• facebook
  • whatsapp
  • telegram

వృద్ధి - అభివృద్ధి

పరిమాణాత్మక మార్పు.. గుణాత్మక ప్రగతి! 

వస్తుసేవల ఉత్పత్తిని అధికం చేస్తే జీడీపీ పెరుగుతుంది. విద్యా సంబంధ కార్యక్రమాలపై పెట్టుబడి పెడితే నిపుణులైన ఉత్పాదకశక్తి కలిగిన శ్రామికులు సిద్ధమవుతారు. మొదటిది ఆర్థికవృద్ధి, అది పరిమాణాత్మకమైతే, రెండోది ఆర్థికాభివృద్ధి నాణ్యమైనది, దేశ దీర్ఘకాలిక శ్రేయస్సుకి దోహదపడుతుంది. ఆర్థిక వ్యవస్థలో నిర్మాణాత్మక, గుణాత్మక మార్పులకు కారణమవుతుంది. ఆర్థికశాస్త్రంలో ఈ రెండు పదాల మధ్య వ్యత్యాసాలను పలువురు శాస్త్రవేత్తలు సమగ్రంగా వివరించారు.   దేశ ఆర్థిక ముఖచిత్రాన్ని సూక్ష్మ, స్థూల స్థాయుల్లో అర్థంచేసుకోవడానికి ఉపయోగపడే ఆ అంశాల గురించి పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. వృద్ధి కారకాలు, మన దేశ ఆర్థికాభివృద్ధి లక్ష్యాలు, ప్రణాళికల ద్వారా సాధించిన ప్రగతితో పాటు వృద్ధి రేటును గణించే సూత్రాలు తదితరాలపై అవగాహన పెంచుకోవాలి.

ఆర్థిక వృద్ధి, ఆర్థికాభివృద్ధి అనే పదాలను ఆడం స్మిత్‌ కాలం నుంచే ఉపయోగిస్తున్నారు. అయితే 1960 దశకం వరకు ఆర్థికవృద్ధి, ఆర్థిక అభివృద్ధి అనే భావనలను పర్యాయ పదాలుగా వాడుతున్నప్పటికీ హిల్స్, షుంపీటర్‌ లాంటి ఆర్థికవేత్తలు వీటి మధ్య స్పష్టమైన వ్యత్యాసాలను వ్యక్తం చేశారు.  

 

ఆర్థికవృద్ధి


దేశంలో వస్తుసేవల ఉత్పత్తిలో వచ్చే పెరుగుదలను ఆర్థికవృద్ధి అంటారు. అంటే ఒక దేశంలో జాతీయోత్పత్తి పెరుగుదలే ఆర్థికవృద్ధి. ఇది పరిమాణాత్మక మార్పును తెలియజేస్తుంది. 

ఉదా: స్థూల దేశీయోత్పత్తిలో పెరుగుదల.

దీర్ఘకాలంలో తలసరి, వాస్తవ, స్థూల జాతీయోత్పత్తిలో వచ్చే పెరుగుదలను ఆర్థిక వృద్ధి అంటారు. దీనిలో మూడు అంశాలు ఉంటాయి.

1) జాతీయోత్పత్తి పెరుగుదల అనేది వ్యాపార చక్రాల వల్ల తాత్కాలికంగా పెరగవచ్చు. అది ఆర్థికవృద్ధి కాదు. దీర్ఘకాలంలో పెరుగుదల ఉన్నప్పుడే ఆర్థికవృద్ధిగా పరిగణిస్తారు. 

2) జాతీయోత్పత్తి కంటే జనాభా వేగంగా పెరిగితే తలసరి ఆదాయం తగ్గుతుంది. అందుకే జనాభా పెరుగుదల కంటే స్థూల జాతీయోత్పత్తి వేగంగా పెరగాలి.

3) ధరల పెరుగుదల వల్ల జాతీయ ఆదాయం పెరగవచ్చు. అది నామమాత్ర జాతీయ ఆదాయం అవుతుంది. అందువల్ల ధరల ప్రభావాన్ని తొలగించి స్థిర ధరల్లో వాస్తవ జాతీయాదాయాన్ని లెక్కిస్తారు. వాస్తవిక జాతీయ ఆదాయం పెరుగుదలే ఆర్థికవృద్ధి.

ఆర్థికవృద్ధి సూచికలు: 

 1) నామమాత్ర స్థూల దేశీయోత్పత్తి 


2) వాస్తవ స్థూల దేశీయోత్పత్తి 


3) నామమాత్ర తలసరి ఆదాయం 


4) వాస్తవ తలసరి ఆదాయం

నాలుగు కారకాలు: ఆర్థిక వృద్ధి నాలుగు కారకాల మీద ఆధారపడి ఉంటుంది. 

1) పొదుపు రేటు 

3) శ్రామికశక్తి వృద్ధి రేటు 

2) మూలధన ఉత్పత్తి నిష్పత్తి 

4) సాంకేతిక విజ్ఞానంలో మార్పులు, నవకల్పనలు

ఆర్థిక వృద్ధి అనే భావన అభివృద్ధి చెందిన దేశాలకు సంబంధించింది. చాలామంది ఆర్థికవేత్తలు వృద్ధి నమూనాలను ప్రతిపాదించారు. వారిలో ముఖ్యులు కార్ల్‌మార్క్స్, హరాడ్‌ - డోమర్, కాల్డార్, జాన్‌ రాబిన్‌సన్‌.

వృద్ధిరేటు గణించే విధానం: సాంవత్సరిక జాతీయ ఆదాయ వృద్ధి రేటు ఆధారంగా ఆర్థిక వృద్ధిని గణిస్తారు.

ఆర్థికాభివృద్ధి 

1960 దశకం వరకు ఆర్థికాభివృద్ధిని వృద్ధికి పర్యాయ పదంగా వాడేవారు. ప్రస్తుతం వృద్ధి, అభివృద్ధిలను వేర్వేరు అర్థాల్లో ఉపయోగిస్తున్నారు. దేశంలో ఉత్పత్తి పెరుగుదలతో పాటు వ్యవస్థాపూర్వక, సాంకేతిక మార్పులతో కూడిన గుణాత్మక మార్పులను ఆర్థికాభివృద్ధి అంటారు.


ఆర్థికాభివృద్ధి  = ఆర్థిక వృద్ధి + వ్యవస్థాపూర్వక మార్పులు

                            =  వృద్ధి + పేదవారికి అనుకూలంగా వనరుల పునఃపంపిణీ

                           =  వృద్ధి + పురోగాత్మక మార్పులు

                           =  వృద్ధి + సంక్షేమం

నిర్వచనాలు:

‘పేదరికం, ఆర్థిక అసమానతలు, నిరుద్యోగం అధిక స్థాయి నుంచి తగ్గడమే ఆర్థికాభివృద్ధి.’
 - డడ్లీ సీర్స్‌                                                              
‘మొత్తం సాంఘిక వ్యవస్థ ప్రగతి పథంలో పయనించడమే ఆర్థికాభివృద్ధి.’
 - గున్నార్‌ మిర్ధాల్‌
‘80 శాతం ఉన్న వ్యవసాయ ఉపాధిని 15 శాతంగా మార్చే ప్రక్రియ ఆర్థికాభివృద్ధి.’
 
- హాన్స్‌ సింగర్‌
‘ధనిక దేశాల ఆదాయ స్థాయి పెరుగుదలకు సంబంధించిందే ఆర్థికవృద్ధి, పేద దేశాల ఆదాయ స్థాయి పెరుగుదలకు చెందింది ఆర్థికాభివృద్ధి.’
 -మాడిసన్‌


కిండిల్‌ బర్గర్‌: ఆర్థిక వృద్ధి ఎక్కువగా ఉత్పత్తికి సంబంధించినది. ఆర్థికాభివృద్ధి అనేది ఉత్పత్తి, సాంకేతిక, సంస్థాగత మార్పులకు చెందినది. అభివృద్ధి లేకుండా వృద్ధిని సాధిస్తే ఉపయోగం లేదు.

ఉదా: అరబ్బు దేశాలు. ఇవి పెట్రోలియం ఎగుమతి ద్వారా జాతీయ తలసరి ఆదాయాలు పెంచుకుని వృద్ధిని సాధించాయి. కానీ అక్కడ ఆర్థిక వ్యవస్థలోని నిర్మాణంలో మార్పులు రాలేదు.

* రాబర్ట్‌ క్లోవర్‌ ‘గ్రోత్‌ విత్‌ అవుట్‌ డెవలప్‌మెంట్‌’ గ్రంథంలో లైబీరియా దేశంలో అభివృద్ధి లేకుండా వృద్ధి ఏ విధంగా జరుగుతుందో వివరించారు. వృద్ధికి, అభివృద్ధికి తేడాలు ఊహాజనితమైనవి, అవాస్తవికమైనవి. పెద్దగా తేడాలు లేవనేది ఆర్థర్‌ లూయిస్‌ అభిప్రాయం.

 

భారతదేశంలో ఆర్థికాభివృద్ధి లక్ష్యాలు:  

1) అధిక వృద్ధి రేటుతో జీవనప్రమాణం 

2) స్వయం పోషకత్వం 

3) సామాజిక న్యాయం 

4) ఆధునికీకరణ 

5) ఆర్థిక స్థిరత్వం 

6) సమ్మిళిత వృద్ధి

అధిక వృద్ధి రేటు: మొదట మూడు దశాబ్దాల ప్రణాళికల కాలంలో తక్కువ వృద్ధి రేటు (3.5%) నమోదైంది. ఈ కాలంలో జనాభా వృద్ధి రేటు అధికంగా ఉండటంతో తలసరి ఆదాయ వృద్ధి రేటు తక్కువ (1.4%)గా నమోదైంది. 6వ ప్రణాళిక నుంచి వృద్ధి 5% పైనే నమోదైంది. అధిక వృద్ధి రేటు ద్వారా ప్రజల జీవన ప్రమాణ స్థాయిని పెంచడం ఆర్థికాభివృద్ధి లక్ష్యాల్లో ఒకటి.


స్వయంపోషకత్వం: భారతదేశం ప్రణాళికల ప్రారంభంలో ఆహార ధాన్యాలను అమెరికా నుంచి దిగుమతి చేసుకునేది. అదేవిధంగా భారీ యంత్రాలు, సాంకేతిక పరిజ్ఞానం, రైల్వే, రోడ్ల సామగ్రికి దిగుమతుల మీద ఆధారపడేది. ఆ విధంగా 3వ ప్రణాళిక వరకు విదేశాల అవసరం ఉండేది. తర్వాత 4వ ప్రణాళిక నుంచి దేశంలో ఆహారధాన్యాల ఉత్పత్తిలో స్వయంపోషకత్వం సాధ్యమైంది. 5వ ప్రణాళికలో విదేశీ మారక ద్రవ్యం కోసం ఎగుమతులను ప్రోత్సహించారు. దిగుమతుల ప్రత్యామ్నాయ విధానాన్ని అవలంబించారు.


సామాజిక న్యాయం: వివిధ వర్గాల మధ్య ఆదాయ, సంపదల్లో సమాన పంపిణీ జరగాలనేదే సామాజిక న్యాయం. భారతదేశంలో నాలుగు సామాజిక న్యాయ అంశాలకు ప్రాధాన్యం ఇచ్చారు. 

1) రాజకీయ వ్యవస్థలో సామాజిక న్యాయం 

2) ప్రాంతీయ అసమానతలు తగ్గించడం 

3) ఆర్థిక వ్యవస్థలో సామాజిక న్యాయం 

4) వెనుకబడిన, అణగారిన వర్గాల్లో సామాజిక న్యాయం

ఆధునికీకరణ: స్వాతంత్య్రం తర్వాత ఆర్థిక వ్యవస్థను ఆధునికీకరణ చేయడం కోసం వ్యవస్థాపర, సంస్థాపరమైన మార్పులు తీసుకొచ్చారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టారు. అందువల్ల జాతీయాదాయంలో పారిశ్రామిక రంగం వాటా పెరుగుతూ వచ్చింది.

ఆర్థిక స్థిరత్వం: ద్రవ్యోల్బణ రహిత సంపూర్ణ ఉద్యోగిత ఉన్నప్పుడు ఆర్థిక స్థిరత్వం సాధ్యమవుతుంది. సామాజిక న్యాయంతో కూడిన ద్రవ్యోల్బణ రహిత, స్వయంపోషకత్వంతో కూడిన వృద్ధిని సాధించడం ఆర్థికాభివృద్ధి లక్ష్యం. దీని సాధనకు ప్రభుత్వం ద్రవ్య, కోశ విధానాలను ఉపయోగిస్తుంది.

సమ్మిళిత వృద్ధి: ఈ భావనను ప్రపంచ బ్యాంకు వెలుగులోకి తెచ్చింది. వృద్ధి ఫలాలు అన్నివర్గాల వారికి సమాన స్థాయిలో పంపిణీ కాకపోవడంతో సమ్మిళిత వృద్ధికి ప్రాధాన్యం పెరిగింది. గతంలో విస్మరించిన వర్గాలను వృద్ధి ప్రక్రియలో భాగస్వాములను చేయడమే సమ్మిళిత వృద్ధి లక్ష్యం. జనాభాలో దిగువనున్న 20 శాతం మంది జాతీయ ఆదాయంలో కేవలం 2 నుంచి 3 శాతం ఆదాయాన్ని మాత్రమే పొందుతున్నారు. జాతీయ ఆదాయంలో వీరి వాటాను పెంచడమే సమ్మిళిత వృద్ధి.

ఆధునిక ఆర్థిక వృద్ధి: సైమన్‌ కుజ్‌నెట్స్‌ ‘ఆధునిక ఆర్థిక వృద్ధి’ అనే గ్రంథం ద్వారా అభివృద్ధి చెందిన దేశాలకు సంబంధించిన ఆరు లక్షణాలను వివరించారు.

1) అధిక తలసరి ఉత్పత్తి వృద్ధి రేటు, అధిక జనాభా రేటు 

2) ఉత్పాదకత పెరుగుదల 

3) ఎక్కువ స్థాయిలో నిర్మాణాత్మక మార్పులు 

4) పట్టణీకరణ 

5) అభివృద్ధి చెందిన దేశాల బాహ్య విస్తరణ 

6) అంతర్జాతీయ వ్యక్తులు, వస్తువులు, మూలధన కదలికలు

ఆర్థికాభివృద్ధి మాపనాలు:  

1) వాస్తవ స్థూల జాతీయోత్పత్తి 

2) తలసరి ఆదాయం 

3) తలసరి వినియోగ స్థాయి 

4) నికర ఆర్థిక సంక్షేమ సూచిక 

5) భౌతిక జీవన ప్రమాణ సూచిక 

6) సమీకృత అభివృద్ధి, సూచిక 

7) మానవాభివృద్ధి సూచిక 

8) లింగ సంబంధిత అభివృద్ధి సూచిక 

9) లింగ సాధికార కొలమానం 

10) మానవ పేదరిక సూచిక - 1  

11) మానవ పేదరిక సూచిక - 2  

12) సామాజిక ప్రగతి సూచిక

వాస్తవ స్థూల జాతీయోత్పత్తి:

దీనిని సైమన్‌ కుజ్‌నెట్స్, మీడ్, వీనర్, ప్రాంకెల్‌ ఆర్థికవేత్తలు సమర్థించారు.

తలసరి ఆదాయం పెరిగితే ప్రజల జీవన ప్రమాణం పెరుగుతుంది. ఆర్థికాభివృద్ధి కొలమానంగా ఎక్కువ మంది జాతీయాదాయం కంటే తలసరి ఆదాయాన్ని ఉత్తమమైన కొలమానంగా ఆమోదిస్తున్నారు.

తలసరి వినియోగ స్థాయి: కొంతమంది ఆర్థికవేత్తలు తలసరి వినియోగ స్థాయిని బట్టి ఆర్థికాభివృద్ధిని మాపనం చేయవచ్చని పేర్కొన్నారు.

నికర ఆర్థిక సంక్షేమ సూచిక: విలియం నర్థూవస్, జేమ్స్‌ టోబిన్‌లు ఆదాయ సూచీని మెరుగుపరిచి ఆర్థిక సంక్షేమ కొలమానాన్ని రూపొందించారు. పాల్‌.శ్యామూల్‌సన్‌ దీనిని నికర ఆర్థిక సంక్షేమంగా పేరు మార్చారు. జాతీయాదాయానికి విశ్రాంతి సమయ విలువను, గృహిణి సేవలను కలిపి, ఆధునిక పట్టణీకరణ కాలుష్యం లాంటి అసౌకర్యాల విలువను మినహాయించాలి.

నికర ఆర్థిక సంక్షేమ సూచీ = వాస్తవ స్థూల జాతీయోత్పత్తి + విశ్రాంతి సమయం + మార్కెటేతర కార్యకలాపాలు  పర్యావరణ కాలుష్యానికి అయ్యే వ్యయం

భౌతిక జీవన ప్రమాణ సూచిక: ఆదాయ సూచీలపై విమర్శలు రావడం వల్ల ఆదాయేతర సూచీలను ప్రవేశపెట్టారు. వాటిలో మొదటిది భౌతిక జీవన ప్రమాణ సూచిక. 1979లో మోరిస్‌ డేవిడ్‌ మోరిస్‌ మూడు అంశాలను ఆధారం చేసుకుని భౌతిక జీవన ప్రమాణ సూచికను రూపొందించారు. 

1) ప్రజల ఆయుర్ధాయం

 2) శిశు మరణాల రేటు 

3) అక్షరాస్యత

  అంశం  గరిష్ఠ విలువ    కనిష్ఠ విలువ  వ్యాప్తి
1) ప్రజల ఆయుర్ధాయం  77 ఏళ్ళు  28 ఏళ్ళు  49
 2) శిశు మరణాల రేటు   09  229  220
3) అక్షరాస్యత 100  0  100


శిశు మరణాల రేటు విషయంలో మాత్రం కనిష్ఠ విలువ నుంచి వాస్తవ విలువ తీసేయాలి.

సూచిక విలువ 0 - 100 మధ్య ఉంటుంది.

తక్కువ తలసరి ఆదాయం ఉండే దేశాల్లో PQLI (Physical Quality of Life Index) విలువ తక్కువగా, ఎక్కువ తలసరి ఆదాయ దేశాల్లో PQLI విలువ అధికంగా ఉంటుంది.

 

 

రచయిత: ధరణి శ్రీనివాస్‌ 

Posted Date : 21-11-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌