగా గుర్తించాలని స్పష్టం చేసింది. అయితే విద్యార్జన హక్కు వయసును 14 సంవత్సరాలకు పరిమితం చేసింది. 14 సంవత్సరాల తర్వాత విద్యార్జన హక్కు ప్రభుత్వ ఆర్థిక పరిస్థితులపై ఆధారపడి ఉంటుందని తెలిపింది. (దీన్ని అమలు చేయడానికి ప్రభుత్వం 86వ రాజ్యాంగ సవరణ చట్టం చేసింది)
వీడియోకాన్ Vs మహారాష్ట్ర (2013) కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ 21వ నిబంధనలోని జీవించే హక్కు, స్వేచ్ఛ అనేవి విదేశీయులకు కూడా వర్తిస్తాయని తెలియజేసింది.

నిబంధన 22: ఎ.కె.గోపాలన్ Vs మద్రాసు ప్రభుత్వం (1950) కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ ఒక వ్యక్తిని అరెస్టు చేసేముందు అతడిని ఏ కారణాలపై అరెస్టు చేస్తున్నారో తెలియజేయడం అరెస్టు చేసే పోలీసు అధికారి బాధ్యత. ఎందుకు అరెస్టు చేశారనే విషయాన్ని సాధ్యమైనంత త్వరలో తెలియజేయలేకపోతే, కారణాలను కోర్టుకు తెలపాల్సి ఉంటుందని పేర్కొంది.
* అబ్దుల్ సమద్ Vs ఉత్తర్‌ప్రదేశ్ (1962) కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ అరెస్టు చేసిన వ్యక్తిని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచకుండా 24 గంటలు గడిస్తే, ఆ వ్యక్తికి (అరెస్టు అయిన వ్యక్తి) విడుదల కావడానికి హక్కు ఉంటుందని తెలిపింది.
* జోగిందర్ కుమార్ Vs ఉత్తర్‌ప్రదేశ్ (1994) కేసులో సుప్రీంకోర్టు ఒక వ్యక్తిని అరెస్టు చేసినప్పుడు, ఆ సమాచారాన్ని, దానికిగల కారణాలను కుటుంబ సభ్యులకు (లేదా) స్నేహితులకు (లేదా) సంబంధిత వ్యక్తులకు తప్పనిసరిగా తెలియజేయాలని చెప్పింది.


III. పీడన నిరోధక హక్కు (నిబంధనలు 23-24)
* పీపుల్స్ యూనియన్ ఆఫ్ డెమోక్రటిక్ రైట్స్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా (1982) కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ.. ఈ ప్రాజెక్టు కోసం నియమించిన కార్మికులకు కనీస వేతనం కంటే తక్కువ వేతనం చెల్లించడం ప్రాథమిక హక్కుల్లోని 23వ నిబంధన ఉల్లంఘనగా తెలియజేసింది. ప్రాథమిక హక్కులను ఉల్లంఘించినందుకు కాంట్రాక్టర్లపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
పీపుల్స్ యూనియన్ ఆఫ్ సివిల్ లిబర్టీస్ (పీయూసీఎల్) Vs యూనియన్ ఆఫ్ ఇండియా (2001) కేసులో సుప్రీంకోర్టు తీర్పు చరిత్రాత్మకమైంది. ఆకలి, పోషకాహార లోపాలను అరికట్టడానికి, ఆహార హక్కును చట్టబద్దంగా అమలు చేయాలని తీర్పునిచ్చింది. దీనివల్ల అనేక రాష్ట్రాలు మధ్యాహ్న భోజన పథకాన్ని (బడిపిల్లలకు) ప్రవేశపెట్టాయి.
* సలాల్ హైడ్రోఎలక్ట్రిక్ ప్రాజెక్టు కార్మికులు Vss జమ్మూ & కశ్మీర్ (1983) కేసులో సుప్రీంకోర్టు నిర్మాణ రంగం లాంటి ప్రమాదకరమైన పనుల్లో 14 ఏళ్లల్లోపు వారిని పనిలో చేర్చుకోకూడదని ఆదేశించింది.
* బందువా ముక్తిమోర్చా Vs యూనియన్ ఆఫ్ ఇండియా (1997) కేసులో ప్రభుత్వం బాల కార్మికుల పునరావాస నిధిని ఏర్పాటు చేయాలని, బాల కార్మికులను పనిలో చేర్చుకునే యజమానిపై రూ.20,000 వరకు జరిమానా విధించి, ఆ నిధిలోకి జమచేయాలని సుప్రీంకోర్టు తెలిపింది.

Posted Date : 07-12-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌