• facebook
  • whatsapp
  • telegram

భారతదేశంలో ముఖ్యమైన పన్నులు 

సంక్షేమ రాజ్యంలో సర్కారు సుంకాలు!

రోడ్లు వేయాలి, కాలువలు తవ్వాలి, ప్రాజెక్టులు నిర్మించాలి. వీటన్నింటికీ సొమ్ము కావాలి. ఫించన్లు, నిరుద్యోగ భృతి తదితరాలకు ఆదాయం  అవసరం.  మౌలిక సదుపాయాలకైనా, సామాజిక సంక్షేమానికైనా ప్రభుత్వం చేసే ఖర్చులకు కాసులను ప్రజలే సమకూర్చాలి. అందరూ తమ సంపాదనలో కొంత గవర్నమెంటుకి సమర్పించాలి. వ్యయం చేసినా సుంకం చెల్లించాలి. వాహనాలు సహా ఏవైనా వస్తువులు కొన్నా సర్కారుకు ముడుపు ముట్టజెప్పాలి. సేవలపై నిర్ణీత రుసుం కట్టడం తప్పనిసరి. దానినే పన్ను అంటారు. అదే ఆర్థిక వ్యవస్థలో అతిముఖ్యమైన పదం.  ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరు. వ్యక్తులు, వ్యవస్థలపై నేరుగా విధిస్తే ప్రత్యక్ష పన్ను. కనిపించకుండా భారాన్ని పెంచితే పరోక్ష పన్ను. ఆదాయ అసమానతలను తగ్గించడానికి, ఆర్థిక వృద్ధికి, సామాజిక సమానత్వాన్ని పెంపొందించడానికి సాయపడే సాధనం. ఈ నేపథ్యంలో దేశంలో పన్నుల పరిణామక్రమంతో పాటు ప్రధానమైన పన్నుల గురించి పరీక్షార్థులు తెలుసుకోవాలి. 


1) వ్యక్తిగత ఆదాయ పన్ను:  ఒక నిర్దిష్ట ఆదాయ పరిమితి దాటిన వ్యక్తులపై విధించే పన్ను ఆదాయ పన్ను. వ్యక్తులు, అవిభాజ్య హిందూ కుటుంబాలు, రిజిస్టర్‌ కాని సంస్థలకు ఈ పన్ను విధిస్తారు. మన దేశంలో ఆదాయ పన్ను పురోగామి, ప్రత్యక్ష పన్ను. స్వాతంత్య్రానంతరం 1961లో ఆదాయపన్ను చట్టం వచ్చింది. ప్రారంభంలో పన్ను రేటు అధికంగా ఉండటంతో పన్ను ఎగవేత ఎక్కువై నల్లధనం పెరిగింది. రాజా చెల్లయ్య కమిటీ సిఫార్సుతో పన్ను రేటు తగ్గించారు. 1997-98 బడ్జెట్‌ నాటికి ఆదాయ పన్ను గరిష్ఠంగా 30 శాతానికి చేరింది. ఆదాయపన్ను చట్టం-1961 ప్రకారం 100కు పైగా పన్ను మినహాయింపులు ఉండేవి. 2020-21 నుంచి అందులో 70కి పైగా మినహాయింపులను తొలగించారు. పాత పన్ను శ్లాబు విధానం స్థానంలో 7 శ్లాబుల విధానాన్ని ప్రవేశపెట్టారు.

 


 
2023-24 బడ్జెట్‌లో ముఖ్యమైన అంశాలు (ఆదాయ పన్నుకు సంబంధించి):

* అధిక ఆదాయంపై సర్‌ఛార్జి రేటును 37% నుంచి 25%కి తగ్గించారు.

* కొత్త పన్ను విధానంలో ఆదాయం రూ.15.5 లక్షలు దాటితే స్టాండర్డ్‌ డిడక్షన్‌ రూ.52,500గా ప్రకటించారు.

* ప్రస్తుతం రూ.5 కోట్లకు మించిన ఆదాయం ఉన్నవారికి 37% సర్‌ఛార్జి వర్తిస్తుంది. దీన్ని 25%కి తగ్గించారు.

* ఉద్యోగులు లీవ్‌ ఎన్‌క్యాష్‌మెంట్‌ చేసుకున్నప్పుడు రూ.3 లక్షల వరకే పన్ను మినహాయింపు ఉండేది. పెరిగిన వేతనాలను దృష్టిలో పెట్టుకుని ఈ మొత్తాన్ని రూ.25 లక్షలకు పెంచారు.

* 2023, ఏప్రిల్‌ 1 నుంచి తీసుకునే జీవిత బీమా పాలసీలకు చెల్లించే ప్రీమియం రూ.5 లక్షల్లోపు ఉంటే పన్ను మినహాయింపు ఉంటుంది.

* ఆదాయ పన్ను విషయంలో ఏర్పడిన వివాదాలను పరిష్కరించేందుకు వీలుగా ‘వివాద్‌ సే విశ్వాస్‌-2’ పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు.

* భవిష్యనిధి నిల్వలకు పాన్‌ కార్డు అనుసంధానం లేకుండా పూర్తిగా వెనక్కు తీసుకుంటే ఆ మొత్తంపై ఆదాయ పన్ను భారాన్ని కేంద్రం తగ్గించింది. ప్రస్తుతం 30 శాతం ఉన్న టీడీఎస్‌ను 20 శాతానికి తగ్గించింది.

* సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్‌ స్కీం పరిధిని రూ.15 లక్షల నుంచి రూ.30 లక్షలకు పెంచారు.

* ఆదాయపు పన్ను గణింపులో కొత్త విధానాన్ని ఎంచుకుంటే 80 C, 80 D కింద మినహాయింపులు వదులుకోవాల్సి వస్తుంది.


2) కార్పొరేట్‌ పన్ను: భారత సంస్థల ఆదాయంపై సర్‌ ట్యాక్స్‌ పేరుతో ఈ పన్ను ప్రవేశపెట్టారు. 1965-66లో కార్పొరేట్‌ పన్నుగా పేరు మార్చారు. రిజిస్టర్‌ అయిన జాయింట్‌ స్టాక్‌ కంపెనీలు, కార్పొరేషన్ల ఆదాయంపై ఈ పన్ను విధిస్తారు. సంస్కరణల్లో భాగంగా రాజా చెల్లయ్య కమిటీ సిఫార్సులతో కార్పొరేట్‌ పన్ను రేటును 40 శాతానికి తగ్గించారు. 1997-98లో ఈ పన్నుని 35 శాతానికి, 2005-06లో 30 శాతానికి తగ్గించారు. 2015-16 బడ్జెట్‌లో 30% శాతం నుంచి 25%కి  తగ్గించారు. వివిధ పన్ను మినహాయింపులు, ప్రోత్సాహకాలను రద్దు చేశారు. ప్రస్తుతం కంపెనీల వార్షిక టర్నోవర్‌ రూ.400 కోట్లు ఉంటే కార్పొరేట్‌ పన్ను 25 శాతం చెల్లించాలి.
 

MAT (Minimum Alternative Tax): ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహకాలు, మినహాయింపుల కారణంగా ఏ పన్ను పరిధిలోకి రాని సంస్థలు చెల్లించాల్సిన కనీస పన్ను లీతిగి. దీన్ని అమెరికా తొలిసారిగా ప్రవేశపెట్టింది. భారత్‌లో 1996-97లో నాటి ఆర్థిక మంత్రి చిదంబరం లీతిగిను ప్రవేశపెట్టారు. 18.5% నుంచి 15%కి తగ్గించారు.


3) వడ్డీ పన్ను: వడ్డీ పన్ను చట్టం-1974 ప్రకారం వాణిజ్య బ్యాంకులు పొందే వడ్డీపై దీన్ని విధిస్తారు. బ్యాంకులు, ప్రభుత్వ విత్త సంస్థలు, విత్త కంపెనీలు దీన్ని చెల్లిస్తాయి. 2000-01 నుంచి ఈ పన్నును రద్దు చేశారు.


4) వ్యయంపై పన్ను: కాల్డర్‌ కమిటీ సిఫార్సులపై 1957లో ఆర్థిక మంత్రి టి.టి.కృష్ణమాచారి వ్యయంపై పన్నును ప్రవేశపెట్టారు. ‘వ్యయంపై పన్ను చట్టం-1987’ ప్రకారం దీన్ని విధిస్తున్నారు.

ఉదా: హోటల్‌ గదులపై రోజుకి రూ.400 కంటే ఎక్కువ వ్యయం చేస్తే దీన్ని చెల్లించాలి. పర్యాటక రంగ అభివృద్ధి కోసం 1993 నుంచి దీన్ని రద్దు చేశారు.

కాల్డర్‌ సిఫార్సు చేసిన పన్నులు- 1) వ్యయంపై పన్ను (1957) 2) సంపద పన్ను (1957) 3) బహుమతి పన్ను (1958) 4) క్యాపిటల్‌ గెయిన్‌ టాక్స్‌ (1958)

5) సంపద పన్ను: 1957లో సంపద పన్నును ప్రవేశపెట్టారు. వ్యక్తులు, ఉమ్మడి హిందూ కుటుంబాలు, కంపెనీల వద్ద పరిమితికి మించిన నికర సంపదపై వార్షికంగా ఈ పన్ను విధిస్తారు. సంపదను లెక్కించేటప్పుడు నికర సంపదనే తీసుకుంటారు. వ్యవసాయ భూములు, పీఎఫ్‌ సొమ్ము, ఎల్‌ఐసీ మొత్తాలు దీని నుంచి మినహాయిస్తారు. రాజా చెల్లయ్య కమిటీ సిఫార్సుల్లో ఉత్పాదక ఆస్తులైన షేర్లు, బాండ్లలో సంపద పన్నును మినహాయించాలని సూచించారు. 1992-93లో నాటి ఆర్థిక మంత్రి మన్మోహన్‌ సింగ్‌ షేర్లు, బాండ్లను మినహాయించారు. గెస్ట్‌హౌస్‌లు, రెసిడెన్షియల్‌ హౌస్‌లు, జ్యువెలరీలపై సంపద పన్ను విధించారు. 2015-16 బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ సంపద పన్నును తొలగించారు.


6) ఎస్టేట్ సుంకం: దీన్ని 1953లో ప్రవేశపెట్టారు. వ్యక్తి మరణించిన తర్వాత అతడి ఆస్తిని వారసులకు సంక్రమింపజేసేటప్పుడు విధిస్తారు. కేంద్రం విధించి వసూలు చేసి ఆ మొత్తాన్ని రాష్ట్రాలకు ఇస్తుంది. దీనివల్ల వచ్చే రాబడి తక్కువ ఉండటంతో 1985లో వి.పి.సింగ్‌ ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు దీన్ని రద్దు చేశారు.


7) బహుమతి పన్ను: కాల్డర్‌ సూచనలపై 1958లో ప్రవేశపెట్టారు. మొదట్లో దీన్ని బహుమతిగా ఇచ్చేవారు. 1990-91 నుంచి గ్రహీతపై విధిస్తున్నారు.ఛారిటబుల్‌ సంస్థలకి ఇచ్చే విరాళాలను మినహాయించి మిగతా విరాళాలు, బహుమతులపై ఈ పన్ను విధిస్తారు. అయితే వివాహ సమయాల్లో మహిళలకు ఇచ్చే బహుమతులు, భార్యకి ఇచ్చే బహుమతులను మినహాయించారు. ఈ పన్ను రాబడి తక్కువగా ఉండటంతో 1998-99లో యశ్వంత్‌ సిన్హా రద్దు చేశారు. తిరిగి 2004-05లో ప్రవేశపెట్టారు. రూ.50 వేలు విలువ దాటిన ప్రతి బహుమతిపైనా ఈ పన్ను విధిస్తారు.


8) సెక్యూరిటీ ట్రాన్సాక్షన్‌ పన్ను: స్టాక్‌ ఎక్స్ఛేంజీలో రిజిస్టర్‌ అయిన సెక్యూరిటీల కొనుగోలు లేదా అమ్మకాలపై విధించే ప్రత్యక్ష పన్ను. షేర్లు, ఈక్విటీ ఆధారిత మ్యూచువల్‌ ఫండ్‌ యూనిట్లపై ఈ పన్ను విధిస్తారు. 2004-05 కేంద్ర బడ్జెట్‌లో దీన్ని ప్రవేశపెట్టారు.


9) దీర్ఘకాల మూలధన లాభాల పన్ను (లాంగ్‌టర్మ్‌ క్యాపిటల్‌ గెయిన్స్‌): ప్రస్తుతం ఏదైనా లిస్టెడ్‌ కంపెనీ షేర్లు, మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థల ఈక్విటీ పథకాల యూనిట్లను కొని ఏడాది కంటే తక్కువ కాలంలో అమ్మితే 15 శాతం స్వల్పకాల మూలధన లాభాల పన్ను విధిస్తున్నారు. అదే సంవత్సరం తర్వాత అమ్మితే ఎలాంటి పన్ను లేదు. 2018-19 బడ్జెట్‌లో ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలం ఉంచిన వాటాలపై వచ్చిన లాభంపై ఈ పన్ను విధించారు. వార్షిక లాభం రూ.లక్ష మించితే 10% దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను చెల్లించాలని ప్రతిపాదించారు.


10) డివిడెండ్‌ డిస్ట్రిబ్యూషన్‌ ట్యాక్స్‌ (డీడీటీ): డివిడెండ్స్‌ పంపిణీ చేసే దేశీయ కంపెనీలు 15 శాతం డీడీటీ చెల్లించాలి. 2020, ఏప్రిల్‌ 1 నుంచి ఈ పన్నును రద్దు చేశారు.


11) క్యాష్‌ ట్రాన్సాక్షన్‌ ట్యాక్స్‌: నల్లధనాన్ని నిరోధించేందుకు 2005లో నాటి ఆర్థిక మంత్రి పి.చిదంబరం దీన్ని ప్రవేశపెట్టారు. వ్యక్తులు రూ.50 వేలు, సంస్థలు రూ.లక్ష కంటే ఎక్కువ మొత్తాన్ని బ్యాంకు నుంచి విత్‌డ్రా చేస్తే ఈ పన్ను విధిస్తారు. 2009, ఏప్రిల్‌ 1 నుంచి రద్దు చేశారు.


12) ఫ్రింజ్‌ బెనిఫిట్‌ ట్యాక్స్‌ (ఎఫ్‌బీటీ): దీన్ని 2005లో ప్రవేశపెట్టారు. ఉద్యోగులకు ఇచ్చే సౌకర్యాలైన టీఏ, డీఏ, బోనస్, ఇతర అలవెన్స్‌లపై విధించే పన్ను. 2009లో ప్రణబ్‌ ముఖర్జీ ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు దీన్ని రద్దు చేశారు.

 

13) కస్టమ్స్‌ సుంకాలు: రాజ్యాంగం ప్రకారం ఎగుమతులు, దిగుమతులపై కస్టమ్స్‌ సుంకాలను కేంద్రం విధిస్తుంది. విదేశీ వ్యాపారాన్ని క్రమబద్ధం చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ముఖ్యంగా దిగుమతుల నియంత్రణలకు దోహదపడుతుంది.


దిగుమతి పన్ను: స్వదేశీ పరిశ్రమల రక్షణకు, విదేశీ వ్యాపార శేషం (బీఓపీ)లో లోటు తగ్గించేందుకు అంతర్జాతీయ వ్యాపారాన్ని క్రమబద్ధం చేయడానికి దిగుమతి పన్ను విధిస్తారు. * దేశంలో దిగుమతి సుంకాలు సాధారణంగా అడ్‌ వాలోరమ్‌ పన్నులుగా ఉన్నాయి. అంటే వస్తు ధరలపై కొంత శాతంగా విధిస్తారు.

ఉదా: యంత్రాలు, ముడి సరకులు దిగుమతి చేసుకునేప్పుడు పన్ను విధిస్తారు.


ఎగుమతి పన్ను: ప్రభుత్వ రాబడిని పెంచేందుకు, దేశంలో వస్తు లభ్యత కల్పించేందుకు విధిస్తారు. సంస్కరణలకు ముందు ప్రపంచంలోనే అధిక కస్టమ్స్‌ సుంకాలున్న దేశంగా భారత్‌ ఉండేది. ఉదా: 300%. రాజా చెల్లయ్య కమిటీ సిఫార్సుల మేరకు ఈ సుంకాలను తగ్గించారు. 2006-07లో 12.5 శాతానికి, 2007-08 నాటికి 10 శాతానికి తగ్గించారు. 2021-22లో 6.13% ఉంది. ప్రస్తుతం కస్టమ్స్‌ సుంకం 7.72%.


14) కేంద్ర ఎక్సైజ్‌ సుంకాలు: మొదట పత్తి, నూలు మీద 1894లో ఎక్సైజ్‌ సుంకాన్ని విధించారు. తర్వాత మరికొన్ని వస్తువులకు వర్తింపజేశారు. దీన్ని రెండు రకాలుగా విధిస్తారు. 1) మూల్యానుగత పన్ను 2) నిర్దిష్ట పన్ను. దేశంలోని వస్తూత్పత్తిపై ఈ పన్ను విధిస్తారు. తక్కువ ఆదాయ వర్గాల వారు వినియోగించే వస్తువుల మీద ఎక్సైజ్‌ సుంకం తక్కువగా, ధనిక వర్గాల వారు ఉపయోగించే వస్తువులపై అధికంగా విధిస్తారు. రాజ్యాంగం ప్రకారం ఆల్కహాల్, నల్లమందు మినహా కొత్తగా ఉత్పత్తి చేసే ప్రతి వస్తువుపై కేంద్రం సుంకం విధిస్తుంది. ఉత్పత్తిదారుడు ఈ సుంకం చెల్లిస్తే అది వస్తువు కొన్న వ్యక్తికి బదిలీ అవుతుంది. ఇందులో ఎగవేత అధికంగా ఉండటంతో 1978లో ఎల్‌.కె.ఝా కమిటీ లీతివిజుతిగి పేరుతో నూతన విధానాన్ని సిఫార్సు చేసింది. కానీ దీన్ని ప్రభుత్వం ఆమోదించలేదు. 1986, ఏప్రిల్‌లో భారత ప్రభుత్వం లీవీదీజుతిగిను ప్రవేశపెట్టింది. 2000, ఏప్రిల్‌ నుంచి రాజా చెల్లయ్య కమిటీ సిఫార్సుల మేరకు లీవీదీజుతిగి ను దినివిజుతిగి గా మార్పు చేశారు. 2022-23లో కేంద్ర బడ్జెట్‌లో కేంద్ర ఎక్సైజ్‌ డ్యూటీ 12.15%.


15) సేవా పన్ను: రాజా చెల్లయ్య కమిటీ సేవా పన్నును సిఫార్సు చేసింది. మన్మోహన్‌ సింగ్‌ ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు 1994-95లో మూడు సేవలపై (టెలికామ్, బీమా, స్టాక్‌ మార్కెట్‌) సేవా పన్ను ప్రవేశపెట్టారు. 2011-12 నాటికి 119 సేవలపై విధించారు. ప్రారంభంలో మొత్తం పన్ను రాబడిలో సేవా పన్ను 0.5% ఉండేది. 2016-17 నాటికి 14.8 శాతానికి పెరిగింది. ప్రారంభంలో సేవా పన్ను రేటు 5 శాతం ఉండేది. 2016 నాటికి 15 శాతం పెరిగింది. 2017, జులై నుంచి జీఎస్టీ అమల్లోకి రావడంతో సేవా పన్ను దానిలో భాగమైంది.


స్వచ్ఛభారత్‌ సెస్‌: సేవా పన్ను పరిధిలోకి వచ్చే అన్ని సేవలపైన స్వచ్ఛభారత్‌ సెస్‌ను 0.50%గా 2015, నవంబరు 15 నుంచి విధిస్తున్నారు. దీని నుంచి వచ్చే మొత్తాన్ని స్వచ్ఛభారత్‌ కార్యక్రమాలకు ఉపయోగిస్తారు. ఈ నిధులు కేంద్రానికి చెందుతాయి.


16) వ్యాట్‌ (జుతిగి): వస్తువు వివిధ ఉత్పత్తి, అమ్మకం దశల్లో పెరిగిన విలువపై మాత్రమే విధించే పన్నును విలువ ఆధారిత పన్ను అంటారు. వ్యాట్‌ అనేది ఒక పరోక్ష పన్ను. భారతదేశంలో వ్యాట్‌ను తొలిసారిగా ఎల్‌.కె.ఝా (1978) కమిటీ సూచించింది. రాజా చెల్లయ్య, మన్మోహన్‌ సింగ్‌ కూడా వ్యాట్‌ ఆవశ్యకత గురించి చెప్పారు. భారతదేశంలో వ్యాట్‌ను అమలుచేసిన తొలి రాష్ట్రం హరియాణా (2003, ఏప్రిల్‌ 1 నుంచి). ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2005, ఏప్రిల్‌ 1 నుంచి వ్యాట్‌ అమల్లోకి వచ్చింది. ఈ పన్నును చివరిగా అమలుచేసిన రాష్ట్రాలు ఉత్తర్‌ప్రదేశ్, తమిళనాడు. కేంద్రంలో ఎక్సైజ్‌ సుంకాల స్థానంలో, రాష్ట్రంలో అమ్మకం పన్నుల స్థానంలో వ్యాట్‌ అమలు చేస్తారు.


వ్యాట్‌ వల్ల ప్రయోజనాలు: 1) పన్నుపై పన్ను తొలగిపోతుంది. 2) పన్ను ఎగవేతను అరికట్టవచ్చు. 3) ప్రభుత్వానికి రాబడి పెరుగుతుంది. 4) పన్ను భారాన్ని తగ్గించవచ్చు. 5) క్రాస్‌ చెకింగ్‌కు వీలవుతుంది. 6) అంతర్జాతీయ పోటీకి దోహదపడుతుంది.

2023 - 24 కేంద్ర బడ్జెట్‌ ప్రకారం కేంద్రం ఆదాయం ప్రతి రూపాయిలో పన్నుల ద్వారా వచ్చేది:  1) ఆదాయ పన్ను - 15 పైసలు 2) కార్పొరేట్‌ పన్ను - 15 పైసలు 3) కస్టమ్స్‌ సుంకాలు-4 పైసలు 4) ఎక్సైజ్‌ సుంకాలు - 7 పైసలు 5) జీఎస్టీ-17 పైసలు


రాష్ట్ర పన్నులు

1) అమ్మకం పన్ను: ఈ పన్నును మొదటిసారిగా జర్మనీలో ప్రవేశపెట్టారు. భారత్‌లో మధ్యప్రదేశ్‌లో పెట్రోల్‌ అమ్మకాలపై తొలుత ప్రవేశపెట్టారు. తర్వాత మద్రాసులో అమలుచేశారు. రాష్ట్రాలకు అధిక రాబడి ఇచ్చే పన్నుగా ఇది అవతరించింది. ప్రస్తుతం దీన్ని జీఎస్టీలో విలీనం చేశారు.


2) రాష్ట్ర ఎక్సైజ్‌: మద్యం, నల్లమందు, మత్తు పదార్థాల తయారీపై రాష్ట్రం ప్రభుత్వం విధిస్తుంది. అమ్మకం పన్ను తర్వాత అధిక రాబడి ఇచ్చే పన్ను.


3) మోటారు వాహనాలపై పన్ను: వాహనాల బరువు, సీట్లు, వాహనం ఆక్రమించే స్థలం, రవాణా చేసే బరువును బట్టి వివిధ రాష్ట్రాల్లో పలు రకాలుగా విధిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మోటారు వాహనాలపై జీవిత కాలం పన్ను విధిస్తున్నారు.


4) వినోదపు పన్ను: దీన్ని 1922లో తొలిసారిగా పశ్చిమ బెంగాల్‌ విధించింది. సినిమా హాళ్లు, సర్కస్‌లు, ఇతర ప్రదర్శనలపై ఈ పన్ను విధిస్తారు.


5) స్టాంప్స్, రిజిస్ట్రేషన్‌: ఆస్తుల యాజమాన్యం, వాటాల బదిలీ, ఇతర ఒప్పందాలపై ఈ పన్ను విధిస్తారు.


6) వృత్తి పన్ను: డాక్టర్లు, లాయర్లు, ఇంజినీర్లు, ప్రభుత్వ ఉద్యోగులు, నెలకు రూ.15 వేలకు మించి జీతం పొందేవారు ఏటా వృత్తి పన్ను చెల్లించాలి. దీని గరిష్ఠ పరిమితి రూ.2,500.

రచయిత: ధరణి శ్రీనివాస్‌

Posted Date : 02-08-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌