• facebook
  • whatsapp
  • telegram

 మానవ అభివృద్ధి సూచిక (హ్యూమన్‌ డెవలప్‌మెంట్‌ ఇండెక్స్‌)

 ప్రజా శ్రేయస్సుకు అంతర్జాతీయ ప్రమాణం! 

ఒక దేశ ప్రగతి స్థాయిని తెలుసుకోవాలంటే అక్కడి జనాభా ఆరోగ్యం, అక్షరాస్యత, ఆయుర్దాయాలను పరిశీలించాలి. నిత్య జీవితంలో పౌరుల శ్రేయస్సును, దేశ పురోగతిపై సమగ్ర దృక్పథాన్ని ఆ సూచికలు ప్రతిబింబిస్తాయి. అందుకే ఐక్యరాజ్యసమితి అలాంటి ప్రమాణాల ఆధారంగా ఏటా సూచీలను సిద్ధం చేసి నివేదికలను విడుదల చేస్తోంది. ప్రపంచ దేశాల్లో మానవ అభివృద్ధి స్థాయులను తెలిపే ఆ రిపోర్టుల గురించి పరీక్షార్థులు వివరంగా తెలుసుకోవాలి. అందుకోసం పరిగణనలోకి తీసుకునే అంశాలు, సూచీ ఆధారంగా దేశాల వర్గీకరణ, భారతదేశం స్థానం, మానవాభివృద్ధి సూచికలోని ఉప విభాగాల గురించి సమగ్ర అవగాహన ఏర్పరుచుకోవాలి. 

దేశానికి నిజమైన సంపద ఆ దేశ ప్రజలే. వారి స్వేచ్ఛను, ఎంపికలను విస్తృతపరచడమే ఆర్థికాభివృద్ధి ముఖ్య లక్ష్యం. మానవాభివృద్ధిని కొలిచే సాధనమే ‘మానవ అభివృద్ధి సూచిక’. ఈ సూచికను ఐక్యరాజ్య సమితికి చెందిన యునైటెడ్‌ నేషన్స్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ (యూఎన్‌డీపీ) రూపొందించి ఏటా విడుదల చేస్తోంది. 

‘ప్రజల ఎంపికలను విస్తృతం చేయడంతో పాటు ప్రజా శ్రేయస్సును పెంపొందించే క్రమాన్ని మానవాభివృద్ధి’ అని మహబూబ్‌-ఉల్‌-హక్‌ నిర్వచించారు. హక్‌ ప్రకారం మానవాభివృద్ధి నమూనాలో నాలుగు అంశాలు ఉంటాయి. అవి 1) సమానత్వం - ప్రజలందరూ సమాన అవకాశాలు పొందాలి. 2) సుస్థిరత - మనం పొందే సంక్షేమం తర్వాత తరం కూడా పొందాలి. 3) ఉత్పాదకత - మానవ మూలధనంలో పెట్టుబడి ద్వారా ఉత్పాదకత పెంచడం. 4) సాధికారత - ప్రజలు తమ ఎంపికలకు అనుగుణంగా పనిచేయడం.

మానవాభివృద్ధి సూచికను 1990 నుంచి యూఎన్‌డీపీ ప్రచురిస్తోంది. దీనిని మహబూబ్‌-ఉల్‌-హక్‌ ఆధ్వర్యంలో రూపొందించారు. తర్వాత దానిని విస్తరించడంతో పాటు సవరిస్తూ వచ్చారు. తర్వాత కాలంలో మానవాభివృద్ధికి చెందిన ఇతర సూచీలను అభివృద్ధి చేశారు. అవి:

* 1995 - లింగ సంబంధిత అభివృద్ధి సూచీ (GDI - Gender Related Development Index) 

1995 - లింగ సాధికారత కొలమానం (GEM Gender Empowerment Measure) 

* 1997  మానవ పేదరిక సూచిక -  I (HPI-I Human Poverty Index - I) 

* 1998  మానవ పేదరిక సూచిక -  II (HPI-II Human poverty Index-II)

మానవాభివృద్ధి సూచికలో పరిగణనలోకి తీసుకునే అంశాలు: ఇది 3 అంశాల్లో సాధించిన సగటు ఫలితాలను తెలియజేస్తుంది.  1) ఆయుర్దాయం - దీర్ఘకాల ఆరోగ్యవంతమైన జీవనం 2) విజ్ఞానం - దీనిలో రెండు అంశాలు ఉంటాయి. ఎ) వయోజన అక్షరాస్యత (2/3వ వంతు భాగం) బి) ప్రాథమిక, ద్వితీయ, తృతీయ విద్యలో ఉమ్మడి నమోదు నిష్పత్తి (1/3వ వంతు భాగం) 3) మెరుగైన జీవన ప్రమాణం - దీనిని వాస్తవ తలసరి ఆదాయం ద్వారా కొలుస్తారు. అమెరికన్‌ డాలర్లలో వ్యక్తం చేస్తారు. 


హెచ్‌డీఐని లెక్కించే సూత్రం:


సూచీ విలువ 0 - 1 మధ్య ఉంటుంది. 0 కి దగ్గరగా ఉంటే వెనుకబడిన దేశాలుగా, 1కి దగ్గరగా ఉంటే అభివృద్ధి చెందిన దేశాలుగా ప్రకటిస్తారు. 2009 వరకు జీడీపీలో తలసరి ఆదాయాన్ని పీపీపీ (పర్చేసింగ్‌ పవర్‌ ఆఫ్‌ పారిటీ) ద్వారా అమెరికన్‌ డాలర్లలో లెక్కించేవారు. 2010 నుంచి జీఎన్‌ఐ (గ్రాస్‌ నేషనల్‌ ఇన్‌కమ్‌) ఆధారిత తలసరి ఆదాయాన్ని పీపీపీ ద్వారా అమెరికన్‌ డాలర్లలో లెక్కిస్తున్నారు. 2009 వరకు అంకమధ్యమం ఆధారంగా అంచనా వేసేవారు. 2010 నుంచి గుణమధ్యమం ద్వారా లెక్కిస్తున్నారు.


హెచ్‌డీఐలో కనిష్ఠ, గరిష్ఠ విలువల పట్టిక: * MYS (Means Year of schooling):  25 సంవత్సరాలు నిండిన వారిలో సగటున నియత విద్య అభ్యసించిన సంవత్సరాలు

EYS (Expected Year of schooling): 7 నుంచి 25 సంవత్సరాల వయసున్న వారిలో సగటున నియత విద్య అభ్యసించిన సంవత్సరాలు.


సూచిక విలువ ఆధారంగా దేశాల వర్గీకరణ:  

1) తక్కువ మానవ అభివృద్ధి దేశాలు - సూచిక విలువ 0.550 కంటే తక్కువ 2) మధ్యస్థ మానవ అభివృద్ధి దేశాలు - సూచిక విలువ 0.500 నుంచి 0.699 3) అధిక మానవ అభివృద్ధి దేశాలు - సూచిక విలువ 0.700 నుంచి 0.799 4) అత్యధిక మానవ అభివృద్ధి దేశాలు - 0.800 కంటే అధిక సూచిక విలువ ఉంటుంది.

లింగ సంబంధిత అభివృద్ధి సూచిక - GDI 1995 నుంచి మానవాభివృద్ధి నివేదికలో యూఎన్‌డీపీ దీనిని లెక్కిస్తోంది. HDIలో తీసుకున్న మూడు అంశాలు GDI లో గణిస్తారు. అవి 1) స్త్రీల ఆయుర్దాయం  2) స్త్రీల అక్షరాస్యత   3) స్త్రీల తలసరి ఆదాయం 

 ఒక దేశంలో లింగ సంబంధిత అసమానత లేకపోతే అక్కడ జీడీఐ విలువ, హెచ్‌డీఐ విలువ సమానంగా ఉంటాయి. లింగబేధం ఎక్కువగా కనిపిస్తే జీడీఐ విలువ, హెచ్‌డీఐ విలువ కంటే తక్కువగా ఉంటుంది. అంటే జీడీఐ, హెచ్‌డీఐల మధ్య వ్యత్యాసం ఎక్కువగా ఉంటే లింగ వివక్ష ఎక్కువగా ఉన్నట్లు అర్థం.

లింగ సాధికారత కొలమానం లింగ సాధికార కొలమానం స్త్రీలు పరిపాలన, రాజకీయ జీవితాల్లో ఏ మేరకు పాలుపంచుకుంటారనే విషయాన్ని పొందుపరుస్తుంది. దీనిలో మూడు అంశాలుంటాయి.  1) రాజకీయ భాగస్వామ్యం 2) ఆర్థిక భాగస్వామ్యం 3) సామాజిక భాగస్వామ్యం 

2010లో హెచ్‌డీఐలో జీడీఐ, జీఈఎమ్‌లను కలిపి లింగ అసమానతల కొలమానం ప్రవేశపెట్టారు. (జీఐఐ- జెండర్‌ ఇన్‌ఈక్వాలిటీ ఇండెక్స్‌) దీనిలో మూడు అంశాలు, 5 సూచీలు ఉంటాయి.1) శ్రామిక మార్కెట్‌ -  ఎ) శ్రామిక శక్తి పాల్గొనడం 2) సాధికారత - ఎ) విద్యాస్థాయి, బి) పార్లమెంట్‌లో భాగస్వామ్యం 3) ఉత్పాదక ఆరోగ్యం- ఎ) కౌమార సంతానోత్పత్తి బి) ప్రసూతి మరణాలు 


మానవ పేదరిక సూచిక-1:  దీన్ని అభివృద్ధి చెందుతున్న దేశాల్లో గణిస్తారు. 1997లో ప్రవేశపెట్టారు. ఇందులోనూ హెచ్‌డీఐలోని అంశాలనే పరిగణనలోకి తీసుకుంటారు. 1) 40 సంవత్సరాలకు ముందు చనిపోయేవారి శాతం 2) వయోజన నిరక్షరాస్యత 3) జీవన ప్రమాణం

 జీవన ప్రమాణాన్ని మూడు అంశాలతో గణిస్తారు. 1) మెరుగైన వైద్య సదుపాయాలు 2) సురక్షిత మంచి నీరు 3) అయిదేళ్లలోపు చిన్నారుల్లో తక్కువ బరువున్నవారు


మానవ పేదరిక సూచిక-II:  దీనిని 1998లో ప్రవేశపెట్టారు. HP-II ను ప్రవేశపెట్టిన తర్వాత HPI-1ని వెనుకబడిన దేశాలకు వర్తింపజేస్తున్నారు. ఇందులో 4 అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. 1) 60 సంవత్సరాల్లోపు చనిపోయే వారి శాతం 2) వయోజన నిరక్షరాస్యత 3) దేశ సగటు ఆదాయం కంటే 50 శాతం తక్కువ ఆదాయం ఉన్న వారి శాతం 4) సంవత్సరం మొత్తం నిరుద్యోగిత శాతం


బహుపార్వ్శ పేదరిక సూచిక (MDPIn-Multi Dimenstional Poverty Index):: అత్యంత అణగారిన జాతులు కోల్పోయిన కారకాలు, అంశాలను తెలియజేయడానికి ఈ సూచికను 2010లో ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ, UNDP సంయుక్తంగా ప్రవేశపెట్టాయి. దీనిలో 3 అంశాలు, 10 సూచీలు ఉంటాయి.


సామాజిక ప్రగతి సూచిక(SPI - Social Progress Index):  సామాజిక పర్యావరణ అవసరాలను తీర్చడానికి అందించే సేవలను సామాజిక ప్రగతి సూచిక కొలుస్తుంది. దీనిలో 3 అంశాలు ఉంటాయి.


ప్రపంచ ఆకలి సూచీ (Global Hunger Index GHI): ఇంటర్నేషనల్‌ ఫుడ్‌ పాలసీ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (IFPRI) ప్రపంచ ఆకలి సూచీని 2006 నుంచి గణిస్తోంది. దీనిలో పేదరికం, నిరుద్యోగిత, పారిశుద్ధ్య లోపం, సురక్షిత మంచినీరు లాంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. దీని విలువ 0 నుంచి 100 మధ్యలో ఉంటుంది. 0 అనేది ఆకలి లేనితనాన్ని సూచిస్తుంది. 100 అనేది అధమ స్థితిని సూచిస్తుంది. 2023లో ప్రపంచ ఆకలి సూచికలో 125 దేశాలను తీసుకుంటే భారత్‌ 111వ స్థానంలో ఉంది. 28.7 విలువతో తీవ్ర ఆకలి (సీరియస్‌ హంగర్‌) జాబితాలో నిలిచింది.


ప్రపంచ పోటీతత్వ సూచీ(Global Competitiveness Index GCI):  దీనిని ప్రపంచ ఆర్థిక ఫోరమ్‌ గణిస్తోంది. వ్యాపారం సాంఘిక అంశాలకు చెందిన 12 అంశాలను తీసుకుంటారు. 


ఉదా: సంస్థలు, ఆర్థిక వాతావరణం, అవస్థాపన సదుపాయాలు, ఆరోగ్యం, ప్రాథమిక, ఉన్నత విద్య శిక్షణ, శ్రామిక మార్కెట్‌ లాంటివి. 2023 ప్రపంచ పోటీ సూచీలో భారత్‌ 40వ స్థానాన్ని పొందింది. దీన్ని 64 దేశాల్లో లెక్కిస్తారు మొదటి మూడు దేశాలు డెన్మార్క్, ఐర్లాండ్, స్విట్జర్లాండ్‌. 

 


రచయిత : ధరణి శ్రీనివాస్
Posted Date : 03-12-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌