• facebook
  • whatsapp
  • telegram

ఇక్ష్వాకులు

విజయపురి రాజ్యంలో విలసిల్లిన బౌద్ధం!వంద సంవత్స‌రాల్లో ఏడుగురు రాజులు దక్షిణ భారతదేశ చరిత్రలో చెరగని ముద్రవేశారు. వైదిక మతాన్ని అనుసరించారు. అయినా వారి పాలనాకాలం బౌద్ధానికి స్వర్ణయుగంగా విలసిల్లింది. నాగార్జునకొండ కేంద్రంగా సాగించిన సాంస్కృతిక వికాసం ఆ ఇక్ష్వాక పాలకుల కీర్తిని చిరస్థాయిగా నిలిపింది. విశిష్ట ఆలయాలు, ఆరామాలు, విహారాలు, చైత్యాలు వెలిశాయి. వ్యవసాయం, దేశ, విదేశీ వాణిజ్యం పెద్ద ఎత్తున జరిగింది. ఇలాంటి విశేషాలతోపాటు నాటి పాలనా వ్యవస్థ, సామాజిక, ఆర్థిక, మత పరిస్థితుల గురించి పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. 


శాతవాహన సామ్రాజ్యం విచ్ఛిన్నమైన తర్వాత కృష్ణా నదికి రెండు వైపుల్లో ఉన్న తూర్పు ఆంధ్ర దేశాన్ని ఇక్ష్వాక వంశ రాజులు దాదాపు వందేళ్లు పరిపాలించారు. వీరు రెండో శతాబ్దం చివర్లో శాతవాహనుల అనంతరం అధికారంలోకి వచ్చారు. ఇక్ష్వాకులను పురాణాలు శ్రీపర్వతీయులనీ, ఆంధ్రభృత్యులనీ పేర్కొన్నాయి. పురాణాల ప్రకారం వీరు మొత్తం ఏడుగురు రాజులు. శాసనాల్లో నలుగురి పేర్లు మాత్రమే లభ్యమవుతున్నాయి.


ఆధారాలు: 1) పురాణాలు 2) సాహిత్య ఆధారాలు 3) శాసనాధారాలు


జైనధర్మామృతం: దీన్ని న్యాయసేనుడు కన్నడంలో రాశారు. ఇదో జైనమత కావ్యం. ఇందులో ఇక్ష్వాకుల రాజధాని శ్రీపర్వతానికి సంబంధించిన విషయాలున్నాయి. ఇక్ష్వాకుల కాలం నాటి పంచాంగం గురించి ఉంది.


బుద్ధచరితం: ఇక్ష్వాకుల పుట్టుక గురించి వివరించే ఈ గ్రంథాన్ని అశ్వఘోషుడు రాశారు. ఇక్ష్వాకులు బుద్ధుడి వంశస్థులని, వీరి కాలంలో దక్కన్‌లో బౌద్ధమతం రాజాదరణ పొందిందని ఇది పేర్కొంటుంది.


శాసన ఆధారాలు: 

అల్లూరు శాసనం: దీన్ని వీరపురుషదత్తుడు వేయించాడు. ఈ శాసనం ప్రకారం ఇక్ష్వాకులు, శాతవాహనుల సామంతులు. చక్రవర్తి వివిధ వర్గాల వారికి, సంస్థలకు దానాలు ఇచ్చేవాడని తెలియజేస్తుంది. 


నాగార్జునకొండ శాసనం: దీన్ని కూడా వీరపురుషదత్తుడు వేయించాడు. ఈ శాసనం ప్రకారం శ్రీశాంతమూలుడు విజయపురిలో ఇక్ష్వాక రాజ్యాన్ని స్థాపించాడు.


గుమ్మడిదర్రు శాసనం: దీన్ని వేయించింది ఎహుబల శాంతమూలుడు. ఈ శాసనంలో ఇక్ష్వాకుల కాలం నాటి స్త్రీ, పురుషుల పేర్లు ఉన్నాయి. గుమ్మడిదర్రు వద్ద ఉన్న బౌద్ధ క్షేత్రం గురించి తెలియజేస్తుంది.


* ఇక్ష్వాకుల శాసనాలు జగ్గయ్యపేట, మైదవోలు, మంచికల్లు వద్ద లభించాయి. ఇవన్నీ ప్రాకృత భాషలో, బ్రాహ్మీ లిపిలో ఉన్నాయి.


ప్రాంతం: ఇక్ష్వాకుల జన్మస్థలం, వంశం గురించి చరిత్రకారుల్లో భిన్న అభిప్రాయాలున్నాయి. ఉత్తర హిందూ దేశంలోని అయోధ్యను పాలించినవారు ఇక్ష్వాక సంతతి వారని బూలర్, రాప్సన్‌ లాంటి చరిత్రకారుల అభిప్రాయం. వాయు పురాణం ప్రకారం వీరు సూర్యవంశ కర్త ఇక్ష్వాకువు వారసులు. జైన, బౌద్ధ మత గ్రంథాలు కూడా వీరు ఉత్తర భారతదేశంలోని ఇక్ష్వాక వంశీయులని చెబుతున్నాయి. ఇక్ష్వాక వంశస్థుడైన యశోధరుడు వేంగి రాజ్యానికి వచ్చి అక్కడ ప్రతీపాలపురం (భట్టిప్రోలు) నిర్మించాడని ‘ధర్మామృతం’ అనే జైన కన్నడ కావ్యంలో ఉంది. అయితే ఇక్ష్వాకులు తమ శాసనాల్లో తాము ఉత్తరాపథం నుంచి వచ్చినట్లు కానీ, తమకు కోసలాధీశుల (ఇక్ష్వాకుల)తో సంబంధం ఉన్నట్లు కానీ చెప్పలేదు.* ఇక్ష్వాకుల పేర్లలో కనిపించే అడవిసిరి, ఖండ, చరిక, అంక లాంటి పదాలు దక్షిణాత్య ప్రభావాన్ని సూచిస్తుండటంతో వీరు అనార్య జాతివారని కొందరి అభిప్రాయం. వీరికి మేనత్త కుమార్తెను వివాహమాడే ఆచారం ఉండేది. వీరు కన్నడ దేశం వారని హేగెల్‌ పండితుడు చెప్పాడు. తమిళ దేశం నుంచి వచ్చారని డాక్టర్‌ కె.గోపాలచారి పేర్కొన్నారు. ఇక్ష్వాకులు ఆంధ్రా ప్రాంతం వారేనని కాల్ట్వెలో/కాల్టోవెలో తెలిపారు. ఇక్షు అంటే చెరకు అని అర్థం. చెరకును జాతి చిహ్నంగా స్వీకరించడంతో ఇక్ష్వాకులు అయ్యారని కొందరి అభిప్రాయం. ఇక్షు అనే పదాన్ని సంస్కృతీకరించడం వల్ల వారు ఇక్ష్వాకులయ్యారు.


* ఇక్ష్వాకుల పాలనా కాలాలు, రాజుల వంశక్రమానికి సంబంధించి, శాసనాలు, పురాణాల్లో దొరికిన సమాచారం ఆధారంగా ఓరుగంటి రామచంద్రయ్య కింది విధంగా సిద్ధాంతీకరించారు. 

1) మొదటి శాంతమూలుడు - (క్రీ.శ. 180 - 193) 

2) వీరపురుషదత్తుడు - (క్రీ.శ. 193 - 213) 

3) రెండో శాంతమూలుడు - (క్రీ.శ. 213 - 237) 

4) రుద్ర పురుషదత్తుడు (క్రీ.శ. 237 - 248). 

ఇంకా పేర్లు తెలియని ముగ్గురు రాజులు (క్రీ.శ. 248 - 278) పాలించారు.


మొదటి శాంతమూలుడు (క్రీ.శ 180-193): మొదటి ఇక్ష్వాక రాజు. రాజధాని విజయపురి. ఇతడికి చాంతమూలుడు, క్షాంతమూలుడు అనే పేర్లున్నాయి. తల్లి పేరు చేర్చి వాసిష్టీపుత్ర సిరిచాంతమూల అని కూడా అంటారు. మహారాజు, మహాధనాధిపతి, మహాతలవర, మహాసేనాపతి, శీతసహస్ర హలదాత, సామ్రాట్, విరాట్, స్వరాట్‌ (అశ్వమేధ‌ యాగం కారణంగా), ఏక విరాట్‌ (నరమేధ‌ యాగం కారణంగా). బిరుదులు ఉన్నాయి. 


* సార్వభౌమ స్థాయిని ప్రకటించుకోవడానికి అశ్వమేథ యాగం చేశాడు. అగ్నిష్టోమ, అగ్నిహోత్ర, వాజపేయం లాంటి యాగాలు చేశాడు. ఇతడి వివరాలు వీరపురుషదత్తుడి శాసనాల్లో అధికంగా ఉన్నాయి. మహాసేన కార్తికేయుడి భక్తుడు, మహాదాత. కోట్లకొద్ది బంగారు నాణేలు, గోవులు, నాగళ్లు, భూమిని దానంగా ఇచ్చాడు. ఆంధ్ర దేశంలో బీరార్‌ ప్రాంత రాజులను ఓడించి రాజ్యాన్ని విస్తరించాడు. ఇతడి రాజ్య వాయవ్య సరిహద్దులు ఉజ్జయిని- క్షాత్రాపులు; నైరుతి సరిహద్దు వనవాసి. గొప్ప రాజనీతి ఉన్నవాడు. సామంతుల కుటుంబాలతో వైవాహిక సంబంధాలు ఏర్పరచుకున్నాడు. 


మొదటి శాంతమూలుడికి హర్మ్యశ్రీ (వామ్మసిరివిక), శాంతశ్రీ (చాంతసిరి) అనే ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు. శాంతశ్రీని పుగియ వంశానికి చెందిన వాసిష్టీపుత్ర స్కందశ్రీకి ఇచ్చి వివాహం చేశాడు. స్కందశ్రీ మహాసేనాపతి, మహాతలవరుడు. అందుకే శాంతశ్రీకి మహాతలవరి, మహాదాన పత్ని అనే బిరుదులున్నాయి.


* శాంతమూలుడు తన కుమార్తె అడవి శాంతశ్రీని ధనక కుటుంబానికి చెందిన మహాసేనాపతి, మహాదండనాయకుడైన స్కంద విశాఖుడికి ఇచ్చి వివాహం చేశాడు.


వీరపురుష దత్తుడు (క్రీ.శ.193-213): ఇరవై సంవత్సరాలు రాజ్యపాలన చేశాడు. ఇతడికి శాంతశ్రీ (మేనత్త శాంతశ్రీ కుమార్తె), బాపిసిరి, షష్టిసిరి (మేనత్త హర్మ్యశ్రీ కుమార్తెలు) అని ముగ్గురు భార్యలు. ఈ పాలనాకాలం ఆంధ్రాలో బౌద్ధమతానికి స్వర్ణయుగమని చెప్పవచ్చు. శ్రీపర్వతం మహాయాన బౌద్ధమతానికి గొప్ప పుణ్యక్షేత్రంగా వెలిగింది. జగ్గయ్యపేటలో ఇతడు జారీ చేసిన మాంధాత శిల్పంలో శివలింగాన్ని కాలితో తొక్కి బౌద్ధ భిక్షువులకు అభయముద్ర ఇస్తున్నట్లు ఉంటుంది. వీరపురుషదత్తుడు తొలుత శివభక్తుడు. ఇతడి కాలంలో నాగార్జునకొండ వద్ద పుష్పభద్రేశ్వరుడు, హారతి, అష్టభుజ స్వామి ఆలయాలున్నాయి. నాగార్జునకొండ వద్ద ఉన్న ఉపాశిక భోదిశ్రీ శాసనం ప్రకారం వీరపురుషదత్తుడి కాలంలోనే అమరావతికి చెందిన వ్యాపారవేత్త కుమార్తె భోదిశ్రీ బౌద్ధమత ప్రచారకులను చైనా, హిమాలయ, కశ్మీర్, నేపాల్‌లకు పంపింది. నాగార్జునకొండలోని చులధర్మగిరిపై బౌద్ధచైత్యం నిర్మించింది. వీరపురుషదత్తుడిని దక్షిణాది అశోకుడు అనేవారు. హూయాన్‌త్సాంగ్‌ తన సి.యు.కి. గ్రంథంలో భావవివేకుడు అనే తార్కికుడు విజయపురి వద్ద బౌద్ధ విహారంలో నివసించేవాడని రాశాడు.ఎహుబల/ బహుబల శాంతమూలుడు (క్రీ.శ 213-237): ఇతడిని రెండో శాంతమూలుడని అంటారు. వీరపురుషదత్తుడి కుమారుడు. 24 ఏళ్లు రాజ్యపాలన చేశాడు. ఇతడి రాజ్యకాలంలో పదకొండో ఏడాది సంస్కృతంలో మొదటి శాసనం వేశారు. పుష్పభద్ర ఆలయ నిర్మాణం పూర్తిచేశాడు. నాగార్జునకొండలో కార్తికేయ, నందికేశ్వర, నవగ్రహ, హారతి దేవి ఆలయాలను నిర్మించాడు. నాటి ప్రాకృత శాసనం గుమ్మడిదర్రు వద్ద లభించింది. తల్లి బట్టి మహాదేవి పేరుతో నాగార్జునకొండ వద్ద బహుశ్వీతయ (బౌద్ధమత రేఖ) భిక్షువుల కోసం విహారం నిర్మించాడు. సోదరి కోడబలిసిరి నాగార్జునకొండపై బౌద్ధ విహారం నిర్మించింది.


రుద్రపురుషదత్తుడు (క్రీ.శ 237-248): ఎహుబలుడి కుమారుడు, ఇక్ష్వాక రాజుల్లో చివరి గొప్పవాడు. ఇతడి పాలన గురించి గురజాల, నాగార్జునకొండల వద్ద ఉన్న శాసనాలు తెలియజేస్తున్నాయి. ఈ కాలంలోనే సమాధుల వద్ద ఛాయ స్తంభాలు నిర్మించే సంప్రదాయం ప్రారంభమైంది. ఇతడిని పల్లవరాజు సింహవర్మ ఓడించినట్లు మంచికల్లు శాసనం వల్ల తెలుస్తోంది.


పురాణాల ప్రకారం మరో ముగ్గురు ఇక్ష్వాక రాజులు క్రీ.శ 278 వరకు రాజ్యాన్ని పరిపాలించారు. తర్వాత ఇక్ష్వాకుల పాలనను అంతం చేసినవారు అభీరులు.


మత పరిస్థితులు: ఇక్ష్వాకులు వైదిక మతస్థులైనప్పటికీ బౌద్ధ మతాన్ని ఆదరించారు. అనేక వైదిక క్రతువులు నిర్వహించారు. ప్రధాన దేవతలు శివుడు, స్కంధుడు, గణపతి. పలు హిందూ దేవాలయాలను నిర్మించారు. విష్ణువును అష్టభుజ స్వామిగా పూజించేవారు. యుద్ధంలో మరణించిన వీరులకు శిలలు ప్రతిష్ఠించి పూజించడాన్ని వీరగల్లు పూజ అనేవారు. వీరపురుషదత్తుడు బౌద్ధమతాన్ని పోషించాడు. తొలిదశలో మహాయానం, మలిదశలో హీనయాన బౌద్ధం అభివృద్ధి చెందాయి. బౌద్ధమత ప్రధాన కేంద్రంగా నాగార్జునకొండ విలసిల్లింది. నాగార్జునకొండ నుంచి బుద్ధఘోషుడు సింహళ దేశానికి వెళ్లి అక్కడి పాళీ గ్రంథాలను సేకరించుకొచ్చాడు. హీనయాన బౌద్ధంపై ‘విశుద్ధియాగ’ అనే గ్రంథాన్ని రచించారు. మహాబౌద్ధంలో బహుశ్రుతీయ, మహాశారస, మహా విహారవాణి, అపర మహా శైలు అని నాలుగు ప్రధాన శాఖలు ఏర్పడ్డాయి. సింహళ దేశం నుంచి అనేకమంది బౌద్ధ సన్యాసులు నాగార్జునకొండకి వచ్చేవారు.


నిర్మాణాలు: ద్రావిడ శైలిలో నిర్మాణాలు చేశారు. అనేక ప్రముఖ ఆలయాలు నిర్మించారు. అష్టభుజస్వామి ఆలయం (రెండో వీరపురుషదత్తుడు), కృష్ణభద్ర స్వామి ఆలయం (శఖసేన), కార్తికేయ, నవగ్రహ, హారతి ఆలయాలున్నాయి. దేవాలయాల్లో శిల్పుల పేర్లు చెక్కేవారు. బౌద్ధమతానికి చెందిన స్తూపాలు, చైత్యాలు, ఆరామ విహారాలు నిర్మించారు. బౌద్ధ విహారాలకు దానం చేసిన వారిలో ‘ఉపాసిక బోధిసిరి’ అగ్రస్థానంలో ఉంది.


పరిపాలన: శాతవాహనుల పరిపాలన విధానాన్ని కొనసాగించారు. సామ్రాజ్యాన్ని రాష్ట్రాలుగా విభజించారు. రాష్ట్ర పాలకులుగా శాసనాల్లో మహాతలవరి, మహాదండనాయక, మహాసేనాపతులు ఉండేవారు. సేనాపతులు రాష్ట్ర పాలన, సైనిక నిర్వహణ పనులు చూసేవారు. రాజే సర్వాధికారి. ఇతడికి సామ్రాట్, రాజన్, మహారాజు అనే బిరుదులు ఉండేవి. రాజు భార్యకు మహాదేవి అనే బిరుదు ఉండేది. రాజు రక్షణ చూసే అంగరక్షకులను ‘వీరులు’గా పిలిచేవారు. పరిపాలనలో చివరి భాగం గ్రామం. దీని పరిపాలకుడు గ్రామ పంచి. అయిదు గ్రామాలను కలిపి గ్రామ పంచిక అనేవారు. గ్రామ రక్షకుడు తలారి. వీరి శాసనాల్లో కనిపించిన తొలి తెలుగు పదం తలారి.


ఆర్థిక పరిస్థితులు: ప్రధాన వృత్తి వ్యవసాయం, ఆదాయ వనరు భూమి శిస్తు. పంటలో 1/6వ వంతు రాజు భాగం. వ్యవసాయదారులను హాలికులు అనేవారు. వ్యవసాయ అభివృద్ధికి శ్రీశాంతమూలుడు భూములు, నాగళ్లు దానం చేశాడు. రోమన్లతో వ్యాపారం చేసేవారు. రోమన్ల నాణేలు నాగార్జునకొండ వద్ద లభించాయి. వర్తక బృందాలను నేగియాం అని అనేవారు. వీరి శాసనాల్లో వర్తక శ్రేణి ప్రస్తావన ఉంది. 


ఉదా: పర్ణిక శ్రేణి - తమలపాకుల వ్యాపార సంఘం, పూసిక శ్రేణి-మిఠాయిల వ్యాపార సంఘం. వర్తక సంఘాల అధ్యక్షుడి పేరు కులిక. నాగార్జునకొండ వద్ద పరిశ్రమలు ఉండేవి. వృత్తి నిపుణులు, వర్తక సంఘాల గురించి ‘విశపట్టె శాసనం’ తెలియజేస్తోంది. ఉపాసిక బోధిశ్రీ శాసనం ప్రకారం నాటి కాలంలో బౌద్ధమతం చైనా వరకు వ్యాపించింది.


రచయిత: గద్దె నరసింహారావు
 

Posted Date : 01-08-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌