• facebook
  • whatsapp
  • telegram

ఉద్యానవన రంగం

      ఉద్యానవన రంగం (హార్టీకల్చర్)లో తెలంగాణ రాష్ట్రం విశిష్టంగా నిలుస్తోంది. రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి దోహదపడే రంగాల్లో ఒకటిగా ఉంది. సానుకూల అంశాల నేపథ్యంలో సాగు విస్తీర్ణం మరింత పెంచేదిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలతో ముందుకెళుతోంది. అయిదేళ్లలో అద్భుత ప్రగతి సాధనకు అనేక పథకాలను అమలు చేస్తూ.. కోట్లాది రూపాయలు వెచ్చిస్తోంది. ఉద్యానవన రంగంలో తెలంగాణ ప్రత్యేకతలు, అభివృద్ధికి ప్రణాళికలు, నిధులు తదితర అంశాలపై అధ్యయన సమాచారం..
వ్యవసాయ రంగ అభివృద్ధి కారకాల్లో ఒకటిగా ఉద్యానవన రంగాన్ని గుర్తించారు. తెలంగాణ రాష్ట్రం ఈ రంగంలో సుసంపన్నంగా నిలిచింది. రాష్ట్ర జీఎస్‌డీపీకి ఒక గణనీయ సహాయకారిగా ఉద్యాన వన రంగాన్ని చెప్పవచ్చు. ఉద్యాన వన పంటల సాగు కింద 10.86 లక్షల హెక్టార్ల విస్తీర్ణం ఉంది. 112.56 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తిని ఉద్యాన వన రంగం అందిస్తోంది. రాష్ట్రంలో పండ్ల తోటలు, కూరగాయలు, మసాలా దినుసులు, తోట పంటల విస్తీర్ణాన్ని అయిదేళ్లలో (2018-19 నాటికి) 14.48 లక్షల హెక్టార్లకు పెంచాలని ఉద్యానవన రంగం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ విస్తీర్ణంలో అంచనా వేస్తున్న ఫలసాయం 152.31 లక్షల మెట్రిక్ టన్నులు. దేశంలో సాగులో ఉన్న భూ విస్తీర్ణం పరంగా పండ్లు విషయంలో తెలంగాణ మూడో స్థానంలో ఉండగా.. పసుపు సాగులో మొదటి స్థానంలో ఉంది.

 

ఉద్యానవన రంగ అభివృద్ధి

రాష్ట్రీయ ఉద్యానవన మిషన్ (ఎస్‌హెచ్ఎం)

కేంద్ర ప్రభుత్వం అమలు చేసే పథకంగా రాష్ట్రీయ ఉద్యానవన మిషన్‌ను 2005 నవంబరులో ప్రారంభించారు. ఇందులో కొత్త తోటల పెంపకం, పూర్వపు తోటల వృద్ధి, సమీకృత తెగుళ్ల అదుపు, సమీకృత పోషక నిర్వహణ, పంటల కోత అనంతర నిర్వహణ, రైతులకు శిక్షణ ఇవ్వడం వంటివి ఉంటాయి.
 

పంటల కోత అనంతర నిర్వహణ

   పంటల కోత అనంతరం ఉద్యాన వన పంటల రక్షణ కోసం తెలంగాణలో మౌలిక సదుపాయాలను వృద్ధి చేస్తున్నారు. రాష్ట్రంలో 19 శీతల గిడ్డంగి విభాగాలు, 12 మగ్గబెట్టే గదులు, 31 ప్యాక్‌హౌస్‌లు, 40 పసుపు బాయిలింగ్ విభాగాలను అభివృద్ధి చేశారు. పూదోటల సాగు వృద్ధికి 7.9 హెక్టార్లలో గ్రీన్‌హౌస్‌లను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది.
 

సూక్ష్మ సేద్యం - ఆవశ్యకత

   పంటల ఉత్పత్తి, ఉత్పాదక అభివృద్ధికి సూక్ష్మ సేద్యం ద్వారా ప్రతి నీటిబొట్టును వినియోగించడం అత్యంత అవసరం. ఇది నీరు, ఎరువుల సమర్థ వినియోగం.. ఉత్పత్తుల నాణ్యత, అభివృద్ధి.. విద్యుత్తు, శ్రమశక్తుల సమర్థ వినియోగం.. తక్కువ నీటితో ఎక్కువ ఉత్పత్తి తదితర అంశాలకు ఉపయోగపడుతుంది. రాష్ట్రంలో 14.85 లక్షల సేద్యపు నికర భూమిలో 4.7 లక్షల హెక్టార్లకు సూక్ష్మనీటి సరఫరా విధానం అమల్లో ఉంది. 2003-04 నుంచి 2013-14 వరకు సూక్ష్మ నీటి సేద్యంలో భాగంగా బిందు సేద్యం ద్వారా 3.55 లక్షల హెక్టార్లు, తుంపర్ల సేద్యం ద్వారా 1.24 లక్షల హెక్టార్ల భూమి సాగయ్యింది. వీటితోపాటు 10.06 లక్షల హెక్టార్ల సాగుకు అవకాశం ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తోట నీటి నిర్వహణ కార్యక్రమం కింద 2014-15లో ప్రభుత్వం 44,000 హెక్టార్లు ప్రతిపాదించింది. రాష్ట్రంలో హైదరాబాద్ మినహా అన్ని జిల్లాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.
 

పాలిహౌస్‌ల నిర్మాణం

  పాలిహౌస్‌లో కూరగాయల సేద్యాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో 2014-15లో వెయ్యి ఎకరాల్లో పాలిహౌస్‌లను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర ఉద్యాన వన మిషన్ కింద 2007-2013 మధ్యకాలంలో.. 130 ఎకరాల్లో పాలిహౌస్‌ల నిర్మాణానికి తెలంగాణలోని 346 మంది రైతులకు రూ. 24.42 కోట్ల ఆర్థిక సహాయాన్ని అందించింది.
* పాలిహౌస్‌ల కింద పూలమొక్కల సామగ్రికి రూ. 9.93 కోట్లు, కూరగాయ మొక్కల సామగ్రికి రూ. 22.86 లక్షల ఆర్థిక సహాయం చేశారు. రక్షిత వ్యవసాయం ప్రోత్సాహానికి రూ. 34.33 కోట్లు సమకూర్చారు.

 

మన ఊరు - మన కూరగాయలు

రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మార్కెట్లకు ప్రధానంగా మహబూబ్‌నగర్, మెదక్, రంగారెడ్డి జిల్లాల నుంచి కూరగాయలు వస్తాయి. వీటితో కూరగాయల మార్కెట్ అనుసంధానం, విలువ పటిష్ఠం చేయడానికి వెజిటేబుల్ ఇనీషియేటివ్స్ ఫర్ అర్బన్ క్లస్టర్స్ (వీఐయూసీ) అనే పథకం ఉంది. సంకరజాతి విత్తనాల సరఫరా, శాశ్వత మార్కెట్ల నిర్మాణం, వసూళ్ల కేంద్రం ఏర్పాటు వంటివి ఈ పథకం ప్రధాన ఉద్దేశాలు. ఈ పథకం కింద రూ. 625 లక్షల వ్యయాన్ని ప్రతిపాదించారు.
 

అభివృద్ధి పథకాలు

రాష్ట్ర ఉద్యానవన రంగ అభివృద్ధికి ఉన్న అవకాశాలను వినియోగించుకోవడానికి, అవసరమైన కీలక కార్యక్రమాలకు విస్తృతమైన ప్రాధాన్యం ఇస్తూ ఉద్యానవన శాఖ వివిధ పథకాలను అమలు చేస్తోంది. వాటిలో ప్రధానమైనవి..
* సూక్ష్మ సేద్య పథకం (ఎంఐపీ)
* సమగ్ర ఉద్యానవనాభివృద్ధి ఉద్యమం (ఎంఐడీహెచ్)
* రాష్ట్రీయ కృషి వికాస్ యోజన (ఆర్‌కేవీవై)
* నూనెగింజల జాతీయోద్యమం, పామ్ఆయిల్ ఉద్యమం (ఎన్ఎంవోవోపీ)
* రాష్ట్ర ప్రణాళికా పథకాలు

 

పబ్లిక్ గార్డెన్ల అభివృద్ధి

2014-15 ఉద్యాన వన కార్యకలాపాల వృద్ధి, పబ్లిక్ గార్డెన్ల అభివృద్ధికి ఎకరాకు రూ. 29.52 లక్షల వంతున 75 శాతం సబ్సిడీపై 1000 ఎకరాల్లో పాలిహౌస్‌ల నిర్మాణానికి రూ. 452.75 కోట్లను తెలంగాణ ప్రభుత్వం కేటాయించింది. వీటిలో 2014-15లో ఒక లబ్దిదారుడికి గరిష్ఠంగా మూడెకరాల వరకు మాత్రమే సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించారు.
 
రాష్ట్ర ఉద్యానవన మిషన్ ద్వారా ఉద్యానవన పంటలను అభివృద్ధి చేయడం ప్రధాన లక్ష్యంగా చెప్పొచ్చు. ఉద్యానవన పంటల ఉత్పత్తి అనేక రెట్లు పెంచినప్పటికీ పంటలను భద్రపరచడం, నిల్వ చేయడంలో లోటుపాట్ల కారణంగా 30 నుంచి 35 శాతం పంటల కోత అనంతరం నష్టాలు వస్తున్నాయి. కొత్త తోటలను అభివృద్ధి చేయడం, శిథిలమైన తోటలను పునరుద్ధరించడం, సేంద్రీయ సాగు, వ్యవసాయ యాంత్రికీకరణ, పంటల అనంతర నిర్వహణకు 2014-15లో రూ. 28.30 కోట్లు వినియోగించారు.
 
 


ఉత్పత్తి - అభివృద్ధి

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 3,155 హెక్టార్ల విస్తీర్ణంలో తోటలను వేశారు. 8,255 హెక్టార్లలో పాతబడిన, శిథిలమైన పూల తోటలను అభివృద్ధి చేశారు.

 

తోటనీటి నిర్వహణ కార్యక్రమం అమలు

పంటల ఉత్పత్తి, ఉత్పాదకత అభివృద్ధికి చిన్న, సన్నకారు రైతుల జీవన ప్రమాణాల అభివృద్ధికి సూక్ష్మ సేద్యం ద్వారా ప్రతి నీటి బొట్టును సమర్థంగా వినియోగించుకోవడం అవసరం. సూక్ష్మ సేద్యంతో నీటి సమర్థ వినియోగాన్ని అభివృద్ధి చేయడం ద్వారా రైతులు అదనపు ఆదాయాన్ని పొందుతారు. విద్యుత్తు ఆదా, వ్యయాల తగ్గింపు, పంటల దిగుబడి పెంపు తదితర ప్రయోజనాలకు సూక్ష్మ సేద్యం దోహదపడుతుంది. ఎరువుల సామర్ధ్యం అభివృద్ధి చేయడానికి, భూమి కోత నివారణకు కూడా సూక్ష్మ సేద్యం విధానాలు ఉపయోగపడతాయి. భూసారం పెంచడం ద్వారా మొక్కల దిగుబడి మరింత పెరిగేలా దోహదం చేస్తాయి. సూక్ష్మనీటి సేద్యం బిందువులు, తుంపర్ల ఆధారంగా జరుగుతుంది.
 

రక్షిత వ్యవసాయం

రాష్ట్రంలో మెరుగైన నాణ్యత ఉన్న ఉత్పత్తులను పెంచడానికి.. రైతులకు అధిక ఆదాయాలు రావడానికి.. కూరగాయలు, పూలతోటలను అభివృద్ధి చేయడానికి గానూ గ్రీన్‌హౌస్‌ల నిర్మాణం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. నేలలోని తేమ పెంపు, భూసార పరిరక్షణ, కలుపు మొక్కల నివారణ, ఇతర ప్రయోజనాల కోసం నేలను ఆకులు అలములతో కప్పి ఉంచే విధానాలను అమలు చేయడానికి 812 హెక్టార్ల విస్తీర్ణానికి ఆర్థిక సహాయం సమకూర్చింది.
 

Posted Date : 02-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌