• facebook
  • whatsapp
  • telegram

పర్యావరణంపై మానవ ప్రభావం

విచక్షణరహిత చర్యలతో విధ్వంసాలు!


అనుకోని వర్షాలు, ఆకస్మిక వరదలు, అంతుపట్టని అంటువ్యాధులు, భరించలేని భూతాపాలు, దుర్భర దుర్భిక్షం.. అంచనాలకు అందని ఇలాంటి పరిస్థితులు ఎన్నో ఆధునిక కాలంలో తలెత్తుతున్నాయి. దాంతో ఎడారీకరణ, తుపానులు, సునామీలు సంభవిస్తున్నాయి. ప్రగతి పేరుతో మనిషి విచక్షణరహితంగా చేసే పనులు విధ్వంసాలను సృష్టిస్తున్నాయి.  క్రమంగా జీవజాతులు అంతరిస్తున్నాయి. జీవులకు, పరిసరాలకు మధ్య సంబంధాల్లో సమస్యల వల్లే వాతావరణంలో ఆ విధమైన విపరిణామాలు ఏర్పడుతున్నాయి.  భవిష్యత్తు తరాల ఉనికినే ప్రశ్నార్థకం చేస్తున్న ఈ పర్యావరణ మార్పుల గురించి పరీక్షార్థులు తెలుసుకోవాలి. మానవ చర్యలు విపత్తులకు కారణమవుతున్న తీరును, ప్రకృతి అనుకూల జీవన విధానాన్ని అలవరచుకోవాల్సిన అవసరాన్ని అర్థం చేసుకోవాలి.


జీవరాశులన్నింటిలో ఒక్క మానవుడికి మాత్రమే తన పరిసరాల్లోని, పరిసరాలకు దూరంగా ఉన్న సహజ వనరులను వివిధ రూపాల్లో వినియోగించుకునే సామర్థ్యం ఉంది. మనిషికి ఉన్న ఈ శక్తితో ప్రకృతి సృష్టించే ప్రతిబంధకాలను అధిగమించి తాను అభివృద్ధిపరిచిన శాస్త్ర సాంకేతిక విజ్ఞానం సహాయంతో పెద్ద పెద్ద నాగరికతలను రూపొందించాడు. ప్రాచీన మానవుడు తన కనీస అవసరాల కోసమే సహజ వనరులను వినియోగించేవాడు. ఇందులో భాగంగా ఏర్పడే వ్యర్థాలను పర్యావరణం సులభంగా తనలో ఇముడ్చుకునేది. నిప్పును కనిపెట్టడంతో పర్యావరణంపై మానవ ప్రభావం ప్రారంభమైంది. దీంతో క్రూరమృగాలను దెబ్బతీయడం, అడవులు తగలబెట్టి వ్యవసాయ భూములుగా మార్చడం, స్థిర వ్యవసాయాన్ని ప్రారంభించడంతో ఆవరణ వ్యవస్థలపై మానవుడి ప్రభావం వేగవంతమైంది. పారిశ్రామిక విప్లవ ప్రారంభంతో మరింత తీవ్రమైంది. పారిశ్రామిక విప్లవం తర్వాత పర్యావరణంపై మానవ ప్రభావం పెరగడానికి, పర్యావరణ వనరులు క్షీణించడానికి పలు కారణాలున్నాయి. అవి 

1) జనాభా పెరుగుదల 

2) వేగంగా విస్తరిస్తున్న పారిశ్రామీకరణ, పట్టణీకరణ 

3) ఆధునిక ప్రపంచ ఆర్థిక పోకడలైన సరళీకరణ, ప్రపంచీకరణ, బహుళజాతి కంపెనీల లాంటి మార్కెట్‌ శక్తులు 

4) అభివృద్ధి చెందుతున్న శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం 5) నూతన వినిమయ సంస్కృతి కారణంగా ఘన వ్యర్థ పరిమాణం పెరగడం.


మూడు రకాలు: పర్యావరణంపై మానవుడి ప్రభావం మూడు రకాలుగా ఉంటుంది. 

1) ఉపాధి, విద్య, వైద్యం, విలాసవంతమైన జీవనాన్ని వెతుక్కుంటూ ప్రపంచం అంతటా గ్రామాల నుంచి నగరాలకు దారితీసే వలసలు నగర ఆవరణ వ్యవస్థలను కలుషితం చేస్తున్నాయి. దీనివల్ల నగరాల్లో మురికివాడల సంఖ్య పెరగడం, తాగునీరు, ఆరోగ్యపరమైన సమస్యలు తీవ్రమవుతున్నాయి. 

2) మానవుడు సాంకేతిక నైపుణ్య వ్యవస్థల ద్వారా చుట్టూ ఉన్న పర్యావరణాన్ని తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నంలో సహజ ఆవరణ వ్యవస్థల స్వభావాన్ని మార్చడంతో సహజ వనరుల నాణ్యత తగ్గిపోతోంది. జీవవైవిధ్యం దెబ్బతింటోంది. ఉదా: పశ్చిమ రాజస్థాన్‌లోని ఎడారి ప్రాంతాలకు సాగు  నీటిని అందిస్తూ ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడానికి నిర్మించిన ఇందిరాగాంధీ కాలువ నిర్మాణం వల్ల జొన్న, సజ్జ లాంటి ఆహార పంటల సాగు తగ్గి చెరకు, పత్తి లాంటి వాణిజ్య పంటల సాగు విస్తరించింది. సాంద్ర వ్యవసాయ విధానాల వల్ల భూ వనరులు క్షారనేలలుగా మారిపోతున్నాయి. అంతేకాకుండా పర్షియా సింధు శాఖ ప్రాంతంలో చమురు నిక్షేపాల వెలికితీతతో పరిశ్రమల సంఖ్య పెరిగి ఆ ప్రాంత భూవనరులపై ఒత్తిడి పెరుగుతోంది. 

3) పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆహార ధాన్యాల ఉత్పత్తి అధికం చేసే ప్రయత్నంలో హరిత విప్లవ సాంకేతిక పద్ధతులైన రసాయనిక ఎరువులు, పురుగు మందుల వినియోగాన్ని అధికం చేయడం వల్ల భూ, జలవనరులు కాడ్మియం, ఫ్లోరిన్, లెడ్‌ లాంటి భార లోహాలతో కలుషితమయ్యాయి. ఉదా: ప్రస్తుతం మానవుడు ఎదుర్కొంటున్న ఫ్లోరోసిస్, ఇటాయి - ఇటాయి, మినిమాటా లాంటి వ్యాధులకు కారణం తాగే నీటిలో ఈ కాలుష్యాల పరిమితి మించడమే.


మొత్తం మీద మానవుడు అభివృద్ధి కార్యకలాపాల పేరుతో వనరులను దుర్వినియోగపరుస్తూ పర్యావరణ సమతౌల్యాన్ని దెబ్బతీస్తున్నాడు. దీని ఫలితమే గ్లోబల్‌ వార్మింగ్, ఆమ్లవర్షాలు, ఓజోన్‌ పొర క్షీణత, జనవనరుల పరిమాణం తగ్గిపోవడం, బంజరు విస్తృతి, ఎడారీకరణ, వరదలు, దుర్భిక్షం, భూకంపం, సునామీల తీవ్రత పెరగడం, జాతుల అంతర్థానం, అంటు వ్యాధులు ప్రబలడం మొదలైనవి. 


శీతోష్ణస్థితి మార్పు


సముద్ర మట్టం పెరగడం: భూమిపై శీతోష్ణస్థితి మార్పు ద్వారా ధ్రువ హిమ శిఖరాలన్నీ కరిగి సముద్ర మట్టం పెరుగుతోంది. ఐపీసీసీ ప్రకారం 2100 నాటికి 80 సెం.మీ. పైగా సముద్రమట్టం పెరిగి, పసిఫిక్, హిందూ మహాసముద్రంలో అనేక దీవులు శాశ్వతంగా మునిగిపోయే ప్రమాదం ఉంది. తువాలు, మార్షల్‌ దీవులు, మాల్దీవులు ఈ జాబితాలో ఉన్నాయి.


వ్యవసాయం: రబీ కాలంలో గత దశాబ్ద   కాలంగా ఉపరితల ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఈ ప్రభావం గోధుమ దిగుబడిపై తీవ్రంగా ఉంటోంది. ఐఎన్‌సీసీఏ ప్రకారం దేశ సగటు ఉపరితల ఉష్ణోగ్రతలు రబీ కాలంలో ఒక డిగ్రీ చొప్పున పెరిగితే గోధుమ దిగుబడి 6 మిలియన్‌ టన్నుల మేరకు తగ్గే ప్రమాదం ఉంది. నైరుతి రుతుపవనాలు, ఈశాన్య రుతుపవనాల రాకపైనా ప్రభావం పడుతుంది. వర్షాలు ఆలస్యంగా కురవడం, రెండు రుతుపవనాల మధ్య అంతరం పెరగడం, కుండపోత వర్షాలతో పంటలు నాశనం కావడం లాంటి ప్రభావాలు ఇప్పటికే ఉష్ణమండల దేశాల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. వ్యవసాయ రంగంపై శీతోష్ణస్థితి మార్పు ప్రభావాల ద్వారా దిగుబడి తగ్గడమే కాకుండా ఆహార ద్రవ్యోల్బణం పెరుగుతోంది. మహిళలు, ఆడపిల్లల్లో పోషకాహార లోపం పెరుగుతుంది. ఆసియాలో వరి దిగుబడిపై శీతోష్ణస్థితి మార్పు తీవ్ర ప్రభావాన్ని ప్రదర్శించనున్నట్లు ఐపీసీసీ ఇప్పటికే హెచ్చరించింది. ఈ ప్రాంతంలో వరి దిగుబడిలో 30 శాతం తగ్గుదల నమోదు కానుంది. అయితే ఉత్తరార్ధ గోళంలో శీతోష్ణస్థితి మార్పుతో వెచ్చదనం పెరిగి పంటల సాగు, దిగుబడి పెరిగే అవకాశం ఉంది.


అధిక వరదల తీవ్రత: ప్రపంచవ్యాప్తంగా వరదల తీవ్రత పెరగడానికి శీతోష్ణస్థితి మార్పే కారణం. కుండపోత వర్షాలతో నగరాలు ముంపునకు గురవుతున్నాయి. 2021లో జర్మనీ, బెల్జియం, ఇతర యూరప్‌ దేశాలు భారీ స్థాయి వరదలను చవిచూశాయి. వెయ్యేళ్లలో ఎప్పుడూ చూడని వరదలు చైనాను ముంచెత్తాయి.


ఓషన్‌ అసిడిఫికేషన్‌: వాతావరణంలో  కార్బన్‌డైఆక్సైడ్‌ పెరిగేకొద్దీ సముద్ర నీటిలో కరిగే ఆ వాయువు మోతాదు కూడా పెరుగుతుంది. సముద్ర నీటిలో కార్బొనిక్‌ ఆమ్లం అధికమై నీరు ఆమ్లయుతంగా మారుతుంది. సాధారణంగా సముద్ర నీటి pH 8-8.5 గా ఉంటుంది.. సముద్ర నీటిలోకి కార్బన్‌డైఆక్సైడ్‌ అధిక మొత్తంలో కరిగే కొద్దీ సముద్ర pH విలువ కొద్దిగా తగ్గుతుంది.సముద్రనీటి మార్పుతో ఆహారంగా ఉపయోగపడే సముద్రజీవుల సాంద్రత తగ్గి జాలర్ల ఆదాయం కూడా తగ్గుతుంది.


జంతువులపై ప్రభావం: ఆర్కిటిక్‌ ప్రాంతంలో ధ్రువ ఎలుగుబంట్లు, అంటార్కిటిక్‌లో పెంగ్విన్‌లపై శీతోష్ణస్థితి మార్పు ప్రభావాలు ఇప్పటికే స్పష్టంగా కనిపిస్తున్నాయి. శీతాకాలంలో ఆర్కిటిక్‌ ప్రాంతంలోని సముద్రంపై నడిచే ధ్రువ ఎలుగుబంట్లు హిమక్షీణత ద్వారా ఆహారం లభించక క్షీణిస్తున్నాయి. ఇదే కొనసాగితే భవిష్యత్తులో ఇవి పూర్తిగా అంతరించిపోయే ప్రమాదం ఉంది. 


తుపాను తీవ్రత: తుపాను తీవ్రత పెరగడానికి శీతోష్ణస్థితి మార్పే ప్రధాన కారణమని ఇప్పటికే గుర్తించారు. ఫైలాన్, హుద్‌హుద్, అంఫన్, నిసర్గ, తౌతే లాంటి తుపానులు మరింత తీవ్రతతో సంభవించే ప్రమాదం ఉంది. సమగ్ర తుపాను నిర్వహణ వ్యవస్థను అభివృద్ధి చేసుకోకపోతే ఆర్థిక నష్టాలు తీవ్రస్థాయిలో సంభవిస్తాయి.


జలవలయం: ఉష్ణమండల ప్రాంతాల్లోని జలవలయంపై శీతోష్ణస్థితి మార్పు ప్రభావాన్ని కూడా గుర్తించారు. కొన్ని ప్రాంతాల్లో విపరీతంగా వర్షం కురిసి వరదలు సంభవిస్తే, ఇంకొన్ని ప్రాంతాల్లో వర్షాలు లేక క్షామం ఏర్పడుతోంది. ఆసియాలో 50 కోట్లకుపైగా జనాభా తీవ్రస్థాయి నీటి కొరత ఎదుర్కోనున్నట్లు ఐపీసీసీ గుర్తించింది.


హిమానీనదాల అదృశ్యం: హిమానీనదాలపైనా శీతోష్ణస్థితి మార్పు ప్రభావం    పడుతోంది. ఏటా గంగోత్రి హిమానీనదం 1.8 మి.మీ. చొప్పున క్షీణిస్తోంది. ఫలితంగా 2030-50 మధ్యకాలంలో హిమానీనదాలు అదృశ్యమై తూర్పు, ఉత్తర భారతదేశంలో తీవ్ర నీటికొరత ఏర్పడుతుంది.


జీవవైవిధ్య నష్టం: భూమి ఉపరితల ఉష్ణోగ్రతలు ప్రతి 2 - 3 డిగ్రీలు పెరిగే కొద్దీ   20 - 30 శాతం జీవవైవిధ్యం నష్టపోతున్నట్లు ఐపీసీసీ గుర్తించింది. అత్యధిక జీవజాతులు, అధిక స్థానీయ జీవవైవిధ్యం దీవులు తీర ప్రాంతాల్లోనే కనిపిస్తాయి.  శీతోష్ణస్థితి మార్పు ప్రభావంతో సముద్ర మట్టం పెరిగితే తొలుత ఇలాంటి ప్రాంతాలే మునిగిపోతాయి. అక్కడున్న స్థానీయవైవిధ్యం అదృశ్యమవుతుంది.


వేసవి ఉష్ణోగ్రతలు పెరగడం: ఏటా వేసవి ఉష్ణోగ్రతలు తీవ్రమవుతున్నాయి. 2017ను అత్యధిక వేడి సంవత్సరంగా గుర్తించారు. ఉష్ణమండల ప్రాంతాల్లో వడదెబ్బతో చనిపోయేవారి సంఖ్య బాగా పెరుగుతోంది. ఆశ్చర్యకరంగా ఉత్తరార్ధ గోళంలోనూ వేసవి తాపం పెరుగుతోంది. కెనడాలోని లిట్టన్‌ ప్రాంతంలో 2021లో 49.5 0C ఉష్ణోగ్రత నమోదవడం గమనార్హం. భారత్‌లో వేసవి ఉష్ణోగ్రతల తీవ్రత ఏటా పెరుగుతోంది.


ఈ ధోరణులను పరిశీలిస్తే మానవుడు తన జీవనశైలిని పర్యావరణ సామర్థ్యానికి అనుకూలంగా మార్చుకోవాలి. పర్యావరణానికి, మానవుడికి మధ్య సంబంధాలు సకారాత్మకంగా ఉండాలి లేకపోతే     పర్యావరణ  ఆధిపత్యం శీతోష్ణస్థితిలో మార్పుల రూపంలో మానవుడిపై  అధికమై జీవజాతి మనుగడే ప్రమాదంలో పడుతుంది.


రచయిత: ఈదుబిల్లి వేణుగోపాల్‌ 

Posted Date : 25-03-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌